May 7, 2024

ఇటుక బట్టీలు – ఒక కల

రచన:- రామా చంద్రమౌళి

ramachandramouli

 

 

 

 

 

 

 

….

ఒక్కోసారి కల.. అమాంతం సింహమై దూకుతుంది పైకి
శరీరం చిరిగిపోతూంటుంది
కొవ్వొత్తి గాజుకుండీలో వెలుగుతూ ఉండగానే
దేహం కరిగి కరిగి ..  నిశ్శబ్ద సంగీతంలో ప్రవహిస్తూ ప్రవహిస్తూ
రెండు చేతులు.. అలా  తామర రేకుల్లా విస్తరిస్తూ వస్తాయి
వక్షాన్ని.. వీపును.. తలను.. తొడలను.. అరికాళ్ళను
తాకి తాకి..స్పర్శించి స్పర్శించి
మనిషి   నిశ్శేషమై  పోతూండగా . ..క్రమంగా నిద్రలో
గాలిలో కాగితం ముక్క..ఎటో తేలిపోతూ
చటుక్కున ఒక ఆయుధం మొలుస్తుంది మొలలోనుండి
బహుముఖీనం.. ముఖబహుళ వివర్తనం…సర్జింగ్
ఖడ్గ ప్రహారాలు చరిత్రనిండా
రాజ్యాలు కూలిపోతూ.. మనుషులు మరణిస్తూ.. అంతా రక్తసిక్తం –

ఇవాళ ఉంటుంది.. అదే సత్యం.. రేపు ఉండదు
కాలాలు మూడనేది తప్పు
గతం,వర్తమానమే.. చాలా మందికి భవిష్యత్తే లేదు
ఫ్యూజన్  సంగీతం.. ఫ్యూజన్   కల్చర్.. డాన్స్ ఇన్ ఫ్యూజన్
కరిగిపో కరిగిపో.. మైనపు ముద్దవలె..వెన్నపొరవలె.. కన్నీటి తెరవలె
కరగవలసింది కరిగిన తర్వాత
కరగనిదేదో, అరగనిదేదో, చెరగనిదేదో.. అది బైటపడ్తుంది
అప్పుడు ప్రాకుతూ, దేకుతూ కదుల్తున్నపుడు
చుట్టూ గాజుగది..కనిపించదెవరికీ.. కాని ఉంటుంది ఆవరించి
గాలి అందదు
కుక్కపిల్ల.. ముద్దుగానే..నాలుకతో నాకుతూ
గుండెను గీకుతుంది పదిగోళ్ళతో
హింసించబడ్డ ప్రతిసారీ రక్తం రాదు
అప్పుడు కన్నీళ్ళు రక్తానికి   ప్రత్యామ్నాయమని  తెలుస్తూంటుంది

పక్షిని పట్టుకుంటావు  దోసిట్లో
రెండు రెక్కలు.. రెండు చేతులు.. లోపల ఒక ఆత్మ
ఒక ‘ ఏరో ఫాయిల్ ‘..ఎగిరిపో..విముక్తమై
ఎక్కడ ఎంతసేపు తన్నుకుని తన్నుకుని ధ్వంసించుకున్నా ఏమున్నది
కొన్ని పేకముక్కలు.. కొన్ని విస్కీ గ్లాసులు
మరికొన్ని మురుక్కాలువలు.. అంతే,
అరే బాబూ.. అవి ఇటుక బట్టీల్రా
పైన ఒట్టి పచ్చి మట్టిపూతే ..కాని లోపల ఎర్రగా నిప్పు
వెదుకుతూ వెదుకుతూ..,
కలలను ఛేదిస్తూ ఛేదిస్తూ.. పోగా పోగా
అన్నీ శిధిల సామ్రాజ్యాలు..
రక్తరచిత  చరిత్రలు.. మట్టిలో మనుష్య పురాస్మృతులు
పాదాలకింద..శ్వాసిస్తూ..ఒక వారసత్వం
స్వప్నం రమ్మంటే రానిది.. వద్దంటే పోనిది
ప్రతిరాత్రీ..ఒక అనిశ్చిత ప్రశ్న.. కల –
జవాబు ఉందా.. ?
ఈ రోజు నీకు కల వస్తుందా..? వస్తే  ఏమిటది.?
– చెప్పు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *