May 3, 2024

మాయా నగరం – 1

రచన: భువనచంద్ర  bhuvana

 

ఆమె కంట్లోంచి ఓ కన్నీటి బిందువు రాలింది. ప్రపంచంలో వున్న విషాదమంతా ఆ కన్నీటి బిందువులోనే దాగుంది. మళ్లీ మరో చుక్క… ఇంకొకటి.. మరొకటి.. బుగ్గలమీద జారుతుండగా తెలిసింది. కాసేపయ్యాక నదిలో నీరు ఇంకినట్టు కళ్ళల్లో కన్నీరు ‘ఇంకి’పోయింది. కళ్ళు మూసుకుని నిర్లిప్తంగా పడుకుంది. వర్షం వెలిసిన భావన. “ఏ వర్షం? ఇది మనసు వర్షించిన వర్షం.. ఆలోచనల మబ్బులు ‘బాధ’ అనే ముసుగు ధరించి వర్షించిన వర్షం ఇది. అశృవులు మనోజనితాలా? అప్పటిదాకా కంట్లోలేని కన్నీరు ఠక్కున ఎలా ఉబికిందీ? భావతీవ్రత వల్ల ఒళ్ళు వేడెక్కి శరీరంలో ఉండే ‘నీరు’ వ్యాకోచించి కళ్ళల్లోంచి వర్షించిందా? ఏమిటీ పిచ్చి ఆలోచనలు? క్షణం క్రితం వరకూ చెప్పలేని బాధ. ఇప్పుడేమో కన్నీరెలా పుడుతుందన్న పిచ్చిప్రశ్న. అయినా ఇది పిచ్చి ప్రశ్న ఎలా అవుతుందీ? ‘గడ్డి’ ఎలా మొలుస్తుందని సమూలంగా చెప్పే సైన్సు ఉండగా కన్నీటి గురించి ఎందుకు రిసెర్చి చెయ్యకూడదూ? ఓ లేబరేటరీ, పిప్పెట్లు, బ్యూరెట్లు, స్పిరిట్ లాంపూ, లిట్మస్ టేస్టులూ,, అవునూ లిట్మస్ పేపర్‌ని ముంచాలంటే చాలా కన్నీరు కావాలి.. ఎంతమంది దగ్గర్నించి కలెక్టు చేస్తే పిప్పెట్టు నిండును?  బ్లడ్ బ్యాంకులాగా ‘టియర్‌బాంకూ మొదలెట్టాలేమో…   అన్నట్టు ‘టియర్‌గేసు’ ఉండిగా.. దాంతో చాలా కన్నీటిని కలెక్టు చెయ్యొచ్చు. No… టియర్‌గేస్‌తో వచ్చే కన్నీరు స్వచ్చమైనది కాదు. అది కేవలం రసాయనిక చర్య వల్ల వస్తుంది. అసలు సిసలైన కన్నీటినే పరీక్షించాలి. స్వచ్చమైన కన్నీటిలో ఏ పదార్థాలు ఉన్నాయో తెలుసుకోవాలి. అబ్బో…! అదీ కష్టమే! ప్రేమవిఫలమైన వారి కన్నీరు.. కాలు విరిగి ఏడ్చేవాడి కన్నీరు.. పరీక్ష ఫేలై ఏడ్చేవారి కన్నీరూ’ఒకటే’ ఎలా అవుతుందీ? దేని కంపొజిషన్ దానిదే.. అవునూ.. ఇంతకీ నన్ను ఏడ్పించిన “విషయాలు” ఎక్కడికెగిరిపోయాయి.. ఆలోచిస్తూ పడుకుంది. చల్లని నిద్రాదేవి కనులమీద వాలింది. నిద్ర ముంచుకొచ్చింది. ఆమె నిజంగా.. నిద్రపోయింది… ఆమె పేరు.. మిస్ శోభారాణీ.. బియ్యస్సీ

 

**********************

   ఆ కిటికీలోంచి చూస్తే గుడిసెలు కనబడతాయి. అమెరికన్లు కిటికీల్లోంచి చూడ్డానికి అలవాటు పడ్డవాళ్ళు. ‘వ్యూ’ బాగుంటే అద్దె ఎంతిమ్మన్నా ఇస్తారుట. యీ గుడిసెల ‘వ్యూ’ని వాళ్లెలా’రేట్’ చేస్తారో .. ఓ పద్యం రాస్తే??

గుడిసె పక్కన గుడిసె

గుడిసె ముందు గుడిసె

గుడిసె ఎనకన గుడిసె

గుడిసేటి దానా…

అవునూ.. ‘గుడిసేటి’ దంటే అర్ధం ఏమై వుంటుందీ? ఏమో అస్సలు తిట్లకి అర్ధాలెందుకూ? ఉక్రోషం వెళ్లగక్కాలంటే ఊతపదజాలం చాలా కావాలి. సరే.. కిటికీ తీస్తే గుడిసెలు బార్లుగా నానావిధ నిర్మాణాల్తోనూ కనిపిస్తాయి. అప్పుడప్పుడు తడిక చాటున స్నానాలు చేసే అతివలూ కనిపిస్తారు. మాంచి.. రొమాంటిగ్గా వుంటాయా సీన్లు. సాయంత్రం అయేటప్పటికి మొత్తం ‘సీను’మారిపోతుంది. వందలకొద్దీ ‘బుడ్డీ’ దీపాలు వెలుగుతూ వుంటాయి. ఆకాశం నుంచి ‘చీకటి’ ముద్దలు ముద్దలుగా జారి పడుతుంటే, యీ బుడ్డి దీపాలు వీరుల్లా ఆ చీకటి ముద్దల్ని ఖండిస్తూ వుంటాయి. వెలుగూ- చీకట్లు దాగుడుమూతలు భలే వుంటాయి. ఆ పక్కనున్న గుడిసేటివాడు రోజూ తాగొచ్చి పెళ్ళాన్ని తంతూ వుంటాడు. ఆ మాత్రం ‘హన్’గన్నా లేకపోతే మందేసిన ‘మజా’ ఏముంటుంది? వాళ్లావిడ సన్నగా చీపురు పుల్లలా వుంటుంది. నిర్లిప్తంగా జీవిస్తుంది. పగలంతా ఆవిడ కళ్లు ఆబగా లోకాన్ని వెతుకుతుంటాయి. చెత్త కాయితాల్ని బస్తాల్లోకెత్తి అమ్మడం ఆవిడ ప్రొఫెషన్. హాబీ కూడా అదే. ఆవిడ కళ్లకి బంగారం, వెండి, వజ్ర వైఢూర్యం కనిపించవు. కనిపించిన ఆవిడ చలించదు. పేద్ద చిత్తు కాయితాల కట్ట’ కనిపిస్తే చాలు, పరమానందభరితురాలై గభాల్న ‘దాన్ని’ గోనెసంచీలో వేసుకుని సన్నగా నిట్టూరుస్తుంది. నిట్టూర్చడం కూడా ఆవిడ హాబీనే. అసలింతకీ ఆవిడ వొండుకుంటుందో లేదో..! వండితే తినాలి. తింటే ఆ వొంటి మీదున్న ఒక్క చీరా చివికి పోదూ..! అయినా ‘వాడి’కోసం వండక తప్పదు. రాత్రి ఏ పదింటికో వాడొస్తాడు. ఏదేదో వాగుతాడు.. మళ్ళీ తాగుతాడు. తాగి వాగుతాడు. వాగుతూ తాగుతాడు.సడన్‌గా జుట్టూ పట్టుకుని ఆవిడ వీపు మీద ఎడాపెడా గుద్దుతాడు. ‘ఏడుస్తుందేమో’ అని కాసేపు ఆగుతాడు. యీవిడ పొరపాట్న కూడా ఏడవదు. “నీ పని పూర్తయిందిగా. తింటావా?” అన్నట్టు చూస్తుంది. మరుక్షణం వాడి ముందర వడ్డించిన కంచం పెడుతుంది.

“దీన్సిగదరగ.. ఒక్కసారన్నా ఏడిచ్చావదు” అని గొణుక్కుంటూ పెట్టింది తిని తొంగుంటాడు. ఇది రొటీన్. గుడిసెల ‘వ్యూ’ గురించి కదూ? పొద్దున్నే చూస్తే బోలెడన్ని రిక్షాలు గుడిసెల ముందు ‘పార్క్’ చెయ్యబడి వుంటాయి. కొంతమంది పిల్లలు వాటిని తొక్కాలని ఆశగా వాటివైపు చూస్తుంటారు. కొందరు పిల్లలు కేవలం ‘బెల్లు’ల్ని మోగించి ఆనందపడతారు. రాయల్ ప్రొఫెషన్!.. వంశపారంపర్య హక్కుండే ప్రొఫెషనది. హెసిడిటరీ జబ్బుల్లాగా రిక్షాలూ పిల్లలకి సంక్రమిస్తాయి. ‘టీ’కి డబ్బుల్లేని ఆడాళ్లు పిల్లల వీపు వాయిస్తూ ఉంటారు. నోబుల్ ప్రొఫెషన్! దీన్లో వ్యాయామమే గాక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. ‘ బాలానాం రోదనం బలం’ అంటారుగా! పెద్దయ్యాక వాళ్లు ‘యాడ్’ ఇవ్వచ్చు. crying is the secret of my energy అని.

గుడిసెల్లో ఉన్నవాళ్లు రేడియో స్విచాన్ చేసి సంగీతాభిరుచిని వ్యక్తం చేస్తే ‘లే’నోళ్ళు పిల్లల రోదన వింటూ ఆనందిస్తారు. తల్లులకి పిల్లల్ని బాదటం హాబీ.. పిల్లలకు ఏడవటం హాబీ. పస్తులుండడం ఆ గుడిసెల్లో పిల్లలకూ, పెద్దలకూ కూడా హాబీనే.. సరే.. ఎప్పుడో గుడిసెల్లోనూ ‘వివాహ మహోత్సవాలు’ జరుగుతై. ఆ రోజంతా గ్రామఫోన్ మోత, చుట్టు పక్కల పెంకుటిళ్ళకీ, మేడలకీ పిచ్చెక్కేంతగా సౌండ్ పెడతారు.

మిసెస్ సుందరీబాయ్ ‘కిటికీ’ ఇంటికొచ్చినప్పుడల్లా విసుక్కుంటూ ఉంటూంది. కిటికీ మూసేస్తుంది కూడా. “వాటె హారిబుల్ వ్యూ యీజ్ దిస్!” అంటూ ముక్కెగరేసి కళ్లు చికిలిస్తుంది. ముక్కు ఎగరెయ్యడం, కనుబొమలు పైకెత్తడం.. కళ్లు చికిలించడం.. ఇంగ్లీషులో విసుక్కోవడం ఆవిడ హాబీ..

ఓసారి ఆవిడొచ్చినప్పుడు ఓ ‘చిరు’ గుడిసెలో పెళ్లి జరిగింది. మరో ‘గుడిసేటి’ కన్య వధువై గుడిసెలపేట కొచ్చింది. మరో గుడేసేటివాడు భార్యని తన్నబోయే హక్కుని పొందాడు. శోభనం రోజునే తన్నకపోవచ్చు. ‘పాత’బడ్డాక మాత్రం తన్నులు తప్పవు. ఆ విషయం గుడిసెల్లో వాళ్లందరికీ తెలుసు. తత్శుభ సందర్భంలో ఎల్లారీశ్వరి ఎలుగెత్తి పాడింది. మిసెస్ సుందరీబాయి ఆనాడు లెక్కలేనన్నిసార్లు ముక్కు చిట్లించీ, వందసార్లు ‘హారిబుల్ నాన్సెన్స్.. న్యూసెన్స్.. షిట్..’వంటి ఆంగ్ల పదప్రయోగాలు చేసీ తన ‘రిగ్రెట్స్’ని బాహాటంగా ప్రదర్శించింది. అవునూ న్యూసెన్స్ అంటే ‘అర్ధమేవిటీ?’ న్యూ.. సెన్స్ అనా? అంటే కొత్త సెన్సనా? అసలు సెన్స్‌కీ సైన్స్‌కీ సంబంధం? ‘న్స్’ అనగా చెప్పుట… ఐ అనగా నేను.. EYE ఐ కూడా ఉందిగా? వాటెవర్. ఎల్లారీశ్వరి ఆనాడు ఎలుగెత్తి పాడటం మానలా.. దాంతో పిచ్చికోపం వచ్చిన సుందరీబాయి చిందులు తొక్కుతూ, చిత్ర విచిత్ర హస్తన్యాస అంగన్యాసాలు చేస్తూ, “ఎందుకో వీళ్లంటే నాకు మాత్రం చికాకు మాధవీరావ్… యీ ముండమోపి పెళ్లికి తోడు ఆ గ్రామఫోన్ రికార్డులొకటీ.. ఎట్లా భరిస్తున్నావో నువ్వు.. నేనైతేనా? వెంటనే పోలీస్ కంప్లయింట్ ఇచ్చేదాన్ని. I mean it… అంది.

సుందరీబాయి తండ్రి సేట్ చమన్‌లాల్. ‘సుందరీ ఫైనాన్స్’ కి అధిపతి..’వడ్డీ వ్యాపారి’ అని వాళ్ల నాన్ననెవరన్నా అంటే సుందరీబాయికి కోపం ముంచుకొస్తుంది. ‘ఫైనాన్సర్’ అనాలంటుంది. సుందరీబాయి భర్త పేరు కిషన్‌చంద్ జరీవాలా.. ‘హీయీజ్ సో క్యూట్’ అని అందరితోనూ జరీవాలా గురించి చెప్తుంది. కానీ తనతో మాత్రం ఎప్పుడూ ‘జరీవాలా’ని వెంట తీసికెళ్లదు. ఆవిడ చిన్నప్పుడు ‘ఆల్సేషన్’ డాగ్ మీద మోజుపడితే ‘డేడి’ అర్జంటుగా ‘ఫ్లైట్’లో తెప్పించాడట. అది మనసులో ఉంచుకుని కాలేజీలో ‘మదన్’ అనే కుర్రాడి మీద మనసు పారేసుకుని తండ్రికి చెపితే ‘ససేమిరా’ అనడమేగాక అర్జంటుగా ‘జరీవాలా’తో పెళ్ళి జరిపించి , “హీ యీజ్ జస్ట్ లైక్ యువర్ డాగ్.. హీ విల్ సింప్లీ ఒబే యూ..” అని నచ్చచెప్పాడు. యీ విషయం అందరితో చెప్పి ‘ మా డేడి చాలా దూరదృష్టితో మా ‘హబ్బీ’ని తెచ్చారు” అని మురుసుకుంటుంది. అన్నట్టు ఆ గుడిసెలముందు పార్కు చెయ్యబడ్డ రిక్షాల్లో మూడోవంతు చమన్‌లాల్‌వే. వీళ్లు ‘రోజువారీ’ అద్దె కడుతుంటారు. ‘రిక్షా’ డబ్బుల్తోనే ఆయన పెంకుటింట్లోంచి మేడలోకి, మేడలోంచి ‘చమన్ మహల్’ లోకి మారాడు.

సుందరీబాయికి రిక్షావాళ్లంటే ఎలర్జీ.

రిక్షావాళ్లకి ‘రిక్షా’లంటే ఎలర్జీ.

రిక్షాలకి రోడ్లంటే ఎలర్జీ.

నిజానికి ఎల్లారీశ్వరి పాటలంటే సుందరీబాయికి ప్రాణం. ‘నువ్వచ్చు జయమాలిని’లా వుంటావని ‘దట్ క్యూట్ ఫెలో’ ఎప్పుడో అన్నాట్ట. అపట్నించీ జయమాలిని పాటల్ని (LRరేగా పాడింది) ‘ఓన్’ చేసుకుంది. అయితే రిక్షావాళ్లు ఆ పాటల్ని ఇవాళ ‘వెధవ’ పెళ్ళిళ్ళలో మోగించటమే ‘సుందరి’కి నచ్చదు.

‘వెన్ విల్ దే లెర్న్?” అని సమాజాన్ని సూటిగా ప్రశ్నించింది కూడా.

“వాళ్ల సంతోషం వాళ్లది” అంటే

“యూ ఆర్ సింప్లీ ఆర్థడాక్స్ మాధవీరావ్” అని ముక్కు చిట్లించింది.

సింప్లీకీ.. ఆర్థడాక్స్‌కీ ఉన్న సంబంధం అమెరికాకీ, ఆస్ట్రేలియాకి ఉన్నంత…

ఒకె  ఒకె.. గుడిసెల ‘వ్యూ’ గురించి కదూ..

ఆ గుడిసెల మధ్యన వంకర టింకర దార్లున్నాయి.. వాటిని ‘సందు’లంటారు..

 

మళ్ళీ కలుద్దాం..

 

 

4 thoughts on “మాయా నగరం – 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *