May 3, 2024

మౌనరాగం – 6

రచన: అంగులూరి అంజనీదేవి anjanidevi

http://www.angulurianjanidevi.com

anguluri.anjanidevi.novelist@gmail.com

http://www.angulurianjanidevi.com/

anguluri.anjanidevi.novelist@gmail.com

– See more at: http://magazine.maalika.org/2014/02/01/%e0%b0%ae%e0%b1%8c%e0%b0%a8%e0%b0%b0%e0%b0%be%e0%b0%97%e0%b0%82-4/#sthash.iMqJo7rG.dpuf

http://www.angulurianjanidevi.com/

anguluri.anjanidevi.novelist@gmail.com

– See more at: http://magazine.maalika.org/2014/03/10/%e0%b0%ae%e0%b1%8c%e0%b0%a8%e0%b0%b0%e0%b0%be%e0%b0%97%e0%b0%82-5/#sthash.nzAr66KW.dpuf

సుభాష్‌చంద్ర మరణం దేదీప్యకి పెద్ద షాకయింది.

దేదీప్యను ఎలా ఓదార్చాలో అర్థం కాక, ఆ స్థితిలో ఆమెను ఒంటిరిగా వదిలెయ్యలేక, తన ఇంటికి తీసుకొచ్చుకొని, ఆ రాత్రికి తన గదిలోనే పడుకోబెట్టుకొంది యశోదర.

దేదీప్యలోని నిరాసక్తత చూస్తుంటే సుభాష్‌చంద్ర చావు ఆమె మీద ఎంత ప్రభావం చూపిందో అర్థమవుతోంది.  ఏ భావం లేని ఆమె ముఖం చూస్తుంటే యశోదరకు భయమేస్తోంది.

స్నేహితుని మరణం రాజశేఖరాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పరిస్థితి మొత్తం అర్థమైనా అత్తగారు దేదీప్యను ఇంటికి తీసుకొచ్చి తన గదిలో పెడుకోబెట్టుకోవటం లాలిత్య జీర్ణం చేసుకోలేక,  కోపంతో వూగిపోతోంది.  అవకాశం దొరికితే తన మాటలతో గాయపరచాలని ఎదురుచూస్తోంది.

సుభాష్‌చంద్రను తలచుకొని, కళ్లనీళ్లును పెట్టుకుంటున్న దేదీప్య చేత బలవంతంగా అన్నం తినిపించి, ఆమెను ఆ బాధ నుండి బయటపడేలా చెయ్యాలని ఎంత చూసినా దేదీప్యలో మార్పు రాకపోవటం యశోదరకు విచారంగా వుంది.

‘‘దేదీప్యా! పోయినవాళ్లు తిరిగిరారు.   నువ్వెంత బాధపడ్డా,  అన్నం, నీళ్లు మానేసినా సుబాష్‌చంద్ర తిరిగిరాడు.’’ అంది యశోదర దేదీప్య బాధ చూడలేక…..

‘ఆయన చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా ఆంటీ! ఒక సాదారణ గృహిణిగావున్న నన్ను తీర్చిదిద్ది, ఎంతో ఎత్తుకి ఎదిగేలా చేశారు.  ఇప్పుడు నా రెక్కలు దారి మధ్యలోనే విరిగిపోయాయి’’ అంది దేదీప్య.

యశోదర మాట్లాడలేకపోయింది. భర్త, అత్తగారు దేదీప్య విషయంలో ఎంత నిర్భయంగా ప్రవర్తించారో ఆమెకు తెలియంది కాదు. ఆ టైంలోనే సుభాష్‌చంద్ర అండ, ఆదరణ, ఓదార్పు దేదీప్యకి దొరికాయి. ఇప్పుడవి కరువవ్వటం దేదీప్య దురదృష్టం.

‘‘ఆంటీ! దీపక్‌ నన్ను కొట్టలేదు. మా అత్తగారు నా నెత్తిన కిరోసిన్‌ పోయ్యలేదు.  కానీ నాలో వుండే సున్నితత్వం వాళ్ల మాటలతో, ప్రవర్తనతో నలిగిపోయింది. ఒక్కరోజు కూడా వాళ్ల నుండి నాకు ఓదార్పు కాని, సుఖంకాని దొరకలేదు.  ఆర్థిక భద్రత అందలేదు. అప్పుడు నా మనసు ఏడుస్తుంటే, నన్ను నేను ఓదార్చుకునే స్థాయికి సుభాష్‌చంద్ర తీసికెళ్లారు.  ఇప్పుడాయన లేకపోవటంతో నా నవనాడులు పనిచెయ్యటం మానేశాయి.’’ అంది దేదీప్య.

దేదీప్య చెప్పేది అక్షరాల నిజం. సుభాష్‌చంద్ర నీడలో మొలచి ఎదిగిన మొక్క దేదీప్య. ఆయనలేకపోవడం తీరని లోటు. అడుగడుగునా యిలాంటి పరీక్షలు దేదీప్యకి ఎందుకు ఎదురవుతున్నాయో అర్థం కావటం లేదు అనుకొంది యశోదర మనసులో.

‘‘నువ్వు పత్రికాఫీసుకి వెళ్లు దేదీప్యా!  ఇలాగే వుంటే నీ మనసు ఇదే ఆలోచిస్తూ బాధపడ్తుంది.’’ అంది యశోదర.

‘‘ఇంకెక్కడి ఆఫీసు ఆంటీ! అప్పుల వాళ్లు పత్రికను వేలం వేస్తామంటున్నారు.  ఇకముందు నాకు ఆ పని కూడా లేకుండా పోయింది. వున్న ఆ ఒక్క ఆధారం కూడా ఇప్పుడు లేదు నాకు.’’ అంది బాధగా

దేదీప్యను ఆ స్థితిలో చూస్తుంటే బాధగా వుంది. దీపక్‌ ఇంటికి రాక, చేతిలో పనిలేక ఇకముందు దేదీప్య ఎలా బ్రతకాలి?

*     *     *     *     *

అత్తగారు బాత్‌రూంలో స్నానం చేస్తున్న టైం చూసి ఇదే మంచి అవకాశం అన్నట్లుగా క్రిందికి దిగింది లాలిత్య

హాల్లో అటు, ఇటు తిరుగుతూ దేదీప్యకి మాత్రమే విన్పిపించేలా గొంతు తగ్గించి.‘‘కదలకుండా తిష్ట వెయ్యాలనుకున్నప్పుడు ఏదైనా అనాధ ఆశ్రమం చూసుకోవాలి. మీలాంటి వాళ్ల పుణ్యమా అని మాలాంటి వాళ్ళం కాపురాలు చేసుకోలేకపోతున్నాం. మా మగవాళ్ల  మనసులెక్కడ మారిపోతాయోనని భయంతో చచ్చిపోతున్నాం.  ఏ టైంలో ఏం జరుగుతుందో అన్నట్లు ఒకటైమున్నట్లు ఒక టైం వుండదుగా.’’ అంటూ సూటిగా దేదీప్యను తాకేలా అంది లాలిత్య. దేదీప్య ప్రాణం చచ్చిపోయేలా అయింది.

మంచుపర్వతంలాంటి యశోదర ఆంటి ఔదార్యం నీడలో తలదాచుకోవాలని వస్తే గులకరాయిలాంటి లాలిత్య మాటలు దేదీప్యను గురి చూసి కొట్టాయి.

దేవుడు తనకిలాంటి రాత రాశాడేంటి? అయినా తనేంటి వీళ్ల యింట్లో తలదాచుకోవటం?  అని మనసులో అనుకుంటూ వెలకట్టలేని యశోదర ఆంటీ ఆదరణ గుర్తొచ్చి ఆమె వచ్చే వరకు ఆగాలనుకొంది. కాని ఆగితే ఆమె వెళ్లనివ్వదు. కోడలితో గొడవపెట్టుకుంటుంది.  తన వల్ల వాళ్ల మధ్యన వాదన పుట్టటం వినటానికే అసహ్యంగా వుంటుంది. అనుకొని…… వెంటనే లేచి తన యింటికి వెళ్లింది దేదీప్య.

యశోదర బాత్‌రూంలోంచి బయటకి రాగానే దేదీప్య కోసం చూస్తూ ‘‘దేదీప్యా!’’ అంటూ పిలిచింది. దేదీప్య కన్పించకపోవటంతో ఆశ్చర్యంగా అన్పిపించి లాలితను పిలిచింది.

‘దేదీప్యను నువ్వేమైనా అన్నావా?’’ అంది సూటిగా కోడలివైపు చూస్తూ యశోదర.

అత్తగారి చూపులు తట్టుకోలేని దానిలా…

‘‘అన్నాను ఏం తప్పా?’’ అంది లాలిత్య.

‘‘ఏమన్నావ్‌?’’ అంది అసహనంగా యశోదర.

‘‘అవన్నీ మీకు చెప్పాలా? నా నోటికి ఏదివస్తే అది అన్నాను.’’అంది లాలిత్య.

షాకయింది యశోదర.

‘‘బాధలో వున్న మనిషిని అర్థం చేసుకోకుండా, నోటి కొచ్చినట్లు మాట్లాడి వెళ్లగొడ్తావా? ఆ అమ్మాయి నీకేం అడ్డొచ్చింది?’’

‘‘ఏమోచ్చిందో మీకు తెలుసా? ఎంతసేపు ఆవిడగార్ని వెనుకేసురావటమే కాని యింట్లో ఓ మనిషిని నేను వున్నానన్న ద్యాసవుందా మీకు?

ఎప్పుడైనా నన్ను మీరు పట్టించుకున్నారా? ఎప్పుడు చూసినా బయటకెళ్లి మహిళాభ్యుదయం అంటూ మాట్లాడతారు కానీ ఇంట్లో వున్న నాతో ఏనాడైనా నాలుగు మాటలు మాట్లాడారా? ఇదిగో ఇప్పుడు కూడా నన్ను ముద్దాయిని చేశారు.  దేదీప్యను కౌగిలించుకుంటున్నారు. మీరేం అత్తగారండీ! ఇలాగేనా అత్తగారంటే వుండేది.’’ అంటూ గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది లాలిత్య.

యశోదర నివ్వెరపోయి చూస్తోంది.

ఏ సందర్భములోనైనా ఎదుటి మనిషిని దోషిని చేసి నిలబెట్టగలిగే సత్తా వున్న లాలిత్య మాటలు చెప్పులో రాయిలా అన్పించి యశోదర మస్తిస్కాన్ని రంపపు కోత కోశాయి.

‘‘మీరేమో ఆమె బాధలో వుందని తెచ్చి యింట్లో పెట్టుకున్నారు. మీ కొడుకేమో ఆమెను ఆరాదిస్తున్నారు.  అసలు నేనీ యింట్లో వుండాలా? వద్దా?’’ అంది లాలిత్య.

‘‘మాట్లాడే ముందు  ఆలోచించాలన్న కనీస జ్ఞానం కూడా లేదా నీకు?’’ అంది యశోదర కోపాన్ని ఆపుకోలేక

‘‘ ఆ మొగుడు వదిలేసిన దాన్ని వెనకేసుకువస్తూ….

‘‘నాకు జ్ఞానం లేదంటారా?  వుండండి మీ పని చెబుతా’’ అంటూ యశోదర వైపు చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ పైకెళ్లింది.

యశోదరకేం అర్థం కాలేదు. ఇంటి కోడలని ఎంత సర్దుకుపోతున్నా, లాలిత్య ఆగడాలను భరిచలేపోతుంది.

కొద్దిసేపటి తర్వాత….

‘‘నాకు జ్ఞానం లేదన్నారుగా.. మీరంతా తెలివైన వాళ్లునేనెందుకు మీ మధ్యన ? చచ్చిపోతున్నా….. ’’ అంటూ ఏదో మింగిన దానిలా గొంతు పట్టుకొని వూపిరాడనట్లు కీచుగా అరుస్తూ క్రిందకి దిగింది లాలిత్య.

ఆ మాటలు వినగానే భయంతో వణికిపోతూ…

‘‘ఏమైంది లాలిత్యా?’’ అంటూ దగ్గరకొచ్చింది యశోదర.

‘‘దగ్గరకి రాకండి! మీరింక హాయిగా వుండండి! నేను విషం త్రాగాను.’’ అంది లాలిత్య. గొంతు దగ్గర నుండి చేతులు తియ్యకుండా

వెంటనే అభిరాంని కేకేసింది యశోదర.

తల్లి కేక విని బిత్తరపోయాడు అభిరాం.

లాలిత్య చేష్టలు, తల్లి ముఖంలో కంగారు చూసి…. ప్రమాదాన్ని గుర్తించి….. హాస్పిటల్‌కి వెళ్లాలని వెంటనే కారు బయటకు తీశాడు.

హస్పిటల్‌ లోపలికి వెళ్లాక యశోదర వెళ్లి డాక్టర్‌గారితో మాట్లాడగానే వెంటనే లాలిత్యను తీసుకెళ్లి ఒక గదిలో పడుకోబెట్టారు.

పైపులు, సెలైన్‌ బాటిల్‌ తెచ్చి, లాలిత్య చుట్టూ నర్స్‌లు నిలబడ్డారు.

లాలిత్య ఎంత గింజుకుంటున్నా వదలకుండా, కాళ్లూ, చేతులు కదలకుండా యశోదర నర్స్‌లు పట్టుకున్నారు. డాక్టర్‌ పైపు ద్వారా లాలిత్య కడుపులోకి మెడిసిన్‌ పంపించారు.

అప్పటి వరకు ఊపిరాడనట్లున్న లాలిత్య ఒక్కసారిగా

‘‘నేనేం తాగలేదు నన్ను వదిలెయ్యండి!’’ అంటూ అరవటం మొదలుపెట్టింది.

‘అలాగే మాట్లాడుతారు ఎవరైనా’ అని ఆమె మాటల్ని పట్టించుకోకుండా డాక్టర్‌, నర్స్‌లు వాళ్ల పని వాళ్లు చేసుకుపోతున్నారు. లాలిత్య అరుస్తోంది, కేకలేస్తోంది. ‘‘నన్నేం చేయకండి నేనేం తాగలేదు.’’ అంటోంది. అయినా వాళ్లామెను వదలట్లేదు.

కోడల్ని ఆ స్థితిలో చూస్తుంటే ఈ పాపం తనకెక్కడ తగులుతుందోనని యశోదర కళ్లలోకి నీళ్లొచ్చాయి.  ‘‘ నా కోడల్ని బ్రతికించు దేవుడా!’’ అని మనసులో దేవునికి మొక్కుంది.

అభిరాం మాత్రం ‘ఏంటిరా నాకీ ఖర్మ.’ అనుకుంటూ వాళ్ల అత్తగారికి, మామగారికి ఉన్నపళంగా బయలు దేరి రమ్మంటూ ఫోన్‌ చేశాడు.

లాలిత్య అరుపులతో, కేకలతో హాస్పిటల్‌ మొత్తం దద్దరిల్లుతోంది…

‘‘నేనేం తాగలేదని చెబుతుంటే అర్థంకాదా మీకు? నిజంగానే డాక్టర్‌! నేనేం తాగలేదు.  ఏదో మా అత్తగారిని భయపెట్టాలని అలా చేశాను.’’ అంటూ డాక్టర్ని బ్రతిమాలింది.

దారిన పోయే వాళ్లు ‘ఏమైంది’ అని అడుగుతుంటే యశదోర తల సిగ్గుతో వాలిపోగా, అభిరాం మనసుకి చిన్నతనంగా వుంటే అప్పుడే అక్కడికి వచ్చిన రాజశేఖరంకి ఈ కథంతా గందరగోళంగా అన్పించింది.

లాలిత్యకి ప్రేగులు కదలిపోయేలా కక్కించారు.  అప్పటికి  అమె ఏమీ మింగలేదని నిర్థారణ అయింది. లాలిత్యకి పేగుల నొప్పి మిగిలింది.

సెలైన్‌ బాటిల్‌ని అలాగే కంటిన్యూ చేసి….

‘‘మీ కోడలి ప్రాణానికి ఏమి భయం లేదు.’’ అంటూ డాక్టర్‌ గారు వెళ్లిపోయారు.ఇంజక్షన్‌ ఇవ్వటంతో ప్రశాంతంగా నిద్రపోతోంది లాలిత్య.

లాలిత్య వాళ్ల అమ్మా, నాన్న హుటాహుటిన కారులో వచ్చి హాస్పిటల్‌ ముందు దిగారు.

అభిరాంకి వాళ్లను చూడగానే పట్టరాని కోపం వచ్చింది. ఏదో అనబోయే లోపలే అభిరాం చేయిపట్టి ఆపుతూ లాలిత్య ఉండే రూంలోకి వాళ్లని తీసుకెళ్లింది యశోదర. సమయం, సందర్భాన్ని బట్టి కోప, తాపాలను ప్రదర్శించాలన్నదే ఆమె అభిప్రాయం.

కూతుర్ని చూడగానే కదిలి, కదిలి ఏడ్చింది లాలిత్య తల్లి అరుణాదేవి.

లాలిత్య తండ్రి భుజంపై చేయి వేస్తూ….

‘‘లాలిత్య ఏం మింగలేదురా! వూరికే భయపెట్టాలని అలా చేసిందట. డాక్టర్‌ గారు ఇప్పుడే చెప్పారు.  ఇంజక్షన్‌ యివ్వగానే నిద్రపోతుంది.’’ అన్నాడు రాజశేఖరం ఫ్రెండ్‌కి ధైర్యం చెబుతూ.

లాలిత్య తండ్రి తనకి ప్రాణ స్నేహితుడు కావటంతో అంతకన్నా ఏమీ అనలేకపోయాడు రాజశేఖరం.

మౌనంగా మారింది ఆ వాతావరణం.

కొన్ని గంటల వ్యవథిలోనే లాలిత్యను డిశ్చార్చి చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికొచ్చాక……

లాలిత్యకి జ్యూస్‌ తాగించి పడుకోబెట్టి, పై నుండి క్రిందకి దిగింది అరుణాదేవి. అరుణాదేవి హాల్లోకి రాగానే……

‘‘ఇలా మీ కూతురు చేసుకునే వెదవ పనులన్నింటికి నేను రెస్పాన్స్‌బులిటీగా వుండలేనండి! నాకు విడాకులు కావాలి. మీ అమ్మాయిని తీసుకెళ్లండి! ఇవాళ ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఎక్కడైనా భర్త,అత్తగారు  కోడల్ని హింస పెడతారని వింటాం. కాని యిక్కడంతా రివర్స్‌లో వుంది.  మీ కూతురు రోజుకి ఎన్నిసార్లు గొడవ చేస్తుందో తెలుసా?’’ అన్నాడు అభి.

అరుణాదేవి కళ్లలో నీళ్లొచ్చాయి.  ఆమె కళ్లలో నీళ్లు చూడగానే అభి  యింకేం మాట్లాడలేపోయాడు.

‘‘వదినగారు! మీ కూతురు గురించి మీకు ముందే తెలిసి వుండొచ్చు.  మావారేదో ప్రాణాస్నేహితుని కూతురని ముచ్చటపడ్తుంటే ఎవరైతే ఏంటి మంచి కోడలైతే చాలు అన్నట్లుగా మేం కూడా ఏమీ అనలేదు.  పైగా ‘తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేను రెండు అంటా’ అన్నట్లుగా మీ కూతురు వున్నా కూడా నెమ్మదిగా మారకపోతుందా అని ఎదురుచూశాను. కానీ తను మారకపోగా రోజూ మాకు నరకాన్ని చూపిస్తోంది.  నోరు తెరిచి ఇప్పుడు చెబుతున్నా పెళ్లైన నాటి నుండి మావాడు మీ అమ్మాయితో ఏ రోజూ సుఖపడింది లేదు.’’ అంది యశోదర.

యశోదర తన కొడుకు మనోవేదనను గమనిస్తూ చాటుగా ఎంత బాధపడ్తుందో యశోదరకే తెలుసు.

అప్పటి వరకు నోరు మెదపని అరుణాదేవి ఏదో అర్థమైనదానిలా

‘‘ నా బిడ్డ తప్పుల్ని పెద్ద మనసుతో మన్నించి, కడుపులో పెట్టుకోండి వదినగారు! లాలిత్యను మాతో తీసికెళ్లి, తనకి నచ్చ చెప్పి డాక్టర్‌తో కౌన్సిలింగ్‌ యిప్చించి మీరెలాంటి కోడలు కావాలనుకుంటున్నారో అలా తయారు చేసి పంపిస్తాను.  అప్పటి వరకు  మీ మనసులో ఎలాంటి ఆలోచన రానివ్వకండి! దయచేసి ఈ ఒక్క అవకాశం నాకు యివ్వండి!’’ అంటూ యశోదర చేతులు పట్టుకొని రిక్వెస్ట్‌ చేసింది.తన చేతుల్ని పట్టుకొని అరుణాదేవి చేతులు ఆ బిడ్డపై మమకారంతో సన్నగా వణకటం గమనించింది యశోదర అలా అనటానికి చాలా కారణాలు వున్నాయి.  ఒకరోజు రాజశేఖరం కారు బయటకి తీస్తూ… గేటు కిర్రుమనగానే… తుప్పుపట్టిందేమో ఆయిల్‌ వేద్దామని లాలిత్యను తెమ్మన్నాడు. ఆమె ఎలాగూ జుట్టుకి అయిల్‌ పెట్టుకోదు కాబట్టి నేరుగా చెప్పుల కాళ్లతోనే దేవుని గదిలోకి వెళ్లి ఆయిల్‌ పట్టుకురావటం యశోదర చూసింది.  భూమిచీలి అందులోకి తను వెళ్లిపోతున్నట్లు ఫీలైంది. ఇంకా ఇలా ఫీలైన సందర్భాలు చాలా వున్నాయి.

యశోదర లోని ఆడ మనసు కరిగింది.

‘‘సరే! వదినగారు! తన  కూతురి మానసిక స్థితి ఎందుకలా తయారయిందో కొద్ది, కొద్దిగా అర్థమైంది. ఏ తల్లికైనా కన్నా బిడ్డ విషయంలో తెలియనిది అంటూ ఏదీ వుండదు.  ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో…..

పెళ్లైతే అంతా సర్దుకుంటుందిలే అనుకొంది కాని అదే శాపమై అభిరాంతో కాపురం కూడా చెయ్యదని వూహించలేకపోయింది.

వెంటనే తన భర్తతో సంప్రదించి విజయవాడలో వున్న ఫేమస్‌ సైక్రియాటిస్ట్‌కి కాల్‌ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకొంది అరుణాదేవి.

ఇన్నాళ్లూ ఈ రహస్యాన్ని భర్తకి కూడా చెప్పకుండా గుండెల్లో దాచుకున్న అరుణాదేవి దిక్కు తోచని దానిలా అసలిదంతా తల్లి వల్లే జరిగిందంటూ తల బాదుకొంది కుమలి, కుమిలి ఏడ్చింది.

ఆ ఒక్కరోజు తన స్నేహితురాలి ఇంట్లో లాలిత్యను వుంచకపోయివుంటే ఇలా జరిగుండేది కాదు.  నిజానికి లాలిత్య అందరితో ఎంతో సంతోషంగా కలిసి మెలిసి తిరిగేది.  వంట కూడా చక్కగా చేసేది . కానీ ఈ రోజు యిలా తయారవ్వటానికి కారణం తన స్నేహితురాలి భర్తే.  ఈ నిజాన్ని జీర్ణించుకోటానికి చాలా శక్తి అవసరమైంది.

ఆరోజు అరుణాదేవి తన స్నేహితురాలి ఇంట్లో లాలిత్య వదిలి వెళ్లాక….

ఆంటీకి పాలు కలిపి యివ్వాలని వంటగదిలోకి వెళ్లింది లాలిత్య అప్పుడే వూరి నుండి వచ్చిన ఆమె భర్త….

 

‘‘నీకు ఆరోగ్యం బాగా లేదు కదా! మరి, కిచెన్‌లో ఎవరున్నారు?’’ అంటూ కిచెన్‌లోకి వెళ్లి…. అక్కడ లాలిత్యను చూడగానే దుర్బుద్దితో లాలిత్య భుజంపై  చేయి వేశాడు. వెనుదిరిగి చూసిన లాలిత్య…..

ఒక్కసారిగా అదిరిపడి, మళ్లీ తేరుకొని

‘‘మీరెప్పుడొచ్చారు అంకుల్‌?  మీరు రారేమోనని ఆంటీకి తోడుగా వుండమని అమ్మ నన్నిక్కడ వుంచింది.’’ అని లాలిత్య అంటుంటే అతని చేతులు మౌనంగా నిర్భయంగా ఆమెను ఎక్కడెక్కడో తాకటం మొదలు పెట్టాయి.

అతనేం చేస్తున్నాడో అర్థమై అతని చేతుల్ని విదిలించి రాబోతుంటే గట్టిగా పట్టుకున్నాడు. చేతికందిన చాకుతో ఆతన్ని గాయం చేసింది. అప్పటికీ అతను వదలకుండా వెంటబడ్తుంటే బలమంతా కూడదీసుకొని ఎలాగోలా తప్పించుకొని బయటపడి ఇంటికెళ్లింది లాలిత్య…..

ఇంటికెళ్తున్నంతసేపు ఆమె ఒళ్లంతా చెమటతో నిండిపోయింది.

ఇంకా ఆ షాక్‌లోంచి తేరుకోని లాలిత్యకి… ఒళ్లంతా చెమటలు పట్టి,  మాటలు రాని దానిలా శూన్యంలోకి చూస్తుంటే విషయం అర్థం చేసుకున్న అరుణాదేవిలోని కన్న ప్రేగు కదిలినట్లైంది.

అనారోగ్యంతో మూలుగుతున్న స్నేహితురాలి పై జాలితో తన కన్న బిడ్డను తోడుగా వుంచితే తప్పు లేదనుకొంది కాని అది పులిబోను అనుకోలేదు.  ఎంత అవసరమైనా ఎదిగిన పిల్లను పరుల యింట్లో వదలకూడదని అప్పుడే తెలుసుకున్న దానిలా తన కూతుర్ని ఒళ్లంతా తడిమి చూసుకొంది ఏం జరిగిందో మెల్లగా అడిగి తెలుసుకొంది.

తన కూతురికి ఏమీ కాలేదని ఆ రోజు సంతోష పడిరదే కాని తండ్రిలాంటి వ్యక్తి తాకటంతో ఆమె మానసిక స్థితి దెబ్బతిని భర్తను చూసి పరాయి వ్యక్తిలా భయ పడ్తూ భర్తను దూరంగా వుంచుతుందని వూహించలేకపోయింది..

కూతురు కాపురం బాగుండాలని, భర్తతో సుఖంగా సంసారం చేసుకోవాలని ఏ తల్లికైనా వుంటుంది. ప్రస్తుతం తన కూతురికి సరైన ట్రీట్‌మెంట్‌ ప్రముఖ సైకియాట్రిస్ట్‌ ఇండ్ల రాయసుబ్బారెడ్డి గారైతేనే ఇవ్వగలరనుకొంది.  ఎన్ని సిటింగ్‌లైనా పర్వాలేదు.  తొలివ్యక్తి పూర్తిగా నయమై, అభిరాంని భర్తగా భావించి, అతనికి మంచి బార్యగా మసులుకోగలదన్న నమ్మకం కుదిరేదాక….. విజయవాడలో వుండే తన చెల్లి ఇంట్లో వుండి ట్రీట్‌మెంట్‌ ఇప్పించాలనుకొంది.

*     *     *     *     *     *

రోజులు గడుస్తున్నాయి.

దేదీప్య ఇంటి ముందు పూల చెట్ల మధ్యన వున్న పిచ్చి మొక్కల్ని ఏరిపారేస్తూ, కావ్యను చూడగానే కాళ్లూ, చేతులు కడుక్కొని పవిటకొంగుతో చేతులు తుడుచుకుంటూ..

‘‘కూర్చో కావ్యా!’’ అంది దేదీప్య.

సుభాష్‌చంద్ర చనిపోయిన తరువాత……

దేదీప్యకున్న కంప్యూటర్‌ నాలెడ్జితో ఒక కంపెనీలో జాబ్‌ వచ్చింది. కానీ ఆ కంపెనీలో వున్న వర్క్‌లోడ్‌కి, టైమింగ్స్‌కి ఆమె సెట్‌ కాలేక ఆ ఉద్యోగం వదిలేసి  ఇంట్లోనే వుంది దేదీప్య. ముఖం అదోలా వుండటం చూసి…..

‘ఎందుకలా వున్నావ్‌ దేదీప్యా! మిా అన్నయ్య, వదిన, గుర్తొస్తున్నారా?’’ అంది కూర్చుంటూ కావ్య. దేదీప్య కూడా కావ్య పక్కన కూర్చుంటూ…..

‘‘అదేం కాదు కావ్యా! నేత్రా పత్రికలో పని చేస్తున్నన్ని రోజులు ఏమి అన్పించలేదు కాని.  ప్రస్తుతం ఉద్యోగం లేక, దీపక్‌ ఇంటికి రాక ఇంట్లో ఒంటరిగా గడపాలంటే కష్టంగా వుంది.’’ అంది దేదీప్య బాధగా…..

‘‘ ఒంటరిగా వుండటం దేనికి? చుట్టు పక్కల వాళ్లతో కలివిడిగా వుండు.  నిన్ను వాళ్లతో కలుపుకుంటారు.  నీకు మంచి కాలక్షేపం అవుతుంది.’’ అంది కావ్య మంచి ఉపాయం చెబుతున్నదానిలా

‘‘వాళ్ల కబుర్లు ఎలా వుంటాయో నాకు అనుభవం అయింది కావ్యా!  వాళ్లంటే ఏమిటో బాగా తెలుసుకున్నాను. నన్ను చూస్తుంటే వాళ్లకి ఎగతాళి. దీపక్‌ నన్ను వదిలేశాడని చిన్న చూపు.  ఎంత తమాయించుకుందామన్నా వాళ్ల మాటల్లోని అవహేళన నన్ను విపరీతంగా బాధిస్తోంది. ఒక్కోసారి ఇల్లు మారదామనిపించినా యశోదర ఆంటీ ఆప్యాయత నన్నిక్కడే కట్టిపడేలా చేస్తోంది.’’ అంది దేదీప్య.

‘‘ప్రపంచంలో వుండే ఆనందాన్నంతా వాళ్ల ముఖాల్లో నింపుకొని, మనిషి కన్పించగానే పలకరింపుగా నవ్వుతూ, ఏమీ తెలియని వాళ్లలా అమాయకంగా మాట్లాడే హౌస్‌వైఫ్‌లు సాటిమనిషిని యిలా బాధిస్తున్నారంటే నమ్మలేకపోతున్నా దేదీప్యా.!’’ అంది కావ్య.

‘‘ ఆడవాళ్లు ఏ రంగంలో ఎంత ఎత్తుకి ఎదిగినా సాటి స్త్రీ ఆత్మాభిమానాన్ని కించపరచకుండా వుండలేరు కావ్యా! ఆ విధమైన తృప్తి వాళ్లకు దేనిలోనూ దొరకని విధంగా ప్రవర్తిస్తున్నారు. నీకింకో విచిత్రం చెప్పనా! ఒకావిడ తన భర్త ఎంతో కాలంగా దుబాయ్‌లో వుంటూ, డబ్బు పంపటం తప్ప ఆమె యిక్కడ ఎలా వుందో పట్టించుకోకపోయినా ఆమె ఎంతో సౌభాగ్యవతిలా నన్ను విమర్శిస్తోంది. ’’ అంది దేదీప్య.

‘‘నువ్వు బాధపడ్తున్నావా?’’

‘‘అదికాదు కావ్యా! నా చుట్టూ వున్న ఆడవాళ్లలో చాలవరకు ఎన్నోరకాల బాధ్యతల్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్న వాళ్లే… ఆదివారాలు కూడా సెలవు లేకుండా వంటచేస్తూ, బట్టలు ఉతుకుతూ, వెచ్చాలు తెచ్చుకుంటూ భర్తలు ఆఫీసులకి, పిల్లలు స్కూళ్లకి వెళ్లాక ఇంట్లో ఒంటరిగా గడిపేవాళ్లే…కానీ వాళ్లా కొద్ది టైంలో నైనా రెస్ట్‌ తీసుకోకుండా అంత పని వత్తిడిలో కూడా నా ముచ్చటే ముందేసుకొని చెవులు కొరుక్కుంటున్నారు’’ అంది దేదీప్య.

ఇప్పుడు దేదీప్యను చూస్తుంటే ఎం.బి.ఏ. చదువుతున్నప్పుడు అన్వేష్‌ ఆరాధించిన దేదీప్య కళ్లముందు మెదిలి మాయమైంది. తనకళ్లముందే పెళ్లి జరిగి శాపగ్రస్తలా మారిన ఈ దేదీప్య గురించి ఆఫీసులో దీపక్‌తో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. కానీ అతను మాట్లాడే దోరణి కావ్యకి నచ్చక మాట్లాడటమే మానేసింది. దీపక్‌ మాట్లాడిన మాటలు గుర్తొచ్చి కావ్యకి  కళ్లు చెమర్చాయి.  తనని చూసి కావ్య అలా కళ్లనీళ్లు పెట్టుకుంటుంటే ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తోచలేదు. దేదీప్యకి. అలాగే కూర్చుంది.  ఆమె గుండె ఎప్పుడో రాయి అయింది. అది గమనించిన కావ్య దేదీప్య భుజంపై ఆప్యాయంగా నిమురుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ…

‘‘ఇవన్నీ మనసులో పెట్టుకొని మనసు కష్టపెట్టుకోకు దేదీప్యా!’’ అంది కావ్య.

‘‘వాటంతటవే మనసులోకి జొరబడి కోరలున్న పురుగులా మనసును కొరికేస్తున్నాయి కావ్యా!’’ అంది దేదీప్య.

‘‘ఒక చిన్న పురుగు పెద్ద గుర్రాన్ని కుట్టి దానికి చికాకు కల్గిస్తుంది. అయినా  కూడా పురుగు, పురుగే, గుర్రం గుర్రమే కదా!’’ అంది కావ్య

కావ్య మాటలు వింటూ…..

‘‘చూస్తుండగానే నెలలు గడచిపోతున్నాయి. దీపక్‌ ఏమంటున్నాడు కావ్యా?’’ ఆశగా అడిగింది దేదీప్య.

దేదీప్య అవసరం అణువంతయినా లేనట్లు ప్రవర్తిస్తున్న దీపక్‌ని గుర్తుచేసుకుంటున్న దేదీప్యను చూస్తుంటే ఏం చెప్పాలో తెలియక మాటలు దొరకనిదానిలా మౌనంగా చూసింది కావ్య బార్యా, భర్తలు అన్నాక అభిప్రాయాలు కలవాలి. ఆలోచనలు కలవాలి.  ఒకరి కష్టం ఒకరు తెలుసుకోవాలి. ముఖ్యంగా నమ్మకం వుండాలి.

ఇవేం లేకుండా కేవలం ‘భర్త అనే పదాన్ని కోరుకోవటం…ప్రేమించటం అంటే ఇదేనేమో.

‘దేదీప్యా! నేత్రా పత్రిక ఇక నడవదంటావా?’’ అంటూ టాపిక్‌ని మార్చింది కావ్య.

‘‘దాన్ని కొనటానికి ఎవరైనా ముందుకి వస్తే ఎప్పటిలా నడుస్తుంది. లేకుంటే లేదు. అయినా అంత సత్తా ఎవరికి వుంటుంది? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దాన్ని కొనే ధైర్యం ఎవరు చెయ్యరనిపిస్తుంది.’’ అంది దేదీప్య. ఆ పత్రిక విషయం అణువణువు తెలుసు దేదీప్యకి.

‘‘సరే!  అమ్మ కోసారి కన్పించి ఆ దారిన అటే నిన్నో కంపెనీ దగ్గర డ్రాప్‌చేస్తాను రా! ఆ కంపెనీలో వేకెన్సీ వుందని తెలిసింది.’’ అంటూ లేచి తన స్కూటీ దగ్గరకి  వెళ్లబోతూ అక్కడ వున్న ప్యాకెట్స్‌ని చూసి ‘ఏమిటివి’ అన్నట్లుగా ఆసక్తిగా దేదీప్య వైపు చూసింది.  ‘వదినా, అన్నయ్యా స్టేట్స్‌ నుండి పంపారు కావ్యా!  చూడు. ఎలా వున్నాయో!’’ అంటూ  ఆ ప్యాకెట్స్‌ని ఒక్కొక్కటి విప్పి కావ్య చేతికి యిచ్చింది. కాస్ట్లీ శారీస్‌, ఒక సెల్‌ఫోన్‌, మెడలోకి రవ్వల సెట్‌.  వాటిని చూస్తుంటే అవి ధరిస్తే దేదీప్య ఎంత దేదీప్యమానంగా వెలుగుతుందో వూహించుకొంది కావ్య.

‘‘దీపక్‌ యింటికి రావటంలేదని  మీ అన్నయ్యతో ఎందుకు చెప్పడంలేదు దేదీప్య. చెబితే ఒకసారి వాళ్లొచ్చి ఏదో ఒకటి సెటిల్‌ చేసి వెళ్లేవారుగా.’’ అంది కావ్య.

‘‘ఏం చేస్తారు కావ్యా? దీపక్‌ చేసేవన్నీ నేను చెబితే నీట్‌గా విడాకులిప్పిస్తారు.అంతేగా! అది నాకు యిష్టం లేదు.’’ అంది దేదీప్య.  ఇలాంటివి పెద్దవాళ్లకి చెప్పకుండా వుండకూడదు.

‘‘విడాకులనే ఎందుకనుకోవాలి? నువ్వు బాగా డిప్రెషన్‌లో వున్నావు దేదీప్యా! చెప్పి చూడు’’ అంది కావ్యా.

‘‘చెప్పను కావ్యా! చెప్పి వాళ్లను బాధ పెట్టటడం నాకు ఇష్టం లేదు.’’ అంది స్థిరంగా దేదీప్య.

ఒక నిర్ణయానికి వచ్చాక దేదీప్యను మార్చటం కష్టమని యింకేం మాట్లాడకుండా స్కూటీ దగ్గరికి నడిచి వెళ్లింది కావ్య. దేదీప్య తలుపుకి తాళం పెట్టి కావ్య స్కూటీపై ఎక్కింది.

ముందుగా కావ్య తల్లి దగ్గరికి వెళ్లారు.ఆ తర్వాత ఒక పెద్ద కంపెనీ దగ్గర దేదీప్యను వదలి  కావ్య వెళ్లిపోయింది.

ఆ కంపెనీ వాళ్లు ఇంటర్వ్యూ పేరుతో మాట్లాడింది తక్కువే. అయినా ముందుగా కొంత అమౌంట్‌ డిపాజిట్‌ చేయ్యాలన్నారు. వాళ్లు అడిగినంత డబ్బు దేదీప్య దగ్గర లేదు. ఆలోచించుకుంటూ, ఆశ వదులుకొని బయటకు నడిచింది.

తలవంచుకొని మెల్లగా నడుస్తున్న దేదీప్య అభిరాం పిలుపుకి ఉలిక్కిపడి చూసింది. ‘ఏమాలోచిస్తున్నావు దేదీప్యా? క్షణంలో యాక్సిడెంట్‌  తప్పింది అదీ నా బైక్‌ క్రిందనే పడబోయావు.’’ అన్నాడు కంగారుగా

‘‘అవునా!!!’’ అన్నట్లుగా చూసింది. అభిరాం అలా అంటుంటే ఆమెకే ఆశ్చర్యంగా వుంది.

‘‘బాగా అలసిపోయినట్లు కన్పిస్తున్నావు. పద అలా టీ త్రాగుతూ కూర్చుందాం.’’ అన్నాడు ఎదురుగా వున్న  క్యాంటిన్‌ వైపు దారితీస్తూ అభిరాం. కాదనకుండా అతని వెంట నడిచింది దేదీప్య.

ఇద్దరు కూర్చున్నారు.  వాళ్లిద్దరికి మధ్య నిశ్శబ్ద్దం రారాజులా నిలబడింది. ఆ నిశ్బబ్దాన్ని ఛేదించాలని ఇద్దరికి లేనట్లు  ఎవరి ఆలోచనలో వాళ్లున్నారు.

బాధపడ్తూ బ్రతకాలని ఎవరూ అనుకోరు. ప్రతికూల భావాలతో సతమతమవ్వాలని కూడా అనుకోరు.  సాధ్యమైనంత వరకు అన్ని బాధలకి దూరంగా జీవితాన్ని మలుచుకోవాలని చూస్తారు. కానీ…. తను? తనెలా మలుచుకోవాలి తన జీవితాన్ని?

కొన్ని బాధలు చెప్పుకుంటే తగ్గుతాయి. కొన్ని బాధలు అనుభవిస్తే తగ్గుతాయి. మరి తన బాధలు?

దేదీప్యా! నీతో ఇలాంటి మాటలు మాట్లాడవచ్చో, మాట్లాడకూడదో నాకు తెలియదు.  ఒకనాటి మన పరిచయం నీతో ఇలా మాట్లాడేలా చేస్తోంది’’ అన్నాడు మెల్లగా  ఏ వ్యక్తి అయినా తనను ప్రేమించానని (ఎవరైనా) ఒకసారి చెప్తే చాలు  జీవితంలో ఆ మాటల్ని మరచిపోరు. ఆ మాటలే ‘నేను నీకు చాలా దగ్గర మనిషిని,  నీ బాధల్ని నాతో కొంచెం పంచుకోవా! అన్నట్లు తృప్తినిస్తాయి.  దేదీప్య సమక్షం ఇప్పుడు అతనికి అలాగే వుంది.

అప్పటి వరకు టీ వైపు చూస్తున్న దేదీప్య కళ్లు ఒక్కసారిగా అభిరాంవైపు తిరిగాయి. ఆమె కళ్లలో  ఏ భావం లేదు.

‘‘నాకు లాలిత్యతో కాపురం నిప్పుల మీద నడకలా వుంది.ఇక ఎంతో కాలం తనతో కలసి జీవితాన్ని గడపలేనేమోననిపిస్తోంది.’’ అన్నాడు అభి

‘‘అంత గడపలేనంత ఇబ్బంది ఏముంది లాలిత్యతో?’’ అంది పొడిగా దేదీప్య.

తను పడ్తున్న బాధలన్ని దేదీప్యకి చెప్పుకోలేకపోయినా కొన్నయినా చెప్పాలనుకున్నాడు.

‘‘కారణం లేకుండానే కోపం తెచ్చుకుంటుంది. అవసరం లేకుండానే మాట్లాడుతుంది. అవసరం లేని విషయాల్లో తలదూర్చి అల్లకల్లోలం సృష్టిస్తుంది.  ఎప్పుడు చూసినా  ఈర్ష్య, కోపము,గర్వము, అతిశయంతో వూగిపోతూ ….. ఇతురుల్ని అవమానించటానికే తన ఫీలింగ్స్‌ని వినియోగిస్తుంది.  ఇంతకన్న ఏం కావాలి మనశ్శాంతి. కోల్పోవటానికి?’’ అన్నాడు.

‘‘ఇంచు మించు అందరిలో అంతో, ఇంతో ఈ లక్షణాలు వుంటాయి అభిరాం.! ప్రదర్శించే దాన్ని బట్టి అవి కొందరిలో బయటకి రావొచ్చు. రాకపోవచ్చు. అంత మాత్రానికే జీవితం గడపలేకపోవటం అనే  పెద్ద పెద్ద మాటలు ఎందుకు?’’ అంది దేదీప్య.

‘‘ పెద్ద పెద్ద మాటలు కాదు దేదీప్యా! ప్రకృతిని ఆస్వాదిస్తూ అనుభూతుల పరిమళాలను ఆశిస్తూ జీవితమంతా అలాగే గడపాలకున్నాను. నేను నడిచే దారిలో  ప్రతిపువ్వు దగ్గర ఆగి పలకరించి, నాతో అవి మాట్లాడుతున్నట్లే పరవశించే తత్వం నాది.  అటువంటి  నేను నా భార్య కనురెప్పల చప్పుడులో వేదాలను వినాలనుకోవటం. అత్యాసకాదుగా.  అలసిపోయి ఇంటికొచ్చాక నా భార్య చిరునవ్వులో సేవా తీరాలనుకోవటం స్వార్థం కాదుగా.’’ అన్నాడు అభిరాం కాస్త ఎమోషనల్‌గా.

‘‘కాకపోవచ్చు.  మీరన్నట్లు జీవితంపట్ల సంతృప్తితో, రేపటి పట్ల ఆశతో ఆత్మీయతానుబంధాల మధ్యనే బ్రతకాలని  ఎవరికైనా వుంటుంది. కానీ కాలం ప్రతిక్షణం ఎవరిచేత అమృతం తాగించదు. గుక్కగుక్కకి హృదయాన్ని సంతోషంతో నింపదు….. కురిసిన ప్రతి చినుకు ముత్యం కానట్లే బ్రతుకు స్పర్శలో ఆనందమే కాకుండా దు:ఖం కూడా  ఏడవటమే జీవితం ఇంతవరకు నేను నేర్చుకున్న పాఠాన్ని మీకు చెప్పాను.’’ అంది దేదీప్య.

‘‘పెళ్లయ్యాక నువ్వు పడ్డ కష్టాలే నీకు పాఠాలు నేర్పాయి. దేదీప్యా! దీపక్‌తో నువ్వు ఎంత మాత్రం సుఖపడ్డావో నాకు తెలియదు కాని, నేను మాత్రం లాలిత్యతో నరకాన్ని చూస్తున్నా . అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. మన లైఫ్‌ పార్టనర్‌లకి చట్టపరంగా దూరమై మనం మళ్లీ పెళ్లి చేసుకుందాం.’’ అన్నాడు.

లాలిత్యలోని ప్రేమరాహిత్యమే అతని చేత అలా మాట్లాడిస్తుందని దేదీప్య గ్రహించింది.   ‘‘ ఈ మాటలు నా మీద ప్రేమతో అంటున్నారా? జాలితో అంటున్నారా?’’ సూటిగా అడిగింది దేదీప్య.

నీకెందుకొచ్చిందీ అనుమానం?’’ ఏ మాత్రం తడబాటు లేకుండా ఆమెనే చూస్తూ అడిగాడు.

‘‘నేను నడిచి వచ్చినదారి నాకింకా గుర్తుంది అభిరాం! ప్రేమతో అన్నావని నేనెలా అనుకుంటాను. ఇదే మాట కోసం మన కాలేజీలో ‘ఫేర్‌వెల్‌ పార్టీ రోజు నేను మిమ్మల్ని అర్ధించాను. మీరు నన్ను ప్రేమించలేదన్నారు.’’ అంది దేదీప్య వేదనగా.

‘‘ నువ్వు నన్ను ప్రేమించావుకదా.’’

‘‘కానీ మీరు నన్ను ప్రేమించలేదు కదా!’’

మాట్లాడలేకపోయాడు అభిరాం.

‘‘చూడండి! అభిరాం గారు! యాచనలో వున్న ఇబ్బందిలోంచి బయటపడి.. సంపాదనలో వున్న గౌరవాన్ని చూసుకొని…ఆధారపడటం లోంచి స్వయం పోషణలోకి వెళ్లిన నాకు…ప్రేమ గురించి మాట్లాడే ఆసక్తి గాని, ఓపిక, టైం కాని లేవు. అలా అని ప్రేమ అవసరం లేదని నేను అనటంలేదు.  నన్ను  నేను ప్రేమించుకుంటున్నాను. నా అభిరుచుల్ని, అలవాట్లని ప్రేమించుకుంటున్నాను.  ఆ ఆనందం దేంట్లోనూ రాదని నా పరిస్థితులు నాకు నేర్పాయి.’’ అంది దేదీప్య.

‘‘నేర్పాయి. కరక్టే దేదీప్యా!  కానీ యిలా ఎంత కాలం? ఇంత చిన్న వయసులో ఈ ఒంటరి ప్రయాణం అవసరమా? ఆధారం దొరికితే లత కూడా ఎక్కడికక్కడ అల్లుకుపోతుందే… మరి నువ్వెందుకిలా మాట్లాడుతున్నావ్‌? ప్రేమించే తోడుకాని, పోషించే మనిషి కాని లేకుండా, సమాజ భద్రత లేకుండా ఇలా ఒంటరిగా…. ఇలాగే వుండిపోవాలని నువ్వెందుకు ఇష్టపడ్తున్నావు? నాకైతే నచ్చడం లేదు.  నీ గురించి ఆలోచించే లోకం కూడా ఒకటుందని నువ్వెందుకు అనుకోవు?’’ అన్నాడు అభిరాం.

‘‘ నా గురించి అందరు ఆలోచిస్తూ వుంటారని, మాట్లాడుకుంటూ వుంటారని నేను  అనుకోను అభిరాం.! వాళ్లకి నాకన్నా అవసరమైన పనులు చాలా వుంటాయి. మనం ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తే అది మనకి అలాగే కన్పిస్తుంది.  ఎవరి బలహీనతలు  వాళ్లకుంటాయి. కాదని నేను అననూ.  కానీ వాటిని అధిగమించే శక్తిని కూడా ఎవరికి వాళ్లే తయారు చేసుకోవాలి. నా జీవిత పుస్తకాన్ని నేనెప్పుడూ నెగటివ్‌ దృక్పథంతో  చదువుకోను.  అందుకే మిారు చెప్పే భయాలేమిా  నన్ను కలవరపెట్టవు.  అదీ కాక ఇతరులకి నష్టం కల్గించకుండా,నాకు  కష్టం కలగకుండా నా ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కు నాకుందనుకుంటున్నా.’’ అంది చాలా ప్రశాంతంగా దేదీప్య.

‘‘నాకు నీ ప్రేమ కావాలి దేదీప్యా! నన్ను అర్థం చేసుకో… నా గురించి కూడా ఆలోచించు.’’ అన్నాడు అర్థింపుగా.

‘‘మీ గురించి ఆలోచించటానికి మిా పెద్దవాళ్లున్నారుగా అభిరాం! ‘ప్రేమ కావాలి’ అని అడిగితే దొరికేది కాదని మనిద్దరికి తెలిసిన విషయమే.కానీ ప్రేమిస్తే టైం వేస్ట్‌ అవుంతుందేమోనని అనుకోకుండా, మీకు ప్రేమించాలని అనిపించినప్పుడు లాలిత్యను ప్రేమించండి! ఆమెతోనే జీవించండి! ఆమెను మీకు అనుకూలంగా మార్చుకోండి! ఆమెకు మీరెలా వుంటే నచ్చుతుందో అలా మారండి!’’ అంటూ అక్కడ నుండి లేచి వెళ్లిపోయింది.

ఆమెను ఆపే ప్రయత్నం చెయ్యకుండా అలాగే చూస్తూ కూర్చున్నాడు అభిరాం.

 

*     *     *     *     *

ఇంకా ఉంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *