May 6, 2024

ఎవరిది గొప్ప జాతి?

రచన: శశి తన్నీరు

‘టప్’ సీరియస్ గా వ్రాసుకుంటూ తపోబంగం అయినట్లు  ఉలిక్కిపడి చూసాడు కిటికీ వైపు విసుగ్గా మూర్తి. లేచి నిలబడి కిటికీ నుండి బయటకు తొంగి చూసాడు.

ఎదురుగా దరిద్ర దేవత కొలువు చేస్తున్నట్లు చెత్త కుప్పలు.

జీవనదిలాగా రోజు రోజుకు పెరుగుతున్నచెత్త .వాటిపై పొర్లుతూ పందులు,

వాలుతున్న దోమలు,ఈగలు..ఏదో మానస సరోవరం లో మునకలు వేస్తున్నట్లు

అర్ధ నిమీలత నేత్రాలతో పరుండి ఉన్నాయి కొన్ని కుక్కలు.

”ఛీ ఛీ”ఇల్లు ఇలాంటి దగ్గర ఉన్నందుకు నుదురు కొట్టుకున్నాడు. అసలు శబ్దం ఎక్కడ నుండి వచ్చిందా అని కళ్ళతోనే చెత్త కుప్పల మధ్య స్కాన్ చేసాడు.

ఏదో ఆకారం కలబెడుతున్నట్లు కనిపిస్తుంది…బహుశా ఏదో వెతుకుతుంది.

జంతువూ మాత్రం కాదు మనిషి లాగా లేదు?మళ్ళా దీక్షగా చూసాడు.

ఊహు నిలుచుకుంటే తెలుస్తుంది ఎవరో.ఏదో వెతుకుతూ ఉంది అది.

ఆ చెత్తకుప్పలో కావాల్సింది దొరకలేదు కాబోలు మెల్లిగా నిల్చుంది ఆకారం. బక్కగా ఒక కర్ర నిలబెట్టినట్లు ఉంది.చీర కట్టుకుని ఉంది కాని చినుగులతో  అది చీర అనేటట్లు లేదు. చిత్రం ఎండ ఆ మొహం పై పడి మెరిస్తే చూసాడు… మంచి కళగల మొహం. చెత్తసముద్రం లో లక్ష్మి దేవి లాగా ఉంది. జడలు కట్టిన జుట్టు మొహం పై నుండి తోసుకున్నప్పుడు మొహం చంద్ర బింబం మేఘం వెనుక నుండి కనిపించినట్లు  కనిపిస్తుంది.

మళ్ళా కూర్చోని ఏదో కలబెడుతూ ఆ కవర్ల మధ్య కెలుకుతూ ఉంది.

బహుశా కవర్లు అమ్మేది ఏమో…ఎదవ జాతి? వీటితో జాగ్రత్త పడాలి  లేకుంటే దొరికింది దోచుకుని పోతారు.దొంగ గాడిదలు….

ఉన్నట్లుండి  దాని మొహం లో నవ్వు చేతిలో ఏదో చూసి. ఏమయ్యుంటుంది?కిటికీ లో నుండి వీలైనంత తొంగి చూసాడు.

ఏదో తెలీదు కాని దాని చేతిలోని వస్తువు మీద పడి మెరిసి మొహం మీదపడి కళ్ళు మూసుకున్నాడు జిగేల్మని.

కొంపతీసి బంగారు కాదు కదా…

ఉలిక్కిపడి దానిని పట్టుకోవాలి అని ఇంట్లో నుండి చొక్కా వేసుకొని ఉరికాడు బయటకు..

అప్పటికే అది అక్కడ లేదు.చుట్టూ చూసాడు.వీధి చివర వేగంగా అడుగులు వేస్తూ వెళుతుంది.

గబా గబా ఎక్కడకు పోతుందో చూడాలి అని వెనుక పరిగెత్తాడు.

ఆ పిచ్చిది అప్పటికే ఇంకో వీధిమలుపు తిరుగుతూ కనిపించింది.

ఎగిరే చెంగు జండా లా ఎగురుతూ అది వెళ్ళిన మార్గం చూపించింది.

”దీని తస్సా దియ్యా ఏమి తింటుంది.ఏమి వేగంగా పరిగిస్తుంది.

ఎక్కడిది ఇంత శక్తి?తప్పకుండా దీనికి ఏదో దొరికింది.

గుండెల తీసిన బంటు పారిపోతుంది.పట్టుకొని బొక్కలో వేయించాలి..ఎదవజాతి…ఎదవలు ”పట్టుదలగా పెద్ద అంగలు వేస్తూ అనుసరించాడు.

రోడ్ లోని వాహనాలు కూడా లెక్క చేయకుండా

రోడ్ దాటేసింది.ఎలాగైనా అది ఎక్కడకు వెళుతుందో చూడాలి అని

రోడ్ మీదకు అడుగేసి ఆటో గుద్దుకోపోయి ….చావు తప్పి కన్ను

లొట్ట పోయినట్లు ఆటో వాడి చేత బూతులు తిన్నాడు. అయినా చుట్టూ చూస్తున్నాడు.అదిగో రోడ్ అవతల చిన్న సందులోకి నాగు పాము మెలికల్లా తిరుగుతూ గాల్లోకి ఎగురుతున్న చీర….వీధినుండి లోపలికి  మలుపు తిరిగాడు.

గుప్పుమని ముక్కులను తాకిన పరిమళం పీల్చలేక రుమాలు తీసి అడ్డం పెట్టుకున్నాడు.

అది ఒక వీధి కాదు.పెద్ద కాలువ గట్టు మీద అక్కడక్క నాలుగు కర్రలు పాతి ఏది దొరికితే దానితో కప్పి చేసుకున్న గుడిసెలు..

మధ్యలో పారుతున్న మురుగు,

చుట్టూ చూసాడు…ఒక గుడిసెలోకి వంగింది చీర నేల మీద జీరాడుతూ పాముకుబుసం లాగా గుడిసలోకి వెళ్ళిపోయింది.

”చిక్కింది దొంగ ….”తృప్తిగా ఒక బూతు సులువుగా రాల్చేస్తూ …

మురుగు వాసన కడుపు తిప్పేస్తూ ఉంది.కాని దాని చేతిలో ఏముందో చూడాలనే పట్టుదల ముందుకు నడిపించింది.

ఎంత విలువ గల వస్తువు కాకపొతే

”దొంగము….”తృప్తి దీరా మళ్ళా నాలుగు బూతులు తిట్టి

”పరిగెడుతుంది ఆ లెవల్లో…దొరకనీ చెపుతాను”.

మళ్ళా దాని మొహం గుర్తుకు వచ్చింది.

చక్కటి మొహం.కళ్ళలో ఏదో కోరిక మెదిలింది మూర్తికి.

మంచి చీర కడితే బాగానే ఉంటుంది.

”ఎదవా జాతి దొంగతనాలు చేసి బతుకుతారు”

మనసులోని కుళ్ళు ఆలోచనలు కూడా వాసన వచ్చేట్లయితే మూర్తీ

లాటి వాళ్ళను ఎప్పుడో వెలి వేసి ఉందురు అందరు.

మెల్లిగా ఆ గుడిసె దగ్గరకు చేరాడు…వంగందే కాదు కాదు దోగాడందే ఆ గుడిసె లోకి వెళ్ళలేడు.”ఎక్కడ సచ్చావే ము…”అనుకుంటూ లోపలి వెళ్లాడు.

ఒక్క సారి చిమ్మ చీకటి దృశ్యాన్ని దుప్పటి లాగా కప్పేస్తూ ….

కళ్ళు విప్పార్చి చూసాడు.కొంత సేపటికి కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి.

ఉన్నట్లుంది కళ్ళలో ఉప్పొంగిన కన్నీళ్లు….

కుళ్ళు మనసును లోని మురుగును కదిగేస్తూ …

ఎదుటి దృశ్యం చూస్తూ మూర్తీ మనసు మెలిబడిపోయింది బాధతో.

నిశ్చేష్టుడై నిలబడి చూస్తూ కొంత సేపటికి తేరుకున్నాడు.

ఎదురుగా నేల పై పడుకొని ఒక చిన్న ఆస్తి పంజరం…

కాదు ఎముకలు కప్పుతూ చర్మపు తొడుగు ఉంది.

శవం అనాల్నా…కాదు పొట్ట ఎగురుతూ ఉంది.ప్రాణం ఉంది. ఉందంటే మనసు ఒప్పుకోవడం లేదు.మూడేళ్ళ పిల్లవాడి శవం అనొచ్చు.

కాని అది మెల్లిగా కదులుతూ ఉంది.పొట్ట మీద ఎముకలు ముందుకు  పొడుచుకొని వచ్చినట్లు, కడుపు వెన్నుకంటుకొని ఉంది.

ఆ మొహం లోని మిడిగుడ్లు ఆశగా ఆ పిచ్చి దాని చేతి లోని వస్తువు  వైపు చూస్తూ …మళ్ళా ఆ వస్తువు పై వెలుగు కిరణం పడి

బంగారు రంగులో వస్తువు మెరిసింది.

ఆ పిచ్చిది ఆత్రంగా దానిని పూర్తిగా చించి తీసి వాడి నోట్లో

గబా గబా కుక్కుతుంది…ఎక్కడో మిగిలిన చిప్స్ ఆ శవానికి

ఆకలి తీరుస్తూ…పాకెట్ మెరుపులకు పెట్టిన ఖర్చు కూడా  ఇలాంటి బీద వాళ్లకి దొరకదేమో. ఆకలికి పసివాడు పేకెట్ అంతా చేయి పెట్టి వెతుకుతున్నాడు.

మూర్తికి ఆ దృశ్యం హృదయాన్ని రంపంతో కోసినట్లుగా ఉంది.

తన పిల్లలు ఇష్టం లేదని పారేసే అన్నాలు,స్వీట్లు ,పాలు గుర్తుకు వచ్చాయి.

ఆ పిచ్చి దాన్ని తాను తిట్టిన తిట్లు గుర్తుకు వచ్చాయి.

ఎవరు ఎదవా జాతి?పశ్చాత్తాపం తో చేతికి జేబులో దొరికిన వంద రూపాయలు

నోటు వాళ్ళు చూడక ముందే వాళ్ళ వెనుక వేసి వెనక్కి తిరిగి వచ్చేసాడు…

దరిద్ర దేవత విశ్వ రూపం ఎక్కువ సేపు చూడ లేక ……

 

 

4 thoughts on “ఎవరిది గొప్ప జాతి?

  1. Namaskaram sasikala garu,
    me blog lo nenu chadivina first story edi. chala bagundi heart touching and denini waste cheya kudadhu ane chala baga cheparu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *