May 3, 2024

విజయగీతాలు – 2

సముద్రాల రాఘవాచార్య (సీనియర్)

1992 జులై 19 తేదీన గుంటూరు జిల్లా రేపల్లెలో పండిత వంశంలో పుట్టిన రాఘవాచార్య చిన్నపుడే అవదాన విద్యలో ప్రజ్ఞను ప్రదర్శించారు. 1934లో ప్రజామిత్ర పత్రికకు పని చేయటంతో గూడవల్లి రామబ్రహ్మంగారితో పరిచయం యేర్పడింది.
1937లో హెచ్.వి.బాబు వద్ద ‘కనకతార’ చిత్రానికి రచయితగా సినీరంగప్రవేశం చేసి ఆ మరు సంవత్సరం 1938లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ‘గృహలక్ష్మి’ కి పనిచేయటం మొదటి దశలో అనుభవంగా చెప్పుకోవాలి. వాహినీసంస్థకు వి.యస్.రెడ్డి తీసిన మూడు చిత్రాలకు (వందేమాతరం, సుమంగళి, దేవత) ఆ తరువాత కె.వి.రెడ్డి తీసిన భక్తపోతన యోగివేమన చిత్రాలకు రచన చేయటం సముద్రాలకు దక్కిన సువర్ణావకాశం. ‘త్యాగయ్య’ చిత్రం రచయితగా సముద్రాలకు, నటుడిగా సంగీత దర్శకునిగా నాగయ్యకు చిర యశస్సు నార్జించాయి.
సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలకు సమసామర్థ్యంతో రచన చేశారు సముద్రాల రాఘవాచార్య. లైలామజ్ను, బాటసారి, దేవదాసు వంటి విషాదాంత చిత్రాలకు ఆయన రచన ప్రాణం పోసింది.
విజయా ప్రొడక్షన్స్ వారి ప్రారంభ చిత్రం ‘షావుకారు’కు సముద్రాల గీతరచయిత. అంతేకాదు ఆ చిత్రానికి సంగీత దర్శకునిగా ఘంటసాలని నిర్మాతలకు సిఫారసు చేసారు. ఘంటసాల – సముద్రాల కాంబినేషన్‌లో రూపొందించిన (‘షావుకారు’) గీతాలు (‘ఏమనెనె చిన్నారి’, ‘పలుకరాదటే చిలకా’) లలితగీతాల కోవలో హాయిగొలుపుతాయి.
సీతారామకళ్యాణం, నర్తనశాల, పాండవవనవాసం వంటి పౌరాణికాలు, బాలరాజు, స్వప్నసుందరి వంటి జానపదాలు, తెనాలిరామకృష్ణ, అమరశిల్పిజక్కన్న వంటి చారిత్రాత్మక చిత్రాలు సముద్రాల సంభాషణలతో చిరస్మరణీయం.
సుమారు వంద చిత్రాలకు రచనచేసి వేయి గీతాలు వ్రాసి, ముచ్చటగా మూడు (భక్తరఘునాథ్, వినాయకచవితి, బబ్రువాహన) చిత్రాలకు నెరపిన సముద్రాల 1968 మర్చిలో తనువు చాలించారు.

పాతాళభైరవి
(15.3.1951)

Pathala_Bhairavi

‘సాహసం శాయర డింభకా; విజయలక్ష్మి వరిస్తుంది, రాకుమారి లభిస్తుంది’; ‘అదెట్లానె బుల్‌బుల్; హాంఫట్’; ‘వరె, వరె, వరె, వరె వాడికత్తి’; ‘నరుడా ఏమినీ కోరిక’; ‘తప్పు తప్పు’ – ఇటువంటి పలు మాటలు ఒక దశాబ్దం (1951-60) పాటు ప్రేక్షకుల నోళ్ళలో నానాయి. వాటిని ప్రయోగించిన పదజాల మాత్రికుడు పింగళి నాగేంద్రరావు ‘పాతాళభైరవి’ చిత్రరచయిత. మాటలే అంత వింతగా వుంటే యిహ పాటల సంగతి వేరే చెప్పాలా! వాటిని చిత్రీకరించిన దర్శకుడు కె.వి.రెడ్డి నేర్పు గురించి చెప్పాలా?
నిజమే, చెప్పాల్సిందే – కారణం అందులోని హాయి గొలిపే వింతవింత పోకడలు తెలుసుకొని తీరాల్సిందే! ఆ పాటల పల్లకిలో వూరేగేముందు….
ఉజ్జయిని – పేరు వినగానే సాహసవంతులు విక్రమార్కుడు, శాలివాహనుడు గుర్తుకువస్తారు. ఈ కథకు ఆ రాజ్యమే కేంద్రం. ఆ రాజోద్యానవనంలో పనిచేసే ముదుసలి శాంతమ్మ (సురభి కమల). ఆమె కొడుకు తోటరాముడు (యన్.టి.ఆర్) అతని చెలికాడు అంజి (బాలకృష్ణ). వారిద్దరూ కర్రసాము చేయటంతో కథ ప్రారంభమౌతుంది. రాజకుమారి వనవిహారానికి వచ్చేవేళయింది అని శాంతమ్మ వాళ్ళని ఓ గదిలో వుంచి గొళ్ళెం పెడుతుంది. సన్నటి వేళ్ళతో అంజి ఆ గొళ్ళాన్ని తొలగించి యిద్దరూ అలా బయటకు రాగా, యిలా రాకుమారి ఇందుమతి (మాలతి) చెలికత్తెలతో వనవిహారానికి వచ్చి వసంత గీతాలపన చేస్తారు.
తీయని వూహలు హాయిని గొలుపుతుంటే, వనంలోని పూవులు, చిరుగాలి మత్తెకించే కోయిల గానం రాకుమారి ఇందుమతి (మాలతి)ని వరవశింపజేసాయట! ఆ పాట గాయని లీల నోట, నాయిక మాలతి అభినయంతో పురులువిప్పింది. వెన్నెల వెలుగులు వనసౌందర్యంతో దోబూచులాడుతుంటే, ఫౌంటెన్ నీళ్ళతో యువ హృదయాలు వులకరింతలతోనూ తన్మయులౌతారు. అంత ఆహ్లాదంగా గోఖలే-కళాధర్ సెట్స్‌ను తీర్చిదిద్దితే కెమెరా ద్వారా మనల్ని మెస్మరైజ్ చేసారు మార్కస్ బార్‌ట్లీ. ‘తోట’ రాముడి చేత ‘మోసులు వేయించిన’ కవి రాకుమారి చేత ‘మదిరాల’ ప్రస్తావన చేయించారు. దరిమిలా మాంత్రికుడి గారడీకి లోబడే హీరో ప్రేమను కూడా ‘గారడీ’గానే భావించాడు. పాత్రోచితంగా సాగిన ఈ ప్రేమగీతం పాడినవారు ఘంటసాల, లీల.

ఆమె : కలవరమాయే మదిలో, నా మదిలో
కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమమందిరమాయె !!కల!!

అతడు : కలవరమాయే మదిలో, నా మదిలో
కన్నులలోన గారడి ఆయె
మనసే పూలమంటపమాయె !!కల!!

ఆ: నాలోయేమొ, నవభావనగా
మెల్లన వీణ మ్రొగిందీ
అనురాగాలే – ఆలాపనగా
మనసున కోయిల కూసే !!కల!!

అ: నాలోయేమొ, నవరసరాగం
పిల్లనగ్రోవి ఊదిందీ
మొహాలేవో మోసులువేసీ
ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో, నా మదిలో

ఆ: కన్నులలోన కలలే ఆయె
మనసే ప్రేమమందిరమాయె
కలవరమాయె మదిలో, నా మదిలో

అ: కలవరమాయే మదిలో, నా మదిలో

ఆ వలపు తలపులు మరునాటికి మారాకు వేసినై. రాముడు తోటలో ఇందుమతి రాకకోసం దారిపొడుగునా కుసుమాలు పరచి, పొదరింట వూయలపై పూలు జల్లి ఆమెరాగానే “ఈ తోటకంతకూ పరిమళం తెచ్చిన పువ్వు” అని పూలబాలను బహుకరిస్తాడు. ఇందుమతి ఆ పూవుని పదిలంగా దాచుకొని వెన్నెల వేళ కాగానే, అద్దంలో తన అందాన్ని చూసుకొని మురిసిపోతుంది.
ఆ పూబాల మందిరంలో రాకుమారికి, తోటలో రాముడికి ప్రేమోద్దీపన కలుగజేస్తుంది. అది ప్రణయగీతానికి దారితీస్తుంది. ఈ గీతంలో పింగళివారు ప్రయోగించిన “ఘాటు ప్రేమ” ప్రేమ తీవ్రతకు సంకేతమే! ‘కన్నుకాటు తిన్నదిగా’ అంటూ మరో ప్రయోగంతో రచయిత రసికుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. (పాము కాటు, దోమకాటు విన్నాం గానీ యీ కన్నుకాటు ఏమిటో) జాబిలి, వెన్నెల, మలయానిలం – విరహాన్ని విప్పిచెప్పిందని నాయిక తలపొస్తే – వాటినే సంబోధిస్తూ ప్రియురాలికి విరహాగ్నిని పెంచమని వేడుకొంటాడు రాముడు. ‘కలవరమాయె’ పాటతాలూకు హాయిగొలిపే వాతావరణమే యిక్కడా కనువిందు చేస్తుంది. దీన్ని పాడినవారూ ఘంటసాల, లీలయే!

ఆ: ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో !!ఎంత!!
కన్ను కాటు తిన్నదిగా కళలు విరిసెనే..
నా..మనసు మురిసెనే
ఎంత ఘాటు ప్రేమయో….

అ: ఎంత లేత వలపులో ఎంత చాటు మొహములో !!ఎంత!!
కన్నులలో కనినంతనె తెలిసిపోయెనే
నా… మనసు నిలిచెనే !!ఎంత!!

ఆ: ఈ జాబిలి.. యీ వెన్నెల ఈ మలయానిలమూ
విరహములో వివరాలను విప్పిచెప్పెనే… !!ఎంత ఘాటు!!

అ: ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ప్రియురాలికి, విరహాగ్నిని పెంపుసేయరే !!ఎంత లేత వలపు!!

కథలో రొమాన్స్ పాకాన పడ్డాక, ఓ మలుపు తిరుగుతుంది. ఇందుమతిని పెళ్ళి చేసుకోవాలని రాణిగారి తమ్ముడి వుబలాటం. అందుకోసం రాజు ఎదుట జరిగిన తెలివిపరీక్షలో తికమక పడతాడు. ఇందూని ప్రేమించరా అని రాణి సలహాయిస్తుంది. ‘ఓస్ యింతే గదా’ అనుకొన్న రాణిగారి తమ్ముడు మరునాడు తోటలో ఇందుమతితో తన ప్రేమ గోల వినిపిస్తాడు. ఈ ఫార్సును చెట్టుమీద వున్న రాముడు, అంజి చూసి ఆనందిస్తారు. రేలంగి స్వయంగా పాడిన ఆ గీతం ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ‘తోడి’ రాగాన్ని యిక్కడ అనువుగా తోడు తెచ్చుకున్నారు పింగళి.

వినవే బాలా – నా ప్రేమగోలా
నిను కను వేళ నిలువగజాలా !!వినవే!!
గుబుల్ గుబుల్‌గా – గుండెలదరగా
దిగుల్ దిగుల్‌గా – యిది యిదిగా !!వినవే!!
చిరునవ్వు చాలే – చిత్తయిపోతానే
మురిపింతే చాలే – మూర్చేపోతానే !!వినవే!!
జోడు గూడి తోడిరాగం పాడుకొంటూ, మేడమీదా
పైడిబంగార్… తూగుటుయ్యాల్ వేడుకలరా – ఊగరావా,
చెట్టాపట్టి జడకోలాటం తొక్కుడుబిళ్లా ఆడే నాతో
తొక్కుడుబిళ్లా ఆడే నాతో……

పాట పూర్తయ్యేసరికి అక్కడికి ఓ పాము రాగా రాముడు దానిని చంపి రాకుమారిని కాపాడుతాడు. ఈ పాము గండం గూర్చి ఆరా తీస్తాడు రాజు. ఇక్కడ్నుంచి అసలు కథ పాకాన పడుతుంది.
యస్.వి.రంగరావు నటజీవితానికి పటిష్టమైన పునాది వేసిన పాత్ర నేపాళ మాంత్రికుడు. అభినయం. ఆహార్యం, వాచకం – వీటిల్లో ఓ కొత్త వరవడితో ఆ పాత్ర రూపకల్పన చేసారు. అన్ని శక్తులను మించిన ‘పాతాళభైరవి’ శక్తిని సాధించాలంటే తన వంటి మంత్రసిద్ధుని గానీ, సాహసవంతుడైన యువకుని గానీ ఆ శక్తికి బలియివ్వాలని తెల్సుకొన్న నేపాళమాంత్రికుడు సాహాసవంతుని కోసం దుర్భిణిలో చూడగా ఇందుమతి కోసం కోటలోకి ప్రవేశిస్తున్న రాముడు కనిపిస్తాడు. వాడికోసం సేవకుడు డింగరి (పద్మనాభం)తో ఉజ్జయినికి ప్రయాణమౌతాడు మాంత్రికుడు. ఇందుమతి శయన మందిరంలో ప్రవేశించిన రాముణ్ని, రాణిగారి తమ్ముడు కపటోపాయంతో బంధిస్తాడు. రాముడికి మరణశిక్ష విధించిన మహారాజు కూతురు మాటను మన్నించి, సంపద సాధించిన తరువాత తన కూతురి ప్రసక్తి తెమ్మని రాముణ్ని వదిలిపెడతాడు.
ఉజ్జయిని చేరిన మాంత్రికుడు రాజవీధిలో తన విద్యలతో జనాన్ని ఆకర్షిస్తాడు. అక్కడికి చేరిన రాముడు, అంజి వాటిని చూసి వినోదిస్తారు. అందులో భాగంగా మాంత్రికుడు మంత్రదండంతో హాంఫట్ అంటూ రాతిని కోతిగానూ, కోతిని నాతిగాను సృష్టించి “మహాజనానికి మరదలు పిల్లా, గలగలలాడవె గజ్జెలకోడి” అని ఆదేశిస్తాడు! జిక్కి పాడిన ఆ నృత్యగీతానికి నర్తకి లక్ష్మీకాంత అక్కడ గుమికూడిన జనాన్ని (పాటలో ‘గుమిగుమిగుమిలే’ అంటూ కవ్వించేలా డాన్సు చేస్తుంది. ‘పాతాళభరవి’ హిందీలో విడుదల చేసినప్పుడు యీ పాటను రంగులలో ప్రదర్శించారట! దీని ట్యూన్ విదేశీ బాణీ నుండి అరువు తెచ్చుకున్నా, ‘మాయ’లాడి కాబట్టి ఎబ్బెట్టుగా తోచదు. మావల్ని, బావల్ని రెచ్చగొట్టే ఆ గీతం….

వగలోయ్ వగలూ, తళుకు బెళుకు వగలూ
బావలూ, మామలూ, బావలు మామలు, భామలూ
లాలలూ, లలలూ, లలలు, లలలు, లలలూ లలలూ….
సింగారి వీధంట మామ రంగేళి పిల్లంట బావ
కొంగు తాకిందంటె… హై – హై
కొంగు తాకిందంటె… కుయ్ కుయ్ కుయిలే
నీవెంట వస్తాను – ఆఁ నీ జంట ఉంటాను – ఉఁ
సైఁయంటి బావా ఉఁ అంటి మామా
చెలీయనీ, భళీయనీ, సరేయనీ, చెలామణి
మీరంత నావెంట, గుమిగుమి, గుమిలే
లాలలూ, లలలూ, లలలు, లలలు, లలలూ లలలూ….
వగలోయ్ వగలు, తళుకు బెళుకు గగలూ
ఇంతలో అక్కడికి వచ్చిన రాణీగారి తమ్ముడు హడవుడి చెయ్యబోతే మాంత్రికుడు ‘హాంఫట్’ అంటూ వాణ్ణి ఆడదిగా మర్చేస్తాడు. సిగ్గుతో ఆ వేషంలో రేలంగి…

‘తథికిణి తోం, తథికిణితోం
తాళలేనె, నే తాళలేనే
భామలారా, ఓ యమ్మలారా,
యిందరిలోనూ నా నాదుడేడే,
శ్రీకృష్ణుడేడే, ఓయమ్మలారా,
తాళలేనే నే తాళలేనే, ఓయమ్మలారా !…..

అంటూ దేశవాళీ పాటతోనే నర్తించి ప్రాధేయపడగా మాంత్రికుడు “విద్యలు వినోదలు కావురా, వివేకం కలిగివుండు” అని హెచ్చరించి మామూలు రూపం వచ్చేలా చేస్తాడు.
మాంత్రికుడు తన వద్దనున్న అక్షయపాత్రలోంచి అందరికీ మొహరీలు పంచుతాడు. దాన్ని లాక్కొని దౌడుతీస్తాడు రాముడు. మాంత్రికుడు రాముణ్ని చేరుకోని ధైర్యసాహసే లక్ష్మి అని, తను చెప్పినట్టు చేస్తే సంకల్పం సిద్ధిస్తుందని, రాజకుమారి లభిస్తుందని నమ్మబలుకుతాదు. ప్రేమలు దక్కని బ్రతుకేలాయని రాముడు ఆ మాయావి వెంట వెళతాడు. అప్పుడొక నేపథ్యగీతం. కొడుకు జయం కోరుతూ ప్రార్థన చేసే తల్లి, నిముషం యుగంగా గడిపే రాకుమారి చరణాల పరంగా కనిపిస్తారు. పి.జె.వర్మ అనే గాయకుడు ఆ గీతాన్ని ఆలపించారు. ఘంటసాల ఆలాపన అందించారు.

ప్రేమకోసమై వలలో పడెనే, పాపం
పసివాడు… అయ్యో పాపం పసివాడు
వేమరుదేవుల వేడుకోనీ, తన కొమరుని క్షేమం కోరుకొని
ఏమైనాడో – ఏమగునో యని కుమిలే తల్లిని కుములుమనీ
ప్రేమకన్ననూ పెన్నిధి యేమని యేమి ధనాలిక తెచ్చుననీ
భ్రమసిచూచు ఆ రాజకుమారిని
నిమునమె యుగముగ గడుపుమనీ !!ప్రేమ!!
ప్రేమలు దక్కని బ్రతుకేలయని ఆ మాయావినె నమ్ముకొనీ
ఏమి వ్రాసెనో… అటు కానిమ్మాని బ్రహ్మదేవునిదె భారమనీ

పాతాళబిలం చేరి, బొడ్డుదేవరను బద్దలు కొట్టి, కత్తుల బోనుదాటి రాముడు, మాంత్రికుడు పాతాళభైరవి విగ్రహం వద్దకు చేరుకొంటారు. పుష్కరిణిలో మొసలిని రాముడు సంహరించగా ఆ మొసలి యక్షకన్యగా మారి మాంత్రికుని కుతంత్రాన్ని దెలిపి హెచ్చరిస్తుంది. రాముడు యుక్తిగా మాంత్రికుణ్ని శక్తికి బలియిచ్చి కోరికలు తీర్చే పాతాళభైరవి ప్రతిమను సాధిస్తాడు. రాముని కోరిక ఫలితంగా అతని యింటి స్థానంలో మాయామహల్ వెలుస్తుంది. తను కూడా రాజకుమారుడి దుస్తుల్లో ఇందుమతిని చేరుకొంటాడు. ఆమెకు పంచప్రాణాలు లేచి వస్తాయి. ఆ ఆనంద పారవశ్యంలో యిద్దరూ ప్రణయ గీతాన్ని ఆలపిస్తారు. పూలమాలను విడివడని ప్రేమ మాలగా చమత్కరించటం పింగళికే చెల్లు. పాట పాడినది ఘంటసాల, లీల.

అ: ప్రణయ జీవులకు దేవివరాలే
కానుక లివియే… ప్రియురాలా
హాయిగా.. మనకింకా స్వేచ్చగా.. హాయిగా

ఆ: చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా….
కలసి మెలసి పోదమోయ్ వలపుబాటలా… !!హాయి!!
అ: నీ వలపూ, నా వలపూ పూలమాలగా
నీవు నేను విడివడనీ ప్రేమమాలగా !!హాయి!!

ఆ: కలలె నిజముకాగ, కలకాలమొకటిగా
తెలియరాని సుఖములలో తేలిపోవగా !!హాయి!!

ఆ మాయామహల్ వింతలు విడ్డూరాలు రాజుకు చూపిస్తాడు రాముడు. అందులో భాగంగా రెండు నృత్య రూపకాలుంటాయి. మొదటిది – ఒక దుర్మార్గుడి చెరలో వున్న యువతుల్ని సాహసవంతుడు రక్షించగా వారంతా అతన్ని ప్రశంసిస్తూ విజయగీతాలాపన చేస్తారు. రెండవది – నటి సావిత్రి, నృత్యదర్శకులు పసుమర్తి కృష్ణమూర్తి పాల్గొన్న నృత్యరూపకం.

ఆ: ఇకరా రానంటే రానే రానోయ్,
మన ఋణమిక యింతేనోయ్

అ: ఓ.. మనకూ మనకూ తీరని ఋణమే

ఆ: మనసే చెడితే ఎక్కడి ఋణమే!

అ: చీటికి మాటికి మనసులు చెడితే
యీ కాపురమెటులె…

ఆ: ఎవరికి తెలుసును పో…

అ: ఈ అప్పంతా నాదేననుకో
నా మెప్పంతా నీదేననుకో
నా వయ్యారి భామా రావే!

రాముడి ఘనకార్యం చూసి పెళ్ళి ఖాయం చేస్తాడు మహరాజు. అంజివల్ల సంగతి తెల్సుకొన్న డింగరి పాతాళగుహకు వెళ్లి సంజీవి స్పర్శతో మాంత్రికుణ్ణి బ్రతికిస్తాడు. మాంత్రికుడు రాణిగారి తమ్ముడిద్వారా పాతాళబైరవి విగ్రహాన్ని సంగ్రహించి. పెళ్ళి సమయానికి ఇందుమతిని, మాయామహల్‌ను మాయం చేసి తన బసకు చేరుస్తాడు. నిజం తెల్సుకొన్న రాముడు, ఎలాగైనా ఇందుమతిని దక్కించుకొంటానని రాజుకు మాట యిచ్చి మిత్రుడు అంజితో బయల్దేరతాడు. ఆ సందర్భంలో తన పరిస్థితిని, విధివ్రాతను తల్చుకొంటూ రాముడు ఆలపించే విషాదగీతం….
మాంత్రికుడి కబంధహస్తాలలో చిక్కుకున్న రాకుమారి పరిస్థితిని ‘పులివాతను పడుబాలహరిణి (జింక)యై చెలియెచ్చటనో చెరపడగా’ అని వాపోవటంలో కవితాత్మకంగ ఉపమాలంకారాన్ని ప్రయోగించారు రచయిత పింగళి. ఘంటసాలా పాడారు.

కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖినీ

పెండ్లిపీటపై ప్రియ నెడబసి గాలిమేడలూ గారడికాగా
కలకాలమును కర్మను దూరుచు కలగా బ్రతకడమేనో !!క!!

వెదకి వెదకి ఏ జాడ తెలియక హృదయమంతా చీకటిగా
ఎంత పిలిచినా పిలుపే అందక చింతిలి తిరగడమేనో !!క్!!

పులివాతను బడు బాలహరిణియై చెలి ఎచ్చటనో చెరపడగా…
జాలిలేని ఆ మాయదారికే బలిగా చేయడమేనో !!క!!

మాయామహల్‌లో మాంత్రికుడు రాకుమార్తెను మోహించమని, పెళ్లాడమని నిర్బంధిస్తాడు. ఎక్కడో అడవుల్లో తిరుగుతున్న రాముణ్ని ఎదుటకు రప్పించి, బంధించి ఆమె ముందే హింసిస్తాడు. ఈ సన్నివేశాల్లో రంగారావు అభినయం అపూర్వం, అనితర సాధ్యం.
దెయ్యల బారిన పడ్డ అంజి, తెలివిగా వారి వద్దనుంచి మాయా తివాచీ చెప్పులు సంపాదించి మాయామహల్ చేరుకొని రాముణ్ని కలుసుకొంటాడు. డింగరీని కొట్టి, తను డింగరిగా మారి – అందంగా కనపడితే అమ్మణి మొహిస్తుందని చెప్పి మాంత్రికుడు సర్వశక్తులూ దాచుకున్న గెడ్డాన్ని తీయించేస్తాడు.
మాంత్రికుడు ముస్తాబై ఇందుమతి మందిరానికి వచ్చి ఆమె శయ్యపై కూర్చొంటాడు. ఇంకేముంది- రాముడు ముసుగుతీసి వడుపుగా పాతాళభైరవిని చిక్కించుకుని మాంత్రికునితో పోరాడి, సంహరించి ఉజ్జయినికి చేరుకొంటాడు. మహారాజు కూతురితో రాముడికి వివాహం జరిపిస్తాడు. పాతాళభైరవి అందరికీ శుభం పలుకుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *