May 6, 2024

రాముని మిత్రధర్మము

రచన: యఱ్రగుంట సుబ్బారావుగారు

 

 

సప్తాంగములతో కూడిన రాజతంత్రమందు మిత్రునకు స్థానమున్నది. అట్లే రాజునకున్న బలములలో మిత్రబలమొకటి. ఒక మహారాజ్యాధిపతితో యుద్ధము చేయవలసిన రామునకు మిత్రబలము అవసరమై ఉన్నది. రాముడు రావణునిపై దండెత్తనున్నాడని తెలిసిన సీత “రాముడు మిత్రులను సంపాదించెనా?” అని హనుమంతుని ప్రశ్నించినది. శాపవిముక్తిని పొంది, దివ్యుడైన కబంధుని ద్వారా రాముడు సీతావృత్తాంతము నెఱుగదలచినను, కబంధుడు – సీత ఉన్న స్థానము తనకు తెలియునో, తెలియదో కాని ఆ విషయమును స్పృశింపక, రాముడున్న స్థితిలో ఆయనకవశ్యకమైన దానిని గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు-“రామా! నీవు భార్యను పోగొట్టుకొని దుర్దశలో నున్నావు. ఇట్టి స్థితిలో యున్న నీకు మంచి స్నేహితుడు కావలసి ఉన్నది. అట్టి మిత్రుని సంపాదింపక నీ కార్యము సిద్ధిపొందునని నేను తలంచను” (అర.౭౨-౯,౧౦) అని సుగ్రీవుని రామునకు మిత్రునిగా నిర్దేశించినాడు. కబంధుడు దివ్యుడగుటవలన ఒకవేళ సీత ఉన్న స్థానమును తెలిసి రామునికెఱింగించినను, దానివలన ఆయనకంత ఉపయోగముండదు. సీతను సాధించుకొనుటకు ఆయన వేఱు ప్రయత్నము చేయవలసియుండును. అందుకే మహాఫలరూపమగు మిత్ర సంపాదనమునకై రామునిని ప్రేరణ చేసినాడు కబంధుడు.

 

అయితే రాముని కార్యము నెఱవేరుటకు- రాజు, సైన్యవంతుడు, బలవంతుడు అయిన వాలిని చూపక – దుర్దశలో ఉన్న సుగ్రీవుని ఏల చూపినాడు? తనకు సూచించినవాడు తనవలె దుర్దశా పీడితుడని ఎఱిగి రాముడు దానికెట్లు సమ్మతించినాడు? దుర్దశలో ఉన్నను స్థిరచిత్తుడు మైత్రికి అర్హుడని ధర్మశాస్త్రమిట్లు చెప్పుచున్నది -” అప్పుడు బలహీనుడై ఉన్నను, మీదటికి వృద్ధినందునట్టి స్థిరచిత్తుడగు శాశ్వతమిత్రుని పొంది వృద్ధినొందినంతగా రాజు, సువర్ణ భూమ్యాది లాభములవలన వృద్ధినందడు”(అధ్యా.౭- ౨౦౯, మనుస్మృతి). తుల్యావస్థలోనుండి పరస్పరసాయమపేక్షించు వారి స్నేహము దృఢతరముగా నుండును. అట్టి స్థితిలో ఉన్నను వారిలో ఒకరుగాని, ఇరువురుగాని దుర్జనులైనచో అక్కడగూడ స్నేహముండదు. అందుకే “ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు,తృప్తిపడువాడు, ప్రేమశీలి, నిలకడగలవాడు అయిన మిత్రుడు శ్రేష్ఠుడు. అట్టివానిని సంపాదింపవలయును”( అధ్యా.౭ – ౨౦౯, మనుస్మృతి) అని శాస్త్రము నిర్దేశించుచున్నది. కావుననే “సత్యసంధుడు, వినయశీలి, ధైర్యశాలి, మతిమంతుడు, సమర్థుడు, ప్రగల్భుడు, కాంతిమంతుడు, బలపరాక్రమవంతుడు”(అర.౭౨-౧౩,౧౪) అయిన సుగ్రీవుని మిత్రునిగా కబంధుడు సూచించినాడు.

 

రాముడు తన కార్యము సాధించుకొనవలసియున్నను, దానిని అధర్మముగా గాని, అధార్మికుల సాయముతోగాని సాధించువాడు కాడు. రామబాణ ఘాతమునకు అల్పప్రాణావశిష్టుడైన వాలి-” ఏ రావణుని కారణముగా నన్ను కొట్టితివో, ఆ రావణుని చంపి, మెడకు త్రాడు బిగించి తెచ్చి నీకు సమర్పించెడివాడను, నీ ఆదేశము వలన సముద్రములోనో, పాతాళములోనో ఉన్న సీతను తెచ్చి నీకు అప్పగించెడివాడను”-(కిష్కిం.౪౭,౪౮) అని రామునితో పలికినాడు. రామునకు తన కార్యము సాధించుకొనుటే ప్రధానమైనచో, తనకే ఇంకొకరి సాయము కావలసియున్న సుగ్రీవుని కంటె రాజు, బలోపేతుడు అయిన వాలియే తగినవాడు. రాముడు వాలితో చెలిమి చేసినచో తన కార్యము సులభముగా నెరవేరెడిది. పైగా వాలి నిందావాక్యములకు పాత్రముకాకుండ తప్పిపోయెడిది. ఇట్టి అవకాశమున్న వాలిని కాదని సుగ్రీవుని మైత్రినే కోరినాడు. ఇక్కడ వాలితో స్నేహము చేయుటకు రామునకు ప్రధానమైన ధార్మిక ప్రతిబంధమొకటున్నది. వాలి బలవంతుడైనను, రాజై సైన్య సమేతుడైనను, రామునకు సాయము చేయ సమర్థుడైనను వానియందు అధర్మ దోషమున్నది, ఔద్ధత్యమున్నది. ఇట్టివాడూ స్నేహమునకేగాక ప్రజాపరిపాలనకు కూడ అనర్హుడు. ఇట్టివాడు శిక్షార్హుడు కాని మైత్రికి పాత్రుడు కాడు. ఉద్ధతుడైన వాలికి, దీనుడైయున్న రామునకు మైత్రి సగౌరవముగా పొసగునా? అట్టి దీనస్థితిలో ఉన్నను, తన కార్యసాధనావ్యగ్రుడై యున్నను రాముడు వాలివంటి ఉద్ధతుని, అధార్మికుని మైత్రికై, సాయమునకై ఆశ్రయించునా? కావుననే శాపముక్తుడైన కబంధుడు కూడ రామునకు మిత్రునిగా సుగ్రీవుని చూపినాడుగాని,వాలిని కాదు. ధార్మికచింత లేనివాడైనచో, తన కార్యము మాత్రము సఫలము కావలెనని కోరువాడైనచో- వాలిని చంపి, సుగ్రీవుని రాజును చేసి, తనకు సాయము చేయు సామర్థ్యము వానికి కల్పించి, వానినుండి సాయమపేక్షింపడు. తనకు సాయము చేయువాడు ధార్మికుడై ఉండవలయునని, సాయము కూడా ధర్మబధ్దమై ఉండవలయునని కోరువాడు కావుననే వాలిని కాదని సుగ్రీవుని చెలిమిని అంగీకరించినాడు.

 

అట్లైన రామునకు సుగ్రీవుడు ధార్మికుడని, వాలి అధార్మికుడని ముందే తెలియునా? అనిన సవివరముగా తెలియకపోయినను కబంధుని వాక్యములను బట్టి – “భ్రాత్రా నిరస్త(అన్నచే నిరసింపబడినవాడు), అన్నచే నిర్వాసితుడైనవాడు( భ్రాత్రా వివాసితః), వాలిచే పాపాచరణము చేయబడినవాడు(వాలినా కృత కిల్బిషః) మఱియు సుగ్రీవుడు- ” సత్యసంధో వినీతశ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్”, ” దక్షో ప్రగల్భోద్యుతిమాన్ మహాబల పరాక్రమః” అనియు రామునకు తెలియుచున్నది. వీనినిబట్టి రామునకు వాలి సుగ్రీవులలోని ధార్మికాధార్మికతలు స్థూలముగా తెలిసినవి. అదియునుగాక, తుల్యావస్థలో నున్నవారికి చెలిమి కుదురునుగాని, భిన్నావస్థలో నున్నవారికి కుదరదు. ఈ రెండు లక్షణములు సుగ్రీవునియందు ఉన్నవి గనుకనే కబంధుడు, ధర్మస్వరూపుడైన రామునకు స్నేహార్హునిగా సుగ్రీవుని సూచించినాడు. రాముడును అంగీకరించినాడు. కబంధుని ద్వారా తెలిసిన విషయము హనుమంతుని మాటలతో బలపడినది. అప్పటికే వాలి శిక్షార్హుడని, సుగ్రీవుడు రక్షణీయుడని తలచిన రామునకు హనుమంతుని మాటలు బలమునిచ్చినవి. ఇక సుగ్రీవుని కథనము విన్నపిమ్మట నిశ్చయముగా వాలి వథార్హుడని తలచి వాలివధను గూర్చి ప్రతిన చేసినాడు. కబంధుని సూచన, హనుమంతుని మాటలు, సుగ్రీవుని కథనము మాత్రమేగాక, సుగ్రీవుని ప్రస్తుత నిర్వాసిత స్థితి ప్రత్యక్ష సాక్ష్యముగా రాముని ఎదుట నిలిచినది. దీనినిబట్టి రాముడు కేవలము తన కార్యసాఫల్యమునకేగాక, ధార్మిక దృష్టితో కూడా సుగ్రీవుని మైత్రి కోరినాడని సిద్ధమగుచున్నది.

 

రాముని స్నేహశీలమునకు జాతి, అధికార, ఐశ్వర్యాదులు పరిమితులు కావు. కాని, ఒకవేళ రాజకుమారుడైన రాముడు వానరజాతివాడని, సుగ్రీవునిని అవమానించునేమో అని అటుల చూడవలదని కబంధుడు రాముని హెచ్చరించినాడు. ( సచ తే నావమంతవ్యో సుగ్రీవో వానరాధిపః). కాని ఆటవికుడైన గుహునితో రామునకు గాఢమైత్రి యున్నది. అట్లే అయోధ్యలో రామునకు ఎందరో మిత్రులున్నారు. ఒకసారి రాముని స్నేహ మాధుర్యమును రుచి చూచినవారు రామునికై ఎట్టి పనియైనను చేతురు, మున్ముందుగా రామపట్టాభిషేక వార్తను సంతోషముతో కౌసల్యాదేవి కెఱింగించినవారు రాముని మిత్రులే. రాముని పట్టాభిషేకమునకు పొంగిపోయిన ఆయన మిత్రులు, రాముని వనగమనమునకు దుఃఖితులై మంచము పట్టినారు. నిరవధికమైన స్నేహవాత్సల్యమున్న గుహుడు రామునకై మహాసైన్యముతో వచ్చుచున్న భరతుని ఎదిరించుటకు సిద్ధమైనాడు. అట్లే రాముని భార్యనపహరించిన రావణుని తొలిసారిగా చూచినపుడు, యుద్ధారంభమునకు పూర్వమే, రామునితో కూడ చెప్పక, హఠాత్తుగా సుగ్రీవుడు రావణునితో ద్వంద్వయుద్ధమునకు దిగినాడు. రాముని స్నేహములో జాతిభేదాదులున్నచో వారిట్లు రామునియెడ ప్రవర్తింతురా?

 

రాముని మిత్రులు ఆయనయందట్లు అనురక్తులగుటకు రాముడు వారిని అంతకంటె ప్రాణాధికముగా ప్రేమించుటయే హేతువు. యుద్ధారంభమునకు ముందే రావణుని చూచి ఆవేశముతో వానితో ద్వంద్వయుద్ధము చేసి తిరిగివచ్చిన సుగ్రీవునితో అతనిపై తనకు కల్గిన భయము, అతనిపై తనకున్న స్నేహానురాగమునిట్లు వ్యక్తము చేసినాడు-” సుగ్రీవా! రాజులు ఇట్టి సాహసము చేయరాదు. నన్ను, విభీషణుని, సైన్యమును సంశయములో పడవేసినావు. నీకైదైన జరిగిన యెడల నా తమ్ములతోగాని, భార్యతోగాని, తుదకు స్వశరీరముతోగాని నాకేమి పని? అనాలోచితముగా ఇట్టి సాహసము మఱల చేయవలదు. ఒకవేళ నీవు తిరిగిరాని యెడల నేనేమి చేయదలచుకొంటినో చెప్పెద వినుము. రావణుని సపుత్రబలబాంధవముగా వధించి, విభీషణుని లంకారాజ్యాభిషిక్తుని చేసి, భరతుని అయోధ్యాధిపతిగా చేసి, ప్రాణములను విడిచెడివాడను”(యుద్ధ.౪౧-౪-౭). సుగ్రీవునకు కలిగిన హానిని వినిన వెంటనే గాక కొంత సమయము తీసికొనుటయు, కొన్ని కార్యములు చేయుటయు  జరిగిన రాముని మిత్రప్రీతి రాముని కర్తవ్యకర్మలకంటె తక్కువయని బోధపడును గదా!

 

నిజమే! రామునకు భార్యకంటె, సోదరులకంటె, మిత్రులకంటె తుదకు తన శరీరముకంటె ధర్మాచరణము ప్రధానమైనది. దుష్టులను శిక్షించుటకు దండధారియైన, క్షాత్రధర్మ ప్రవర్తకుడైన తాను తన ధర్మమును పాటించి, రావణుని శిక్షింపవలసి ఉన్నది. విభీషణునికిత్తునన్న లంకారాజ్యము వానికీయవలసి ఉన్నది. కోసల దేశమునకు రాజును నియమించవలసి ఉన్నది. ఇవి నిర్వహించకనే ఎంత ప్రేమయున్నను పేదగుండెవాని వలె మరణించుట రామునకుచితము కాదు. తన శరీరముతో నిర్వహించవలసిన కార్యములున్నవి. కావుననే అంతవరకు శరీరమును నిల్పుకొని తదనంతరము దేహత్యాగము చేతుననినాడు. రామునకు భార్యపై, తమ్ములపై, మిత్రులపై, ప్రజలపై అనురాగమున్నది. కాని అది కొన్ని హద్దులకు లోబడి ఉన్నది. ఆ హద్దు తన ధర్మము. ఆ ధర్మ నిర్వహణకు వీరినేగాక తన శరీరమునైనను తృణప్రాయముగా త్యజించును. ఇట్లు చూచినచో రామునకు వారివారి యెడలనున్న ప్రేమలో దోషము కానరాదు.

 

అయితే, తన కర్తవ్య కర్మలకంత ప్రాధాన్యమిచ్చిన రాముడు, వానిని నిర్వహింపకనే ప్రాణముపోవు పరిస్థితి వచ్ఛినచో ఏమి చేయును? మాయాయుద్ధ ప్రవీణుడైన ఇంద్రజిత్తు అదృశ్యుడై రామలక్ష్మణులను నాగపాశ బద్ధులను చేసినాడు. కొంతసేపటికి స్పృహ వచ్చిన రాముడు తుల్యావస్థలో నున్న లక్ష్మణుని దీనవదనులై తన చుట్టు పరివేష్టించియున్న విభీషణ సుగ్రీవ హనుమంతాదులను చూచినాడు. ఇక్కడ రాముడు తానున్న దీనదశకు దుఃఖించలేదు. ప్రాణసంశయావస్థలో ఉన్న లక్ష్మణునికై శోకించినాడు. తనకు రానున్న మరణమునకుగాక తాను అసత్యవాది కానున్నందులకు వ్యథ చెందినాడు-” నేను విభీషణుని రాజును చేతునని చేయలేకపోతిని. ఆ అసత్యవచనము నన్ను కాల్చివేయును”(యుద్ధ.౪౯-౨౨). అంతేగాక, సుగ్రీవాదులు తనకు చేయవలసినదేమియు లేదని, వారు తనకు చేయవలసినదంతా చేసితిరని, మిత్రఋణ విముక్తులైతిరని చెప్పి వారిని తనను విడిచిపోవుటకు అనుమతించినాడు(యుద్ధ.౪౯-౨౯). అట్టి నిస్సహాయస్థితిలో సత్యధర్మముల హానికై వగచుట, తనవారు తనను విడిచిపోవుటకు అనుమతినిచ్చుట రాముని ఉదాత్తతను చాటి చెప్పుచున్నవి. దీనినిబట్టి రామునకు భార్యామిత్రాదుల కంటె మాత్రమేగాక, తన ప్రాణముకంటె కూడ సత్యధర్మములు ప్రియములని తెలియుచున్నది.

 

ఒకవేళ తనవలన ఉపకారమును పొంది తనకు ప్రత్యుపకారము చేయవలసిన అవసరమున్నపుడు, ఆ మిత్రుడు ఉదాసీనముగా ఉన్నాడని రాముడు సంశయించినపుడు ఆయనకు వానిపై కోపము రాకుండునా? ఒకవేళ వచ్చినను దాని స్వరూపమెట్లుండు? వర్షాకాలము పోయి శరత్కాలము వచ్చినను సీతాన్వేషణకై సుగ్రీవుడెట్టి ప్రయత్నములు చేసిన జాడ లేదు. దానితో కోపగించిన రాముడు లక్ష్మణుని సుగ్రీవుని దగ్గరకు పంపుతూ- “మాటకు కట్టుబడకపోయిన సుగ్రీవునకు కూడ వాలిగతి పట్టున”ని హెచ్చరింపుమని లక్ష్మణునితో చెప్పినాడు. తనపని చేయకపోయినంత మాత్రముననే హఠాత్తుగా రామునిలోని మిత్రప్రీతి అదృశ్యమాయెనా? రాముని స్నేహము కేవలము సవ్యాజమేనా?

 

వాలివధ జరిగిన వెంటనే సీతాన్వేషణ జరుపుటకు వర్షాకాలము వచ్చుట వలన వీలుకాక పోయినది. శరత్ప్రవేశముతో సీతాన్వేషణము జరుపుటను నిశ్చయించుకొనిరి. వర్షఋతువు నంతయు రామలక్ష్మణులు గుహలోనుండి గడిపిరి. కామోద్దీపనములగు వార్షుక దృశ్యములను చూచుటవలనను, నిర్వ్యాపారియై యుండుటవలనను, రాముని సీతాస్మృతి మిక్కుటముగా ఆవేశించినది. ఆ నాలుగు మాసములు రామునకు నూరు సంవత్సరములుగా నున్నవట! ఎట్లో వర్షఋతువు గడిచినది. శరత్కాలము వచ్చినను సుగ్రీవుడేమీ ప్రయత్నములు చేసినట్టు కనపడలేదు. సీతాస్మరణముతో ధైర్యమును కోల్పోయిన రాముడు దైన్యమునకు లొంగిపోయి సుగ్రీవుడు తననిట్లు తలంచునని అనుకొనినాడు- ” దిక్కులేనివాడు, రాజ్యహీనుడు, రావణునిచే ధర్షింపబడినవాడు, దీనుడు, ఇంటికి ఎంతో దూరంలో ఉన్నవాడు, కాముకుడైనవాడు, నన్ను శరణు పొందినవాడు”(కిష్కి.౩౦-౬౭). ఇట్లు తనను తాను కించపఱచుకొనినాడు. ఇట్టి బలహీనతలు రామునియందు మనకటనట కన్పించును. ఇవియే రాముడు మానవుడని మనకు పట్టి చూపును. బలహీనతలుండుట, వానిని అధిగమించుటకు మానవుడు ప్రయత్నము చేయుట అనునది మానవుని జీవన ప్రస్థానమునందు తఱచుగా కన్పించుచుండును. వానిపై పట్టును సాధించినవారు ధీరులై నిలుతురు. వానికి లొంగిపోయినవారు దుఃఖితులై నశింతురు. రాముడును అట్లే, క్రమ్ముకొని వచ్చిన దైన్యమను బలహీనతకు లోనైనాడు. బలహీనతకు లోనైతినని తెలుసుకొని వెంటనే క్రోధమునకు వశుడైనాడు. ఇట్టి స్థితిలో నుండుట వలననే లక్ష్మణునితో అట్లు పలికినాడు. అంతేగాని, సుగ్రీవునిపై ప్రీతి అదృశ్యమగుటకాని, అతనిని నిజముగ చంప నిశ్చయించుటగాని కాదు. రాముని మాటతో లక్ష్మణుడు నిజముగనే సుగ్రీవుని దండించుటకు సిద్ధమైనాడు. లక్ష్మణుని ఆ సంరంభమును చూచిన రామునకు తనకు సుగ్రీవునిపై కలిగిన కోపము, తన దైన్యము వెంటనే అదృశ్యమైనవి. వాని స్థానమున, లక్ష్మణుడు నిజముగనే సుగ్రీవుని పరుషములాడి దండించునేమో అను భయము, సుగ్రీవునిపై తనకున్న పూర్వానురాగము వచ్చి చేరినవి. దానితో రాముడు ” స్వవవేక్షితం సానునయం వాక్యమ్” పలికినాడు. అనగా తానన్నమాటను అన్నట్లు చేయటానికి సిద్ధపడిన లక్ష్మణుని ఆంతర్యమును, తన మాటలోని భావమును బాగుగా పరిశీలించి, లక్ష్మణుని కోపాన్ని పోగొట్టుటకు అనునయ పూర్వకముగా పలికినాడని అర్థము. దీనిని బట్టి రామునకు సుగ్రీవునిపై వచ్చిన కోపము తాత్కాలికమేగాని, ద్వేషముతో కూడినది కాదని, ఆయనకు సుగ్రీవునిపై గల మిత్రప్రీతి కెట్టి చ్యుతి లేదని విశదమగుచున్నది. కించిత్కాలము స్వాస్థ్యము చెడి, మఱలా యథాస్థితికి వచ్చిన రాముడు లక్ష్మణునితో ఇట్లనుచున్నాడు -“లక్ష్మణా! నీయట్టివాడిట్లు పాపమునాచరింపడు. నిజమైన పాపిని చంపినవాడు సత్పురుషుడు. సాధుపురుషుడవైన నీవిట్లు నిశ్చయించుట తగదు. ఇంతకు పూర్వము అతనిపై నీకున్న స్నేహమును, ప్రీతిని కొనసాగింపుము. సీతాన్వేషణకు కాలాతీతమైన విషయమును మృదువుగా పల్కుము. పరుషములని విడిచివేయుము”(కిష్కిం. ౩౧-౬-౮). ఇట్టి ఈ ఆలోచన వలననే రాముడు తనను తాను మిత్రవధ అను పాపమునుండి రక్షించుకొనినాడు. పూర్వానురాగమును స్మరించి ప్రస్తుత కించిద్దోషమును మన్నించుమని లక్ష్మణునకు బోధించినాడు.

 

తనకై ప్రాణములు రణహోమములో వ్రేల్చిన వానరులు తిరిగి జీవించవలెనను మహావరమును వరదుడైన ఇంద్రుని రాముడు కోరినాడు. సర్వవానరులు తనను ప్రభువుగా, నాయకునిగా సమ్మానించుచు తన ఆజ్ఞలను పాలించుచున్నను, రాముడు మాత్రము వారినందరిని సుహృజ్జనముగానే సంభావించినాడు. దుర్భేద్యమైన లంక వారి వలననే వశమైనదని పేర్కొనుచు మణిరత్నములతో వారినందరిని సమ్మానింపుమని విభీషణుని కోరినాడు. తనవలెనే వానరులును తమ తమ గృహములకు పోవ త్వరపడుచుందురని తలచి వారికిట్లు వీడ్కోలు పలికినాడు.-” వానర శ్రేష్ఠులారా! మీరు మిత్రుడనగు నా కార్యము చేసితిరి. మీకు సెలవొసంగుచున్నాను. మీరు యథేచ్ఛముగా మీమీ స్థానములకు పొండు.” అట్లే సుగ్రీవుని మైత్రిని ప్రత్యేకముగా ప్రశంసించినాడు. అయితే రాముడు తలంచినట్లు వారు తమ స్వగృహములకు పోవుటకు తొందరపడలేదు. రామాభిషేకమును చూడవలెనను తమ ఇచ్ఛను సుగ్రీవ విభీషణాదులందరును వ్యక్తము చేసిరి. వారికి తనపై నున్న స్నేహానురాగమునకు మురిసిపోయిన రాముడు- ” మీతో కలిసి నేను పట్టణమునకు పోవుట ప్రియములకంటె ప్రియమైనది. మిత్రులైన మీతో కలిసిపోయి నేను పట్టణమున మహత్ప్రీతిని పొందుదును(యుద్ధ.౧౨౩-౨౨).” వారి స్నేహానురాగమును అనుభవించిన రాముడు వారిని ఆదరించుటలో ఆశ్చర్యము లేదు. కాని రామునిపై వారు చూపిన స్నేహభావమును విని మురిసి ముగ్ధుడైన భరతుడు వారినిట్లు సమాదరించుచున్నాడు-” సుగ్రీవా! నీవు మా నల్గురకు ఐదవ సోదరుడవు. ఉపకారి మిత్రుడు, అపకారి శత్రువు”.

శ్లోII   త్వమస్మాకం చతుర్థాం తు భ్రాతా సుగ్రీవ! పంచమః I

సౌహృదాజ్జాయతే మిత్రమపకారో౭రి లక్షణమ్ II

2 thoughts on “రాముని మిత్రధర్మము

  1. సుబ్బారావుగారూ!

    చాలా చక్కని వ్యాసమును అందించిన మీకు ధన్యవాదములు. శ్రీరాముని మిత్రధర్మమును గూర్చి ఎంతో బాగా విశ్లేషించి చెప్పారు. అభినందనలు.

  2. చక్కగా రాశావు కౌటిల్యా ఐతే నాకో చిన్న సందేహం. తీర్చగలవు. వాలిని నేరుగా యుద్దములో చంపలేను అని కదా రాముడు వేరొక పద్దతిన అతనిని సంహరించినది. అది వాలికి కూడా తెలిసుండాలి. మరి ఏ కారణంతో అతను రామునితో ” నీవు కోరినట్లైతే/ అదేశముతో” అని పలికాడు ? తనకు ఆదేశమివ్వగల, రాముడు కోరితే అది తీర్చే ఉత్సుకత తీసుకువచ్చేలా రామునిలో విశిష్టత ఏమిటి ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *