April 28, 2024

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 7

రచన:- శ్రీమతి రామలక్ష్మి కొంపెల్ల

ఈ సంచికలో మనం సెమీ క్లాసికల్ (తెలుగులో అర్ధ శాస్త్రీయమైన అని చెప్పచ్చు) రచనల్లో రాగమాలికల గురించి చర్చించుకుందాము. ఒక సంకీర్తన లాగా పాడే రచనలు అన్నీ కూడా ఈ విభాగంలో చేర్చుకోవచ్చు. శాస్త్రీయ సంగీతం విషయంలో రాగం, తాళం అన్నీ కూడా చాలా సాధన ద్వారా నేర్చుకుని, వాటిని ప్రదర్శించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, నియమబద్ధంగా ప్రదర్శించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, సెమీ క్లాసికల్ రచనలు, భక్తిరసం తో నిండి ఉండే రచనలు. అవి, శాస్త్రీయపరమైన తర్ఫీదు లేనివారు కూడా భక్తితో పాడుకునే అవకాశం ఉన్న రచనలు.
శాస్త్రీయ సంగీతానికి, అర్ధ శాస్త్రీయ సంగీతానికి తేడా ఏమిటి అంటే, ఒక కృతికి, కీర్తనకు ఉన్న తేడా అన్నమాట. నాలుగు మాటలు ఆ రెంటి మధ్య ఉండే తేడా గురించి చెప్పుకుని ఆ తర్వాత రచనల గురించి తెలుసుకుందాం.
కృతి సంగీత ప్రధానమైనది.
కీర్తన సాహిత్య ప్రధానమైనది
కృతిలో కష్టమైన సంగతులు, స్వర సంచారాలు ఉంటాయి. కీర్తనలో కష్టమైన సంగతులు, సంచారాలు ఉండవు.
ఉన్నతమైన రాగభావంతో ఉండే రచన కృతి.
కీర్తనలు సామాన్యమైన రాగభావంతో ఉంటాయి. గానరస ప్రధానమైనవి కృతులు. భక్తిరస ప్రధానమైనవి కీర్తనలు.
సంకీర్తనలు రచించిన వాగ్గేయకారులు మన దేశంలో ఎందరో ఉన్నారు. హిందుస్తానీ సంగీతంలో తులసీదాస్, మీరాబాయిలాంటి వారు చేసిన రచనలు కోకొల్లలు. కర్ణాటక సంగీతంలో సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుల్లో ముఖ్యమైన వారు, సర్వశ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, పురందర దాసు, భక్త రామదాసు, నారాయణ తీర్థ, సదాశివ బ్రహ్మేంద్ర మొదలైనవారు. కొంచెం పాడగలిగిన వారెవరైనా సరే, భక్తిగా పాడుకోవడానికి వీలుగా ఉండే ఈ రచనలు సాహిత్యపరంగా చాలా గొప్పగా ఉంటాయి. అందుకే శాస్త్రీయ సంగీతం నేర్చుకునే సమయం, అవకాశం లేనివారు కూడా ఈ భక్తి సంగీత రచనలు నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతారు.
ఈ విభాగంలో ముందుగా అన్నమాచార్యుల వారి కీర్తన “ఎంత మాత్రమున యెవ్వరు తలచిన అంత మాత్రమే నీవు” అనే ద్విరాగమాలిక గురించి తెలుసుకుందాం. అలాగే అన్నమాచార్యుల వారి గురించి కూడా కొన్ని విషయాలు చర్చించుకుందాము.

అన్నమాచార్యులు:
తెలుగునాట, చందమామ రావే జాబిల్లి రావే అంటూ పిల్లలకు అన్నం తినిపించే తల్లులు, జో అచ్యుతానంద జోజో ముకుందా అని పాడుతూ పిల్లలను నిద్రపుచ్చే తల్లులు ఈ భూమి ఉన్నంత వరకు, ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి శిష్ట వ్యావహారిక భాషలోనే కాక, ప్రౌఢ సంస్కృత భాషలో కూడా రచనలు చేసిన అన్నమాచార్యుల వారు క్రీ.శ. 1408 సం. వైశాఖ పూర్ణిమనాడు, శ్రీ వేంకటేశ్వరుని వర ప్రసాదంగా (తల్లి) అక్కమాంబ, (తండ్రి) నారాయణ సూరికి, కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో జన్మించారు. అన్నమాచార్యుల వారు ఆంధ్రదేశం గర్వించదగిన గొప్ప వాగ్గేయకారులు. 32000 సంకీర్తనలు చేసిన పదకవితా పితామహుడు. శ్రీ వేంకటేశ్వరుని భక్తితో సేవించి, స్తుతించి తరించిన పరమ భాగవతోత్తముడు. వీరు వెంకటేశ్వరస్వామి వారికి, అలమేలు మంగమ్మవారికి కూడా జోల పాటలు, లాలి పాటలు, మంగళాలు, సువ్వి పాటలు, కూగూగులు, కళ్యాణం పాటలు, నవవిధ భక్తిరస ప్రధానమైనవి, తాత్విక చింతన కలిగినవి, ఎన్నో ఎన్నెన్నో రచనలు చేసి క్రీ.శ. 1502 సం. శ్రీ వేంకటేశ్వరునిలో ఐక్యం అయినట్లు తెలుస్తోంది.
వారి రచనలకు సంబంధించిన సంగీతలిపి (notation) లభ్యం కాకపోవడం వల్ల, వారి సాహిత్యం తీసుకుని నేటి తరం సంగీత విద్వాంసులు ఎందరో సంగీత రచన చేసి, ఆ రచనలను ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చారు. అన్నమయ్య రచనలను వెలికి తీసి, వాటికి సంగీతం సమకూర్చి, ఆ రచనల గొప్పదనం తెలియచెప్పడం కోసం 1978 లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ‘అన్నమాచార్య ప్రాజెక్ట్’, అనే ఒక సంస్థ ఏర్పాటు చేయబడింది.
ఇప్పుడు మనం చర్చించుకుంటున్న ఈ రచనకు సంగీతం సమకూర్చిన వారు శ్రీ. కడయనల్లూర్ వెంకటరామన్ గారు.
రెండు మాటలు వెంకటరామన్ గారి గురించి కూడా చెప్పుకుని, ఆ తర్వాత రచన గురించి మాట్లాడుకుందాం.
కె. వెంకటరామన్ గారు నవంబర్ 16వ తేదీ 1929 లో జన్మించి 2004 లో మరణించినట్లు తెలుస్తున్నది. వారు తిరువనంతపురంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో సంగీత విద్య అభ్యసించి, తర్వాత వివిధ ప్రముఖ కచేరీలలో తంబురా వాయించడం చేసేవారు. ఆకాశవాణి, చెన్నైలో వారి ఉద్యోగం ద్వారా వారికి వివిధ ప్రముఖ కళాకారులతో పరిచయం ఏర్పడింది. సెమ్మంగుడి వంటి విద్వాంసులు, వెంకటరామన్ గారికి సన్నిహితులయ్యారు. అదే సమయంలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగారి చేత కొన్ని కొత్త రచనలు రికార్డ్ చేయించవలసిన బాధ్యత సెమ్మంగుడి వారికి అప్పగించబడినప్పుడు, వారు, వెంకటరామన్ గారిని ఆ రచనలకు సంగీతం సమకూర్చమని అడిగారట. వెంకటరామన్ గారి సంగీత రచన, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి గొంతులో విన్న శ్రోతలు ముగ్ధులయ్యారట. ఆ విధంగా వెలువడ్డ రచనలే భావయామి గోపాలబాలం, డోలాయాంచల, క్షీరాబ్ధి కన్యకకు, మొదలైన అన్నమాచార్య కీర్తనలు, వ్యాసరాయల వారు రచించిన ‘కృష్ణా, నీ బేగానే బారో’ మొదలైనవి. ఇంకా ఎన్నో స్తోత్రాలు, జయదేవుడు, చైతన్య ప్రభువు మొదలైన వారి రచనలు కూడా వీరి సంగీత రచనతో ఎంతో ప్రఖ్యాతి గడించాయి. మనం క్రితం సంచికలో చర్చించుకున్న గణేశ పంచరత్న స్తోత్రమ్ కూడా వెంకటరామన్ గారి సంగీతం సమకూర్చినదే అని తెలుస్తున్నది. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు, వెంకటరామన్ గారి భాగస్వామ్యంతో ఎన్నో గొప్ప గొప్ప రచనలు, సంగీతం అంటే చెవి కోసుకునే రసికులకు లభ్యం అయ్యాయి.
ఇప్పుడు కీర్తన గురించి తెలుసుకుందాం.
కీర్తన:
పల్లవి: (బృందావని రాగం)
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు ॥

1. చరణం (బృందావని రాగం)
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
ll ఎంత మాత్రమున ll

2. చరణం: (మాయామాళవ గౌళ రాగం)
సరి నెన్నుదురు శాక్తేయులు, శక్తిరూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు ।
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
గరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు ॥

3. చరణం (మాయామాళవ గౌళ రాగం)
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవమని
ఈవలనే నీ శరణనెదను, ఇదియే పరతత్వము నాకు

ll ఎంత మాత్రమున ll

అలతి అలతి పదాలలో అనంతమైన తాత్విక చింతన కనిపిస్తుంది అన్నమయ్య రచనలలో.
ఉపాసనా మార్గాలు రెండు రకాలు. 1. సగుణ ఉపాసన. 2. నిర్గుణ ఉపాసన.

మొదటిదశలో భగవంతుడికి నామ రూపాలు ఉన్నాయన్న భావనతో ధ్యానం, పూజ, ఉపాసన చేసుకుంటాం. రెండవ దశలో, భగవంతుని నిరాకారుడుగా భావించి ఉపాసిస్తాము.
సగుణ ఉపాసన మార్గంలో భగవంతుని కొందరు శివునిగా, కొందరు విష్ణువుగా, కొందరు శక్తి స్వరూపంగా, కొందరు గణపతిగా, మరి కొందరు సూర్యుడిగా, ఇంకొందరు కుమార స్వామిగా ఆరాధించండం మనం చూస్తూ ఉంటాము.
వివిధ రూపాల్లో భగవదారాధన చేసుకోవడం కోసం ఎన్నో స్తోత్రాలను, అష్టకాలను రచించి మనకు అందించిన గొప్ప అద్వైత వేదాంతవేత్త ఆది శంకరాచార్య. అయితే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అతి ముఖ్యమైన అంశం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ‘వాసుదేవః సర్వమితి’, అన్నారు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒకే వాసుదేవుడు. ఎన్ని రకాలుగా భగవంతుడి రూపాలను ధ్యానించినా, పూజించినా అవన్నీ చేరేది ఒక పరమాత్మ దగ్గరికే.
భగవద్గీత లోని 7వ అధ్యాయం, విజ్ఞాన యోగంలోని 21వ శ్లోకం –
యో యో యాం యాం తనుం భక్తః
శ్రద్ధయార్చితుమిచ్ఛతి
తస్య తస్యాచలాం శ్రద్ధాం
తామేవ విదధామ్యహం.
“ఏ యే భక్తుడు ఏ యే దేవతా రూపమును శ్రద్ధతో పూజించదలచుచున్నాడో, వాని వానికి ఆ పూజకు తగిన శ్రద్ధను నేను కలుగజేయుచున్నాను”, అన్నది కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం. ఏ మార్గమును ఎంచుకుని ఆధ్యాత్మిక సాధన మొదలు పెట్టినప్పటికీ, తుదకు చేరేది మాత్రం పరమాత్మనే. ఆ పరమాత్మను నేనే అన్నాడు వాసుదేవుడు. ఈ విధంగా ఆధ్యాత్మికోన్నతికై ఎవరు ఎంత ప్రయత్నం చేస్తే, అంత ఫలితం పొందుతున్నాడు.
ఇదే విషయాన్ని చాలా చక్కగా వివరించిన రచన ఇది.
ఎవరు ఎలా తలిస్తే నువ్వు అలాగే ఉంటావు అని పరమాత్మను ఉద్దేశించి చెప్పారు అన్నమయ్య. దానికి ఒక పోలిక చెప్తూ, పిండి కొద్దీ రొట్టె లాగా అని కూడా అన్నారు. “ఏ విధంగా పిండి కొద్దీ రొట్టె తయారవుతుందో, అదే విధంగా ఎవరెవరు వారి మనసుల్లో నిన్ను ఎలా భావిస్తారో అదే నువ్వు”, అన్నారు అన్నమయ్య.
మొదటి చరణంలో – వైష్ణవులు నిను విష్ణు స్వరూపంగా, వేదాంతులు పరబ్రహ్మగా, శైవులు నిను శివుడుగా, కాపాలికులు నిను ఆది భైరవుడిగా పూజిస్తారు, అన్నారు అన్నమయ్య.
రెండవ చరణంలో – శాక్తేయులు నిను శక్తిరూపంగా, ఇతరులు వారి వారికి తోచిన విధంగా నిను ఆరాధిస్తారు. అల్పబుద్ధులు కలిగినవారికి అల్పుడివి, ఘనబుద్ధులకు ఘనుడివి కూడా నీవే, అని వేంకటేశ్వరునితో అన్నారు అన్నమయ్య.
మూడవ చరణంలో – నీరు ఉన్నంత మేరకు తామర విస్తరించినట్టు, నీ వలన కొరత అన్నది లేదు. మేము ఎంత సాధన చేస్తే, నువ్వు అంత అనుగ్రహిస్తావు. నీ కరుణలో ఏ లోటూ ఉండదు. ఎలా అయితే గంగానదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ బావి త్రవ్వినా గంగాజలమే ఊరుతుందో, అలా కురిపిస్తావు నీ దయను. శ్రీ వేంకటపతివైన నువ్వు నన్ను కాపాడే దైవమని నమ్మి నీ శరణు కోరుతున్నాను, ఇదియే నాకు పరతత్త్వము. ఇలా అన్నమయ్య పూర్తిగా తనని తాను వేంకటేశ్వరునికి సమర్పించుకుని సర్వశ్య శరణాగతి చేసి తరించారు.
పల్లవి, మొదటి చరణం బృందావనిరాగంలో చేయబడ్డాయి. రెండవ చరణం, మూడవ చరణం మాయామాళవగౌళ రాగంలో చేసారు కడయనల్లూర్ వెంకటరామన్ గారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం. ఆ కార్యక్రమం ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారికి అప్పగించినపుడు, ఆవిడ వెంకటరామన్ గారి సంగీత సహకారంతో అత్యద్భుతంగా పాడి అప్పట్లో క్యాసెట్ విడుదల చేసారు అని వివిధ ఆధారాల ద్వారా తెలిసిన సమాచారం.
ఆ అద్భుతమైన కీర్తన ఈ లింక్ లో వినేద్దాం రండి మరి!

 

మరొక రాగమాలిక అంశం వచ్చే సంచికలో తెలుసుకుందాం.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *