April 27, 2024

చినుకు (తండ్రి – కూతురు)

రచన: అత్తలూరి విజయలక్ష్మిathaluri vijaya

స్తుతికి ఒక్కసారిగా తన ఆశాసౌధాలు పెళ్లలు పెళ్లలుగా తన తలమీద పడిపోతున్నట్టు అనిపించింది.
పెద్ద పెద్ద కెరటాలతో సముద్రం ఆమెని తనలో కలిపేసుకుంటున్నట్టు, రక్షణ కోసం చాచిన చేతుల్ని మొసళ్లు నోట కరుచుకుని వెళ్లిపోతున్నట్టు బాధ, చెప్పలేనంత బాధ… గుండెల్ని మండిస్తోన్న బాధ… నిస్సహాయత…ఉక్రోషం, కోపం గుండెల్ని తన్నుకుంటూ ఉధృతంగా వస్తోంది దుఃఖం…
అంతకన్నా ఎక్కువగా కడుపు రగులుతోంది.
ఎంత మాట అన్నాడు నాన్న!
నువ్వు నా ఇంటి దీపానివి, నా కంటి వెలుగువి, నా ఊపిరివి అంటూ ఇరవై ఏళ్ల నుంచీ అపురూపంగా పెంచిన నాన్న…
తను కోరిందే తడవుగా కొండమీది కోతినైనా తీసుకొచ్చి ఇచ్చే నాన్న…
తన ఇష్టానికి వ్యతిరేకంగా అడుగు కూడా వేయలేని నాన్న.
ఎంత మాట అన్నాడు. స్తుతికింకా నమ్మకం కలగడం లేదు… అలా మాట్లాడింది నాన్నేనా? లేక ఆయన్ని ఆ క్షణంలో ఏదన్నా దుష్టశక్తి ఆవహించిందా?
ఇంతకాలంగా ఎంతో విశ్వాసంతో నాన్న తన మాట కాదనడన్న గర్వంతో ఉన్న తనకి అశనిపాతంలా తగిలింది ఆయన మాట… ఆ విశ్వాసం, గర్వం వరదల్లో కొట్టుకుపోయినట్టు ఆనవాలు కూడా లేకుండా చేశాడు.
ఇంతకాలం నుంచీ ఆయన చూపించిన ప్రేమ నటన కాబోలు… అందుకేనా అలా అనగలిగాడా మాట! పౌరుషంగా అనుకుంది స్తుతి.
ఎంతో ఆశగా, సిగ్గులమొగ్గై, ఆశల పందిరిమీద తుమ్మెదలా ఎగురుకుంటూ వెళ్లి తండ్రితో తన మనసు విప్పిచెప్పింది.
‘ఎంత పెద్దదానివైనావు నా తల్లీ! ఎంత మంచి నిర్ణయం నీది! ఎంత చక్కటి అభిరుచి’ అని పొగడ్తలతో తనని అక్కున చేర్చుకుని ఆశీర్వదిస్తాడనుకుంది.
కానీ, హఠాత్తుగా పేలిన ఆటంబాంబులా ‘వీల్లేదు’ అని అరిచిన తండ్రి స్వరం స్తుతి గుండెని ముక్కలు చేసింది. ముందు భయంతో నిశ్చేష్టురాలైపోయింది.
”నీకెంత ధైర్యం!” అని ఆయన కళ్లల్లో నిప్పులు కురిపిస్తుంటే నోట మాటరాక స్తంభించిపోయింది.
కానీ అదంతా కాస్సేపే… స్తుతిలో మొండితనం ప్రవేశించింది. ”ఏం తప్పు మాట అన్నాను నాన్నా?” కన్నీళ్లతో ఉక్రోషంగా అడిగింది.
”తప్పు కాదా!” ఆయన నివ్వెరపోతూ చూశాడు. ”నేను నీ తండ్రినే! మర్చిపోయావా?” అని అడుగుతుంటే ”తండ్రివి కాబట్టే నీకు చెప్పాను” అంది అంతకన్నా కోపంగా…
”వెళ్లు, ముందు నా ముందునుంచి వెళ్లిపో… ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు” అని ఆయన తర్జని చూపించి శాసిస్తుంటే తనకి అమ్మ సపోర్టు లభిస్తుందేమోనని ఆశగా చూసింది.
ఆవిడ స్తుతివైపు వెళ్లవేం అన్నట్టుగా చూసిందే కానీ, స్తుతిని సమర్థిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో అది మరింత వేదన కలిగించింది స్తుతికి. పరిగెత్తుకుంటూ తన గదిలోకి వచ్చిన స్తుతికి ఏం జరిగిందో అర్థమయే సరికి పిచ్చెక్కినట్టు అవుతోంది.
నిన్నటి ఆప్యాయతా, అభిమానం, ప్రేమా, వాత్సల్యం నేడు ద్వేషం అవగలవా? ఆమెకి ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తన మాట ఎలా కాదనగలిగాడు నాన్న!
ఆలోచిస్తున్న స్తుతికి మతిపోతోంది. ఏం జరుగుతోందో, ఏం జరగ బోతోందో అర్థం కావడం లేదు.
‘ఆడపిల్లకి తల్లి సపోర్టు ఉంటుందంటారు. నాన్నకి అమ్మ నచ్చచెప్పచ్చుగా! ఏం మాట్లాడకుండా శిలలా నిలబడిపోయింది నాన్న తనని అన్ని మాటలంటుంటే. అమ్మ నాన్న ఏదంటే దానికి అలా తలూపుతుందే… ఒక్క మాట కూడా కాదు, వద్దు అనదు. ఎప్పుడూ అంతే! మరీ డిపెండెంట్‌! ఏం లాభం చదువుకుంది, ఉద్యోగం చేస్తోంది కానీ అమ్మకసలు ఇండివిడ్యువాలిటీ లేదు. ఏం అమ్మో!’ కసిగా అనుకుంది స్తుతి.
చిన్నప్పటినుంచీ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరుగలేదు. ఆ నమ్మకంతోటే తను శరత్‌ మీద ఆశలు పెంచుకుంది. తప్పకుండా తండ్రి తన మాటని గౌరవిస్తాడనుకుంది. తన జీవన సహచరుడి విషయంలో నిర్ణయాన్ని ఆమోదిస్తాడనుకుంది. కానీ ఇదేంటి ఇలా జరిగింది…
స్తుతికి ఒక్కసారిగా తన చిన్నప్పటి విశేషాలన్నీ మనోఫలకం మీద గిర గిరా తిరిగాయి.
తండ్రికి తనని మెడిసిన్‌ చదివించాలని ఇష్టం కానీ, తనకి చిన్నప్పటినుంచీ మందుల వాసనలు పడవని, బొద్దింకన్నా భయపడుతుందని దాని మాట కూడా ఎత్తకుండా తను చదువుతానన్న ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్‌లో చేర్పించాడు. ఆయనకి తను కనీసం ప్రతి శుక్రవారమన్నా కాలేజీకి పరికిణీ, ఓణీ వేసుకుని మెడలో నెక్లెసు, చెవులకి బుట్టలు పెట్టుకుని కాలేజీకి వెళ్లాలని కోరిక… అలా వెళితే అందరూ నవ్వుతారు నాన్నా అంటే సరేలేమ్మా… కనీసం ప్రతి పండక్కి అయినా అలా తయారయి నా కళ్లకి లక్ష్మీదేవిలా కనిపించు అన్నాడు… తనేమన్నా కాదందా? లేదే… ప్రతి పండక్కీ మొన్నటిదాకా పరికిణీ, ఓణీలు ఈ మధ్య పట్టుచీరలు కట్టుకుంటోంది.
నాన్నకి తను స్కూటీ తీసుకుని వెళ్తుంటే భయమని తను అది మానేసి ఆటోలో కాలేజీకి వెళ్తోంది.
నాన్నకిష్టమని తను చెస్‌ ఆడటం నేర్చుకుంది నాన్నకోసమేగా…
‘నాకొక్కతివే కూతురివి కన్నా… కొడుకుల్లేరు. నువ్వే నా కొడుకు, కూతురు అనుకుంటున్నా. ఎవరన్నా మీకు పిల్లలెంతమంది అంటే ఏం చెప్తానో తెలుసా…’ అంటుంటే తను ఆసక్తిగా చూసింది. నాన్న చెప్పిన సమాధానం విని పగలబడి నవ్వింది.
‘ఒక కూతురు, ఒక కొడుకు అమ్మాయి స్తుతి, అబ్బాయి స్మరణ్‌ అని చెప్తాను. ఎందుకంటే నిన్నే కొడుకుగా భావిస్తా కాబట్టి. నా మనసులో ఉన్న కొడుకు రూపానికి స్మరణ్‌ అని పేరు పెట్టుకున్నా’ అని నాన్న చెప్తుంటే ఎంత హ్యాపీగా అనిపించింది!
అలాంటి నాన్న ఇవాళ తన మాట ఎందుకు కాదంటున్నాడు? తనూ, నాన్న ఒకరి కోసం మరొకరు చిన్న చిన్న సరదాలు త్యాగం చేయడం, ఒకరి కోసం ఒకరు ఎదుటివారి ఇష్టాల్ని గౌరవించడం చేశారు. కానీ, మరివాళ ఇదేంటి?
ఒక హోటల్‌కి వెళ్లినా తనకిష్టమైన మెనూనే ఆర్డర్‌ చేస్తాడు.
ఒక సినిమాకి వెళితే తనకిష్టమైన మహేష్‌బాబు సినిమాకే అమ్మా, నాన్న వస్తారు. అమ్మకి హిందీ సినిమాలిష్టం. తనకీ, నాన్నకీ ఇంగ్లీషు సినిమాలు, తెలుగులో మహేష్‌బాబు సినిమాలిష్టం. ఎప్పుడూ తన ఇష్టానికే నాన్న ప్రాధాన్యత నిచ్చాడు. ఇవాళెందుకు అంత భీకరంగా నరసింహస్వామి అవతారం ఎత్తాడు?
స్తుతికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
తండ్రి మీద నమ్మకంతో తన మాట కాదనడన్న విశ్వాసంతో శరత్‌కి మాట ఇచ్చింది. ‘మా నాన్నకి నేనంటే ప్రాణం. నేను ఎవరిని చేసుకుంటానన్నా కాదనడు. నువ్వేం వర్రీ అవకు శరత్‌… ఆస్తి గురించి ఎప్పుడూ నాన్నకి పట్టింపులు ఉండవు. పైగా నువ్వు ఎంటెక్‌ చదివావు. అందమైనవాడివి. మంచి జాబ్‌ ఉంది. ఇంక కాదనడానికి రీజన్‌ ఏముంది?’ అంది తను.
‘మన కులం ఒకటి కాదు. పైగా మీలాగా మేము ఫైనాన్షియల్‌గా సౌండ్‌ కాదు. నా వెనక ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు ఉన్నారు. మీ నాన్నగారు ఒప్పుకుంటారని నాకనిపించడం లేదు’ అన్నాడు దిగులుగా.
స్తుతి, శరత్‌ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఒకసారి స్తుతి కాలేజీ నుంచి వచ్చేటప్పుడు బాగా వర్షం పడుతుండడంతో ఒక్క ఆటో కూడా దొరకలేదు. అప్పుడే శరత్‌ అనుకోకుండా స్తుతివాళ్ల కాలేజీ ముందునుంచి బండిమీద వెళుతూ ఆమెని చూశాడు. ముందు ‘అయ్యో! ఆడపిల్ల వర్షంలో తడుస్తోందని’ లిఫ్ట్‌ ఇచ్చాడు. తరవాత ఆమె మాటలు, అమాయకత్వం అతడిని, అతని పర్సనాలిటీ, గంభీరమైన స్వరం ఆమెని ఆకర్షించి పరస్పరం ఫోన్‌ నెంబర్లు ఇచ్చుకుని ఆ తరువాత తరచూ కలవడం, కబుర్లు, నవ్వులు, కేరింతలు సరదాగా అప్పుడప్పుడూ సినిమాలు, షికార్లు చిన్న చినుకులా మొదలైన ప్రేమ జడివాన అవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ జడివానలో తలమునకలుగా తడిసిపోయి ఉంది. ఆమె వయసు, అతని పట్ల ఆకర్షణ అతనే నీ జీవితం అని ఢంకా బజాయించి చెబుతున్నట్టుగా అనిపిస్తోంది.
ఇప్పుడు ఇద్దరి చదువులు పూర్తి అయాయి. శరత్‌ని తల్లిదండ్రులకి పరిచయం చేసి వాళ్ల అనుమతి తీసుకోవాలని స్తుతి, ఒకసారి స్తుతి తరఫునుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చాక లాంఛనంగా తన తల్లిదండ్రులకి ఆమెని పరిచయం చేయాలని శరత్‌ అనుకున్నారు. శరత్‌ ఇంట్లో స్తుతిని కాదనడానికి కారణాలేం లేవు. కాని స్తుతి తండ్రి మోహనరావుకి మాత్రం చాలా కారణాలు కనిపించాయి.
ఆయనకి కూతురంటే పంచప్రాణాలు. ఆమెని ఐఏఎస్‌ ఆఫీసర్‌కి ఇచ్చి పెళ్లి చేయాలన్నది ఆయన కోరిక. స్తుతికి కాబోయే వరుడికి ఏ బాదరబందీలు, బాధ్యతలు ఉండకూడదనేది మరో కోరిక. ప్రస్తుతం స్తుతి ఇంట్లో పూచికపుల్ల కూడా తీసి అవతల పెట్టదు. ఆమెకి స్టవ్‌ వెలిగించడం కూడా నేర్పలేదు ఆమె తల్లి ప్రసన్న.
అలాంటిది తన కూతురు అత్తారింటికి వెళ్లి అత్తగారికి, మామగారికి, మరుదులకి, ఆడబిడ్డకీ సేవలు చేయడమా? ఆస్తిపాస్తులు లేకపోగా, ఇంటినిండా జనం ఉన్న ఇంటికి వెళ్తానంటుంది. దీనికి బుద్ధి ఉందా? ఆయనకి కూతురు తెలివితక్కువ నిర్ణయం తీసుకోవడం పట్ల కడుపు రగిలిపోతోంది. దాన్ని ఎంత గారం చేసినా దాని మాటకి ఇంతకాలం ఎంత విలువ ఇచ్చినా ఈ విషయంలో మాత్రం ఒప్పుకునేది లేదు.
ఖచ్చితంగా అన్నాడు భార్యతో ”రేపట్నించీ దాన్ని బైటకి వెళ్లనివ్వకు. వారం రోజుల్లో నేను మంచి సంబంధం చూస్తాను.”
అయితే ఆ రాత్రే కూతురు ఇంట్లోంచి వెళ్లిపోతుందని ఊహించని ఆ దంపతులు తెల్లవారి లేచి ఖాళీగా ఉన్న స్తుతి మంచం చూసి స్థాణువులైపోయారు.
ఎంత పనిచేసింది స్తుతి… ఎంత దైర్యం? ఎలా వచ్చింది దీనికింత ధైర్యం? అంటే కని పెంచి, కంటిపాపలా చూసుకున్న అమ్మా, నాన్నల కన్నా వయసు ప్రభావంతో తాత్కాలిక మోహం పెంచుకున్న ఆ కుర్రవాడు ముఖ్యమా? ఇంతేనా ఆడపిల్లలు… వీళ్లని కంటిరెప్పలా పెంచుకోవడం తల్లిదండ్రుల తప్పా?
ప్రసన్న గుండె పగిలేలా ఏడుస్తుంటే గుండెల్లో ఎగిసిపడే దుఃఖానికి అక్కడే ఆనకట్ట కట్టేసి కఠినంగా అనుకున్నాడు మోహనరావు… ”ఆడపిల్ల అని ఊరికే అనలేదు. ఇది ఆడ పిల్లే…” అని.
రెండురోజులు గడిచాయి.
స్తుతి పుట్టిన తరువాత మొదటిసారిగా ఆ ఇంట్లో ఆ పిల్ల లేని లోటు కనిపిస్తోంది. అది కూడా భయంకరంగా, ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నా, మోహనరావు చెవులకి కూతురు మెత్తటి పాదాల శబ్దం, సెలయేటి గలగలలాంటి ఆమె నవ్వు తెరలు తెరలుగా హృదయాన్ని తాకుతుంటే తుపానులో చిగురాకులా కంపించిపోతున్నాడు.
‘కారు కూడా లేదు.. నెలకి నలభై వేల జీతం ఒక జీతమా? ఎలా బతుకుతోందో!
ఒక మధ్యతరగతి ఇంట్లో అత్తగారికి, మామగారికి సేవలు చేస్తూ, ఇంటిల్లిపాదికీ వండిపెడుతూ, అయ్యో! నా తల్లీ! నీకు స్టవ్‌ వెలిగించడం కూడా రాదు. అంతమందికి ఎలా వండిపెడుతున్నావమ్మా?’ ఆయన గుండెల్లో బాధ సుడులు తిరుగుతోంది. కళ్లల్లో తడి ఆరడం లేదు. భార్య ఒడిలో తల పెట్టుకుని బావురుమన్నాడు.
”నేనేం తక్కువ చేశాను ప్రసన్నా దానికి… దాని సుఖం, సంతోషం కోరడం తప్పా? ఏడాది కూడా కాకుండానే అతని ప్రేమమైకం దాన్నలా చుట్టేసి ఇరవై ఏళ్ల నుంచీ కంటికి రెప్పలా కాపాడిన నన్ను కాదనేంత ధైర్యం ఎలా వచ్చింది?” అంటూ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న భర్తని ఎలా ఓదార్చాలో, తన గుండెల్లో రగులుతున్న బడబాగ్ని ఎలా చల్లార్చుకోవాలో తెలియక తల్లడిల్లిపోసాగింది ప్రసన్న.
ఇద్దరి కంటికి కునుకు లేదు. కడుపులో మెతుకు పడడం లేదు. ఇంట్లో పొయ్యి వెలిగించిన పాపాన పోలేదు. ఆ నిశ్శబ్దంలో వాళ్లిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకునే ఓపిక కూడా లేకుండా నిస్సత్తువగా, నిర్జీవంగా కూర్చున్నారు.
‘చిన్నప్పటినుంచీ తను అడిగిందేదీ నేను కాదనలేదు. ఇవాళ నాలో ఇంత కాఠిన్యం ఎందుకిచ్చావు దేవుడా! ఎందుకిలా ప్రవర్తించాను. నాకున్న ఆస్తి ఇచ్చేసి తను కోరుకున్న వాడికిచ్చి పెళ్లి చేస్తే పిల్ల ఇలా నా ఇంట్లోనుంచి వెళ్లిపోయేదా? నన్ను వదిలిపెట్టేదా? ఎందుకిలా చేశాను?’ మోహనరావులో సన్నగా మధన…కానీ ఎలా? ఐఎయస్‌ ఆఫీసర్ని చేయాలనుకున్నాను. ఇలా ఎలా ఒప్పుకోను? ఘర్షణ… సంఘర్షణ…
మూడోరోజు…కాలింగ్‌ బెల్‌ మోగింది.
ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ‘ఎవరొచ్చారో… స్తుతి ఏదంటే సమాధానం ఏం చెప్పాలి? తన పరువేమన్నా ఉంటుందా?’ ఆయన మనసులో ఆలోచన.
‘ఎవరొచ్చారో? పనిమనిషిని కూడా రెండు రోజులు రావద్దని మొన్ననే చెప్పేసింది. పాలవాడికి ఊరు వెళ్తున్నాం పాలు వద్దని చెప్పింది. మరి ఎవరు వచ్చినట్టు! కొంపదీసి బంధువులెవరన్నా… ఏమని చెప్పాలి?’ ప్రసన్న గుండె దడదడలాడింది. ఒకరినొకరు ఆసరాగా చేసుకుని వణికిపోతున్న శరీరాలని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ వెళ్లి తలుపు తీశారు.
సుడిగాలిలా వచ్చి గుండెల మీద వాలింది స్తుతి.
నిశ్చేష్టుడై పడిపోబోతున్న కూతుర్ని అప్రయత్నంగా రెండు చేతుల్తో చుట్టేసి గుండెకి అదుముకున్నాడు మోహనరావు.
”మీరు కాదన్నారన్న కోపంతో, ఎలాగైనా తన మాటే నెగ్గించుకోవాలన్న కసితో ఆ రాత్రి మా ఇంటికి వచ్చింది అంకుల్‌. నేను వెంటనే తీసుకొచ్చి మీకు అప్పగించాలనుకున్నాను. కానీ తను ఆవేశంలో ఉంది. నా మాట కూడా వినలేదు. అందుకే మా అమ్మానాన్నా కొంచెం ఆవేశం తగ్గనీరా తీసికెళ్లి దింపుదువుగాని అన్నారు. కానీ, వచ్చిన మరుక్షణం నుంచీ నాన్న, నాన్న అని ఏడుస్తూనే ఉంది. మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. కనీసం మీ దగ్గరకు తీసుకొస్తానంటే కూడా వీల్లేదంది.
ఆయనే నన్ను వదులుకున్నప్పుడు నాకేం అవసరం? నాకేనా పట్టుదల లేనిది! ఆయన నన్ను వదిలి ఉండగా లేనిది నేనుండలేనా? నాకు నువ్వున్నావు చాలు. పద మనం పెళ్లిచేసుకుందాం. ఆయనకి బుద్ధి రావాలంటే మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి అందే గానీ, మిమ్మల్ని తల్చుకుని కుమిలిపోని క్షణం లేదు. అందుకే తీసుకొచ్చేశాను అంకుల్‌…”
”నాకు తనమీద ఎంత ప్రేమ ఉన్నా మీ అనుమతి, ఆశీర్వాదం లేకుండా తనని పెళ్లి చేసుకుని సుఖపడలేను. కాకపోతే ఒకటి ప్రామిస్‌ చేస్తున్నాను. మీరెంత అపురూపంగా చూసుకున్నారో మీ అమ్మాయిని నేనూ అలాగే చూసు కుంటాను. ఏనాడూ తనని కష్టపెట్టను” వినయంగా, ఎంతో సంస్కారవంతంగా మాట్లాడుతున్న శరత్‌ వైపు ముగ్ధుడై చూశాడు మోహనరావు.
నా కూతురు ఎంచుకున్న వ్యక్తి ఇంత గొప్పవాడా అనుకున్నాడు.
”నాన్నా! సారీ నాన్నా! నీ కిష్టం లేకుండా నేను ఇకనుంచీ ఏం చేయను నాన్నా… నువ్వు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తేనే శరత్‌ని పెళ్లిచేసుకుంటాను. నిజం నాన్నా! నన్ను నమ్ము” అంటున్న స్తుతిని దగ్గరగా, మరింత దగ్గరగా అభయం ఇస్తున్నట్టుగా పొదుపుకున్నాడు మోహనరావు.
కన్నీళ్లు ధారాపాతంగా కారుతుంటే ఆ తండ్రీ కూతుళ్లవైపు నిశ్చేష్టురాలై చూడసాగింది ప్రసన్న. వాళ్లని చూస్తున్న శరత్‌ కళ్లనుంచి చిన్న ప్రేమ చినుకు రాలి పడి ‘శభాష్‌ శరత్‌’ అని భుజం చరిచినట్టు అనిపించింది.

కథా విశ్లేషణ: మంథా భానుమతి

”చిన్నప్పట్నుంచీ అడిగిన ప్రతీదీ కాదనకుండా ఇచ్చావు. మరి జీవితాంతం నేను కలసి బ్రతకవలసిన వ్యక్తిని అడిగితే ఎందుకివ్వవు నాన్నా?” ఎప్పుడో స్వయంవరాలుండే కాలంలో కూతురు ఎవర్ని వరిస్తే వాళ్లనిచ్చి వివాహం చేశారేమో కానీ, ఈ ఇరవై, ఇరవై ఒకటో శతాబ్దాలలో తరచుగా పై విధంగా అడిగే కూతుళ్లని గమనిస్తూనే ఉంటాం. ఈ విధంగా అడిగే కూతుళ్లను సినిమాల్లో, కథల్లో కూడా చూస్తుంటాం.
తండ్రి తన మాట కాదన్నాడన్న కోపంతోనో, ప్రేమించినవాడి మీదనున్న నమ్మకంతో ఇల్లు వదిలిపోయిన అమ్మాయి రెండు రకాలుగా ప్రవర్తిస్తుంది. ఒకటి తల్లిదండ్రులని మర్చిపోయి, నచ్చినవాడితో హాయిగా ఉండి, అతను మంచివాడయితే మంచి జీవితం, చెడ్డవాడయితే హీనంగా బ్రతకడం. రెండవది, తండ్రిని, తల్లిని అనుక్షణం తలుచుకుంటూ, ఏడుస్తూ తన చుట్టూ ఉన్నవారికి మనశ్శాంతి లేకుండా చెయ్యడం.
అత్తలూరి విజయలక్ష్మిగారి కథలో స్తుతి రెండవ రకంగా ప్రవర్తిస్తుంది. తను ప్రేమించిన యువకుడు, అతని కుటుంబం ఎంతో మంచివాళ్లు కనుక, అమ్మాయిని తండ్రికప్పగించి, ఆయనకి ఇష్టమైతేనే పెళ్లి జరుగుతుందని చెప్తారు. కథ సుఖాంతం అవుతుంది.
అత్తలూరి విజయలక్ష్మిగారి శైలి అత్యంత సరళం. ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా చదువరుల మనస్సులకి ఇట్టే హత్తుకునేలా చేసేస్తారు. చదివించే శక్తి చాలా ఉంది. ఎన్నో నవలలు, మరెన్నో కథలు, నాటికలు… అన్ని ప్రక్రియలలోనూ ఆరితేరిన రచయిత్రి. ఈ కథకి ‘చినుకు’ అని పేరు పెట్టడంలోనే వారి ప్రతిభ అర్థమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *