May 3, 2024

చిరంజీవ… విజయీభవ

రచన: జ్యోతివలబోజు

సుమ తల్లీ!!!

నేను నీ నాన్నని.. కంగారు పడకు ఎప్పుడూ లేనిది ఇవేళ నేను ఉత్తరం రాయడమేంటి అని అనుకుంటున్నావా?? …    ఇలా మనసులోని మాటలు ఉత్తరంలా రాయడం అది కూడా స్వంత కూతురికి రాయడం  నాకు మొదటిసారి. తప్పులుంటే క్షమించమ్మా.. రచయిత్రివి కదా..  ఎందుకో నీతో నిజం చెప్పుకోవాలనిపిస్తుంది. మరీ టూ మచ్ అనుకోవద్దు. ఈ మాటలు నీతో చెప్పకుంటే నాకు స్తిమితంగా ఉండదు.

నీ గురించి తలుచుకుంటే నాకు ఒకవైపు గర్వంగానూ ఉంటుంది, మరోవైపు గిల్టీగా కూడా ఉంటుంది. నేను నీకు చిన్నప్పటినుండి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. అసలు నువ్వు, నీ తమ్ముళ్లిద్దరి  ఆలనా, పాలనా, చదువులు మొదలైనవి అన్నీ మీ అమ్మే చూసుకునేది. డబ్బులు సంపాదించి ఇవ్వడమే నా పని, మిగతావి కావు అన్న అహంకారంతో నా బిజినెస్‌లో పూర్తిగా మునిగిపోయేవాడిని. ఇంటి విషయాలు మీ అమ్మ మీద వదిలేసి నిశ్చింతగా నా వ్యాపారం, స్నేహితులు, పార్టీలు అంటూ తిరిగాను.  నెలకోసారి స్కూలు రిపోర్టులో సైన్ చేయడం తప్ప మీరెలా చదువుతున్నారో, మీ స్కూలు ఫంక్షన్లు, మీ పోటీలు ఏవీ నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా ప్రయత్నించలేదు. అదంతా నా డ్యూటీ కాదు అనుకునేవాణ్ణి. అప్పుడప్పుడు పండగ షాపింగ్ మాత్రం చేసేవాడిని. పిల్లలంటే నాకు ద్వేషం, కోపం అని కాదు కాని అదో నిర్లక్ష్యం. నా వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఇంకా ఎంత సంపాదించాలి అన్న ఆవేశం తప్ప మీ అల్లరి, ఆటపాటలు, ముద్దు ముచ్చట్లలో పాల్గోవాలి. మీకు మరింత దగ్గరగా ఉండాలనే ఆలోచన రాలేదు.  ఇప్పుడు నిన్ను, నీ తమ్ముళ్లను మీ పిల్లలకోసం పడే తపనను చూస్తుంటే మీ చిన్నప్పుడు నేను చేసిన తప్పులు గుర్తొచి సిగ్గు పడుతున్నాను. నేను ఎందుకు మిమ్మల్ని ఇంతగా పట్టించుకోలేదు అని. పిల్లల్ని కన్నాం, వాళ్లకు మంచి బట్టలు, పుస్తకాలు, అవసరమైనప్పుడు డబ్బులు తప్ప ఇంకేం అవసరం ఉంటాయిలే అనుకునేవాడిని. కాని ఒక్క కూతురువైన నీ మీద నాకు ప్రేమ ఉండేది. నీకు ఇష్టమైనవన్నీ  కొనివ్వాలి. అందరు ఆడపిల్లల్లా కాకుండా మాడర్న్‌గా ఉండాలని అడిగినవి, అడగనివి కొనిచ్చేవాడిని. అలాగే నీ పెళ్లి కూడా నా తాహతుకు మించి ఖర్చు పెట్టి బందువులూ, స్నేహితులూ  ఆశ్చర్యపోయేలా బ్రహ్మాండంగా చేసాను. అది నా బాధ్యత అనుకున్నాను. నీకు గుర్తుందా నీ పెళ్ళికి ముందు నీకేం చేప్పానో.. పెద్దవాళ్ల ముందు కూర్చోకూడదు. ఎదురు మాట్లాడకూడదు. మగవాళ్ల ముందు గట్టిగా మాట్లాడకూడదు. అత్తవారింటి కష్టాలు పుట్టింటికి తీసుకురాకూడదు, అందరు చెప్పినట్టు వినాలి అని…. నీ మూలంగా అత్తవారింటి నుండి ఒక్క మాట కూడా రావొద్దు అని ఎంత కర్కశంగా చెప్పానో.. దానివల్ల నాకు మాటొస్తుందని బెదిరానే కాని నా కూతురు అలా ఎప్పుడూ చేయదు. అని ఆలోచించలేకపోయాను.. పెళ్లి తర్వాత ఒక తండ్రిలా అన్ని బాధ్యతలూ, ఆచారాలూ, సంబరాలూ అన్నీ చేసాను.

ఇన్ని చేసినా నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అందరికీ చేయడం నీ బాధ్యత అని చెప్పానే కాని నీకు ఏం కావాలో నేను ఎప్పుడూ తెలుసుకోలేకపోయాను. కనీసం ప్రయత్నించలేదు. నీవు ఇంటర్ తర్వాత డిగ్రీలో ఏం చదవాలో చెప్పలేదు. కనీసం పెళ్లి కుదిర్చినప్పుడు కూడా నీకు అబ్బాయి నచ్చాడా అని కూడా అడగలేదు. కాని ఆ దేవుడి దయవల్ల నేను చూసి చేసిన అబ్బాయ్ వల్ల నీకెలాంటి గొడవలు లేవు. ఏమో నువ్వు మాకు తెలీకుండా దాచావేమో. నాకు తెలుసు నేను అన్నమాటకు కట్టుబడి అత్తారింట్లో నీ కష్టాలేవీ మాదాకా రానీయకుండా నువ్వే అనుభవించి బాధపడ్డావని. నువ్వు చెప్పకుంటే సుఖంగానే ఉన్నావని అనుకున్నా. కాని నేను కూడా నిన్ను చాలా బాధపెట్టాను. ఎన్నోసార్లు నిన్నూ, నీ భర్తను అవమానించాను. సూటిపోటి మాటలన్నాను. నీ పరిస్థితి గురించి ఆలోచించకుందా కోపంతో అన్నమాటలు ఇప్పుడు తలుచుకుంటే నేనెంత తప్పు చేసానో తెలిసొస్తుంది.. కాని ఆ మాటలకు బాధపడ్డ నువ్వు నా ఇంటిగడప తొక్కను అని మీ అమ్మతో చెప్పి వెళ్లిపోయావ్. మూడేళ్ళ తర్వాత నాకు నేను దిగివచ్చి నిన్ను పిలిస్తే కాని రాలేదు. నా మొండితనమే నీకు వచ్చిందిరా.. కాని అది నీ విషయంలో మాత్రం ఆత్మాభిమానం.  అది తీవ్రంగా దెబ్బతింటే, ఎవరైనా (అది నేనైనా సరే)  గేలి చేస్తే తండ్రినైనా ఎదిరించావు కదా.. నీ పిల్లల కోసం పడ్డ ఆరాటం, వాళ్ల చదువులు, పెళ్లిళ్ల విషయంలో కూడా నేను ఎటువంటి సాయం చేయలేకపోయానమ్మా. నీ పిల్లలు.. నువ్వు, నీ భర్త చూసుకోవాలి నాకేం సంబంధం లేదు నా కొడుకులు, వాళ్ల పిల్లలు మాత్రమే నా బాధ్యత అనుకున్నా.. ఇది నా స్వార్ధమే. ఐనా నువ్వు అన్నింటికీ ఎదురీది పిల్లలను ఉన్నత స్థితికి చేర్చావు, వాళ్ల పెళ్లిళ్ళు కూడా ఘనంగా చేసావు. ఇవన్నీ కనిపించే సంతోషాలే కాని వీటి వెనుక ఉన్న నీ పట్టుదల, కృషి, బాధ, పోరాటం నాకు ఇప్పుడు ఇప్పుడు అర్ధమవుతుంది.

ఇప్పుడు ఈ ఉత్తరం రాయడానికి గల మరో కారణం చెప్తున్నా. ఒక తల్లిగా నీ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసినా నీకంటూ కూడా ఒక  ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని ఇంత పేరు సంపాదించుకున్నావని  తలుచుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. అసలు నువ్వు ఇంత బాగా ఆలోచించగలవని, రాయగలవని నాకు అస్సలు తెలీలేదు. మన కుటుంబంలో ఆడవాళ్లు ఎవరూ ఇలా కష్టపడి రచనల రంగంలో ఇంత పేరు సంపాదించలేదు. ఇప్పుడు ఖాళీగా ఉండడం వల్ల నువ్వు రాసిన కొన్ని వ్యాసాలు చదువుతుంటే నీ మనసులో ఇంత అద్భుతమైన భావాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయేవాడిని. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఒక మంచి రచయిత్రిగా, సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకుంటుంటే ఎంత గర్వంగా ఉందో. అయ్యో నా బిడ్డను చిన్నప్పటినుండి ఎంకరేజ్ చేస్తే ఇంకెంతగా పేరు తెచ్చుకునేదో నేనేమి చేయలేదు కాని స్వంతంగా పిల్లలతో పాటు తనకు తాను పేరు తెచ్చుకుంది. నీ పేరు ప్రఖ్యాతులు చూసి మనసారా అభినందిస్తున్నాను. వీటివెనుక నీ కష్టం, పోరాటాం , ఆత్మస్థైర్యానికి చేతులెత్తి మొక్కుతున్నాను. ఎంత ఎదిగిపోయావమ్మా .. గొప్పవాళ్లతో నీ స్నేహం చూస్తుంటే నాకే గర్వంగా ఉంది. కన్నబిడ్డలను ఎక్కువగా పొగడకూడదు అంటారు అందుకే ఆపేస్తున్నాను. కుసుమగా నేను పెట్టిన పేరు సుమగా మరింతగా గర్వంగా చెప్పుకుంటూ

చిరంజీవ… విజయీభవ..

మీ నాన్న..

 

విశ్లేషణ- మంథా భానుమతి

కొన్ని దశాబ్దాల క్రితం మగవారు సంపాదించి పోషించడం, ఆడవారు ఇంటి బాధ్యతలు నిర్వహించడం.. ఈ రెండు విధులూ ఒక గిరి గీసినట్లు ఉండేవి. (ఇప్పుడు కూడా ఉందనుకోండి.. కానీ కొన్ని చోట్ల మగవారు కూడా ఇంటి బాధ్యతలు పట్టించుకోవడం చూస్తుంటాం. అంటే పట్టించుకునే వారి శాతం పెరిగింది.)

“నాన్నగారు” అంటే చాలా కుటుంబాలలో, సభ్యులకి అందని చందమామ. ఏది కావాలన్నా అమ్మ రికమెండ్ చెయ్యవలసిందే. తలెత్తి చూడ్డానికే భయపడే వాళ్లు. మనసులో పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా పైకి చూపిస్తే క్రమశిక్షణ పోతుందేమో అనే అభిప్రాయం నాన్నగారికే కాదు అమ్మకి కూడా ఉండేది. అల్లరి చేస్తే, “మీ నాన్నగారికి చెప్తా అంతే..” అనే మాటతో ఠపీమని మూల కూర్చోవడమే. అందులో ఆడపిల్ల అంటే ఇంకొంచెం ఎక్కువే ‘జాగ్రత్త’ ఉండేది. దాంతో తండ్రి దగ్గర చనువు ఉండదు. ఇష్టం లేని చదువులు, నచ్చని బట్టలు, బలవంతపు నిర్బంధాలు.. ఇవన్నీ చాలా సహజం. ముఖ్యంగా వివాహ విషయంలో, “దాన్నడిగేదేంటి.. నేను అన్నీ ఆలోచించే చేస్తాను కదా.. “ అనే అభిప్రాయం తండ్రులకి సహజంగా ఉండేది.

అటువంటి వాడే ఈ కథలో సుమ తండ్రి. తన అనవసర క్రమశిక్షణతో జీవితంలో ఏం కోల్పోయాడో, తన పిల్లల సంసారాలు చూసి తెలుసుకుంటాడు. అందులో ఆడపిల్లని అలుసుగా చూసి, ఒక్క కూతుర్ని ఆమె ప్రతిభ గుర్తించకుండా చిన్నతనంలోనే పెళ్ళి చేసి.. “ఎన్ని కష్టాలు వచ్చినా భరించి ఉండాల్సిందే అని శాసిస్తాడు. అన్ని కట్టుబాట్లనీ భరిస్తూనే వివిధ రంగాల్లో కృషి చేసి తనేమిటో నిరూపించుకుంటుంది సుమ. అప్పుడు పశ్చాత్తాపంతో రగిలిపోతూ కూతురికి రాసిన ఉత్తరమే, “చిరంజీవ సుఖీభవ.”

శ్రీమతి జ్యోతీవలబోజు పేరు తెలియని పాఠకులుండరంటే అతిశయోక్తి కాదు. వంటల గురించి రాసినా, అరుదుగానైనా మంచి కథలు రాసినా, ఒక పత్రిక నిర్వహణ బాధ్యతని సమర్ధతతో నిర్వహిస్తున్నా, బ్లాగ్ గురువుగా అనేక మందికి బ్లాగ్ లోకాన్ని పరిచయం చేసి వారి సందేహాలను విసుగు లేకుండా వివరించినా, ప్రచురణ సంస్థని స్థాపించి ఒకేసారి ఒక రచయిత్రి ఆరు పుస్తకాలని ఆవిష్కరించడానికి శ్రమించినా.. జ్యోతీ వలబోజుకే చెల్లు. ప్రాచీన సాహిత్యం నుంచీ ఆధునిక సాహిత్యం వరకూ, కవిత్వం, కథలు, వ్యాసాలు.. అన్నింటిలోనూ ప్రవేశం ఉన్న రచయిత్రి జ్యోతి.  “చిరంజీవ సుఖీభవ” లేఖ రూపంలో ఉన్న ఒక తండ్రి ఆవేదన.. అత్యంత సహజంగా వివరించారు రచయిత్రి.

 

 

 

12 thoughts on “చిరంజీవ… విజయీభవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *