May 3, 2024

హ్యూమరధం – 2

రచన: రావికొండలరావుravikondala

హాసం ప్రచురణ

 

చావు సెట్టింగ్

 

సినిమాల్లో అవుట్ డోర్ అనీ, ఇన్‌డోర్ అనీ రెండు వుంటాయి. ఆ రోజుల్లో స్టూడియోలో,  ఫ్లోర్‌లో షూట్ చేస్తే – ఇన్‌డోర్. బయట ఎక్కడ తీసినా అవుడ్డోరే. ఆ లెక్కల్లో చూస్తే ఇవాళ అన్నీ అవుడ్డోర్లే. స్టూడియో ఫ్లోర్‌లో తక్కువ. అల్లాంటిదే ఒక అవుడ్డోర్ మద్రాసులో – ఒకరింట్లో, ఇల్లు ఊరికి చివర. షూటింగ్ ఏమిటంటే – ఆ(ఇంటి) ఇల్లాలు మరణించటం, ఆమెను పాడెమీదకట్టి, తీసుకువెళ్ళడం, తక్కిన పాత్రలన్నీ భోరున ఏడవడం – వగైరా, ఉదయం షూటింగ్, షూటింగ్‌కి కావలసిన సరంజామా అంతా ఏడో గంటకి ఆ యింటి దగ్గర జేరవేయాలన్నారు. అందుకని, ఆర్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు వెదుళ్ళతో కట్టిన పాడె, పాడెముందు తీసుకెళ్ళే “నిప్పు ఉట్టి” సిద్ధం చేసి ఆ ఇంటి దగ్గరకి వాన్‌లో తీసుకొచ్చారు.

అది పెద్ద ఇల్లు. కాంపౌండు, పెద్దగేటు వున్నాయి. లోపల ఇంటివాళ్ళున్నారు. గేట్ దగ్గర వాచ్‌మన్ కూడా వుంటాడు. ఒక ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు వచ్చి, గేటు కొట్టి, పిలిచి అలసిపోయారు. ఇంట్లో వాళ్ళు ఇంకా లేవలేదు. వాచ్‌మన్ ఎక్కడికో పోయినట్టున్నాడు. ఇక లాభం లేదని, ఆ పాడెనీ, నిప్పునీ గేటు దగ్గర పెట్టేసి, ఇంకేవో సామాన్లు తీసుకురావటానికి ఆ సెట్టు అసిస్టెంట్స్ వచ్చిన వాళ్ళతో వెళ్లిపోయారు. ఏడున్నర ప్రాంతంలో ఆ ఇంటికి ఎదురుగా వున్నవాళ్ళు ఒక్కొక్కళ్లే నిద్రలేస్తున్నారు. ఒక భర్త, నెమ్మదిగా తన భార్యని గుమ్మంలోకి తీసుకువచ్చి ఎదురు గేటు చూపించాడు. ఆమె దిగ్గుమంది. ఆ భర్త కూడా ప్రశ్నార్థకంగా అమె వైపు చూశాడు. అలాగే ఇంకో ఇంటి వాళ్ళూ గుమ్మంలోకొచ్చి కంగారు పడ్డారు. వీళ్ళందరికీ గేటు పక్కన ఉన్న పాడె, కుండ కనిపించాయి! అదంతా సినిమా షూటింగ్ సరంజామా అని వాళ్ళకి తెలీదు.

“పాపం! నిన్నటి దాకా ఆయన నిక్షేపంగా వున్నాడు. రాత్రికి రాత్రి ఏమైందో పాపం!”

“అదికాదే – ఆ ముసలావిడ, ఇంటి ఆవిడ తల్లి కాబోలు, ఆవిడకు చాలాకాలంగా సుస్తీటగా ఆవిడ పోయిందేమో!”

“ఆవిడ పోవడం ఏమిటండీ – నిన్న సాయంకాలం కూడా నాతో మాట్లాడితేనూ”

పొద్దున్నే వాళ్ళయింటికి పాలు తీసుకొచ్చిన పాలవాడు కూడా కంగుతిన్నాడు. ఇలాంటి సమయాల్లో పాలు ఇవ్వడమా – మానడమా అని ఆలోచించి,వెళ్ళిపోయాడు. పక్క ఇళ్ళవాళ్ళూ ఇక ఆగలేకపోయారు. ఎదురింటి వారి చుట్టాల్లో తమకు స్నేహితులైన వాళ్ళింటికి ఫోన్ చేసి అడిగారు. ఈ విషయం చెప్పారు. మరి కాస్సేపటికి, పక్కయింటి వాళ్ళూ, ఎదురింటివాళ్ళూ పరామర్శకి బయల్దేరారు. వాచ్‌మన్ గేటు తీసాడు. “ఏమైంది?” అని అడిగారు నెమ్మదిగా. అతను ఇంకా నెమ్మదిగా “ఏం లేదే” అన్నాడూ. అందరూ దిగాలుపడుతూ, లోపలకు వెళ్ళారు. “రండి రండి ఏమిటి పొద్దున్నే వచ్చారు – ఎంత అదృష్టం! రండి కూర్చోండి” అంది ఇల్లాలు. వీళ్ళు ముఖాలు చూసుకున్నారు. ఎక్కడా విచారాలు లేవు. శవం వున్న సాక్ష్యమూ లేదు! మరి?… ఆ పాడే.. నిప్పుకుండ…?

ఉండబట్టలేక అడిగారు, ఆ పాడె అవీ ఏమిటనీ.  “ఆదా! సినిమా షూటింగ్ మా ఇంట చేస్తామన్నారు. అయితే, అలాంటి సీను వుందని మాకు చెప్పలేదే” అన్నాడు ఇంటాయన.

మొత్తానికి టీ కప్పులో తుపాను చల్లారిపోయింది. ఎదురింటి, పక్కింటి వాళ్ళు ‘అమ్మయ్యా’ అనుకున్నారు. గేటు గలవాళ్లు గేటు దగ్గరకు రాగా, సినిమాకు సంబంధించిన వాళ్లు ఒక్కొక్కరూ కార్లు దిగుతున్నారు. అపార్థాలు కల్పించినందుకు, ఆ చర్యకూ ప్రొడక్షన్ వాళ్ళ మీద మండిపడ్డారు. “పొరపాటయిపోయింది. ఇప్పటి కిప్పుడు ఇంకో ఇంటికి వెళ్లలేం – క్షమించండి, ఎక్సూజ్, మన్నిచ్చుడుంగో” లాంటి మాటలన్నీ వాడి, షూటింగ్ అవుననిపించుకున్నారు!

(ఈ సంఘటన 1976 ప్రాంతాలలో జరిగింది. ఆ సినిమాలో నేనూ ఉన్నాను. తక్కిన వివరాలు గుర్తులేవు)

 

 

నిద్ర సుఖం ఎరుగదు….

 

అల్ల్లు రామలింగయ్యగారితో అవుడ్డోరు. రామానాయుడు గారు ‘పాపకోసం’ సినిమా తీసారు. అందులో అల్లువారు, నేనూ బ్రహ్మాణ పాత్ర ధారులం, మద్రాసుకి దూరంగా అవుడ్డోర్ పెట్టారు. మంచి ఎండ. ఒంటి గంటలోపలే షూటింగ్ బ్రేక్ చేసి, భోజనాలు పెట్టారు. రామలింగయ్యగారికి భోజనం చేసిన తర్వాత ఓ అరగంట పాటైనా విశ్రమించే అలవాటుంది. అంచేత ఆయన ఎక్కడికి వెల్ళినా ఒక చిన్న దిండు కూడా తనతో తెచ్చుకుంటారు. “నాకు మళ్ళీ షాటు ఎప్పుడు? టైముంటుందా?” అని అసిస్టెంట్‌ని అడిగారు. అతను ఆలోచించి, “మీరు రెస్టుతీసుకోండి” అన్నాడు. అన్నదే తడువుగా అల్లువారు, సదరు దిండు వగైరాలు తీసుకుని నిద్రాభంగం కలగకుండా షూటింగ్ స్పాట్‌కి దూరంగా వెళ్ళిపోయి, మంచి నీడ ఇస్తున్న చెట్టు చూసుకుని, దిండు పెట్టుకుని సుఖనిద్రలోకి జారుకున్నారు.

షూటింగ్ నాల్గుగంటలకల్లా అయిపోయంది.  “పాకప్” అన్నారు. అనడమేమిటి – అందరూ ఎవరికి దొరికిన కార్లో వాళ్ళు ఎకి బయల్దేరిపోయారు. మధ్యాన్నం తర్వాత రామలింగయ్య గారికి షాట్ రాలేదు గనక, ఆయన హాయిగా నిద్రపోయారు. షూటింగ్ పాకప్ హడావుండిలో ఎవరికీ ఆయన సంగతి గుర్తులేదు, ఆయన దూరంగా వెళ్ళిపడుకోడం చేత నిదానంగా రామలింగయ్య గారు నిద్రలేచి, అటూ ఇటూ చూశారు. షూటింగ్ ఆలికిడేం కనిపించలేదు. నిశ్శబ్దంగా వుంది. ‘లొకేషన్ మార్చారులా వుంది’ అనుకున్నారు. పక్కనే కాలువ గట్టున బట్టలుతుకుతున్న ఓ అబ్బయిని అడిగారు.

-“షూటింగ్ సంగతి తెలుసా?” అని. అందరూ వెళ్ళిపోయారన్నాడు. అల్లువారి ఒళ్ళు జల్లుమంది. గుండె కలుక్కుమంది….

ప్రొడక్షన్ కార్లు ఆఫీసుకి చేరాయి. “రామలింగయ్య గార్ని ఏ కారులో దింపారు?” అని వాళ్ళలో వాళ్ళు తర్జనభర్జన చేసుకుని, నాలికలు కొరుక్కొని, అయ్యయ్యో అనుకుని కారు మీద పరుగెత్తారు.

సరిగ్గా లొకేషన్ దగ్గరగా కారు చేరుకునే ముందే ఓ బస్టాండ్ ఉంది. అక్కడ పిలక, నుదుటిమీద విభూతి రేఖలతో, ఒంటి మీద చొక్కాలేకుండా – చంకలో దిండుతో ఒకాయన నించుని వున్నాడు చూశారు – రామలింగయ్యగారు! ”

సార్… సారీ… సర్… రండి” అని కారెక్కించారు. “నేనూ సారీ చెప్పాలి. ఎక్కడ పడుక్కున్నానో  మీతో చెప్పాలిగా” అన్నారాయన. మొత్తానికి ఆ కథ అలా కంచికి వెళ్ళింది.

అటు తర్వాత, ఇంకో షూటింగ్‌లో రామలింగయ్యగారు నా పక్కనే వుండగా, నేను ఈ కథంతా తక్కిన వాళ్ళతో చెప్పి- “రామలింగయ్యగారూ! జ్ఞాపకం వుందా? ఇలా ఎక్కడ జరిగిందో?” అని అడిగాను.

‘ఏ షూటింగ్‌లో జరిగిందంటే ఎలా చెప్పనూ? ఇలాంటివి చాలాసార్లు జరిగాయి”- అన్నారు అల్లు రామలింగయ్య తేలిగ్గా నవ్వేస్తూ.

 

సినిమాకు తెలుగు పదకోశం…

 

ఒక చిన్న నటుడికి కొంతకాలం క్రితం  షూటింగ్ వచ్చింది. ఆ సినిమా పేరు ‘బృందావనం”. చందమామ విజయా వారిది. ఆ చిన్ననటుడి పేరు ప్రకాష్.  ఒకసారి వేశాడు. ఆ వేషం మళ్లీ రావడంతో అతనికి షూటింగ్ వచ్చింది. ప్రొడక్షన్ వాళ్లు అతన్ని కాంటాక్ట్ చేశారు. అతను ఇంట్లో లేడు. – అంటే రూములో లేడు. మర్నాడు తిరుపతి బయల్దేరాలి – షూటింగ్ అక్కడ. “రాత్రికి వస్తాడు. మీరు లెటర్ రాసి తలుపుకింద నుంచి తోసేయండి” అని పక్కవాళ్లు చెప్పారు. ఆమాట ప్రొడక్షన్ వాళ్లు డైరక్టోరియల్ డిపార్ట్‌మెంట్‌కి విన్నవించారు. “అయితే ఓ లెటర్రాసి పంపేయండి. రేపు అతను బయల్దేరాలి” అన్నారు దర్శకశాఖ వారు. కాని ఓ చిక్కొచ్చింది. ఆ ప్రకాష్ అనే ఉపవేషధారికి ఇంగ్లీషు రాదనీ, తెలుగులోనే సుబ్బరంగా ఈ లేఖ రాయమనీ ప్రొడక్షన్ వారు చెప్పగా, దర్శక శాఖలో కొత్తగా చేరిన ఒక అబ్బాయికి (పేరు చెబితే అతను బాధపడతాడేమో – అయినా ఇది సరదాగా తీసుకోవలసిందే గనక చెప్పొచ్చు) – పేరు గోపాల్రావు – చెప్పారు.

కంపెనీ లెటర్ హెడ్‌మీద రాసి, అతన్నే తీసుకెళ్లి ఆ రూము తలుపుకింద నుంచి లోపలకి తోసేయమన్నారు. తెలుగులోనే రాయాలన్నారు. గోపాల్రావు లెటర్ హెడ్ పట్టుకుని కూచుని, గంట గంటన్నర సేపు తెలుగు భాషతో కుస్తీ పట్టి, ఎలాగైతేనేం లెటర్ రాసి తీసుకెళ్లి తలుపు సందులోంచి నెట్టాడు. మర్నాడు ఉదయం – ప్రకాష్ అనే ఆ చిన్ననటుడు ఆ లేఖ తెచ్చి అందరికీ చూపించాడు. అందులో ఇలా ఉంది.

చందమామ విజయా కంబైన్స్

విరేచన చిత్రాల నిర్మాతలు

వాహినీ స్టూడియోలు, మదరాసు – 26.

శ్రీ ప్రకాష్ గారికి,

సహాయ దర్శకుడినైన నేను గోపాలరావు తెలియజేయుచున్నాను. ఆర్యా! రేపు తమకు కాల్పులు గలవు. మన చిత్రము యొక్క కాల్పులు తిరుపతిలో జరుగును. కాల్పులలో మొదటి దెబ్బ మీ మీదే. అందువలన రాత్రికే బయల్దేరవలెను. కాల్పులు రెండు రోజులు జరిగిన తర్వత మీరు తిరిగి రాగలరు. ఈ లేఖ అందిన వెంటనే మా కార్యలయమునకు విచ్చేసి ఖర్చులు అందుకొన గలరు.

 

ఇట్లు,

శిక్షణలో వున్న సహాయ దర్శకుడు

జి.గోపాలరావు

ఈ లేఖ చూసి అందరూ ఒకటే నవ్వు. గోపాలరావు “విరేచన చిత్రాల నిర్మాతలు” అన్నది లెటర్ హెడ్ మీద వున్న మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్‌కి తెలుగు అన్నమాట! అలాగే షూటింగ్ అన్నదానికి ‘కాల్పులు’అన్నాడు. “మొదటి దెబ్బ మీదే” అంటే ఫస్ట్ షాటులోనే మీరుంటారనిట! ఆలోచించి ఆలోచించి సత్యానువాదం (ట్రూ ట్రాన్స్‌లేషన్) చేసిన గోపాలరావును చూసి నవ్వాలో ఏడవాలో తెలీలేదు. దీనిమీద వచ్చిన ఆలోచనతో, షూటింగ్‌లో వచ్చే ఇంగ్లీషు పదాలకు తెలుగు పడితే ఎలా వుంటుంది?

సైలెన్స్           :  నిశ్శబ్దము

ఆల్‌లైట్స్         :  అన్ని దీపములూ

రెడీ ఫర్ టేక్     :  తీతకు సిద్ధము

క్లాప్              :  చప్పట్టు

యాక్షన్          :  నటించు!

కట్               :  కోయుము!

క్లోజ్‌షాట్         : మూతదెబ్బ

లాంగ్ షాట్      :  దూరపు దెబ్బ

మిడ్ షాట్       :  మధ్య దెబ్బ

క్రేన్ షాట్         :  కొంగ దెబ్బ

ట్రాలీషాట్         :  బండి దెబ్బ

ఇలా రాసుకుని తెలుగులోనే షూటింగ్ చేస్తే ఎలా వుంటుందో చూడాలనిపించింది.

 

ఎవరు చూస్తార్లెండి…?

 

ఒక సినిమా అవుడ్డోర్ షూటింగు. నెల్లూరు దగ్గర. నేనూ వేశాను అందులో. నా పాత్రకి (అంటే నాకే)మీసం వుంది. లంచ్ బ్రేక్ వరకూ షూటింగ్ చేసి, భోజనం చెయ్యమన్నారు. అప్పుడు మీసం తీసేసి, భోజనం కానిచ్చి ‘రెడీ’ అవమన్నంత వరకూ కూచున్నాం. అంతలో ఇంకో లొకేషన్‌కి పదండి పదండన్నారు. మీరు బయల్దేరండన్నారు నన్నూనూ. ‘మీసం పెట్టుకోవాలే’ అని నసిగాను. మేకప్ అసిస్టెంట్ మీసం క్లీన్ చేసి వెనకాలే వస్తానన్నాడు. ఈలోగా కార్లు బయల్దేరుతున్నాయి ఎక్కండంటే ఎక్కండన్నారు. ఆ లొకేషన్‌లో అంతా అడావుడిగా వుంది. కారణం ఏమిటంటే హీరోయిన్ మూడు గంటలకి వెళ్ళి పోవాలట! ఆమె కాంబినేషన్‌లో వున్న సీను తియ్యాలి. ఆ సీన్‌లో నేనూ వున్నాను. ఓ పక్క నుంచి జనం. ఇంకో పక్క నుంచి ఎండ తగ్గుట, హెచ్చుట. ఈ టెన్షన్‌లకి మించిన టెన్షను హీరోయిన్‌ని పంపాలి!  డైరెక్టరు రెడీ రెడీ అని అరుస్తున్నారు.

“డైలాగులు చూసుకోండి సార్, ఏదో ఒకటి చెప్పండి… తర్వాత చూసుకుందాం. రడీ – “రండీ” అన్నాడాయన రడీ మధ్య సున్నా పెట్టి నావేపు చూసి.

“నా… మీసం…” అని గొణిగాను. “ఏమైంది మీసం?… ఏయ్… ఎవరయ్యా మీసం?” అని అరిచాడు డైరక్టరు.

“మీసం అసిస్టెంటు దగ్గరుంది. అతను వెనకాల జీపులో వస్తున్నానన్నాడు… రాలేదు మరి” అని ఈసారి సణిగాను. “పర్వాలేదు. మీసం గురించి ఆలోచించకండి… రండి.. డైలాగ్ చెప్పండి”

“అదెలా? అంతకుముందున్న సీన్లలో మీసం వుండీ, ఈ సీన్లో లేకపొతే?… మొహానికి చెయ్యి అడ్డం పెట్టుకుని, యాక్షన్లో ఇరికించేస్తూ డైలాగు చెబుతూ వుంటే, డైరెక్టరు గారు మండి పడ్డారు. “ఎందుకు సారు మీకా బాధ? మీసం లేకపోతే ఏమైంది ? ప్రజలు మీ మీసం కోసమే పట్టించుకుంటారా –  రండి, రడీ” అంటున్నా డాయన.

నేనింకా ఆశగా మేకప్ అస్టిటెంటు వస్తున్న జీపుకోసం చూస్తున్నాను. “రెడీ… షాట్ రెడీ… రండి కొండలరావుగారూ! ఎవరు చూస్తారు?”

అంతే! నేను అలాగే వెళ్లి మీసరహితుడినై నటించేశాను. అయిపోయింది, హీరోయిన్ వెళ్లి పోయింది! “ఎవరు చూస్తారు?” అని డైరక్టరన్నట్టే అయింది – ఆ సినిమా! మరి, ఎవరూ చూడలేదు!

 

 

ఆడతారా…?

ఒక అవుడ్డోరు షూటింగ్‌లో ఓ సాయంకాలం. గ్రామంలోని పెద్దాయన ఇంట్లో మా బస. అందరూ అంటే తోటినటులు – స్నానాలు చేసి హాల్లో పేకాట మొదలు పెట్టారు. నేను ఆడను. పక్కనే కూచున్నాను. ప్రారంభంలో పేక పంచుతున్న పెద్దమనిషి – “సార్, కొండలరావు గారూ – మీరు ఆడతారా?” అని అడిగాడు.

“అబ్బే – నేను మగతారను”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *