May 6, 2024

||అవధానంలో సమస్యాపూరణం||

రచన: Rvss Srinivas

          తెలుగు భాషకి పుట్టుక సుమారు 2400 యేళ్ళని చరిత్ర కారులు చెప్పినా, వేంగీ దేశాధిపతి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ చేతిలోనే ఒక రూపు దాల్చిందని చెప్పాలి. రాజమహేంద్రవరపు గోదావరి తరంగాల సోయగాన్ని రంగరించో లేక యా పావన నదీ తీరాన నిత్యం వినబడే వేదమంత్రాల సుస్వరాలు వినో తెలుగు భాషకి ఓ రూపం తీసుకువచ్చి వ్యాకరణ రచనతో పద్యానికుండే సౌందర్యాన్ని చెప్పిన నన్నయకి తెలుగు భాష ఋణపడి ఉంటుంది ఎప్పటికీ. అప్పటిదాకా వెలుగు చూడని భాష నన్నయ పద లాలిత్యంతో కొత్త పుంతలు తొక్కుతూ పద్యాల్లో అందంగా ఇమిడి పోయింది. అందమైన భావాల్లో ఒదిగిపోయింది.

ముందుగా తెలుగు  ఎన్నో సాహిత్య ప్రక్రియల్లో ఉండవచ్చును…కాని శాస్త్రీయపరంగా సాహిత్య శోధకుల దృష్టిలో ఒక పరిపూర్ణమైన సాహిత్య కావ్యంగా నన్నయ రచించిన మహాభారతాన్నే ధ్రువీకరించారు. అయన మొదలుపెట్టిన ఆ అందమైన పద్యరచన తరువాత ఆ భారతాన్ని పూర్తిచేసిన తిక్కన, ఎర్రా ప్రెగ్గడలకు మార్గదర్శకమైంది.

అరణ్యపర్వంలోని నన్నయ భట్టారకుని  చివరి పద్యం ఒక్కసారి చూడండి…

“శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్

జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో

దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క

ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై ”

శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. – అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేద వికసించిన కలువల సుగంధాన్నిమోసుకుపోయే చల్లగాలితో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు…ఇలాంటి పద్యంతో భావకవులు ఓ పది కవితలు వ్రాసేయచ్చు….ఓ 5 పాటలు వ్రాసేయచ్చు…

ఆ తర్వాత శ్రీనాధుని శృంగార నైషధం లోని సీస పద్యాల సౌందర్యం …చాటువులలోని చురకలు…పోతనామాత్యుని భాగవతలోని పద్యాలలోని కోమలత్వం మనసు సాహితీప్రియుల మనసు దోచినవే..

ఇలా పద్య కావ్యాలు పురాణాలతో ముడిపడి ప్రసిద్ధి చెందుతుండగా మొదలైంది ఆంద్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయల కాలం. ఆ కాలంలోని అష్టదిగ్గజాలతో పద్య కావ్యాలకి పట్టాభిషేకమే జరిగింది.

అల్లసాని పెద్దన మనుచరిత్ర లాంటి ప్రబంధాలలో అల్లికల జిగిబిగితొ మెరిస్తే,

నంది తిమ్మన సత్యభామ కోపంలో మురిసింది.

ధూర్జటి కాళహస్తీస్వర శతకంలో శివుని అర్చిస్తే,

రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యంలో పాండురంగని కొలుస్తూ మాతాపితరుల గొప్పతన్నాని చెప్పింది.

కృష్ణ దేవరాయల ఆముక్తమాల్యదలో గోదాదేవి ఆరాధనలో ముత్యపు కప్పురమై వెలిగింది.

అందుకే ఆ భాషని మెచ్చిన రాయలు

“తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స”…  అని తెలుగు భాషను స్తుతించారు.

ఇక్కడ మొదలైన వైభవం 1900 వ సంవత్సరం  నుండి తిరుపతి వెంకట కవుల చేతిలో నాటకాలలో పద్యం జీవం పోసుకుంది. వీరి నాటకాలలో పద్యాలు అందరికీ సుపరిచితమే…

‘బావా ఎప్పుడు వచ్చితీవు ఎల్లరునున్ సుఖులె భ్రాతల్ సుతుల్ చుట్టముల్

నీవాల్భ్యమున్ పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే

నీ వంశోన్నతికోరుభీష్ముడును,నీమేల్కోరుద్రోణాదిభూ

దేవుల్ సేమంబై మెసంగుదురేనీతేజమంబుహెచ్చిమంచున్’

‘ఎక్కడనుమండి రాకయిటకుఎల్లరునున్ సుఖులే కదాయశో

భాక్కులునీదు అన్నలునుభవ్యమనస్కులు నీదు తమ్ములును

చక్కగనున్నవారే భుజశాలి వ్రుకోదరుదుఁడగ్రజాజ్ఞకున్

చక్కగ నిల్చి శాంతుగతి చరించునె తెల్పునమర్జునా’

100 సంవత్సారాలు దాటినా ఇప్పటికీ నాటకాలలో మనం తిరుపతి వేంకటకవులను చూస్తున్నాము. వీరి పాండవ ఉద్యోగ విజయం నాటకం ‘కురుక్షేత్రం పేరుతొ ప్రసిద్ధి చెందింది. అందులో షణ్ముఖి ఆంజనేయరాజు గారు కృష్ణునిగా… మద్దాల రామారావు గారు కర్ణునిగా… ఆచంట వెంకట రత్నం నాయుడు గారు సుయోధనునినిగా నటిస్తూ యావత్ ఆంద్రప్రదేశ్ ని ఉర్రూతలూగించారు. వీరిని సుమారు ఓ మూడు దశాబ్దాల క్రితం రంగస్థలం పై చూసిన భాగ్యవంతుల్లో నేనొకడిని అని చెప్పుకుంటాను. పృథ్విరాజ్      తారాశాశంకంలో పద్యాల రాగం వేరు …హరిశ్చంద్ర నాటకంలో సుబ్బారావు గారు …వారణాసి…అంటూ పద్యం అందుకొనే రాగం వేరు…సంపత్కుమార్ ఆంజనేయుడి పాత్రలో పద్యాలు పాడితే ఒక అందం…జైరాజ్ నారద పాత్రలో, నక్షత్రకుని పాత్రలో పద్యాలాపన చేయడం మరొక అందం.

ఎదో చెప్పాలని ఎదో చెప్తున్నానని అనుకుంటున్నట్లు అనిపిస్తోంది చదువరులారా! చెప్పబోయే విషయానికి ఈ ఉపోద్ఘాతం అవసరం అనిపించింది …

తెలుగు సాహిత్యంలో పద్యానికున్న ప్రాముఖ్యత చెప్పడానికి మాటలు లేవు. భారతీయ భాషల్లోనే కాదు యావత్ ప్రపంచ భాషల్లో పద్యం అనేది తెలుగు ప్రజలకి లభించిన అపురూపమైన వరం. ఆ పద్యం ఛందస్సు వ్యాకరణం లోని నియమాలతో వ్రాయడం ఒక ఎత్తు,ఆ పద్యాలని రాగ యుక్తంగా పాడడం మరొక ఎత్తు. ప్రతీ పద్యం రాగయుక్తంగా పాడడం అందరికీ సాధ్యం కాని విషయం. గమ్మత్తు ఏమిటంటే పద్యం అర్ధం తెలిస్తే గానీ పద్యాన్ని ఎక్కడ ఆపాలో ఏ పదాన్ని ఎక్కడ విరవాలో తెలియదు అందమైన పద్యాన్ని వచనంగా చదువుతూ పొతే ఆ అందం కనపడదు.

ఈ సమస్యాపూరణం అనేది రాయల కాలంలోనే మనకి కనిపిస్తుంది.అంటే సుమారు 500 ఏళ్ళ ముందు ప్రక్రియ.అంతకు ముందు ఏమైనా ఉన్నా పరిశోధకుల దృష్టిలో ఆ సమయం నుంచే ప్రాచుర్యములోనికి వచ్చినట్లుగా చెప్తారు.అసలు పద్యం ఛందస్సుకి లోబడి కావలసిన భావంతో వ్రాయడం ఎంత కష్టమైన ప్రక్రియో!. సరళమైన పదాలతో కవితలు వ్రాయడం కంటే కొన్నిరెట్లు కష్టమైన పని. అలాంటిది ఒక పాదం ఇచ్చి(సాధారణంగా నాలుగవపాదం )  మిగిలిన పాదాలు పూరించమనడం మరీ కష్టం. గమ్మత్తైన విషయమేమిటంటే ఈ పాదం మామూలు భావంలా ఉండక ఒక సమస్యతో ఉంటుంది. ఈ పాదం అర్ధరహితం గానో, లేక అసంబద్దార్ధముగానో, అన్వయ రహితంగానో ఉంటుంది. చమత్కారంతో పూరించడం లోనే కవికి ఉన్న పాండిత్యం తెలుస్తుంది. ఈ సమస్యాపూరణం అవధానం అనే ప్రక్రియలో చాలా ముఖ్యమైనది. అష్టావధానంలో వర్ణనము, దత్తపది, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం (ప్రశంస) ఘంటానాదం, సమస్యా పూరణము ఈ ఎనిమిది ప్రక్రియలని ఏక కాలంలో చేయగలగడం. ప్రశ్నలడుగు వారిని పృచ్చకులు అంటారు.సమాధానం చెప్పే పండితుని ‘అవధాని’ అంటారు.

సమస్యాపూరణంలోని కొన్ని మంచి పూరణలు ఇక్కడ చూద్దాము.

భువనవిజయ సభలో రాయలవారు ఇచ్చిన సమస్య : “రవి గాననిచో కవి గాంచునే కదా” అని ఈ సమస్య సాధారణంగానే కనిపిస్తుంది. రవి చూడని చోటు కవి చూడగలడు అని.అయితే భట్టు మూర్తి ఈ విధంగా పూరించినట్లుగా చరిత్ర చెప్తోంది మనకు.

ఆరవి వీరభద్రుని పదాహతి డుల్లిన బోసినోటికిన్

నేరడు, రామకృష్ణ కవి నేరేచెబో మన ముక్కుతిమ్మరా

ట్క్రూర  పదాహతిమ్బడిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము ప

ల్గారచియింప, నౌర! రవి గాననిచో కవి గాంచునే కదా!

ప్రతివారి నోటిలో కవిని ప్రశంసిస్తూ అనే రవి  గాననిచో కవి గాంచునే కదా!…అనేది ఇక్కడే పుట్టింది..రామకృష్ణ కవి ముక్కుతిమ్మన ఊయల ఊగే సమయంలో ఊతునా? అని అడిగితే తిమ్మన ఊ.. అన్నారట. అంతే ఈయన రెండో అర్ధాన్ని తీసుకుని ఉమ్మేసాడట. అప్పుడు ఆయన పాదరక్ష విసిరితే అది తగిలి పన్నూడగొట్టుకున్న రామకృష్ణ కవి దుప్పికొమ్ముని పన్నుగా పెట్టుకొని కాస్తే… ఆ విషయం తెలిసిన భట్టుమూర్తి సమస్యను పై విధంగా పూరిచారు. రవి చూడని చోట అని.

కానీ మరో చమత్కారమైన విషయం ఏమిటంటే ధూర్జటి కవితా మాధుర్యానికి  అచ్చెరువొంది రాయల వారు

“స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కులకెల కల్గెనీ యతులిత మాధురీ మహిమ?”..అంటూ సమస్యనిస్తే

రామకృష్ణుడు ఆయన వేశ్యాలోలత్వాన్ని చూపుతూ

హా తెలిసెన్! భువనైక మోహనో

ద్ధత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం

తత మధురాధరోద్గత సుధా రస ధారల గ్రోలుటం జుమీ !! అని.

పూరించెనట…ఇక్కడ కూడా రవి చూడని వారకాంతల ఆధార సుధలు రామకృష్ణ కవి చూసి చెప్పినట్లు…ఇది కూడా రవి కాంచని చోట కవి కాంచినట్లే.

అల్లాగే తిరుపతి వెంకట కవులు

“గణ చతుర్ధినాడు ఫణిచతుర్ది.” దీనిని ఎంత అర్ధవంతంగా పూరించారో…

“ఎన్ని దినములాయె నిట నన్నుడించి నీ

వరిగి” యనిన బత్నికనియె  భర్త

“నేటి కేన్నగా బదినేలలాఎగా నేడు

గణ చతుర్ధి నాడు ఫణిచతుర్ది”.

రఘునాథ నాయకుని ఆస్థానంలో కవయిత్రులు రామభద్రాంబ, మధురవాణి ప్రాకృత,  సంస్కృత, ఆంధ్రములలో ఆశుకవిత్వం చెప్పేవారు. సమస్యలను అవలీలగా పూరించేవారు.

ఇలాంటి అద్భుతమైన ప్రక్రియలో తిరుపతి వెంకట కవులు (వారిలో చెళ్ళపిళ్ళ వారి వంశజులు మాకు బంధువులు కావడం మా సౌభాగ్యం). పిశుపాటి చిదంబర  శాస్త్రిగారు, శివరామ శాస్త్రిగారు సంస్కృత ఆంధ్రములలో సమస్యాపూరణం చేయడంలో దిట్టలు. పద్యానికి, సమస్యాపూరణానికి ఆదరణ కల్పించిన వారిలో  శ్రీ మేడసాని మోహన్, రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు, మాడుగుల నాగఫణి శర్మ గారు, గరికపాటి  నరసింహారావు గారు ప్రధానంగా చెప్పుకోవచ్చు.

గతంలో ఆకాశవాణి కేంద్రాలలో ఈ సమస్యాపూరణం ఓ కార్యక్రమంగా వారానికోసారి నిర్వహించేవారు 78-80 లో వినేవాళ్ళం. మనకే సొంతమైన, కేవలం మన సొత్తు అయిన పద్య సాహిత్యాన్ని, ఈ సమస్యాపూరణలుండే అవధానాలని మనం ఆదరిస్తే మన భాష ఔన్నత్యాన్ని నిలిపిన వాళ్ళము అవుతాము…లేకుంటే అంతరించిపోతున్న భాషలలో ఒకటిగా మన భాష నిలిచిపోతుంది. ఆధునిక కవిత్వాన్ని ఆదరించాలి. పురాతన సాహిత్యాన్ని తూలనాడక ఆ సాహిత్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి. కొన్ని ఆధునిక కవితలు అర్ధం కానట్లే పద్యాలు కూడా ఒకటికి రెండు సార్లు చదివితే గానీ ఆ పదాల సోంపు కనబడదు. అందమైన భావం అగుపడదు.ఇప్పుడు కూడా కొన్ని బ్లాగులలో  పద్య రచయితలు సమస్యాపూరణలు ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు…అందులో శ్రీ కంది శంకరయ్య గారి http://kandishankaraiah.blogspot.in/   ఒకటి.

తెలుగు భాష అజంతం. అనంతం..తెలుగుభాష ఉన్నంత కాలం పద్యం అనేది తెలుగు కళామతల్లికి కావాలి ఒక మహా నైవేద్యం.

1 thought on “||అవధానంలో సమస్యాపూరణం||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *