May 2, 2024

శివునికి ప్రీతికరమైన మాసం – కార్తీక మాసం

రచన–కర్రా నాగలక్ష్మి nagalakshmi karra

 

 

మాసాలన్నిటిలోనూ  కార్తికమాసాన్ని  చాలా విశిష్టతమైనదిగా మన పురాణాలలో వర్ణించడం జరిగింది. కార్తీక మాసం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనదని అంటారు

భారతదేశంలో “సౌరమానము”  లేక “చాంద్రమానా”లని ప్రామాణికంగా తీసుకొని సంవత్సర పంచాంగాన్ని  తయారు చేస్తారు పండితులు.

సౌరమానం ప్రామాణికంగా వాడతారు మన తమిళ సహోదరులు . వారి నెల సూర్యుడు మేష రాశిలో ప్రవేశిస్తే అది చైత్రమాసం , అలాగే సూర్యుడు వృషభ రాశి లో ప్రవేశిస్తే వైశాఖం అలా అన్న మాట. అంటే వారి నెల ప్రతి సంక్రాంతికి మారుతుంది . అంటే మన ఇంగ్లీషు కాలెండర్ ప్రకారం ప్రతి నెల 14 లేక 15 తారికులలో వారి నెల మారుతుంది .

చాంద్రమానం అనుసరించే వారు మళ్ళీ రెండు విధానాలని అనుసరిస్తారు . తెలుగు, కన్నడ, మహారాష్ట్ర,  కాశ్మీరీల నెల శుక్లపక్షంతో మెదలవుతుంది. తమిళనాడు తప్ప మిగిలిన రాష్ట్రాలవారికి బహుళ పక్షంతో నెల మొదలవుతుంది. సులువుగా చెప్పుకోవాలంటే మన తెలుగువారికి అమ్మవాస్య తో నెల ముగుస్తుంది. అలాగే ఉత్తరాది వారికి పున్నమి నెలలో ఆఖరి రోజవుతుంది. అంటే ఉత్తరాదివారికి మనకన్నా పదిహేను దినాల ముందే నెల మొదలవుతుంది. అంటే ఒక్క మన భారతీయులం మూడు రకాలైన పంచాంగాలని వాడుతున్నాం. కాని మళ్ళీ సంవత్సరాల పేర్లు , నెలల పేర్లు మాత్రం ఒకటే. భిన్నత్వం లో ఏకత్వం అంటే ఇదేనేమో .

హిందువుల పంచాంగం  ప్రకారం ఎనిమిదవ నెల కార్తీకం. అందరి హిందువులకు పరమ పవిత్ర మైన మాసం ఈ కార్తీకం.  పైన చెప్పుకున్న ప్రకారం దీపావళి మరునాడు తెలుగు వారి కార్తిక మాసం మొదలవుతుంది. ఉత్తర భారతీయులకి అప్పుడే కార్తీకం మెదలయ్యింది. తమిళులకి నవంబర్ పద్నాలుగో తేదిన మొదలవుతుంది.

సరే ఇక మనం కార్తిక మాస విశిష్టతని తెలుసుకుందాం.

shiva

దీపావళి అమావాస్య ముగుయగానే మరునాటినుంచి కార్తీకం మాసం మొదలౌతుంది .  అందుకే యీ మాసంలో శివుడికి ఇష్టమైన స్నానం, ఉపవాసాలకి ప్రాముఖ్యత ఇవ్వబడింది.

కార్తీకమాసంలో ప్రొద్దున్నే తెల్లవారుఝామున నదీ స్నానం లేక సముద్ర స్నానం లేక చెరువులలో స్నానం లేక నూతి నీటితో కాని స్నానం చెయ్యాలి అనేది శాస్త్రం.

కార్తీకమాసం శరదృతువులో వస్తుంది. శరదృతువులో చంద్ర కిరణాల ద్వారా పాజిటివ్ శక్తిని భూమి పైకి పంపిస్తుందని,  ఆ శక్తి నదులు మొదలగు నీటి ప్రవాహాలలో కలుస్తాయి,  ఆ శక్తి సూర్యుని వేడికి  నష్టపోతాయి కావున   సూర్యోదయానికి పూర్వమే స్నానమాచరించాలని చెప్తారు. అందుకు పెద్ద పట్నాలలో ఉన్నవారికి ప్రవాహాలలో స్నానం చేసే భాగ్యం లేకపోవడంతో యీ మద్య కొంతమంది ఆయుర్వేద, ప్రకృతి చికిత్సకులు బకెట్ల తో నీరు రూఫ్ లేని బాల్కనీలలో రాత్రి పెట్టుకొని ప్రొద్దుటే స్నానం చెయ్యమనే సలహాలు ఇస్తున్నారు.

బలి పాడ్యమి .

కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అని అంటారు. మళయాళీలు  ఈ బలి పాడ్యమిని బలి చక్రవర్తి జన్మదినంగా జరుపుకుంటారు.

భగినీ హస్త భోజనం.

ఇది కార్తిక శుద్ధ విదియనాడు జరుపుకుంటారు. ఈ రోజుని “భగినీ హస్త భోజనం “అని లేక “భాయి దూజ్”అని అంటారు. ఈ రోజు అన్నదమ్ములని అక్కచెల్లెళ్ళు  తమ ఇంటికి పిలిచి పిండి వంటలతో భోజనం పెట్టి బహుమతుల్ని ఇస్తారు. ఇది అన్నాచెల్లెల్ల ఆత్మీయతా అనుబంధాలని తెలియచెప్పే పండుగ.

కార్తిక సోమవారం .

ఇక రెండవది పరమశివునికి ఇష్టమైన ఉపవాస దీక్ష . శివునికి ఇష్ట మైన సోమవారం యీ ఉపవాస దీక్షకి  యెంచు కున్నారు మన ఋషులు, మునులు.

కార్తిక మాసంలో సోమవారం నాడు ఉపవాసదీక్ష ఆచరించే భక్తులు ప్రొద్దున్నే తలస్నానం చేసి శివాలయంలో అభిషేక, అర్చనలు చేసుకొని రోజంతా శివధ్యానంతో రోజు గడిపి సూర్యాస్తమయం తరువాత వండిన వంటకాలు శివునికి నివేదించి ముందుగా సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి, తాంబూలం యిచ్చి ఆతని ఆశీస్సులు  పొంది, పిమ్మట కుటుంబ సభ్యులతో ఉపవాసదీక్షను ముగిస్తారు. ఈ కార్తిక సోమవారం దీక్షకు వయోభేదం, వర్గ భేదం లేదు. కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

నాగుల చవితి

కార్తిక శుద్ధ చవితిని నాగుల చవితిగా  నాగులను వారి వారి వంశాచారం ప్రకారం పూజ చేస్తారు. హిందువులకు నాగదోషం వల్ల  పిల్లలు లేని వారు నాగులని ఆరాధించడం మనకు పురాణకాలం నుంచి వున్న ఆచారమే. ఈ దినం భక్తులు పాము పుట్టలకి వెళ్లి పుట్ట చుట్టూ ముగ్గులువేసి , దీప ధూపాలతో పూజ చేసి పాలు, చలిమిడి, చిమ్మిలి లతో నైవేద్యం పెడతారు కొందరు ఉపవాసం కూడా చేస్తారు.

ఏకాదశి

ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తిక శుద్ధ దశమి వరకు విష్ణుమూర్తి యోగనిద్ర లో ఉంటాడట . కార్తిక శుద్ధ ఏకాదశి నుంచి ఆషాఢ శుద్ధ దశమి వరకు జాగృదావస్థ లో ఉంటాడట. విష్ణుమూర్తి యోగనిద్ర చాలించిన తరవాత వచ్చే ఏకాదశి కాబట్టి దీనిని ప్రభోదిని ఏకాదశి అని అంటారు . భక్తులు ఈ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్దలతో ఉపవాసదీక్షతో ఆచరిస్తారు. రోజంతా నారాయణ మంత్రం , విష్ణు సహస్రనామం జపిస్తూ  గడిపి సాయంత్రం ఉప్పు వెయ్యని వంటకాలని నారాయణునికి నివేదించి ఉపవాసదీక్షను విడుస్తారు.

క్షీరాబ్ది ద్వాదశి

కార్తిక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేక చిలుక ద్వాదశి అని అంటారు. ఈ రోజు సాయంత్రం లక్ష్మి తులసి , విష్ణు తులసిని కలిపి తులసి కోటలో నాటి తులసి వివాహం జరిపిస్తారు. తులసితో పాటు ఉసిరిక మొక్కని కుడా నాటి పూజ చేస్తారు. ఉసిరిక మొక్క లేకపోతె ఉసిరిక ఆకు నాటి పూజ చేస్తారు. ఉసిరిక దీపం వెలిగించి క్షీరాన్నం నైవేద్యం పెడతారు.

ఈ తులసి వివాహం కార్తిక శుద్ధ ద్వాదశి నుండి కార్తీక పూర్ణిమలో యే రోజైనా చేసుకోవచ్చు అని ప్రమాణ సింధు లో చెప్పబడింది.

వైకుంఠ చతుర్దశి

కార్తిక శుద్ధ ఏకాదశిని వైకుంఠ చతుర్దశి అని కుడా అంటారు . ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరించేవారు పొద్దున్నే నది స్నానం చేసి శివ , విష్ణు నామాలని జపిస్తూ ఉపవాస దీక్షను చేపడతారు.  ఈ దీక్ష మరునాడు సాయంత్రం చిన్న చిన్న అరటి దొప్పలతో చేసిన పడవలలో దీపాలు పెట్టి నదులలో విడిచిపెడతారు.  దీంతో వైకుంఠ చతుర్దశి వ్రతం పూర్తి ఔతుంది. ఈ వ్రతాన్ని ఆడ, మగ పిల్లలూ అందరూ ఆచరించవచ్చు. ఈ రోజు హరి, హర నామ స్మరణ చేస్తూ ఉపవాసం చేసే వారికి వైకుంఠ  ప్రాప్తి కలుగుతుంది అని విష్ణుమూర్తి నారదుడికి చెప్పినట్లు విష్ణు పురాణంలో వుంది.

కార్తీక పూర్ణిమ

కార్తీకపూర్ణిమని భారత దేశంతో పాటు మన ఇరుగు పొరుగు దేశాలైన నేపాలు, థాయ్ లాండు, ఇండోనిషియా , చైనా , జపానులో ఈ పండుగని చాలా నిష్టగా జరుపుకుంటారు. తేలికగా వుండే కర్రతో చేసిన రకరకాలైన ఓడల ఆకారాలలో దీపాలు అలంకరించి సముద్రం లో వదిలి పెడతారు.

మన దేశంలో కార్తిక పూర్ణిమనాడు ఆడవారు ప్రొద్దున్నే అభ్యంగన స్నానం చేసి క్రొత్త వస్త్రములు ధరించి ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. ఈ వ్రతం ఆడవారి కడుపు చలవకోసం అని అంటారు. సాయంత్రం బియ్యపు పిండితో చేసిన చలిమిడి పళ్ళు నైవేద్యం చేసి చంద్రునికి పూజ చేసి చలిమిడి వాయినం ఇచ్చి చంద్రునికి నివేదించిన పళ్ళు , చలిమిడి తిని ఉపవాసాన్ని విడిచి పెడతారు. ఈ రోజు వండిన పదార్ధాలని స్త్రీలు తినరు. ఉసిరిక దీపం పెట్టి కార్తిక దామోదరునికి పూజ చేస్తారు.

పున్నముల నోము పట్టిన వారు మూడు సంవత్సరాలు లేక ఐదు సంవత్సరాలు ఇలా బేసి సంఖ్యలో పడతారు . మూడు సంవత్సరాలు పట్టిన వాళ్ళు మూడు కేజీల బియ్యంతో చేసిన చలిమిడిని ముగ్గురు ముత్తైదువులకు వాయినమిస్తారు. అలా ఎన్ని సంవత్సరాలు అని మొక్కు కుంటే అన్ని సంవత్సరాలు అంతమంది ముత్తైదువులకు అన్ని కేజీల చలిమిడి వాయినంగా ఇస్తారు.

ఇది పిల్లల ఆరోగ్యం కోసం మొక్కు కుంటారు. ఈ కార్తీక పూర్ణిమని మన తెలుగు సినిమా వాళ్ళు బాగా వాడుకున్నారు. ఎన్నో పాపులర్ పాటలు వచ్చేయి .

ఈ కార్తీక పున్నమి హిందువులకే కాక బౌద్దులు , జైనులు, సిక్కులకి కూడా ఎంతో పవిత్రమైన రోజు.

కార్తీకపున్నమినాడు నదీస్నానం సూర్యోదయానికి ముందు చేస్తే ఈ జన్మలో చేసిన పాపాలు నశించడమే కాకుండా మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మన పురాణాలలో చెప్పబడింది .

ఈ కార్తిక మాసం వస్తోంది అంటే పిల్లలు, పెద్దలూ  అందరు ఉత్సాహంగా ఎదురుచూసేది వనభోజనాలకోసం. ఎండలు తగ్గి గాలిలో చిరు చలి ప్రవేశించి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో అందరు స్నేహితులు బంధువులతో ఈ వన భోజనాలకి బయలుదేరతారు. ఇక్కడ మరో చిన్న మెలిక ఉంది . పిక్నిక్ అనొచ్చు కదా ? కాదు వనభోజనం అని ఎందుకు అన్నారంటే పచ్చగా ఉండే వనాలు వాటి పైనించి వీచే గాలి మన నిత్య జీవితంలోని ఒత్తిళ్లని పోగొట్టి హాయినిస్తుంది. ఆ వనంలో వుసిరిక చెట్టు ఉండాలట. ఉసిరిక చెట్టు సర్వదేవతా ఆవాసమట . ఉసిరిక చెట్టు మొదలు హరి, హర, బ్రహ్మాదుల నివాసమట ఆకులు ముక్కోటి దేవతల నివాసమట  ఉసిరిక కాయ లక్ష్మీదేవి నివాసమట . అందుకని కార్తిక వనభోజనాలు సర్వదేవతా నివాసమైన ఉసిరిక నీడన చేసి దేవతల ఆశీస్సులు పొందాలని మన పెద్దలు ఈ వనసంతర్పణలు ఏర్పాటు చేసారేమో కదా?

ఉపవాసం, వనభోజనాలూ సైంటిఫిక్ గా చూసినా కూడా ఆరోగ్యదాయకాలే కాబట్టి మనం కూడా అన్నీ కాక పోయినా కొన్ని ఉపవాసాలని, స్నానాలని చేసి ఇహం పరం పొందుదామా?

ఆలస్యం ఎందుకు బయలు దేరండి వనాలకు వన సంతర్పణకు .

ఈ నెలంతా తులసి కోటలో నేతి దీపం పెట్టడం కూడా హిందూ ఆచారమే .

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *