May 2, 2024

తెలుగు సినిమాలో హాస్యం

రచన : వెంకట్ హేమాద్రిబొట్ల

 

ఎంతో సునిశితమైనది, కేవలం మానవులకే సాధ్యపడేది, ఆ పని చేయడం వల్ల ఎంతో సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ముఖంలో అన్నీ కండరాలకి వ్యాయామం ఇచ్చేది, మనసుని ఆహ్లాద పరిచేది, ఎటువంటి ఖర్చు లేనిది – ఏమిటది?  అదేనండి నవ్వు. మనకి ఇంతటి మంచి చేసే ఆ నవ్వు తెప్పించేది?  హాస్యం.  మంచి హాస్యం ఉన్న పుస్తకాలు చదువుతుంటేనో, నవ్వుతు నవ్విస్తూ ఉండేవారితో మాట్లాడితేనో ఎంతో హాయిగా అనిపిస్తుంది కదూ.

 

మరి మన దైనందిన జీవితంలో భాగమైపోయి, వినోదానికి ఒక ప్రధాన మాధ్యమంగా ఉన్న తెలుగు చలన చిత్ర సీమలో హాస్యం మాటేమిటి?  చాలానే ఉందండోయ్!  తెలుగు సినిమాలో హాస్యానికి మనవాళ్ళు పెద్ద పీటనే వేసారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు  కూడా, హాస్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఇస్తున్నారు..  మన తెలుగు చలన చిత్ర సీమలో ఈ హాస్యం యొక్క ప్రస్థానాన్ని చూద్దామా? ప్రేక్షకుల ను ఆనందింపజేయడానకి తమవంతు ప్రతిభను ప్రదర్శించి తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని  మన హృదయాల్లో ఇప్పటికి కొలువై ఉన్నారు.. వాళ్లను ఒక్కసారి గుర్తు చేసుకున్న చాలు పెదవులపై చిన్న మందహాసం వచ్చేస్తుంది..

 

(ఎన్నో ఆణి ముత్యాల వంటి చిత్రాలు,  ఎందరో, మరెందరో అద్భుతమైన హాస్య నటీనటులు.  ఆ చిత్రాలు, నటీనటులందరి  జాబితా “మొత్తం” ఇక్కడ చెపుతున్నాము అని కాదు.  ఇన్ని హాస్య సన్నివేశాలు ఉన్న చిత్రాలు,  ఇంత మంది హాస్య నటులు ఉండడం చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభకు తార్కాణం.  ఆ చిత్రాలలో కొన్నింటిని, హాస్య నటులలో కొంత మంది గురించి ఇక్కడ చెప్పుకుందాం).

 

మొట్ట మొదట తెలుగు చలన చిత్ర సీమలో హాస్యంలో సువర్ణ శకం గురించి.  ఎందరో అధ్బుతమైన నటులు, హాస్యాన్ని సునాయాసంగా పండించేవారు, తమదంటూ  ఒక శైలి కల్పించుకుని, తమదైన హావభావాలతో ప్రేక్షకులని చక్కలిగింతలు పెట్టి, హాయిగా నవ్వించిన వారు. రేలంగి గారు అటువంటి సువర్ణ శకంలోని మహానటుడు.  ఆయన హాస్య పాత్రలు చాలా జనాదరణ పొందాయి.  ఎంతగా అంటే, ప్రేక్షకులు ఆయనకంటూ ప్రత్యేకమైన పాటలు కూడా ఉండాలి అని ఎదురు చూసేవారు.

 

అదే కోవలో రమణారెడ్డి గారు ఇంకొక  అద్భుతమైన హాస్యనటుడు.  సన్నగా  రివటలా ఉండే ఆయన తనదైన శైలిలో, తనకే సొంతమైన యాసలో బహు అందమైన హాస్యపుజల్లు కురిపించారు.  పద్మనాభంగా  మనకు సుపరిచితులైన బసవరాజు వెంకట పద్మనాభరావు .  తెలుగు చలనచిత్ర సీమలో మరొక  అసామాన్యమైన హాస్య  నటుడు.  సున్నితమైన హాస్యాన్ని ఎంతో అందంగా పండించి, నవ్వించారు…తరువాత ఎన్నో చిత్రాలు నిర్మించారు కూడా.

రాజబాబు – రెండు దశాబ్దాలు చిత్ర సీమని ఏలిన మేటి హాస్య నటుడు.  ఆయనకంటూ ఒక విలక్షణమైన శైలి, సంబాషణలు, హావ భావాలు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాయి. అల్లు రామలింగయ్యగారంటే హాస్యానికి పెట్టింది పేరు.  తన హాస్యంతో మూడు తరాల సినీ ప్రేక్షకులను చక్కలిగింతలు పెట్టిన నటుడు.  పద్మశ్రీ అవార్డుతోపాటు.  రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత కూడా.  “మనషులంతా ఒక్కటే” చిత్రం బాలు పాడగా అల్లు రమాప్రభల మీద చిత్రీకరించిన “ముత్యాలు వస్తావా” పాట అప్పటికి, ఇప్పటికీ అలరిస్తుంది.

 

గిరిజ – ఆ కాలం లో హాస్యానికి వన్నె తెచ్చిన వారిలో గిరిజ ఒకరు.  “రేలంగి గిరిజ”, “రమణ రెడ్డి గిరిజ” ఇలా వీరి జంట తో ఎన్నో చిత్రాలు, చక్కిలిగింతలు పెట్టె సన్నివేశాలు, అందమైన హాస్యం.   అంతే కాదండోయ్ “పాతాళ భైరవి” చిత్రం లో పాతాళ భైరవిగా వేసింది ఎవరన్నుకున్నారు?  గిరిజ గారే! హాస్యనటిగానే కాకుండా క్యారెక్టర్ నటిగా కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు. అత్తగారు, అందునా గయ్యాళి అత్తగారు అంటే ఎవరు?  ఎవరు గుర్తు వస్తారు?  సూర్య కాంతం గారే కదా.  ఆ పాత్రలలో అంతగా ఇమిడి పోయి మనకి హాస్యపు పిండి వంటకాలు పంచి పెట్టారు.  తెర మీద ఎంత గయ్యాళిగా కనపడేవారో, నిజ జీవితంలో అంత మృదుస్వభావం కలిగిన వ్యక్తి.  ఇంటి నుంచి వండి తీసుకువచ్చి షూటింగ్ లంచ్ లో అందరికి తినిపించేవారుట.  సూర్యకాంతంతో సై అంటూ గొడవపడుతూనే  అందరిని నవ్వించిన చాయాదేవిని ఎలా మర్చిపోతాం.

పాతాళ భైరవి లో అంజిగాడు గా గుర్తుండి పోయిన నటుడు వల్లూరి బాలకృష్ణ గారు.  ఆ తదుపరి విజయా వారివి, ఇంకా వేరే చిత్రాలలో ఇంకెన్నో హాస్య పాత్రలు పోషించారు. వీరే కాకుండా ఆ చిత్రాల సన్నివేశాలలో హృద్యమైన, అంతర్లీనంగా, చక్కలిగిలి పెట్టె హాస్యం, హీరో హీరోయిన్స్, ఇతర పాత్రలు ఆ సన్నివేశాలలో పాల్గొనడం, వాటికి ఈ  నటీనటులు వన్నె తేవడం, అలా కలిసి చేసిన చిత్రాలు, వాటిలో పండిన తీయని హాస్యం ఈనాటికి మనకి గుర్తు ఉండి పోయింది, గుర్తు ఉంటూనే ఉంటుంది కూడా.

 

ఇక ఆ తరువాతి తరం లో కూడా హాస్యం యొక్క ప్రాముఖ్యత కొనసాగింది.

“మడిసన్నాకా కూసింత కలాపోసన ఉండాలి” అని ముళ్ళపూడి వారు ఈయన చేత చెప్పించి, ఆ పదాలకి ఈ రోజుకీ పాపులారిటీ తెచ్చి పెట్టారు. ఎవరు ఆయన అంటే  రావు గోపాలరావు గారు.  తన విలక్షణమైన డయలాగ్ డెలివరీతో  ఎన్నో చిత్రాలు,  ఎన్నెన్నో పాత్రలు వేసారు . “నూటొక్క జిల్లాల అందగాడు” నూతన ప్రసాద్.  తనదైన డైలాగ్ డెలివరీతో ఎంతో జనాదరణ పొందిన నటుడు.  “దేశం చాలా క్లిష్ట పరిస్ధితుల్లో ఉంది” అనే డయలాగ్  ఆయనకే సొంతమైనట్టుగా  ఇప్పటికీ  పాపులర్.

“కురుమద్దాలి లక్ష్మి నరసింహరావు” గారు మీకు తెలుసా?  తెలీదా? మరోసారి ఆలోచించండి…  అబ్బ సుత్తి కొట్టద్దు అంటారా?  అదేనండీ ఆ సుత్తి పదం ఆవిర్భావంలో ఒకరైన వారు సుత్తి వేలు….  సుత్తి వీరభద్రరావు గారితో కలిసి హాస్య బ్రహ్మ సృష్టించిన ఈ పదం మన  జీవితంలో భాగమైపోయింది కదా.  అరవ యాసతో తెలుగు మాట్లాడుతూ మనల్ని ఎన్నో చిత్రాల్లో నవ్వించినవారు కే. వి. చలం గారు.  మలయాళం, బెంగాలి, రష్యన్ ఇలా ఎన్నో బాషలు సులువుగా మాట్లాడేసేవారు.  అంటే మాట్లాడినట్టు నటించేవారన్న మాట.  వినాడానికి అచ్చు ఆ బాష లాగే ఉన్నా, దానికి అర్ధం పర్ధం ఉండదు.  దేనినే ఆంగ్లం లో “గిబ్బెరిష్” అంటారు.  మళ్ళీ ఈ ప్రక్రియ తో నవ్వించింది ఈ మధ్య కాలం లో ఆలీ గారు.  ఎంతో సులువుగా హాస్యం పండించగల నటి “రమా ప్రభ”.  అల్లు గారితో, రాజబాబుతో ఎన్నో చిత్రాలలో జోడిగా నటించి, ఇప్పటి చిత్రాల్లో కూడా  ఎప్పుడు కనిపించినా నవ్వులు పండిస్తున్నారు.

పి. కే. నగేష్, దక్షినాదిలో పలు తమిళ, తెలుగు, మళయాళ చిత్రాలలో ఎన్నో హాస్య పాత్రలలో నటించారు. రచయిత, నటుడు అయిన తనికెళ్ళ భరణి, దర్శకుడు గెట్ల డిసైడ్ చేస్తే అట్ల ఫిక్స్ అయి పోయి నవ్వులు కురిపిస్తారు.  వంశీ చిత్రాలు “లేడీస్ టేలర్” “శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్” కి సంభాషణలు అందించి అందులో నటించారు కూడా. “శివ” లో “నానాజీ” పాత్ర ఆయనకి ఎంతో గుర్తింపు తెచ్చింది.  లంక భద్రాద్రి శ్రీరామ్, ఎల్ బి శ్రీరామ్, హాస్య రచయిత గా ప్రారంబించి హాస్య నటుడిగా  కూడా మనకి సుపరిచుతలైన వారిలో ఒకరు.  ఏప్రిల్ ఒకటి విడుదల, అప్పుల అప్పా రావు, హలో బ్రదర్, హిట్లర్ వంటి ఎన్నో చిత్రాలకి సంభాషణలు అందించారు.  పట్టి పట్టి మాట్లాడడం అనే ఆయన శైలి జనాదరణ పొందింది.

 

నేనండి, మీ కోట శ్రీనివాసరావును అంటూ ఆప్యాయంగా రేడియో లో వినపడే గొంతు విలక్షణ నటుడు కోటది .  ఎదురుగ్గా కోడిని వెళ్లాడ దీసుకొని, కంచంలో అన్నం తింటూ, చికెన్ కర్రీ అదిరింది అనడం ఎలాగో ఈయన ద్వారానే మనకి తెలిసింది.  ఈయన కూడా హాస్య బ్రహ్మ చిత్రాలతో బాగా పాపులర్ అయ్యారు.  ప్రతినాయక పాత్రలో, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాలలో మనకి నటన లోని ఎన్నో పార్శ్వాలను చూపించిన నటుడు కోట శ్రీనివాసరావు.   రాజకీయాలలో ప్రవేశించి ఎం ఎల్ ఏ గా కూడా ఉన్నారు..

 

ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆనందో బ్రహ్మ టెలీ సీరియల్ తో పాపులర్ అయ్యి, ఎన్నో హాస్య పాత్రలు పోషించి, “తోక లేని పిట్ట” చిత్రం ద్వారా దర్శకుడు కూడా అయ్యారు .గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోతారేమో అనే “దేహ దారుడ్యం” తో ఉండేవారు కొండ వలస లక్ష్మణ రావు గారు.  ఎక్కువగా వంశీ చిత్రలలో కనపడుతారు.  అయ్యోలు, హమ్మోలు ఇంతేనా బ్రతుకు హో హో హో … అంటూ మనకి సుపరిచితమైన “అమృతం” టి.వి. సీరియల్ లో “ఒరేయ్ ఆంజనేయులు, తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు” అన్న పాటలోని అంజనేయులే “గుండు హనుమంత రావు” గారు.  ఎన్నో చిత్రాలలో నటించి, బుల్లి తెరపై కూడా నవ్వులు పండిస్తున్నారు.

జయప్రకాశ్ రెడ్డి ఓరబ్బి, ఎందిరా అంటూ రాయలసీమ యాసతో అటు విలనీజం ఇటు కామెడి చేయగల నటులు. తను వేసిన పాత్ర పేరుతో పాపులర్ అయిన ఇంకొక హాస్య నటుడు మల్లికార్జున రావు గారు.  వంశీ పరిచయం చేసిన ఈయన,  “బట్టల సత్యం” గా పాపులర్ అయ్యారు .రాజకీయాలలో అడుగుపెట్టి మంత్రిగా కూడా పని చేసిన బాబూ మోహన్, తనదైన శైలిలో నవ్వించారు.  ముఖ్యంగా కోట శ్రీనివాసరావు తో కలిసి ఈయన చేసిన హాస్య పాత్రలు  ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇంకో హాస్యనటుడు రాళ్ళపల్లిగా సుపరిచుతులైన రాళ్ళపల్లి నరసింహారావు ఎక్కువగా జంధ్యాల, వంశీ చిత్రాలలో నటించి నవ్వించారు.

 

సూరావఝుల సుధాకర్ గారు “శుభలేఖ” చిత్రంలో నటించి అదే తన ఇంటి పేరుగా పాపులర్ అయ్యారు.  ఈ చిత్రంలో ఆయన తులసి జంటగా చేసిన పాత్ర ఎంతో ప్రజాదరణ పొంది, దరిమిలా “మంత్రిగారి వియ్యంకుడు”, “ప్రేమించు పెళ్ళాడు”  వంటి మరి కొన్ని చిత్రాలలో కూడా వీరు జంటగా కనిపించారు.  ఇప్పుడు ఆయన బుల్లి తెరపై బిజీ గా ఉన్నారు. రంగావఝుల రంగారావు, బాపు గారి “సాక్షి” చిత్రంతో సాక్షి రంగారావుగా మారి ఎన్నో బాపు, కళా తపస్వి  కే. విశ్వనాద్ దర్శకత్వంలోని ఎన్నో చిత్రాలలో నటించి నవ్వించారు. కోవై సరళ తమిళం నుంచి ఇంపోర్ట్ అయిన వారిలో ఒకరు.  ఆ యాసతో డయలాగ్ చెపుతూ నవ్వించారు.  బ్రహ్మానందం తో జోడిగా నటించడం, వారివురి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులని ఎంతో నవ్వించాయి. ఏం జరుగుతోంది, నాకు తెలియాలి, తెలిసి తీరాలి అంటారు ఎం. ఎస్. నారాయణ గారు.  తాగుబోతు పాత్రలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈయన క్రమంగా ఆ మూస లోంచి బయట పడి వైవిధ్యమైన పాత్రలతో నవ్విస్తున్నారు, మెప్పిస్తున్నారు.  ఇదే వరుసలో “తాగుబోతు రమేష్” గా “అలా మొదలయ్యింది” లో నటించిన రమేష్ కూడా పాపులర్ అవ్వడం విశేషం.

ఆ పేరులోనే ఆనందం ఉంది.  బ్రహ్మానందం ఉంది.  900 పైచిలుకు చిత్రాలలో నటించి మనల్ని నవ్విస్తున్న ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం గారు.  ఒకే బాషలో ఎక్కువ చిత్రాలలో (754 ) నటించినందుకు 2007 లో గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు వచ్చింది.  2005 లో “అల్లు రామలింగయ్య” అవార్డు రావడం ఇంకొక గొప్ప విశేషం.   “బ్రహ్మి టెన్ లాఖ్ షో” అంటూ బుల్లి తెర మీద ఆ మధ్య తళుక్కు మన్నారు కూడా.  అసలు ఆయన ప్రస్తానమే బుల్లి తెరతో ప్రారంభమయ్యింది.  చిన్న చిన్న స్కిట్స్ వేసేవారు.  అవి చూసి “హాస్య బ్రహ్మ జంధ్యాల” గారు ఆయనకీ అవకాశం ఇచ్చారు.  తరువాతి కథ అంతా మీకు తెలిసిందే కదా.

 

తెలుగు సినిమాల్లో క్రమంగా హస్యం యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది అంటే కేవలం చిత్రం మధ్యలో కొన్ని సీన్స్ లోనే కాకుండా ఆద్యంతం హాస్యభరితమైన చిత్రాలు నిర్మించడం మొదలు పెట్టారు.  వీటికి  హాస్య చిత్రాలు అని పేరు వచ్చింది.   అలా ఒక ఫుల్ లెంగ్త్ వినోద భరిత చిత్రంగా బాపు రమణల “అందాలా రాముడు” చిత్రాన్ని చెప్పుకోవచ్చు.  బాపు రమణల నవ్వుల పువ్వులు పూయించే ఇంకొన్ని చిత్రాలు – మిస్టర్ పెళ్ళాం, పెళ్లి పుస్తకం. రాధాగోపాళం.

తరువాత జంధ్యాల గారు  ఒక నూతన ఒరవడి సృష్టించి ఇటువంటి  హాస్యచిత్రాలకి ఎంతో ప్రాచుర్యం సంపాదించి పెట్టారు.   వారు దర్శకత్వం వహించిన “ఆహ నా పెళ్ళంట” కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఒక ప్రత్యేకమైన కేటగిరి సృష్టించి “ఉత్తమ హాస్య చిత్రం” గా ఎంపిక చేసింది.  జంద్యాలగారు ఎన్నో హాస్య పాత్రలు సృష్టించి, నటుల చేత చేయించి అది వాళ్లు మాత్రమే చేయగలరు అన్నంతగా మెప్పించారు.  ముఖ్యంగా శ్రీ లక్ష్మి చేసిన పాత్రలు – బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఈల వేయడం, రక రకాల వంటలు చేసి అందరికి తినిపించడం, కవితలు రాసి వినిపించడం, “ఇప్పుడేమన్నావు బాబూ” అంటూ దుఖం లేక సంతోష మైన గతంలో ఆ మాట ఎవరో అన్నట్టు తలుచు కొని ఎదుట వారిని అమాంతం పట్టేసు కోవడం, మనకి తలుచు కుంటేనే ఎంతో నవ్వు తెప్పిస్తాయి.

 

వంశీ మార్క్ చిత్రాలు, వాటిలోని హాస్యం చాలా ఏళ్లు అందరిని నవ్వించాయి. ఈ వి వి సత్యనారాయణ  కూడా ఎన్నో హాస్య చిత్రాలు తీశారు.   ఎస్ వి కృష్ణా రెడ్డి చిత్రాలు కూడా ఎంతో ఆదరణ పొందాయి. రెండు రెళ్ళు ఆరు, ఆలీ బాబా అర డజను దొంగలు, హలో బ్రదర్ (స్టార్ హీరో నాగార్జున తో), కిష్కింద కాండ, యమలీల, ఘటోత్కచుడు, నిన్నే పెళ్ళాడుతా, ఆవిడా మా ఆవిడే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, అల్లరి, కిత కితలు,  తొలి ప్రేమ, కుషి, జల్సా, మల్లీశ్వరి (కొత్తది), అందాల రాముడు (కొత్తది), ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు ఇలా ఎన్నో ఇంకెన్నో పూర్తీ వినోద భరిత చిత్రాలు వచ్చాయి.

 

హాస్య జంటలు – రేలంగి గిరిజ, రాజ బాబు రమా ప్రభ,  వీరభద్ర రావు సుత్తి వేలు, శ్రీ లక్ష్మి సుత్తి వేలు, కోట శ్రీనివాస రావు బాబూ మోహన్ – ఇలా ఎంతో మంది జంట కమేడియన్స్ గా పేరొందారు. తరువాత హీరోలుగా  కామెడి హీరోస్ వచ్చారు.  అంటే వారినే హీరో గా పెట్టి, వారి చుట్టూ కథ అల్లడం, వారు ఇతర పాత్రలు కూడా హాస్య ప్రధానంగా ఉండడం అన్నమాట.  ఈ సినిమాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.  నరేష్, రాజేంద్ర ప్రసాద్, అలీ, వేణు మాధవ్ నుంచి మొన్న మొన్నటి సునీల్ కూడా హీరోలు గా చేస్తున్న చిత్రాలు ప్రేక్షకులు ఆదరించారు, ఆదరిస్తున్నారు కూడా.  ఇక “అల్లరి” అనే చిత్రం తో సినిమా రంగంలో ప్రవేశించిన నరేష్ (ఈ వి వి గారు కుమారుడు, ), అల్లరి నరేష్ గా, హాస్య చిత్రాల హీరోగా స్థిరపడిపోయాడు అంటే ఈ రోజుల్లో హాస్య చిత్రాలు జనం ఎంతగా ఇష్టపడుతున్నారో తెలుస్తుంది.

 

మల్లంపల్లి చంద్రశేఖర రావు గారు కొంచెం పొట్టిగా ఉంటారు.  కానీ హాస్యం పండించడంలో చాలా గట్టి వారు.  వారి చిత్రాలతో పరిచయమైన “జయప్రద” “శ్రీదేవి” వంటి ఎంతో మంది నాయికలు తారా పధంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు.  ఏ పాత్రనైనా సునాయాసంగా పోషిస్తారు ఈయన.  ఈయన మరెవరో కాదు “చంద్రమోహన్” గారు.  ఈ రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్న వీరు, ఎన్నో మంచి మంచి హాస్య చిత్రాల హీరో గా మనకి గుర్తుంటారు.

 

రాజేంద్ర ప్రసాద్ ఎన్నో హాస్య చిత్రాల్లో నటించారు – వాటిలో కొన్ని ఆహ నా పెళ్ళంట, ఏప్రిల్ ఒన్ విడుదల, లేడీస్ టైలర్, ఆ ఒక్కటి అడక్కు, బామ్మ మాట బంగారు బాట, కొబ్బరి బొండాం, అప్పుల అప్పా రావు,  మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, జయమ్ము నిశ్చయమ్మురా, చిత్రం భళారే విచిత్రం. ఎంద కాట్రవిల్లి అంటూ ఆలీ హాస్యం ఈ రోజుకీ మనకి చక్కలిగింతలు పెడుతోంది.  అలా ఎన్నో చిత్రాల్లో నవ్వించిన ఆలీ ఎస్ వి కృష్ణా రెడ్డి దర్సకత్వంలో “యమ లీల” చిత్రంతో హీరో అయ్యి నవ్వించి మెప్పించారు.  మళ్ళీ కామెడి పాత్రలలో పాపులారిటీ కొనసాగిస్తున్నారు.   పూరీ జగన్నాధ్ తన ప్రతీ చిత్రంలో ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కామెడీ ట్రాక్ రాస్తారు.  ఈ మధ్య బుల్లి తెరలో ఒక హాస్య ప్రధానమైన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు.  కామెడి పాత్రలు పోషిస్తూ పాపులర్ అయ్యి హీరో పాత్రలు కూడా వేసిన నటుడు వేణు మాధవ్.  ఆయన మిమిక్రీతో పాత కొత్త నటులను అనుకరించడం ఎంతో ప్రజాదరణ పొందింది.  “హంగామా”, “ప్రేమాభిషేకం”, “భూకైలాస్” చిత్రాలలో ఆలీ తో కలిసి హీరో గా నటించారు. హాస్య పాత్రలతో నటించడం ప్రారంబించి పాపులర్ స్టార్ అయిపోయిన వారిలో సునీల్ లేటెస్ట్ గా చేరారు.  “అందాలా రాముడు” తో హీరోగా హిట్ కొట్టి రాజ మౌళి “మర్యాద రామన్న” తో సూపర్ హిట్ కొట్టిన ఈయన ఇప్పుడు కొత్త చిత్రంలో సిక్స్ ప్యాక్ లో కనిపించ బోతున్నారుట.

ఇక, ఈ మధ్య కాలంలో ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే “అష్టా చెమ్మ” చిత్రం ఎంత ఆదరణ పొందిందో మనకి తెలుసు.  జాతీయ పురస్కారం అందుకున్న “గ్రహణం” వంటి సీరియస్ చిత్రాన్ని అందించిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ నాని, స్వాతి లతో ఎక్కువ ఖర్చు ఆర్భాటం లేకుండా తీసిన ఈ చిత్రం విజయం సాధించింది.  ఇదే జాబితాలో నందిని రెడ్డి అనే ఒక మంచి దర్శకురాలు వచ్చి చేరింది.  ఆవిడ చిత్రం “అలా మొదలయ్యింది” విజయం, మంచి హాస్యానికి ఎప్పటికి ఆదరణ తగ్గదు అని నిరూపించింది.  ఆ చిత్రం విజయంతో హీరో నాని, ఆ తరువాత వచ్చిన “పిల్ల జమిందార్” చిత్రంతో కూడా హిట్ అవ్వడంతో ఇంకొక మంచి కామెడి హీరోగా స్థానం సంపాదించుకున్నాడు.

 

 

చిత్రాల సంభాషణలు కూడా.  వినగానే నవ్వు వచ్చేలా, వాటిలో “పంచ్” ఉండేలా ఉన్న సంభాషణలు ఇష్ట పడుతున్నారు.  మొదట్లో ముళ్ళపూడి వెంకటరమణ, జంధ్యాల,  ఆ తరువాత దివాకర్ బాబు, జనార్ధన్ మహర్షి, కోన వెంకట్ ఇలా ఎంతో మంది ఈ సంభాషణలు ప్రజాదరణ పొందేలా రాసారు. మాటల రచయిత గా ప్రారంబించి దర్శకుడిగా ఎదిగిన “త్రివిక్రమ్ శ్రీనివాస్” చిత్రాలు అంటే ప్రేక్షకుల లో ఎంతో ఉత్సుకత ఉండడం ఈ కారణం వల్లే.  అలాగే ఈ కోవకి చెందిన ఇతర దర్శకులు, రచయితల చిత్రాలు కూడా.

 

అయితే ఇవన్ని తెలుగు చిత్ర పరిశ్రమకి కొత్త కాదు.  ఎనభై ఏళ్ళ ఈ చలన చిత్ర రంగంలో ఎంతో మంది అధ్బుతమైన హాస్య నటులు, వారు నటించిన పాత్రలు, వారి సంభాషణలు, ఆ చిత్రాలు విడుదల అయినప్పుడు చాలా ప్రజాదరణ పొందడమే కాకుండా, ఈ రోజుకీ మనల్ని ఆహ్లాద పరుస్తున్నాయివాటిలో మచ్చుకి  కొన్ని:

 

వెయ్యండి రెండు వీర తాళ్ళు

కంబళి గింబళి

మేరీ ప్లీజ్ … ధర్మం ప్లీజ్

ఆ మాట నువ్వు నేనడక్కముందు సెప్పాల … అసలు అడగనే అడగను అని నీ ఎదవ అయిడియా కదా

అమ్యామ్యా

ఐ వాంట్ తో టాక్ తో నెల్లూరు పెద్దా రెడ్డి రైట్ నౌ (ఈ నెల్లూరు పెద్దా రెడ్డి స్థానంలో మనం మాట్లాడవలసిన వారిని

పెట్టి అనుకుంటాం కదా ఈ డయలాగ్ !)

తను నన్ను ప్రేమించింది … తరువాత నేను ప్రేమించాల్సి వచ్చింది

ఆఫ్టర్ ఒన్ ఇయర్ ఇ విల్ బి కింగు

“అప్పు” డే తెల్ల వారిందా

గట్ల డిసైడ్ చేసినవా అన్నా

అట్టులు ఉత్తినే పెట్టరు – (equivalent of American adage – There is no such thing called free lunch)

తీ తా – తీసేసిన తహసిల్దారు

ఓ ఫైవ్ ఉంటే అప్పిస్తావా

ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఎం జరగబోతోంది – తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి.

ఎందుకు? ఏమిటి? ఎలా?

 

ఇలా ఎన్నో, ఎప్పటివో, పాతవి కొత్తవి సంభాషణలు మన నోట్లో నానుతూ ఉంటాయి … మనలో ఎంతో మంది రోజూ వాడుతూ ఉంటారు కూడా.

 

ఇక పాటల విషయానికొస్తే  మన తెలుగు సినిమాల్లో ఎన్నో హాస్య భరితమైన పాటలు.  ఎంతో నవ్వు తెప్పించేవి ఉన్నాయి. అవి ఇప్పటికి  అలరిస్తున్నాయి..

 

వివాహభోజనంబు, వింతైన వంటకంబు, వియ్యలా వారి విందు, ఒహ్హో నాకే ముందు

అహ నా పెళ్లి అంటా, ఓహ నా పెళ్లి అంటా

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

రావోయి చందమామ మా వింత గాధ వినుమా

తెలుసుకొనవె యువతి, అలా నడుచుకోనవే యువతీ

లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం

సుందరాంగులను చూసిన వేళల

వినవె బాలా నా ప్రేమ గోలా

అంతేనాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు

రారోయి మా ఇంటికి

ఆకాశం  నుంచి నా కోసం వచ్చావా, పొంగే అందాలా మిఠాయి పొట్లం తెచ్చావా

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా

టౌను పక్కకి వెళ్లొద్దురా

సరదా సరదా సిగిరెట్టు ఇది దొరలు తాగు బల్ సిగిరెట్టు

ఇల్లరికం లో ఉన్న మజా అది అనుభవించుతే తెలియునులే

కాశికి పోయాను రామాహరి … గంగ తీర్థాము తెచ్చాను రామా హరి

వినరా సూరమ్మ కూతురు మొగుడా వివరము చెబుతాను

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా … వాళ్ల ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా

రాముడేమన్నాడొయ్ … సీతా రాముడేమన్నాడొయ్

బోటనీ పాఠ ముంది మాటనీ ఆట ఉంది … దేనికో ఓటు చెప్పరా

తిట్ల దండకం

భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు … భర్తగ మారకు బాచిలరు

ముత్యాలు వస్తావా … అడిగింది ఇస్తావా … ఊర్వసి లా ఇటు రావే వయ్యారి

కొబ్బరి నీళ్ళా జలకాలాడి

వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు

పాపారాయుడు (మొన్న మొన్న రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ పంజా లో బ్రహ్మానందం గారి మీద చిత్రీకరించిన పాట)

 

 

ఇప్పటికీ చిత్రంలో ఫలానా హాస్య నటుడు/హాస్య నటుల జంట ఉన్నారా అని చూసి మరీ సినిమా చూడడానికి వస్తున్నారంటే, హాస్యం ఎంత జనాదరణ పొందిందో తెలుస్తోంది.  ఈ పంధాని గమనించి, అర్ధం చేసుకున్న పెద్ద పెద్ద హీరోలు సైతం ఈనాడు ఇలాంటి వినోదభరితమైన చిత్రాలని చేయాడానికి మోజు చూపుతున్నారు.   రవితేజ నటించే చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి.  అలాంటి చిత్రాలు రికార్డులు  బద్దలు కొడుతూ సూపర్ హిట్ అవుతున్నాయి కూడా.  ఇటీవల విడుదలైన ప్రిన్స్ మహేష్ బాబు నటించిన “దూకుడు” చిత్రం ఇందుకు మంచి ఉదాహరణ.  జుగుప్స కలిగించని, వెకిలితనం లేన హాస్యానికెప్పుడూ ప్రేక్షకులు పెద్దపీట వేస్తారు..

హాస్యం అంటే సునిశితంగా ఎవ్వరినీ నొప్పించక ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలి…  But there is a very thin line that separates wholesome comedy from the bad one.  హాస్యం అపహాస్యం మధ్య ఉన్న రేఖ ఎంతో చిన్నది.  రాను రాను హాస్యం యొక్క జనాదరణ పెరిగి. కొత్త పుంతలు కూడా తొక్కడం మొదలెట్టింది.       ఆ క్రమంలో మధ్యలో అలా అపహాస్యపు వైపుకి కూడా మళ్ళింది మధ్యలో.   చివరికి ప్రేక్షకుల వ్యతిరేకతతో మళ్ళీ గాడిలో పడింది.  హాస్యం పండించడం ఎంత కష్టమో అది అపహాస్యం అవ్వడం అంత సులువు.  ఇది అందరూ గుర్తు పెట్టు కోవలసిన విషయం.  ఆ విచక్షణ పాటించారు కాబట్టే, ఆ రోజుల్లో చలన చిత్రాలలోని హాస్యం ఇప్పటికి మనకి గుర్తుండి, మనకి ఆహ్లదాన్ని పంచి పెడుతోంది.  ఇలాంటి హాస్యానికి ఉన్న వన్నె ఎప్పటికి తగ్గదు.  ఇది గుర్తు పెట్టుకొని, ఆ విధంగా చిత్రాలు వస్తే, అటువంటి హాస్యం ఈ రోజుకీ ఎంతో వినోదాన్ని పంచుతుంది, పంచుతూనే ఉంటుంది.

1 thought on “తెలుగు సినిమాలో హాస్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *