April 28, 2024

అత్తగార్లూ… ఆలోచించండి

రచన: ధరిత్రీ దేవి ముక్కమల

“ఏంటిది రవీంద్రా! పెద్ద చదువులు చదివావు. మంచి ఉద్యోగం చేస్తున్నావు. నీ భార్య కూడా ఉద్యోగస్తురాలే. . . చివరి రోజుల్లో అనా రోగ్యంతో బాధపడుతున్న మీ అమ్మను దగ్గర ఉంచుకోమంటే వద్దంటున్నావట !!. . . ”
“. . . . . . . . . . . . . . ”
“మీ అన్నలిద్దరూ పెద్దగా చదువుకోలేదు. అంతంత మాత్రం ఆదాయం వాళ్ళది. వాళ్లే ఇంతకాలం మీ అమ్మ బాగోగులు చూశారు. ఇప్పుడు టౌన్లో అయితే ఆసుపత్రి సౌకర్యం ఉంటుందని కొంతకాలం నీ వద్దకు పంపిస్తామంటే వీలు కాదన్నావట !”
ఎదురుగా కూర్చున్న రవీంద్రను చూస్తూ మందలింపుగా అన్నాడు రాజారెడ్డి. ఆయన, రవీంద్ర తండ్రి కేశవరెడ్డి ఒకే ఊరివాళ్ళు. మంచి స్నేహితులు కూడా. ఆయన ముగ్గురు కొడుకులను వాళ్ళ చిన్నతనం నుండీ చూస్తున్నాడు రాజారెడ్డి. కొన్నేళ్ల క్రితం పట్నం చేరి, వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డాడు. కేశవరెడ్డి కొంతకాలం క్రితం కాలం చేశాడు. అప్పట్నుంచీ ఆయన భార్య కాత్యాయిని పెళ్ళయిపోయిన ఇద్దరు కొడుకుల వద్దే ఉంటోంది. ఆ తర్వాత ఐదారేళ్లకు మూడో కొడుకు రవీంద్ర చదువు పూర్తి చేసుకుని, ఓ గవర్నమెంట్ ఆఫీస్ లో మంచి ఉద్యోగంలో చేరిపోయాడు.
రాజారెడ్డి తనపై మోపుతున్న అభియోగానికి బాధ కలిగింది రవీంద్రకు. ఎదురుగా తల్లి కాత్యాయిని, ఆమె పక్కన అన్నలు నారాయణ, నాగేశ్వర్ లు కూర్చుని ఉన్నారు. బాధను, కోపాన్ని అదిమిపెట్టుకుని తమాయించుకుని, మెల్లిగా నోరు విప్పాడు రవీంద్ర.
“చిన్నాన్నా! అసలు విషయం మీ దాకా రాలేదు. అందుకే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. . . ”
“నీవు, మీ అమ్మ నీ వద్ద ఉండడానికి ఒప్పుకోలేదంట. అది నిజమా కాదా? ఆరేడేళ్ళయింది మీ నాన్న చనిపోయి. . . తర్వాత నీ అన్నలిద్దరూ విడిపోయినా, సొంత ఊళ్ళోనే పొలాలు చూసుకుంటూ ఉంటున్నారు. మీ అమ్మ కూడా అక్కడా ఇక్కడా ఆ ఇద్దరి దగ్గరే కాలం గడుపుతూ ఉంది. నీ పెళ్లయి సంవత్సరం అయిందనుకుంటా. . . సరే. . ఇదంతా నీకు తెలియనిదేముంది ! వారం క్రితం నీ అన్నలిద్దరూ నావద్దకు వచ్చారు. అమ్మ ఆరోగ్యం బాగుండడం లేదనీ, చీటికీ మాటికీ టౌన్ కెళ్ళి చూపించుకొని రావాలంటే పెద్దావిడ ప్రయాణాలు చేయలేకపోతోందనీ, కొంతకాలం నీ దగ్గర ఉంచుకోమంటే నీవేమో వద్దంటున్నావని చెప్పారు. చిన్నతనం నుండీ నా దగ్గరున్న చనువుతో అలా నాతో చెప్పుకున్నారు. మంచిదే. మరెక్కడికో పోయి, పంచాయితీలు పెట్టి ఇంటి మర్యాద పదిమంది ముందూ పెట్టలేదు. రవీంద్రా, వాళ్ళు నాతో చెప్పింది నిజమా కాదా. చెప్పు. నా మీద నీకు గౌరవం ఉందనే అనుకుంటూ ఈ రోజు నిన్ను ఇక్కడికి రమ్మని నీకు ఫోన్ చేశాను. అన్నలిద్దర్నీ, మీ అమ్మనూ కూడా రమ్మన్నాను. ఈ విషయం మాట్లాడదామనే” చెప్పడం ఆపి, రవీంద్ర వైపు చూశాడు రాజారెడ్డి.
” చిన్నతనం నుండీ నిన్ను చూస్తున్నా చిన్నాన్నా! నీ మీద నాకు గౌరవం లేకపోవడమేంటి ! కానీ, ఒక విషయం. నాన్న చనిపోయాక కొద్ది రోజులకే మీరు మన ఊరి నుండి టౌన్ కు వచ్చేశారు. చాలా ఏళ్లుగా మన ఊరి విషయాలు మీకేమీ తెలియవు. ముఖ్యంగా మా ఇంటి విషయాలు. మా కుటుంబంలో చెప్పకూడనివి కొన్ని జరిగాయి చిన్నాన్నా. ఈ రోజు అమ్మ, అన్నలతో పాటు నువ్వు కూడా తప్పు నాదే అని భావిస్తున్నారు కాబట్టి, ఇక తప్పదు. ఎందుకంటే, ఈ నింద భరించే శక్తి నాకు లేదు. తప్పనిసరై చెప్పాల్సి వస్తోంది.”
“. . . . . . . . .”
“మా నాయనమ్మ విరూపాక్షమ్మ నీకు బాగా తెలుసు. నాన్న చనిపోయాక, మీరు మన పల్లె వదిలి వెళ్లిపోయాక, మా ఇంట్లో జరిగినవేమీ మీ దాకా రాలేదని ఇప్పుడు మీ మాటల్ని బట్టి నాకు తెలిసి వచ్చింది.”
“. . . . . . . . . . . . . . . . . . . . . ”
“మా చిన్నప్పటి నుంచీ మేము చూస్తున్నాము. మా అమ్మకూ, నాయనమ్మకు ఒకరంటే ఒకరికి ససేమిరా పడేది కాదు. ఎప్పుడూ పోట్లాటలే.! అవన్నీ చూస్తూనే పెరిగాను నేను. నాన్న పోయాక, నాయనమ్మను నేను భరించలేనంటూ మొండికేసింది అమ్మ. నీకే పట్టనప్పుడు. మాకేంటి బాధ్యత! అంటూ, వదినలూ మొహాలు తిప్పుకున్నారు. అన్నావాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళ సహకారం లేకుండా ఆవిడకు ఏం చేయగలరు! ఎవరేమనుకుంటారో అని కొన్నాళ్లు ఆలోచించారు. తర్వాత తప్పనిసరై, పదిమంది గురించి ఆలోచించక, తీసుకెళ్లి దగ్గర్లోనే ఉన్న ఓ వృద్ధాశ్రమంలో చేర్పించేశారు. . . ”
విస్తుబోయి, వాళ్ల వంక చూశాడు రాజారెడ్డి. నిజంగానే ఈ విషయం ఆయన దృష్టికి రాలేదు. తనను కలిసినప్పుడు కాత్యాయని గానీ, కొడుకులు గానీ చెప్పలేదు.
“అప్పుడు నేనింకా చదువుకుంటున్నాను. నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అత్తాకోడళ్ళ మధ్య ఎన్నో ఉండొచ్చు. నిజమే. నాయనమ్మ చేష్టలతో, మాటలతో అమ్మ ఎంతో బాధపడి ఉండొచ్చు. కానీ, చివరి దశలో అలా వదిలేయడం నాకు బాధనిపించింది. నా చదువు పూర్తయి ఉద్యోగంలో చేరడానికి కొన్నేళ్లు పట్టింది. తర్వాత పెళ్లి జరిగింది. ముందే నా మైండ్ లో నిర్ణయించుకున్న ప్రకారం నా భార్యకు నచ్చజెప్పి, వృద్ధాశ్రమం నుండి నాయనమ్మను తీసుకొచ్చాను. ప్రస్తుతం నాయనమ్మ మా ఇంట్లోనే మా దగ్గరే ఉంది.”
అవాక్కైపోయాడు రాజారెడ్డి. మాట మాత్రమైనా ఈ విషయం ఆ ముగ్గురూ తన వద్ద ఎత్తకపోవడం చాలా కోపం తెప్పించింది ఆయనకు.
“అన్నావాళ్ళు అమ్మను నా వద్దకు పంపిస్తామని చెప్పగానే, నేను సంతోషంగా సరే అన్నాను చిన్నాన్నా. అమ్మ వచ్చింది కానీ, అక్కడ మా ఇంట్లో నాయనమ్మను చూడగానే ముఖం చిట్లించుకొని, ఆమె ఉన్న చోట నేను ఉండను అని వెంటనే తిరుగుముఖం పట్టింది. ఎంత బ్రతి మాలినా వినలేదు. అన్నల వెంట వెళ్ళిపోయింది. తప్పంతా నా మీద తోసిన తర్వాత నేనిక ఉపేక్షించదలుచుకోలేదు. జరిగింది ఇదే చిన్నాన్నా. ఇది నిజమో కాదో ఇప్పుడు వాళ్లనే అడగండి. . . ”
నాగేశ్వర్, నారాయణ ఇద్దరూ తలలు దించుకున్నారు. కాత్యాయిని మొహం పక్కకు తిప్పుకుంది.
“ఏమర్రా! ఇదంతా నాకు చెప్పకుండా, తప్పంతా రవీంద్ర మీదికి నెట్టేశారా! మీ మాటల్ని నమ్మి, వీణ్ణి తప్పు పట్టి నిందించాను గదరా. ఏమ్మా వదినమ్మా! కాటికి కాళ్లు చాపుకున్న ఆ ముసలావిడ మీద ఎందుకమ్మా అంత పగ! నీ అత్తగారి పట్ల నువ్విలా ఉంటూ, నీ కోడళ్లకు నీవే పాఠాలు నేర్పిస్తున్నావు. వదినా! ఆ సంగతి నీకు తోచడం లేదా! మీ మధ్య మనస్పర్ధలు, కొట్లాటలూ ఉన్నాయి, సరే. వాటినే తలుచుకుంటూ చివరి దశలో బాధ్యత పక్కన పెట్టేస్తే. రేపు నీ పరిస్థితీ ఇంతే కదమ్మా. . . !”
కాత్యాయని కళ్ళనుండి బొటబొటా కన్నీళ్లు కారసాగాయి.
“నీవే కాదమ్మా, ప్రతీ అత్త, కోడలు తెలుసుకోవలసిన విషయమిది. కొడుకులున్న నేటి కోడళ్ళు ఖచ్చితంగా రేపటి అత్తలు. అవునా కాదా! ఈ రోజు జవసత్వాలున్నాయని పెత్తనాలు చేస్తే, రేపు అవి ఉడిగిన తర్వాత నా పరిస్థితి ఏమిటి అన్న దూరాలోచన వాళ్లకు ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే… ఉండదు. రవీంద్ర రత్నం లాంటి కుర్రాడు. నాయనమ్మను ఆదరిస్తున్న వాడు కన్నతల్లిని ఆదరించడా! పెద్ద మనసు చేసుకోవాలమ్మా. వయసు పెరిగే కొద్దీ మనలో అవగాహన కూడా పెరగాలి కదా వదినా” చెప్పుకుంటూ పోతున్న ఆయన ఉన్నట్టుండి చిన్నగా నవ్వాడు.
“తమాషా ఏంటంటే, నాకు తెలిసి కొందరు అత్తలు వాళ్ల అత్తగార్లను చివరి దశలో ఏమాత్రం పట్టించుకుని ఉండరు. కానీ, వీళ్ళ కోడళ్లు మాత్రం వీళ్లను మహా బాగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అది ఆ కోడళ్ళ బాధ్యత అంటారు. నేనూ ఒకప్పుడు కోడలినేగా, ఒక అత్తకు. నేను మా అత్తను ఆమె చేతకాని స్థితిలో ఎంత మాత్రం చూసుకున్నాను! అన్న ఆలోచన వాళ్లకు ఏ కోశానా రాదు. . నేటి అత్తలు, రేపు కాబోయే అత్తలు ఆలోచించాల్సిన విషయం కాదా ఇది. . . !”
“. . . . . . . . . . . . . . . . . . . . . ”
“వదినా! సూటిగా మాట్లాడుతున్నా. నువ్వేమనుకున్నా సరే. . ఇప్పటికే నీ పెద్ద కోడళ్ళిద్దరికీ నీ మనస్తత్వం అర్థమయిపోయి ఉంటుంది. రేపు కాలూ చేయి కదవలేని స్థితి వస్తే, వాళ్లూ నీ పద్ధతే పాటిస్తే. . . ! పాటిస్తే ఏంటి !! కచ్చితంగా అదే జరుగుతుంది. నువ్వు నీ అత్తను పంపినట్టే వాళ్ళూ నిన్ను ఏ ఆశ్రమానికో పంపించేస్తే. . . !”
కాత్యాయని గుండె రెపరెపలాడింది. గత కొంతకాలంగా ఇంట్లో తనకి ఎదురవుతున్న రుసరుసలు, ఛీత్కారాలు, తన మాట లెక్క చేయక పోవడాలూ, అడపాదడపా పోట్లాటలూ, అవమానాలు ఆమె కళ్ళల్లో మెదిలాయి. ఠక్కున మరేదో తట్టింది ఆమె బుర్రకి. సరిగ్గా, అదే అందుకున్నాడు రాజారెడ్డి.
“అసలు నిన్ను రవీంద్ర దగ్గరికి పంపాలనుకోవడంలో నీ కోడళ్ల ఉద్దేశం అదేనేమో ఆలోచించు వదినా”
నిటారుగా అయిపోయింది కాత్యాయని. తల్లి మీద నుండి ఆయన చూపు కొడుకుల మీదికి మళ్ళింది.
“ఏరా, మీ ఇద్దరూ మీ మీద ఉన్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు ఈ రోజుతో. . . ”
“చిన్నాన్నా,! తప్పైపోయింది చిన్నాన్నా. అమ్మను ఎలాగైనా తమ్ముడి దగ్గరకు కొన్నాళ్లయినా పంపించాలనుకుని, నువ్వు చెప్తేనన్నా వింటుందేమో అనుకున్నాం. నాయనమ్మ గురించి చెబితే, నువ్వు తిడతావని భయంతో వెనుకాడాం”
“మొన్న నా వద్దకొచ్చినప్పుడు నాయనమ్మ సంగతి చెప్పలేదు సరే, ఈ రోజైనా రాగానే చెప్పారా, లేదు. . రవీంద్ర చెప్పేదాకా ఎందుకు మీరు నోరు తెరవలేదు? అదంతా సరే. మీ అమ్మ అక్కడ ఉండనని వచ్చేసింది. మళ్లీ ఈ రాయబారాలెందుకు చేస్తున్నట్టు!!”
” అదే చిన్నాన్న! అమ్మకు ఈ మధ్య ఆరోగ్యం బాగా దెబ్బతింది. తమ్ముడి దగ్గరుంటే డాక్టర్లు అందుబాటులో ఉంటారని. మీతో చెప్పిస్తేనన్నా అమ్మ వింటుందనీ.”
నీళ్లు నమిలారిద్దరూ. తల పంకించాడు రాజారెడ్డి. ఆయన లౌక్యం, లోకజ్ఞానం మెండుగా ఉన్న వ్యక్తి. సూక్ష్మగ్రాహి కూడా. తన జీవితానుభవంలో ఎందరినో చూశాడు. ఈ అన్నదమ్ముల సమస్య చూచాయగానైనా స్పష్టంగానే బోధపడిందాయనకి. ముగ్గురు కొడుకులున్నప్పుడు తామిద్దరే తల్లిని ఎందుకు భరించాలి? అన్నది ఓ కారణం కావచ్చు. ఇంట్లో భార్యల పోరు ఇంకోటి కావచ్చు. కోడళ్లతో సర్దుకుపోలేని తల్లి మనస్తత్వం వాటికి తోడై ఉండొచ్చు.
” సరేలేరా! మీతో పాటు రవీంద్ర కూడా తల్లి బాధ్యత తీసుకున్నట్లు ఉంటుంది. వదినా! విరూపాక్షమ్మ పెద్దమ్మకు వయసు బాగా మీద పడింది. నువ్వే ఎలాగోలా సర్దుకోవాలి మరి. పెద్దదానవు, నీకు నేను చెప్పేదేమిటి!” అన్నాడు ఉభయతారకంగా.
“సరే నారాయణ! మీ నాన్నే బ్రతికి ఉంటే ఎంత క్షోభ పడి ఉండేవాడో! అయిందేదో అయిపోయింది. ఏం వదినా, ఇంతకీ ఇప్పుడే మంటావు?”
కాత్యాయని వైపు చూశాడు. సంవత్సరకాలంగా ఇద్దరు కోడళ్ళ ప్రవర్తనలో వచ్చిన మార్పులు. . . కొడుకుల ముభావం. ఆసుపత్రి కారణం చెప్పి రవీంద్ర వద్ద ఉంచడానికి తీసుకెళ్లిన వైనం… అక్కడ అనుకోని విధంగా తన అత్త కంటబడటం… తాను తిరిగి రావడం… అన్నీ సినిమారీళ్ళలా గిర్రున తిరిగాయి ఆమె ముందు. తిరిగి వచ్చాక, మళ్లీ తనకు ఆ మాట ఈ మాట చెప్పి, ఇలా రాజారెడ్డి దగ్గరకు తీసుకురావడం… ! ఒకప్పుడు తన అత్తను తాను వదిలించుకోవాలనుకున్నట్లు ఇప్పుడు తనను తన కోడళ్లు వదిలించుకోవాలనుకుంటున్నారు. తాత్కాలికంగానైనా… అంతే…! అప్పుడు ఆమెకనిపించింది. . రాజారెడ్డి చెప్పింది నిజమే! నాలాంటి స్థితిలో ఉన్న ప్రతి అత్త వేసుకోవాల్సిన ప్రశ్న…
“నేను నా అత్తను ఏమాత్రం చూశాను గనక !!” అని. . . ఇక తను చేయవలసింది స్పష్టమై లేచి నిలబడింది.
” నీకు తెలియందేముందిలే రాజారెడ్డీ! నేను అనుభవించింది తక్కువేమీ గాదు. సరే. పిల్లల కోసమైనా సర్దుకుపోతాను. చిన్నాడి దగ్గరికే పోతా. వెళ్ళొస్తామిక.” కన్నీళ్లు ఒత్తుకుంటూ లేచింది కాత్యాయని.
“భోజనాలు చేయకుండా ఎక్కడికి పోతారే కాత్యాయినీ.”
నడుం వంగిపోయి, నడవలేక నడుస్తూ, బోసి నోటితో నవ్వుతూ లోపల నుండి వచ్చింది కమలమ్మ, రాజారెడ్డి తల్లి. . . ! ఆ వెనకే భారతి చిరునవ్వుతో… రాజారెడ్డి భార్య ! ఆ ఇద్దరినీ అలా చూసేసరికి ఒక్కసారిగా మతి పోయినట్లు అయింది కాత్యాయినికి. కమలమ్మ. తన అత్త ఈడుదే. భారతి తన కంటే రెండు మూడేళ్లు చిన్నది. కమలమ్మ అప్పట్లో కోడలి మీద తన అత్తతో ఎన్ని పితూరీలు చెప్పేది !! భారతీ అంతే. అత్తగారి దాష్టీకం గురించి తనతో చెప్పుకొని ఏడ్చేది కూడా. . ! ఇప్పుడేమో ఒకేచూరు కింద. . . ! కలివిడిగా… నవ్వుకుంటూ. . . !!
తనకేనా! వీళ్ళిద్దరికి మాత్రం ఎన్ని లేవు! అయినా తనలాగా అత్తను వృద్ధాశ్రమానికి పంపడం గానీ, నేనీమెతో వేగలేనని గానీ వదిలేసిందా భారతి ! పోనీ, ఉండలేనంటూ తను వెళ్ళిపోయిందా! లేదే !!
అయినా, చూసేవాళ్ళు… అమ్మో! ఈ కోడలు అత్తను వృద్ధాశ్రమంలో పెట్టేసిందట ! అని బుగ్గలు, నోళ్లు నొక్కుకుంటూ అత్త మీద సానుభూతులు కురిపిస్తారు గానీ. . . ఆఁ !ఆవిడగారు ఎంత నరకం చూపించిందోలే ఆ కోడలికి !! లేకపోతే అలా ఎందుకు చేస్తుంది ! అని ఒక్కరూ కోడలి గురించి మంచిగా అనుకోరు గదా !అందుకేనేమో. . . లోకుల గురించైనా కొన్ని బాధల్ని పంటి బిగువున భరించాల్సిందే. . . తప్పదు. . దేవుడా ! నాక్కూడా వీళ్ళిద్దరిలాగా కాస్త లౌక్యం, కాస్త మాటకారితనం అంటుకునేలా చేయి తండ్రీ. . . అనుకుంటూ మొహాన నవ్వు పులుముకుంటూ ఆ అత్తాకోడళ్ల దగ్గరికి నడిచింది కాత్యాయిని.
ఓదార్పుగా రవీంద్ర వంక చూశాడు రాజారెడ్డి. రవీంద్ర మనసు కుదుటపడింది.

సమాప్తం

1 thought on “అత్తగార్లూ… ఆలోచించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *