May 6, 2024

కళారూపాలు – 2 బుర్రకధ

రచన: ఉషాబాల గంటి

HYF30BURRAKATHA_1036953f

జాతి సంస్కృతిని కళలు సాహిత్యము, ప్రతిబింబింప జేస్తాయి. కళలే జాతికి జీవనాడులు. ఇలాంటి కళల్లో తెలుగు జానపద సాహిత్య కళారంగాలలో ఒక మహత్తర ప్రక్రియ బుర్రకథ. తెలుగు మాట తెలుగు పాట తెలుగు ఆహార్యం , తెలుగు పలుకుబడి , తెలుగుదనము, మూర్తీభవించిన కథ బుర్రకథ. అంతేకాక దేశ, జాతి సంస్కృతి లోని విశిష్టతను , సామాజిక వ్యవస్తలోని లోపాలను, బహిర్గతం చేసే కళారూపంగా బుర్రకథ ప్రసిద్ధి పొందింది

 

బుర్రకథ చరిత్ర:

 

కథకుని చేతిలో బుర్ర(సొరకాయ) ఆకారంలోఉన్న వాయిద్యం వల్ల దీనికా పేరు వచ్చింది. జాతిలో నిద్రించిన నీతి నిజాయితీలను గుంజి కుదిపి నిద్ర లేపేందుకు బుర్రకథ ఒక మహత్తర సాధనము. బుర్రకథ అనేక జానపద కళారూపాలకు మాతృక యైన యక్షగానం నుంచి వచ్చినదే. బుర్రకధలో నవరసాలూ పలుకుతాయి. ముఖ్యంగా వీర, కరుణ రసాలను మెప్పించే ప్రక్రియ ఇది. ప్రదర్శనా సౌలభ్యాన్ని బట్టి వీరగాధలూ, త్యాగమూర్తుల కథలూ, స్వాతంత్రోద్యమ కథలు ఇతివృత్తాలుగా పేరు గాంచాయి. రాజకీయ ప్రచారము, కుటుంబనియంత్రణ , ప్రజలకు వివిధ విషయాలపై అవగాహన పెంచడం బుర్రకథ ద్వారానే సాధ్యము. శ్రీనాధుని కాలంనాటికే బుర్రకథలు ఉన్నాయనడానికి నిదర్శనము క్రీడాభిరామంలో “ద్రువ తాళంబున వీరగుంభిత ధుం ధుం ధుం కిటత్కార”అను పద్యము. అయినప్పటికి 1942 నాటికి మాత్రమే ఒక పరిణతి చెందిన కళారూపంగా రూపొందింది. యెన్నో ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచింది.

 

ప్రదర్శనావిధానము

               బుర్రకథలో ఒక ప్రధాన కథకుడు, ఇద్దరు వంతలు ఉంటారు. ప్రధాన కధకుడు ముఖ్య కథను, వర్ణనలను, నీతిని, వ్యాఖ్యలను, రసవత్తరమైన మాటలు , పాటలూ, పద్యాలతో తాళానికి అనుగుణంగా చెబుతాడు. వీరికి అట పాట మాట బాగా తెలిసి ఉండాలి. వేషధారణ రంగుల అంగరఖా తలపాగా, నడుముగుడ్డ ,ముత్యాలగొలుసు, కాలిగజ్జలతో ఉంటుంది. వంతలలో మొదటివాడు హాస్యగాడు రంగులదుస్తులతో విభూతి రేఖలతో చేతిలో డప్పుతో (దీనినే ఢక్క) అంటారు.  ప్రధాన కధకునికి తోడుగా కధలోని పట్టు నిలబెడుతూ ఏమైనదని ప్రశ్నిస్తూ ఉంటాడు. హాస్యాన్ని పంచుతాడు. పిట్టకథలు చెబుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు. మరొక వంతగాడు హాస్యగాని అతితెలివికి అడ్డుకట్ట వేస్తుంటాడు. కథను, కథనాన్ని అందులోని నీతినీ నొక్కి చెబుతూ అసలుకథ దారి తప్పకుండా చూస్తుంటాడు. ఇతని ఆహార్యం కూడ మొదటి వంతని పోలి ఉంటుంది. రాగ తాళ నృత్యాదులతో ముగ్గురు అలరిస్తారు.`

 

బుర్రకథనే నాజర్ తంబూర కథ అంటూ ఇలా వివరించారు.

 

“సోదర ఆంధ్ర వీరులార || తం ||

జోడు గుమ్మెటలు తాథిమి యనగ

తొడుగ వంతలు ఆడిపాడగా

రాగతాళాధి నృత్యముల తంబూర కథ వినండి

 

ప్రధాన కథకుడు వినరా భారత వీరకుమారా విజయం మనదేరా అనే చరణం సర్వసాధారణం. దీనికి ఇధ్ధరు వంతలు తందానతాన అంటారు.

 

కొన్ని వంతపాటలు :

 

1. తందాన తందాని తందానా

2. భళానంటిభాయి తమ్ముడ-సై భాయె భళానోయె    దాదానా

3.తందాన భాయి దేవనందనానా – తందానితాని.

4. ఓ భారతీయుడా ఓ వీరయోధుడా లేవయ్యా లేచిరావయ్యా.

5. తందాన తుమ్మెదా.

 

విషాదఘట్టాలలో హరిహరీ యని అయ్యో అని వంతలు అనాలి. బుర్రకథలో కథకునికి శృతి వేసే జ్ఞానం, డక్కీలను వాయుంచే తాళజ్ఞానం బాగా ఉండాలి. కథలోని ప్రతి ముగింపూ నోటితోను, గుమ్మెటపైనా మ్రోగించాలి.

 

కొన్నిముక్తాయుంపులు:

 

తకఝంతదంత

తకిట తకిట తక దరికిటదరికిటత

తధిమి తకిటతక ఝంతరికిటతక

తరికిటఝంతరి కిటతకత

తఝంణంతక తకత్ఝం ణంతక తక్కిటతరికిటఝంతరిత

 

ముగింపు బిగింపు ముక్తాయింపు వల్ల కథ వినడానికి ఇంపుగా ఉంటుంది.

కథావస్తువులు :

 

బుర్రకధ

 

బుర్రకథలో దేవతాకథలు, పౌరాణికాలు, జానపదాలు,  రాజకీయాలు చ్రిత్రకారుల ఉద్యమకారుల కథలు, పల్లె పట్టణ సమస్యలు, మొదలైనవి ఉంటాయి. కాలానుగుణంగా ఇతివృత్తంలో మార్పులు వచ్చాయి. సమకాలీన ప్రజాసమస్యలను ఆధారంగా చేసుకుని ఏర్పడిన తొలి ఇతివృత్తం  సుంకర సత్యనారాయణగారి కష్టజీవి. 1940 నించి వీటిని ఎక్కువగా ఉపయోగించుకున్నారు. జమిందారీ వ్యవస్తలోని లోపాలు, భుస్యామ్య వ్యవస్తలోని దురవస్ధలు, వాటి పరిష్కారాలు ఈ కథలలో కనిపిస్తాయి.

ప్రముఖ బుర్రకథ రచయితలు:

 

ప్రజాకవి సుంకర సత్యనారాయణ,  ప్రజాకవి నాజర్, అభినవ పోతన వానమామలై వరదాచార్యులు, కవికుమార మాచిరాజు లక్ష్మీపతీ, జంపన్న, కొసరాజు రాఘవయ్య చౌదరి, రుక్మాభట్ల విదుమౌళి శర్మ, పేరి సుబ్బారావు,  వారణాసి వెంకటనారాయణశాస్త్రి, దంటూరి కృష్ణమూర్తి, నదీరా మున్నగు కవులు ఎన్నో బుర్ర కథలు రచించారు.

 

కొందరు కథకులు : ఆంధ్ర బుర్రకథాపితామహ నాజర్.  ఈయనకు అనేకమంది ఏకలవ్య శిష్యులు ఉన్నారు. వీరు బుర్రకథనే జీవనాధారముగా చేసుకుని బతికారు. వీరి పలనాటి యుధ్ధం, భొబ్బిలి యుధ్ధం బహుళ ప్రాచుర్యం పొంధాయి. ఇంకా జూనియర్ నాజర్, నిట్టల బ్రధ్రర్స్, లక్ష్మికాంత్ మోహన్, పున్నంరాజు భానుమూర్తి, చందన కొటేశ్వరరావు, శిష్టా సాంబశివరావు, పండు, వింజమూరి రామారావు, పేరి సుబ్బారావు, కోటంరాజు, నదీరా మున్నగువారు కొందరు కథకులు. శ్రీమతి భద్రకాళి, శారద, వాణి మున్నగువారు కథకురాండ్రు. కుమ్మరి మాష్టారుగా పేరొందిన దార అప్పలనాయుడు, కాకుమాను సుబ్బారావు కూడా కథకులే.

 

కొందరు వంతలు:  కర్నాట లక్ష్మీనరసయ్య, మిక్కిలినేని రాజబాబు, పండు, నిట్టల శతృఘ్నరావు, నిట్టల హనుమంతరావు, మండలీక కృష్ణ భాస్కర్, డొక్కా అనంత రామమూర్తి, సలాది భాస్కరరావు, నూకల అప్పన్న శాస్త్రి, వి.వి.శర్మ, జన్నాభట్ల రామం, కుసుమ, ఝాన్సీ, తులసి మున్నగువారు కొందరు వంతలు.

బుర్రకథలు – నాజర్:  బుర్రకథల్లో ఇది నిశ్చితంగ నాజర్ యుగము. ప్రాచీన యక్షగాన సాంప్రదాయాలను ప్రాణప్రదంగా కాచుకుంటూ నిజమైన బుర్రకథకు నిర్వచనంగా, నిలువుటద్దముగా తన కథను నిల్పిన ఘనత ఈ సహృదయునికే   దక్కుతుంది. అందుకే బుర్ర కథాప్రపంచం ఈయనకు మొక్కుతుంది.

నాదపితామహా త్యాగరాజు,

కవితాపితామహా అల్లసానిపెద్దన,

హరికథాపితామహ ఆదిభట్ల,

బుర్రకథాపితామహనాజార్.

షేక్ నాజర్ 1920 వ సంవత్స రంలో గుంటూరు జిల్లా, పొన్నకల్లు గ్రామంలో జన్మించారు. పుట్టింది ఇస్లాంలో ఐనా హిందూ పురాణకథలను తన కథలలో చెప్పేవారు. ఆంధ్ర దేశానికి గర్వకారణమై తన నటనతో మెప్పించిన బళ్ళారి రాఘవ ‘భళా నీవంటి ఉత్తమాభిరుచి గల కళాకారులు దేశానికి ఎంతో అవసరం.’ అని అభినందించారు. 1986 రెపబ్లిక్ డే  రోజున రాష్ట్రపతీ భవన్‌లో నాజర్‌కు  ‘ఫద్మశ్రీ’ అవార్డు అందించారు. బుర్రకథకు ఒక చక్కని రూపునిచ్చిన నాజర్ 1997 ఫిబ్రవరి 21న పరమపదించారు.

బుర్రకథ పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకుని సరదాగా సాగిపోయే ఒక జానపద కళారూపము. పరిమితమైన ఆహార్యంతో ఆడుతూ పాడుతూ, కథ, హాస్యం, రాజకీయమును సంభాళించుకుంటూ జనసామ్యానికి చేరువయిన కథ ఇది.  ప్రసిధ్ధమైన ఈ జానపద కళారూపం ఇవాళ ప్రాచుర్యం కోల్పోతోందంటే తెలుగువారిగా మనం సిగ్గు పడాలి. అరకొరగా మిగిలిన ఈ జానపద కథా కళారూపాన్ని కాపాడుకోవలిసిన భాద్య్తత మనమీధ ఉంది.  ప్రభుత్వం కూడ కళాకారులను కొంతవరకు ప్రొత్సహించాలి.  చేవగల కళలకు, భావాలను పలికించగల గళాలకు మనకు కొదవ లేదు. ప్రొత్సాహం, మీడియా గాలికి తట్టుకునే శక్తి  బుఱ్రకథా కళాకారులకు వస్తే బుర్రకథలు భవిష్యత్తులో మరింత శోభాయమానంగా వర్ధిల్లుతాయని ఆశిద్ధాం.

 

 

3 thoughts on “కళారూపాలు – 2 బుర్రకధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *