May 6, 2024

వీర ప్రేమ

రచన : శ్రీధర్ అయల

ఇరవై సంవత్సరాల నిండు విగ్రహం ! పొడవుకి తగిన శరీర పుష్టి, పుష్టికి తగిన అవయవాల బిగి, బిగికి తగ్గ లాఘవం , లాఘవానికి తగిన కౌశలం ! కలిగి ఉన్నాడు ‘వీరం దొర’.

క్రూర మృగాలకి వీరందొర సింహస్వప్నం. భీకరమైన వాని శరీరాలయంలో మెత్తని ప్రేమ పూరిత హృదయం దాగుంది. వాని విశాల రక్తాంత నయన కోణాలలో కరుణ నిండి ఉంది.

అప్పుడు మిట్ట మధాహ్నం ! నభోమణి మధ్యంలో నిప్పులు చెరగుతున్నాడు. పశువుకి మృగాదులు చల్లని జాగాలో చేరుకొని విశ్రాంతిని అనుభవిస్తున్నాయి. పక్షిగణం ఆకు -జొంపాలలో కువకువలాడు తున్నాయి.

నల్లసాని రాయివలె నిగనిగలాడుతున్న దొర విశాల వక్ష స్థలం చెమట బిందువులచే అలంకరింపబడి వీరలక్ష్మి యొక్క పాద పీఠంలాగ ఉంది. జీడి నూనె పట్టించి , కొమ్ము పన్నెతో దువ్వబడిన కేశాలు ఎత్తి శిరోపరి భాగంలో ముడివేయబడి , రంగు రంగు పక్షి ఈకల్తో మెరసిపోతోంది !కటి ప్రదేశానికి బిగించి కట్టిన ముతక ధోవతి సిలకట్టు , మొలలో దోపుకొన్న ఒరతో కూడిన బాకు, ప్రక్కన వ్రేలాడుతున్న పదునైన గొడ్డలి, చేతిలో నల్ల త్రాచువలె భయంకరమైన విల్లు, వీపుపై నల్లని దట్టీతో బిగించి కట్టబడిన అమ్ముల పొది కలిగి ‘ వీరందొర’ ,భిల్ల వేషంలో అర్జునునికి ప్రత్యక్షమైన సాంబశివుని వలె ఉన్నాడు !

ఒక పెద్ద చెరువులో తామరలు, కలువలు నిండి ఉన్నాయి. చెరువు ఒడ్డున శాఖోపశాఖలతో మర్రిచెట్టు సగం చెరువుని తన ఛాయలో ఇముడ్చుకొని గంభీరంగా ఉంది ! చెట్టు మొదట ఒక బండ రాయి అరుగు వలె ఉంది.దానిపై ఆశీనుడయ్యాడు వీరందొర.

వీరందొర వెదురు కోలల్ని తయారు చేస్తున్నాడు. వాని చేతులు పనిచేస్తున్నాయి, కాని వాని హృదయం ఈ పనిలో ఇమడకుండా ప్రత్యేకమైన పని చేసుకొంటోంది.

అది ( మనస్సు) ఒక మనోహర రూపాన్ని చిత్రీకరణ చేసుకొంటోంది ! ఆ మధుర చిత్రీకరణలో హృదయ దర్పణ గతమైన రూపం యొక్క ఒక్కొక్క అంగం ప్రతిఫలించింది.శరీరం పండిన నిమ్మపండు, దాంట్లో ప్రవహించే తరంగ మాలినీ ఝురి అభ్రగంగా సదృశం ! ముఖం చంద్ర సదృశమై మృదు మధుర కమనీయం !

కన్నులు తామర దళాల వలె మనోహర తేజోపూరిత రమణీయం ! నాసిక కండ్ల ఔన్నతిని చాటుటకై ఉన్నతమై గంభీరాకృతి దాల్చి దర్శనీయం ! పెదిమలు మాణిక్య కాంతి సముజ్వలమై మకరంద రస ప్రపూరితం !

వీరందొర మత్తెక్కిన చూపులు హృదయకుహరంలో చిత్రీకృతమైన ఇట్టి రూపాస్వాదనలో లోనమై పోయాయి

“మావా ! మావా ! ” అని వెనకనుంచి ఒక కిన్నెర కంఠం వినిపించింది.

“బిగువుగా ఉండాల — చూస్తాం కదా , సిక సంగతి !” అని తనలో తలంచి నవ్వుకొన్నాడు వీరందొర.

ఒక పడుచు వీరందొర వెనుక భాగానికి సమీపంలో వచ్చి నిలిచింది. ఆమెయే వాని హృదయ ఫలకంలో చిత్రితమ అందాల బాల !

“ మావ మా చెడ్డ కోపంగా ఉండాడు — నాకేం పోతాదంట ?” అని లోపల శబ్దించుకొంది రత్తి.

రత్తి మెల్లగా దొరని సమీపించింది.  వాని దగ్గరగా బండరాతికి చేరవేయబడిన విల్లి అందుకొంది ! నెమ్మదిగా అంబుల పొదిలోని వెదురు కోలని లాగింది ! విల్లుి వంచి  నారి ఎక్కుపెట్టింది, బాణాన్ని వింట తొడిగింది !

దొర ఓర కంటితో గమనించి, మందహాసం చేసాడు.

“ మావా ! ఓ కాసుకో ! కోల దూసుకు వస్తాది !” అంది రత్తి.

“ కాసుకొనే ఉన్నానే సిలకా ! ఆ కోలకే !” అన్నాడు దొర.

రత్తి కిలకిలా నవ్వింది. దొర హృదయ వీణాతంత్రులు స్పందించాయి.

“ మావా ! ఓ వెర్రి మావా ! రత్తి కోల ఏం సులకనా ?”

“ కాదే సిలకా ! దాని వేగం నాకంటే ఏరికే తెలుసు ?”

రత్తి విల్లుని మర్రిఊడకి తగిలించి , కోలని పొదిలో దోపి, దొరకి ఎడం ప్రక్కన మూతి ముడుచుకొని కూర్చొంది.

“ ఏం రత్తీ ! కోపమా ?”

“కాక మరేంది, అస్తమానం సిలకా, సిలకా అంటావు–”

“ పోనీయే ‘రత్తీ’ అని పిలుస్తాలే !” అని అంటూ దొర రత్తికి దగ్గరగా వచ్చాడు.

“ అదుగో మావా ! దగ్గరగా రాబోకు —”

“ ఏవంటా ?” అని బిగుసుకొని కూర్చొన్నాడు దొర.

“ అదో అప్పుడే కోపం ! నాను కన్నెపిల్ల కాదా మావా ?”

“ రత్తీ ! మనం పెండాడేద్దాం !”

రత్తి కిలకిలా నవ్వింది. ఆ నవ్వుల ధాళధళ్యం దొర హృదయంలో వెలుగు పుట్టించింది !

“ అయ్యో ! వెర్రి మావా ! మన పెండ్లి అయిపోయింది కాదా ?”

“ ఎప్పుడే రత్తీ ?”

“దుర్గ గుల్లో నాను పైట వేసిన రోజు, నాను నీ మెడలో మాలవేసా ! నీవుండావే నా మెల్లో మాల వేసి —” అని సిగ్గుతో కుంచించుకొని పోయింది ఆమె.

“ మరి ఇంకేం ?” అని రత్తి చెయ్యిని పట్టుకొని లాగాడు దొర.

రత్తి యీండ్రపడుతూ “మావా ! నీవు గండడివి కదూ ?” ప్రశ్నించింది

“ అవునే నూరు పాళ్లూనూ.” అన్నాడు తన నూగు మీసాలని దువ్వి.

“ గండడివైతే నా కోర్కె తీర్చి — తరువాత — నీ ఇష్టం !” అని తల దించుకొంది.

“రాణి కోరుతాది, రాజు తీర్చాలి ! ప్రాణం ఇచ్చి తీరుస్తా రత్తీ” అన్నాడు గుండె చరచుకొని దొర.

“రత్తి దొర చెవిలో గుస గుసలాడింది. –“ మాఁవా ! అదే నాను కోరేది, నాలు చణాలు చాలు

“ మాఁవా ! సరా,  మాఁవా !” అని తన కోర్కెని వ్యాఖ్యానం చేసింది.

“అమ్మ దొంగా ! ఎంతేసి కోరిక కోరావ్ !తల పోయే పనే!నా రత్తి ప్రాణం ఇస్తానే ” అని దొర రత్తిని చంటి పిల్ల వలె తన గజ సుండాలోపమ బాహువుల్తో ఎత్తాడు!

రత్తిని వీరం దొర తన గుండెకు అదుముకొన్నాడు. నున్నటి చెక్కిళ్ల మీద  తన ప్రతి బింబాన్ని చూసుకొని మురిసి పోయాడు! ఆమె  తన వెలుగుని చిలకరించాడు! ఉక్కువంటి తన శరీరంలో ఆ పుష్ప సుకుమార శరీరాన్ని నిర్భయంగా అదుముకొన్నాడు. రత్తి కొప్పు విడిపోయి క్రిందికి కాల సర్పంలాగ జీరాడింది. ఆమె కంఠం లోంచి తియ్యని నాదం, పొంగిన ఏటిలో బుడగల్లాగ ఉబికి, శబ్దించింది. ఆ నాదంలో వీరందొర శరీరంలో మధురానుభూతి చెలరేగింది.

“ మాఁవా ! చాలు  మాఁవా ! క్రిందకి దించేయి  మాఁవా !” అని రత్తి దొర కంఠానికి తన బాహు వల్లరని తగిలించి బుజ్జగించింది ప్రశాంతంగా

ఇంతలో టక టకమని రత్తిని మెల్లగా క్రిందకి దించి, వీరందొర చప్పుడు వచ్చిన వైపు పరికించి  చూసాడు !

బాణాల వలె దూసుకొంటూ అశ్వ దళం వస్తూంది

**********************

పై సంభవం జరిగి పదిహేను రోజులు దొర్లిపోయాయి.

అప్పుడు సంజె చీకట్లు దట్టంగా నాలుగు మూలలా అలముకొన్నాయి. సూర్యుడు అస్తాద్రి మరుగున చొచ్చిపోయాడు! అమావాశ్య మొదటి ముందటి రోజు కాబట్టి చుక్కల రేడు పొడవలేదు. చుక్కలు మాత్రం నిర్మలాకాశంలో వజ్రపు తునకల వలె మెరుస్తున్నాయి !

చల్లని గాలి వేప పువ్వుల పరిమళాన్ని తెచ్చి నలుమూలలా నింపుతూంది. దుర్గ గుడి వేప చెట్ల మధ్య ప్రశాంతంగా ఉంది.

ఒక జంట వేప చెట్టు క్రింద కూర్చొని మాట్లాడుకొంటోంది !

“ మాఁవా !నా కెంతో భయమేసింది, ఆ రోజు —” అంది రత్తి.

“ప్రక్కన రాజు నెట్టుకొని భయమేందే పిలా !” అన్నాడు వీరందొర.

“వూరి లోని వారంతా మన గుడిసెల వైపు పరిగెత్తుకొని వచ్చేరేందీ?”

“ఆడ పిల్లవు నీకేం తెల్సు ? యుద్దమే రత్తీ, యుద్ధం –”

“వూళ్లో వాళ్లు కొట్టుక ఛస్తుండరా, మాఁవా ”

“ఇజయనొగరం మారాజుకి, గజపతి మారాజుకి బెడిసిందట– ఇజయనగరం వోళ్లు,– అది కోట కాదే,

రత్తీ ! ఉక్కు ! ఉక్కు !! లోపలికి వెళ్లనొసమా ? ఈళ్లకి నోళ్ల సత్తువే గాని, జబ్బ సత్తువ లేదే పిల్లా !”

“అయితే  మాఁవా ! నీవేంది ఊరకొంటావ్ ? జబ్బ సత్తువ చూపరాదా ?”

“నా కోరిక ఇజయనగరం మారాజు తీరుస్తే, నా సత్తువ చూపిస్తా, చిటెకెలో కోట తలుపులు తీసెయ్యనా !”

“ నీ కోరికేంటో?”

“నా కంటూ ఏ కోరికా లేదే పిల్లా ! నీ కోరికే నాను కోరేది !”

వీరందొర రత్తి కౌగిట్లో కరిగిపోయాడు !

అప్పుడు ఇద్దరు మనుష్యులు వారి కెదురుగా వచ్చి నిల్చొన్నారు . సింహం వలె లేచాడు వీరందొర !

లేచాడో లేదో వాని చేతిలోని బాకు తళుక్కుమని మెరిసింది. రత్తి బుస్సు పెడుతూ కోడెనాగు వలె లేచింది. ఆమె చేతిలోనూ బాకు మెరిసిపోయింది !

“ యువ దంపతులారా ! మీ బాకులు మొలలో దోపండి. మేము మీకు విరోధులం కాదు. మీ స్నేహితులం–” అన్నాడొకడు.

దొర తన బాకుని మొలలో దోపుకొన్నాడు. రత్తి వాని చాటున నిలబడింది.

“వీరందొరా ! మాకు కొండవీడు దుర్గాన్ని వశం చేయగలవా ? నీవు కోరిన కోర్కె ఏదైనా సరే చక్రవర్తి గారు తీర్చగలరు–”

“ పెరుభూ ! రేపు అమావాశ్య ! రాత్రి– కోడితొలి కూత కూసేలోగా — నాను కోట తలుపుల్ని తెరుస్తా ! దుర్గమ్మ తోడు ! కాని నేను కోరింది–”

“ తప్పకుండా తీరుస్తాం , వీరం దొరా ! నీ కోరిక ఏదో చెప్పుఅది డబ్బుగా ఉంటే ఇప్పుడే ఇస్తాం. ఎంతైనా సరే —”

వీరందొర గుండెల కడ్డంగా చేతులు పెట్టుకొని గంభీరంగా నిలబడి—

“ పెరుభూ ! డబ్బుకు విలువేంది ? నా ఎత్తు డబ్బు పోసినా నాకొద్దు మారాజా !– ఇదిగో రత్తి  ! ఇఅది నా గుండెకాయ ! ఇది కోరింది తీర్చాల—”

“ అదేదో చెప్పవోయ్ !”

వీరందొర కొన్ని అడుగులు వెళ్లి తన ప్రేయసి కోర్కెని సన్నని స్వరంతో చెప్పాడు !

అతడు మేఘ గంభీర నినాదం వలె బిగ్గరగా నవ్వి —

“ వీరందొరా ! ఇదేనా నీ ప్రియురాలి కోరిక ! చక్రవర్తి తరఫున నెను వాగ్దానం చేస్తున్నాను విను. తప్పకుండా నీ ప్రియురాలి కోరిక తీర్చబడుతుంది. ” అని వీరందొర  చేతిలో చెయ్యి వేసి చెప్పాడు.

ఆ చేతికున్న ఉంగరాల పొళ్ల కాంతి జిగేలుమని మెరిసింది.

************************

అమావాశ్య రోజు—

మహారాజాధిరాజ, రాజ పరమేశ్వర, మూరు రాయర గండ, శ్రీ శ్రీ శ్రీ దేవ రాయల సేనా వాహిని కొండవీడు దుర్గాన్ని అర్థ చంద్రాకారంగా చుట్టు ముట్టింది !

ఆ రోజు ప్రాతఃకాలానికి కోటని పడగొట్టే ప్రయత్నాన్ని విరమింప జేసాడు శ్రీకృష్ణ దేవ రాయ చక్రవర్తి !

దాని కారణాన్ని ఊహించలేక తబ్బిబ్బులవుతున్నారు దండనాధులు ! ఎవరికిని చక్రవర్తిని కారణం అడిగే సాహసం లేదు !

గుడారాల్లో గానాలు, భరత నాట్యాలు, గాన సభలు జరుగుతున్నాయి ! సైనికులు మహోత్సాహంతో ఈ వేడకల్లో పాల్గొన్నారు.

రాత్రి మొదటి ఝాము గడచింది. దళపతులు తమ తమ సైనికుల్ని ఈ విధంగా హెచ్చరిక చేస్తున్నారు !

“ఆంధ్ర వీరులారా ! ఈ రోజు తెల్లవారేలోగా మన సైన్యం దుర్గ ప్రవేశం చేసి తీరాలని చక్రవర్తి ఆజ్ఞ ! వారే స్వయంగా గజ యూధాన్ని నడిపిస్తారట ! దుర్గ ప్రవేశం ముందుగా చేసిన వారందరికీ విశేషంగా బహుమతులు ఇవ్వ బడుతాయి ! మీరు ఆంధ్రుల కీర్తి పతాకలతో పాటు , విజయనగర వీర వరాహ పతాకని ఎగురవేసే రోజు ఇది ! సూర్యోదయంతో పాటు మన వీర వరాహావతారం కొండవీడు దుర్గంపై ఉదయించాలి !

ముట్టడి ప్రారంబమయింది !

చక్రవర్తి అధినేతృత్వంపై గజయూధం నల్లని మేఘ మాలికల వలె పయనించింది ! విజయనగర విలుకాండ్రు వానజల్లు వలె వర్షం బురుజులపై కురిపిస్తున్నారు.

ఏనుగులు ముందుకి సాగుతున్నాయి ! వాటి పైనే ఉన్న విలుకాండ్రు విల్లు వంచి బాణాల్ని మెలకువతో వదులుతున్నారు.

సైనికులు బ్రహ్మాందమైన దూలాన్ని కోట తలుపులకి తాటించి బాదుతున్నారు. వీరి ప్రయత్నాన్ని సడలించడానికి కోటలోని వీర బృందం సల సల మరుగుతున్న చమురు పైనుండి వంపుతున్నారు. ముట్టడి భయంకర రూపం దాల్చింది !

********************

వీరందొర చీకటి పడగానే తనను తాను ముస్తాబు చేసుకొన్నాడు. ఒక చేత ఈటె, ఇంకొక చేత భయంకర కృపాణం ధరించాడు. తోలు దట్టీని కట్టుకొన్నాడు. పండ్రెండు బాకులు పేర్చిన పటకా బిగించాడు. చీమలు కరచినా బాధించకుండా ఉండేందుకు శరీరమంతా  కొన్ని మూలికా ద్రవ్యాలతో వండబడిన చమురు రాసుకొన్నాడు.త్తలకి నల్లని తలపాగా కట్టుకొన్నాడు. కొన్ని విష హరమైన మూలికల్ని తలపాగాలో పదిలం చెసుకొన్నాడు. రెండు బలమైన త్రాటి చుట్టాల్ని వీపుకి కట్టుకొన్నాడు.

ఇట్టి వేషంతో వీరందొర సింహ గమనంతో రత్తి ఉన్న గుడిసెకి దారి తీసాడు !

గడప ముందర రత్తి తల్లి దుర్గమ్మ కూర్చొని ఉంది !

“అక్కోయ్ ! రత్తి ఉండాదా?”

“ ఒలే రత్తీ ! మాఁవ వచ్చిండు —” అని కేక వేసింది దుర్గమ్మ.

“గుడిసెలోనికి దూరాడు వీరందొర.

“ మాఁవా ! ఇదేం వేషం ?” అడిగింది రత్తి.

“ ఇదేనే సిలకా ! యుద్ధ వేషం –” అన్నాదు వీరందొర.

రత్తి కండ్ల నీరు తిరిగింది ! గత రాత్రి విషయం ఆమెకి గుర్తుకి వచ్చింది. అపాయం శంకించింది ఆమె నిర్మల హృదయం–దుఃఖం పొంగి పొర్లింది. దొరని కట్టుకొని బావురుమని ఏడ్చింది రత్తి !

వీరందొర కండ్లు చెమ్మగిల్లాయి. ఆ ధీరుని విశాల వక్షం ఉబికింది ! రత్తి కన్నీటిని పెదిమలతో తుడిచాడు.

“గుడిసెలోనికి దూరాడు వీరందొర.

“ మాఁవా ! ఇదేం వేషం ?” అడిగింది రత్తి.

“ ఇదేనే సిలకా ! యుద్ధ వేషం –” అన్నాదు వీరందొర.

రత్తి కండ్ల నీరు తిరిగింది ! గత రాత్రి విషయం ఆమెకి గుర్తుకి వచ్చింది. అపాయం శంకించింది ఆమె నిర్మల హృదయం–దుఃఖం పొంగి పొర్లింది. దొరని కట్టుకొని బావురుమని ఏడ్చింది రత్తి !

వీరందొర కండ్లు చెమ్మగిల్లాయి ! అతని విశాల వక్షం ఉబికింది ! రత్తి కన్నీటిని అరను పెదవులతో తుడిచాడు వీరందొర! ఆమె కురుల్ని నిమురుతూ అన్నాడు ! “రత్తీ ఏడవకు, నా గుండె పగిలి పోతుండాది ! నన్ను చూసి నవ్వవే రత్తీ ! జనమ సాసువతం కాదే ! మనం చేసే పనులే సాసువతమే రత్తీ ! ఈ శరీరం ఒకనాడు కట్టేమీద కాలిపోతాది ! మన కర్మే నిలిచి ఉంటాది. నేను వీరుణ్ని, దొరబిడ్డని ! చావుకి బయం పొందమంటవా రత్తీ ? నన్ను తిలకం పెట్టి పంపవే ! దుర్గమ్మ తోడు — మారాజుకి మాట ఇచ్చా, ప్రాణం పోతే పోతాది కాని వీరందొర మాట పోదు” అన్నాడు వీరందొర.

“మాఁవా ! నేనూ దొర బిడ్డనే, మాఁవా ! నీ రత్తి నీవెక్కడ ఉంటే అక్కడే ఉంటది . ఇదుగో, నా ముద్దు మాఁవా !” అని రత్తి నూనె ఓడుతున్న మాఁవ శరీరాన్ని తనివి తీర కౌగలించుకొని వాని చెక్కిళ్లని మార్చి మార్చి ముద్దు పెట్టుకొంది !

ఆర్ద్ర నయనాలతో, దస ప్రపూరితమైన సింధూరాధరములతో, చక్కగా నవ్వింది ! మొల లోని బాకు తీసి తన కుడి చేతి బొటన వ్రేలిని సన్నగా చీరి , వీరందొర నుదుట బొట్టు పెట్టింది–వీరబాల రత్తి ! వీరందొర మరొకమారు తన ప్రాణాధిక ప్రేయసిని బిగి కౌగిట సంభావించి గిర్రుమని తిరిగి కొండవీటి దుర్గం వైపు నడక సాగించాడు.

వీరందొర తిన్నగా దుర్గ గుడికి వెళ్లాడు.

తాను తెచ్చుకొన్న కర్పూరాన్ని దుర్గ ముందర వెలిగించాడు. సాష్టాంగంగా నమస్కరించి , లేచి నిలబడి అన్నాడు,“ దుర్గమ్మ తల్లో ! నీ బిడ్డని, దీవిమ్చు, నాను రత్తి కోరిక తీర్చేందుకు వెళ్తున్నా తల్లో ! నాకు శక్తి పెసాదించు, నా రత్తిని కాపాడు !”

కర్పూరపు జ్వాలలో దుర్గ కంద్లు జ్వలించాయి !

చీకటి బాగా వ్యాపించింది.

వాతావరణం కూడా ప్రేయసి కోర్కెని తీర్చడానికి వీరందొరకి అనుకూలమయింది !

తూర్పు మెరసింది. దాంతో పాటు ఉరుము, దాన్ని అనుసరించి చండ మారుతం, వాతాన్ని అనుసరించి, కారు మబ్బుల కదలిక ! నింగి అంతా అల్లకల్లోలంగా ఉంది.

వీరందొర సముద్రంలో తిమింగళం వలె ఆ కారు చీకటిలో దూసుకొని వెళ్తున్నాడు !

దొర కొండ వెనుక నుండి ఎక్కడం ప్రారంభించాడు. ఒక ప్రక్క ఈటెతోను, మరొక ప్రక్క కృపాణం తోను, బలంమైన విగా నేలని గ్రుచ్చి, ఒక్కొక్క అడుగు వేస్తునాడు అతను.

ఒక చదును జాగాని చేరుకొని నిలబడి, కండ్లు చిట్లించి చూసాడు ! నున్నటి రాతి గోడ– సహజ సిద్ధమైనది, అడ్డు తగిలింది, ఆ మహావీరునికి

వీరందొరకి ఆ ప్రాంతమంతా కొట్టిన పిండి. అక్కడ ఉండే ఒక్కొక్క రాయి వానికి తెలుసు. ఒక మెరుపు మెరిసింది. ఆ వెల్తుర్లో తాను వచ్చిన స్థలం అనుకూలమయినదని పసి గట్టాడు !

వీపుకి కట్టుకొన్న త్రాటి మట్టను తీసాడు. త్రాటికి ఉరి వలయం బిగించాడు. కొన్ని గజాలు వెనక్కి తగ్గాడు. అప్పుడు మళ్లీ మెరిసిన మెరుపు వెలుగులో వానికి కోట బురుజు నిటారుగా కన్పడింది. వలయాన్ని బలంగా త్రిప్పాడు, “జయ దుర్గా !” అని ఉచ్ఛరించి బురుజు మిదకి త్రాడు విసిరాడు.

రివ్వుమని త్రాటి వలయం బురుజుకి తగులుకొంది. వీరందొరకి ‘గిరి’ అనేది జన్మ సిద్ధమైన విద్య !

కొన్ని నిముషాలలో కోట గోడపై కాలుమోపాడు వీరందొర ! దీర్ఘమైన నిట్టూర్పు వదిలి దుర్గకి చేతులెత్తి మ్రొక్కాడు. క్రిందకు చూసాడు. కోట లోని హడావుడి వానికి కన్పించింది. వేలకొలది కాగడాలు కన్పించాయి. తాను నిలుచున్న చోటుకి తిన్నగా క్రిందకి చూసాడు. ఆ చోటు నిశ్శబ్దంగా చీకటితో మంతనం చేస్తూంది.

వీరందొర మరొక త్రాటి చుట్ట విప్పి, బురుజుకి బిగించి క్రిందకి త్రాటిని వేసేసాడు ! దాని సహాయంతో కోట లోపలి భాగానికి వచ్చి నిలుచున్నాడు మహాసాహసి దొరబిడ్డ !

గోడ ప్రక్కనే మెల్లగా అడుగులు వేసుకొంటూ నడిచాడు. –దొర– కొన్ని గజాలు నడక సాగించాడు.

ఎదురుగా కాపలాదారు కవచ ధారియై వస్తూండడం గమనించాడు !

వీరందొర మొలలోని బాకుని తీసాడు ! వస్తున్న సైనికున్ని గురిచూసి ‘జ్య్ దుర్గ’ అని బాకుని విసిరాడు! ఆ బాకుతో పాటు సైనికిడు క్రిందకి దొర్లాడు. వాని ఊపిరి అనంతంలో కలిసింది. ఆ సైనికుని దుస్తులని తాను ధరించి కోట లోని సైనికుల మధ్య చొరబడ్డాడు.

కోటలో హాహాకారాలు మిన్నుముట్టాయి ! శత్రువులు ! శత్రువులు ! కుట్ర, కుట్ర !” అని అరుస్తున్నాడు సింహ ద్వారాన్ని కాపాడుతున్న దళపతి.

వాని అరుపు హఠాత్తుగా ఆగిపోయింది ! కారణం ? వీరందొర అజేయమైన బాకు వాని కంఠ నాళంలో లోతుగా గ్రుచ్చుకొంది. దళపతితో పాటు సైనికులు బెదరిన కుందేళ్ల లాగు, “ శత్రువులు, శత్రువులు కోటలోనికి వచ్చారు” అంటూ కేకలు వేస్తునారు !

వీరందొర మెరుపు వలె నాలుగు ప్రక్కలా ఖడ్గచాలనం చేస్తున్నాడు. శిరస్సులు శరీరాలనుంచి వేరగుతున్నాయి ! వందల కొలది శత్రు సైనికులు కోటలో చొరబడ్డారని భ్రాంతిని పుట్టించాడు, ఆ ఆంధ్ర వీర యువకుడు !

వీరందొర సింహద్వారం యొక్క తలుపుల దగ్గరకి వచ్చాడు. పంటితో కత్తిని కరచుకొన్నాడు ! కుడి కాలుని ఒక బలమైన మేకుకి దన్ను పెట్టాడు ! తన భూజాన్ని తలుపుల అడ్డు దూలానికి ఆనించి ‘జయ్ దుర్గ’ అని మీదకి నెట్టాడు !

ఫెళ ఫెళమనే శబ్దంతో అడ్డు దూలం మీది కెగసి క్రిందకి పడింది !! చేత్తో కత్తిని పట్టుకొని అడ్డు గొలుసుల్ని బలంగా మోదాడు వీరందొర ! శత్రు సైనికులు తండోప తండలుగా వీరందొరపై విరుచుకొని పడ్డారు.

తొలి కోడి కూసింది !!!

శ్రీ కృష్ణ దేవరాయల గజ యూధం కొండవీటి దుర్గం లోకి చొరబడి పోయింది !!

గజ యూధం వెనక విజయనగర సేనావాహిని కృష్ణానదీ ప్రవాహం వలె చొరబడింది.

భయంకరమైన దొమ్మి యుద్ధం చెలరేగింది !

విజయనగర సామ్రాట్టు అన్ని మూలలా తానై సైనిక చాలనం కావించాడు !

వీర వరాహ పతాక జయఘోషల మధ్య కొండవీటి దుర్గంపై రెప రెప లాడింది !!

**************

చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు వీరందొర ప్రక్కగా నిలబడి ఉన్నాడు ! చుట్టూ దళపతులందరూ బారులు తిరి నిలబడి ఉన్నారు ! వీరందొర శరీరం అంగుళమైనా ఖాళీ లేకుండా గాయాలతో నిండి, మోదుగ చెట్టు పూచినట్లు బాలార్కుని కిరణాలలో మెరిసి పోతోంది !

ఆ వీర యువకుని సుందర వదనంలో బాధతో కూడిన హాసం నెలకొంది !“ దండాలు– మా–రాజా ! మాట –నిల–బెట్టు–కొన్నా !మీ –మాట–మాట–”అని పల్కాడు వీరందొర.

చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు , మహామంత్రి అప్పాజీని చూసి, “అప్పాజీ ! ఈ యువకుని త్యాగం నిరుపమానం ! తన ప్రేయసి కోర్కెని తీర్చడానికై ఈ వీర మహావీర సింహం బలి అయిపోయింది. రత్తి కోర్కె చాల అల్పమయినది, కాని ఆమె ప్రియుని త్యాగం మహత్తరమైనది ! వెంటనే ఏడు వారాల నగలతోనూ, పట్ట మహిషి ధరించే మణిమయ కిరీటంతోనూ, రత్తిని అలంకరించి తీసుకొని రండి. ఈ వీర సింహం తన ప్రేయసిని ఆ వేషంలో చూడడానికే శ్వశిస్తూంది !” అన్నాడు.

రత్తిని ఏడు వారాల నగలతోను అలంకరించారు. బంగారు జరీ చీర కట్టబెట్టారు. ఆమె శిరస్సుపై నవరత్న ఖచితమైన కిరీటాన్ని ఉంచారు !

తన రూపాన్ని నిలువుటద్దంలో చూసుకొని మురిసి పోయింది ఆ అమాయిక బాలిక —రత్తి !!

అప్పుడామె రూపం త్రైలోక్య సామ్రాజ్యాన్ని శాసించు ప్రపండ — చండి– ఇంద్రాణి వలె అందరినీ ఆశ్చర్యంలో ముంచింది !

“ నా మాఁవ ఏడుండాడు ?” అని  రత్తి ప్రక్కనున్న చేటిని ప్రశ్నించింది !

అందరూ గుస గుసలాడుకొన్నారు !

“అమ్మగారూ ! మీ మావ ఇక్కడే దగ్గరలో ఉన్నారు–” అంది ఆమె.

ఇంతలో ఒక చేటిక పరుగు పరుగున వచ్చి–“ రత్తమ్మగారిని ఏడు వారాల నగలతో   వెంటనే తీసుకొని రమ్మని, మహామంత్రి తిమ్మరుసుల వారి ఆజ్ఞ !” అని చెప్పింది.

రత్తి మనస్సు కీడుని శంకించింది !

ఆమె వెంటనే తన చిన్న బాకుని తీసుకొని తన గుండెల్లో లోతుగా గ్రుచ్చుకొని , పైట కప్పుకొంది. క్షణ క్షణం వక్షోభాగం రక్తంతో ఎరుపెక్కుతోంది !

ఈ సంభవాన్ని ఎవరూ గమనించలేదు !

***************

“ మాఁవా ! నన్ను చూడు  మాఁవా ! ఏడు వారాల నగలతో వచ్చాను మాఁవా ! నా కోరిక నెరవేరింది మాఁవా !” అని దొర దగ్గరగా నిలబడి ఆక్రోశించింది రత్తి.

వీరందొర కండ్లు విప్పి మందహాసంతో —

“ర–త్తీ ! వీర సొరగం–ఎళ్తున్నా ! నా –అందాల –అందాల –రాశిని  చూసా-! నీ –కోరి -కా, మారాజు– కోరికా– నెరవేర్చా !!!” అని అన్నాడు. తృప్తిగా.

“ మాఁవా ! వీర సొరగం ఒంటరిగా పోమాక ! నీ రత్తి నీ వెంట వస్తాది  మాఁవా !  మాఁ –వా !–” అని ఎలుగెత్తి పలికి వీరబాల రత్తి, దొర గుండెలపై దొర్లి పడిపోయింది !!!

ఆ వీర మిథునం ప్రాణాలు అనంతంలో కలిసి పోయాయి !!! చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు కొనగోటితో తన కన్నీటిని ఎగజిమ్మి ఆ వీర మిథునానికి సైనిక అభివాదం కావించాడు !

అందరూ తమ ప్రభువుని అనుసరించారు .

 

**************

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *