May 3, 2024

అండమాన్ డైరీ – 4

రచన: దాసరి అమరేంద్ర   amarendra

          మూడు రోజులు గడిచిపోయాయి. హేవలాక్‌లో ఇరవై గంటలు. చనువు వచ్చేసింది. కొత్తదనం దూరమయింది. గైడు గారి కోసం ఎదురు చూడ్డం అన్న ప్రసక్తే లేదు. నా అలవాటు ప్రకారం ఆ నాలుగో నాడు ఉదయం అయిదున్నరకల్లా రూంలోంచి బయటపడ్డాను. రోడ్డును పక్కన బెట్టి తిన్నగా ఉండీ లేని కాలి దారుల్లో సముద్ర తీరం చేరాను.

ప్రకృతి నిజంగా వరప్రసాదిని. ఎర్లీ పక్షులకు కీటకాలు దొరకడం సంగతి ఎలా ఉన్నా నాకు మాత్రం ఆ అయిదు గంటల ముప్ఫైనాలుగు నిముషాలకు దొరికిన ఆ ఉదయ సంధ్యా దృశ్యం నిజంగా వరప్రసాదమే! ఆకాశం నిండా పరచుకొంటోన్న ఉదయ సంధ్యా వర్ణాలు… దిగువన నిశ్చల జలధిలో వాటి వాటి ప్రతిబింబాలు.. ఆకాశానికీ సముద్రానికి తేడా కనిపించని క్షితిజరేఖ.. కంటికి ఆహ్లాదం కలిగించే మంద్రపు రంగులు.. శోభాయమాన దృశ్యమది!

అలా ఉండీలేని కాలి దారుల్లో మొదలైన విచిత్ర వ్యాహాళి చిరు మడఅడవుల మీదుగా… తెల్లటి ఇసుకలో అడుగులు వేస్తూ.. మడ చెట్ల వేళ్ళ విన్యాసాలకు అబ్బుర పడుతూ.. మధ్య మధ్యలో రంగులు మారుతోన్న ఆకాశాన్ని ఆరాధనగా చూస్తూ.. చేపల పడవల వారిని పలకరిస్తూ.. ఆడుకోవడానికి వచ్చి ఓ బెస్తవాళ్ళ అన్నాచెల్లెళ్ళతో ముచ్చట్లాడుతూ.. ఆగి ఆగి ఆయా అందాలను ఫోటోలు తీస్తూ.. ఓ గంట తెలియకుండా గడిచిపోయింది!

ఆనాటి మా ముఖ్య కార్యక్రమం ఎలిఫెంట్‌ బీచ్‌కు వెళ్ళడం ` స్నోర్‌కెలింగ్‌ చేసి పగడాల బారుల్ని చూడడం. ఆ బీచ్‌కు వెళ్ళాలంటే రోడ్డు మీద ఓ ఏడెనిమిది కిలోమీటర్లూ ఆపైన కాలినడకన అడవి మార్గంలో మరో రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళాలి. కానీ దాదాపు అందరు టూరిస్టులూ ప్రత్యామ్నాయంగా జలమార్గాన్నే ఎన్నుకొంటారు. జెట్టీ నుంచి నలభై నిమిషాల ప్రయాణం. మా గైడు కూడా అదే మంచిదని సలహా ఇచ్చాడు. జెట్టీకేసి అడుగు వేసాం.

గూడు పడవలాంటి ఓ మరబోటు.. పదిమంది పట్టే కెపాసిటీ.. మిగిలిన యాత్రికుల కోసం ఓ అరగంట నిరీక్షణ. తొమ్మిదిన్నర ప్రాంతంలో ప్రయాణం మొదలు. కొత్త వాళ్ళని లేకుండా హాలోలూ, ఆత్మీయపు కబుర్లూ మామూలే. ఇలాంటి చోటికి వెళ్ళినపుడు సహ టూరిస్టులంతా బంధువులూ, ఆత్మీయ మితృలూ అనిపించడం సహజం. తమ తమ అనుభవాలను కలబోసుకోవాలని తహతహలాడటం ` ఇంకా సహజం. నిజానికి ఇలాంటి చిన్న ప్రదేశాల్లో రెండు మూడు రోజులు గడిపితే సహ యాత్రీకులే గాకుండా ఊరుఊరంతా మనల్ని గుర్తుపట్టడం, చిరునవ్వులు చిందించడం, పలకరించడం ` నాకు బాగా అనుభవం.

ఒకానొక కాలంలో ఓ ఏనుగు ఈ ప్రాంతానికి వచ్చిన అందరి వెనుకా పడి తరిమేదట. ఆ గజరాజు గౌరవార్ధం ఈ బీచ్‌ని ఎలిఫెంట్‌ బీచ్‌ అనేస్తున్నారు. చిన్న బీచి. సామాన్య పరిభాషలో చెప్పాలంటే ఇది బీచేగాదు. దాని ప్రాముఖ్యత ` అక్కడున్న పగడాల నిధులు.. కోరల్స్‌!

కోరల్స్‌ను చూడాలంటే రెండు పద్ధతులు.. లోతైన సముద్ర ప్రాంతంలో డీప్‌ సీ డైనింగ్‌ ` స్క్యూబాడైవింగ్‌ ` చెయ్యడం. ఇది అందరికీ అందుబాటులో ఉన్న పద్ధతి గాదు. దానికి ఖరీదైన పరికరాలు, అనుభవజ్ఞుడైన ఇన్‌స్ట్రక్టరూ, ఆక్సిజన్‌ సిలెండర్లూ ` అంతకన్నా ముఖ్యం అపారమైన గుండె ధైర్యమూ ఉండాలి. ఓ అరగంట డైవింగుకు నాలుగయిదు వేల ఖర్చు సంగతి సరేసరి. ఇదిగాక మరో సరసమైన ప్రక్రియ ఉంది. స్నోర్కలింగ్‌..

గాలి ఊదిన లైఫ్‌బోయ్‌లను (ట్రక్కు  టైర్లలాంటివి) మన ఒంటికి అనుకూలంగా తగిలించి, వాటి సాయంతో నీటి ఉపరితలం మీద తేలుతూ వెళ్ళేలా చేస్తారు. తలమాత్రం నీటి మట్టానికి దిగువన ఉంటుంది. గాలి పీల్చుకోవడానికి ఓ ఆరు అంగుళాల పరికరం ` దాని పైకొస సహజంగానే ఉపరితలంపైన ఉంటుంది.  నీళ్ళలో చూడడానికి అనువుగా వాటర్‌ టైట్‌గాగుల్స్‌.. అంతే! అద్భుత ప్రపంచ దర్శనానికి మనం సిద్ధం!!

ఇంతకూ ఏవిటీ కోరల్సూ ` అదే, పగడాలూ? అవి సముద్రపురాళ్ళా! జలచరాలు విడిచిపెట్టిన ‘విసర్జనలా’? సముద్రంలో సహస్రాబ్దాలుగా గుట్టలుగా పేరుకుపోయిన నత్తలూ శంకువుల గట్టిపాటి గుల్లలా? ఏవిటవీ?

అవేమీ గాదు. కోరల్సంటే సముద్రంలో ‘నివసించే’ వెన్నెముకలేని జాతికి చెందిన ‘స్థావర’ జీవజాలం! ఒకటి రెండు సెంటీమీటర్ల పొడవూ,  కొన్ని మిల్లీమీటర్ల వ్యాసమూ గల స్థూపాకారపు జీవజాలమిది. ఉష్ణ మండలపు సముద్రాలలో వీటి   ఉనికి. అరవై మీటర్లకు మించని లోతుగల ప్రదేశాలలోనే ఉంటాయివి. సముద్రంలో దొరికే ఆల్గె వీటి ఆహారం. వీటిలోంచి కాల్షియం కార్బొనేట్‌ స్రవిస్తుందట. అది ఆయా కోరల్‌ కాలనీలకు ఆధార పీఠం అవుతుందట. అలాగే శత్రువుల నుంచి  కాపాడే రక్షణ కవచమూ అవుతుందట. ఈ పీఠాన్ని ఆధారంగా చేసుకొని వేలాది లక్షలాది కోరళ్ళు తమ మనుగడ సాగిస్తూ ఉంటాయి. ఆయా పీఠాల మీద కాల్షియం కార్బొనేట్‌ను స్రవిస్తూనే ఉంటాయి. లోతు తక్కువ సముద్ర ప్రాంతంలో గుట్టలు గుట్టలుగా సహస్రాబ్దాలుగా ఇవి పేరుకు పోతూనే ఉంటాయి.

ఎలిఫెంట్‌ బీచ్‌లో అంతా కలసి ఏభై అరవై మందిమి చేరామానాడు. ఉత్సవ వాతావరణం.. స్నోర్క్‌లింగ్‌ కార్యక్రమం నడిపే కుర్రాళ్ళు ఓ ఇరవై పాతిక మంది. లైఫ్‌బోయ్‌లలో నీళ్ళలోకి అడుగు పెట్టడానికి సందేహించే లక్ష్మిలాంటి వాళ్ళకోసం ‘గాజుటడుగు’ మరబోట్లు.. మనం తిరిగేదానిబట్టీ గడిపే టైముబట్టీ వాటికి రేట్లు.

లక్ష్మి గ్లాస్‌ బోటమ్‌ బోటు ప్రయాణం ఎన్నుకొంది. మామూలు కన్నా రెట్టింపు కాలమూ`దూరమూ ఉండే ప్యాకేజీ తీసుకొంది. వాళ్ళంతా కలసి అరడజను. నేను లైఫ్‌బోయ్‌లో చేయిపట్టుకొని తీసుకువెళుతోన్న గైడ్‌బోయ్‌తో కలసి స్నోర్కలింగ్‌కు ఉపక్రమించా `

ఏమి అనుభవమది!!

రంగురంగుల లోకం.. ఎన్ని రంగులు.. ఎన్ని ఆకృతులు.. ఎంత అందం.. అసలది మనకు తెలిసిన మానవ ప్రపంచంగాదే! భూలోకమేనా అదీ! నీటి లోపల ఒక్క పగడాల దిబ్బలనే ఏవిటీ… రంగు రంగుల చిరు చేపలు.. ఒక అక్వేరియం నడిమధ్యన తిరుగాడుతోన్న భావన. పగడాల్లో ఎరుపేగాకుండా ఎన్నెన్నివర్ణాలూ.. ఎన్నెన్ని ఆకృతులూ.. ఓ చోట చుట్టచుట్టుకొని పడుకొన్న కట్ల పాము.. బిగిసిన శరీరం, అలజడి చెందిన మనస్సు ` క్షణంలోనే అది  శిలాసర్పభ్రాంతి అని బోధపడగా.. తిరుగాడి, తిరుగాడి `‘రండి ఒడ్డుకు వెళదాం’ అని దారితీసాడు గైడ్‌బోయ్‌. ఆనందంతో మాటలు మరచిపోయిన క్షణమది. కాసేపట్లో మాటలు కూడబలుక్కొని ` ‘‘చూడు బాబూ! నాకు ఈత బాగానేవచ్చు.. ఈ స్నోర్కలింగ్‌ పరికరాల ఉపయోగమూ బాగా బోధపడిరది. మరో అరగంట ఒక్కడినే తిరిగి వస్తాను..’’ అని అడిగాను. అతను నవ్వేసి ‘‘అలా ఇవ్వడం ఇక్కడి నియమాలకు విరుద్ధం. ఏమన్నా జరిగితే చెప్పుకోవడానికి సమాధానం ఉండదు. కానీ మిమ్మల్ని చూస్తోంటే కాదనబుద్ధి కావడం లేదు. అయినా మరీ దూరం వెళ్ళకండి. నేను మిమ్మల్ని ఎంతవరకూ తీసుకువెళ్ళానో ` ఒడ్డు నుంచి ఏభై అరవై అడుగులు ` అది దాటి వెళ్ళకండి. మీరు వెళ్ళినా అక్కడ లోతు ఎక్కువగా ఉండి కోరల్స్‌ ఉండవు. పైగా అంతర్గత ప్రవాహాల బెడద ఉంటుంది’’, అంటూ అనుమతి ఇచ్చాడు. అలా మరో ముప్పావుగంట.. వాటిని గురించి ` ఆ నిమిషాల గురించి ఏమని వర్ణించనూ? అది వర్ణనకు అందని అనుభవం.

కొత్త వాళ్ళతో పరిచయాలు, లోకల్‌ గైడు కుర్రాళ్ళతో బాతాఖానీ, చిన్న పిల్లలతో కబుర్లు ` అవి మామూలే. ఆగంటన్నరా రెండు గంటల్లో మాతో పాటు మరబోటులో వచ్చిన ఓ బొంబాయి కుటుంబంతో స్నేహం కలిసింది. అతడు, ఆమె, పధ్నాలుగేళ్ళ పాప. కలసి అన్ని పనులూ చేసాం. వాళ్ళు ముందు చూపుతో పళ్ళూ ఫలాలూ విరివిగా తీసుకొచ్చారు. మాకూ ఇవ్వజూపితే నేనే సవినయంగానూ, సగౌరవంగానూ తీసుకొన్నాను. ‘వాళ్ళు అలా అన్నీ ఆఫర్‌ చెయ్యడం మర్యాద. మనం ఒకటీ అరా స్వీకరించి మిగిలినవి వదలెయ్యడం మనం పాటించవలసిన మర్యాద’ అంటూ కరణేషు మంత్రి ` లక్ష్మి` మెత్తగా హితవు (చీవాట్లు!!) పెట్టింది. ‘నిజమే సుమా!’ అనిపించింది గానీ, టూలేట్‌! మనకు మనసే తప్ప బుర్ర పనిచెయ్యదాయె. ఈ బాపతు మర్యాదలు ఈ జన్మలో అర్ధం కావు! వచ్చే జన్మంటూ ఉంటే ` చూద్దాం!!

నాలోని ట్రెక్కింగు చాపల్యం ‘ ఆ రెండు మూడు కిలోమీటర్ల అడవి మార్గాన్నీ ఓ సారి పరామర్శించిరా’ అంటూ వెనకబడిరది. దారి తెలియదు. ఆ ఏనుగు గారు ఇంకా అక్కడే ఉన్నారేమో అదీ తెలియదు. మరపడవ మన కోసం ఆగదు ` ఇలాంటి పరిస్థితుల్లో అలా వెళ్ళే ప్రయత్నం అర్ధంలేని పని అని అర్ధమయింది…

అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నీల్‌ ద్వీపం చేరాం.

ఈ నీల్‌ అన్నది అండమాన్‌ పరిభాషలో చూసినా సరే ` అతి చిన్న ద్వీపం. తూర్పు పడమరలుగా ఓ ఆరేడు కిలోమీటర్ల పొడవు, మూడు నాలుగు కిలోమీటర్ల వెడుల్పు, ఇరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. మూడువేల జనాభా! హేవలాక్‌ నుంచి ఫెర్రీలో గంటంబావు ప్రయాణం ` ఇరవై కిలోమీటర్ల దూరంలో సరిగ్గా దక్షిణాన ఉంది..

ఇక్కడా మా వసతి పీడబ్ల్యూడీ వారి వసతి గృహంలోనే. జెట్టీలో దిగగానే ఆటో మనిషి కనిపించి ‘వంద’ అన్నాడు. మాపుల అధ్యయనం పుణ్యమా అని దూరం అరకిలోమీటరే అని ముందే తెలుసు. ఇంకా సాయంత్రం నాలుగే గాబట్టి ‘చీకటి పడిపోతే కొత్త ప్రదేశంలో ఎలా?’ అన్న సంకోచం లేదు. పైగా నాలుగు రోజులు అండమాన్లలో ఉండే సరికి ‘మనమిక్కడ పాతకాపులం’ అన్న అసంకల్పిత అంతర్గత ధీమా… వెరసి మా కొద్దిపాటి సామాన్లను ఈడ్చుకొంటూ గెస్టు హౌసు దారి పట్టాం. పెద్దగా ఇబ్బంది లేకుండానే దొరికేసింది. అయిదింటికల్లా ఆ పర్ణశాలలాంటి గెస్టుహౌసులో స్థిరపడడం (అక్కడ మేమే ఏకైక అతిధులం)… గ్రామ పర్యాటనకు బయటపడడం..

హేవ్‌లాక్‌లో గమనించాం ` ఈ ద్వీపాల్లో అత్యుత్తమ ప్రయాణం సాధనం ఏక్టివా ద్విచక్రవాహనం. ఆ బళ్ళు విరివిగా దొరుకుతున్నాయి కూడానూ. అంచేత ముందస్తుగా చేసిన పని ` అలాంటి ఓ బండి చేజిక్కించుకోవడం. ద్వీపపు మార్కెట్టులో వాకబు చేయగా వెంటనే దొరికింది. అద్దె రోజుకు  మూడువందలు. పెట్రోలు మన ఖర్చే. ఎంత తిరుగుతామన్నది మన ఇష్టం. ఉభయ తారకం.

ద్వీపం బాగా చిన్నదే గానీ ఇందులోనూ ఐదారు గ్రామాలున్నాయి. ద్వీపపు జెట్టీ దగ్గరి కేంద్ర బిందువును నీల్‌కేంద్ర అంటారు. తూర్పుగా వెళితే భరత్‌పూర్‌, గోవిందనగర్‌, బిజోయ్‌నగర్‌, సీతాపూర్‌, రామ్‌నగర్‌ గ్రామాలు. పశ్చిమంగా వెళితే రాధానగర్‌, లక్ష్మణపూర్‌ గ్రామాలు… హెలీపేడ్‌.. లక్ష్మణపూర్‌ బీచ్‌.. ఇదంతా విమానంలోంచి చూస్తే త్రిభుజాకారంలో ఓ మినీ ఇండియాలాంటి రూపురేఖలు.. లక్ష్మణపూర్‌ బీచ్‌ అయితే పైనుంచి చూడగానే రక్తంలో ఉత్సాహపు ఉరకలు పుట్టించే శక్తి గలది. అదంతా అదో ప్రపంచం.. మినీ ప్రపంచం..

ఏక్టివా అద్దెకు తీసుకొంటున్నపుడు అడిగాను ` ‘ఏమన్నా సెక్యూరిటీ డిపాజిట్టూ, ఐకార్డు ఫోటో కాపీలు నీ దగ్గర ఉంచాలా’ అని. నవ్వేసి ‘అదేం అక్కర్లేదు’ అన్నాడతను. ఓ అరగంట గడిచేసరికి అర్ధమయింది ` ఇక్కడ ప్రతి మనిషీ మరో మనిషికి తెలుసు. ప్రతి మనిషికీ ప్రతి వాహనమూ తెలుసు. బయట నుంచి వచ్చే టూరిస్టులనూ వాళ్ళు త్వరగా గుర్తించి పలకరిస్తారు.  మరిహ జాగ్రత్తలూ, డిపాజిట్ల ప్రసక్తేముంది? అయినా ఎటు చెయ్యి చాపినా సముద్రమే అయినపుడు ఏ ఏక్టివా అయినా ఎక్కడికి పారిపోగలదూ?!

పదీ పదిహేనేళ్ళ క్రితం భూమధ్యరేఖకు చేరువలో పసిఫిక్‌ మహాసముద్రంలో ` పాపువా`న్యూగినియాకు తూర్పున  ‘నవురూ’ అన్న అతి చిన్న దేశం అంతర్జాతీయ కారణాల వల్ల చర్చలోకి వచ్చింది. నీల్‌ ద్వీపంలానే అదీ ఇరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. పదివేల జనాభా.. పదహారువేల రాజకీయాలు.. లక్ష సమస్యలు.. ‘మా దేశంలో ఉన్న ఫాస్సేట్‌ నిలవలను వారూ వీరూ అందరూ కలసి కొల్లగొట్టి మమ్మల్నో వ్యర్ధ ప్రదేశంగా మిగిల్చారు’ అని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లాంటి దేశాలు భారీగా జరిమానా సమర్పించుకోవడం జరిగింది. అదంతా గమనిస్తోన్నపుడు ‘అసలు పదివేల జనాభా ఏమిటి? ఇరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఏమిటి? అసలది ఒక దేశంలా ఎలా మనుగడ సాగిస్తోంది? విద్య, ఆరోగ్యం, ఆర్ధిక వనరులు, రవాణా, రక్షణ, తిండిగింజలు ` ఇవన్నీ సమగ్రంగా సమకూర్చుకోవడం అంత చిన్న దేశానికి ఎలా సాధ్యం’ అని సవాలక్ష ప్రశ్నలు ` నా వందకోట్ల భారత బుర్రలో. నీల్‌ ద్వీపాన్ని చూసాక చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి.

సమతల ద్వీపం. సారవంతమైన ద్వీపం. కూరగాయలు విరివిగా పండుతాయి. ‘అండమాన్ల శాకాగారం’గా ప్రసిద్ధి చెందింది. స్కూళ్ళున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ టవరుంది. పోలీసు అవుట్‌పోస్ట్‌ ఉంది. తగుమాత్రపు రోడ్లున్నాయి. ముగ్గురు డాక్టర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రముంది. డీజిల్లోంచి పుట్టే కరెంటు ఉంది. సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, ఆటోరిక్షాలూ ఉన్నాయి. బస్సుల్లేవు. టీవీ లేదు. ఫేస్‌బుక్‌ అందదు. అందమైన ద్వీపం. ఆందోళన లేని మనుషులు. సరళమైన జీవనసరళి ` అది దేశంగానే గాదు, ఆదర్శ రాజ్యంగాకూడా మనుగడ సాగించగల అతి చక్కని ‘మోడల్‌’ ద్వీపం!!

బ్రోషర్లో కనిపించి కవ్విస్తోన్న ద్వీపపు ఉత్తరభాగంలో ఉన్న లక్ష్మణపూర్‌ బీచ్‌కి వెళ్ళాం. మా గెస్టుహౌసు నుంచి రెండు కిలోమీటర్లు… చేసేసరికి సాయంత్రం అయిదు. చీకటి పడటానికి ఇంకా గంటా గంటన్నర.. అతి తక్కువ టూరిస్టులు. సుతిమెత్తని తెల్లటి ఇసుక. శంఖాల రజనా అదీ?! తెలియలేదు. కానీ ఒక్కమాట ` బ్రోషర్లలో ఏరియల్‌వ్యూలో కనిపించే మహత్తర సౌందర్యం నేలమీద నిలబడినపుడు మామూలు కంటికి ‘కానరాలేదు’. అదో చిరునిరాశ.

పదీ పదిహేనుమంది భారతీయ టూరిస్టులు.. ఓ స్పానిష్‌ నడివయసు జంట.. ఓ బ్రిటీష్‌ అరవై ఏళ్ళ యువకుడు. దిగిపోతోన్న సూర్యుడు.. లోతులేని సముద్రంలో అలవోకగా నడకలు.. తీరమంతటా ఆసక్తికరమైన ఆకృతుల్లో చెట్ల కొమ్మలు, మొదళ్ళు.. మరి ఎవరు వదిలేసారో తెలియదు గానీ బీచిలో చెట్ల చేరువన వరసాగ్గా కొలువున్న ఏడెనిమిది చిరు విసర్జిత విగ్రహాలు.. గంట గడిచింది. తిరిగి వస్తోంటే ఆటోలో ఓ బక్కపలచటి యువకుడూ, భార్యా, ఇద్దరు అతి చిన్న పిల్లలూ ` కవనీంద్ర కోహ్లీ అట అతని పేరు `

అయిదో రోజు. మార్చి ఎనిమిది 2012.

చిన్న ద్వీపం గాబట్టి అంతా కలసి పాతికే కిలోమీటర్ల రోడ్లు. చేతిలో ఏక్టివా. తెల్లవారురaాము నుంచి సాయంత్రం నాలుగు గంటల పోర్ట్‌బ్లెయిర్‌ ఫెర్రీ దాకా కనీసం పదిగంటల సమయం. మళ్ళా జీవితంలో ఈ ద్వీపానికి వచ్చే అవకాశం తక్కువ కాబట్టి రోజంతా శ్రమించి అణువణువునూ పలకరించి రావాలన్న కృతనిశ్చయం..

లక్ష్మి నిద్రలేవకముందే, గంట అయదు కొట్టీకొట్టకముందే, నా నీల్‌ ద్వీపపు ఆయనం మొదలయింది. వెన్నెల రోజులు.. చంద్రుని తోడు. పైగా ఆయనే దార్లకు దీపం! తిన్నగా తూర్పుదిక్కు పట్టుకొన్నాను. ఓ పావుగంటలో ఏ ఇబ్బందీ లేకుండా ద్వీపపు ఆగ్నేయ కొసన ఉన్న సీతాపూర్‌ బీచ్‌ చేరుకొన్నాను. ఇది ఈ ద్వీపపు సూర్యోదయ దర్శన కేంద్రం.

బీచ్‌ కనిపించే ప్రదేశానికి చేరుకోగానే గుండెలయ తప్పింది! ఎదురుగా ఓ కిలోమీటరు దూరం వరకూ అర్ధచంద్రాకారపు సముద్రతీరం. నీళ్ళకు పదిగజాల దూరంలో సుందరంగా దట్టంగా పెరిగిన చెట్లు.. వాటిలో రంగులు వెదజల్లే పువ్వులూ ఆకులూ.. దూరాన లీలగా కనిపిస్తోన్న మరో ద్వీపపు కొండలూ అడవులూ.. అపుడే ఉదయపు వెలుగులు సంతరించుకొంటోన్న ఆకాశమూ సాగరమూ.. మార్మిక వర్ణ విన్యాసం.. హేవలాక్‌లోని రాధానగర్‌ బీచి గురించి విన్నంతగా ఈ సీతానగర్‌ బీచి గురించి ముందుగా విని ఉండలేదేమో ` ఆశ్చర్యమూ, ఆనందమూ ఒకేసారి కలిగాయి. మెల్లగా ఆ కిలోమీటరు దూరమూ పచార్లు.. దారిలో ఒకటి రెండుచోట్ల సముద్రం కొన్ని లక్షల లక్షల లక్షల సార్లు తన కెరటాలతో ముద్దాడడం వల్ల చొచ్చుకువచ్చిన చిరు శిలల్లో ఏ్పడిన అతి సుందర ఆకృతులు.. ఒక చోట హఠాత్తుగా ఆయా చెట్లలోంచి వ్యాపించి అంతటా కమ్ముకొన్న తియ్యని సువాసన.. ఇదంతా నిజమా?! కలా?!

ఆ సమయంలో, ఆ ప్రదేశంలో ` నాతోపాటు ఒకే ఒక్క యాత్రికుడు. నాలాంటి శృతిమించిన పిపాసే అయి         ఉండాలి. ‘అయ్యో.. ఇంత అందమూ వృధా అవుతోందే’ అనిపించింది. ‘ఆనందాన్ని పంచుకోవడానికి ఎవరూ లేరే’ అన్న చింత. ` వెంటనే ‘ఎవరో ఏమిటి.. వెళ్ళి లక్ష్మినే తీసుకువద్దాం’ అన్న ప్రాధమిక ఆలోచన.. ఆఘమేఘాల మీద వెళ్ళాను.

మరో అరగంటలో ఇద్దరమూ తిరిగి సీతాపూరు బీచిలో!

తనకూ బాగా నచ్చింది. స్నేహంగా పలకరిస్తోన్న చిరు కెరటాలతో ఆడుకొంది. మళ్ళా రానూ బోనూ ఆ రెండు కిలోమీటర్ల నడక. సుందర శిలాకృతుల్నీ, తియ్యని అడవి సువాసనలనీ ` అదంతా ఏదో నా ఘనతే అన్నట్టు ` లక్ష్మికి పరిచయం చేసాను!! తిరిగి గెస్టు హౌసుకు చేరేసరికి ఏడున్నర. నిన్న మా హడావుడిలో గమనించలేదు గానీ మా పీడబ్ల్యూడీ గెస్టుహౌసు, దానిని ఆనుకొనే ఉన్న అండమాన్‌ టూరిజం వారి ‘హవాబిల్‌నెష్ట్‌’ గెస్ట్‌హౌసు ` ఆధునిక పర్ణశాలల్లా పచ్చదనపు మేలి ముసుగుల మధ్య మహా ముచ్చటగా ఉన్నాయి. తీరిగ్గా వాటి పరిశీలన ` బ్రేక్‌ఫాస్టు ` ఉదయం ఎనిమిదిన్నర..

సాయంత్రం నాలుగింటికి  మా తిరుగు ప్రయాణపు ఫెర్రీ.

కనీసం అయిదారుగంటలు ఇంకా మిగిలే ఉన్నాయి ` తిరగడానికి.

మనసు ప్రలోభపెట్టగా నిన్న సాయంత్రం వెళ్ళివచ్చిన లక్ష్మణపూర్‌ బీచికి మళ్ళా వెళ్ళాం. ఇలాంటి విషయాల్లో లక్ష్మి మీద మనం ఎకనామిక్స్‌లో చదువుకొనే ‘లా ఆఫ్‌ డిమినిషింగ్‌ రిటర్న్స్‌’ చాలా త్వరగా పనిచేస్తుంది. నేను మరీ ముదురు  గాబట్టి అలాంటి సామాన్య సూత్రాలకు బాగా అతీతం. అయినా తన మనోభావనను గౌరవించి వెంటనే ఆ బీచి వదిలిపెట్టాం. కానీ లక్ష్మణపూర్‌ 2 అనే మరో బీచి ఆ దగ్గరలోనే ఉందనీ అక్కడ మన తిరుపతిశైలిలో ఓ బృహత్తర శిలాతోరణం ఉందని మా బ్రోషరు చెపుతోంది గదా ` బండి అటునడిపాం.

చక్కని గ్రామీణ ప్రాంతాల్లోంచి సాగింది దోవ. ఆహ్లాదకరమైన వాతావరణం. అతి చక్కని పంటపొలాలు, కూరగాయల మళ్ళు. హఠాత్తుగా ఒక చోట చెరువుగట్టు లాంటి ప్రదేశం.. ఆ గట్టు దిగువన ఒకటి రెండు దుకాణాలు, టీకొట్లు. ‘బీచి ఇదేనా’ అని వాకబు చేసాం, నమ్మకం చిక్కక. ఓ దుకాణం నడుపుతోన్న పెద్దావిడ ఔనని నిర్ధారించింది.

‘మీరు సముద్రపు పోటు సమయంలో వచ్చారు. అదిగో ఆ గుట్ట దాటితే గట్టుదాకా సముద్రమే. ఆటు సమయంలో అయితే సముద్రం ఓ ఏభై అరవై అడుగులు వెనక్కు వెళుతుంది. మీరు శిలాతోరణం దాకా వెళ్ళగలిగేవారు. ఇపుడు దూరం నుంచే చూడగలరు..’ అని వివరంగా వివరించిందావిడ.

ఉసూరుమంటూ అక్కడే కూలబడ్డాం. కొబ్బరినీళ్ళు తాగుతూ ఉండగా కబుర్లు ఊపందుకొన్నాయి. బంగ్లాదేశ్‌కు చెందిన కుటుంబం వారిది. ఈ ద్వీపంలో వారికి పునరావాసం కల్పించింది భారత ప్రభుత్వం (ఎంత అదృష్టం!!). ద్వీపవాసుల్లో అత్యధికులది అదే నేపధ్యం. వాళ్ళల్లో చాలామంది ఆర్ధికంగా, సామాజికంగా నిలదొక్కుకోవడమే గాకుండా, ముందు ముందుకు వెళ్ళగలిగారట. ఈవిడ కొడుకు ఢల్లీిలోని ఎయిమ్స్‌లో మెడిసన్‌ పీజీ చేస్తున్నాడు. కూతురు బెంగుళూరు సాఫ్టువేరు. ‘ఇంకా ఈ కొట్టెందుకూ. కట్టెయ్యి అంటారు వాళ్ళు. ఇదేమో నాకు అలవాటయిన జీవన రీతి. ఎలా వదిలి పెట్టాలీ! అసలు ఎందుకు వదిలిపెట్టాలీ’ అన్నారావిడ. ఎంతో గాఢత, సంస్కారం కనిపించాయి ఆవిడ మాటల్లో..

ఎలాగూ వచ్చాం గదా ఆగట్టు మీదకు చెట్ల మధ్యలోంచి ఎక్కాం. గట్టుపైకి చేరీ చేరగానే నిరాశపడడం, హతాశులవడం శుద్ధ అనవసరం అని తెలిసిపోయింది. ఆ పోటు సంద్రం గట్టుదాకా పరుగెత్తి వస్తోన్న మాట నిజమే. కానీ ఆ కెరటాల మధ్య నుంచే అటూ ఇటూ చిరు సాహసపు నడకలకు అవకాశముంది. అంతకన్నా ముఖ్యం అది కోరల్‌ ‘శిలల’ ఓ సజీవ మ్యూజియం!!

నిజానికి నీల్‌ ద్వీపమే ఓ కోరల్‌ ప్రదర్శనాలయం. నిన్న జెట్టీలోంచి దిగి ఒడ్డును చేరడానికి కర్రవంతెన మీద ఆ వంద అడుగులూ నడుస్తున్నపుడే దిగువన లోతులేని, కెరటాలు లేని, నీళ్ళలో కోరల్‌ ‘శిలలు’ కనిపించాయి. ఇక్కడ, ఈ లక్ష్మణపూర్‌ బీచిలో కోరల్సే కోరల్సు.. అంతా అందమైన కోరల్‌రాళ్ళ గుట్టలు.. నిండుగా అనంత జలధి.. పాదాలను తాకి మోకాళ్ళదాకా బట్టలను తడుపుతోన్న స్నేహజలాలు. దూరాన సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన పెద్దకొండ చరియ. అందులో ఓ విశాల ద్వారంలా శిలాతోరణం. మా ఇద్దరికీ బాగా నచ్చేసిన ప్రదేశమది. అక్కడి కోరల్‌ శిలలు బాగా నచ్చేసి ఇంటికి తీసుకువెళిపోదామా.. అనిపించింది గానీ, అది పూర్తిగా నిషిద్ధం. అక్కడి అధికారులు కూడా ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండి, అలాంటి స్మగ్లింగ్‌లు సమర్ధవంతంగా అరికడతారట.

గట్టుదిగి వస్తోంటే కాస్తంత ఎగువన కుడిచేతి వేపు చిరుకోలాహలం. ఓ ఐదారు కుటుంబాలు నివాసముండే చిన్న  కాలనీ అట. వినిపించేది ఆనాటి హోలీ కోలాహలమట. ఉత్సాహం పొంగగా వెళ్ళి వాళ్ళతో కాసేపు గడిపాం. పాపం ఆ పెద్ద మనుషులు ‘మాకు రంగులు పుయ్యకండి’ అంటే మాట విని నుదుటి బొట్లతో సరిపెట్టారు!

తిరిగి తిరిగి గూటికి చేరేసరికి సుమారు పదకొండు. అలసిన లక్ష్మి ‘ఇహ చాలు ` నాలుగు దాకా విశ్రాంతి’ అని ప్రకటించేసింది. నాకు మాత్రం ఇలాంటి సమయాల్లో తనివి తీరడమన్న ప్రసక్తేలేదు.

ఈసారి బీచ్‌లు గాకుండా ద్వీపపు గ్రామాలన్నీ తిరిగి రావాలన్నది ప్లాను. ఇప్పటికే ద్వీపపు రూపురేఖల గురించి మంచి అవగాహనే కలిగింది గాబట్టి ఉన్న అయిదారు గ్రామాలనూ చుట్టబెట్టాను. దారిలో నాలానే స్కూటరు మీద నిన్న లక్ష్మణపూర్‌ బీచ్‌లో కలసిన స్పానిష్‌ జంట. మధ్యలో దారి గురించి (నన్ను!) వాకబు  చేస్తూ మరో ఫ్రెంచి జంట. గ్రామాల్లో పిల్లల బృందాల హోలీ కోలాహలం. రంగులు చిమ్మాలని నా పైన దండయాత్రలు. నయానా భయానా అలాంటి ఒకటి   రెండు ‘మూక’లనుంచి తప్పించుకోవడం.. అలా తప్పించుకోవడంలో ఆనందంలేదని స్ఫురించి ఆ తర్వాత ఇష్టపూర్వకంగానే లొంగిపోవడం.. ముంచెత్తిన రంగు నీళ్ళు.. స్కూటరు ఆపి ఆయా పిల్లలతోనూ, వారి వారి పెద్దలతోనూ హోలీ ఆటలు.. స్వీట్లు.. స్వీట్‌ మెమొరీస్‌.. పన్నెండున్నర.

మళ్ళా గాలి బీచిల మీదకు మళ్ళింది.

ఉన్న గంటన్నరా రెండు గంటల్లో ముఖ్యమైన మూడు బీచ్‌లూ మళ్ళా చుట్టి రావాలన్న పురుగు బుర్రలో పుట్టింది. స్కూటర్ని లక్ష్మణపూర్‌ వేపు మళ్ళించాను. స్నేహంగా పలకరించింది. చెదురు మదురుగా సూర్య స్నానాలు చేస్తోన్న విదేశీ టూరిస్టులు. కబుర్లలో పెట్టిన ఓ నడివయసు బ్రిటీషరు. తన శెలవల సమస్య గురించి చెపుతోంటే నేను బడాయిగా ‘నాకా సమస్య లేదు.. ఇపుడు నాకు వారంలో ఏడు ఆదివారాలు’ అనేసాను! ‘నిజమే గదూ! భలే చెప్పావయ్యా!’ అంటూ మురిసిపోయాడా అల్పసంతోషి.

పక్కనే ఉన్న శిలాతోరణపు లక్ష్మణపూర్‌ 2 బీచి రెండో మజిలీ. టీ కొట్టావిడ చెప్పినట్టు మధ్యాన్నమయేసరికి పోటు తీసి శిలాతోరణం దాకా నడచి వెళ్ళే వెసులుబాటు ఉంటుంది గదా అనుకొంటూ వెళ్ళాను. నిజమే. నీరు తీసింది. సజీవ కోరల్‌ మ్యూజియంలోని శిలలన్నీ ‘మళ్ళా వచ్చావా!’ అంటూ ఆహ్వానంగా పలకరించాయి. వాటిల్ని నొప్పించకుండా దాటుకొంటూ శిలాతోరణం దగ్గరికి ` అక్కడ ఓ పూనా సాఫ్ట్‌వేర్‌ యువజంట. జట్టుకట్టాం.. కలిసి అక్కడి అందాలను పంచుకొన్నాం.  ఇరవై అడుగుల ఎత్తూ పాతిక అడుగుల వెడల్పు ఉన్న విశాలమైన వాకిలిలాంటి శిలా వైచిత్రి దగ్గర ఫోటోలు దిగాం.

వెంటనే ఏదో ఎపాయింటుమెంటు ఉన్నట్టుగా గబగబా ద్వీపపు అటు చివర ఉన్న సీతాపూర్‌ బీచి దగ్గరకు ` ఒకే పూటలో ఇది మూడో విజిటు! మరో చక్కని ఫోటో. ఇహచాల్లే అని గూటికి చేరబోతోంటే ‘మరినేనో’ అంటూ నిలదీసింది భరత్‌పూర్‌ బీచి. ఇది మా గెస్టుహౌసుకు కిలోమీటరు లోపే. హేవలాక్‌లో ఎలిఫెంట్‌ బీచిలాగా ఇక్కడ ఈ భరత్‌పూర్‌ స్నోర్కలింగ్‌కూ స్విమ్మింగ్‌కూ ప్రసిద్ధి. రంగు రంగుల చేపల బృందాలు ఇక్కడి ప్రత్యేకత. ఆయా వ్యాపకాల్లో మునిగిపోయి ఉన్న ఓ ఏభై మంది టూరిస్టులు. మరో పాతిక మంది గైడు కుర్రాళ్ళు.

తిరుగు ప్రయాణం హేవలాక్‌ నుంచి బయల్దేరి నీల్‌ మీదుగా పోర్ట్‌ బ్లెయిర్‌ చేరే ఫెర్రీలో. నిన్న లక్ష్మణపూర్‌లో కలిసిన కోహ్లీ  కుటుంబం కూడా మాతోనే పడవ ఎక్కింది. మరిన్ని కబుర్లు. అతను పంజాబీ. ఆవిడది కాకినాడ! కాలేజీలోనో, ఆఫీసులోనో పరిచయం. పెళ్ళి. అతనిపుడు ఉద్యోగం పక్కనబెట్టి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టాడు. ఆవిడ ఇంకా ఉద్యోగినే. మళ్ళా బెంగుళూరులో కలుసుకోవాలని నిర్ణయం. సముద్రంలో దిగిపోతోన్న సూర్యుడ్ని పడవలోంచి కలసి చూసాం..

మూడురోజుల ద్వీపయాత్రల ‘జ్ఞాపకాల బడలిక’ తీరకుండానే మర్నాడు ` మార్చి తొమ్మిది ` బారాటాంగ్‌ యాత్ర మొదలయింది.

బారాటాంగ్‌ అన్నది పోర్ట్‌బ్లెయిర్‌కు ఉత్తరాన వంద కిలోమీటర్లు దూరాన ఉన్న ` బొంబాయి లాంటి ` ‘అనిపించని’ ద్వీపం. సున్నపురాతి గుహలకు ప్రసిద్ధి. మన వైజాగ్‌ దగ్గరి బొర్రా గుహల్లాంటివన్నమాట. పోర్ట్‌బ్లెయిర్‌ నుంచి కావాలంటే ఏడెనిమిది గంటల పడవలో వెళ్ళవచ్చు గానీ టూరిస్టులంతా చేసేపని గ్రేట్‌ అండమాన్‌ ట్రంక్‌ రోడ్డులో నాలుగు గంటల బస్సు ప్రయాణం చెయ్యడం. దారిలో మధ్యజలసంధి ` మిడిల్‌ స్ట్రైట్‌ ` అన్నచోట ఈ బస్సుల్నీ బళ్ళనూ దాటించి ఒడ్డు ఎక్కించే ఫెర్రీ ఉంటుంది.

ఉదయం ఏడుగంటలకు అండమాన్‌ టూరిజం వారి టెంపోట్రావెలర్‌ మా ఇద్దరినీ మేముంటోన్న నావీ కాలనీ ప్రాంతం నుంచే ఎక్కించుకొంది. డ్రైవరూ, హెల్పరూ యువకులు. చురుగ్గా ఉన్నారు. ఊరు పొలిమేరలు దాటగానే అక్కడికక్కడే సునామీ అవశేష విశేషాలను పరిచయం చేస్తూ సాగారు. ఒకచోట వాను ఆపి ‘అల్లదిగో.. అక్కడ చూడండి.. ఆ పచ్చగడ్డిలో, నీటి మడుగు దగ్గర.. అండమాన్‌ దారు పావురాలు.. అవి మా అండమాన్‌ ద్వీపాల జాతీయ విహంగాలు. ఈ ద్వీపాల్లోనే కనిపిస్తాయి. వాటి సంఖ్య తగ్గిపోతోంది. అదో ఆందోళన’ అంటూ డ్రైవరు వివరించాడు. ఆ వివరణలో కర్తవ్యపాలనను మించిన పిపాస కనిపించింది.

ఓ అరగంట గడిచాక అందరికీ పాక్డ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ పంచాడు హెల్పరు కుర్రాడు.. వానులోని పదిహేను మందిమీ దాన్ని ఆస్వాదించే పనిలోపడ్డాం. కానీ కాసేపటికే వానులో గుసగుసలు.. చిరుజల్లు జడివాన అయినట్టు ఆ గుసగుసలు రణగొణ ధ్వనులుగా మారాయి. ‘ఆపు.. వాను ఆపు’ అన్న కేకలుగా మారాయి!!

ఏమీటీ విషయం? సాండ్విచ్చిలో బూజు!

సమస్య గంభీరమయినదే. కానీ సంస్కారవంతుల్లా కనిపిస్తోన్న ప్రయాణీకులు చేస్తోన్న యాగీ? ఆశ్చర్యమనిపించింది. వారి వారి ధన సంపత్తీ, ఆరోగ్య చరిత్రా తాము కొరికిన బ్రెడ్డు ముక్కలవల్ల సంపూర్ణంగా తుడుచుకుపోయినట్టుగా ` ‘అంతంత డబ్బులు పెట్టి మీ యాత్రా టిక్కెట్టుకొంటే మాకు మీరు ఇచ్చేది ఈ బూజు బ్రేక్‌ ఫాస్టా?! మామా ఆరోగ్యాలు విషమించితే మరి జవాబుదారీ ఎవ్వరిదీ!’ ` అంటూ డ్రైవరు మీద విరుచుకుపడ్డారు..

డ్రైవరు యువకుడే అయినా స్థిరమైన మనిషి. బండి ఆపి విషయం పరిశీలించాడు. ‘‘మా యాత్రల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. నాకు సిగ్గుగా ఉంది. మీరు క్షమించేసి సహకరించండి. మరో అరగంటలో మనం జిర్కాటాంగ్‌ అన్న చోటుకు చేరతాం. అక్కడ ఏమి దొరికితే అవి మీకు ఇప్పిస్తాను’’ అని ప్రకటించాడు. పరశురాములందరూ శాంతించారు!!

మరి కాసేపట్లో వాను జిర్కాటాంగ్‌ చెక్‌పోస్టు చేరింది. ఇక్కడ్నుంచీ వాహనాలన్నీ కలసికట్టుగా ముదుకు సాగుతాయి. కాన్వాయ్‌ అన్నమాట. దానికో కారణముంది. అది ‘జరవ’ల రక్షిత ప్రాంతం.. ‘మీరు మాకు ఇక్కడి ఆదివాసుల్ని చూపించాలి’ ఎయిర్‌పోర్టులో మార్చి నాలుగున దిగగానే ప్రకాష్‌ను నేను కోరిన మొదటి కోరిక. ‘కష్టం.. ఇపుడు అదంతా బాన్‌ చేసారు’ అన్నాడతను. నిరాశ అనిపించింది. కానీ వివరాల్లోకి వెళితే ఆ బాన్లూ, నిరాశల వెనక అంతులేని విషాదముందని బోధపడిరది.

పందొమ్మిదో శతాబ్దం ఆరంభదినాల్లో ` బ్రిటీషువారు రాకపోకలు ఆరంభించిన సమయంలో ` అండమాన్‌ ద్వీపాలలో అయిదు ఆదిమ జాతులు ఉండేవి. పది ఉప తెగలు గల ‘గ్రేట్‌ అండమానీస్‌’ అన్నది అందులో ముఖ్యమయినది.  ఉత్తర, దక్షిణ, మధ్య అండమాన్‌ ద్వీపాల్లో, ఐదువేల జనసంఖ్యతో, తమవైన భాషలతో మనుగడసాగిస్తూ ఉండేది. దక్షిణ అండమాన్‌ ద్వీపానికి దిగువన ఉన్న రట్‌లాండ్‌ ద్వీపంలో ‘జంగ్లీ’లనే తెగ.. దక్షిణ అండమాన్‌కు తూర్పున ఉన్న నార్త్‌ సెంథినెల్‌ ద్వీపంలో ‘సెంథినరీస్‌’ అనే మూడో తెగ, అండమాన్లలో నాలుగో ముఖ్య ద్వీపం ` లిటిల్‌ అండమాన్‌ ` నిండా ‘ఒంగే’ అనే తెగ (1901లో వీరి జనాభా 700), దక్షిణ అండమాన్‌ దక్షిణ భాగాన ` ఇపుడు పోర్ట్‌ బ్లెయిర్‌ ఉన్న చోట ` ‘జరవా’లన్న తెగ.. ఇదీ పందొమ్మిదో శతాబ్దపు ఆరంభ దినాల నాటి పరిస్థితి.

నూటఏభై రెండువందల ఏళ్ళు గడిచేసరికి గ్రేట్‌ అండమానీస్‌ తెగదాదాపు అంతరించి పోయింది. ఆయా ప్రాంతాల ఆక్రమణకోసం బ్రిటీషు వాళ్ళు జరిపిన మారణకాండ ముఖ్యకారణం. ఇపుడు ఆ తెగలో మిగిలి ఉన్నది నలభై ముగ్గురు. వారి భాషలా?! అడగడమెందుకూ?! ఆ నలభై ముగ్గురినీ దయతో ప్రభుత్వం మిడిల్‌ అండమాన్లకు చెందిన బారాటంగ్‌ ద్వీపానికి చేరువ ఉన్నా ‘స్ట్రైట్‌ ఐలెండ్‌’ అన్న చిరు ద్వీపానికి తరలించి కాపాడుతోంది. ‘జంగ్లీ’ తెగ 1930 నాటికి పూర్తిగా అంతరించిపోయింది. ఓంగే తెగ ` ఇపుడు అంతా కలసి 96 మంది ` లిటిల్‌ అండమాన్‌ ద్వీపపు ఉత్తర కొసనా, దక్షిణ కొసనా మిణుక్కుమంటూంది. సెంథినరీస్‌ మాత్రమే అప్పటికీ ఇప్పటికీ తమ నార్త్‌ సెంథినెల్‌ ద్వీపంలో ఉంటున్నారు. వారి సంఖ్య నలభైలోపేనట. వారి ద్వీపం దక్షిణ అండమాన్‌ ద్వీపానికి తూర్పున ఏభై కిలో మీటర్లు పెడగా ఉంటుంది. అండమాన్లలోనే కాదు, భారతదేశంలోనే గాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రాధమిక ఆదిమ జాతుల్లో ఈ సెంథినరీస్‌ ఒకటట. ఇప్పటికీ బయట ప్రపంచంతో ఏ సంపర్కమూ లేకుండా ఉండిపోయిన తెగ ఇది.

ఇహ మిగిలిన అయిదో అండమాన్‌ తెగ ‘జరవా’లు. ప్రస్తుతం అక్కడి తెగల్లో అత్యధిక జనసంఖ్య ` సుమారు మూడు వందలు ` వీరిదే. ఒకప్పుడు దక్షిణ అండమాన్‌ ద్వీపపు దక్షిణ భాగంలో ఉన్న జరవాలు ఇపుడు మెల్లగా దక్షిణ, మధ్య అండమాన్‌ ద్వీపాల పశ్చిమ తీర ప్రాంతానికి తరలి వెళ్ళారు. ‘ఏ తెగకూ చెందని కలగూరగంప’ అని వారి సోదర తెగల్లో ‘జరవా’ అన్న మాటకు అర్ధమట. ‘అలాకాదు, వీరికి ‘జంగ్లీ తెగ’ వారసత్వం ఉంది’ అన్నది మరోభావన. ఏదేమైనా మొన్న మొన్నటిదాకా వీళ్ళూ బయట వాళ్ళకు దూరం దూరంగా ఉంటూ వచ్చారు. 70లలో గాబోలు ‘ది గ్రేట్‌ అండమాన్‌ ట్రంక్‌ రోడ్‌’ పడిరది. 1990ల నుంచి జరవాలు మెల్ల మెల్లగా బయట వారి ఉనికిని సహించడం నేర్చుకొన్నారు. కానీ అదే        ఉపద్రవాలకు కారణమవుతోంది. తెలియని తిండి పదార్ధాలు, మందులు, తగ్గే రోగనిరోధకశక్తి, పెరిగే మహమ్మారి  రోగాలు, తరిగే జనసంఖ్య ` దానికి తోడు వీళ్ళను ‘చూపించడానికి’ టూరిస్టు ఏజెంట్లు నడిపే యాత్రలు.. టూరిస్టుల కోసం వీరితో చెయ్యరాని నృత్యాలు చేయించడం.. ఆ వీడియోలు ఇంటర్నెట్‌కు ఎక్కగా గోలగగ్గోలు, కోర్టు ఉత్తర్వుల మేరకు వీరి మధ్యకు నాగరికులు వెళ్ళడాన్ని ఈ మధ్యనే నిషేధించడం..

ప్రకాష్‌ ఎయిర్‌పోర్ట్‌లో ‘కష్టం.. ఇపుడు అదంతా బాన్‌  చేసారు’ అనడం వెనుక ఇంత కధ ఉంది!! మరి మేము నిరాశ చెందడం అమాయకత్వమా! కానేకాదు! మూర్ఖపు వాస్తవ స్పృహారాహిత్యమా?! అనుమానమెందుకూ!!

జిర్కాటాంగ్‌ నుంచి మధ్య జలసంధి వరకూ జరవాల రిజర్వ్‌ ఫారెస్టు. వాహనాలనన్నిటినీ కూడగట్టి రోజుకు నాలుగే నాలుగు సార్లు పోలీసు ఎస్కార్టుతో కాన్వాయ్‌గా పంపిస్తున్నారు.  మధ్యలో ఏ జరవా మనిషీ కనిపించకుండా అధికార వర్గాలు జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. వాను కిటికీలు తెరవవద్దనీ, ఫోటోలు ` అడవినే అయినా ` అసలు వద్దే వద్దనీ  నిషేధాలు. అలా ఓ గంటంబావు జరవా అడవిలో ప్రయాణం. (‘అక్కడ పోలీసు వాను వెనకాల నలుగురు జరవాలను పోలీసులు కనుమరుగుచేసి ఉంచారు’.. ఓ స్థలం దాటాక మా హెల్పరు సమాచారం.. వానంతా హయ్యో హయ్యోలు.. నిట్టూర్పులు!!) చివరికి అడవిదాటి బడా ఫెర్రీలో వానుతో సహా ‘మధ్య జలసంధి’ దాటి నీలాంబర్‌ జెట్టీ చేరుకొన్నాం. గంట పదకొండు కొట్టేసింది.

నీలాంబర్‌ జెట్టీ నుంచి గుహల దాకా వెళ్ళడానికి ‘నయదేర జెట్టీ’ అనే చోటు దాకా బారాటాంగ్‌ క్రీక్‌లో ఓ అరగంట పాటు స్పీడుబోటు ప్రయాణం. అందరికీ లైఫ్‌ జాకెట్లు అందించారు. అదో ముచ్చటైన  రక్షణ. ఆహ్లాదకరమైన జల ప్రయాణం. అడపాదడపా కనిపించే చిరు ద్వీపాలు.. ఒడ్డున దట్టంగా మడ అడవులు.. ఉష్ణ మండల వృక్షాలు.. నీళ్ళ తుళ్ళింతలు.. యాత్రికుల కేరింతలు ` హఠాత్తుగా మా బోటు ఆ విశాలమైన క్రీక్‌లోంచి ఓ అతి సన్నని జలమార్గంలోకి ప్రవేశించింది. అటూ ఇటూ చేతికి తగిలేలా చెట్ల కొమ్మలు.. తలవంచక పోతే నుదుట బొప్పికట్టించే రెమ్మలు.. అదో చక్కని ప్రయాణం. పదకొండున్నర ప్రాంతంలో నయదేర జెట్టీలో బోటు దిగాం.

బోటు దిగీదిగగానే మమ్మల్ని ఆకట్టుకొన్నది ‘మడ అడవుల పరదా దారి’… మాన్‌ గ్రోవ్‌ కెనోపీ వాక్‌. ఓ రెండు వందల గజాల పాటు వెదురూ లతలతో కూడిన ఎత్తు పాటి ‘కర్ర వంతెన’ కట్టారక్కడ. పైన సూర్య కిరణాలు చొరబడలేనంత దట్టంగా మడ చెట్ల కొమ్మలూ, రెమ్మలూ, ఆకులూ.. అటూ ఇటూ మడ అడవి. కింద చిత్తడినేల.. అక్కడక్కడ ` వర్షం వస్తే రక్షణ కోసమట ` ఎకో కుటీరాలు. చక్కని ఆరంభ అనుభూతిని కలిగించిందానడక. ఆదారి అలా సాగి సాగి ఆ కర్ర వంతెనను దాటుకొని, కాలి బాటలోకి దారితీసి, ఓ ఇరవై నిముషాలు నడిపించి గుహల దగ్గరకు తీసుకు వెళ్ళింది. అక్కడ ఆయా సున్నపురాతి గుహలు ఎలా ఏర్పడ్డాయో, అందుకు దారితీసే ప్రాకృతిక, రసాయనిక కారణాలేమిటో వివరించి చెప్పే మూడు బోర్డుల మాలిక.. లోపల వివిధ ఆకృతుల్లో.. విఠలాచార్య సినిమాల్లో లాగా ` పై కప్పు నుంచి నేలమీది వరకూ రూపుదిద్దుకొన్న సున్నపురాతి మాలలు.. ‘అదిగో గణేషుని ఆకృతి.. ఇదిగో శివలింగం.. అల్లదిగో గజరూపం..’ అంటూ హడావుడి చేస్తోన్న గైడులు.. చీకటి దారుల్లో టార్చిలైట్ల వెలుగుబాటలు… మోకాళ్ళ మీద పాకి మరీ చేరుకోవలసిన గుహల అంతర్భాగాలు.. అందరిలోనూ పసినాటికుతూహలం.. కోలాహలం.. అదో ఆనందవెల్లువ. కానీ ఒక్కమాట. మన బొర్రాలోనూ, ఆ మాటకొస్తే బెలుంగుహల్లోనూ ఇంతకన్నా గొప్ప శిలాకృత సంపదలున్నాయన్నది నిర్వివాదం.

ఓ గంటలో తిరిగి ‘నయదేర’ జెట్టీ చేరాం. మరో అరగంటలో ‘నీలాంబర్‌’ జెట్టీ.

ఆ గుహల సమీపంలోనే ఓ మట్టిని చిమ్మే జ్వాలాముఖి ఉందని తెలుసు.

టూరు మొదలవ్వక ముందు మా యాత్రలో ఆ వోల్కనో కూడా ఉండి ఉంటుందనే అమాయకంగా నమ్మాం. కానీ టూరు మొదలయ్యూ మొదలవ్వగానే డ్రైవరు స్పష్టపరిచాడు. ‘మనకు టైము చాలదు గాబట్టి ఈ టూరులో దాన్ని చేర్చం’ అని. సరేననుకొన్నాం.

నీలాంబర్‌ జెట్టీలో మరెంచేతో మాకు ఓ గంట విరామం దొరికింది. మేం అక్కడికి చేరింది ఒంటిగంటకయితే ఫెర్రీ నడిచేది రెండిరటికట. ‘లంచ్‌బ్రేక్‌’ అని దాన్ని సర్దిచెప్పారు డ్రైవరూ, హెల్పర్లు. నా మనసు మాత్రం ఈ బ్రేక్‌ను అంగీకరించనంది. గబగబగబా వాకబు చెయ్యగా ` ఆ గంట సేపట్లో అక్కడికి ఏడెనిమిది కిలోమీటర్ల దూరాన ఉన్న ఆ మట్టి జ్వాలాముఖి దగ్గరికి వెళ్ళిరావడం సాధ్యమే అని బోధపడిరది. కార్యాచరణకు దిగాను. పక్కనే ఉన్న టాటా సుమోను అడిగాను. సరసమైన రేటే చెప్పాడు. సహ యాత్రికులను కదిపాను. పదిమంది రెడీ అయిపోయారు! మరి ఇహనేం? అయిదే అయిదు నిముషాల్లో అందరం అడవి దారి పట్టాం. ‘రెండిరటిలోపల రాకపోతే మీకోసం ఆగం’ అని డ్రైవరుగారు తన ధర్మంగా మమ్మల్ని హెచ్చరించాడు. అయినా రిస్కు తీసుకొన్నాం!

ఆకులూ కొమ్మలూ రెమ్మలూ ఏదేనీ కారణం వల్ల మట్టిలో బాగా కప్పడిపోయినపుడు అవి కుళ్ళడం ద్వారా మీథేన్‌ లాంటి రకరకాల వాయువులు పుడతాయట. ఆ వాయువులు పైకి తన్నుకొనే ప్రయత్నంలో వాటిపైనున్న మట్టిని పైకి ఎగదోస్తాయట. అలా స్రవించే మట్టి ఉపరితలం చేరుకొని, ‘ఘనీభవించి’, చుట్టు పక్కల పరచుకొని ` మధ్యలో మట్టి ఊరి ఎగసిపడే ఓ రంధ్రంతో ` విలక్షణ ఓల్కనోగా రూపుదిద్దుకొంటుందట. వీటిల్లోంచి మట్టి స్రవించడం అన్నది మౌనంగా జరిగిపోయే నిరంతర ప్రక్రియే అయినా అడపాదడపా ఈ మ్రణ్మయ జ్వాలాముఖులు కూడా అల్లరీ అట్టహాసాలతోనూ, చిరు భూ ప్రకంపనలను సృష్టిస్తూనూ విస్ఫోటం చెందడమూ జరుగుతుందట. అలా ఈ మధ్య 2003లోనూ, 2004లోనూ ఇక్కడ జరిగిందట. ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల మట్టి ఓల్కనోలున్నాయని అంచనా. అందులో మూడు వందలు బ్లాక్‌సీ, కాస్పియన్‌సీల తీరాలలో ఉన్నాయట.

సుమో దిగాక ఓ రెండు మూడు వందల మీటర్లు గబగబా నడచి ఓల్కనో దగ్గరకు చేరుకున్నాం. నేను హెడ్మాష్టరు అవతారం ధరించి ‘పదంటే పదే నిముషాల్లో చూపులూ, పలకరింపులూ ముగించి వెనక్కి మళ్ళాలి’ అని ఆజ్ఞ జారీ చేసాను.

మేం చేరిన ఓల్కనో మరీ చిన్నది. టీనేజర్ల ఆట బొమ్మలా, ఇంటర్మీడియెట్‌ విద్యార్ధుల సైన్సు మోడల్లా ఉంది. కానీ అగ్ని పర్వతం అగ్నిపర్వతమే ` మట్టిదయినా, మరీ చిట్టి దయినా. ఆ అభ్యంతరాలను మనసులోకి రానివ్వకుండా చక్కగా ఆ పదినిముషాలూ గడిపాం. అక్కడున్న సమాచారపు బోర్డులను శ్రద్ధగా చదువుకొన్నాం. తిరిగి రెండింటికి నీలాంబర్‌ జెట్టీ, రెండున్నరకు ఆవలి గట్టు ` మళ్ళా జరవాల సీమలో…

 

**************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *