May 2, 2024

వర్షంలో గొడుగు (తండ్రి – కూతురు)

రచన :వాయుగుండ్ల శశికళ

”అయ్యో పొరపాటు జరిగింది . ఇప్పుడే సారె లో అది కూడా  పెట్టేస్తాము . తల్లి లేని పిల్ల కదా ! వాళ్ళ అమ్మ ఉంటే అన్నీ చూసుకునేది . అదీ కాక మీ  పద్దతులు కొంచెం వేరుగా ఉన్నాయి . ఇప్పుడే సరి చేసేస్తాము ” మెల్లిగా బ్రతిమిలాడుతూ అన్న నాన్న మాటలు చెవినబడ్డాయి కొత్త పెళ్లి కూతురు  సుష్మ కి .

అమ్మ లేని పిల్ల …

మనసు బాధతో మూలిగింది . ఎంత నాన్న తల్లి ప్రేమతో అన్నీ చేస్తున్నా ఎక్కడో దగ్గర ఈ మాట చిన్నప్పటి నుండి నాన్న  నోటి వెంట వస్తూనే ఉంది .  అమ్మ ఇంత కంటే ప్రేమగా చూస్తుంది అనుకుంటున్నాడేమో. ఏమి తక్కువ చేసాడు తమకి .

” ఏమిటండి ప్రతీ దానికి ఇదొక మాట. తెలీక పోతే తెలుసుకోండి ” చిన్నగా కసురు వినపడింది అవతలినుండి .

రెండు కుటుంభాలు కొత్తవే కావొచ్చు ,కొంత సంయమనం వహించి శాంతంగా చెపితే అవతలి వారి మీద గౌరవం రెట్టింపు అవుతుంది కదా !తండ్రి కంటి మీద లేత మీగడ లాంటి నీటి పొరను ఊహించుకోగానే సుష్మకి దుఖం తన్నుకువచ్చి ఆవేశంగా వెళ్ళబోయింది ఆక్కడకి .

ఈ లోగా ఎప్పుడు వచ్చారో  విజయక్క ,హరి అన్నయ్య వాళ్ళను పక్కకు తీసుకెళ్ళి సమాధానపరిచారు .

అమ్మ ….

ఒక్క సారిగా  అక్క , అన్న చెప్పిన గతం గుర్తుకు వచ్చింది .

” ఏమండీ కొంచెం ఆ కొబ్బరి నూనె సీసా ఇలా ఇవ్వండి ”

అడిగింది ఇందిర . ఒక వైపు ఐదేళ్ళ పాప విజయకి తల దువ్వుతూ , ఇంకో వైపు మూడేళ్ళ బాబు హరికి స్పూన్ తో

అన్నం పెడుతూ పనుల్లో అష్టావధానం  చేస్తూ అడిగింది . మరీ తొమ్మిదో నెల వచ్చినప్పటినుండి అసలు లేవలేక పోతుంది . అందులో ఈసారి రక్తం తక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండమని డాక్టర్స్ చెప్పనే చెప్పారు .

కాని ఎలా కుదురుతుంది . మూడో కాన్పు కాబట్టి పుట్టింట్లో కాన్పు చేసుకోకూడదు . అయినా కడుపులో ఉండేది గట్టి పిండమే వద్దని ఎన్ని సార్లు అబార్షన్ కు  పోయినా ఏదో ఒక అడ్డంకి . ఇక చేసేదేముంది మెల్లిగా తొమ్మిదో నెల వచ్చేసింది .

”మిమ్మల్నే ” లేవకుండా టి.వి చూస్తున్న భర్త ని ఇంకోసారి అడిగింది .

”ఆ హరి ని అడుగు తెచ్చిస్తాడు ”నిర్లక్ష్యంగా తల తిప్పకుండా  చెప్పేసాడు . ఆఫీస్ కి వెళ్లేందుకు లోపలి కి వెళ్ళిపోయాడు.

”మీకూ  అదిగో ఆ పైన పెట్టిన గొడుగుకు తేడాయే లేదు. ఎప్పుడూ పని చేసేదే లేదు  . ఎప్పుడో ఒక్క సారి తప్ప ”

విసుక్కుంటూ లేవలేక మెల్లిగా లేచింది. పిల్లలను రెడీ చేసి స్కూల్ కి పంపేసింది .

*******

ఫోన్ వినగానే పరుగున హాస్పిటల్ కు వెళ్ళాడు ఆనంద్ .

”ఇదేమిటి ఇంకా డెలివరీ కి ఇంకా రోజులు ఉన్నాయి కదా ” అని ఆలోచించుకుంటూ.  పక్కింటి వాళ్ళ మొహంలోని నీలి నీడకు అర్ధం,  నర్స్ పాపను తెచ్చి చేతిలో జాలిగా పెడుతున్నప్పుడు మెల్లిగా అర్ధం అయింది

”ఇందిర ఇక లేదు ” మెల్లిగా మనసును కోసేస్తూ ఏదో రంపం లోనికి వెళుతున్నట్లు బాధ.  బాధ కూడా అనుభవించడానికి  లేకుండా చుట్టూ ఏడుస్తూ ముగ్గురు పిల్లలు . కన్నీళ్లు మనసులో అదుముకొని అందరికి ఫోన్లు చేస్తూ

అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూ , పిల్లలను చూసుకుంటూ వారంలోనే ఏబై ఏళ్ళు పైన పడినట్లు మారిపోయాడు .

అన్ని కార్యక్రమాలు అయిన తరువాత మెల్లిగా పాపను వళ్ళో వేసుకొని పాలు తాగిస్తున్న ఆనంద్ దగ్గరకు  వచ్చింది వాళ్ళ అక్క శైలజ .

”ఆనంద్ ఒక మాట చెపుతున్నాను విను . మన దూరపు చుట్టాలకు పిల్లలు లేరు కదా , ఈ పాపను వాళ్ళు పెంచుకోను

అడుగుతున్నారు . నువ్వు తల్లి లేకుండా చూసుకోలేవు . వాళ్ళు బాగా చూసుకుంటారు ఇచ్చేద్దాము ” అంది . పాప గుప్పెట్లో ఉన్న ఆనంద్ చూపుడు వేలుకి  ఒక్క క్షణం మంచుబిందువు పడిన ఆకులాగా ఉలికిపాటు .

లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు .

”పెద్దదాన్ని చెపుతున్నాను  నా మాట విను. పుట్టగానే తల్లిని మింగేసింది . అదృష్టవంతురాలు కాదు . ఇచ్చేద్దాము ” బలవంత పెట్టింది .

” లేదక్కా! తల్లి మనసు గొప్పది అంటారు కాని , కొబ్బరిపెంకులాగా కనిపించే తండ్రి మనసులో కూడా లలితమైన తల్లి మనసు ఉంటుంది . ఒక్కసారి అది మేలుకుంటే …. తల్లి, తండ్రి అన్నీ తానే. ఇప్పుడు పాప దూరం అవుతుంది అనే ఊహ కూడా నేను భరించలేను. నా పాప ఎన్నటికి దురదృష్టవంతురాలు కాదు. తండ్రి లోనే తల్లి ప్రేమ కూడా పొందిన అదృష్టవంతురాలు ” నిండిన తమ్ముడి కన్నీటి చెలమలు చూసి మాట్లాడలేక కొంచెం గర్వంగా , ప్రేమగా తమ్ముడి వీపు తట్టి , పాప నుదుటి పై మెల్లిగా వంగి ముద్దు పెట్టి వెళ్లిపోయింది అక్క .

      ******

”విజయా నీకు అమ్మ ఉంటే బాగుంటుంది కదా! ఇలాగా జడలు వేయడం అన్నీ చూసుకుంటుంది ” ప్రేమగా  విజయతో అంది మేనత్త శైలజ .

”ఎందుకత్తా మా నాన్న అన్నీ చూస్తున్నాడు కదా ! మాకు అమ్మే గుర్తు లేదు ” చెప్పింది విజయ .  అవునంటూ వంత పలికారు చిన్న పిల్లలు హరి , సుష్మ .

”అక్కా పిల్లల మనసు పాడు చేయొద్దు ” ఎప్పుడు వచ్చాడో ఆనంద్ కోపంగా అన్నాడు.

”అది కాదు ఆనంద్ పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఇలా ఉండి  పోతావు ? రేపు పిల్లలు వెళ్ళిపోతే నీవు ఒంటరి అయిపోతావు . రెండో పెళ్లి మగవాళ్ళకు ఎప్పటికీ తప్పు కాదు . అదీ కాక పిల్లలకి ఉహ తెలీక ముందే చేసుకుంటే కొత్త తల్లితో కలిసిపోతారు ” అనునయంగా చెప్పింది శైలజ తమ్ముడికి .

”అక్కా ఇందిర నన్ను ఎప్పుడూ అదిగో మీరు ఆ పైన పెట్టిన గొడుగులాంటి వారు అని అంటుండేది . అది

ఎప్పుడూ అవసరం కాక పోవచ్చు . కాని వర్షం పడితే మాత్రం అది ఆగేంతవరకు అది తెరుచుకొనే ఉంటుంది .

కిందవాళ్ళ పై నీరు పడకుండా కాచుకొనే ఉంటుంది . నా పిల్లల పై కష్టాల వర్షం పడనంత వరకు నేను

గొడుగులా కాచుకొనే ఉంటాను . నా అవసరం వాళ్లకు లేని రోజున ఒక దగ్గర ముడుచుకొనే ఉంటాను , అంతే కాని

ఇంకో పెళ్లి మాట ఎత్త వద్దు ” పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు …. తమ్ముడి గొంతులోని జీర పిల్లల మీద ప్రేమను స్థిరంగా తెలుపుతుంటే…

”నీ బిడ్డలు అదృష్టవంతులురా ”అనేసి వెళ్లి పోయింది శైలజ .

ఎదురుగా వినపడిన మాటల శబ్దానికి గతం నుండి ఒక్కసారి ఉలికిపడి  బయటపడింది సుష్మ . ఎదురుగా నాన్న వాళ్లకు సర్ది చెపుతుంటే అక్క , అన్న తోడుగా ఉన్నారు .

”లేదు నాన్నా మీరు ఇంకా రెక్కలు విప్పుకొని మమ్మల్ని కాపాడక్కర్లేదు. మాకూ రెక్కలు వచ్చాయి. వాటి పై మీ భారాన్ని మేము మోస్తాము ” మనసులో అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సుష్మ .

అక్క , అన్న అన్ని విషయాలు వాళ్లకు చెప్పారు కాబోలు  వాళ్ళు ఆనంద్ చేయి పట్టుకొని ”మీ లాంటి మంచి బాధ్యత

గల వాళ్ళతో  పొందడం మా అదృష్టం. తండ్రి అంటే అవసరం అయితే తల్లి బాధ్యత కూడా చేయాలి అని మీరు అందరికి దారి చూపారు. ఇంకేమి చెప్పక్కర్లేదు. పదండి ” గౌరవంగా నమస్కరించారు వాళ్ళు .

”అవును నాన్న . మీరు మా కోసం కష్టపడింది చాలు. ఇప్పుడు మీ సుఖమే మాకు కావాల్సింది ” ఆనందంగా

అన్నారు పిల్లలు .

**********

విశ్లేషణ; మంథా భానుమతి

జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు, ప్రకృతి సహజంగా పురుషుడు భౌతికంగా ఎంత బలవంతుడో మానసికంగా అంత బలహీనుడవటం చూస్తుంటాం. ముగ్గురు పిల్లల్ని ఒంటరిగా పెంచడం.. అదీ అప్పటి వరకూ ఇంటి విషయాలు ఏవీ పట్టించుకోని వాడు, అంత సులభం కాదు. కానీ ధృఢ సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తాడు ఆనంద్.

ఎంతో ఉదాత్తమైన వ్యక్తిత్వం కలవాడు ఆనంద్. నిండు గర్భిణి అయిన భార్య, లేవలేక ఏదో అందియ్యమంటే నిర్లక్ష్యంగా లేచి వెళ్ళిపోతాడు. అప్పుడా భార్య అంటుంది, “మీకు, ఆ పైన పెట్టిన గొడుగుకు తేడాలేదు” అని. ఇదేం పోలిక అనుకున్నాను మొదట. తర్వాత కథ నడుస్తుంటే అర్ధమయింది.

కథానాయికని పుట్టినప్పట్నుంచీ తండ్రే పెంచడం.. అదీ అమ్మ లేని లోటు తెలియకుండా, చదువుతుంటే మానవతకి పరాకాష్ఠ అనిపించక మానదు. అమ్మాయే అనుకుంటుంది.”అమ్మే ఉంటే ఇంతకంటే బాగా పెంచేదా!” అని. పైగా ఎవరైనా తల్లి లేని పిల్ల అంటే తనకి నచ్చదు కూడా. ఆ విధమైన అభిప్రాయం తన పిల్లల్లో కలిగింపజెయ్యడం అంత సులభం కాదు. అందుకే ఆ తండ్రిని శిఖరాగ్రం ఎక్కిస్తారు పాఠకులు.

ఉపాధ్యాయిని అయిన వాయుగుండ్ల శశికళ, తన వృత్తి రీత్యా కలిగే పలు రకాల పరిచయాలను, ఆ వ్యక్తుల స్వభావాల పరిశీలనను తన కథల్లో ప్రతిఫలింపజేస్తారు. వీరి కొన్ని కథలకు బహుమతులు కూడా లభించాయి. పోలికలు నూతనంగా ఉంటాయి. ఉదాహరణకి, “కొబ్బరి పెంకు లాగా కనిపించే తండ్రి మనసు..”. ఒక మెచ్చుకోలును, ఒక ఆప్యాయతను, ఒక ప్రేమ భావాన్ని తనలోనే గుంభనగా దాచుకుని.. అవసరమొచ్చినప్పుడు, ఆ పెంకును పగులగొట్టి లోపలి మీగడలాంటి ఆత్మీయతను పంచే తండ్రి.. ఎంత బాగా సరిపోయిందో చూడండి.. పాఠకులకి కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది ఆ తండ్రి వ్యక్తిత్వం.

శశికళ మంచి మంచి కథలను మనకి ఇంకా ఇంకా అందించాలని కోరుకుందాం.

7 thoughts on “వర్షంలో గొడుగు (తండ్రి – కూతురు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *