March 29, 2023

దార్శనికుడు – కవి

రచన : రవి ENV

God is a God dammned word అంటాడు ఓషో. ’దేవుడు’ అన్న శబ్దం అంత తీవ్రంగా కలుషితమైపోయిందని ఆయన ఉవాచ. అవును మరి, ఎవరికి వారు ఆవిష్కరించుకోవలసిన సత్యాన్ని గురించి లక్ష మంది లక్ష రకాలుగా తమకు తోచినట్టు వివరిస్తూ పోతూ ఉంటే కలుషితం కాక మరేమవుతుంది? అలాంటిదే మరొక మాట ’ప్రేమ’. తెలుగు భాషలోనే కాదు ప్రపంచ భాషలన్నిటిలో ఇంత చెత్తపదం మరొకటి ఉండదు గాక ఉండదు. మన దిగజారుడు టీవీ సీరియళ్ళూ, సినిమాల దగ్గర మొదలుకుని, తాత్త్వికులు, మతప్రవక్తలు, బాబాలు అందరికీ ఈ శబ్దం అవసరమైపోయింది. దాంట్లో ఏదో కొత్తగా వెతకాలి. ఆ కనుక్కున్న దాన్ని ఆర్కిమెడిస్ లాగా అందరికీ చాటి చెప్పాలి. అలా చెప్పి అందరినీ ఆకర్షించాలి. పబ్బం గడవాలి. ఇదే తాపత్రయం!

profound విషయాలకు స్పష్టమైన నిర్వచనాలు ఉండవు. వాటిని చెప్పవలసి వస్తే ప్రతీకాత్మకంగా (ఎలిజీ) చెప్పడం గొప్ప పద్ధతి. చైనాలో బుద్ధుడు పుట్టిన కాలంలోనే లావు త్సు అనే దార్శనికుడు, తాత్త్వికుడు పుట్టాడు. అతని మతం తావోయిజం ఈ పద్ధతికి పెట్టింది పేరు. ఉదాహరణకు ప్రపంచం మిథ్య అనే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా చెబుతాడు జ్వాంగ్ జు అనే తావోయిష్టు గురువొకాయన. ఆ ఉదంతం ఇది.

అతనికి ఒకరోజు ఒక అందమైన, గాఢమైన కల వస్తుంది. ఆ కల గురించి అతని మిత్రుడితో సంభాషిస్తాడు.

” ఈ రోజు ఒక గాఢమైన కలగన్నాను. ఎంత గాఢమైన కల అంటే ఆ కల, కల అని ఇప్పటికీ నమ్మకం కలుగనంత గాఢమైనది. కలలో నాకు ఎందుకో అలా ఎగరాలనిపించింది. చూస్తూ ఉండగానే నాకు రెండు రెక్కలు వచ్చాయి. నా రెక్కలు అలా గాలిలో కొట్టుకోసాగినాయి. నేను ఎగురసాగాను. దేహం అందంగా మారిపోయింది. నాకు ఫలానా మనిషినన్న ఎఱుక లేకుండా పోయింది. నేనొక సీతాకోకచిలుకగా మారాను. పూలపైన వాలుతూ మకరందాన్ని గ్రోలుతూ, జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించసాగాను. ”

“అందమైన అద్భుతమైన అనుభవం కదూ” – అంటాడు మిత్రుడు.

“ప్రతి కథకూ ఏదో ఒక ముగింపు ఉన్నట్లు ఆ కల కూడా ముగిసింది. ఇప్పుడు నన్నొక సందేహం పట్టి పీడిస్తూంది. నేను జ్వాంగ్ జు అన్న మనిషినై, కలలో సీతాకోకచిలుకగా మారానా లేక సీతాకోక చిలుక తాలూకు కలనా? నా కలలో నాకు మనిషినన్న స్పృహ లేదు. సీతాకోకచిలుకనే నేనైనాను. ఇప్పుడు ఈ ప్రపంచం అనే వాస్తవం సీతాకోకచిలుక తాలూకు కలగానే అనిపిస్తూ ఉంది. ఏది నిజం?”

ఈ చిన్న కథ ద్వారా జీవితం అంటే మిథ్య అన్న భావాన్ని ఎంతో అందంగా చెప్పగలిగినాడాయన.

బౌద్ధ సాహిత్యంలో బుద్ధుడు చెప్పిన ప్రతి వాదానికి ఒక ఎలిజీ ద్వారా మిళింద పన్హ అనే పుస్తకం సమాధానం చెబుతుంది. ఇది గహనమైన విషయాలు సామాన్యునికి కూడా చేరగల సులువైన పద్ధతి.

సరే, మొదటికి వస్తే, దేవుడు, ప్రేమ వంటి కలుషితమైన పదజాలం లోనికి ’కవి’ అనే శబ్దం కూడా మెలమెల్లగా చేరుకుంటూంది. పద్యమో, కవితనో వ్రాసిన ప్రతి ఒక్కరూ ఈ పోస్టుకు అభ్యర్థులవడం సాధారణమైపోయింది. ఇంకాస్త పెద్ద పరిధిలో అయితే, ’ఫలానా కవి’. ఆ కవి ముందో వెనుకో ఒక విశేషణం తగిలించడమూ, ఆ పేరునూ, ఆర్భాటాన్ని చూసి నలుగురు ఆశ్చర్యపోవడమూ, సదరు కవిని మహా ’దార్శనికుడి’గా గుర్తించడమూ, ఇక ఆయన మహా తాత్వికుడయిపోయాడు కాబట్టి ఆయనకు గొడుగులు పట్టటం, బిరుదాలు, వ్యక్తిగత సన్మానాలు, వ్యక్తిగత గండపెండేరాలు ఇలా సర్వమూ ఒకదానివెనుక మరొకటి. ఒక ’తప్పుడు’ బాట ’రాచ’ బాట అవటమంటే అదే. ఆ బాట చూసి అలాంటి బాటను తమకు సరిపడినత్రోవలో నిర్మించుకోవాలనే వారు కొందరైతే, ఆ తప్పుడు బాటను రాచబాటగా భావించి అనుసరించే వారు మరికొందరు.

కవయః క్రాన్తదర్శినః, నానృషిః కురుతే కావ్యం అని అన్నారని చెప్పి ప్రతికవిని దార్శనికుడిగా గుర్తించడం పొఱబాటు, నిజాయితీలేమి కూడా. చాలా చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే దార్శనికుడు కవిగా రూపొందడం జరుగుతుంది. దార్శనికుడికి ఉన్నది శబ్దార్థ, వస్తు జ్ఞానం కన్నా మౌలికమైన, అద్వైతానుభవం. నిజమైన దార్శనికులెవ్వరు తమ వద్దనున్నది (వస్తుగతమైన) ’జ్ఞానం’ అనలేదు. (బహుశా శంకరాచార్యులవారు తప్ప. శంకరాచార్యులవారు మేధావి, ’జ్ఞాని’ కూడా. అందుచేత ఆయన బోధ గహనం.) గౌతముడు ’తథాథ’ అంటాడు. As is.. అంటే సుఖము, దుఃఖము, ద్వేషము, స్నేహము, వేదనా, సంతోషము వంటి ద్వైతాలు అన్నీ హరించుకుపోయిన ఒక శూన్యత్వ, పూర్ణత్వ స్థితి. అదొక శుద్ధ నిర్వాణ దశ. ఈ దశ ఏదో అప్పుడప్పుడూ చుట్టపుచూపుగా వచ్చిపోయేది కాదని, దార్శనికుడి నిరంతర మానసిక స్థితే అదని తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఉవాచ. ఇట్టి స్థితిలో ఉన్న వ్యక్తి చెప్పేది లౌకికమైన, బుద్ధితో గ్రహించగలిగిన సమాచారజ్ఞానం కాదు. ఆ చెప్పే అంశం ధ్యానానికి ప్రేరణ మాత్రమే. My words are not the arguments, but they are the indicators of truth. My finger points to moon. Look at the moon, but do not bother about my finger…. ఇంతకంటే స్పష్టంగా దార్శనికుడి తత్త్వాన్ని ఎవరూ చెప్పలేరేమో!

పైన చెప్పిన అద్వైత భావనకు ఖచ్చితంగా ఒక మెట్టు దిగువగా ఉన్నవాడు సౌందర్యరసాన్వేషి అయిన భావుక కవి, . కవిది మౌలికంగా అన్వేషణ, తపన. ఆ తపన తీవ్రతరమై, హృదయగతంగా, నిజాయితీగా ఉండి, దానికి భాష తోడయితే ఆ కవి భావాలలో మాధుర్యం పాఠకులకు అంత కోమలంగా తాకుతుంది. అలాంటి కవి పలుకులు మరొక సహృదయుణ్ణి, అదేవిధమైన తపన జ్వలిస్తున్నవాణ్ణి కొంతవరకు ఉత్తేజపర్చగలవేమో కానీ, తాత్వికంగా ఉపశమింపజేయలేవు.

కవి అంటే భావాలను స్పష్టంగా పాఠకులకు చేరవేసిన వాడు! వాటిని స్వీకరించటానికి పాఠకుడికీ ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ను సూచించడానికి ’సహృదయుడు’ అన్న శబ్దం మొట్టమొదటిసారి ఆనందవర్ధనుడు ఉపయోగించినాడు.

కవి లేదా సాహిత్యకారుడికి, దార్శనికుడికీ మధ్య తేడా స్ఫుటంగా తెలిసేదెలా?

దార్శనికుడి రచన ఒక అద్దం. అది వచనమైనా, కవితైనా ప్రత్యక్షంగా చర్చించే వస్తువుకన్నా, పరోక్షంగా సూచించబడే ప్రతీక ముఖ్యమైనది. దాన్ని గురించి తెలియాలంటే పాఠకుడిలో కొంతైనా అలౌకిక, ఆత్మగత భావనాస్రవంతి తప్పనిసరి. హిమాలయాలను చూచి వచ్చిన ఒక చిత్రకారుడు ఒక బొమ్మను గీస్తాడు.  ప్రేక్షకుడికి అందులో బొమ్మ మాత్రమే కాకండా హిమాలయాల తాలూకు నిశ్శబ్ద, నిసర్గ సౌందర్యం, మంచుకొండల తుషారమలయస్పర్శ ఇవన్నీ అదృశ్యంగా తాకినప్పుడు ఆ చిత్రం దృశ్యకావ్య స్థాయికి మించిన సౌందర్యభావన పొందుతుంది. అలాంటి రచన గురించిన చక్కని ఉదాహరణ ఈశావాస్యోపనిషత్తులో కనబడుతుంది.

పూర్ణమదః పూర్ణమిదమ్ పూర్ణాత్ పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

పై శ్లోకంలో ’వస్తువు’ అనబడేదేదీ లేదు. చదువుకున్న వందమంది వందరకాలుగా ఊహించుకోగల ప్రతీకాత్మక సూచనయే ఆ శ్లోకానికి వస్తువు. ఈ రకమైన శ్లోకం బౌద్ధికమైన జ్ఞానం తో వచ్చే సృజన కాదు. ధ్యానపూర్వకమైన స్థితినుండి వెలువడితేనే ఇటువంటి శ్లోకం సాధ్యం అవుతుంది.

కవులలో మేధావులు వేరు, భావుకులు వేరు. మేధావులు పాఠకుల కోసం నవ్యరచనాసంవిధానం తోటి అనన్యసామాన్యప్రతిభ తోటి రచనలు చేయవచ్చు, అనేకులు మెచ్చనూ వచ్చు. అయితే హృదయం ఉప్పొంగి ఒక తన్మయావస్థలో పొంగే కవిత్త్వధార ముందు ఆ మేధాసృజన నిలువదు. ఆలోచింపజేయడం కవిత్త్వలక్షణం అని చెప్పినవారు లేరు. అలంకారశాస్త్రవేత్త ఆనందవర్ధనుడు కావ్యం యొక్క అంతిమ ఉద్దేశ్యం ఆలోచన అని కాక, ఆనందమన్నాడు. పాఠకులకు నిర్భరశ్రమ కలిగించి పాండిత్యప్రకర్షను ఎలుగెత్తి చాటే కావ్యం వల్ల కలిగే ప్రతీతి ఆనందం అనేదాని కన్నా శ్రమతర్వాత వచ్చే విశ్రామసుఖమని, లేదా అహాన్ని తృప్తి పరిచే ప్రక్రియ అని అనడం సబబు. అలాంటి కవుల వాక్కులను దార్శనికుల స్థాయిలో తలచి ఆలోచించడం ఖచ్చితమైన పొఱబాటు.

కళాకారుడెప్పుడూ ఎప్పుడూ రెండవ తరగతి పౌరుడే అంటారు సుప్రసిద్ధ వ్యాసకర్త తిరుమల రామచంద్ర గారు. చరిత్రలో కవులు నాయకత్వ స్థాయికి ఎదిగినది దాదాపుగా లేదు. కేవలం ఏదైనా నాయకుని అనుసరించడమో, లేదా ఏదైనా సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ఉద్యోతించడం మాత్రమే కవుల పని. వ్యక్తిగతమైన అనుభవసారాంశాన్ని, ప్రతిభను, లేదా సృజనను సమాజానికి అన్వయించి మార్పును తీసుకురాగల సమర్థుడు దార్శనికుడు. నాటి బుద్ధుడు, శంకరాచార్యులు మొదలుకుని నేటి గాంధీ వరకూ అలాంటి పనినే చేశారు. వారి భావజాలాన్ని ప్రజలకు మరింత దగ్గరగా తీసుకుపోవడానికి తోడ్పడే వాడు కవి.

చాలా తక్కువగా, అరుదైన సందర్భాలలో దార్శనికుడూ, కవీ ఒక్కరు కావచ్చు. అట్టి కవులు సామాజిక దృక్పథంతో లేదా అత్మగతంగానూ రచనలూ చేయవచ్చుగాక. సామాజికమైతే ఆయన ’కవిత్త్వం’లో నైపుణ్యం కన్నా, ప్రయోజనమే పరమావధి గా దృగ్గోచరమౌతుంది. తెలుగునేలలో అటువంటి మహానుభావుడు వేమన. ఒక కవిని దార్శనికుడని పొఱబాటు పడడం ఎంత అనుచితమో, అలాగే దార్శనికుడిని కవిత్త్వపు తూకం రాళ్లతో కొలిచి, విమర్శించడం క్షమించరాని తప్పిదం. వేమన కవి కాడు, యోగి. ఆయన కవితను యే రకమైన ప్రమాణంతోనూ కొలవడం సరి కాదు. దార్శనికుని సృజనకు దేశకాలమానాలకు అతీతమైన ప్రత్యేకమైన ప్రయోజనం ఉన్నది.

ఏదేమైనా, కవులను/సాహిత్యకారులను గురించి అవధులకు మించి అంచనా వేయడం, దార్శనికుడిగా పొరబడ్డం తో బాటు, ఏవో కొన్ని విలక్షణమైన, లేదా ప్రయోజనాత్మక భావాలున్న కారణం చేత అలవి మాలిన విధంగా పొగడ్డం, తద్వారా ఒక ’తప్పుడు’ సాంప్రదాయానికి తెరతీయడం, దానికి ప్రతిస్పందన గా మరింత పొఱబాటు ఆలోచనలు, వారిని అభిమానించో, ప్రతిఘటించో మరొకరు అలాంటి సాంప్రదాయాన్నే తిరిగి సృష్టించటం, ఇలా ఒక అసహజమైన వాతావరణం సాహిత్య లోకంలో వేళ్ళూనుకుంది. ఇది కొన్ని ప్రమాదఘంటికలను మోగిస్తూంది. ఇటువంటి పెడధోరణుల వల్ల వచ్చే నష్టాలు పైకి కనిపించవు. కంటికి కనిపించే శత్రువు కన్నా కనబడని శత్రువు ప్రమాదకరం. poison కన్నా, slow poison మరింత ప్రమాదకరం. విద్వేషం ఒక్కసారిగా వెలువడేవిషం లాంటిదైతే అలవిమాలిన అభిమానం కొంచెం కొంచెం గా అలవాటు కాబడే విషం. విజ్ఞులు ఈ ధోరణిని, వీటి మూలాలను నిష్పక్షపాతంగా గుర్తించవలసిన అవసరం ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

December 2012
M T W T F S S
« Oct   Jan »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31