April 28, 2024

మీరు తలచుకొనండి – నేను కనుగొంటాను!

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు j.k.mohanrao

 

 

 

క్రింద ఇచ్చిన పద్యమును చదవండి. ఇందులో గొప్పగా కవిత్వము ఏమియు లేదు. ఇది నిజముగా ఒక సమస్య. ఇది సీస పద్యము; సీసము పిదప గల ఆటవెలదికి కూడ సీసపద్యపు లక్షణములు గలవు. ఆటవెలది పాదములను 5, 6 పాదములుగా పరిగణించుకొనవలయును. పాదముల సంఖ్యను పాదముల ముందు ఇచ్చియున్నాను.  ఈ పద్యములో ఏ అక్షరమునైనను మీరు తలచుకొని, ఆ అక్షరము ఏయే పాదములలో ఉన్నవో నాకు తెలిపిన మీరు తలచిన అక్షరమును నేను మీకు తెలుపగలను. అనగా ఆఱు పాదములలో ఏ ఏ పాదములలో మీరు తలచుకొనిన అక్షరములు గలవో తెలుప మనవి. కొన్ని నియమమములు-

 

1. హల్లులను మాత్రమే మీరు ఎన్నుకొనవలయును.

2. 31 హల్లులకు మాత్రమే మీ ఎన్నిక పరిమితము.

3. ఙ, ఞ లను తలచుకొనరాదు.

4. ల, ళ లు సమానము.

5. ర, ఱ లు సమానము.

6. క్ష క మఱియు షల సంయుక్తాక్షరముగా పరిగణించబడును.

7. సంయుక్తాక్షరములలో మొదటి అక్షరమునకు మాత్రమే విలువ. అనగా క్తి అను అక్షరము క-కారముగా పరిగణించబడును.

ఈ సమస్య వెనుక గల గణితశాస్త్ర సిద్ధాంతములను రాబోవు సంచికలో మీకు విశదీకరించెదను. అందఱును ఇందులో పాల్గొని దీనిని జయప్రదముగా చేయ ప్రార్థన.  మీరు ఎంచుకొన్న అక్షరములు ఏయే పాదములలో  నున్నవని నా ఈ-మెయిలుకు పంపండి. మీకు నేను జవాబును పంపుతాను.  రాబోయే సంచికలో మీ పేరులను, మీరు ఎంచుకొనిన అక్షరములను తెలుపుతాను.

నా మెయిల్ ఐడి: jkmrao@yahoo.com

ఇక పద్యము-

 

సీసము-

1) మన భాష గాథలు – మనకిచ్చు ఘనకీర్తి,

భారతిన్ బొగడుగా – నూరు హృదులు,

2) హృదయ మక్కటికమ్ము, – చిదమర శిఖరమ్ము,

ఫక్కియు నజడమ్ము – వరద కెపుడు,

3) మసృణపు ఝరులాయె, – మతి కింపు శ్రుతు లౌర,

మృష లేని జిగి క్రొత్త – మెఱపు ఛాయ,

4) సభలోన గఠినమ్ము – సఫల మవగ వాంఛ,

జయమది జగదంబ – చలువ విధిగ,

 

ఆటవెలది-

5) పృథివియందు దృఢిమ – బ్రియమార బిల్తు, స-

ద్వీణ మీటెడు విధి – రాణి సతము,

6) నన్ను గనుమ యమ్మ – నలువదేవుని గొమ్మ,

నిన్ను గొలుతు నమ్మ – నిజము నమ్ము.

 

(కొన్ని పదములకు అర్థము: గాథ – పద్యము, చరిత్ర; అక్కటికము – కనికరము; ఫక్కి – విధము, రీతి; అజడము – తెలివి; మసృణము – చక్కనిది; ఝరి – సెలయేఱు; మృష – అసత్యము; జిగి – కాంతి; దృఢిమ – గట్టిదనము)

 

1 thought on “మీరు తలచుకొనండి – నేను కనుగొంటాను!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *