May 3, 2024

మురిసేవు విరిసేవు ముకురమ్ము జూచి – అమర (నటనా) శిల్పి (నాగేశ్వర) జక్కన్న

రచన: జెజ్జాల కృష్ణ మోహనరావు j.k.mohanrao

తెలుగు ఛందస్సుకు శార్దూలవిక్రీడితములాటి వృత్తములు సంస్కృతమునుండి సంక్రమించినవి. కందములాటి జాతి పద్యములు ప్రాకృత, సంస్కృత కన్నడములనుండి వచ్చినవి. సీసము, ఆటవెలది, తేటగీతి లాటి ఉపజాతులు తెలుగు భాషకు ప్రత్యేకములు. ఇవి దేశి ఛందస్సులు. అదే విధముగా ద్విపద కూడ తెలుగు దేశములో పుట్టినదే. శతాబ్దాలకు ముందు తెలుగు శాసనాలలో ద్విపద గలదు. రెండు ద్విపద పాదములు చేరిస్తే మనకు తరువోజ లభిస్తుంది.

సామాన్యముగా పద్యములు చతుష్పాదులు. కాని ద్విపదకు రెండే పాదములు, అందుకే ఆ పేరు. సంస్కృతములో ద్విపదలు ఉన్నాయి. హిందీలోని దోహా కూడ ఒక ద్విపదయే. కాని తెలుగు ద్విపద ఒక జాతి పద్యము, అనగా దీనికి యతిప్రాసలు ఉన్నాయి. ద్విపదను అంశ లేక ఉపగణములతో నిర్మిస్తారు. ప్రతి పాదమునకు వరుసగా మూడు ఇంద్ర గణములు (IIII, IIIU, IIUI, UII, UIU, UUI – I లఘువు, U గురువు), ఒక సూర్య గణము (UI, III) ఉంటాయి. మూడవ గణముతో యతి. ద్విపదలో ఏ పాదము ఆ పాదమునకు స్వతంత్రముగా నుండాలి. ఒక పదమును సగము మొదటి పాదము చివరలో, మఱొక సగము రెండవ పాదపు ప్రారంభములో ఉండేటట్లు వ్రాయ రాదు. అనగా, ద్విపదకు సంస్కృతములో ఉండేటట్లు, పాదాంత విరామము తప్పని సరి.

నాకు ద్విపద అంటే చాల ఇష్టము. ద్విపదను చక్కగా పాడుకొనవచ్చును. స్త్రీల పాటలు ఎన్నో ద్విపదలో, దాని పాదమునకు రెట్టింపుగా ఉండే తరువోజలో ఉన్నాయి. తరువోజ రోకలి పాటలకు ప్రసిద్ధి. ఉదాహరణముగా ఈ క్రింది పాట ఛందస్సు ద్విపదయే –

కలవారి కోడలు – కలికి కామాక్షి
కడుగుచున్నది పప్పు – కడవలో పోసి
అంతలో వచ్చేను – ఆమె పెద్దన్న
కాళ్ళకు నీళ్ళిచ్చి – కన్నీళ్ళు నింపె

పాడేటప్పుడు చివరి లఘువును సాగించి పాడుట వాడుక. పాల్కురికి సోమనాథునివంటి కవులు ద్విపద ఛందస్సులో కావ్యములనే వ్రాసినారు. బసవపురాణమునుండి కొన్ని పంక్తులు –

వడగాము రామేశు – వరశిష్యు డనఁగఁ
బడు చెన్న రాముని – ప్రాణసఖుండ
సంభవితుఁడ భవి-జన సమాదరణ
సంభాషణాది సం-సర్గ దూరగుఁడ
నలిఁ బాల్కురికి సోమ-నాథుఁ డనంగ
వెలసినవాఁడ ని-ర్మల చరిత్రుండ
నురుతర గద్యప-ద్యోక్తులకంటె
సరసమై పరగిన – జాను తెనుంగు
చర్చింపఁగా సర్వ-సామాన్య మగుటఁ
గూర్చెద ద్విపదలు – గోర్కి దైవాఱ

సోమనాథుడు ద్విపదకు కొన్ని చోటులలో అక్షర సామ్య యతికి బదులు ప్రాసయతిని ఉంచినాడు (వెల – ర్మల) . ప్రాస లేని ద్విపదను మంజరీద్విపద అంటారు. ద్విపదలను యక్షగానములలో కూడ కవులు వాడినారు. పూర్తిగా మాత్రాగణములతో కూడ కొందఱు ద్విపదను వ్రాస్తారు. చిత్రగీతములలో కూడ ద్విపద ఛాయలు అక్కడక్కడ మనకు కనిపిస్తాయి.

గడచినవారము నటసామ్రాట్టు అక్కినేని నాగేశ్వరరావు మరణించినారు. వారు నటించిన అమరశిల్పి జక్కన్న చిత్రములో ద్విపద ఛందస్సులోని ఒక పాట నాకు చాల ఇష్టము. ఇది అరుదుగా వినబడే, ప్రసారించబడే పాట, కాని చాల సొగసైనది. వారి నటనకు జోహారు లర్పిస్తూ ఆ పాటను ఇక్కడ మీ ఆనందముకోసం సమర్పిస్తున్నాను –

చిత్రము – అమరశిల్పి జక్కన్న
రచయిత – సముద్రాల రాఘవాచార్య
సంగీతము – సాలూరు రాజేశ్వర రావు
గాయకుడు – ఘంటసాల వేంకటేశ్వర రావు
సన్నివేశము – బేలూరు చెన్నకేశవస్వామి ఆలయములో తాను మలచిన శిల్పములను జక్కన్న గురువుకు చూపిస్తాడు.

మురిసేవు విరిసేవు – ముకురమ్ము జూచి
మరచేవు తిలకమ్ము – ధరియించ నుదుట
నీ రూపు గన నీకె – పారవశ్యాల
మా రాజు మనసేలు – మరుని తంత్రాల

ఏ కాంతు దరి జేర – ఏకాంత వేళ
ఈ కబురు పంపేవె – ఓ కీరపాణి
చిలకమ్మ కనబోవు – చెలుని పేరేమె
చెలియరో నీ స్వామి – చెన్న కేశవుడ

గోపికలు సేవించు – గోపాల దేవు
రూపుని మురళిని – మోపి కెమ్మోవి
సరసానురాగాల – స్వామి దరిజేరి
సారూప్య మోక్షమ్ము – సాధింతువేమొ

విలు చేత బూనేవు – వీరాల బాల
పలికిరా ఎవరైన – పరిహాస లీల
నవయౌవనము దోచి – నమ్మించిరా నీ
ధవునిపై పగలూని – దాడి జేసేవ

ఆటలను పాటలను – హావ భావముల
నీటులో నీసాటి – నెఱజాణ నీవె
అలరింపగా నిన్ను – ఆనంద లీల
చెలు వెఱుగు కేశవుడు – చేరు నీ వేళ

కౌశికుని మది గొనిన – కలికి మేనకవొ
శ్రీశుకుని దరి కులుకు – చెలి రంభ వేమొ
సరసలయ గతి చూడ – స్వామి రాడమ్మ
పరమాత్ము గను దారి – భక్తి జేరమ్మ

ఈ పాట ద్విపదలో సాగింది. పాట గతి పంచమాత్రల గతి కావున కొన్ని చోటులలో ఇంద్రగణాలకు బదులు పంచమాత్రలు దొరలాయి. చివరి సూర్యగణము వద్ద ఒక విరామము ఉన్నది పాటలో. అదియును గాక అది చతుర్మాత్రగా ఉచ్చరించబడినది. విరామముతో కూడిన చతుర్మాత్రల వలె ఉచ్చరించబడు త్రిమాత్ర పంచమాత్రయే సుమా! అందుకే అంశ లేక ఉపగణాలకన్న మాత్రాగణాలు సంగీతానికి బాగుంటుంది. మంచి పాటకు మంచి ఛందస్సు కూడ అవసరము. సంగీతమును ఆనందించేటప్పుడు, సాహిత్యమును ఎప్పుడు మఱువరాదు.

1 thought on “మురిసేవు విరిసేవు ముకురమ్ము జూచి – అమర (నటనా) శిల్పి (నాగేశ్వర) జక్కన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *