May 2, 2024

మౌనరాగం – 5

రచన: అంగులూరి అంజనీదేవి anjanidevi

http://www.angulurianjanidevi.com/

anguluri.anjanidevi.novelist@gmail.com

– See more at: http://magazine.maalika.org/2014/02/01/%e0%b0%ae%e0%b1%8c%e0%b0%a8%e0%b0%b0%e0%b0%be%e0%b0%97%e0%b0%82-4/#sthash.iMqJo7rG.dpuf

http://www.angulurianjanidevi.com/

anguluri.anjanidevi.novelist@gmail.com

రోజులు గడుస్తున్నాయి.

లంచ్‌ బ్రేక్‌లో పత్రికాఫీసు స్టాఫ్‌లో కొంతమంది బైక్‌ల మిాద ఇళ్లకెళ్లారు.  కొంతమంది లంచ్‌రూంలో కూర్చుని లంచ్‌ చేస్తున్నారు.

సుభాష్‌చంద్రకి ఇంటి దగ్గర నుండి లంచ్‌ రాగానే తన ఛాంబర్‌ లోంచి బయటకొచ్చి లంచ్‌రూంలోకి వెళ్తూ ఒంటరిగా కూర్చుని వున్న దేదీప్యను చూసి ఆగిపోయాడు.

‘‘దేదీప్యా! లంచ్‌ చేశావా?’’ అంటూ దేదీప్యను పలకరించాడు. ఆయన్ని చూడగానే లేచి నిలబడింది దేదీప్య.

‘‘లేదు సర్‌! చెయ్యలేదు.’’ అంది దేదీప్య.

‘‘లంచ్‌ బాక్స్‌ తెచ్చుకున్నావా?’’ అన్నాడు సుభాష్‌చంద్ర.

తెచ్చుకోలేదన్నట్లుగా తల అడ్డంగా వూపింది.

‘‘సరే!  ఈ రోజు ఇద్దరం కలిసే లంచ్‌ చేద్దాం. నాతోరా!’’అన్నాడు.

‘‘ ఈ రోజెందుకో ఆకలిగా లేదు సర్‌.!’’ అంది.

‘‘దేనిగురించైనా ఆలోచిస్తున్నావా?’’

‘‘అదేం లేదు సర్‌!’’

‘‘హెల్త్‌  ప్రాబ్లమా?’’

‘‘అబ్బే… అలాంటిదేం కాదుసర్‌!’’

‘‘మరెందుకు ఆకలిగా లేదు?’’ అంటూ దేదీప్యను చూస్తూ, శ్రద్దగా ప్రశ్నించగా. ఆయన్నలా చూస్తుంటే దేదీప్య కళ్లు చెమర్చాయి.  వెంటనే దీపక్‌ గుర్తొచ్చాడు.

ఇంటి పనితో ఆఫీసు పనితో రెస్ట్‌ లేక ఉదయాన్నే లేచి లంచ్‌బాక్స్‌ రెడీ చెయ్యలేకపోయింది. పడుకొని వున్న దేదీప్యను ఏమైందని కాని, ఆరోగ్యం బాగాలేదా అని కాని అడగకుండా బయటకెళ్లి టీ త్రాగి, వచ్చి పేపర్‌ చదివి రెడీ అయి ‘నేను మధ్యాహ్నం హోటల్లో తింటాన్లే’ అంటూ ఆఫీసు కెళ్లాడు.

జాబ్‌లో జాయిన్‌ అయినప్పుడు బస్‌పాస్‌ తీసిచ్చాడు.

‘బస్‌పాస్‌ వుందిగా నీకు డబ్బుతో అవసరం ఏముంది?’ అంటాడే కానీ కనీసం ఇలాంటప్పుడైనా ఆఫీసు కాంటిన్‌లో తిను అని డబ్బులివ్వడు.

‘‘కళ్లు తుడుచుకో దేదీప్య! నీలాంటి అమ్మాయిలు కళ్ల నీళ్లు పెట్టుకోకూడదు.  అసలు కళ్లనీళ్లు ఎందుకొస్తున్నాయో కారణం తెలుసుకొని దానికి నీ బాధ్యత ఎంతవుందో ఆలోచించి, యింకెప్పుడు                                కన్నీళ్లు పెట్టుకునే అవసరం రాకుండా చూసుకో.  ఒకరి నుండి ప్రేమను ఆశించకుండా నిన్ను  నీవు ప్రేమించటం నేర్చుకుంటే కన్నీళ్లు రావు. దీనికి ఆత్మ పరిశీలనతో పాటు, ఆత్మ విమర్శ కూడా అవసరమవుతుంది. రా. తింటూ మాట్లాడుకుందాం.’’ అంటూ ఆయన లంచ్‌ రూం వైపు వెళ్తుంటే ఖర్చీఫ్‌ తో కళ్లు తుడుచుకొని ఆయన వెంట నడిచింది.

‘‘ప్రపంచం చాలా మారిపోతుంది దేదీప్య! చాలా మంది`వాళ్లు తమ విలువల్ని పెంచుకోవటానికి వాళ్లేం చేయాలో…  ఏ పని చేస్తే ఎదుగుతారో ఆలోచిస్తున్నారే కాని చిన్న, చిన్న సిల్లీ విషయాలకి ప్రాధాన్యత యిచ్చి ఏకాగ్రతను దెబ్బతీసుకోవటం లేదు. నువ్వింకెప్పుడు ఇలా ఏడ్చే ఆలోచనలు చేస్తూ నీకున్న విలువైన టైంను వృదా చేసుకోకు. ప్రస్తుతం మనిషి సరైన మార్గంలో వున్నా కూడా కదలకపోతే వెనకవాళ్లొచ్చి తొక్కుకుంటూ పోయే రోజులివి.’’ అన్నాడు సుభాషచంద్ర.

‘‘సరే సర్‌’’! అంది నవ్వీ నవ్వనట్లు నవ్వి రిలీఫ్‌గా చూస్తూ…ఆకాశాన్ని వర్షాలు కడిగేసినట్లు ఆమె ముఖం తేటగా మారింది.

ఇద్దరు కూర్చున్నారు. ఆఫీస్‌ బాయ్‌ వడ్డిస్తున్నాడు.

‘‘ఎప్పుడైనా మన ఐడియాలను, ఆలోచనలను ఎనలైజ్‌ చేసుకుంటే మన ఆలోచనల్లో సీరియస్‌నెస్‌ పెరుగుతుంది.  అప్పుడు జీవితానికి పనికొచ్చే ఆలోచనల్ని చెయ్యగలుగుతాం. ఇక నేను ఇంతే!  నా

బ్రతుకు ఇంతే! నా ఏడుపు ఇంతే! ఇంతకన్నా ఏంచేయలేను అనుకుంటే మాత్రం అంతే! ప్రస్తుతం ఎక్కడున్నావో ఎప్పటికీ అక్కడే వుంటావ్‌! మన విజయానికైనా, అపజయానికైనా మన ఆలోచనలు, మన పనులే కారణం.’’ అన్నాడు సుభాష్‌ చంద్ర.

ఆయన కళ్లలో కన్పిస్తున్న విజ్ఞానం మాటల్లోకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంటే శ్రద్దగా వింటోంది దేదీప్య.  స్వతహాగా ఆమెది తరచి, తరచి ఆలోచించే తత్వం అయినందువల్ల ఆయన మాట్లాడే ప్రతి మాటను ఆమె మనసు చక్కగా స్వీకరిస్తోంది.  తను ఇన్ని రోజులు తన భర్త ప్రేమ రాహిత్యం గురించే ఆలోచించేది.  దానిమీద పరిశోదన చేస్తున్నట్లు ఆలోచించేది.  దానికి కారణం పెళ్లికి ముందు తను చదివిన పుస్తకాలు అప్పుడప్పుడు చూసిన టి.వి. సీరియల్స్‌…. ప్రేమికుడి పట్ల తను కన్న కలల్ని అభిరాం కల్లలు చేశాడు.  భర్త పట్ల కన్న కలల్ని దీపక్‌ నేలపాలు చేశాడు. కొడితేనే నొప్పికాదు.  తిడితేనే బాధ కాదు….ప్రేమను గుర్తించకపోయినా బాధే. ప్రేమగా చూసుకోకపోయినా బాధే.

సుభాష్‌చంద్ర అంత సేపు ఎంత శ్రద్దగా మాట్లాడాడో, తింటున్నంత సేపు అంత శ్రద్దగా తిన్నాడు.

‘‘దేదీప్యా! నీకో గుడ్‌ న్యూస్‌ చెప్పాలి.’’ అంటూ తిన్న తర్వాత నాప్‌కిన్‌తో చేతులు తుడుచుకుంటూ నెమ్మదిగా అన్నాడు సుభాష్‌చంద్ర.

‘‘ఏమిటి సర్‌?’’ ఆసక్తిగా అడిగింది దేదీప్య.

‘‘బహుశా ఇది నువ్వు ఎక్స్‌పెక్ట్‌ చేసి వుండకపోవుచ్చు.  ఇది నీ ఫ్యూచర్‌కి బాగా                              ఉపయోగపడ్తుంది.’’ అన్నాడు.

నవ్వుతూ ‘‘అదేంటో చెప్పండి సర్‌?’’ అంది. ఫ్యూచర్‌ అనగానే నవ్వుగా వుంది దేదీప్యకి.  వర్తమానంలో కొట్టుకుంటుందే తప్ప భవిష్యత్తు కూడానా తనకి?

‘‘నిన్ను త్వరలో యు.కె.పంపాలనుకుంటున్నాను దేదీప్యా’’

అది వినగానే అదిరిపడింది దేదీప్య.

‘‘ఎందుకు సర్‌? యు.కె. వెళ్లి నేనేం చెయ్యాలి?’’

‘‘పత్రికా రంగంలో నీకు ఆధునిక శిక్షణ ఇప్పిద్దామనుకుంటున్నాను. మన పత్రికకు ఇకముందు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. నీ ద్వారానే నా ఆశయాలు నెరవేరాలి. ఏమంటావు దేదీప్యా?’’ అంటూ ప్రశాంతంగా అడిగాడు సుభాస్‌చంద్ర.

ఆయనలో తన శక్తి సామర్థ్యాలపై వున్న నమ్మకం మహావృక్షమై కన్పించింది దేదీప్యకి.  తనింత మాత్రమైనా సెక్యూర్డ్‌గా మారి ఈ మాత్రం వుండగలుగుతుందంటే దానికి కారణం సుబాష్‌చంద్రే అందుకే సుభాష్‌చంద్ర ఆశయాలకు ఊపిరిగా మారి ఆయనకు హెల్ప్‌గా వుండాలనుకొంది.

‘‘మా వారితో మాట్లాడి చెబుతాను సర్‌’’ అంది.

‘‘అలాగే… మరి నీకు పాస్‌పోర్టు?’’ అన్నాడు సుభాష్‌చంద్ర.

‘‘ఎం.బి.ఏ.లో జాయిన్‌ అయినప్పుడు పాస్‌పోర్ట్‌కి అప్లై చేశాను సర్‌! అప్పుడే నాకు పాస్‌పోర్టు వచ్చింది.’’ అంది దేదీప్య.

‘‘గుడ్‌!’’ అంటూ తన ఛాంబర్‌లోకి వెళ్లాడు సుబాష్‌చంద్ర.

ఆఫీసు అయిపోగానే ఎప్పటిలాగే వెళ్లి బస్‌స్టాఫ్‌లో నిలబడిరది దేదీప్య.

బస్‌లు బంద్‌ అని తెలియగానే వణికిపోయింది.

ఆటోలు నడవటం లేదు. సన్నగా వర్షం పడ్తోంది. తనిప్పుడు ఇంటికెలా వెళ్లాలా అని భయంగా రోడ్డువైపే చూస్తోంది.

అంతలో అభిరాం బైక్‌ మీద వెళ్తూ కన్పించాడు. అతన్ని చూడగానే….

‘‘అభిరాం!’’ అంటూ గట్టిగా పిలిచింది దేదీప్య.

అభిరాం వెంటనే తిరిగి దేదీప్యకి దగ్గరగా వచ్చి ఆగాడు దేదీప్య వైపు చూస్తూ.

‘‘ఇవాళ బంద్‌ ప్రకటించారు దేదీప్యా! రా. వెళదాం!’’ అన్నాడు.

ఒకప్పుడు దేదీప్యను బైక్‌ మీద ఎక్కించుకోవాలంటేనే….ఎంతగానో ఆలోచించిన అభిరాంకి ఇప్పుడు ఎలాంటి ఆలోచన రాలేదు.

అభిరాం వెనకాల కూర్చుని వెళ్తున్న దేదీప్యకి బంద్‌ కారణంగా ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా తిన్నగా ఇల్లు చేరుకోగలుగుతున్నానన్న ఫీలింగ్‌ తప్ప ఇంకే ఫీలింగ్‌ కలగలేదు.

ఇల్లు రాగానే అభిరాం బైక్‌ మీద నుండి దిగుతున్న దేదీప్యను లాలిత్య చూసింది…

దీపక్‌ చూశాడు.

లోపలకి వస్తున్న దేదీప్యను సూటిగా చూస్తూ ప్రశ్నార్థకంగా, కనుబొమలు ముడుస్తూ, ఏదో అనబోయాడు, దీపక్‌.

చెప్పులు సరిగ్గా విప్పకుండానే… యు.కె. వెళ్లే విషయం చెప్పటంతో దీపక్‌ హేపీ మూడ్‌లోకి వచ్చాడు. అంతవరకు దేదీప్య పట్ల వున్న అతని నెగటివ్‌ ఫీలింగ్స్‌ మర్యాదగా, ఆప్యాయంగా మారాయి.  అతనప్పుడప్పుడు అవసరాన్ని బట్టి అలాగే వుంటాడని దేదీప్యకి తెలుసు.

యు.కె. వెళ్లొచ్చాక భార్య సంపాదన పెరుగుతుందని, పెరిగిన సంపాదనతో తన సంపాదనతో తన వాళ్లకి ఇల్లు కట్టించవచ్చని…. ఇంకా కొత్తకొత్త ఆశలు, మనసులో మెదలటంతో దేదీప్యకి వెంటనే పర్మిషన్‌ యిచ్చాడు.

ఆ ఆనందంలో… దేదీప్యను  ఏ మాత్రం విసిగించకుండా  ఆరోజు హాయిగా నిద్రపోనిచ్చాడు.

 

*     *     *     *     *

 

ప్రొద్దుట నిద్రలేచినప్పటి నుండి రాజశేఖరం, యశోదర ఎప్పుడెప్పుడు బయటకెళ్తారా అని ఎదురుచూసిన లాలిత్య, వాళ్లేదో పంక్షన్‌ వుందని గాజువాక వెళ్లగానే ` తాతయ్య, మామ్మ దగ్గర కూర్చుని వున్న

అభిరాం దగ్గరికి నిప్పులు కక్కుతూ వచ్చి నిలబడింది లాలిత్య.లాలిత్యను అలా చూస్తుంటే పెళ్లికి ముందు ఎక్కడ

చూసినా పూలతో, ఆకులతో నిండివున్నట్లున్న ప్రపంచంలో ఇప్పుడొక్క ఆకులేదు, పువ్వు లేదు. అంతా ఎండిపోయి ఎండుటాకులా అన్పిస్తోంది అభిరాంకి.

 

‘‘ ఈ రోజు కూడా ఆ దేదీప్యను మిా బండి మీద ఎక్కించుకొని వస్తారా?’’ అంది  స్ట్రైట్‌గా నిలబడి అభిరాంని నిలదీస్తూ. నడుం మీద వున్న ఆమె రెండు చేతులు యుద్దనారిని తలపింపజేస్తున్నాయి. ఆమెనలా చూడగానే ఆ దంపతులిద్దరు ఆశ్చర్యపోతూ చూశారు.

‘‘ రాత్రి కూడా ఇలాగే గొడవచేసి నాకు నిద్ర లేకుండా చేశావ్‌! మళ్లీ మొదలుపెట్టావా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నిన్న సిటిలో బంద్‌ కాబట్టి ఇంటి పక్కన అమ్మాయి కదా అని తీసుకొచ్చాను. ఈరోజెందుకు తీసుకొస్తాను?’’ అన్నాడు అభిరాం.

‘‘ఎందుకంటే ఏం చెప్పాలి? చుట్టు పక్కలవాళ్లు చూస్తారన్న వెరపు కూడా లేకుండా మీ ఇద్దరిలా బరితెగించి తిరుగుతుంటే కట్టుకున్న పాపానికి నా కళ్లతో నేను చూడలేకపోతున్నా’’ అంది .

‘‘ఆపదలో వున్న అమ్మాయికి లిఫ్ట్‌ ఇచ్చి సాయం చేశాను. అంతే! ఈ విధంగా నువ్వు పెడర్థాలు తీసి పిచ్చిగా మాట్లాడకు.’’ అన్నాడు అభి.

‘‘నన్ను`మీరూ, మీ అమ్మా కలిసి పిచ్చిదాన్ని చేసి చూస్తున్నారు. మిమ్మల్ని అనేం లాభంలే. ఇదిగో ఇదంతా వీళ్ల పెంపకం… మీకు ఇంతకన్న బాగా పెంచటం రాలేదా?  ఇలాగేనా పిల్లల్ని పెంచేది?’’ అంటూ వాళ్లవైపు చూసి దబాయించిది.  గుడ్డు పోయి పిల్ల నెక్కిరించినట్లు. వయసు తారతమ్యం లేకుండా లాలిత్య అలా మాట్లాడుతుంటే ఆ పెద్దవాళ్లు సిగ్గుతో చితికిపోయారు.

వాళ్లనలా నేరస్తుల్ని దండించినట్లు మాట్లాడటం అభిరాంకి నచ్చలేదు. అలా మాట్లాడుతుందని కూడా అతను వూహించలేదు.  దారినపోతున్న వాళ్లను లోపలికి పిలిచి కట్టేసి కొట్టినట్లు అన్పించింది.

‘‘నీ కసలు మైండ్‌ పనిచేస్తుందా? ’’ అన్నాడు కోపాన్ని ఆపుకోలేక.

‘‘ మీ అమ్మ కూడా నన్నిలాగే అంటుంది. ఆ దేదీప్యను చూసి నేర్చుకో అని ఆ దేదీప్యకేనా మైండ్‌ పని చేసేది? నాకు చెయ్యదా? ’’ అంటూ కేక లేసింది.

‘‘నేర్చుకోవలసిన అవసరము వచ్చినప్పుడు ఎవరిని చూసైనా నేర్చుకోవచ్చు.  నువ్వనుకున్నట్లు దేదీప్య కాని, అభిరాం కాని అలాంటి వాళ్లు కాదు. నువ్వింత నీచంగా మాట్లాడటం మాకు నచ్చటం లేదు.’’ అన్నాడు నారాయణవు చూస్తూ వూరుకోలేక.

‘‘మీరూరుకోండి! మీకేం తెలియదు. ఈయనగారు  చేసే పనులు ఎప్పుడో ఒకసారి వచ్చి చూస్తే మీకేం తెలుస్తుంది? ఇక్కడ రోజూ నేను అనుభవిస్తున్నాను.   నిన్న బస్‌లు బంద్‌ అన్నాడు.  ఇవాళ ఇంకేం చెబుతాడో. అయినా మీ పెంపకం ఇలా తగలడింది కాబట్టి ఆయన అలా తయారయ్యారు. ముందు మిమ్మల్ని అనాలి.’’ అంది నిర్లక్ష్యంగా చూస్తూ.

ఇందుమతికి తట్టుకోలేనంత కోపం వస్తోంది.

అభిరాంని ఎంత జాగ్రత్తగా పెంచింది ఏనాడైనా అమ్మాయిల్ని కన్నెత్తి చూశాడా! కంప్లైంట్స్‌ తెచ్చాడా?

‘‘మా పెంపకం నువ్వు వేలెత్తి చూపేంత తక్కువ స్థాయిలో లేదు.  ఇంకెప్పుడూ అలా అనకు. ’’ అంది ఇందుమతి.

‘‘అవునవును ఆరడుగులు ఎత్తులో కళ్లముందే కన్పిస్తుందిగా మీ పెంపకం మిమ్మల్ని మీరు సమర్థించుకోవటం ఆపి నోరుమూసుకోండి.’’అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న లాలిత్య చెంప చెళ్లుమంది.

మండుతున్న చెంపను అలాగే పట్టుకొని

‘‘నన్ను కొడతారా మీరు?’’ అంటూ అభిరాం వైపు కోపంగా చూసి, వెంటనే ఇందుమతి వైపు తీక్షణంగా చూస్తూ.

‘‘మీవల్లనే కదూ ఆయన నన్ను కొట్టింది?’’ అంటూ కొండను ఢీకొనే పిల్లకెరటంలా చక చక మెట్లెక్కి పైకెళ్లింది.

అభిరాం అక్కడోక్షణం కూడా వుండకుండా బయటకెళ్లిపోయాడు. అతనలా బయటకెళ్లగానే…

‘‘ఈ ముసలోళ్లు నన్ను కొట్టిస్తారా?’’ అని మనసులో అనుకుంటూ వెంటనే క్రిందికి దిగి, కిచెన్‌ రూంకి తాళం వేసి, డైనింగ్‌ టేబుల్‌ మీద వున్న బ్రేక్‌ఫాస్ట్‌ పట్టుకొని పైకెళ్లింది.

దేదీప్య తను యు.కె. వెళ్లబోతున్న విషయం తాతయ్యకి, బామ్మకి చెప్పాలని వాళ్ల దగ్గరికి వచ్చింది.

దేదీప్యను చూడగానే జరిగింది తెలిస్తే దేదీప్య బాధపడ్తుందని, అక్కడ ఏమి జరగనట్లే మౌనంగా కూర్చున్నారు.

దేదీప్య నవ్వుతూ… బామ్మా భుజాల చుట్టూ చేతులు వేసి, తాతయ్య వైపు చూస్తూ…

‘తాతయ్యా! నాకు యు.కె. వెళ్లే చాన్స్‌ వచ్చింది.  ఆయన కూడా ఒప్పుకున్నారు’’ అంది.

‘‘సంతోషం తల్లీ!’’ అన్నాడు. ఇందుమతి కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

‘‘బ్రేక్‌ ఫాస్ట్‌ అయిందా తాతయ్య?’’ అంది దేదీప్య.

వాళ్లేమీ చెప్పకుండా మౌనంగా వున్నారు.

‘‘ఏంటలా వున్నారు? తిన్నారా? లేదా?’’ అంది దేదీప్య.

‘‘ఇంకా తినలేదు దేదీప్యా!’’ అన్నారు.

‘‘వుండండి! నేను తెస్తాను’’ అంటూ కిచెన్‌ వైపు వెళ్లింది.

డోర్‌ లాక్‌ చేసి వుండటంతో వెంటనే వాళ్లదగ్గరకి వచ్చి.

‘‘కిచెన్‌ లాక్‌ చేసి వుందేం బామ్మా?’’ అంటూ ఆశ్యర్యపోయింది దేదీప్య.  బామ్మ కళ్లలో ఎంత దాచుకుందామన్నా తడి కన్పించింది.

‘‘ఇదంతా మా ఖర్మ! మా మనవరాలి ఘనకార్యం.’’ అని వాళ్లు అనగానే విషయం అర్థమై దేదీప్య హృదయం ద్రవించి పోయింది.

వెంటనే ఇంటికెళ్లి నారాయణరావుకి, ఇందుమతికి టిఫిన్‌ తెచ్చిపెట్టింది. వాళ్లు తినేంత వరకు అక్కడే కూర్చుని తర్వాత ఆపీసుకి వెళ్లింది.

దేదీప్య అలా వెళ్లగానే భార్యవైపు చూస్తూ…

‘‘మనిషన్నాక మానవత్వం వుండాలి ఇందూ! సెంటిమెంట్స్‌తో పాటు మంచితనం  వుండాలి. సిగ్గు, మొహమాటం వుండాలి. ఇవేమీ లాలిత్యలో నాకు కన్పించటం లేదు.  ‘రాజశేఖరం గారి కోడలు గొప్ప అందగత్తె’ అని నలుగురు అనుకోవాలని మన అల్లుడు గారు ఆశపడ్డారు. కానీ చూస్తుంటే  “పంది ముక్కున బంగారు ముక్కెరలా అన్పిస్తుందీ అమ్మాయి.’’ అన్నాడు బాధగా.

తన పెంపకములో ఎలాంటి లోపం లేకపోయినా లోపం వున్నట్లే నలుగురితో చెప్పేలా వున్న లాలిత్య మాటలు గుర్తొస్తుంటే ఇందుమతికి బాధగా వుంది. అంతటి అవమానాన్ని సైతం భరిస్తూ, సర్దుకుపోతున్న అభిరాంని చూస్తుంటే జాలిగా వుంది. జీవితాంతం ఈ మానసిక వికలాంగురాలుతో తన మనవడిలా బ్రతకవలసిందేనా తట్టవలసిందేనా అని వేదనగా వుంది. దీనికి పరిష్కారం కావాలంటే కాలం తలుపు అనుకుంటూ భర్త వైపు చూసింది.                                 ‘‘ఇందూ! ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడవేరు’’అనే తెలుగు పద్యం గుర్తుందా? ఈ పద్యం పండితులకే కాక పామరులకి కూడాకొట్టిన పిండి.  ఎందుకో తెలుసా? దీనిలో   లోకసత్యం వుంది. పైకి ఒక్కలాగే కన్పించినా కూడా…. ఉప్పు లాలిత్య. కర్పూరం దేదీప్య.

‘‘ఇప్పుడీ ఉప్పునేం చేయాలి దేవుడా?నా మనవడి గతి ఇంతేనా?’’ అంది దిగాలుగా భర్త మాటలు వింటూ….

నారాయణరావు పరిస్థితి కూడా అలాగే వుంది.

 

*    *    *    *     *

 

అన్వేష్‌ వాళ్ల కాలేజీలో ప్లేస్‌మెంట్స్‌ జరగుతున్నారు.

అమృతరావు కొడుకు చేత ఏదెనా ఇండస్ట్రీ పెట్టించాలని వున్నా కూడా ముందు జాబ్‌ చేస్తే ఎక్స్‌పీరియన్స్‌ వస్తుందని, జాబ్‌ చేయ్యమని అన్వేష్‌తో చెప్పాడు.

అన్వేష్‌ ప్రాజెక్టు వర్క్‌ చేస్తూనే ఇంటర్వ్యూలకి అటెండ్‌ అవుతున్నాడు.

 

*     *     *     *     *

 

యు.కె. వెళ్లిన దేదీప్య ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని, ఈ రోజు ఇండియా వస్తుందని తెలియగానే ఆనందంగా ఆమెను రిసీవ్‌ చేసుకోటానికి ఎయిర్‌పోర్టుకి వెళ్లాడు దీపక్‌.

భర్త ముఖంలో అంత ఆనందాన్ని ఎప్పుడూ చూడని దేదీప్యకి కొత్తగా అన్పించింది.  ఒక్క క్షణం ఆమె దృష్టి దీపక్‌పై  నిలిచింది.

తల్లీదండ్రీ లేకపోయిన అల్లారుముద్దుగా అన్నయ్య దగ్గర పెరిగి, హాస్టల్లో వుండి చదివి.  పెళ్లయ్యాక బోలెడంత భవిష్యత్తును గుండెల్లో నింపుకొని, దీపక్‌ చిటికెన వేలే కొండంత ఆధారంగా భావించి, సంసార సాగరాన్ని అవలీలగా ఈదేద్దామనుకున్నప్పుడు దీపక్‌ నుండి ఎలాంటి సహకారం అందలేదు. ఆ సంసారంలో ఆనందం లేదు. ఓదార్పు లేదు.  ఎలాంటి సహకారం అందలేదు.  ఆ సంసారంలో ఆనందం లేదు.  ఓదార్పు లేదు, చిరునవ్వు లేదు.  అనురాగమైన స్పర్శలేదు.ఎప్పుడు చూసినా బడ్జెట్‌ ! లెక్కలు! అదే లోకంగా`తనలోని, తెలివిని, అందాన్ని గుర్తించకుండా తన సున్నితమైన భావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు. నీకున్న తెలివి, జ్ఞానం, నీకే ఉపయోగపడనప్పుడు అవి వున్నా దండగే అని తన మనసు తనని సవాల్‌ చేసేంతగా బాధపెట్టాడు.

అదే భర్త ముఖంలో` ఈ రోజు తనని చూడగానే కన్పిస్తున్న ఆనందం, ఉత్సాహం, అంబరాన్ని తాకుతున్నాయి.తనకి ఉద్యోగం లేనప్పుడు ఎందుకు పనికి రాని వస్తువులా చూసిన ఆ దీపక్కేనా ఇతను అన్పించేలా వున్నాడు.  పైగా అతని చూపులు సాంకేతిక నైపుణ్యంతో తయారైన యంత్రాన్ని ఒక నిపుణుడు  చూసే చూపుల్లా వున్నాయి.  ఇక పర్వాలేదు.  ఈ యంత్రాన్ని ఉపయోగించి ఎంత డబ్బయినా సంపాయించవచ్చన్న కాంక్ష కూడా వుంది.  చూస్తున్న కొద్ది దీపక్‌లో మంచి వ్యాపారస్తుడు కన్పిస్తున్నాడు.  తనలోని ఫీలింగ్స్‌ని ఏ మాత్రం బయట పడకుండా మామూలుగా వుండటానికి ప్రయత్నిస్తోంది దేదీప్య.

అంతలో సుభాష్‌చంద్ర కారొచ్చి దేదీప్యకి దగ్గరగా ఆగటంతో ఉలిక్కిపడి చూశాడు దీపక్‌.  దేదీప్య  చూపులు మాములుగా వున్నా, కారులో ఉన్న వ్యక్తి అతి ముఖ్యమైన వ్యక్తి అన్న భావం ఆమెలో తొంగి చూసింది.

సుభాస్‌చంద్రలో… దేదీప్యను చూడగానే తన ఆలోచనలకి అనుగుణంగా మలుచుకున్న శిల్పాన్ని చూసినప్పుడు ఒక శిల్పికి కలిగే ఆనందం కలిగింది.

ఎంతో డిప్రెషన్‌లో జీవిస్తున్న తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించి తనలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకొని రీచార్జ్‌ చేసుకునే అవకాశాలను కల్పించిన సుభాష్‌చంద్ర వైపు కృతజ్ఞతగా  చూసింది దేదీప్య. అది గమనించిన సుభాష్‌చంద్ర…..

‘‘బాగున్నావా దేదీప్య’’ అంటూ నవ్వుతూ పలకరించి ఆమెను కార్లో ఎక్కించుకున్నాడు. దీపక్‌ కూడా కారెక్కాడు.

కారుని నేరుగా రెస్టారెంట్‌కి పోనిచ్చాడు సుభాష్‌చంద్ర.

కారు దిగి ముగ్గురు రెస్టారెంట్‌ లోపలకెళ్లి కూర్చున్నారు.

దేదీప్యతో చాలా ముఖ్యమైన విషయాలను చర్చించటానికే ఆయన రెస్టారెంట్‌కి  తీసుకొచ్చారని వాళ్లని చూడగానే అర్థం చేసుకున్నాడు దీపక్‌.

సుబాష్‌చంద్ర దేదీప్యను పి.ఎ.గా చూడకుండా తనకెంతో విశ్వసనీయమైన వ్యక్తిగా భావించి, తన పత్రిక పురోభివృద్దికి తోడ్పడుతుందన్న ఉద్దేశంతో యు.కె. పంపాడు.  ఆమె టాలెంట్‌కి ఇంకాస్త మెరుగులద్ది ఆమెకు కొన్ని బాధ్యతల్ని అప్పజెప్పే ప్రయత్నంలో వున్నాడు.

ముందుగా దేదీప్యతో` పత్రిక గురించి, పోటీ గురించి, భవిష్యత్‌లో ఆర్థిక సమస్యల గురించి చర్చించాడు.

ఆ తర్వాత మన దృష్టి, ఏకాగ్రత, మనసు, ఒక లక్ష్యం పట్ల ఎలా వుండాలో…. కొత్త ఆలోచనలు చేస్తూ,  కొత్త వ్యక్తులతో పరిచయాలను పెంచుకొని ఎప్పుడూ ఎలా ఫ్రెష్‌గా వుండాలో… మన క్రిందపని చేసే వాళ్లను, సబార్డినేట్స్‌ను తక్కువ దృష్టితో చూడకుండా ఇతరుల అభిప్రాయాలను, అభిరుచులను లోతుగా, చక్కగా ఎలా అర్థం చేసుకోవాలో… అవరోదాలను, ఆటంకాలను  ఎదుర్కుంటూ లక్ష్యం పట్ల విజయం పట్ల దృష్టిని ఎలా కేంద్రీకరించాలో చెప్పాడు.

తన పద్దతిలో తను వింటోంది దేదీప్య. ఆమె ప్రతి కదలికలో పరిపూర్ణమైన వ్యక్తిత్వం కన్పిస్తూ దీపక్‌ని ఆశ్చర్యపరుస్తోంది.

‘‘దేన్నైనా! నేను సాధించగలను.  అని  నమ్మినప్పుడే మనం టాప్‌ పొజిషన్‌లోకి రాగలుగుతాము దేదీప్యా! మన బలమైన నమ్మకమే మనల్ని విజేతలుగా మారుస్తుంది. అలాంటి మనకు ఏం చేయాలో

ముందుగానే తెలిసిపోతుంది.’’ అంటూ ఇండియాలో, ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో సక్సెస్‌ అవుతున్న కొందరు వ్యక్తుల్ని ఎగ్జామ్‌పుల్‌గా చెప్పాలి.

దీక్షగా వింటున్న దేదీప్య ముఖంలోకి పరీక్షగా చూస్తూ

‘‘మన నమ్మకమే మన విజయానికి బలమైన పునాది. మనలో వుండే అనంతమైన శక్తిని మనమే నిద్రలేపుకోవాలి. చిన్న, చిన్న పొరపాట్లను, తప్పులను పట్టించుకోకుండా ఏకాగ్రతతో కృషి చెయ్యాలి. అసలే పోటీ తత్వం పెరిగిపోతున్న ఈ టైంలో అనవసర వాదాలకి, వివాదాలకి గొడవలకి కూడా దూరంగా వుండాలి.’’ అంటూ పత్రికకు సంబంధించిన మరిన్ని డీటైల్స్‌తో పాటు కొన్ని సీక్రెట్స్‌ కూడా చెప్పాడు.

ఏకాగ్రతతో వింటున్న దేదీప్య పక్కన శ్రోతలా మిగిలిన దీపక్‌కి కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లుంది.

సుబాష్‌చంద్ర ఇచ్చిన ఆర్డర్‌ తీసుకొని వెయిటర్‌ వెళ్లిపోయాక…. సుబాష్‌చంద్రను, దేదీప్యను చూస్తూ ఒకసారి తను వేసుకున్న డ్రస్‌ వైపు చూసుకున్నాడు దీపక్‌ పర్వాలేదు పాతదైనా ఇస్త్రీ మడతలు నలగలేదు అనుకొని తృప్తి పడ్డాడు.

అయినా కానీ వాళ్లలో కన్పిస్తున్న విశిష్టతకి మనసు మూలల్లో ఎక్కడో ఆత్మన్యూనతా భావం మొదలై దీపక్‌ని అతలాకుతలం చేసింది.

రెస్టారెంట్‌లోంచి బయటకొచ్చి ముగ్గురు కారెక్కారు.

ఇల్లు రాగానే…

కారులోంచి దిగుతున్న దేదీప్యను చూసి లాలిత్య షాకయింది.  పోయిందనుకున్న పీడ  మళ్లీ వచ్చిందా!!!  అనుకొని కొండచరియ విరిగి మీదపడ్డట్టు అప్పటికప్పుడే బెడ్డెక్కింది.

ఇంట్లోకెళ్లి దేదీప్య రిలాక్స్‌ అయ్యాక.

‘‘నీకోగిఫ్ట్‌…. ‘‘అంటూ ఎన్నో షాపులు తిరిగి ఏరి కోరి కొన్న చీరను దేదీప్య చేతుల్లో పెట్డాడు దీపక్‌.

ఆ చీరను దేదీప్య నచ్చుతుందో లేదోనని భయంగా వుంది. ఫ్లైట్‌ దిగివస్తున్నప్పుడు ఏమీ అన్పించలేదు కాని, రెస్టారెంట్‌లో సుబాష్‌చంద్ర ముందు కూర్చున్న దేదీప్యను చూసినప్పటి నుండి  అతనికి లోలోన ఏదో ఫీలింగ్‌ తను తక్కువన్న ఫీలింగ్‌.

తన ఎడబాటు అతనిలో బాగా మార్పు తెచ్చినట్లు గమనించింది దేదీప్య. ఆ మార్పు ఆమె కోరుకున్నది కాబట్టి ఆమెకు సంతోషంగా వుంది. పెళ్లయ్యాక దీపక్‌ నుండి తొలిసారిగా  ఆమె తీసుకున్న గిఫ్ట్‌ అది.

‘‘రేపు మన మేరేజ్‌ డే దేదీప్యా! అందుకే ఈ చీర కొన్నాను ఎలా వుంది?’’. అంటూ ఆమె ముఖంలోకే చూస్తూ అడిగాడు.

‘‘నిజం చెప్పనాండి? నాకు ఈ చీరకన్నా, నాకు చీర కొనాలన్న ఆలోచన మీకు వచ్చినందుకు చాలా సంతోషంగా వుంది.  మీ ఆలోచనల్లో నేనుంటే చాలు అని కోరుకునే నాకు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే.‘ఎలా చెప్పాలో తెలియని ఆనందం’ అంటే ఇలాగే వుంటుందనిపిస్తోంది.’’.అంది దేదీప్య దీపక్‌నే చూస్తూ….

ఆ రాత్రి ఆ యిద్దరి మధ్య గడిచిన మధురమైన క్షణాల్లోని మాధుర్యాన్ని వర్ణించటానికి యద్దనపూడి, యండమూరి సరిపోరేమో…. మళ్లీ ప్రబంధకవులు పుట్టాలేమో అనటానికి బయట కురుస్తున్న వెన్నెలే సాక్షి.

పక్క బంగళాలో అధునాతనమైన బెడ్‌రూంలో పడుకొని వున్న అభిరాంకి నిద్ర రావటం లేదు. దానికి కారణం లాలిత్య సణుగుడే. భరించలేక తప్పదన్నట్లు అతను మౌనంగా వుండే కొద్ది చిన్న విషయానికి కూడా నోరెక్కువ చేసి బెదిరించటం అలవాటు చేసుకొంది.

అభిరాంకి ఆఫీసులో వున్నంత సేపు వర్క్‌ బిజీలో వుండి ఏమీ అన్పించదు కాని ఇంటి కొచ్చాక నరకం కన్పిస్తోంది. ఎవరికి చెప్పినా సర్దుకుపొమ్మంటారు. బార్యాభర్త అన్నాక అవన్నీ మామూలే అంటారు. ప్రపంచంలో నూటికి తొంబైశాతం బార్యాభర్తలు యిలాగే వున్నారంటున్నారు. అలా వుంటేనే భార్యా, భర్తలంటున్నారు. ఒకసారి ముడిపడ్డాక తెంపుకోవటం కూడా కష్టమే అంటున్నారు.  అంతేకాని ఒక్కరు కూడా కరక్ట్‌  సొల్యూషన్‌ చెప్పి ‘ఇదీ నాయనా! ఇలా బ్రతుకు! అని చెప్పటం లేదు.

బయట వెన్నెల బాగున్నట్లనిపించి…. ఆలోచిస్తూ బాల్కనీలోకి వెళ్లి నిలబడ్డాడు అభిరాం.

అతనికి తొలిసారిగా దేదీప్య గుర్తొచ్చింది. ఫేర్‌వెల్‌ పార్టీ రోజు దేదీప్య అన్న మాటలు గుర్తొచ్చాయి. ‘‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అభిరాం! అన్నయ్యను అడిగి నన్ను పెళ్లి చేసుకుంటారా? అని అనటం ఇంకా తన చెవులకి విన్పిస్తున్నట్లే అన్పించి, బాధగా తలపట్టుకున్నాడు.

‘దేదీప్యా! దేదీప్యా! అంటూ అతని మనసు ఆక్రోశించింది.

‘‘అర్థరాత్రి దానింటి వైపు చూస్తూ అక్కడేం పని? రండి లోపలకి.’’ అంటూ గదిలోంచి బాల్కనీ వైపు చూస్తూ పిలిచింది లాలిత్య.  పక్కన భర్త లేకుంటే నిద్రపట్టదు లాలిత్యకి. అసలే దేదీప్యను చూసినప్పటి నుండి అనుమానం ఎక్కువై తిక్కతిక్కగా వుంది.  అసూయతో మనసు రగిలిపోతోంది. తన భర్తను తనెలా కాపాడుకోవాలి? అంత శక్తి తనకి వుందా? అని మనసులో అనుకుంటూ మళ్లీ పిలించింది.

లాలిత్య పిలుపు పొలికేక కాకముందే లోపలకెళ్లటం మంచిదని లోపలకెళ్లాడు అభిరాం.                                   ఎవరికైనా భవిష్యత్తుపై ఆశ పెంచుకోవటమే ఆనందమైతే దేదీప్య గుర్తొచ్చినప్పటి నుండి అభిరాంకి ఆనందంగా వుంది. ఒకప్పుడేమీ అన్పించలేదు కాని ఇప్పుడామె మాటలు ఓ జ్ఞాపకంలా మారి మంచుపొరల గుండా ఉదయించే సూర్యునిలా, పున్నమి రాత్రి కుండపోతగా కురిసే వెన్నెల్లా. చిరునవ్వయి పలకరించే తెల్లగులాబిపై నిలిచిన మంచుబిందువులా అన్పిస్తూ అతనికంటే ముందు మేల్కోని అతని తర్వాత నిద్రపోతూ నిత్యం అతని వెంటే అతని ఆలోచనలతో కలసిపోతున్నాయి. ఆ తలపుల్లో, తడిసిపోతూ కాసింత వెచ్చదనం కోసం ఆమె వూహల వాకిలిని తడుతూ ` తన రూపాన్ని ఆమె కళ్లలో నింపుకున్న ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ, ఆ క్షణాలను తేనెల ఊటలా, మల్లెల తోటలా, వెన్నెల వాగులా భావిస్తూ లాలిత్యను తాకితే కస్సుమంటుందని నిండుగా దుప్పటి కప్పుకున్నాడు.

 

*     *     *     *    *

 

మేరేజ్‌ డే కావటంలో ఆఫీసులో వర్క్‌ త్వరగా పూర్తి చేసుకొని ఇంటికెళ్లాడు దీపక్‌.

రేపటి  మీటింగ్‌ గుర్తు రావటంతో దానికి సంబంధించిన ఫైల్‌ని వెతుకుతూ, అది కన్పించకపోవటంతో బీరువాలో వుందేమోనని చూశాడు. అప్పుడప్పుడు ఇంటికి తెచ్చిన ఫైల్స్‌ని దేదీప్య బీరువాలో కూడా దాస్తుంది. ఫైల్‌ కన్నా ముందు దేదీప్య కన్పించింది దీపక్‌కి.

ఆ డైరీ మామూలుగా కన్పిస్తే పట్టించుకునేవాడు కాదుగాని, చేయి తగిలి క్రిందపడటంతో దాన్ని తీద్దామని వంగి. అందులోంచి తొంగిచూస్తున్న దేదీప్య, అభిరాంల ఫోటోని చూసి షాక్‌ తిన్నాడు.

అది మామూలు షాక్‌ కాదు. భూమి రెండుగా చీలి, అందులోకి జారిపోతున్న ఫీలింగ్‌తో కూడిన షాకు.

దేదీప్యకి డైరీ రాసే అలవాటు వుందా? అనుకుంటూ ఆశ్చర్యంగా ఈ డైరీని చేతిలోకి తీసుకొని ఒక్కో పేజీని తిప్పుతూ అందులోని అక్షరాలను మిస్‌ కాకుండా చదువుతూ నిలబడ్డాడు.

నా మనసు పుస్తకం నిండా మీరే వున్నారు అభిరాం!

నేను నా బెడ్‌ మీద పడుకున్న ప్రతిసారి….

ఆ పుస్తకాన్ని నా గుండెల మీద పెట్టుకొని రిలాక్స్‌ అవుతున్నాను.

రోజుకెన్నో సార్లు దాన్ని విప్పి చూస్తున్నాను.

అందులో వున్న కష్టమైన పదాలను అండర్‌లైన్‌ చేసి…

అర్థాలను వెతుక్కుంటున్నాను.

కష్టమైన పదాలను సరళంగా మార్చుకొని…

మీతో గడపబోయే జీవితాన్ని అందంగా ఊహించుకుంటున్నాను.

అందులో ప్రతి చాప్టర్లో ఒక గోలు వుంది.

ప్రతి పేజీలో సంతోషం, సంతృప్తి, చిరునవ్వు కన్పిస్తున్నాయి….

అటువంటి మీ సహచర్యం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ…..

ప్రేమతో

మీ దేదీప్య.

ఆ వాక్యాలవెంట దీపక్‌ కళ్లు పరిగెత్తుతున్నాయి.  మధ్య, మధ్యలో కళ్లు తిరుగుతున్నాయి. తనని తను కంట్రోల్‌ చేసుకుంటూ తర్వాత పేజీలు తిప్పాడు. ఆ పేజీల  నిండా అలాంటి వాక్యాలు అనేకం వున్నాయి.  ఆ వాక్యాలు అద్భుతమైన భావాలను బయటపెడ్తున్నాయి.

ప్రేమని ఇంత గొప్పగా వ్యక్తీకరించే కళ చాలా తక్కువ మందిలో వుంటుంది. తమకు ప్రేరణ కలిగించే వారిపట్ల అనుభూతి చెంది మనసు ప్రవాహంలో మునకలేస్తు వ్రాసుకునే అద్బుత వాక్యాలివి.  ఇంత  బావుకత వుందా దేదీప్యలో? ఆ బావుకతనంతా పెళ్లికాగానే హత్య చేసుకొని రసానుభూతిలేని జీవితం గడిపిందా? అభిరాం ఆమె మనసును యింతగా స్పందింపజేశాడా? అతనికి మనిసిచ్చి తనతో శరీరాన్ని పంచుకుందా? యింతకన్నా ఘోరం మరొకటి లేదని దీపక్‌ గుండె మండి పోయింది.

అతని కళ్లకి ` ఒకానొక అర్ధరాత్రి బాల్కనీలో అభిరాం వుంటే దేదీప్య క్రింద నిలబడి వుండటం.. ఆ తర్వాత ఒకరోజు అభిరాం బైక్‌ మీద దేదీప్య ఎక్కి రావటం కన్పించి తట్టుకోలేని బాధతో నరనరం మెలిపెట్టాయి.

మేరేజ్‌ డే అని చెప్పి సుభాష్‌చంద్ర దగ్గర పర్మిషన్‌ తీసుకొని త్వరగా ఇంటికెళ్లి భర్త తెచ్చిన చీర కట్టుకొని, భర్తను సంతోషపెట్టాలని పత్రికాఫీసు నుండి ముందుగా బయలుదేరి ఇంటికొచ్చి, చెప్పులిప్పుతున్న దేదీప్య భుజంపై చేయివేసి, ఇటు తిప్పుతూ చెంపమీద చెళ్లు మనేలా కొట్టాడు దీపక్‌.

ఆ దెబ్బకి దేదీప్య కళ్లలో నీళ్లు తిరిగి బుగ్గల పైకి దూకాలని తొందరపడ్డాయి.

ఇన్నాళ్లూ గుండె నెండగొట్టుకుంటూ, ఏ అనుభూతి లేకుండా, ఆర్థ్రత లేని బ్రతుకును, ప్రేమ రాహిత్యంతో మొండిగా నెట్టుకొస్తున్న ఆమెకు ఈ అనూహ్య చర్యలో పెద్ద విశేషమేమీ కనబడకపోయినా…. ఏ తప్పు చేశానని ఈ శిక్ష తనకి అని అడగమని మనసు గింజుకొంది. కానీ ఆమె గొంతు పెగల్లేదు. అతనిలోని పురుషాంకారానికి విస్తుపోయి అలాగే చూస్తూ నిలబడిరది.

‘‘నువ్వు నన్ను మోసం చేశావు.’’ అన్నాడు. నేను నిన్ను కొట్టటానికి కారణం అదే అన్నట్లుగా….

‘‘నేనా?’’ అంటూ విభ్రమరాలైంది.

‘‘ఏమీ ఎరగని దానిలా ఏంటా ఎక్స్‌ప్రెషన్స్‌?

ఇంకా నన్ను చీట్‌ చెయ్యాలనే చూస్తున్నావా?’’ అన్నాడు.

అతని కళ్లు నిప్పులు కక్కుతున్నాయి.  చెట్టు తొర్రలోని అగ్ని చెట్టును దహించివేసినట్లు  ఆ డైరీ అతని మనసును కాల్చివేస్తోంది.

‘‘నేనేం చేశానండీ?’’

‘‘నన్ను అలా ప్రశ్నించే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీలో నువ్వు ఆలోచించు కుంటూ కూర్చున్నప్పుడే అనుకున్నా… యిలాంటిదేదో నీగతంలో వుంటుందని ఇప్పటికి బయట పడింది.’’ అన్నాడు.

‘‘ఇప్పటికీ మీరేమంటున్నారో అర్థం కావటం లేదు.’’ అంటూ ఆలోచనగా తలవంచుకొంది.

‘నటించే వాళ్లకి ఏమీ అర్థం కాదులే. నీ ప్రేమనే నువ్వు మరచిపోతున్నావు. చిలక నవ్వు నవ్వుతూ, సీతాకోక చిలుకను అభిరాం ముఖం మిద ఆడిస్తున్నావే. కనీసం ఆ ఫోటో అయినా గుర్తొచ్చిందా?’’ అన్నాడు.

అప్రతిభురాలైంది దేదీప్య.

‘‘నువ్వు అభిరాంని ప్రేమించినట్లు నాకెందుకు చెప్పలేదు?’’అన్నాడు నిలదీస్తున్నట్లు.

ఆమె నెమ్మదిగా తలెత్తి చూసింది.

ఆ డైరీని అప్పుడెప్పుడో చీరమడతల్లో పెట్టి మరచిపోయింది. అదిప్పుడిలా పైకి విసిరిన రాయిలా పైన పడుతుందని వూహించలేదు.

ఆ ప్రేమ ` కదిలిపోయిన ఓ మేఘంలా అనుకుందే కాని ఆ మేఘమే తిరిగొచ్చి యిలా తడుపుతుందనుకోలేదు. పైగా ఆ రోజు అభిరాం తన ఆత్మ విశ్వాసాన్ని పెకలించివేసినప్పుడే ఆ ప్రేమను మరచిపోయింది.

‘‘ఎప్పుడో జరిగిపోయింది కదాని మరిచిపోదామన్నా….. నిప్పుల్ని జేబులో పోసుకున్నట్టు అతను ఇంటిపక్కనే వున్నాడు. నా కంత విశాల హృదయం కూడా లేదు మిమ్మల్నిలా చూస్తూ భరించటానికి’’ అని ఆవేశంగా అన్నాడు దీపక్‌.

మాట్లాడలేదు దేదీప్య.

అతనెప్పుడు కిటికీలోంచి బయటకి చూసినా … అతని కళ్లకి మురికి గుంట తప్ప నక్షత్రాలు కన్పించవు. గులాబికున్న ముళ్లు తప్ప గులాబి కన్పించదు. ఇప్పుడు కూడా అప్పుడెప్పుడో డైరీలో రాసుకున్న కవితలు తప్ప, పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల దేదీప్య కన్పించటం లేదు.

‘‘అయినా…. నీ ఎంగిలి మనస్సు పంచుకోవలసిన ఖర్మ నాకేంటి? ప్రొద్దున లేచి నీలాంటి వాళ్ల ముఖం చూసినా దరిద్రం.’’ అంటూ ఇదే ఆఖరు అన్నట్లుగా ఇంట్లోంచి వెళ్లిపోయాడు.

మనిషికి ఏ వయస్సులో వుండే ఆలోచనలు ఆ వయసులో వుంటాయి ఏ ఆలోచనా శాశ్వతం కాదు. కానీ పెళ్లికి ముందు కాదు కదా, గత జన్మలో కూడా తననే ప్రేమించాలన్న దృక్ఫథంలో కొట్టుకుంటున్నా దీపక్‌.

నవ్వాలని ప్రయత్నిస్తే కన్నీళ్లొచ్చాయి దేదీప్యకి.

కన్నీళ్లతో తడిసిన ఆమె కళ్లకి వెళ్లిపోతున్న దీపక్‌ మసకబారాడు.

దీపక్‌ అరిచే అరుపులు అభిరాంకి విన్పిస్తున్నాయి కాని….విషయం  అర్థం కాలేదు. లాలిత్యకు, దీపక్‌కు పెద్ద తేడా లేదని మనసులో అనుకున్నాడు అభిరాం.

 

*     *     *     *     *

 

దీపక్‌ ఇంటికి రాకపోవటంతో ఒంటరితనం ఎక్కువైంది. దేదీప్యకి.  చుట్టుపక్కల                          వాళ్లు అడుగుతుంటే ఏదో ఒకటి చెప్పి దాటేస్తోంది.

ఆమె ఎప్పుడైనా ఎంత బీజీగా వున్నా  ఇరుగుపొరుగు వాళ్లతో మంచి రిలేషన్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తుంది. వాకిలి ఊడుస్తూనో, కళ్లాపి చల్లుతూనో మొక్కలకి నీళ్లు పోస్తూనో వాళ్ల  యోగక్షేమాలు తెలుసుకుంటూ….మార్నింగ్‌ పేపర్‌ లాగా మార్నింగ్‌ విషెస్‌ చెప్తుంటుంది. ఇప్పుడు దీపక్‌ ఇంటికి రాకపోవటంతో ఆమె పలకరించినా వాళ్లు ముఖం తిప్పేసుకునే స్థితికి వచ్చారు.

వాళ్లలా వుండటం వల్లనో లేక దీపక్‌తో కలసి బ్రతకటం అలవాటైనందువల్లనో తెలియదు కాని, క్షణమొక యుగంలా మారి ‘ఒంటరితనం’ అంకుశమై ఆమె గుండెను పొడుస్తోంది. ఆ బాధతో నలిగిపోతూ ` నిత్యం కళకళలాడే ఆమె సౌందర్యపు నేత్రాలు వెలవెలపోతున్నాయి. తన భర్త ఎప్పటికైనా మారి తనకి స్వర్గాన్ని తలపింప చేస్తాడనుకున్నది అమాయకమే అయినా స్వర్గమన్నదే లేదని తెలుసుకోవటమే ఇప్పుడు నరకంగా వుంది.

కానీ ఆమె నాటుకున్న మొక్కలు మాత్రం ఆమె ఎప్పుడు బయటకొస్తే అప్పుడు ‘‘నీకు తోడుగా మేమున్నాం. నీ వేదన మాకు పంచవా?’’ అన్నట్లు ఆమెనే చూస్తుంటాయి.

ఎన్నిసార్లు కాల్‌ చేసినా దీపక్‌ కట్‌ చేస్తుంటే ఇక వుండలేక నేరుగా అతను పని చేస్తున్న ఆఫీసుకి వెళ్లింది.

దీపక్‌ పని చేస్తున్న ఆఫీసులో కావ్యను చూసి ముందు షాక్‌ తిని తర్వాత ఆశ్చర్యపోతూ, ఆ తర్వాత సంతోషంగా కావ్యకి దగ్గరగా వెళ్లింది దేదీప్య.

‘‘దేదీప్యా! నువ్వా?’’ అంటూ దేదీప్యను చూడగానే ఆనందంగా కుర్చీలోంచి లేచి దేదీప్యను చుట్టేసింది కావ్య.

‘‘ఎంత కాలమైంది కావ్యా నిన్ను చూసి?’’ అంది దేదీప్య.

‘‘సంవత్సరమేగా!’’ అంది పొడిగా దేదీప్యను తన పక్కన కూర్చోబెట్టుకుంటూ.

‘‘నీకింకా పెళ్లికాలేదుగా! అలాగే అన్పిస్తుంది.’’ అంది దేదీప్య సన్నగా నవ్వుతూ. ఆ నవ్వు ఏదోగా వుంది. ఎంత నవ్వాలని ప్రయత్నించినా ‘నవ్వు’ ఆమె దగ్గరకి రావాలంటేనే మొరాయిస్తోంది.

లంచ్‌ టైం కావటంతో పక్క సీట్లలో వుండే కొలీగ్స్‌ ఎవరూ లేరు.

‘‘వైజాగ్‌లో వుండి కూడా అడ్రస్‌ తెలియక నిన్ను కలుసుకోలేకపోయాను. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు?’’ అంది కావ్య, దేదీప్యనే చూస్తూ….

‘‘పత్రికాఫీసులో పని చేస్తున్నాను కావ్యా!  మీ ఆఫీసులో పని చేస్తున్న దీపక్‌ నా భర్త’’ అంది దేదీప్య.   పెళ్లికి రాలేదు కాబట్టి దేదీప్య భర్త దీపక్‌ అని కావ్యకి తెలియదు.

‘‘వాట్‌ ……’’ అంటూ అదిరిపడిరది కావ్య.

ఎన్ని జోకులేసినా నవ్వని దీపక్‌ దేదీప్య భర్తా? ఆశ్చర్యపోతూ అలాగే చూసింది కావ్య.

‘‘మాట్లాడవేం కావ్యా?’’ అంది దేదీప్య.

‘‘వుండవే నాకేం అర్థం కావటం లేదు. అవునూ! నిజంగా దీపక్‌ నీభర్తేనా?’’ అంది మళ్లీ చెవిదాకా వంగి….

‘‘కాక నీ భర్తనుకున్నావా?’అంది జోవియల్‌గా….

దడుసుకున్న దానిలా కుడిచేతిని వెనక్కి పోనిచ్చి వీపుమీద కొట్టుకొంది కావ్య.

‘‘ఇంకా నువ్వు అప్పటి కావ్య లాగే వున్నావు. ఏం మారలేదు. అదే నవ్వు. అదే నవ్వించటం. ’’ అంటున్న దేదీప్య కళ్లు చెమర్చటం కావ్య గమనించింది.

‘‘పెళ్లయ్యాక ఏ అమ్మాయి అయినా హుషారుగా, హేపీగా వుండాలికాని ఈ నిర్లిప్తతేంటీ, ఈ కళ్లు తడవటమేంటి, నాకయితే అర్థం కావటం లేదు.’’ అంది కావ్య.

‘‘నేను చెప్పందే ఏమర్థమవుతుంది నీకు? ఆయన ఇంటికి రావటం మానేశారు.’’ అంది దేదీప్య బాధగా.

‘‘ఎందుకు?’’ అంది వెంటనే కావ్య.

‘‘వరంగల్‌ పోర్టు దగ్గర మన సీనియర్‌ అభిరాంని నన్ను కలిపి జోత్స్న ఒక ఫోటో తీసింది. అది నా డైరీలో చూశాడు దీపక్‌. అప్పటి నుండి గొడవ పెట్టుకొని, ఇంటికి రావడం మానేశాడు.’’

‘‘ఫోటో అంటే అభిరాంని నువ్వు ప్రేమించావా?’’

‘అవును’ అంటూ  జరిగింది మొత్తం చెప్పింది దేదీప్య.

తనపట్ల ఎలాంటి ఫీలింగ్‌ లేని వ్యక్తిని తన మనిషిలా భావించి, వూహించి ఆ వ్యక్తిపై తనకు కలిగిన భావాలను పదిలంగా తన డైరీలో ఎక్కించుకొని మురిసిపోవటం సిగ్గుగా వుందని కూడా చెప్పింది. ఆ వ్యక్తిపై వున్న ఫీలింగ్స్‌న్నీ చచ్చిపోయి భర్తే సర్వస్వం అనుకుంటూ కాపురం చేసుకుంటుంటే, ఇప్పుడు మళ్లీ అభిరాంని నేను ప్రేమిస్తున్నట్టే భ్రమపడ్తూ అతను మాట్లాడిన మాటలకి తల తుంచేసినట్లైయింది అంటూ తన పడ్డ నరకయాతన చెప్పింది.

కానీ యిప్పుడు తనకి దీపక్‌ కావాలి. దీపక్‌ లేకపోతే తనుండలేదు. దీపక్‌ అవసరం తనకి ఎంత వుందో చెప్పింది.

ఒకరి డైరీ చదవటం సంస్కారం కాదని దీపక్‌కి తెలియదా. అయినా గతంలో జరిగిపోయిన దాని గురించి వదిలేయ్యకుండా, ఏం జరిగిందో, చెప్పుకునే అవకాశం కూడా యివ్వకుండ, నిర్దయగా ఇంటికెళ్లని  దీపక్‌ మనస్తత్వం కావ్యకి నచ్చలేదు. అలాంటి దీపక్‌ కోసం ఏడుస్తూ ఇంటికి రమ్మని పిలవటం కోసం వచ్చిన దేదీప్యను చూస్తుంటే….బాగా చదువుకొని, సొంతంగా ఆలోచించగలిగి, సమున్నత వ్యక్తిత్వం గలిగిన గట్టి మనిషై వుండి కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నట్లుగా వుంది.

‘‘దీపక్‌ ఇంటికి రాని విషయం మా అత్తగారితో చెప్పాలని వాళ్ల వూరెళ్లాను కావ్యా. ఆమె నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వాళ్లబ్బాయికి నా వల్ల మనశ్శాంతి లేదన్నది వాళ్లను చూస్తుంటే నాకు మళ్లీ వాళ్ల ఊరెళ్లే అవకాశం రాదనిపిస్తుంది.’’ అంది దేదీప్య.

దేదీప్య సహనం ముందు సముద్రం కూడా చిన్నగా అన్పించింది. కావ్యకి.

‘‘దేదీప్యా!  నిన్ను చూస్తుంటే జాలిపడాలో, బాధపడాలో అర్థం కావటంలేదు.’’ అంది కావ్య.

‘‘ఏదో ఒకటి పడాలిగా. ఏది పడంది ఈ జీవితాన్ని ఎలా నెట్టుకొస్తాం?’’ అంది ఆలోచనగా తన చేతి వేళ్ల వైపు చూసుకుంటూ…

ఎంతో జీవితాన్ని చూసిన జ్ఞానిలా అన్పిస్తున్న దేదీప్యను చూస్తూ….

‘‘దీపక్‌ ఈ మధ్యన సరిగ్గా ఆఫీసుకి రావటం లేదు దేదీప్యా! వచ్చిన మూడీగా వుంటున్నాడు.   ఈ రోజు కూడా ఆఫీసుకి రాలేదు.’’ అంది కావ్య.

దేదీప్యకి ఏం చేయాలో తోచక …

‘‘సరే!  నేను వెళ్లొస్తా కావ్యా!’’ అంటూ లేచింది.

ఇంటికొస్తున్న దేదీప్యను చూడగానే.

‘‘అన్నయ్య కాల్‌ చేశాడు దేదీప్యా!  దీపక్‌ సెల్‌కి ఎన్నిసార్లు కాల్‌ చేసిన లిఫ్ట్‌ చెయ్యట్లేదట. నీ సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చిందట.’’ అంది యశోదర.

‘‘నా సెల్‌కి చార్జింగ్‌ అయిపోందాంటి!’’ అంది దేదీప్య.

యశోదర మాట్లాడలేదు.

‘‘ఆంటీ’’ అంది దేదీప్య.

‘‘చెప్పు దేదీప్యా? ’’ అంది యశోదర.

‘‘దీపక్‌ ఇంటికి రాని విషయం అన్నయ్యతో చెప్పకండి! చెప్తే అన్నయ్య బాధపడ్తారు.  నా జీవితం ఇంకా ఎన్ని మలుపులు  తిరగనుందో…. అయినా దీపక్‌ ఇంటికొస్తాడన్న నమ్మకం నాకుంది.’’అంది దేదీప్య.

ఆ మాటతో యశోదర యింకేంమాట్లాడకుండా నెమ్మదిగా దేదీప్య భుజం తట్టి ఆగిపోయింది.

ఆశ ఎక్కడ వుంటే జీవితం అక్కడ వుంటుంది. ప్రతి విషయంలో మంచిని చూసే స్వభావం గల దేదీప్యను ఇప్పుడు ఆ ఆశే నడిపిస్తోంది.  ఎరికైనా ఆశ లేకుంటే ప్రాణం అణగారి పోతుంది.  ఆశవుండాలి లేకుంటే గుండెకూడా బ్రద్దలవుతుందని కొన్నిసార్లు.

 

*     *     *     *     *

 

తెల్లవారింది.

పత్రికాఫీసుకి వెళ్లింది దేదీప్య.

‘‘గుడ్‌ మార్నింగ్‌ సర్‌!’’ అంటూ సిస్టమ్‌ ముందు కూర్చుని వవ్ను సుబాష్‌చంద్రను పలకరించింది దేదీప్య.

‘‘గుడ్‌ మార్నింగ్‌ దేదీప్యా! ’’అంటూ స్క్రీన్‌ మీద నుండి తన దృష్టిని మరల్చకుండానే…..

‘‘ ఆ రోజు మనం మన పేపర్ని న్యూమోడల్లో డిజైన్‌ చేశాంగా. ఆ ఫైల్‌ ఏ నేమ్‌తో సేవ్‌ చేశాం. ఎంతకీ ఓపెన్‌ అవ్వటం లేదు.’’ అంటూ దేదీప్య వైపు చూశాడు. ఆయన దాని కోసం చాలా సేపటి నుండి ట్రై చేస్తున్నట్లు ఆయన్ని చూస్తూనే తెలిసిపోతుంది.

‘‘నేత్రా నేమ్‌లోనే సేవ్‌ చేశాం సర్‌! ఏది ఒకసారి ట్రై చేయ్యండి!’’ అంది దేదీప్య సిస్టమ్‌ వైపు చూస్తూ.

ట్రై చేశాడు సుభాష్‌చంద్ర.  వెంటనే అది ఓపెన్‌ అయింది. ఆయన ముఖం వెలిగిపోవటం దేదీప్య గమనించి, అక్కడ తన అవసరం లేకపోవటంతో వెళ్లి తన సీట్లో కూర్చుంది.

యు.కె. వెళ్లి వచ్చినప్పటి నుండి దేదీప్యకి పని పెరిగింది. బాధ్యత పెరిగింది. ఒక్క సెకన్‌ తన గురించి తను ఆలోచించుకునేంత టైం కూడా ఆమెకు మిగలటం లేదు. పనిపట్ల ఆమె అంకిత భావం చూసి పత్రిక భవిష్యత్తును అంచనా వేసుకోసాగాడు సుభాష్‌చంద్ర.

‘‘లంచ్‌ అవర్లో భోజనం చెయ్యటం కోసం సుభాస్‌చంద్రను పిలవాలని ఛాంబర్‌లోకి వెళ్లింది దేదీప్య.

‘‘సర్‌! లంచ్‌ చేద్దాం రండి!’’ అంటూ వినయంగా, ఆప్యాయంగా పిలిచింది దేదీప్య. రోజు అలాగే పిలుస్తుంది.

పలకలేదు సుభాష్‌చంద్ర.

‘‘లంచ్‌ చేద్దాం రండి సార్‌!’’ మళ్లీ పిలిచింది.

ఈ సారి సుభాష్‌చంద్ర పలకకపోవటం చూసి దగ్గరగా వెళ్లింది.  సిస్టమ్‌ను, సుభాష్‌చంద్రను మార్చి, మార్చి చూసింది.

‘‘సిస్టమ్‌ లో ఏం చూస్తున్నారు సర్‌?’’ అంటూ సుభాస్‌చంద్ర కూర్చున్న చెయిర్‌ మీద చేయివేసి సిస్టమ్‌ వైపు చూడసాగింది.

ఆమె చేయి చెయిర్ని తగలగానే సుభాషచంద్ర ఆ చెయిర్లోంచి పక్కకి ఒరిగాడు. జీవం లేనట్లు పక్కకి ఒరిగిన సుభాష్‌చంద్రను చూడగానే దేదీప్య గుండె జల్లు మంది. ఊహించని విధంగా ఆ గుండె వేగంగా కొట్టుకొంది.

‘‘బాయ్‌!’’ అంటూ ఆఫీసు బాయ్‌ కోసం పెద్దగా పిలుస్తూ పెరిగెత్తుతున్నట్టే బయటకొచ్చింది.

లంచ్‌ చేస్తున్న కోలీగ్స్‌ అందర్ని వెంట బెట్టుకొని సుభాష్‌చంద్ర ఛాంబర్‌లోకి పరిగెత్తుతున్నట్టే వెళ్లింది దేదీప్య.

అప్పటికే సుభాష్‌చంద్ర  చనిపోయినట్లు నిర్దారణ అయింది.

కొలీగ్స్‌ అంతా బాధపడ్తూ ఆయన్ని ఇంటికి చేర్చారు. ఎలా చనిపోయాడో అర్థం కాక కొందరు, హర్ట్‌ఎటాక్‌  అయివుంటుందేమోనని కొందరు రకరకాల వూహాగానాలు చేస్తున్నారు.

సుభాషచంద్రను ఇంటికి చేర్చిన మరుక్షణమే అప్పుల వాళ్లొచ్చి ఆయన ఇంటి చుట్టూ దడికట్టారు.

భర్త చనిపోయాడని తెలిసి వచ్చిన వాళ్లలో ఎక్కువగా సిటీలో బాగా డబ్బున్న శేఠ్‌లు, ఫైనాన్స్‌  కంపెనీ వాళ్లు కావటం….గమనించి సృహ కోల్పోయింది సుభాస్‌చంద్ర భార్య.

అక్కడి వాతావరణం చూస్తుంటే ఏం చేయాలో దిక్కు తోచటం లేదు దేదీప్యకి.

సుభాష్‌చంద్ర శవాన్ని చూస్తుంటే ఆమె గుండెలవిసిపోతున్నాయి. మనిషి లక్ష్యాలని, గమ్యాలని, భవిష్యత్తు ప్రణాళికలని, యింకా ఎత్తుకి ఎదగాలని ఆశిస్తాడు కాని చావు గురించి ఆలోచిస్తే ప్రణాళికలనేవి ఇంత పటిష్టంగా వుండవు. కానీ….. సుభాష్‌చంద్ర ఈ అప్పులెందుకు చేసినట్లు? ఆయనకు ఒకే ఒక అమ్మాయి వుంది.

అదీ అమెరికాలో.  తండ్రిని ఆఖరి చూపు చూడటానకి ఏదో  ఫార్మాలిటీగా వచ్చినట్లు వచ్చి, ఏడ్చే ఓపిక కూడా లేని దానిలా రెండు కన్నీటి చుక్కలు బలవంతంగా కార్చి ఇండియాతో సంబంధంలేని దానిలా వెంటనే అమెరికా వెళ్లిపోయింది.

సుభాష్‌చంద్ర అంత్యక్రియలు ముగిసేంత వరకు దేదీప్య అక్కడే వుంది.

 

*     *     *     *     *

 

సుభాష్‌చంద్ర మరణం దేదీప్యకి పెద్ద షాకయింది.

దేదీప్యను ఎలా ఓదార్చాలో అర్థం కాక, ఆ స్థితిలో ఆమెను ఒంటిరిగా వదిలెయ్యలేక, తన ఇంటికి తీసుకొచ్చుకొని, ఆ రాత్రికి తన గదిలోనే పడుకోబెట్టుకొంది యశోదర.

దేదీప్యలోని నిరాసక్తత చూస్తుంటే సుభాష్‌చంద్ర చావు ఆమె మీద ఎంత ప్రభావం చూపిందో అర్థమవుతోంది.  ఏ భావం లేని ఆమె ముఖం చూస్తుంటే యశోదరకు భయమేస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *