May 7, 2024

ఆశుధారలో కమనీయమైన ఖడ్గధార

రచన: ఏల్చూరి మురళీధరరావు       elchuri

 

 

 

 

 

అభినవాంధ్రకవితాపితామహులు, శతాధికగ్రంథకర్త శ్రీ మండపాక పార్వతీశ్వరశాస్త్రిగారు 1865లో కొడుకు ఆరోగ్యంకోసం అరసవల్లిలో సూర్యనారాయణస్వామివారిని సేవించి, అక్కడినుంచి వావిలివలస జమీందారు ఇనుగంటి సీతారామస్వామి ప్రభువుల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ రోజులలోని ఆనవాయితీ ప్రకారం విద్వత్పరిషత్తులో విద్యాపరీక్ష జరిగిందట. వసుచరిత్రలోని “ఆ తన్వంగి యనంగఝాంకరణవజ్జ్యాముక్తచూతాస్త్రని, ర్ఘాతం బోర్వక తమ్ము లంచు” అన్న కఠినమైన శ్లేషపద్యాన్ని ఇచ్చి ఆశుగతిని సంస్కృతీకరించమని అడిగారట. శాస్త్రిగారు ఆ రోజు దానికి చేసిన మహితమైన అనువాదం అనువాదసాహిత్యంలో అద్భుతావహమని ప్రసిద్ధిని గడించింది.

శ్రీ మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారు

పందొమ్మిదవ శతాబ్ది కారణజన్ములలో మహాకవి శ్రీ మండపాక పార్వతీశ్వరశాస్త్రిగారొకరు. బొబ్బిలి జిల్లా పాలతేరు వీరి అభిజనం. 1833 జూన్ 30-వ తేదీ నాడు ఉదయించారు. 1897 జూన్ 29-న పరమపదించారు. శతాధికగ్రంథకర్త. అమితాశురచనకు పట్టాభిషేకాలు జరిగిన రోజులవి. బొబ్బిలి సంస్థానంలో ఆస్థానకవిగా యావజ్జీవం గౌరవాలను అందుకొన్నారు. స్వతంత్రకావ్యాలను, గొప్ప అనువాదాలను, మాలికలను, శతకాలను ప్రకటించారు.  రాధాకృష్ణసంవాదము, శ్రీకృష్ణాభ్యుదయము వీరి యశోలతికను దిగంతాలకు ప్రాకించాయి. ‘హరిహరేశ్వర శతకము’ అన్న పేరుతో ఆత్మకథను తెలుగు సాహిత్యంలో తొలిసారిగా శతకరూపంలో చెప్పారు. వ్యర్థపదాలు, దురన్వయాలు, దూరాన్వయాలు లేని అద్భుతావహమైన చిత్రకవిత్వంలో వారు సాటిలేని మేటి. ‘ప్రబంధ సంబంధ బంధ నిబంధన గ్రంథము’ అని ఒక అపూర్వమైన బంధలక్షణగ్రంథాన్ని రచించి అముద్రితగ్రంథచింతామణిలో ప్రకటించారు. ఒక్క సీసపద్యాన్ని వ్రాసి, అందులో గర్భితంగా ఒక అనుష్టుప్ ఛత్రబంధాన్ని ఇమిడ్చి, ఆ ఒక్క శ్లోకంలోనే తాము చెప్పిన నూరు బంధాలకు లక్ష్యాన్ని ఇచ్చారు. అంతటి గొప్ప విద్వత్కవి.

వావిలివలస ప్రభువులవారే శాస్త్రిగారిని ఆ రోజు రెండువందలయాభైయారు విధాలుగా చదువదగిన ఒక కందపద్యాన్ని చెప్పమని కూడా ఆదేశించారట. అడిగినవెంటనే పార్వతీశ్వరశాస్త్రిగారు తడవుకొనక ఆశువుగా చెప్పారట. ఆ పద్యం ఇది:

 

క.      శ్రీవామ ౹ దేవ ౹ పావన ౹

భావా ౹ భావంగ ౹ మాగ్ర్య ౹ పండిత ౹ భావా ౹

శ్రీవాసు ౹ దేవ ౹ బహ్వను

భావా ౹ భావా ౹ భవజనక ౹ పాలిత ౹ భావా.

ఆశుగతిని చెప్పినా అమితప్రౌఢంగా అలరారుతున్న శ్రీ మండపాక వారి పద్యానికి భావార్థం ఇది:

శ్రీవామ – శ్రీ = లక్ష్మీదేవిని, వామ = ఎడమ భాగమునందు నిలిపికొన్న ప్రభూ; దేవ = సర్వభూతాంతరాత్మవై వెలుగొందుతున్న స్వామీ; పావన = అజ్ఞానమోహితులైన జీవులకు పాపక్షయకారివై విజ్ఞానపథాన్ని దర్శనగోచరం చేసే పరమేశ్వరా; భావ = జ్ఞానవైరాగ్యైశ్వర్యాది ధర్మములతో విరాజిల్లుతున్న దేవా; భావంగ = పరమాత్మ యందు తాదాత్మ్యమును కలిగి అనురక్తులైనవారి హృదయమందిరాలలో కొలువుతీరినవాడా; మాగ్ర్య – ఆదిదేవుడవై, మా = లక్ష్మీదేవియొక్క అగ్రపూజకు అర్హుడవైన స్వామీ; పండిత = సమ్యగ్దర్శనము గల విజ్ఞానస్వరూపా; భావా = పారమార్థికమైన ఉనికిని కలవాడా; శ్రీవాసు – శ్రీ = శ్రీమత్స్వరూపుడవై, వాసు = సర్వవ్యాపకుడవైన జగదీశ్వరా; దేవ = జీవులకు జ్ఞానప్రకాశమును ప్రసాదించు పరమాత్మా; బహ్వనుభావా – బహు = అనేకరీతుల అనేకరూపనామములతో, అనుభావ = సాక్షాత్కారమును అనుగ్రహించు దేవా; భావా = సర్వజీవులకు మనోమయుడవైన మహాత్మా; భవజనక – భవ = ఉనికి గలవారందరి, జనక = పుట్టుకకు కారణమైనవాడా; పాలిత = రక్షింపబడుచున్నజీవతతికి అంతర్యామివైన వాసుదేవా; భావా = ఎల్లరచే గౌరవింపబడుచున్న నిరవధిక బ్రహ్మస్వరూపా!

పద్యంలో – శ్రీ వామదేవ = పరమేశ్వరా; పావనభావా = జీవులకు అంతఃకరణశుద్ధిని ప్రసాదించు దేవా; పండితభావా = బుధజనులచే భావింపబడుచున్నవాడా; భావంగమ = భక్తుల మనోగతులందు నెలకొన్నవాడా; అగ్ర్య = ఆదిదేవుడవై అగ్రపూజకు అర్హుడవైనవాడా; శ్రీ వాసుదేవ = శ్రీమత్స్వరూపుడవై సర్వజగత్తులను నీ యందు వసింపజేసికొని నీవే ఆ జగత్తులలో వసించే పరమప్రభూ; పాలితభావా = శరణాగతుల యందు కృపవహించి వారికి కర్మబంధాల నుంచి విముక్తిని ప్రసాదించే తండ్రీ – అనికూడా అర్థకల్పన సాధ్యమే కాని, రెండువందలయాభైఆరు విధాలుగా చదువవలసి వచ్చినపుడు పదాలను పరిపరివిధాల విడదీయవలసి ఉంటుంది కనుక ‘శ్రీవామదేవ’ అనటం కంటె ‘శ్రీవామ, దేవ’ ఇత్యాదిగా వ్యస్తంగా ఒక్కొక్క దళానికి అర్థం చెప్పుకొనటమే భావ్యం. సందర్భానుసారం పై సమస్తభావాలను కూడా గ్రహింపవచ్చును.

ఇందులోని పద్యాంతరాల నిర్మాణక్రమాన్ని శ్రీ పార్వతీశ్వరశాస్త్రిగారే ఈ విధంగా సూత్రీకరించారు:

క.      ఏకమతిన్ భేకగతిన్

సాకల్యమునం గనుండు షట్పంచాశ

చ్ఛ్లోకోత్తరద్విశతిసం

ఖ్యాతము లై యందమొందుఁ గందము లిందున్.

అని. ‘షట్పంచాశచ్ఛ్లోకోత్తరద్విశతిసంఖ్య’ అంటే రెండువందలయాభైఆరు విధాలు. అంటే, ఇందులో 16X16 = పదహారు షోడశవిధకందాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క షోడశవిధకందంలోనూ నాలుగేసి చతుర్విధకందాలు ఉన్నాయన్నమాట.

క.      శ్రీవామ ౹ దేవ ౹ పావన ౹ భావా ౹ భావంగ ౹ మాగ్ర్య ౹ పండిత ౹ భావా ౹

శ్రీవాసు ౹ దేవ ౹ బహ్వను ౹ భావా ౹ భావా ౹ భవజనక ౹ పాలిత ౹ భావా.

క.      భావంగ ౹ మాగ్ర్య ౹ పండిత ౹ భావా ౹ శ్రీవాసు ౹ దేవ ౹ బహ్వనుభావా ౹

భావ ౹ భవజనక ౹ పాలిత ౹ భావా ౹ శ్రీవామ ౹ దేవ ౹ పావన ౹ భావా.

క.      శ్రీవాసు ౹ దేవ ౹ బహ్వను ౹ భావా ౹ భావ ౹ భవజనక ౹ పాలిత ౹ భావా ౹

శ్రీవామ ౹ దేవ ౹ పావన ౹ భావా ౹ భావంగ ౹ మాగ్ర్య ౹ పండిత ౹ భావా.

క.      భావ ౹ భవజనక ౹ పాలిత ౹ భావా ౹         శ్రీవామ ౹ దేవ ౹ పావన ౹ భావా ౹

భావంగ ౹ మాగ్ర్య ౹ పండిత ౹ భావా ౹ శ్రీవాసు ౹ దేవ ౹ బహ్వను ౹ భావా.

ఇది సుప్రసిద్ధమైన చతుర్విధకందం నిర్మాణ క్రమం. కందపద్యానికి రెండు పాదాలనుకొంటే, పాదంలోని అయిదవ గణంతో ఒక కొత్త క్రమం మొదలై, ఆ విధంగా ఒక పద్యావృత్తి పూర్తవుతుందన్నమాట. ఆ క్రమం నుంచి తక్కినవి ఏర్పడుతాయి. కొంతసేపటికి ఈ ఆవృత్తులు పూర్తయిన తర్వాత కొత్త పద్యాలు ఏర్పడే వీలుండదు. అందువల్ల శ్రీ పార్వతీశ్వరశాస్త్రిగారు సరికొత్తగా చెప్పిన సూత్రం, ‘ఏకమతిన్ భేకగతిన్’ అన్నది.

చిత్రకవిత్వంలో గతిభేదాలను సంస్కృతలాక్షణికులు 1) గతప్రత్యాగతం 2) తదక్షరగతగతి 3) శ్లోకాంతరగతి 4)  భాషాంతరగతి 5) తదర్థానుగతగతి 6) రథపదగతి 7) తురగపదగతి 8) తురంగపదపాఠగతి 9) శరయంత్రగతి 10)   చతురంగ చిత్రగతి  11) గజపదగతి అని మొత్తం పదకొండు విధాలుగా విభజించారు. వాటిలో శ్రీ పార్వతీశ్వరశాస్త్రిగారు చెప్పిన ‘భేకగతి’ అన్నది లేదు.

గతప్రత్యాగతం అంటే శ్లోకము లేదా పద్యంలోని ప్రతిపాదం దేనికదే వెనుకకు తిప్పి చదివినప్పుడు రెండు పాఠాలూ సమంగా ఉండటం అన్నమాట. దీనికి ప్రతిపాదానులోమవిలోమము అనికూడా పేరున్నది.

తదక్షరగతగతి అంటే పూర్తి పద్యభ్రమకం అన్నమాట. పద్యాన్ని ఎటునుంచి చదివినా ఒకే తీరున ఉండటం.

శ్లోకాంతరగతి లేదా పద్యాంతరగతి అంటే మొదటి నుంచి చివరికి చదివినప్పుడు ఒక పద్యమూ, చివరి నుంచి మొదటికి వచ్చినపుడు అదే ఛందస్సులో గాని, వేరొక ఛందస్సులో గాని వేరొక పద్యమూ ఏర్పడటం.

భాషాంతరగతి అంటే పద్యాన్ని మొదటి నుంచి తుది వరకు చదివినప్పుడు ఒక భాష, తుదినుంచి మొదటికి వచ్చినపుడు వేరొక భాష ఉండటం.

తదర్థానుగతగతి అంటే తదక్షరగతగతిలో వలె అనులోమవిలోమాలు ఒకే తీరున ఉన్నా, వాటి అర్థాలు పదచ్ఛేదం వల్ల వేర్వేరుగా ఉండటం అన్నమాట.

రథపదగతి అంటే శ్లోకము లేదా పద్యంలోని సరిపాదాలలో కాని, బేసిపాదాలలో కాని – రెండు పాదాలలో మాత్రమే గతప్రత్యాగతంలో వలె అనులోమవిలోమాలను కలిగి ఉండటం.

తురగపదగతి అంటే పద్యంలోని అక్షరాలను నాలుగు వరుసలుగా విభాగించాలి. పద్యంలో అరవైనాలుగు అక్షరాలుంటే ఒక్కొక్క వరుసకు పదహారు గడుల చొప్పున నాలుగు వరుసలు వస్తాయన్నమాట. ఆ గడులలో అక్షరాలను క్రమంగా వ్రాయాలి. చదరంగంలో గుర్రం పావుయొక్క నడకను అనుసరించి మొదటి గడినుంచి ప్రయాణం మొదలుపెడితే, గడులన్నీ పూర్తయేసరికి మళ్ళీ అదే పద్యం రావాలి.

తురంగపదపాఠగతి అంటే, పైని తురగపదగతిలో వలెనే పద్యంలోని అక్షరాలను నాలుగు వరుసలుగా విభాగించి, గడులలో పద్యాక్షరాలను క్రమంగా వ్రాయాలి. గుర్రం పావు నడకను అనుసరించి మొదటి గడినుంచి ప్రయాణం మొదలుపెడితే, గడులన్నీ పూర్తయాక ఆ అక్షరస్థానాలను కూర్చుకొంటే వేరొక కొత్త పద్యం రావాలి.

శరయంత్రగతి అంటే పద్యాన్ని రెండు వరుసలుగా విడదీసి, ఒక వరుస క్రింద మరొక వరుసను వ్రాయాలి. రెండు వరుసలలోని గడుల సంఖ్య సమానంగా ఉండాలి. పై వరుస బేసి గడులలో ఏ అక్షరాలుంటే క్రింది వరుస బేసి గడులలోనూ అవే అక్షరాలు ఉండాలి. సరిగడులలోని అక్షరాలు రెండు వరుసలలోనూ వేర్వేరుగా ఉంటాయి.  రెండు వరుసలలోనూ సరిగడులలో సమానంగా నిలిపి, బేసిగడులలోని అక్షరాలను మార్చుకొనే వీలున్నది. ఈ విధమైన చిత్రానికి ‘గోమూత్రికా బంధము’ అనే పేరుకూడా ఉన్నది.

చతురంగచిత్రము అంటే, ఇందాకటి తురగపదగతిలో లాగా గడులను వ్రాసి, గుర్రపు నడకతో ముందుకు సాగితే, వేరొక పద్యం రావటం అన్న చిత్రమే కాని, మార్పల్లా ఒక్కటే. ఇందులో మొదటి పద్యం పూర్తిగా ఒక గురువు, దాని

తర్వాత ఒక లఘువు, మళ్ళీ ఒక గురువు, ఒక లఘువు చొప్పున ఉంటే, గర్భితంగా వచ్చే కొత్తపద్యం లఘువు, దాని తర్వాత గురువు అన్న విపరీతక్రమంలో ఉండాలన్నమాట.

గజపదగతి అంటే, ఎనిమిదేసి గడులతో ఒకదాని క్రింద ఒకటిగా రెండు వరుసలను వ్రాయాలి. మొదటి వరుసలోని మొదటి అక్షరం, రెండవ వరుసలోని మొదటి అక్షరం; మొదటి వరుస చివరి గడిలోని అక్షరం, రెండవ వరుస చివరి గడిలోని అక్షరం; ఆ తర్వాత మొదటి వరుసలోని రెండవ అక్షరం, రెండవ వరుసలోని రెండవ అక్షరం; ఆ తర్వాత మొదటి వరుసలోని ఏడవ అక్షరం, రెండవ వరుసలోని ఏడవ అక్షరం – ఈ విధంగా అన్ని గడులను పూర్తిచేస్తే ఇంకొక రెండు పంక్తుల పద్యం వస్తుంది.

శ్రీ పార్వతీశ్వరశాస్త్రిగారు కల్పించిన ‘భేకగతి’ ఈ లక్షణక్రమంలో లేదు. లక్ష్యాన్ని బట్టి ఆ సంకేతానికి ‘కప్పదాటుగా పదాలను కూర్చుకోవటం’ అని అర్థం చెప్పాలి. ఒక నియమం అంటూ లేకుండా ఛందస్సును చూసుకొంటూ పదాల క్రమాన్ని ఇచ్ఛానుసారం మార్చవచ్చునన్నమాట. పేరుకు రెండువందలయాభైఆరు అని అన్నారే గాని, నిజంగా ప్రస్తరించి చూస్తే అంతకు ఎన్నో ఇంతలే అవుతాయి. కొన్ని ఉదాహరణలను మాత్రం చూపుతున్నాను

క.      శ్రీవామ ౹ దేవ ౹ పావన ౹ భావా ౹ భావంగ ౹ మాగ్ర్య ౹ పండిత ౹ భావా ౹

శ్రీవాసు ౹ దేవ ౹ బహ్వను ౹ భావా ౹ భావా ౹ భవజనక ౹ పాలిత ౹ భావా.

క.      శ్రీవాసు ౹ దేవ ౹ పాలిత ౹ పావన ౹ భావంగ ౹ మాగ్ర్య ౹ పండిత ౹ భావా ౹

భావా ౹ భావ ౹ భవజనక ౹ భావా ౹ శ్రీవామ ౹ దేవ ౹ బహ్వను ౹ భావా.

క.      భావంగ ౹ మాగ్ర్య ౹ పండిత ౹ భావా ౹ శ్రీవామ ౹ దేవ ౹ పాలిత ౹ భావా ౹

శ్రీవాసు ౹ దేవ ౹ బహ్వను ౹ భావా ౹ భావ ౹ భవజనక ౹ పావన ౹ భావా.

క.      పావన ౹ పండిత ౹ భావా ౹ భావా ౹ శ్రీవామ ౹ దేవ ౹ పాలిత ౹ మాగ్ర్యా ౹

భావంగ ౹ భావ ౹ భవజనక ౹ భావా ౹ శ్రీవాసు ౹ దేవ ౹ బహ్వను ౹ భావా.

క.      శ్రీవామ ౹ దేవ ౹ పండిత ౹ భావా ౹ శ్రీవాసు ౹ దేవ ౹ పాలిత ౹ భావా ౹

పావన ౹ భావభవజనక ౹ భావా ౹ భావంగ ౹ మాగ్ర్య ౹ బహ్వను ౹ భావా.

క.      శ్రీవామ ౹ దేవ ౹ పండిత ౹ పావన ౹ భావంగ ౹ మాగ్ర్య ౹ పాలిత ౹ భావా ౹

భావభవజనక ౹ భావా ౹ భావా ౹ శ్రీవాసు ౹ దేవ ౹ బహ్వను ౹ భావా.

క.      శ్రీవామ ౹ దేవ ౹ బహ్వను ౹ భావా ౹ భావంగ ౹ మాగ్ర్య ౹ పావన ౹ భావా ౹

భావభవజనక ౹ పాలిత ౹ భావా ౹ శ్రీవాసు ౹ దేవ ౹ పండిత ౹ భావా.

క.      శ్రీవామ ౹ దేవ ౹ పావన ౹ భావా ౹ భావభవజనక ౹ పండిత ౹ భావా ౹

శ్రీవాసు ౹ దేవ ౹ బహ్వను ౹ భావా ౹ భావంగ ౹ మాగ్ర్య ౹ పాలిత ౹ భావా.

క.      శ్రీవామ ౹ దేవ ౹ పావన ౹ భావా ౹ భావభవజనక ౹ పండిత ౹ భావా ౹

శ్రీవాసు ౹ దేవ ౹ బహ్వను ౹ భావా ౹ భావంగ ౹ మాగ్ర్య ౹ పాలిత ౹ భావా.

క.      దేవ ౹ భవజనక ౹ బహ్వను ౹ భావా ౹ శ్రీవామ ౹ మాగ్ర్య ౹ పండిత ౹ భావా ౹

శ్రీవాసు ౹ పావన ౹ భావా ౹ భావా ౹ భావంగ ౹ దేవ ౹ పాలిత ౹ భావా.

ఇవి పదక్రమం యథేచ్ఛగా మారే ‘భేకగతి’కి ఉదాహరణలు. ఈ సూత్రాన్ని అనుసరించి పదస్థానాలను మారుస్తూ ఎన్నయినా పద్యాలను కల్పించటం సాధ్యమవుతుంది.

విద్వత్పరిషత్తులో విద్యావిజయాన్ని సాధించిన తర్వాత శ్రీ పార్వతీశ్వరశాస్త్రిగారు నిండైన సంతృప్తితో ఆనాటి సన్నివేశాన్ని తమ ఆత్మచర్యాత్మక ‘హరిహరేశ్వర శతకము’లో నెమరువేసుకొన్నారు:

సీ.      సుతనిరామయతకై సూర్యనారాయణస్వామినిఁ గని, హర్షవల్లి నుండి

వావిలివలసకు వచ్చి, యిన్గంటి సీతారామవిభుఁ గాంచి, తత్ప్రతిజ్ఞ

నణఁచి, యా ‘తన్వంగి’ యనెడు వసుచరిత్రలోని పద్యమునకు శ్లోకరచనఁ,

బ్రతిన నిన్నూటయేబదియాఱు పద్యముల్ గలుగు షోడశవిధకందరచనఁ,

గీ.      దత్కవులకన్న నెక్కుడు ధారఁ గలిగి

వింత యగునట్టి యాశుకవిత్వరచన

నాకుఁ గల్గించి చెలఁగించినాఁడ వౌర!

హరిహరేశ్వరదేవ! మహానుభావ!

అని. “తత్ప్రతిజ్ఞను అణఁచి” అంటే – ఆ వసుచరిత్రలోని పద్యాన్ని సంస్కృతీకరించటం అసాధ్యమని జమీందారు గారో, ఆయన ఆస్థానంలోనివారో భావించేవారన్నమాట. పార్వతీశ్వరశాస్త్రిగారు అమోఘమైన ఆశుధారను సాధించిన మహాకవి కాబట్టి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నమాట. “ఇన్నూటయేబదియాఱు పద్యముల్ గలుగు షోడశవిధకందరచన” అనటం వల్ల షోడశవిధకందపద్యాలు ఇందులో పదహారు ఉంటాయి. అదంతా తత్కాలోచితంగా సద్యఃస్ఫురణతో చెప్పిన చిత్రరచన కాబట్టి, “తత్కవులకన్న (జమీందారు గారి ఆస్థానంలో ఉన్న కవులకంటె) నెక్కుడు ధారఁ గలిగి, వింత యగునట్టి యాశుకవిత్వరచన, నాకుఁ గల్గించి చెలఁగించినాఁడ వౌర” అని హరిహరేశ్వరునికి కృతజ్ఞతాపూర్వకంగా నివేదించుకొన్నారు.

ఇటీవల ఈ పద్యంలోని గర్భితపద్యాల క్రమాన్ని ప్రస్తరిస్తున్నప్పుడు అక్షరాల అమరిక వల్ల ఈ పద్యాలలో ఒకటి ఖడ్గబంధంలో అమరి ఉన్నదని నాకు స్ఫురించింది. సరస్వతీపుంభావమూర్తి అయిన మహాకవి ప్రతిభావిలసనం ఎంత అమేయమో చూసి ఆశ్చర్యం కలిగింది. నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఈ లఘుపరిచాయికను వ్రాశాను:

క.      భావభవపావనజనక ౹ భావా ౹ శ్రీవాసుదేవ ౹ బహ్వనుభావా ౹

భావంగమాగ్ర్య ౹ పండిత ౹ భావా ౹ శ్రీవామ ౹ దేవ ౹ పాలితభావా.

ఖడ్గ బంధము

పద్యభావం ఇది: భావభవజనక – భావభవ = జీవుల మనోభావాలలో రూపుదిద్దుకొనే మన్మథునికి, పావన = ముల్లోకాలను పవిత్రీకరించే, జనక = తండ్రివైన ఓ వైకుంఠనిలయా; భావా = ప్రకృతిజన్యమైన బోధకు విషయానివై తోచే పరమపురుషా; శ్రీవాసుదేవ – శ్రీ = ఐశ్వర్య వీర్య యశః శ్రీ జ్ఞాన వైరాగ్యములనే ఆరు దివ్యశక్తులతో ఒప్పారెడి, వాసుదేవ = వసుదేవసుతుడవగు ఓ పరమాత్మా; బహు+అనుభావా = అనేకరూపనామములతో మాహాత్మ్యమును ప్రదర్శించిన మహానుభావా; భావంగమ + అగ్ర్య = భక్తుల మనోమందిరాలలో కొలువుతీరి అగ్రపూజలకు అర్హుడవైన పరమపురుషా; పండితభావా = బ్రహ్మజ్ఞానుల భావాంబరములయందు విహరించు మహనీయా; శ్రీవామదేవ = శ్రీలక్ష్మిని అర్ధాంగిగా వలచిన దేవా; పాలితభావా = శరణాగతుల రక్షణమే కర్తవ్యముగా కలవాడా! అని. ఇది ఖడ్గబంధం.

శ్రీ మండపాక పార్వతీశ్వరశాస్త్రిగారే 1896లో ‘అముద్రితగ్రంథచింతామణి’ పత్రికలో ప్రకటించిన ‘ప్రబంధ సంబంధ బంధ నిబంధన గ్రంథము’ అన్న తమ అపురూపమైన బంధకవిత్వలక్షణగ్రంథంలో ఖడ్గబంధం లక్షణాన్ని నిర్వచించారు:

మ.    పిడి కాదిం దుది నాల్గు దళముల్ పీఠాకృతిన్ నిల్పి, యొ

క్కడు గం దల్గునఁ ద చ్ఛిరోక్షరమె యాద్యం బంత్య మౌనట్లు పై

యడుగుల్ మూఁడును నాల్గు బంతులుగ వ్రాయన్ ఖడ్గబంధం బిదే

పుడమిన్ నేర్పరి గూర్పఁ జిత్రగతులం బొందున్ సుగంధ్యాదులన్. (ప. 3)

శాస్త్రిగారు సుగంధ్యాదులు – అనటం వల్ల ఉత్సాహము, సుగంధి మొదలైన పద్యాలలో మాత్రమే గాక ఖడ్గబంధాన్ని కందపద్యంలో కూడా రచింపవచ్చును. వారన్నట్లుగానే, పై బొమ్మలో చూపిన ప్రకారం కత్తి పిడి మొదటి గుబ్బలో ఒక దళం, నడిమి హస్తపీఠికలో ఒక దళం, రెండవ గుబ్బలో మరొక దళం, వాదరలు రెండువైపుల రెండు పంక్తులు, నడిమి రేకులో ఒక దళం ఉన్నాయి. ఆద్యంత్యాలలో పిడిలోనూ అలుగులోనూ శిరోక్షరం నిబద్ధం కాకపోయినా, కత్తి చివరి కొనలో పద్యాద్యక్షరం లక్షణయుక్తంగా అంతిమదళంలో ఉండటం విశేషమే. గతిచిత్రంగా ఊహించి వ్రాసిన కవితలో ఆకృతివిశేష బంధమొకటి ఇమిడి ఉండటం మరీ అపురూపం.

కారణజన్ములకు గాని సాధ్యం కాని అరుదైన చిత్రరచన! ఆశుధారలో కమనీయమైన ఖడ్గధార!

 

 

 

 

 

 

 

5 thoughts on “ఆశుధారలో కమనీయమైన ఖడ్గధార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *