May 2, 2024

“శాంతి” (తండ్రి – కూతురు)

రచన: స్వాతి శ్రీపాద

“కాఫీ తీసుకురానా నాన్నా” ఐదున్నరకే లేచి పేపర్ తిరగేస్తున్నతండ్రిని పరామర్శించి’౦ది శాంతి.

అప్పటికే తండ్రి అలికిడి, బాత్ రూమ్ లో బ్రష్ చేసుకోడం విని లేచి పాలు స్టౌ మీద పెట్టి వచ్చి౦ది. సు౦దరరామయ్య తల ఊపాడు. ఎనభై దాటి రెండేళ్ళయినా  అద్దాలు అవసరం లేకుండా పేపర్ చదవగలడు. తన పనులు తను చేసుకుంటాడు. కాదంటే బయటకు వెళ్లి తిరగడం లాటివి తగ్గిపోయాయి.

గడ్డం నిమురుకుంటూ కుర్చీలో కూచున్న తండ్రిని చూసి మనసులోనే గొణుక్కు౦ది శాంతి.

“చింత చచ్చినా పులుపు చావక పోడం అంటే ఇదే ..” అని.

అవును , శాంతికి తెలుసు ఇప్పటికీ కూతురైనా, అల్లుడైనా, బ్రహ్మ దేవుడైనా తనమాటే నెగ్గాలనే మొ౦డి పి౦డ౦. అమ్మ మరో దారిలేక ఎంత వేదన పడిందీ.

ఊహ తెలిసే సరికి బిలబిల మనలేని మూగ జీవాల్లా ఇంటినిండా ఆడపిల్లలు. ఇద్దరు అక్కలు నలుగురు చెల్లెళ్ళు.

ఎవరి చదువులూ సవ్యంగా సాగలేదు. రెండేళ్ళకో బిడ్డను కనే తల్లి. మధ్యలో కాలం తీరి పోయిన వాళ్ళు పోగా మిగిలినది ఆడపిల్లలే. ఇంట్లో పనిపాటలన్నీ పెద్దకూతురి పాలయాయి. చదువు మీద అంతగా ఆసక్తి లేదు. అయినా స్కూల్లో చదివి వుంటే అంతో ఇంతో వచ్చేదేమో .. ఏడో తరగతి పూర్తవగానే కారణమేమిటో తెలియదు గాని ఉన్న ఊరినుండి నగరానికి మారి ఇద్దరక్కలనూ స్కూల్ మాన్పించి ప్రైవేట్ గా మెట్రిక్ కట్టి౦చాలనుకోడం, ఎవరు ఇచ్చిన సలహానో గాని బాగా నెత్తి కెక్కింది.

మిగతా ముగ్గురినీ ప్రభుత్వ పాథశాలలో చేర్చడం.. ఆయన చేసిన మంచిపని అంటూ ఉంటే అదొక్కటే.

రెండేళ్ళ మెట్రిక్ చదువు తరువాత పరీక్షలు రాసి ఇద్దరక్కలూ ఫేలవడం , మళ్ళీ ఏడాది మళ్ళీ రాయి౦చడ౦.

రెండో సారి పెద్దమ్మాయి తప్పడం , రెండోది పాసవడం యాదృచ్చికం.

పునాది సరిగా లేనప్పుడు భవనాలు నిలుస్తాయా?

స్కూల్ చదువు , తనతో పాటు చెల్లెళ్ళు తల్లి మళ్ళీ గర్భవతి… కొడుకు కావాలి , వంశోద్ధారకుడు.

జన్మకో శివరాత్రి లా ఎప్పుడో ఒకసారి తెచ్చిన డబ్బుతో బియ్యం బస్తాలు కొనుక్కుంటే ఇహ రోజులు గడవటం ఎలాగో తెలియని స్థితి.

చదువుల గురించీ పెద్ద పట్టించుకోలేదు , అలాగని వయసొచ్చిన పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యాలనీ తొందరపడలేదు. నాలుగు డబ్బులు దొరికిననాడు, విందు భోజనం లేనప్పుడు తిని కూర్చోడం అలవాటైపోయింది ఆయనకు. తల్లి చెప్తూ౦డేది.

“ఆ రోజుల్లో ఐదో తరగతి చదవడమే గొప్ప , పిలిచి ఉద్యోగం ఇస్తామన్నారు. కాని గడప దాటితే పరువు తక్కువని…”

“ఇప్పుడు ఆ పరువేమన్నా మిగిలి౦ది గనకనా ? కనిపించిన వాడినల్లా అప్పు అడగడమేగా?”  అనిపించేది.

ఏడుగురు ఆడపిల్లల తరువాత వంశోద్దారకుడు పుట్టడం ఎవరి అదృష్టమో, ఎవరి దురదృష్టమో ఎవరికీ అర్ధం కాలేదు.

కొడుక్కి అన్నీ సవ్యంగా అమర్చలేకపోతున్నామన్న విచారం ముందు కూతుళ్ళ అవసరాలు చిన్నవైపోయాయి.

   పెళ్ళిళ్ళకేమి తొందర? చేసుకుని ఎవడు బాగున్నాడు గనక అంటూ మెట్ట వేదాంతం. ఏదైనా అడిగితె కట్నాలు కానుకలు అడిగిన వారికి పిల్లనివ్వమని ఫోజు , ఎవరైనా ముందుకు వస్తే ఎదో మేలికపెట్టి చెడగొట్టడం

….

   ఇంట్లో చాకిరీ చేసి పెట్టింది తిని పడుండాలి.

పెరుగుతున్న పుత్రా రత్నాన్ని ఎవ్వరూ ఏమీ అనరాదు.

అన్నారో వాళ్లకు మూడిందన్నమాటే. ఎలుక మీదో పిల్లి మీదో పెట్టి చావబాదక ఒదిలే వారు కాదు ఇద్దరికిద్దరూ .

అంతే కాదు మాటలు కూడా రాని కొడుక్కి హితోపదేశం చేసేవాడు –“ ఈ ఆడముండలని చెప్పు కి౦ద తేళ్ళలా అణచి ఉంచాలి.” అంటూ.

వాడు రాళ్ళు రప్పలు విసిరి తలలు బద్దలు కొట్టినా కిక్కురు మనకూడదు.

ఇంట్లో ఎవరూ గట్టిగా మాట్లాడకూడదు, నవ్వకూడదు, నోరెత్తి అసలు మాట్లాడకూడదు.

ఇంతే అయితే ఎంత బాగుండేది !

కనిపించిన స్త్రీనల్లా నిలువెల్లా చూడటమే కాదు, ఓ పట్టు పడదామని ప్రయత్నించడం. అదీ ఆడదైతే చాలు కూతుళ్ళ కన్నా చిన్నదైనా , దాదాపు తల్లి వయసు మనిషైనా …

అలాటి ఇంట్లో పెరిగినా విలువలంటూ నేర్చుకున్నది అమ్మ చదివే గజేంద్రమోక్షం, లాటి కావ్యాలవల్ల, ఎప్పుడో జన్మకో శివరాత్రిలా  చూసిన సినిమాల వల్ల. సత్య హరిశ్చంద్ర సినిమా చూసి జీవితంలో భార్యాపిల్లలను అమ్ముకోవలసి వచ్చినా అబద్ధం ఆడని ఆ గొప్ప వ్యక్తి  ఆదర్శంగా అనిపించాడు.

చదివిన పుస్తకాలు మంచి చెడు విచక్షణ నిచ్చాయి.

జీవితం జీవనది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగిపోదు.

ఈ మనిషి కొడుకును మాత్రం సుఖంగా ఉ౦డనిచ్చాడా? అందరిమీదా ద్వేషాన్ని పెంచి ఒంటరి వాడిని చేసి , తలుచుకుంటే జుగుప్స అనిపిస్తుంది.

అయినా ఇప్పుడాయనకు ఆశ్రయం ఇచ్చినది ఒక వ్యక్తిగా కాదు తండ్రిగా , జన్మకు     ఆధారమైన తండ్రిగా …

అడవులకి పంపిన తండ్రిని గౌరవి౦చిన  రాముడి కథ ఇచ్చిన సంస్కారం అది.

 

ఎవరు ఎవరైతేనేం నేను నేనే …

“కాఫీ తీసుకో౦డి నాన్నా” కాఫీ అందించింది శాంతి

*————–*

 

విశ్లేషణ— మంథా భానుమతి

పుత్రుడనే వాడు లేకపోతే పున్నామ నరకానికి పోతామనే భావన ఐదారు దశాబ్దాల క్రితం చాలా ఉండేది.. మధ్యతరగతి కుటుంబాలలో! అందుకని కొడుకు పుట్టే వరకూ కూతుళ్ళని కని, అధిక సంతానాన్ని భరించలేక, పిల్లల్ని వేధించుకు తినే వారి శాతం చాలానే ఉండేది.

కొడుకుని అందలం ఎక్కించి, కూతుళ్లని చిన్న చూపు చూడ్డం, ఆ వంశోద్ధారకుడు అక్కల్నీ, చెల్లెళ్ళనీ ఎన్ని తిట్లు తిట్టినా వాడిని ఏమీ అనకుండా ఎదురు కూతుళ్ళనే తిట్టడం సాధారణమైన విషయంగా ఉండేది. ఇంటి యజమాని నిరంకుశత్వానికి బలైపోయిన ఆడకూతుళ్ళ సంఖ్య అధికంగానే ఉండేది. ఆ ఒరవడి గత ఇరవై ముప్ఫై సంవత్సరాలుగా తగ్గిందనే చెప్పచ్చు.

అతి గారాబం వల్ల కొడుకు చెడిపోతే, కూతురి పంచన గతిలేక ఉంటూ కూడా ఆధిపత్యం చెలాయించే ఒక తండ్రిని ఆదరించిన కథే, స్వాతీ శ్రీపాద గారి “శాంతి”. కథ చెప్తూనే మన పురాణాలలోని విశిష్టతను తెలియ జెప్పడం, అందులోని మంచిని గ్రహించిన కథానాయిక ఔన్నత్యాన్ని చూపించడం ఈ కథలోని ప్రత్యేకత.

స్వాతీ శ్రీపాద అనుభవమున్న రచయిత్రి. అనేక కథలు, అనువాదాలు, నవలలు రాసి పలు పురస్కారాలందుకున్న విదుషీమణి. తెలుగు యూనివర్సిటీ వారి కీర్తి పురస్కారం, నిజామాబాద్ జిల్లా రచయిత్రి గా సత్కారం అందులో కొన్ని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *