May 6, 2024

గుర్రం జాషువా అపురూప సృష్టి “పాపాయి పద్యాలు”

రచన :  పి.వి.ఎల్.రావు,

ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా. సమకాలీన కవిత్వ ఒరవడి యైన భావకవిత్వరీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. సాటి సంప్ర దాయ కవులంతా ప్రేమ, ప్రణయ, శృంగార కవిత్వాలతో కాలయాపన చేస్తుండగా, జాషువా సామాజిక దౌష్ట్యా న్ని తన కవిత్వం ద్వారా చీల్చి చెండాడాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగ బడ్డాడు జాషువా. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ఆయన చెప్పారు.నిత్య జీవితంలో కాని సాహితీ జీవితంలో గాని ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధీరత్వంతో నిబ్బరంగా ఎదుర్కోవడమే ఆయన విజయ సంకేతం.

జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న జాషువా సాహిత్య ప్రపంచంలో తన రచనలతో సంచల నాన్ని సృష్టించారు. వర్తమాన సమాజంలో సంప్రదాయ సాహిత్యం రాజ్యమేలుతున్న రోజుల్లో అనేక ప్రతి కూలతల నెదుర్కొంటూ సామాజిక దృక్పథంతో రచనలు చేసి నిలదొక్కుకోవడం సామాన్య విషయమేమీకాదు. అందులోనూ సాంఘికంగా అణిచివేతకు లోనైన దళిత వర్గానికి చెందిన వారు ఆ రోజుల్లో సాహిత్య రంగంలోకి ప్రవేశించడానికే అవకాశం లేని పరిస్థితి ఉండేది. క్రైస్తవ కుటుంబానికి చెందిన జాషువా కొద్దిపాటి చదువు చదువుకోవడానికి అవకాశం కల్గింది. ఎనిమిదవ తరగతితోటే చదువుకు స్వస్తి చెప్పిన జాషువా నాటకాల పట్ల, సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు.

అన్నింటికన్నా మించి తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయిన మహాకవి జాషువా. తను సృష్టించిన సాహిత్యంలో స్పృశించని అంశం లేదు. పద్య నిర్మాణంలో జాషువా సాధించిన ప్రతిభ అనన్య సామాన్యమై, అనేక మంది సాహిత్య పండితుల ప్రశంసలు పొందింది. జాషువా పద్యాలలోని శబ్ధ సౌందర్యం గుండెలను తాకు తుంది.

జాషువా కవితలో పదాలు, భావాలు చిటికెనవ్రేలు పుచ్చుకొని సిగ్గుగా స్నిగ్థంగా ముగ్థంగా నడిచి వచ్చే జవరాళ్ళలా ఉంటాయి. అందుకే జాషువా సగర్వంగా ‘గవ్వకు సాటిరాని పలు గాకుల మూకలసూయ చేత నన్నెవ్విధి దూరినన్‌ నను వరించిన శారద లేచిపోవునే?’ అని అనగలిగాడు. కవితాంశాలలో భావకవుల్లా ప్రణయాన్ని పట్టుకు వ్రేలాడలేదు. ప్రబంధ కవుల్లా శృంగార వర్ణనలు చేయలేదు. ప్రాచీన కవుల్లా భక్తి రస బంధురంగా రచింపలేదు. జాషువా రచనా పద్ధతే వినూత్నమైనది. తనయింటి కొత్త పెత్తందారైన శిశువును గూర్చి ‘తేలిక గడ్డి పోచలను దెచ్చి తూగుటుయ్యేల గృహంబు రచించే’ గిజిగాడి గురించి, ‘చంద్రమండలానికి మొదట పంపిన మూగప్రాణి ‘లైకా’ కుక్క గురించి- అంశమేదైనా అద్భుత కావ్యమై పోవాల్సిందే.

ఇకపోతే వర్తమాన సమాజపు సాంఘిక అసమానతలపై, అనాచారాలపై ఎక్కుపెట్టిన బాణం గబ్బిలం. ప్రకృతిలో మమేకమైన ఈ కవి ఏది రాసినా సరసపదస్వారస్యమే. ‘ఖండ కావ్యాల రారాజు’ జాషువా ‘గబ్బిలం తో ఈశ్వరునికి సందేశం పంపే మిషతో తెలుగు నేల వైభవాన్ని వర్ణించి తెలుగు నేలపై, తెలుగు భాష పై తన ప్రేమను వ్యక్తం చేసుకున్నాడు. తాజ్‌మహల్‌ ను తన భార్యకు తాను కట్టలేకపోయినా- తాను అమితంగా ప్రేమించే తన భార్యను, ఆమెతో తన ప్రణయ బంధాన్ని ‘ముంతాజ్‌ మహల్‌’లో వర్ణించాడనిపిస్తుంది. సీస పద్యపు సొగసుకు శ్రీనాథుడు పెట్టింది పేరు. కానీ జాషువా ఉత్త శ్రీనాథుడు కాదు, ఇంకా చెప్పాలంటే అభినవ శ్రీనాథుడు కూడా కాదు, నిజానికి అతడు ‘మధుర శ్రీనాథుడు’.

గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర, ముంతాజ్‌ మహల్‌, బాపూజీ, నాకథ, కొత్త లోకం, నేతాజీ, శివాజీ, నాగార్జునసాగరం, స్వప్నకథ, ముసాఫర్లు, స్వయంవరం, రాష్ర్టపూజ ఇలా అనేక ఖండకావ్యాలు, అనేక నాటిక లు, పౌరాణిక నాటకాలు రచించాడు. బలిజేపల్లి లక్ష్మీకాంతకవి రచించిన ‘హరిశ్చంద్ర’ నాటకం మొత్తం ఒక ఎత్తు, శ్మశాన ఘట్టం ఒక్కటీ ఒక ఎత్తు! ఆంధ్రరాష్ట్రంలో ‘కాటిసీను’ లోని ఒక్క పద్యమైనా రాని తెలుగు వాడు ఉండడంటే అతిశయోక్తి కాదు!

పైన తెలిపిన విషయాలను అలా ఉంచితే ఆ రోజుల్లో ఆంధ్రదేశమంతటా సంచలనం కలిగించిన, తెలుగు ప్రజలు ఆసక్తిగా, ఇష్టంగా చదువుకున్న జాషువా పాపాయి పద్యాలకు సంబంధించిన విశేషాల్ని తెలి యజేయడమే ప్రస్తుతాంశం.“మధుర రసమును గడుపున మాటుకొన్న, ద్రాక్ష ఫల గుచ్చముల యందముల తూగు” కవితా లక్షణంతో గడుసుదనంగా భావాలని వెల్లడించడానికి సొగసుదనంగా రచనలు చేసిన జాషువా తన చిన్న తనంలో సమాధులపై కూర్చొని తన కవితాశక్తిని అభివృద్ధి చేసుకునేందుకు పద్యాలను నిర్మించే వాడు. అవమానాలను, తిరస్కారాలను పొందినా ఆయన పద్య నిర్మాణ శక్తి వాడి తగ్గలేదు. విత్తనంలో చేవ ఉంటే అది భూమిని చీల్చుకుని పైకి వస్తుంది మరి!

ఆధునిక తెలుగు పద్యమునకు కరుణను, పాపాయి తనమును, తెనుగు యెద తేనెను, లాలిత్య మును, తెనుగు సొగసును ప్రసాదించిన కవికోకిల, కవితాచక్రవర్తి గుర్రం జాషువ. తెలుగు సాహిత్య మాగాణం లో పాపాయి పద్యాలనే సుమమాలికలను విరబూయించిన మహోన్నత మహిమాన్వితుడు గుర్రం జాషువా.

మొదటి పద్యం: నవమాసములు భోజనము నీరమెరుగక

(నాయనా! పురిటింటి తెరువరి! కులజ్యోతి! నీకు దీర్ఘాయువురా!)

నవమాసములు భోజనము నీరమెరుగక,
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో,
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన,
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ

బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు,

ధారుణీ పాఠశాలలో చేరినాడు, కానీ

వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత

కరపి యున్నది వీని కాకలియు నిద్ర!

రెండవ పద్యం: బొటవ్రేల ముల్లోకములు జూచి

(మా చిట్టి పాప నా ఒళ్ళో ముత్యాలు పోశాడు. నెలబాలుడై ఆనందాన్ని కుప్పవోశాడు. చిట్టిబాబూ!)

బొటవ్రేల ముల్లోకములు జూచి లోలోన
నానందపడు నోరులేని యోగి
తల్లి తండ్రుల తనూ వల్లరీ ద్వయికి వ
న్నియ పెట్టు తొమ్మిది నెలల పంట
అమృతంబు విషమను వ్యత్యాస మెరుగ
కాస్వాదింప చను వెర్రిబాగులాడు
అనుభవించు కొలంది నినుమడించుచు మరం
దము జాలువారు చైతన్య ఫలము

భాష రాదు, వట్టి పాలు మాత్రమె త్రాగు,

నిద్రపోవు, లేచి నిలువలేడు .. (చిన్ని నాన్న)

ఎవ్వరెరుంగ రితని దేదేశమో గాని,

మొన్న మొన్న నిలకు మొలిచినాడు!

ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ పాపాయి పద్యాలలోని కవిత్వం మాటకొస్తే పసిపిల్లవాడిమీద ఇంతకన్నా ఎవరూ బాగా పద్యాలు రాయలేరనేది కాదనలేని విషయం. ఆహారం,నీరు అనే వాని నెరుగకుండా తొమ్మిది నెలల పాటు చిమ్మ చీకటి కమ్ముకొన్న అమ్మ జానెడు పొట్టలో నిద్ర పోయి లేచి పురిటింటి నుంచి ప్రయాణం సాగించే బాటసారి అని తల్లి కడుపున ప్రాణం పోసుకొని ధరణిపై అడుగుపెట్టిన పాపాయిని నవనవోన్మేషంగా అభివర్ణించడం ఒక్క జాషువా వల్ల మాత్రమే అవుతుందనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

అలాగే “అక్షయంబైన మాతృక్షీర మధుధారలన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ” అన్నది ఎంత అంద మైన భావన. మనం రోజూ చూసే సామాన్యమైన విషయాల్లోంచి అందమైన కవిత్వాన్ని సృష్టిస్తాడు కవి. జాషువా చేసింది అదే కానీ దానికదే కొత్త దనాన్ని సంతరించుకోవడమే విశేషం.

తల్లి కడుపులో ఉన్నంత కాలం తనకు తెలియని ఏమాత్రం పరిచయం కూడా లేని ఆకలి నిద్ర అనే వాటిని ఎప్పుడైతే భూమిమీదకొచ్చాడో ధారుణి అనే పాఠశాలలో చేరాడో అప్పటినుండి వాడికి కూడా కష్టాలు మొదలవుతాయనే విషయాన్ని “వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత, కరపి యున్నది వీని కాకలియు నిద్ర!” అనడం ద్వారా ఎంతో చక్కగా సూచించాడు. భవబంధాలు,సుఖసంతోషాల సమ్మిళితమైన ఈ భూమి మీదకు వచ్చిన తరువాత చిన్న పాపాయి సైతం ఆకలి,నిద్రలను భరించాల్సిందే, జయించాల్సిందేననేది కవి హృదయం.

ఇంకా “అమృతమ్ము విషమను వ్యత్యాస మెరుగ కాస్వాదింప చను వెర్రిబాగులాడు” అని కానీ” ఎవ్వరెరుంగరితనిదేదేశమో గాని, మొన్న మొన్న నిలకు మొలిచినాడు” అని కానీ అప్పుడే పుట్టిన పాపాయి ని వర్ణించడం గొప్పకవులు మాత్రమే చెయ్యగలరు. తల్లికి పిల్లలపై ఉన్న ప్రేమ గురించి గొప్ప కవులు ఆర్ద్రతతో ఎంతో సాహిత్యాన్ని సృష్టించారు కానీ, “అమ్మతో తనకెంత సంబంధమున్నదో, ఏడ్చి యూడిగము సేయించు కొనును” వంటి భావంతో తల్లీబిడ్డల బంధాన్ని ఇంత చక్కగా వర్ణించటం జాషువా గారికే చెల్లింది. అప్పుడే పుట్టిన పాపాయిపై ఇంత రసాత్మకంగా కట్టిన పద్యాలు బహుశా తెలుగులో మరింక లేవేమో అనిపిస్తుంది.

మూడవ పద్యం : గానమాలింపక

(కౌగిట్లో కదలి గారాలు కురుస్తాడు! ఉయ్యేల్లో,ఉల్లంలో ముద్దులు మురిపిస్తాడు!)

గానమాలింపక కన్నుమూయని రాజు
అమ్మ కౌగిటి పంజరంపు చిలక
కొదమ కండలు పేరుకొను పిల్ల వస్తాదు,
ఊయేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊ లు నేర్చిన యొక వింత చదువరి,
సతిని ముట్టని నాటి సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించ వచ్చిన పరదేశి,
తన ఇంటి క్రొత్త పెత్తనపుదారి

ఏమి పనిమీద భూమికి నేగినాడొ,
నుడువ నేర్చిన పిమ్మట నడుగవలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొకాని,
ఇప్పటికి మాత్రమే పాపమెరుగడితడు!

కరుణ రసప్రధానమైన ఈ లాలిపద్యంలో ఒక పసి పిల్లవాడిని రాజు,పంజరపు చిలక,పిల్ల వస్తాదు, భాగ్యోన్నతుండు,వింత చదువరి,సాంబమూర్తి,పరదేశి,కొత్త పెట్టనపు దారి అనే ఉపమానాలతో వర్ణించడంలో ఒక సొబగు కనిపిస్తుంది. బాల్యం అనేది ఒక మదురమైన అనుభూతి. అందుకే దాన్ని దేవుడు ఇచ్చిన వరం అని అంటారు. తడబడే అడుగులతో తనివి తీరని ఆటలతో సాగిపోయే బాల్యం,భగవంతుని స్వరూపమే. అందుకే పిల్లలూ,దేవుడూ చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే అని అన్నారు.

ఏ తల్లి దండ్రులైనా, ఏకాలమైనా, ఎలాంటి సమాజమైనా పసి పిల్లలను అల్లారు ముద్దుగానే చూసు కోవడమే ఉంటుంది. అందుకే “రాజ వత్సంచ వర్షాణి’’ అన్నారు. అంటే పిల్లల్ని అయిదు సంవత్సరాలు వచ్చే వరకు రాజుల్లాగా, ప్రభువుల్లాగ చూడాలి అని. అంటే వాళ్ల కోరికలు తీరుస్తూ వాళ్లు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తూ వాళ్లకి కావల్సినవన్నీ సమకూరుస్తూ పెంచాలిట.చిన్నగా ఉన్నప్పుడు పిల్లలను అనేక విధాలుగా లాలన చేయడం సర్వ సాధారణమే. అతడు ఎలాంటి వాడో పసివాడు పెరిగి పెద్దయై నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే పసి తనంలో ఉన్నప్పుడు ఏపాప, పుణ్యాలతో వాడికి సంబంధం లేదు కాబట్టి.

నాలగవ పద్యం: ఊయేల తొట్టి 

(ప్రసవాబ్ధి తరియించి – ప్రసవమనే సముద్రాన్ని దాటి)

ఊయేల తొట్టి యే ముపదేశమిచ్చునో

కొసరి యొంటరిగ నూ కొట్టు కొనును

అమ్మతో తనకేమి సంబంధమున్నదో

యేడ్చి యూడిగము జేయించుకొనును

పరమేశ్వరుండేమి సరసంబులాడునో

బిట్టుగా గేకిసల్ కొట్టుకొనును

మూన్నాళ్ళలోనె ఎప్పుడు నేర్చుకొనియెనో

పొమ్మన్నచో చిన్నబుచ్చుకొనును

ముక్కుపచ్చ లారిపోయి ప్రాయము వచ్చి

చదువు సంధ్య నేర్చి బ్రతుకునపుడు

నాదు పసిడికొండ నా రత్నమని తల్లి

పలుకు, పలుకులితడు నిలుపుగాక!

బాల్యంలో పాలబుగ్గల పసి పాపాయిలు తల్లిపై ఆధారపడి క్రమేపి ఎదుగుతారు. నెమ్మదిగా ఆలోచన లు పెరిగి తన వస్తువులను,తనవాళ్ళను గుర్తించే స్థితి అలవడుతుంది.కానీ ఈ బాల్యదశలో శిశువులకి మాన సికవికాసం ఉండదు. తెలిసీ తెలియని బాల్యంలో స్వయంగా మనుగడ సాధించలేక, పరాధీనమై ఉంటుంది. వివేకం ఉదయించని ఈ బాల్యదశలో పిల్లలకు ఆటలే జీవితం. వారితో ఆడుకునే స్నేహితులను, ఆటవస్తువు లను అంటిబెట్టుకుని వాటితో మమే కమై, వాటినే తమ సర్వస్వంగా భావిస్తూ గడిపేస్తారు.ఇలాంటి విషయాల ను అవగతం చేసుకొన్నవాడవటం  గుర్రం జాషువా “మూన్నాళ్ళలోన ఎప్పుడు నేర్చుకొనియెనో, పొమ్మన్నచో చిన్నబుచ్చుకొనును” అనగలిగాడు. ఈ ధరణిపై అడుగిడిన శిశువు మూడు రోజుల్లోనే వియోగాన్ని భరించ లేని తత్వాన్ని నేర్చుకుంటాడనే భావనని వ్యక్తం చేయగలిగాడు.

చిన్న పాపాయిని వర్ణించడానికి సైతం కూడా ఎంతో భారమైన పదాలను వినియోగించి మధురమైన అనుభూతిని కల్గించ గల కవితాశక్తి కలిగిన వాడు జాషువా అని ఈ పాపాయి పద్యాల రచన ద్వారా వ్యక్తమవు తున్నది.

ఇకపోతే మహాకవి గుర్రం జాషువా రచించిన నాలుగు పాపాయి పద్యాలను సంగీత దర్శకుడు, ఆంధ్రుల అమర గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు నాలుగు విభిన్న రాగాల్లో స్వరపరచి గానం చెయ్యటం తెలుగువారి అరుదైన అదృష్టమే. సంగీత,సాహిత్యాలు సరస్వతీ దేవి నేత్రద్వయమైతే అందులో ఆపాత మధురమైనది సంగీతమైతే, సాహిత్యం అనేది ఆలోచనామృతం. అందునా సాహిత్యానికి తగ్గ సంగీతం, సంగీతానికి దీటైన సాహిత్యం రెండూ పోటాపోటీలుగా కలవటం అరుదైన విషయం. ఘంటసాల.ఇన్ఫో http://ghantasala.info/ అనే సైట్ లో గానం చేసిన పాపాయి పద్యాలు ఉచిత దిగుమతి సౌకర్యంతో  అందుబాటులో ఉన్నాయి. ఈ పద్యాలు చక్కగా వినసొంపుగా ఉన్నాయి.

తన రచనలద్వారా తను జీవించిన కాలంలోనే అనేక మంది యువకులను, మేధావులను ప్రభావితం చేసిన కవి. నేటికీ ఎంతో మందిని తన రచనల ద్వారా ప్రభావితం చేస్తున్న జాషువా సాహిత్యం సామాజిక స్రవంతికి ప్రతిబింబం.అందువల్లనే ముద్దు ముద్దు మాటలతో, చిలిపి అల్లరి చేష్టలతో ఇంటిల్లిపాదినీ అలరించే, ప్రకృతితో సహా అందరి ప్రేమకు అర్హులైన పసి పాపాయిల హృదయాన్ని ఎంతో సునిశితమైన పరిశీలనా దృక్పథంతో ఇంత గొప్పగా ఆవిష్కరించగలిగాడు.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *