April 28, 2024

ప్రాయశ్చితం – 8

రచన: గిరిజారాణి కలవల

మరునాడు సత్యంతో కలిసి సురేంద్ర తన ఊరికి ప్రయాణం అయాడు.
ఊరు సమీపిస్తున్న కొద్దీ సురేంద్రలో తెలియని అలజడి. పైరు పొలాల మీద నుంచి వీచే చల్లని గాలి, తన తండ్రి స్పర్శలాగా మృదువుగా అనిపించింది.
ఆ మట్టి, తన మూలాలలని తెలియచేస్తున్నట్టే తోచింది. ఊరి మొదట్లోనే చెరువు. అక్కడే కదూ? తనకి తండ్రి ఈత నేర్పించినది. అక్కడే కదూ జీవితంలో ఎలా ఎదగాలనేదీ పాఠాలు నేర్పించినదీ?
బడి ముందున్న వేపచెట్టు తనని కోపంగా, ఆగ్రహంతో చూస్తున్నట్టు తోచింది. ‘ఔను… తన సావాసగాళ్ళతో ఆడుకున్న ఆటలకి ఆ చెట్టే సాక్షీభూతం కదా మరి. అక్కడ ఆటలయిపోయాక ఆ చెట్టు కింద కూర్చుని, తామంతా పెరిగి పెద్దయాక, మంచి ఉద్యోగం సంపాదించుకుని, అమ్మానాన్నలని చాలా బాగా చూసుకోవాలి అని అనుకునేవారము. బహుశా ఆ మాటకి కట్టుపడకుండా, ఉన్నది తానే కాబోలు. అందుకే ఆ చెట్టు తనని అంతగా కోపంగా చూస్తోంది. అని అనుకున్నాడు.
తాను బడి నుంచి వచ్చేసరికి తన తండ్రి, తన కోసం ఆ చెట్టు కింద కాచుకుని వుండేవాడు. ఉదయమే తనతో పాటు కేరేజీ పంపితే, తాను తినేవేళకి చల్లారిపోతుందని, మధ్యాహ్నం లంచ్ బెల్ కొట్టే టైముకి వేడివేడిగా అన్నం వండి, కేరేజీ తీసుకొనివచ్చి వేపచెట్టుని ఆనుకుని తన కోసం నిలబడి ఎదురు చూస్తూ వుండేవాడు.
తాను పరుగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి చేతిలోని కేరేజీ అందుకునేవాడు. తామిద్దరం మాట్లాడుకునే మాటలన్నిటికీ ఈ వేపచెట్టు సాక్షి. అవన్నీ గుర్తు చేసుకుంటూ శిథిలావస్థలో వున్న తన ఇంటికి చేరుకున్నాడు. ఒక పక్క పెంకులు రాలిపోయి, కిటికీలు, తలుపులు విరిగిపోయి ముళ్ళ చెట్లతో ఆవరణ అంతా నిండిపోయి వుంది. లోపలకి వెళ్ళడానికి కూడా వీలు లేనంతగా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. అప్పట్లో తన చదువు కోసం షావుకారు దగ్గర ఇంటిని తాకట్టు పెట్టిన విషయం తనకి తెలిసిందే. ఉద్యోగం వచ్చాక తనఖా నుంచి విడిపిస్తానని తండ్రికి మాట ఇచ్చాడు. ఏదీ ఆ మాట? నీటి మీద రాసినట్టే అయింది.
ఊళ్ళో ఇలాంటి తనఖా ఆస్తులని ఎన్నిటినో షావుకారు తన దగ్గర పెట్టుకున్నాడు, కానీ వాటిని అలాగే వుంచేసాడు. ఎన్నెన్ని రిపేర్లు చేసి మళ్ళీ కొత్తగా తయారుచేయిస్తాడు కనక? ఒకవేళ దేనికైనా ఎక్కువ రేటు పలికి ఎవరైనా కొనుక్కుంటామంటే, ఆ పళంగా అమ్మేసేవాడు.
సురేంద్ర అదృష్టం బాగుండి, ఆ ఇల్లు ఇంకా షావుకారు తనఖాలోనే వుంది. పూర్తిగా స్వాధీనం చేసుకోలేదింకా.
వెళ్ళిన వెంటనే సురేంద్ర చేసిన మొదటిపని, షావుకారికి కబురు చేసి, తండ్రి ఇవ్వాల్సిన బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించి, ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు. సత్యం పురమాయించిన తాపీ మేస్త్రి, కార్పెంటర్ లతో ఇంటికి పూర్వ వైభవం తీసుకొచ్చాడు.
ఈ పనులు అయ్యేవరకూ సత్యం ఇంట్లోనే సురేంద్ర బస చేసాడు. ప్రతిరోజూ అమెరికా నుంచి రుషి ఫోను చేసి తనకి తోచిన సలహాలు, సూచనలు సురేంద్రకి ఇస్తూ వుండేవాడు.
ఒక మంచిరోజు చూసుకుని, సురేంద్ర ఇంటి ముందు తండ్రి పేరుతో, ‘రాజయ్య ఉచిత ఆవాస కేంద్రం’ అనే బోర్డు తగిలించాడు. ఏ తోడూ లేక ఒంటరిగా గడుపుతూ ఆఖరి ఘడియల కోసం గాజుకళ్ళతో ఎదురుచూస్తూ, ముడతలు పడ్డ తనువుతో, గుప్పెడు మెతుకుల కోసం వణుకుకున్న చేతులు చాపే వృద్ధుల కోసం ఈ ఆవాస కేంద్రం ఏర్పాటు చేసాడు సురేంద్ర. వారందరికీ ఉచిత ఆహార, వసతితో పాటు అవసరమైన వైద్య సేవలు కూడా వుండేలా అన్ని ఏర్పాట్లు చేసాడు. తండ్రి పట్ల తాను చేసిన అపరాధానికి ‘ప్రాయశ్చిత్తం’ ఇలా అమలులోకి తీసుకువచ్చాడు.
వారందరిలో తన తండ్రిని చూసుకుంటూ, వారికి చేసే సేవలు తన తండ్రికి చేసినట్లే భావించాడు.
అంతేకాకుండా, ఇక్కడ మరణించిన వృద్దులకి అంతిమయాత్ర కొరకు మహాప్రస్థానం వరకూ తీసుకువెళ్ళడానికి ‘వైకుంఠధామం’ అనే వాహనాన్ని కూడా ఏర్పాటు చేసాడు. ఎవరి ఆచారాల ప్రకారం వారికి దహన, ఖనన కార్యక్రమాలతో పాటు శ్రాద్ధకర్మలు నిర్వహించి వారు ఉత్తమ గతులు పొందడానికి తగు ఏర్పాట్లు చేసాడు.
ఇక్కడ ఈ కార్యక్రమాలు అన్నీ చూసుకోవడానికి, నిర్వహించడానికి సత్యంని నియమించి, అతనికి సహాయంగా ఆవాసం లోని వృద్ధులని చూసుకోవడానికి నలుగురు యువకులకి తగు జీతభత్యాలతో ఉద్యోగం ఇచ్చాడు.
ప్రతి సంవత్సరం ఇక్కడ మూడు నెలలపాటు గడపడానికి నిశ్చయించుకుని తిరిగి అమెరికా ప్రయాణం అయాడు సురేంద్ర.
ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే రుషి, చాలా ఆనందంగా తండ్రిని కౌగలించుకున్నాడు.
“డాడీ! చాలా హేపీగా వుంది. మీరు చేసిన పనికి తాతయ్య ఆత్మ శాంతిస్తుంది. ఇప్పుడు మీరు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే. వర్రీ అవకండి. మీరు ఆరంభించిన పనిని నేను కొనసాగిస్తాను. నా చదువు అయిపోగానే, ఇండియా వెళ్ళి, నేను పర్మనెంట్ గా తాతయ్య ఊరిలో వుండిపోతాను. అమ్మని కూడా ఒప్పించాను. చెల్లాయి బాధ్యత తీరగానే మీ ఇద్దరూ కూడా తాతయ్య వూళ్ళోనే వుండిపోవడానికి ఒప్పుకుంది.” అన్నాడు.
రుషి మాటలకి సురేంద్ర ఆనందంతో తబ్బిబ్బు అయిపోయాడు. తను చేసిన తప్పులకి రుషి వారసుడు కాకుండా, తనలో మార్పు తీసుకువచ్చి, తప్పులని సరిదిద్ది… చనిపోయిన తన తండ్రిని నిరంతరం తలుచుకునేలా ఎందరో తండ్రులని, తాతయ్యలని చూసుకోవడానికి తాను సిద్ధమయ్యాడు. తాను తన తండ్రికి మంచి కొడుకుని కాకపోయినా, తనకి మాత్రం మంచి కొడుకుని ‘బహుమానం’ గా ఇచ్చాడు భగవంతుడు. ఆయనకి కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలి? అనుకుంటూ కళ్ళజోడు తీసి ఆనందాశ్రువులని తుడుచుకున్నాడు సురేంద్ర.

సమాప్తం

1 thought on “ప్రాయశ్చితం – 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *