April 28, 2024

బాలమాలిక – స్వశక్తి

రచన: విశాలి పేరి

అది ఒక పెద్ద తోట… నిన్నటివరకూ. నిన్ననే ఆ తోటను ఒక పెద్ద బిల్డర్ కి అమ్మేశాడు ఆ తోట యజమాని. ఆ తోటనిండా బోలెడు చెట్లు. ఆ చెట్ల మీద బోలెడు పక్షులు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి.
ఆ తోట కొనుకున్న బిల్డరు అక్కడ ఒక పెద్ద మాల్ కట్టాలని అనుకున్నాడు. తోట కొన్న మరునాడే అతనొక కాంట్రాక్టర్ ని తీసుకొని వచ్చి, “ఈ చెట్లన్నీ కొట్టేయించు” అని ఆర్డర్ ఇచ్చి వెళ్ళాడు. పక్షులన్నీ ఈ మాట విని, అక్కడ జనాలని చూసి, వాటికేదో ప్రమాదం రాబోతోందని తెలిసి, వాటి వాటి గూళ్ళని ఖాళీ చేసుకొని, రెక్కలని నమ్ముకొని వెళ్ళిపోయాయి. కానీ ఒక చెట్టు మీది పక్షి జంట ఆ సమయానికి ఎక్కడికో వెళ్ళింది. అక్కడి జనాల ఈ మాటలన్నీ ఆ గూటిలోని పక్షి పిల్లలు విని, చాలా భయపడిపోయాయి.
సాయంత్రము తమ తల్లిదండ్రులు రాగానే, “అమ్మా! మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈ చెట్లను కొట్టేయమని ఒక అతను ఇంకో అతనికి చెప్పాడు” అని అన్నాయి.
దానికి తల్లి పక్షి, “ఏమీ కంగారు పడకండి… ఇప్పట్లో చెట్లేమీ కొట్టెయ్యరు, మీరు ఏమాత్రం భయపడకుండా ఉండండి. కానీ ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉండండి, అంతే” అని హామీ ఇచ్చింది.
మరునాడు ఆ కాంట్రాక్టరు, ఒక మేస్త్రీని తీసుకొచ్చి, “రేపటి కల్లా ఈ చెట్లని కొట్టేయించాలి” అని ఆర్డర్ వేసాడు.
“సరే” అని మేస్త్రీ అన్నాడు.
మళ్ళీ సాయంత్రం పక్షి పిల్లలు జరిగింది తల్లి పక్షికీ, తండ్రి పక్షికీ చెప్పాయి. “ఏమీ కంగారు పడకండి, ఇప్పట్లో చెట్లేమీ కొట్టరు వాళ్ళు” అని హామీ ఇచ్చింది తల్లి పక్షి.
మరునాడు ఆ మేస్త్రీ ఒక కూలివాడిని తీసుకొని వచ్చి, “రేపటి కల్లా ఈ చెట్లను కొట్టెయ్యాలి” అని చెప్పాడు, అధికారంగా.
అందుకు ఆ కూలీ అతను సరేనన్నాడు. “రేపు మా కూలీలందరినీ తీసుకొని వచ్చి, చెట్లు కొట్టేస్తాను” అని అన్నాడు.
ఆ రోజు జరిగినదంతా ఆ పక్షి పిల్లలు సాయంత్రం తల్లితండ్రి పక్షులకి చెప్పాయి.
“ఏమీ కంగారు పడకండి, ఇప్పట్లో చెట్లేమీ కొట్టరు వాళ్ళు” అని హామీ ఇచ్చింది తల్లి పక్షి ఎప్పటిలాగానే.
మరునాడు పొద్దుట ఆ కూలీ అతను భార్యతో సహా ఆ తోటకు వచ్చి, “ఏమిటో కూలీలెవరూ రానంటున్నారు, పోనీ పక్క ఊరి నుంచి కూలీలను పిలిపించి చెట్లను కొట్టెయ్యమని చెబుదాము” అని అన్నాడు. అందుకు అతని భార్య, “బాగుంది ఈ ఆలోచన. అలాగే చెయ్యి” అని అంది.
మళ్ళీ సాయంత్రం కూలికీ, అతని భార్యకి జరిగిన మాటలు ఆ పక్షి పిల్లలు తల్లితండ్రికి చెప్పాయి.
“ఏమీ కంగారు పడకండి, ఇప్పట్లో చెట్లేమీ కొట్టరు వాళ్ళు” అని అదే ధీమాతో హామీ ఇచ్చింది, తల్లి పక్షి.
మళ్ళీ మరునాడు ఆ కూలీ అతను, అతని భార్య ఆ తోటకి వచ్చారు. అతను చెట్లవంక చూస్తూ, “లాభం లేదు… పక్క ఊరి నుంచి కూలీలు రావడం ఇప్పట్లో అయ్యేటట్టు లేదు కానీ, రేపే నువ్వూ నేను చెట్లు కొట్టడం మొదలెట్టేద్దాము. వచ్చే కూలీలు ఎప్పుడొస్తే అప్పుడే చూద్దాము” అని అన్నాడు.
అతని భార్య, “అవునండి… త్వరగా మొదలెట్టెస్తే పని త్వరగా అవుతుంది” అని అంది.
మళ్ళీ సాయంత్రం ఆ కూలీకి, అతని భార్యకి జరిగిన సంభాషణ మొత్తం తల్లిపక్షికి చెప్పాయి.
వెంటనే తల్లి పక్షి, “త్వరగా బయలుదేరండి, మనం దగ్గర సమయం ఎక్కువ లేదు. వేరే తోటలో మొన్ననే ఒక చెట్టు చూశాను, అక్కడకి వెళ్ళిపోదాము” అని చెప్పింది.
“అదేమిటమ్మా! ఇంతవరకు చెట్లు కొట్టని వారు, రేపు కొడతారని నమ్మకమేమిటీ? ఇక్కడే ఇంకొన్ని రోజులు ఉండిపోదాము” అని పిల్ల పక్షులు అన్నాయి.
“ఆ కూలీవాడు ఇంతవరకు ఎవరో వస్తారని ఎదురు చూశాడు. కానీ రేపు ఎవరి సాయం కోసం ఎదురు చూడక తనే పనిలో దిగుతున్నాడు. మనిషి ఎదుటి వారి మీద ఆధారపడినన్నాళ్ళు ఏ పని చేయలేడు, చేసినా విజయం పొందలేడు. తన శక్తిని నమ్ముకొన్న వాడు తప్పక విజయం పొందుతాడు. ఆ కూలీ అతను ఇన్ని రోజులు స్వశక్తిని నమ్మక వేరే వాళ్ళని నమ్మాడు, కానీ ఈ రోజు స్వశక్తిని నమ్మాడు. కాబట్టి ఇంక ఇక్కడ మనము ఉండటం అంత శ్రేయస్కరం కాదు” అని తల్లి పక్షి చెప్పింది.
మర్నాడు సూర్యోదయం అవుతూండగానే, పిల్లలను తీసుకొని వేరే తోటకు వెళ్ళిపోయాయి ఆ పక్షులు.

***

1 thought on “బాలమాలిక – స్వశక్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *