April 26, 2024

మాయానగరం-7

రచన: భువనచంద్ర bhuvana

 

శామ్యూల్ రెడ్డిగారు అంటే రెక్టారుగారు ఇన్ స్పెక్షన్ అయిపోయాక మిస్ శోభారాణి గుడిసెల సిటీ పిల్లలకి చాక్లెట్లు పంచి (మరో ఇన్ స్పెక్టర్ వస్తే వాళ్ళని పంపించడం తెలికనే ముందుచూపుతో) ‘అఫ్’ మని ఊపిరితీసుకుంది. అవ్వాళ శోభారాణి అదృష్టం బాగుంది గనుక అంతా బాగా జరిగింది. లేకపోతే నానారభస, నానా రచ్చ జరిగేది. అందుకే కొలీగ్స్ కూడా సుఖంగా ఊపిరి పీల్చుకుని శోభారాణిని ‘కంగ్రాట్’ చేశారు. అంతేకాదు, హెచ్.ఎం శోభారాణిని ప్రత్యేకంగా మెచ్చుకుని మధ్యాహ్నం ఆఫ్ ఇచ్చేసింది. మధ్యాహ్నపు శెలవుని ఎలా సెలబ్రేట్ చేసుకోవా అనె ఆలోచిస్తూ నడుస్తున్న శోభారాణి పొరపాట్న కళ్ళనీళ్లతో నడుస్తున్న మిసెస్ మాధవీరావుని గుద్దేసింది. ఆ డేష్ ఇవ్వడం కూడా చిన్న ఘటనే. మామూలుగానే ఇద్దరూ ‘నాది తప్పు సారీ-లేదు నాదే తప్పిదం’ అని రెండంకెల్లో సారీ అని చెప్పుకున్నాక ‘ఇద్దరి ఊహలు ఒకటాయే అన్న పాటని నిజం చేస్తూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.  అక్కడితో ఆగకుండా వీధుల్లో జంటగా, పర్సనల్ గా తిరిగి తిరిగి మాధవీరావ్ ఇంటికి చేరుకున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే జరిగేదేవిటి? మాటల నదులు ప్రవహిస్తాయి, ఫేషన్ల తళతళలు, లేటెస్ట్ మేకప్ సామాగ్రి తాలూకు సమాచారాలూ, దుస్తుల ధరవరలు, సినిమాల సరిగమలు ఇలా లక్షా తొంభై విషయాల కారవాన్లు గాలివేగంతో దూసుకుపోతుంటాయి. ఇంకొంచెం చొరవ ఉన్నవాళ్ళైతే వంటలూ, వడ్డనలూ, ఇరుగుపొరుగు వాళ్ళ మనస్తత్వాలు, సీక్రెట్టులూ అన్నే అర్జెంటుగా మాట్లాడేసుకుని తమ తమ మెమొరీ పవర్ కి పదును పెట్టుకుంటారు. చిత్రం ఏమిటంటే అటువంటి మాట ఒక్కటి కూడా వీళ్ళిద్దరి మధ్య   జరగలేదు. ఓ బాధతో, ఆవేశంతో ఆపుకోలేని ఉద్వేగముతో మాధవీరావు ‘గుడిసె బతుకుల్నీ’ వాళ్ళ ‘జనన మరణాల్నీ’ కళ్ళకి కట్టినట్లు వర్ణిస్తుంటే చెవులు చాటలంత చేసుకుని మిస్ శోభారాణి బియస్సీ ఆసాంతం శ్రద్ధగా విన్నది. అంతేకాదు అప్పుడప్పుడు మాధవీరావ్ చేతిని తన చేతిలోకి తీసుకుని మౌనంగా ఓదార్చేప్రయత్నం కూడా చేసింది.

ఇంటికి చేరగానే కళ్ళెదుట చూసిన చావుల్ని వర్ణిస్తూ మాధవీరావ్ భోరుమంటే శోభారాణి ఓ చెల్లెలు ఒక అక్కని పొదివి పట్టుకున్నట్లు పొదువుకుని కాసేపు ఏడవనిచ్చి, తర్వాత కళ్ళు తుడవడమే కాక తనకు అపరచితమైన ఆ ఇంట్లో చూపుల్తో వెతికి ఓ గ్లాసును సంపాయించి, ఒక ఇత్తడి కూజా బిందెలో ముంచి, మాధవీరావుతో తానే తాగించింది.

“నువ్వు నాకు దేముడిచ్చిన చెల్లెలివి శోభా” అని మాధవీరావు శోభాని తన కౌగిలిలోకి బంధిస్తే,

“ఎవ్వరూ లేని నాకు ఇన్నాళ్ళకి ఓ అక్కరూపంలో నువ్వు దొరికావని” శోభా, మాధవీరావుని ఒక బల్లి లాగ కరుచుకుపోయింది. ‘విధి చేయు చిత్రాలెన్నో’ పాట రాసిన రైటర్ గ్రేట్ కాదని ఎవరనగలరూ?

 

ఓ గంట తర్వాత శోభారాణి వివరాలన్నీ తెలుసుకుంది మాధవీరావు. “నీకు నేనున్నాను….” అనే అభయం కూడా ఇచ్చింది. ఒంటరితనమెంత బాధాకరమైందో తెలిసిన వాళ్ళకి మరో ఒంటరితనం కనిపిస్తే ఎంత సాంత్వన ఇవ్వగలదో ప్రత్యక్షంగా తెలిసింది శోభారాణికి.

మాధవీరావు ఇట్లో టి.వి. వార్తలు చూస్తూ బోసుబాబు స్టేట్ మెంట్ చూసింది శోభారాణి.

“అకా.. ఇతను నాకు తెలుసు గుడిసెల్లో”–కలరా వచ్చిందని చెప్పి నన్ను స్కూలుకి వెనక్కి పంపింది ఇతనే… మాధవీరావుతో అన్నది శోభారాణి.” పాపం.. నన్ను తప్పించి తాను కలరా బారిన పడ్డాడు” అని కళ్ళనీళ్ళు కూడా పెట్టుకుంది.

“నిజమా”… ఆశ్చ్ర్యంగా అన్నది మాధవీరావు.

“అవునక్కా.. మీలాంటివాళ్ళు యీ సమయంలో ఇక్కడ వుండకూడదని పంపేశాడు. అతను పేరేదో చెప్పాడు గాని గుర్తులేదు.. ఇప్పుడు టి.వి లో చెప్పారుగా బోసుబాబు అనీ!” అని చెప్పింది శోభా.

“అయితే చావులు కల్తీ సారావి కావా? కలరావా?? నేను కల్తీ సారావనుకుంటున్నా. నీకు ముందే చెప్పాడంటే కలారావయ్యుండాలి…అని అమాయకంగా అన్నది మాధవీరావు. “అదిగోచూడు”.. టి.వి ని చూడమన్నది శోభా.

“ఇంతమంది కలరాసోకి మరణించడం నిజంగా బాధాకరంగా  వున్నది..అందరూ అప్రమత్తంగా వుండాలి. కలరా సింప్టమ్స్ ఏవి కనిపించినా వెంటనే వైద్యసహాయం తీసుకోండి” అంటూ గవర్న్ మెంట్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ టివిలో మాట్లాడుతున్నాడు. హూ… సుధీర్ఘంగా నిట్టూర్చింది మాధవీరావు.

అప్పటిదాకా కల్తీసారా వల్లనే ఇన్ని ప్రాణాలు పోయాయనుకుంటూ, ఆ విషయాన్ని ఏ విధంగా బయటపెట్టి కల్లు పాకల్ని, సారాబట్టీల్ని మూయించాలా ఆలోచిస్తున్న మాధవికి అవి కేవలం కలరా డెత్ లని తెలిశాక కాస్త నీరసం ఆవహించింది.

మనకి తెలిసి కూడా తెలీని విషయం. ఏమంటే మనది ఖర్మ భూమి..ఎన్ని నేరాలు, ఘోరాలు జరిగినా పుట్టుక మర్చిపోవడం మనకి పుట్టుకతోనే దేముడిచ్చిన వరం.

కావాలంటే టెస్ట్ చేసిచూడండి. ఒక్కరికైనా బీహార్ కేసూ,  కమల ఫ్లెష్ ట్రేడింగ్ కేసూ, మాఫియా ముఠాల వీరవిహారం, ఎమర్జన్సీలో జరిగిన ఎక్స్ సెస్ వీటిలో ఏమైనా గుర్తున్నాయా?? అంతెందుకు మొన్నగాక అటుమొన్న ఢిల్లీలో ‘నిర్భయ’ ఉదంతం చట్టం చేయడం తప్ప ఏం మార్పు తేగలిగింది? చట్టలకేం ఎన్నన్నా చేస్తారు. వాటిని కఠినంగా అమలుపరిచే దిక్కేది?

 

వారం తర్వాత బోసుబాబు కోర్టునుంచి బయటకొచ్చాక అభిమానులు (?) ఓ లారీని రధంగా మార్చి, అందులో సర్వాలంకారాలతోటి బోసుబాబుని కూర్చోబెట్టి నగరమంతా “మృత్యుంజయుడు బోసుబాబుకి జై..” లాంటి నినాదాలతో అట్టుడికిస్తూ అతనిని మళ్ళీ గుడిసెల సిటీలోకి ప్రవేశం చేయించారు.

అయితే అంతకుముందే అతను ‘గురూగార్ని’ దర్శించుకుని ఆశీర్వాదం పొందడం అన్ని పత్రికలూ గుర్తించీ.. అతని గురుభక్తి, అతని వినయం, యువలోకానికే ఆదర్శమనీ, అనుసరణీయమని కీర్తించాయి. ఎవరికి ముట్టవలసిన ‘పర్సు’  వారికి ముడితే ఇంకేం కావాలి?  బోసుబాబు బుర్రలో రెండు ఆలోచనలు సుడి తిరుగుతున్నాయి. ఒకటి… కల్తీసారా నుంచి తప్పించుకుని కలరా డ్రామా నడిపించడానికి అయిన ఖర్చు తడిపి మోపెడయ్యింది. రెండోది… ఆవేళ అంటే కొద్దిరోజుల క్రితం ‘సోపు పరిమళంలో’ సమ్మోహపరిచిన అప్సరస ఇంటి అడ్రస్సుని వెతికి పట్టడం. మొదటిది అర్జెంటు అయినా రెండోదానంత అర్జెంటు కాదు అని తనలో తనే అనుకున్నాడు.

మామూలుగా మనిషి మెదడుకీ,  రాజకీయ నాయకుడి (రా.నా)మెదడుకీ చాలా తేడా వుంటుంది. మనం ‘పనికి’రాదు అన్నదానిని వెంటనే బుర్రలోంచి డిలీట్ చేసేస్తాం. రా.నా. అలా కాదు. అన్నిటినీ బుర్రలో పడేసి వుంచుతాడు. ఎందుకంటే ఏ అడుగు ఎప్పుడు ఎలా వెయ్యాలో ఎవరికి తెలుసు? అడుగు ఎటుపడ్డా దానికి మడుగులొత్తేవాళ్ళు లేకపోతే, ఎవడైనా జీవించగలడు గాని, రా.నా మాత్రం జీవించలేడు.

ఓ పద్దతిలో ఆలోచించడం మొదలుపెట్టాడు బోసుబాబు. ఆయొక్క సౌందర్యవతి గుడిసెల సిటీకి  ఎందుకొచ్చి వుండాలి? సడన్ గా అతనికి గుర్తొచ్చింది. స్కూలు టీచర్లు పిల్లలకోసం రావడం. సుడిగాలికి మబ్బు తేలిపోయినట్లు, బోసుబాబుకి మైండ్ క్షణంలో క్లియర్ అయిపోయింది. ఆ పిల్ల ‘పిల్లల’ కోసం వచ్చి వుండాలి..అంటే ఆమె పనిచేసేది శామ్యూల్ రెడ్డి స్కూల్ అయివుండాలి. పేరు కనుక్కోవడం ఎంతసేపు? నో వర్రీస్. ఎందుకంటే ఆ స్కూల్లో పనిచేసే సౌందర్య  ఏ ఇంట్లో అద్దెకు వుంటుందో బోసుబాబుకి తెలుసు.

వెంటనే వెళ్ళి ఆ అడ్రస్సుని పట్టుకోవాలనీ, కనీసం పేరైనా తెలుసుకోవాలనీ బోసుబాబు మనసు హఠం చేసింది గానీ ‘కూల్ కూల్’ అంటూ మనసుని బుజ్జగించాడు బోసు.

“ఓ పెద్ద ప్రోబ్లం నుంచి బయటపడ్డాక ఎంత చిన్న ప్రోబ్లం అయినా ‘సీరియస్’ గానే తీసుకోవాలిగాని, ‘అజాగ్రత్త’ కూడదని పొద్దున్న గురూగారు చేసిన బోధ సడన్ గా గుర్తొచ్చి, కాస్త కళ్లెం బిగబట్టి మనసు గుర్రానికి పగ్గాలు వేశాడు బోసు.

 

 

గోవిందరాజస్వామి ఆలయం కోలాహలంగా వుంద. కారణం బ్రహ్మోత్సవాలు. తిరుపతి కథ వేరు, గుడిసెల సిటీ కధ వేరు. గుడిసెలవాళ్ళంతా  ‘నగరం’ లో వున్న గోవిందరాజస్వామి గుడికి మహాపరిశుభ్రంగా వెళ్ళి పొంగళ్ళు వండుతారు. ఆడవాళ్ళైతే వంటినిండా పసుపు పూసుకుని, మగవాళ్ళైతే గంధం పూసుకుని క్రొత్త ఎర్ర పంచ, చీరలతో సామూహిక పొంగలి కార్యక్రమం జరుపుకుంటారు. మంత్రాలూ, పురోహితులూ మిగతా ఫార్మాలిటీస్ ఏవీ వాళ్లు పట్టించుకోరు.  మూడురాళ్ళో, మూడు ఇటికలో పెట్టి పొంగలి వండడం. ఆ వండిన పొంగలిని పొయ్యి మీద నుంచే గుడివైపు చేతులు చాచి దేవుడికి నివేదించడం, అక్కడే ఆ పొంగలిని తిన్నంత తిని, అందరికీ పంచిపెట్టి ఇంటికి పోవడం. ఇది గుడిసెల సిటీ వాళ్ళ ఆచారం. ఎర్రచీరల/ఎర్ర పంచల కోలాహలం అంబరాన్నంటుతోంది. నవ్వే పిల్లలు-ఏడిచే పిల్లలు, అరిచే పిల్లలు – కరిచే పిల్లలు. వీళ్ళందరినీ సంబరంగా తన కిటికీలోంచి చూస్తున్న ఆనందరావు కళ్ళకి- రిలయన్స్ వీధిలోంచి వస్తున్న మాదవీరావ్, శోభారాణి బియ్యస్సీ కనబడ్డారు. ఢమాల్న ఒక షర్ట్ తగిలించుకుని బయటికొచ్చాడు ఆనందరావు.  మిసెస్ మాధవీరావుని చూడగానే అతని గుండెలో ఏదో తుఫాను మొదలయ్యింది. అంతకుముందు వాళ్ళు కలిసింది ఒక్కసారే, అది వాళ్ళు ఢీ కొట్టుకున్నప్పుడే.

“నమస్తే.. అండీ. నేను ఆనందరావుని. ఆవాళ పొరబాటుగా మిమ్మల్ని ఢీ కొట్టాను చూడండీ.  అతన్నన్నమాట. నేను మీకు గుర్తుండకపోవచ్చు. అయినా ఒక్కసారికే నేనెలా గుర్తుంటాను?? నేనుండేది ఈ వీధిలోనే. అన్నట్టు బోలెడన్ని సన్నజాజులు పూస్తాయి. గుడికొచ్చారా? భలే వుంది కదూ సందడి?”…ఓ రకమైన ట్రాన్సులో మళ్ళీ మాట్లాడే చాన్సు రాదేమో అన్నంత ఇదిగా మాట్లాడాడు ఆనందరావు.

మిసెస్ మాధవీరావుకు గుర్తుంది ‘ఢీ’ ఘటన. మీ పొరబాటు కాదని అన్నాగా.. అయినా ఇద్దరి పొరబటు అని రాజీకి వచ్చాము కదా.. నవ్వి అన్నది మాధవీరావు.

“అవునవును..అలాగే కదా అనుకున్నది. అయినా మీకు కూడా గుర్తుండడం నా అదృష్టం…నా పూర్వజన్మ సుకృతం.అవునూ యీమె మీ చెల్లెలుగారా? చూశారా, చూడగానే చెప్పేశాను. అచ్చు మీపోలికే.. హి…హి”… నవ్వి ఆనందంగా అన్నాడు ఆనందరావు.

“దేముడిచ్చిన చెల్లి” అని అన్నది మాధవీరావు.

“అవును దేముడిచ్చిన అక్క” అని అన్నది శోభారాణి ఆనందరావుకేసి కుతూహలంగా చూస్తూ..

“అవునవును.. ఇప్పుడు మీరిద్దరూ నాకు దేముడిచ్చిన అతిధులు” లైట్ గా కనీసం కాఫీ తాగుదాం.ప్లీజ్ కాదనకూడదు. రోడ్దుమీదనే వున్న తిరుమలా కేఫే వైపు అడుగులు వేశాడు ఆనందరావ్. కాదనలేని మొహమాటంతో అటువైపే అడుగులువేశారు ఆడంగులిద్దరూ.

“మీకో విషయం తెలుసా అండీ.. నేను అప్పుడప్పుడు టిఫిన్ చేసేది ఇక్కడే. భలే బావుంటుంది లెండి. ఇక్కడ చాలా ఆరోగ్య సూత్రాలు పాటిస్తారండీ. గట్టి చెట్నీ తో తింటే ఎక్కడ ఇబ్బంది పడతామేమో అని గరిటెడు చట్నీకి గంగాళం నీళ్ళు కలుపుతారు. ఇహ సాంబారంటారా సూపర్. భూతద్దంపెట్టి వెతికి జూసినా పప్పుబద్ద కనబడదు. ఏమన్నా అనండీ.   ఆ సాంబారులో నానిన ఇడ్లీ రుచికి లోకంలో ఏదీ సాటిరాదు”.

తనింత హుషారుగానూ, హాస్యం (?)గానూ మాట్లాడగలనని ఏనాడూ ఆనందరావు అనుకోలేదు.

అతను వూహించిన ప్రకారం, వాళ్ళు కూడా కొన్ని సార్లు గల గలా, కొన్నిసార్లు ముసి ముసిగా, కొన్నిసార్లు కేవలం మర్యాదపూర్వకంగా నవ్వినట్టు నవ్వి అతని మేధస్సుకి సంతృప్తిని కలిగించారు.

“మీకు తెలుసో తెలీదో.. దోశకి ఆపేరు ఎలా వచ్చిందో తెలుసాండీ? వేసినప్పుడు ఒకసారి, తిరగేసినప్పుడు ఒకసారి సుయ్ అని అంటుంది కదా.. దో సుయ్ అని ఓ హిందీ కలెక్టరుగారు పేరు పెట్టారుట. అప్పట్నించీ దో-సుయ్ అనే పేరే స్థిరపడి కాలక్రమేణా దోశగా మారిందట. ఇంతకీ అర్ధమయ్యిందా? హిందీ లో దో.. అంటే రెండు.రెండుసార్లు సుయ్ మంది గనకే….” వాళ్ళకి ఓపిగ్గా వివరించాడు ఆనందరావు.

పకపకా నవ్వింది శోభారాణి. కొంచెం మర్యాద పూర్వకంగా నవ్వినట్టు నవ్వి వూరుకుంది మాధవీరావు. శోభారాణి అంతగా ఎందుకు నవ్విందో ఆమెకే తెలియలేదు. ఒంటరితనం స్థానంలో ‘నాకూ ఒకరున్నారు అనే నమ్మకం వచ్చాక జగం-మధురంగా మారుతుంది.  ఆ మాధుర్యం ఎంతటిదంటే లోకం అద్భుతంగానూ, సర్వమూ ఆనందమయంగానూ కనిపిస్తాయి. శోభారాణి ప్రస్థుత స్థితి ఇది, అందుకే హాయిగా నవ్వింది.

ఎందుకన్నారో పెద్దవాళ్ళు. నవ్వు నాలుగువిధాల చేటు అని. ఆమె నవ్వుతున్న క్షణాల్లోనే అడుగుపెట్టాడు రెక్టార్ శామ్యూల్ రెడ్డి. నవ్వు శబ్దం చెవిన పడగానే అటుతిరిగాడు. పకపకామని నవ్వుతున్న శోభారాణి కనబడింది. కనుబొమ్మలు ముడుచుకుని చూస్తే- ఆనందరావు, మాధవీ కూడా కనిపించారు-

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *