April 27, 2024

రగడలు

రచన: మల్లిన నరసింహారావు

రగడ తెలుగులో అచ్చమయిన జాతీయ ఛందస్సు. ఇది వైతాళీయముగా చెప్పబడినది. అనగా వితాళమైన (వేరు వేరు తాళములలోగల) నడకలతో నడిచే గేయ ఛందస్సు అని అర్థము.

స్వచ్ఛందః సంజ్ఞారఘటా

మాత్రాక్షరః సమోదితాః

పాఠద్వంద్వ సమాకీర్ణా

సుశ్రావ్యాసైవ పద్ధతిః.

(స్వచ్ఛంద లక్షణము, సమమాత్రాక్షర నిర్మాణము, సరిపాదములు, పాదసంఖ్యా నియమరాహిత్యము , సుశ్రావ్యత్వము, రఘటసంజ్ఞకల ఛందస్సుకు లక్షణములు.) అని జయకీర్తి ఛందోనుశాసనమున దీని గేయ లక్షణమును చెప్పినాడు.

దీనిలో మాత్రాసమకగణములే వాడవలయును.

త్రిశ్ర అనగా మూడు మాత్రల గణములు, చతురస్ర అనగా 4 మాత్రల గణములు, ఖండ అనగా 5 మాత్రల గణములు, మిశ్ర అనగా 7 మాత్రల గణములు(4+3లేదా 3+4)

గతులలో ఈ రగడలు నడచును. సూర్యేంద్ర, చంద్ర గణాల ప్రసక్తి ఇక్కడ లేదు. మాత్రా గణాల సంఖ్య మాత్రమే ఇక్కడ ప్రధానం.(సంగీత శాస్త్రములోని సంకీర్ణ =9 మాత్రల (5+4 లేదా4+5) గణములు ఉండవు.) నవ విధ రగడ భేదములలో హయప్రచార(3మాత్రల), మధురగతి(4 మాత్రల), ద్విరదగతి(5 మాత్రల), వృషభగతి(7మాత్ర) గణాల రగడలు ఏర్పడును. జానపద గేయములనుండే స్వీకరించినను తద్భిన్నముగా ఉండుటకు వీటికి ఆది ప్రాస, అంత్య ప్రాసలు నియతము చేసినారు. పాదాంత విచ్ఛేదము పాటించబడును. అనగా మొదటిపాదము చివరిపదము రెండవ పాదములోనికి చొరబడదు. ఇవిగాక ఉదాహరణ కావ్యములలో కనుపట్టు కళిక, ఉత్కళికలు రగడ భేదములే.

తాళ రగడ లేక విషమరగడ(హరిగతికి రెట్టింపు) పేరుతో శ్రీనాథుడు, హంసగతికళిక (ఉదాహరణ కావ్యములందు ప్రయుక్తములు) అని చిత్రకవి పెద్దన, మంజుల రగడ (ప్రాస లేని మధురగతి రగడ) అని అయ్యలరాడు నారాయణామాత్యుడు ప్రయోగములు వివరించినను ప్రసిద్ధముగా రగడలు నవ విధములే.

రగడలు మాత్రాసమక గణములచే నిర్మించబడునపుడు గణముల వాడుక విషయములో స్వేచ్ఛ ఉన్నను, ఎదురు నడక గల లగ, జ గణములు నిషిద్ధము. అనగా లఘువు ఆపై గురువు (ఆరోహణ క్రమము) గలవి గతి తప్పించునని ఛందః శాస్త్రములో నిషేధింతురు. ఐనను ఒకటి రెండు ప్రయోగములుండనే ఉన్నవి.( పింగళి సూరన, ధూర్జటి, పాల్కురికి సోమన వాడినవారు.)

యతి సమద్విఖండన రూపములో ఉండును. అనగా పాదములోని మొత్తము గణములలో సగభాగము పిదప యతి స్థలము ఉండును. రగడలను స్తుతి కావ్యముగా ప్రత్యేకముగ ఏక ఛందస్సులో లఘుకృతులు వ్రాయుట అన్న విధానము శివ కవులతో ప్రారంభమై, శ్రీనాథుల కాలమునుండి కావ్యస్థ స్తుతి రగడలుగా సాగినది. పింగళి సూరన రగడను లేఖ కొరకు వాడినాడు.

రగడ అతి ప్రాచీనమయిన ఛందస్సు. కన్నడములో కూడా తెలుగు వలెనే దీని లక్షణమును, ప్రయోగమును ఉన్నది. అంత్యప్రాస నియమమున్న ఏకైక ఛందము రగడ.

క్రీ.శ. 9వ శతాబ్ది నాటికి అంత్య ప్రాస కన్పట్టుచున్నది. ఇది తెలుగు నుండి సంస్కృత భాషలోనికి తెలుగువారివలన ప్రవేసించినది. పాల్కురికి సోమన ప్రాసతో కూడిన రగడను సంస్కృతమున బసవోదాహరణమున వాడినాడు. 9వ శతాబ్దము నాటి సోమదేవ సూరి యశస్తిలక చంపువన్న సంస్కృత గ్రంథమున వీటిని వాడినాడు. రాజరాజ నరేంద్రుని కోరుమిల్లి శాసనమున (11 వ శతాబ్ది) రగడ వాడినారు. వృత్తమౌక్తికమన్న సంస్కృత ఛందో గ్రంథమున చంద్రశేఖర భట్టు రగడలకు లక్షణము చెప్పినాడు. వీరంతా ఆంధ్రులే.

లయగ్రాహి, లయ విభాతి ఇత్యాది మాలా ఛందములలో అక్షర సమక గణములతో కొలువకున్నచో అవి వైతాళీయములగు రగడల వలెనే కన్పట్టును.రగడలు, రగడ భేదాల తీరులీ క్రింది పట్టికలో గమనించవచ్చు.

 

రగడ పేరు               గతి            మాత్రలు గణములు        మొత్తం మాత్రలు        నిషిద్ధ గణం

 

1.     హయప్రచార రగడ     త్రస్య                   3*4                             12                  లగ

2.     తురగవల్గన రగడ      త్రస్య                   3*8                              24                 లగ

3.     విజయమంగళ రగడ   త్రస్య                   3*16                           48                 లగ

4.     మధురగతి రగడ        చతురస్ర               4*4                              16                 జ

5.     హరిగతి రగడ            చతురస్ర              4*8                              32                జ

6.     ద్విరదగతి రగడ         ఖండ                  5*4                               20                జల,య

7.     విజయభద్ర రగడ        ఖండ                  5*8                               40                జల,య

8.     హరిణగతి రగడ          మిశ్ర                    7*2                             14                 లగ.జల

9.     వృషభగతి రగడ          మిశ్ర                    7*4                             28                 లగ,జల

 

1.     హయప్రచార రగడ రగడ ( మూడు మాత్రా గణములు 4, 3*4=12 , ఆది అంత్య ప్రాసలు,2 గణముల మీద యతి అంటే 3వ గణాద్యక్షరము)

రాజి         తంబు        రత్న       మయము

భ్రాజి         తంబు       ప్రసవ      మయము

 

2.     తురగవల్గన రగడ (మూడు మాత్రాగణములు 8,  3*8=24, ఆది అంత్య ప్రాసలు, హయ ప్రచారకు రెట్టింపు, 4 గణములమీద అంటే 5వ గణాద్యక్షరము యతి)

శ్రీస           తీశు              పరమ            పురుషు          చిత్త       మునద      లంచు             వారు

వాస         వాది               నిఖిల            దివిజ             వంద్యు     నాశ్ర            యించు           వారు

 

3.విజయ మంగళ రగడ(త్రిమాత్రా గణములు 8, 3*16=48,  ఆది అంత్యప్రాసలు, తురగవల్గనరగడకు రెట్టింపు, 4 గణములమీద అంటే 5వ గణాద్యక్షరము యతి)

తురగ     వల్గ             నంబు           రెంటి        తోడ          విజయ       మంగ          ళంబు

ధూర్త      కంస           తూల            దహన      తుహిన      హీర           సదృశ     కీర్తి

4.మధురగతి రగడ(చతుర్మాత్రా గణములు 4, 4*4=16,  ఆది అంత్యప్రాసలు, 2 గణములమీద అంటే 3వ గణాద్యక్షరము యతి)

శ్రీ వని             తాధిపు           జేరిభ              జింపుడు

భావజ            జనకుని          భక్తిద             లంపుడు

 

5.హరిగతి రగడ(చతుర్మాత్రా గణములు 8, 4*8=32,  ఆది అంత్యప్రాసలు, మధురగతి రగడకు రెట్టింపు, 4 గణములమీద అంటే 5వ గణాద్యక్షరము యతి)

శ్రీమ          త్కాశీ            పుటభే        దనల         క్షీశ్రుతి         మణిక       ర్ణికమణి       కర్ణిక

యామవ    తీవర            చూడా         మణికిని      హారక          మలదీ       ర్ఘికమణి      కర్ణిక

 

6.ద్విరదగతి రగడ(పంచ మాత్రా గణములు 4, 5* 4=20,  ఆది అంత్యప్రాసలు, 2 గణముల మీద అంటే 3వ గణాద్యక్షరము యతి)

ఓహంసి                 నీచేత               నున్నయది          నాబ్రతుకు

నాహృదయ            మింతిడెం           దమునేక             ముగనదుకు

 

7.విజయభద్రరగడ(పంచమాత్రాగణములు 8,5*8=40, ఆది అంత్య ప్రాసలు, ద్విరదగతి కి రెట్టింపు, 2గణములకు ఒకమారు అంటే 3,5,7 గణాద్యక్షరములకు యతి)

దారిప్ర  క్కనధరా    ధరకోణ    ఘనశిలా    త్తవితర్ది    కాపరి,    స్తరణర   మ్యంబైన

దారిమధ  ధన్యధరా   ధరఝరీ    సారణీ       దరనీల   పరిలఘూ   త్తమవారి      మృదవైన

 

8. హరిణగతి రగడ(సప్త మాత్రా గణములు రెండు , 3+4  3+4 , ఒక గణము తరువాత యతి, ఆది అంత్య ప్రాసలు, లగ,జ గణములు నిషేధము)

విషధి      కన్యా      వినుత     సార్థము

వృషభ      గతిలో    వెలయు    నర్థము

 

9.వృషభగతి రగడ ( సప్తమాత్రాగణములు 4, 3+4  3+4 , 3+4  3+4 , హరిణగతికి రెట్టింపు, ఆద్యంతప్రాసలు, ప్రతి రెండు గణములమీద యతి)

కొమ్మ వేగిర     మేటికే కొన     గోరగోరట   విరులుగిల్లును   తమ్మిపువ్వుల   మీద జలములు   దారదారక     యుండ జల్లుము

ఇది రెండు మిశ్రగతి నడకలు గలది.

కళిక ఉత్కళికలు కూడా రగడ భేదములే.ఉదాహరణ కావ్యములందు రగడలను కళిక, ఉత్కళిక అందురు. కళికకు సగము ఉత్కళిక. రాయవలెను.ఆది ప్రాసగల          రెండేసి పాదములు 4 జంటలుగా వ్రాయవలెను. కళిక ప్రక్కన రెట్టింపుగా ఉత్కళిక వ్రాయుదురు. కళికలోని గణములకు ఉత్కళికలో రెట్టింపు సంఖ్య ఉండును. నడకలు మాత్రము ఒకేలా ఉండవలయును. పైన చెప్పిన త్రస్యాది గణములే.

 

కళిక

వెండియు         త్రిభువన        వినుతిస         మేతుడు

మండిత            సద్గుణ         మహిమో         పేతుడు

 

ఉత్కళకి

భువన              సువన        ఫలము             లలమి

జవన                పవన         బలము             కలిమి

కళికలో నాలుగు గణములు ఉత్కళికలో 2 గణములుపాదమున కుండును. ఒకే నడక గలవి(చతురస్ర).  ఇవి ఎనిమిదేసి పాదము లుండును. గతిని బట్టి పై నవ విధ రగడలలో ఇవి అతర్భవించును.ది

ఆద్యంత ప్రాస లేకుండా ఏ రగడను రచించినను అది ‘ఆ’ మంజుల రగడ యగును. మధురగతిని ప్రాస లేకుండ రచించినచో అది “మధురమంజుల రగడ” యగును.

ఇవి ప్రస్తుతం నాకు లభించిన రగడ షందంను గుఱించిన విశేషాలు. ఇంకో సారి అక్కఱల గుఱించి , ద్విపదల గుఱించీ తెలుసు కుందాము.

3 thoughts on “రగడలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *