April 27, 2024

ఉరూరి – ఉరూరి

రచన: మంగు కృష్ణకుమారి

రామారావుగారికి నలుగురు పిల్లలు.‌ కొడుకు విజయ్, తరవాత కవలలు వసంత, కవిత. ఆఖరి పిల్ల చిన్నారి. నలుగురు పిల్లలతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది.
అందరిలోకీ చిన్నది చిన్నారి. దీని అసలు పేరు రాధిక. అయినా అందరూ ‘చిన్నారీ’ అనే పిలుస్తూ ఉంటారు. ఈ చిన్నారి అందరికన్నా బాగా చిన్నదేమో ఇంట్లో అందరికీ చాలాముద్దు.
చిన్నపిల్ల కదాని ఏదైనా ముందు దానికే ఇస్తారు. వాళ్ల నాన్నమ్మ, “నీ కోసమే ఈ‌స్వీ ట్ చేసేనే, ఈ బొమ్మ నీ కోసమే కొన్నానే…” అంటూ గారం చేసేది. వాళ్ల నాన్న ఆఫీస్ నించీ రాంగానే “చిన్నారీ…” అంటూ దాన్నే పిలిచేవాడు.
విజయ్ కూడా ఎప్పుడైనా తనకి స్కూల్ లో చాక్లెట్టో, స్వీటో ఇస్తే ఇంటికి‌ రాగానే, “చిన్నారీ, నీకే” అని దానికే ఇచ్చేసేవాడు.
దాంతో చిన్నారికి చిన్న బిరుసు వచ్చింది. వసంత, కవితలని “అక్కా, అన్నీ నాకే, నీకు లేదు” అనడం, ఏ లడ్డూవో తింటూ, “కవితక్కా, నీకు లడ్డూ లేదు ఉరూరీ… నాకు ఉంది ఉరూరి, ఉరూరి” అనడం… ఏ కొత్త బొమ్మతోనైనా అడితే, “వసంతక్కా, ఈ బొమ్మ నాది, నీది కాదు. నీకు ఇవ్వను ఉరూరి, ఉరూరి” అని అక్కలని ఊరించడం మొదలెట్టింది.
నిజానికి, వీళ్లు ఏమీ బాధ పడేవారు కాదు. అయినా వాళ్లూ కొంతైనా చిన్నపిల్లలే కాబట్టి వాళ్లకి మండేది. దీనికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని అనుకున్నారు.‌ ఒకసారి వాళ్ల నాన్నమ్మ తెలిసిన వాళ్లతో కలిసి తీర్థ యాత్రలకు వెళ్లింది. చిన్నారి, నాన్నమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాది.
మొత్తానికి నాన్నమ్మ యాత్రలన్నీ ముగించిసుకొని తిరిగి వచ్చింది.‌ ఆవిడ రైలు దిగి మధ్యాన్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి చిన్నారి మంచి నిద్రలో ఉంది. ఆవిడ స్నానం, భోజనం ముగించి, కోడలితో కబుర్లు చెప్తూ కూర్చొనేసరికి చిన్నారి లేచి వచ్చి ‘నాన్నమ్మా…’ అంటూ మీదకి దూకింది.‌ అది ఒళ్లో దూరి గారాలు పోతుండంగానే, విజయ్, వసంత, కవిత వచ్చేసేరు.
‘నాన్నమ్మా’ అంటూ కవితా, వసంతా దగ్గరకి వచ్చేరు గానీ, చిన్నారి నాన్నమ్మ వొళ్లోంచి కదలలేదు. నాన్నమ్మకి అందరూ సమానమే!
నవ్వుతూ వాళ్నందర్నీ పిలిచింది. వసంత “నాన్నమ్మా, మాకేం తెచ్చేవు?” అని అడిగింది.
“బెడ్రూమ్ లో ఉన్నాయే!” అని అంటూ ఉండంగానే కవితా, వసంతా పరిగెత్తి వెళ్లి మూడు పటాలు తెచ్చి,
విజయ్ కి ఒకటి ఇచ్చి వాళ్లిద్దరూ చెరోటి తీసుకున్నారు. చిన్నారి నాన్నమ్మ ఒళ్ళో ఉండడం దానికి పటం రాలేదు. “ఇదేమిటి నానమ్మా?” అని చిన్నారి అడిగింది.
నాన్నమ్మ వివరంగా ఇలా చెప్పింది. “విజయ్ చేతిలోది బాసర సరస్వతీదేవి, ఆవిడని రోజూ కొలిస్తే పెద్ద చదువు వస్తుంది. వసంత చేతిలోది కొల్హాపూర్ మహాలక్ష్మి, ఆవిడకి రోజూ పూజ చేస్తే ఎంతో సంపద ఇస్తుంది. కవిత చేతిలో కాశీ అన్నపూర్ణ, ఆవిడని కొలిచిన వారికి తిండికి లోటే రాదు సరికదా వాళ్ల చేతిమీద అందరికీ అన్నదానం చేస్తారు…” అని వివరించింది.
కవితా, వసంతలకి ఎప్పటినించో చిన్నారితో చిలిపి ఆట ఆడాలని ఉందేమో, మంచి అవకాశం వచ్చిందని, సంతోషంగా, “పటాలన్నీ మాకే ఉరూరి, చిన్నారికి లేవు ఉరూరి” అని దాన్ని ఊరిస్తూ చిలిపిగా దాని పక్క చూసేరు.
అప్పుడే ఆఫీస్ వచ్చిన రామారావుగారు, పిల్లల తల్లి అయిన సావిత్రి నవ్వుతూ, చిన్నారి ఏం జవాబు చెప్తుందా అని చూస్తున్నారు.
చిన్నారి కొంచెం ఆలోచించింది. ఏడుపు మొహం పెట్టకుండా, “అక్కలూ, మీకు ఒక్కొక్క దేవుడే ఉరూరీ, నాకు ముగ్గురు దేవుళ్లూ ఉన్నారు ఉరూరి, మీకే లేరు ఉరూరి,” అని రివర్స్ అయింది.
“ఎలాగో చెప్పీదా?” అని లేచి వాళ్లమ్మని పట్టుకుంది. “అమ్మ నాకు రోజూ అన్నపూర్ణమ్మలా అన్నం పెడుతుంది. సరస్వతీదేవిలా చదువు చెప్తుంది, లక్ష్మీదేవిలా డబ్బులు ఇస్తూ ఉంటుంది. అమ్మ నాది ఉరూరి, నీది కాదు ఉరూరి” అంటూ అక్కల పక్క చూసింది.
నానమ్మ, అందర్నీ పిలిచి నవ్వుతూ “పిల్లలూ… అమ్మా అందరిదే, దేవతలూ అందరివారే, మీరు కలిసిమెలిసి ఉండాలి. చిన్నారీ, నువ్వు, అక్కలూ అన్నయ్య చెప్పినట్టు వినాలి సుమా! అంది.
అక్కలిద్దరూ “చిన్నారే మాది” అంటూ చిన్నారిని పట్టుకున్నారు. అది “అక్క నాది” అంటూ వాళ్లని చుట్టేసింది.
పిల్లల మధ్య చిలిపి తగవులే గానీ నిజం తగువులు లేవని ఎప్పుడూ తెలిసినా మళ్లీ ఋజువు అయేసరికి అయేసరికి తల్లి తండ్రులిద్దరూ పిల్లలందర్నీ ముద్దు చేసేరు.
నాన్నమ్మ లేచి, “పిల్లలూ, ఇంతకీ మీకోసం తెచ్చిన బొమ్మలూ, ప్రసాదాలూ కొత్తబట్టలూ వేరే పెట్టెలో ఉన్నాయర్రా, ఈ పటాలు నేనూ, మీ అమ్మ పూజ చేసుకుందుకని తెచ్చేను. మీరందరూ రోజూ జేజలకి దండం పెట్టుకోవాలి సుమా!” అంటుంటే, అందరూ బుద్ధిగా తలూపేరు.
***
నోట్: ( ఉరూరి అంటే ) పక్క వాళ్లని ఊరించిందికి, ఉడికించిందికీ వాడే పదం.
పిల్లలు ఆటలలో పక్క పిల్లలని, ఊరించిందికి, కవ్వించిందికి, సరదాగా ఏదో వస్తువు పట్టుకొని, “నాకే ఉంది ఉరూరి, నీకు లేదు ఉరూరి” అని ఊరించీవారు. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండే రోజుల్లో ఆటలూ ఈ తరహా ఊరింపులూ, సరదా ఆటలు ఎక్కువే ఉండేవి.

************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *