April 30, 2024

ఓ కవితా ప్రళయమా.. శ్రీశ్రీ తరంగమా…ఇదే నీకు నా నివాళీ..

రచన:డా.గౌతమిgauthami

తెలుగు సాహిత్యం ఒక అవని. ఈ అవనిపై ఎన్ని అద్భుతాల సృష్టి జరిగిందో సముద్రాలని, వనాలని, నదులని, కొండలు, పర్వతాలు..  అలాగే తెలుగు సాహిత్యావనిలో ఎందరో మహా కవులు, కవయిత్రులు, రచయితలు, రచయిత్రులు, కధకులు అందరికీ వందనాలు. ఒక్కొక్క కవి ఒక్కొక్క ఘని. ఏ ఒక్క ఘని గురించి గూడా క్లుప్తం గా చెప్పుకోలేము. తెలుగు సాహిత్యం దాదాపు  వెయ్యిసంవత్సరాల కాలం నాటిది. మహా భారతాన్ని మొట్టమొదట తెలుగులోకి అనువదించిన కవిత్రయము నన్నయ, తిక్కన మరియు ఎర్రాప్రగడలు (11 వ శతాబ్దము నుండి 14 వ శతాబ్దము వరకు). వీళ్ళల్లో మొదటివాడు నన్నయను తెలుగులో ఆదికవి గా పేర్కొన్నారు. చాలామటుకు తెలుగు సాహిత్యము ఈ పురాణ కవిత్రయముతోనే మొదలు అయినది. ఈ పదమూడవ శతాబ్దములోనే గోన బుద్దారెడ్డి.. తెలుగులో రంగనాధ రామాయణాన్ని ఏడు కందాలుగా రాసారు. అది తెలుగు సాంస్కృతిక రంగంలో అప్పటిలో ప్రసిద్దిలో ఉన్న తోలుబొమ్మలాట అనబడే జానపద కార్యక్రమం లో ఉపయోగించారు. ఆ తర్వాత 14-15 వ శతాబ్దం లో వచ్చిన శ్రీనాధుడు బాల్యములోనే మరుత్తరాట్చరిత్ర అనే బృహత్కావ్యాన్ని  రచించిన ప్రౌఢకవి, కొండవీటిప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థాన కవి. డిండిమభట్టు అనే పండితుని వాగ్యుద్దంలో ఓడించి కంచుఢక్కను పగుల గొట్టించి కవిసార్వబౌముడని బిరుదు పొందెను. వీరి రచనలలో వీరి పాండిత్య గరిమ, అచంచల ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం మూర్తీభవంచేవట. వీరు రాసిన ఎన్నో కావ్యాలు అందులో ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన భీమఖండము, కాశీ ఖండము, శృంగారనైషదము మొదలైనవి, మరెన్నో చాటువులు ప్రసిద్ది కెక్కినవి. 15వ శతాబ్దపు చివరిలో బమ్మెర పోతన సంస్కృతం లో ఉన్న శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రీకరించి తన జన్మని, తెలుగుభాషని, తెలుగువారినీ ధన్యులనిచేసారు. పోతన కవిత్వము లో భక్తి, మాధుర్యము, తెలుగుతనము, పాండిత్యము, వినయము కలసిఉండేవట. తన కావ్యాలను రాజుల పరం చెయ్యకుండా, ఆ శ్రీరామునికే అంకితం చేసేవారుట. గజేంద్ర మోక్షము, వీరభద్ర విజయము, భోగినీ దండకము మరియు నారాయణ శతకము మొదలైనవి మరికొన్ని మచ్చుతునకలు. 16 వ శతాబ్దములో విజయనగర సామ్రాట్ శ్రీ కృష్ణదేవరాయలు కూడా తెలుగు లో ఆముక్తమాల్యదను, సంస్కృతములో ఎన్నో రచనలను గావించిన కవిపండితుడు. ఈయనకు ఆంధ్రభోజుడనే బిరుదు కూడా కలదు.  ఆ తర్వాత 16 వ శతాబ్దంలో పింగళిసూరన తెలుగు సాహిత్యం లో ఏలిన మహాకవుల్లో ఒకరు. శ్రీకృష్ణదేవరాయల కొలువులో అష్టదిగ్గజాలలో ఒకరు.సూరన వ్రాసిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొదటి నవలాకావ్యం, ఒక ప్రేమ కావ్యం. ఆ తర్వాత 18 వ శతాబ్దం వచ్చేసరికి ఆధునిక కవుల యుగం మొదలైనది. గురజాడ అప్పరావు గారు తెలుగు భాషా మహా కవి,తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినారు. గొప్ప హేతువాది. వ్యావహారిక భాషల్లో రచనలు చెయ్యడం తప్పుగానూ, చేతకానితనంగానూ  భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికి అర్ధమయ్యే జీవభాషలో రచనలు చేసారు. ఆయన ఆనాటి దురాచారాలు కన్యాశుల్కం, వేశ్యావృత్తి పై విమర్శిస్తూ, వాటినే కధావస్తువులుగా తీసుకుని, కన్యాశుల్కమనే గొప్ప నాటికను వ్రాశారు.ఈయనకు అభ్యుదయ కవితాపితామహుడని, కవి శేఖరుడు అని బిరుదులు గలవు.

SriSri

తర్వాత 19 వ శతాబ్దంలో శ్రీరంగం శ్రీనివాసరావు లేదా శ్రీశ్రీగారు ఇది గురజాడ – అడుగుజాడ యంటూ సాంప్రదాయక గ్రాంధిక శైలిని, చందస్సును ప్రక్కకు పెట్టి, వాడుక భాషలో అభ్యుదయ కవితా విహంగాన్ని గగన సీమ లో వదిలిన మొదటి విప్లవ కవి. 20 వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. ఆయన అభ్యుదయ కవితాప్రయోగం జానపద సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ, అన్ని వర్గాలవారికి అంటే కార్మిక, కర్షక మొదలైన వారు, విద్యాభ్యాసం లేని స్త్రీ, పురుషులకి కూడా అర్ధమయ్యేరీతిలో చేసారు. శ్రిశ్రి గారు వచ్చెంతవరకు జానపద సాహిత్యాన్ని ఒక సాహిత్యం గా ఎవరూ గుర్తించలేదు. అయితే 16 వ శతాబ్దపు కవయిత్రి మొల్ల జానపద తెలుగులో రామాయణాన్ని ఆరు కాండములతో, 138 పద్యములలో రాసినది. ఈవిడ రచన కూడా ఆనాటి పద్ధతికి విరుద్దంగా, వాడుక భాషకు దగ్గిరగా ఉన్నది. దీనిని బట్టి అర్ధమయ్యేది ఏమిటంటే శాస్త్రీయ కవిత్వ సాహిత్యానికి భిన్నంగా వాడుకభాషా లేదా జానపద సాహిత్య వీచిక గురజాడ, శ్రిశ్రి లకు ముందే సూచిస్తున్నది.

శ్రీశ్రీ గారి శకం మొదలయ్యాకే మన తెలుగుదేశపు జాతీయత, తెలుగు నుడికారం, దాని అస్థిత్వం ఆ జానపద సాహిత్యం లో విస్తృతంగా కనబడడం మొదలయ్యింది. మన తెలుగు యూనివర్సిటీల నుండి జానపద సాహిత్యం మీద పరిశోధనలు చేసి పి.హెచ్ డి పట్టాలను పొందారు. ఈ సాహిత్య విప్లవం వల్ల ఎన్నో తెలుగు సంస్కృతులు కనుమరుగు కాకుండా వెలికి రాబడ్డాయి. ఆనాటి స్త్రీపురుషులు అందరూ విద్యావంతులు కారు, శాస్త్రీయ సాధన లేదు, అలా అని వారు  పాడలేదని కాదు, కవిత చెప్పలేదని కాదు. పొలం పనులు, గృహం లో పని పాట్లు చేసుకునేటప్పుడు పాడే పాటలు, స్త్రీలు పాడే పెళ్ళి పాటలు, సీమంతపు పాటలు, ధు:ఖం తో ఉన్నప్పుడు పాటలు అలాగే సంక్రాంతి లాంటి పండుగ సంధర్భాలలో పాడే పాటలు- వీటికి లిఖిత పూర్వకమైన విద్య అవసరం లేదు. కాని వాళ్ళు పాడే పాటలలో నేటివ్ సంస్కృతి ఉన్నది. అంటే గృహ జీవితం లోనే స్త్రీ గృహిణిగా ఒక కవయిత్రి అయినది, కట్టెలు కొట్టువాని పాట వనానికే ఆలంబన అయ్యింది, కర్షకుని కూనిరాగం సైతం పైరగాలి వీచింది. ఈ విధం గా చూస్తే జానపద సాహిత్య లేదా నేటివ్ సాహిత్యం కూడా నా దృష్టిలో ప్రాచీన మైనదే. ఈ సాహిత్యానికి, ఒక రూపాన్ని ఇచ్చి సాహిత్యం లో విప్లవాన్ని సృష్ఠించిన మొల్ల మొదలుకుని, శ్రీ శ్రీ వరకు చిరస్మరణీయులు.

మిగితా ద్రవిడ భాషా సాహిత్యాలు తమిళం, కన్నడం మరియు మళయాళం కూడా ప్రాచీనమైనవి, ప్రసిద్దమైనవి అయినా, తెలుగు సాహిత్యానికి ఒక ప్రత్యేకత ఉన్నది, అది అజంతా భాష అవ్వడం అంటే పాట అయినా, కవిత్వం అయినా అచ్చులతో ఎండ్ అవ్వడం. దానివల్ల..తెలుగు సాహిత్యానికి ఒక మధిరిమ సంతరించుకున్నది. చూశారా, దాని వర్ణనకు తోడ్పడిన పదం ‘మధురిమ అచ్చుతో ఎండ్ అయి ఎంత మధురంగా ఉన్నది?? పాత కవులు నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడలను సైతం తీసుకుంటే వారి రచనలలో ఎన్నో సంస్కృత సమాసాలు కలిసి ఉన్నాయిట. చివరకు మొల్ల రామాయణంలో కూడా మొల్ల సంస్కృత పదాల్ని విస్తృతంగా వాడినట్లుగా తెలుగు రచయిత్రి నిడదవోలు మాలతి విశ్లేషణలలో ప్రస్పుటమవుతుంటుంది. వీరందరి తర్వాత వచ్చిన సాహిత్య విప్లవ కవి శ్రీశ్రీ సాహిత్యాంశాలను మరికొన్ని విశ్లేషిద్దాం.

జానపద సాహిత్యాన్ని పెంపొందించిన మామూలు జానపద కవులలో ఒకరు కాదు మన శ్రీ శ్రీ. తెలుగుసాహిత్యావనిలో ఈ శతాబ్దం నాది అని సగర్వంగా చాటుకున్న శ్రీ శ్రీ సినిమా రంగంలో కూడా అదే బాణి పలికించారు. తన కవితాగ్ని నుండి సమసమాజాన్ని స్థాపించాడు. సమసమాజ నిర్మాణం అంటే ఆయన దృష్టి పేదవాని బ్రతుకుల మీద పడి వారి జీవితాలలో మార్పు తేవడమే తన ధ్యేయం గా పెట్టుకుని మహాప్రస్థానాన్ని సాగించారు.

 

మరో ప్రపంచం

మరో ప్రపంచం

మరో ప్రపంచం పిలిచింది

పదండి ముందుకు,

పదండి త్రోసుకు!

పోదాం పోదాం పై పైకి..

కదం త్రొక్కుతూ

పదం పాడుతూ

హృదంతరాళం గర్జిస్తూ

పదండి పోదాం

వినబడలేదా

మరోప్రపంచపు జలపాతం??

అని శ్రీశ్రీ  కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలను ఉత్తేజ పరుస్తూ,  నూతనోత్సాహం కలిగిస్తూ ఉర్రూతలూగిస్తూ అభ్యుదయ కవితా గీతాలను వ్రాసినాడు. శ్రీశ్రీ బాణి ఈనాటివారికీ, భావితరాల వారికి కూడా వాణి.  ఆయన కవితాగ్నుల నుండి వెలువడిన చైతన్యంతో జ్యోతులను వెలిగించుకుని సమాజం ముందుకు వెళుతూనే ఉంది. ఇప్పటికీ శ్రీశ్రీ సాహిత్యపరిమళాన్ని తమ గీతాలకు అద్దుతున్నవారెందరో ఉన్నారు.

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను

నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను

నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోశాను

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను

నేను సైతం నేనుసైతం అనే ఈ కవితా పరిమళం పలుచిత్రాల్లో పరిమళించింది. కె. బాలచందర్ దర్శకత్వంలో రుద్రవీణ సినిమాలో ఇళయరాజా ఈ పరిమళ్ళాన్ని తన స్వరాలకు మిళితం చేసారు. ఇదే కవితలోని మకుటాన్ని తీసుకుని బి.వి వినాయక్ తెరకెక్కించిన టాగూర్ సినిమాలో  అశోక్ తేజ కలానికిప్రాణం పోసింది. ఈ కవితకు జాతీయస్థాయి అవార్డ్ కూడా వచ్చింది. సినిమా రంగంలోకి రాకముందే శ్రీశ్రీ సాహిత్యరంగంలో పేరుమోసిన కవి. సామాన్యులకు తన కలం బలం తో నిలబడి వారికి మరో ప్రపంచాన్ని చూపించిన మహా నాయకుడు. ఆయన కవిత ఒక్కొక్కటి బూర్జువాలను కదిలించినా, అందరి సాహితీ ప్రియులను రంజింపజేసింది. అట్టి మహా నాయకుని తలచుకుంటుంటే ఆయన కవితా పరిమళాన్నే మిళితం చేస్తూ ఆయనకు నివాళులను అర్పించాలని ఆగని మనసు తహ తహ లాడుతుంది.. అందుకే..

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చానంటూ

చీకటి బ్రతుకుల్లో కాగడ వెలిగించిన ఓ జీవన జ్యోతీ..

నేను సైతం అశృవొక్కటి ధారవోసానంటూ శ్రామిక

జన ఘోష కు కలం బలం తో మీకు నేనున్నానన్న దైర్యజ్యోతీ..

కదనశంఖం పూరించి బూర్జువాలను కదిలించి

నిన్నవదిలిన పోరాటాన్ని నేడు అందుకొమ్మనీ..ఆలోచించమని

ఆవేశించమని..ఇదే నా మహాప్రస్థానమని తొడకొట్టిన ఓ యుద్దనీతీ..

నేను సైతం బావుటాన్నై పైకిలేస్తున్నా అని చెయ్యెత్తి

ఎత్తిన చెయ్యి దించకుండా శ్రామిక పీడిత జనులపై

అప్రమత్తం గా బెహరా వేసిన జమదగ్నీ..ఓ కవితాగ్నీ..

నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలు పోతానని

ధాత్రినిండా నీవై ..నీ తంత్రీ నినాదాల ఘర్జనలను

భువి ఘోషపై సారించిన ఓ కవితా ప్రళయమా.. శ్రీశ్రీ తరంగమా…

ఇదే సవినయంగా నీకు  గౌతమి నివాళీ..

ఈ సమసమాజ ప్రవక్త విశాఖపట్నం వాస్తవ్యులు. 1910 లో పూడిపెద్ది వెంకట రమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించారు. శ్రీ రంగం సూర్యనారాయణకు దత్తుడగుటచేత ఇంటిపేరు శ్రీరంగం గా మారింది.ఈయన ప్రాధమిక అభ్యాసం విశాఖపట్నం లోనే ప్రారంభమయి, 1925 లో SLC పాస్ అయ్యారు. అదే సంవత్సరం వెంకటరమణమ్మ తో వివాహం జరిగింది. 1931 లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రం లో బి.ఏ పట్టా పొందారు. 1935 లో మిసెస్ ఏ.వి.స్ కాలేజీ లో డిమాన్ స్ట్రేటర్ గా, 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటర్ గా, తర్వాత ఆకాశవాణి, మిలిటరీ, నిజాము నవాబు వద్ద మరియు ఆంధ్ర పత్రిక లో వివిధ ఉద్యోగాలు చేశారు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాధుని రధచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకం గా ప్రచురించారు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చేసిన పుస్తకం ఇది. మహాప్రస్థానం వెనుక మార్క్సిజం కనబడుతున్నా, అది రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటి ఉన్నదని తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు.  1947 లో మద్రాసులో స్థిరపడ్డారు. 1956 లో సరోజ ను రెండవ వివాహం చేసుకున్నారు. తన రచనావ్యాసంగాన్ని కొనసాగిస్తూ, ఎన్నో సినిమాపాటలు, మాటలు రాశారు.  అల్లూరిసీతారామరాజు సినిమాలో తెలుగువీరలేవరా అనే పాట ఒక ఆణిముత్యం. శ్రీశ్రీ తన ఆత్మకధను అనంతం అనే పేరుతో రాశారు. దీనిలో శ్రీశ్రీ తన జీవితం లో ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించారు. తన సమకాలీన కవులను, రచయితలను, ప్రసిద్ధ వ్యక్తులను ఆ పుస్తకంలో పరిచయం చేశారు. మహాప్రస్ఠానానికి ముందే అద్భుతమైన కవితా సృష్ఠిని చేసారు. శ్రీశ్రీ లోని రెండు అక్షరాలు ఒకటి ప్రాసకు, ఒకటి శ్లేషకు ప్రతీకలు. ఆయన రాసిన కవితా ఓ కవితా, ఖడ్గసృష్ఠి తన కవిత్వములోని భావ సాంద్రతని తెలియజేస్తాయి.శ్రీశ్రీ అంటే ఏవిటో చెప్పడానికి మహాప్రస్థానం ఒక్కటి చాలు. అది చదువుతుంటే మనలో రక్తం ప్రవహించదు, ఆయన అక్షరాలు ప్రవహిస్తుంది.శ్రీశ్రీ చమత్కారి, ప్రజాకవి, పాటల రచయిత, మాటల రచయిత, నాటికల రచయిత, హేతువాది, నాస్తికుడు, ఏం మాట్లాడినా నిశ్చితం గా, ఖచ్చితం గా కుండబద్దలుకొట్టినట్లు చెప్పేవారుట. ఆయన గొప్పతనం ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు ప్రజలు అదృష్టవంతులు. మరోమాటలో చెప్పాలంటే తెలుగు ప్రజలు మాత్రమే అదృష్టవంతులు.

ఆయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా ఖడ్గసృష్ఠి కావ్యానికి 1966 లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డ్, 1973 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్, 1979 లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డ్ ను అందుకున్నారు. మహాప్రస్థానానికి ప్రసిద్దమైన ముందుమాటగా గూడపాటి వెంకటాచలం శ్రీశ్రీ యొక్క కవితా తత్వాన్ని ఎలా వివరించారంటే, కృష్ణశాస్త్రి తన బాధని ప్రజలలో పెడితే, శ్రీశ్రీ ప్రజలందరి బాధని తనలో పెట్టుకున్నాడని. శ్రీశ్రీ కి ముందు ఉన్న కవిత్వం వేరు, శ్రీశ్రీ తర్వాత వచ్చిన కవిత్వం వేరు. శ్రీశ్రీ కి ముందు కవిత్వం ఏ రాజభక్తినో, దేవతా భక్తినో పోలిఉంటే, గురజాడగారు వచ్చాక కవిత్వం లో దేశభక్తి చోటుచేసుకున్నది, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని. శ్రీశ్రీ వచ్చాక అది ప్రజాపదం వైపుకు మళ్ళించారు. అందుకే శ్రీశ్రీ అంటుండేవారు, గురజాడగారు రోడ్డువేస్తే, తాను ఆ రోడ్డును వెడల్పు చేశానని. పదండిముందుకు పదండిపోదాం, పదండి త్రోసుకు పోదాం అని చెప్పి ఆయన కవిత్వాన్ని ప్రజాపదం వైపుకు త్రోసాడు. ఈ శతాబ్ధం నాది అని ఆయన అన్నప్పుడు దానిపై కొన్ని చర్చలు జరిగినా, 100 సంవత్సరాలు అయ్యిన తర్వాత కూడా శ్రీశ్రీ ఇంకా ఇప్పటికీ చర్చనీయాంశుడు గా మిగిలాడంటే, ఖచ్చితంగా ఈ శతాబ్దం నాది అన్నమాట కరక్టే. వీళ్ళిద్దరికీ మధ్య కృష్ణశాస్త్రి వచ్చి భావకవిత్వాన్ని రాయడం,తన కవిత్వానికి ప్రజలు ఏమిస్తున్నారను భావనలతో రాస్తే, శ్రీశ్రీ తన కవితలో నేనిస్తాను ప్రజలకు శ్రామిక సౌందర్య చైతన్యాన్ని అంటుండం బట్టి, చలం గారు వారివురి మధ్య తేడాని అలా చెప్పడం జరిగింది.

శ్రీశ్రీ గారు ఒక మహా సముద్రం. సముద్రంలో ఎన్ని బిందువులు ఉన్నాయో లెక్కపెట్టగలమా? అలాగే ఆయన కవితా నేపధ్యాన్ని కూడా అర్ధంచేసుకోవడం అనితరసాధ్యం. శ్రీశ్రీగారు రాసిన ఒక కవిత్వంలో రుద్రాలిక, నయనజ్వాలిక, కలకత్తాకాళిక అనే పదాలు ఎరుపువర్ణాన్నిగుర్తుచేస్తూ, ఆయనొక అచ్చమైన లెఫ్టిస్ట్ అనేటటువంటి భావనను కల్పిస్తుంది. ఎందుకు? ఆ మహాప్రస్థాన సమయంలో ఎన్నో దేశరాజకీయ ఆవిర్భావాలకు ఆ దశాబ్దం నాంది పలికింది. ముఖ్యం గా మూడు విషయాలు ఆ దశాబ్దాన్ని కుదిపింది. 1929 లో ఒక ఆర్దిక సంక్షోభం జరిగింది. న్యూయార్క్ స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. అందువల్ల ప్రపంచమంతా పేదరికం, దారిద్ర్యం తాండవించింది.అందుకే దాన్ని “ఆకటి దశాబ్దం”  అని కూడా అనేవారు.ఆ సమయాల్లో ఆయన రాసిన గీతాలలో ఆ ఆకలి, వేదన కనబడుతుంది. దానికి మరోప్రక్క, ఇలా పెట్టుబడిదారీతనం అంతా కూలిపోయినప్పుడు  సోవియట్ యూనియన్ మాత్రం ప్రణాళికలు వేసింది. అభివృద్ది పదాన సాగింది. అందుకే మళ్ళీ ఒక ఆశ తలెత్తడం వల్ల మహాప్రస్థాన కావ్యంలో ఆ ఆశ కూడా వ్యక్తమవుతుంటుంది. ఈ రెండు ప్రభావాలను మించి, స్పానిష్ అంతర్యుద్దం (1936-1938), రెండవ ప్రపంచ యుద్దానికి ముందు, అది కూడా రెండవ ప్రపంచ యుద్దానికి ఒక రీజన్. ఈ స్పానిష్ అంతర్యుద్దంలో ప్రపంచవ్యాప్తంగా కవులు, కళాకారులు, మేధావులు అందరూ పాల్గొన్నారు. క్రిస్టోఫర్ కార్డియో లాంటి వారు ప్రాణాలను కూడా కోల్పోయారు. స్పానిష్ అంతర్యుద్దంలో  ఫ్రాంకో చూపిన నియంతృత్వ చర్యలను బేస్ గా తీసుకుని, శ్రీశ్రీ రాసిన దేశచరిత్రలు గీతాన్ని గనుక చదివితే  బాగా అర్ధమవుతుంది. కాబట్టి ఆయన లెఫ్టిస్ట్ అవ్వడం అనేది లేదా విప్లవ కవిత్వం రాయడం అనేది అలా జరిగిపోయింది. ఆ దశాబ్దమే అటువంటిది. సముద్రంలో ఎన్నో బిందువులు ఉన్నట్లుగా, శ్రీశ్రీ లో ప్రాచీన కవిత్వం కనబడుతుంది, శ్రామిక సౌందర్య చైతన్యం కనబడుతుంది, అలాగే విప్లవం కూడా కనబడుతుంది, ఆయన ప్రతిభ కూడా అలాంటిది. కృష్ణశాస్త్రి, విశ్వనాధ వంటి ఆయన సమకాలీనుల స్పందన ఉంది, సరిగ్గా అప్పుడే సాగుతున్న దేశరాజకీయ ప్రజాపోరాటాల స్పందన కూడా ఉంది. అందుకే ఆయన్ను, ఆయన కవితా సంపత్తును ఒక దానికి అని ఫిక్స్ చేసి చూడలేము, అందుకే చాలామంది చెప్పినట్లు ఆయన ఒక మహార్ణవము.

నేను సైతం.. అనే దాంట్లో ఒక ఆశావాద దృక్పదం కనిపిస్తుంది. ఇంకోవైపేమో ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణము అని ఏదో నిస్సహాయతతో మొదలైనట్లుగా అనిపిస్తుంది. కానీ నేను సైతం అనేదానికి ఒక సందర్భం ఉంది. మహాప్రస్థాన పరంపరలో ఇది మొదటి గీతం.నేను సైతం సమిధనై ఆహుతిచ్చాను అనేదానిలో గొప్ప భావం ఉంది. ప్రతి వ్యక్తికీ ఒక అస్థిత్వ సంఘర్షణ అనేది ఉంటుంది. ఆ గీతం లో వ్యక్తికి సమాజం, సమాజం వ్యక్తికి ఉన్న పాత్ర అనే ధ్వని కనిపిస్తూఉంటుంది.. సమిధనయ్యాను, సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనేది చాలా ముఖ్యమయినది. మనకున్న ఈ వర్ణ సమాజంలో సమిధనిచ్చే అర్హత కేవలం అగ్రవర్ణాలవారికి మాత్రమే ఉన్నది. కానీ ప్రతిఒక్కరూ ఇవ్వొచ్చనే మాటను కవి పలికించారు. కవిత ఇలా ఆర్తి తో మొదలయి, చివరలో నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను అని చెబుతూ ఒక ఆత్మవిశ్వాసం తో ముగిస్తున్నాడు. భువనభవనపు బావుటాను పైకి ఎత్తినప్పుడు ఏమి కనబడింది?? వెంటనే పదండి ముందుకు పదండి పోదాం అంటూ..కనబడలేదా మరోప్రపంచం, అగ్నికిరీటపు ధగధగధగలు, హోమజ్వాలల భుగభుగలు, ఎర్రబావుటా నిగనిగలు. ఇలా శ్రీశ్రీ కవిత్వ లహరిలో సహజమైన పరిణామ క్రమం కనబడుతుంది. ఇలామహా ఆవిష్కరణలు సిద్దాంతాలలో గాని, సృజనాత్మకతలో గాని ఆనాటి చారిత్రక, రాజకీయ, సామాజిక రంగాలలో వచ్చే మదనానికి ఒక కలగలుపుగా ఒక మహాశక్తిగా శ్రీశ్రీ వెలుగొందారు. ఏదేశచరిత్రచూసినా ఏమున్నది గర్వకారణం అనడంలో…ఏ మాత్రం నిస్సహాయత లేదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమీ లేదు, సామ్రాజ్య తిరుగుబాట్లలో, తాజ్ మహల్ నిర్మాణాల్లో ఒక సామాన్యుని తెగింపు ఉంది, దానిపై జరిగేమోసాలు ఇంకానా, ఇక పై చెల్లవు అన్నాడు. ఇతరేతర శక్తులేలేస్తే, సామ్రాజ్యపు చట్టాలు పేక మేడల్లా కూలిపోవాల్సిందే అన్నాడు. శ్రీశ్రీ కవితా ఒరవడిని చూస్తే, ఆయన ఎలా మొదలుపెట్టినా చివరికి ఆశాజనిత పోరాటపటిమ కనిపించి తీరుతుంది కవిత్వం లో. కృష్ణశాస్త్రిగారు కవిత్వాన్ని మధుర కవిత్వం గా అంటే ఆకులో ఆకు నై, పూవులో పూవునై అని మారిస్తే, మన శ్రీశ్రీ గారు కవిత్వాన్ని పోరాట భాషగా మార్చారు. ఇప్పుడు మన న్యూస్ చానళ్ళుగాని, పత్రికలు గాని శ్రీశ్రీ పదాలు వాడకుండా ఒక్కసారి కూడా కుదరదు, ఎందుకంటే జీవితం పోరాటాల మయం.

ఆయన 14 వ యేట కవిత వ్రాయడం ప్రారంభించాడు, 16 వ ఏట ఒక బుక్కు నే అచ్చువేసేసాడు. అప్పటినుండి, తాను చనిపోయేవరకు విరామం లేకుండా ప్రయోగాలు చేస్తూ రాస్తూనే ఉన్నారు. మహాప్రస్థానం తర్వాత, ఖడ్గ సృష్టిలో కొస్తే అనేకానేక ప్రయోగాలు కనిపిస్తాయి, 1954 లో శరత్చ్చంద్రిక గీతంలో ఇలా ప్రస్తావించాడు- ఇదిగో జాబిల్లి, మావాళ్ళు మీ ఇంటికి వస్తారు. ఆదరిస్తావు కదూ?? అప్పటికి మానవుడు చంద్రమండలానికి వెళ్ళలేదు. మరి ఎంత స్పురధ్రూపి, ఆశా కవో చూడండి.ఆయన కవిత్వం లో భవిష్యవాణి కూడా కనిపిస్తుంది. తనకాలానికి తను ప్రాతినిధ్యం వహిస్తూ, అన్నికాలాలో కూడా ప్రతిధ్వనించగలవాడే మహాకవి. అటువంటి విలక్షణమైన గుణాన్ని కలిగి ఉండడం వల్ల శ్రీశ్రీ ఒక మహా కవి అయ్యారు.

శ్రీశ్రీగారు సమాజంలోని భావాన్ని తీసుకున్నారు. ఆ భావానికి ప్రజా భాష అద్ది, ప్రజలకు అందించారు. ఆయన వాడిన భాష ఒక శక్తివంతమైన వ్యక్తీకరణ. మహాప్రస్థానం, మరో ప్రపంచం అనేది ఎప్పుడో చనిపోయిన తర్వాతఎక్కడోలేదు, కాల్చే ఆకలి కూల్చే వేదన అనేది లేకుండా సాధించుకుంటే మరోప్రపంచాన్ని ఇక్కడే సృష్టించుకోవచ్చు అన్నాడు. ఆయన రాసిన జగన్నాధ రధ చక్రాలు తీసుకుంటే ప్రజాచైతన్యపోరాటం తో జగన్నాధరధచక్రం ముందుకు వెళ్ళాలంటాడు. అలాగే కనకదుర్గ చండసింహం జూలుదులిపి ఆవులించి….అని కనకదుర్గ మీద ఆమె వాహనం తిరుగుబాటు చేసిందని, శివుని మీద నంది తిరుగుబాటు చేసాడని.. అంటే శ్రీశ్రీ యొక్క మరో ప్రపంచ దృష్ఠి లో ఒక్క మానవుడే కాదు, దేవుళ్ల యొక్క వాహనాలు కూడ తిరుగుబాటు చేసాయి. పుడమితల్లికి పురిటి నొప్పులు అని అభివర్ణిస్తాడు, అంటే కొత్తపుడమి పుట్టబోతున్నది అని. ఇలా తన భాషతో క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తూ, శక్తివంతమైన వ్యక్తీకరణలు చేసారు. అలాగే ఎముకలు కుళ్ళిన వయసుమళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండి శక్తులు నిండిన సైనికులారా రారండి అని..అంటే అలాగని ముసలవాళ్ళందరినీ చావమని కాదు. తనగురించి తాను చెప్పుకున్నాడు. నేను ముసలి వాణ్ణికాదు, అసలు వాడిని, అందుకునే ఆకాశపు కొసలువాడిని, పడగెత్తిన త్రాచుపాము బుసలవాడిని, పీడితులను వెంటేసుకుని మసలువాణ్ణి అని..అలాగే కుర్రాళ్ళని గురించి కూడా చెప్పాడు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని. ఆంటే ఆయన దృష్టిలో వయసు ప్రధానం కాదు, ఆశయం గొప్పది అని!! మళ్ళీ అదే గీతం లో యూత్ అనేది యూత్ కాదు నాయనా, నాన్నగారి తాతగారి భావాలకు దాసులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు గా ఉంటే, అదే మరి కొంతమంది యువకులు ముందుయుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు, వారికి నా ఆహ్వానం వారికి నా సాల్యూట్ అన్నాడు. అంటే నూతనత్వానికి ఆయన్ ఇచ్చే నిర్వచనానికి ఈ గీతాలన్ని మచ్చుతునకలు. నూతనత్వాన్ని ఆహ్వానించి, కదం తొక్కించగలిగే శక్తివంతమైన ఆశయం ముఖ్యం తప్ప వయసు కాదు అని గొప్పగా వివరణ ఇచ్చారు.

శ్రీశ్రీ గారి కవితల్లో కేవలం తూటాల్లంటి మాటలు మాత్రమే ఉన్నాయనుకుంటే అది పొరపాటే. ఆయన సినిమాపాటల రచయిత కూడా కదా, ఇలవేలుపు సినిమాలో ‘చల్లని రాజా ఓ చందమామా’ అనే చల్లని గీతం ఈనాటికీ కూడా మరపురానిది. ‘అలాగే జోరుగా హుషారుగా షికారు పోదమా’ అంటూ చిలిపిదనాన్ని పలికించగలిగిన సమర్ధుడు. అలాగే ‘నా హృదయం లో నిదురించే చెలీ’ అంటూ ప్రియురాలిని కవ్వించి, ప్రేమించ గలిగే ప్రేమికుడు కూడా. అలాగే బ్రతుకన్నది కల కాదని, అది ఎంతో విలువైనది అని కూడా తన రచనలలో తెలియ పరిచారు. ఏదీ తనంత తానై నీ దరికి రాదోయ్, శోధించి సాధించాలి అదియే ధీరగుణం అని ఒక లక్ష్యాన్ని నిర్దేశించగల కలం మనిషి. ఆయన భావాలకు అసలు అంతేలేదు. వెలుగునీడలు చిత్రం కోసం ‘కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారల లోనే బలి చెయ్యకూ అంటూ ఆయన కలం అత్మబలాన్ని పెంచింది. . ప్రభవం తో తెలుగు సాహిత్యావనిలో విరబూసిన ఆ సుమం మహాప్రస్థానం సాగిస్తూ, జూన్ 15, 1983 లో మరోప్రపంచానికి దూసుకుపోయింది.

సామాజిక అసమానతలను చీల్చి చెండాడిన హలం ఆతని కలం

భూమిదున్ని శ్రామిక చైతన్యపు విత్తు వేసిన హలం ఆతని కలం

సామాన్యుని తెగింపును దోచుకున్న దగాకోరులను తెగనరికిన కొడవలి ఆతని కలం

శ్రామిక పీడిత తత్వాన్ని ఖండఖండాలుగా తెగ్గొట్టిన గొడ్డలి ఆతని కలం

 

నూతనత్వానికి శక్తినిచ్చి కదం తొక్కించి క్రొత్త రూపాన్ని చెక్కిన ఉలి ఆతని కలం

బ్రతుకు బాటలో ఎదురయ్యే సుడిగుండాలను ముందుగానే శోధించమన్న శాస్త్రం ఆతని కలం

మాటల తూటాలే కాదు పూలబాటలు ప్రేమ తోటలు పెంచిన ప్రేమ కావ్యం ఆతని కలం

ఆధునిక తెలుగు సాహిత్యావనిని ఇది “నా శతాబ్దం” అని శాసించిన శాసనం ఆతని కలం

 

ఏదో ఒక్క యుగానికి కాదు, భావియుగాలన్నింటికి తానే కల్కిని అవుతా,  అనే మొసలిపట్టు కలం ఆతని కలం……..అదే శ్రీశ్రీ హలం !!!

 

11 thoughts on “ఓ కవితా ప్రళయమా.. శ్రీశ్రీ తరంగమా…ఇదే నీకు నా నివాళీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *