April 26, 2024

నాన్నకు ఆసరా… (తండ్రి – కూతురు)

– పి. వసంతలక్ష్మి lakshmi vasanta

గౌతమి తన ముందు ఆగిన కార్లు చూస్తూ, పెద్ద జామ్‌ అయినట్టే ఉంది ముందు జంక్షన్‌లో అనుకుని నిట్టూర్చింది. ఇంటికి ఎంత తొందరగా వెళ్లిపోదామా అని హడావిడి పడిన రోజే అన్నీ ఇలా జరుగుతాయి. పిల్లలని స్కూల్‌ నుంచి తీసుకువెళ్లాలి, ఎలా అని ఆలోచిస్తూ ఎలీజాకి మెసేజ్‌ పంపింది. ‘తన పిల్లలకి అమ్మ వస్తుంది. అక్కడే ఉండమని’ చెప్పమని.
మన  దేశంలోలాగా, ఇక్కడ ఎవరికో ఒకరికి పిల్లలని అప్పజెప్పరు. ఇక్కడ సుఖాలు అనుభవిస్తున్నప్పుడు కొన్ని కష్టాలకి కూడా తయారవక తప్పదు అంటూ మరోసారి నిట్టూర్చింది.
ఇండియా నుంచి రాజ్‌ వచ్చాడు. నాన్నని కలిశాడుట, ఆరోగ్యంగా బాగానే ఉన్నానని చెప్పమన్నారుట.
గౌతమికి పోస్ట్‌ చేయాలని ఉత్తరం రాసి ఉంచాను, సమయానికి వచ్చావు రాజ్‌ అంటూ ఆప్యాయంగా చేయి పట్టుకుని, వీలు చూసుకుని నన్ను చూడడానికి వచ్చావు, మా గౌతమి మరీ మరీ చెప్పి ఉంటుంది అంటూ నవ్వి, ఈ ఉత్తరం కవర్‌లో పెట్టి, రాజ్‌ చేతిలో పెట్టి, మా తోటలో పండించిన పళ్లు అంటూ అరడజను చక్రకేళీ అరటిపళ్లు మరో కాగితం సంచిలో వేసి యిచ్చారుట.
రాజ్‌ ఒకటే చెప్పడం, మీ నాన్నగారు ఎంత బాగా అలవాటు పడిపోయారో, ఉదయం ప్రార్థన, తర్వాత ఒక అరగంట యోగా, ఆపై స్నానం, తేలికగా ఉపాహారం, పేపర్‌ చదువుకోవడం, వంటగదిలో కాని, తోటలో కాని, ఎవరికి తోచిన పని వారు చేయచ్చుట. మా అమ్మ, నాన్నగారిని కూడా ఒప్పించగలిగితే బాగుండును. ఆ పాత ఇల్లు వదలరు. సొంత ఇల్లు మమకారం, మేం నలుగురం పిల్లలం ఉన్నా అందరం తలో చోటా ఉన్నాం. ఇప్పటివరకు అక్క చూస్తూ ఉండేది వారి మంచిచెడ్డలు. తనూ పెద్దదై పోయి నా వల్ల కాదురా రాజ్‌! అంటుందిట. రాజ్‌ వాళ్లు మలయాళీలు, కానీ హైదరాబాద్‌లోనే సెటిల్‌ అయారు.
ఒక్క నిముషం నోరు మూసుకోడు, అలా గలగలా మాట్లాడుతూ ఉంటాడు, పని చేసుకుంటూ కూడా, ఇద్దరం ఒకే టీమ్‌, మంచి స్నేహితులం అయిపోయాం. సుమ మీకు దగ్గర చుట్టమా? అని ఏడిపిస్తూ ఉంటాను.
చందూ కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమే కానీ టూర్లు ఎక్కువ, దాంతో స్నేహితుల సాయం తీసుకోక తప్పదు. పిల్లలకి స్కూల్‌లో చదువు కాక రకరకాల వ్యాపకాలు, మనదేశంలో అయితే ఒక ఆటో మాట్లాడి పంపించేస్తాం పిల్లలని. ఇక్కడ అలా కాదు, మనమే దింపాలి. తీసుకురావాలి. ప్రాజెక్ట్‌ డెడ్‌లైన్‌ అంటూ నూరిపోస్తున్నారు. ఇంటికి కూడా ఒక్కోరోజు పని మోసుకురావాల్సి వస్తోంది. ఉద్యోగం మానేసి, పిల్లల్ని బాగా చూసుకుంటూ అచ్చమైన గృహిణిలా ఉండిపోదామా అని మనసు లాగుతుంది. కానీ, కొత్తగా తీసుకున్న ఇల్లు, రెండు కారులమీద అప్పులు, పిల్లల చదువులు కాక ఇతరత్రా ఖర్చులు, ఎదురుగా కనిపించేసరికి మరి ఆ ఆలోచనే రాదు.
మరో పది నిముషాలు పట్టేలా ఉంది అనుకుని గౌతమి తన హాండ్‌బాగ్‌లో ఉత్తరం కోసం తడుముతూ, వెతికింది. చేతికి తగిలిన అట్ట తీసి చూస్తే ఎర్రటి బొట్టు బిళ్లల అట్ట… ఇదొక ఫార్సు అని నిట్టూర్చింది.
ఇక్కడికి వచ్చిన కొత్తలో బొట్టు లేకుండా బయటికి రావడం అనేది ఊహించనిది. ఈ పాంట్లూ, చొక్కాలు అలవాటు అయాక, కనీ కనిపించని నల్లబొట్టు చిన్నది ఉందా, లేదా అన్నట్టు పెట్టుకోవడం, అదీ ఎప్పుడో మర్చిపోయింది. ఉరుకులు, పరుగులు, చేతికి ఏది అందితే అది వేసుకుని తొమ్మిది కల్లా ఇంట్లోంచి బయటపడడం అనేది రోజూ ఒక బ్రహ్మ ప్రయత్నమే. చందూ ఉంటే చాలా నయం. పిల్లలని దింపడం అదీ తను చేస్తాడు.
మొదట్లో ఈ బొట్టుమీద ఎంత గొడవ జరిగింది. బోసిగా ఉన్న నీ మొహం చూడలేకపోతున్నాను అంటున్నాడని, ఇలా బాగ్‌లో ఒక స్టిక్కర్ల అట్ట పడేసుకుని, ఇంటికి రాగానే కారు గరేజ్‌లో పెడుతూ, అద్దంలో చూసుకుని స్టిక్కర్‌ ఒకటి అంటించుకుని రావడం, తనకెందుకో అంతమంది నానాజాతి ఉద్యోగస్తులతో కలవాలంటే ఇలా బొట్టు పెట్టుకోవడం ఒక అవరోధంలాగా అనిపించేది. అందుకే ఆఫీసు దుస్తులకి మాచింగ్‌గా బోసి మొహమే అలవాటు చేసుకుంది.
ఒక్కసారి ఎందుకో అమ్మ గుర్తువచ్చి, కళ్లు తడి అయాయి. అమ్మే ఉంటే, నాన్న ఇలా హోంలో ఉండాల్సి వచ్చేదా?
ఎప్పుడూ నుదుటిమీద గుండ్రంగా తిలకం బొట్టు పెట్టుకునేది, నిండైన మొహం… అమ్మ పోలిక కూతురు నిత్యకి వచ్చింది, తనదీ గుండ్రని మొహమే, అఖిల్‌కి మళ్లీ నాన్న పోలిక.
ఆరునెలల్లో అంతా అయిపోయింది. బ్రెయిన్‌ ట్యూమర్‌ అన్నారు. నాన్నకి ఈ సెల్‌ఫోన్‌ అంటే దాంతో ద్వేషం, తన దగ్గర సెల్‌ ఉంచుకోరు. నాతో మీరు రోజూ ఎలాగూ మాట్లాడరు. రూమ్‌లో ఉండే ఫోన్‌కి చేయండి చాలు అంటారు.
అమ్మ పోగానే, నాన్న నేను ఒంటరిగా ఈ ఇల్లు, అవీ చూసుకోలేను అని చెప్పి, ఊరికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో కట్టిన ఈ ప్రశాంతి హోమ్‌లో జీవిత సభ్యత్వం తీసుకుని, అక్కడికి మారిపోయారు. అతిథులకి ఒక చిన్న ఇల్లు అవీ ఉన్నాయి. కాని, అమ్మ లేకపోవడంతో తను, తమ్ముడూ కూడా వెళ్లాలని అంతగా అనిపించక అశ్రద్ధ చేస్తున్నాం అనుకుంది గౌతమి.
మూడేళ్లు అయింది. ఫోన్లలో మాటలు, ఎవరైనా వెళితే ఇక్కడనుంచి ఫోటోలు పంపించడం. కంప్యూటర్‌, నెట్‌… ఈ సదుపాయాలేవీ నాకు వద్దు అని ఖరాఖండిగా చెప్పేశారు నాన్న.
ఒక పదేళ్లలో ఎన్ని మార్పులు తమ జీవితాలలో. అందరినీ కట్టి ఉంచే సూత్రధారి అమ్మ లేకపోవడంతో అందరం చెల్లాచెదురయిపోయాం. గౌతమి మనసు ఈ జ్ఞాపకాలతో భారం అయి, చిన్నగా తలనొప్పి కూడా మొదలయింది.
పచ్చలైటు పడి, కారులు కదిలేసరికి మరో పది నిముషాలు ఎక్కువే పట్టింది. అందరూ ఆఫీసులనుండి ఇంటికి తిరిగి వెళ్లే సమయం ఇది. దారిలో పిల్లలని ఎక్కించుకుని, ఇంటికి చేరేసరికి, చీకటి పడిపోయింది. అబ్బ! వెలుగుచూసి అసలు ఎన్ని నెలలు అయిందో! ఏమిటో ఈ దేశంలో కఠినమైన వాతావరణాలు, పోనీ అన్నీ ఎత్తిపట్టి మనదేశానికి వెళ్లిపోదామా అని ఒక ఆలోచన. అప్పుడప్పుడు.. ముందు పిల్లలకి ఏదో వండి పెట్టాలి. వంటా, భోజనాలు అయేసరికి రాత్రి పది. మంచం మీద అలసటగా వాలడమూ, నిద్రపోవడమూ ఒక్కసారే… మళ్లీ తెల్లవారి ఆరుగంటల అలారంకి మెలకువ వచ్చి, రోజు మొదలు, ఇంక ఉరుకులు, పరుగులు అనుకుంటూ, ఎలాగో సమయానికి ఆఫీసుకి చేరింది గౌతమి.
రాజ్‌ ఎదురుగా కనపడి విష్‌ చేసేసరికి గుర్తు వచ్చింది. నాన్న రాసిన ఉత్తరం చదవనే లేదు అని. ఇంత రాచకార్యం ఏంచేస్తున్నావు అని ఎవరైనా అడిగితే అసలు సమాధానం ఏముంది? అమ్మ ఒక్కసారి ముందు కనిపించి, అమ్మలూ నాన్న రాసిన ఉత్తరం చదవడానికి కూడా తీరిక లేదా అని అడుగుతున్నట్టు అనిపించి, ఒక్కసారి చాలా తప్పు చేసిన అనుభూతి కలిగింది.  అప్పటికే పని ముందు పెద్దకొండలా అనిపించి, అందులో పడిపోయింది గౌతమి, మరో ఆలోచన లేకుండా.
రాజ్‌ మధ్యలో ఒక వార్త పట్టుకువచ్చాడు. విక్టర్‌ ఒక పార్టీ ఇస్తున్నాడుట. ఎందుకని అడిగితే జాన్‌తో అతని పదేళ్ల సహజీవనం విజయోత్సవం అని నవ్వుతూ చెప్పాడు. ఈ దేశంలో ఇవన్నీ మొదట్లో కొత్తగా, చిరాకుగా కూడా అనిపించేవి, రాను రానూ ఇవీ అలవాటు అయాయి.
తమ జీవితానందమే ముఖ్యం అంటారు. కుటుంబం కోసమో, కొందరి కోసమో తమ జీవితాలు, ప్రేమలూ, అలవాట్లూ ఎందుకు మార్చుకోవాలి అని చాలా సూటిగా అడుగుతారు.
మనదేశంలో అయితే పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య బాంధవ్యం. వారి పుట్టుపూర్వోత్తరాలు చూస్తారు. పరువు ప్రతిష్ఠ అంటారు. అమ్మ ఎప్పుడూ అనేది, ఇరువేపులా మీకు అండదండలుండాలి ఎప్పుడూనూ అని.
అత్తగారు, మామగారు కూడా ఏడాది గడువులో పెద్ద సుస్తీ లేకుండానే పోయారు. దాంతోనే అనుకుంటా మాకు మన దేశంతో సంబంధాలు మరీ తక్కువైపోయాయి. గౌతమి తనలో తాను ఈ రెండ్రోజుల నుంచి, నా మనసు అక్కడ, శరీరం ఇక్కడలాగా గడిపాను. నాన్న రాసిన ఉత్తరం ఈ రోజయినా చదవాలి అనుకుంటూ బ్రేక్‌లో కేఫిటేరియాకి బయలుదేరింది.
దారిలో ‘కేధీ’ కనిపించింది. వేరే టీమ్‌లో పనిచేస్తున్నా పరిచయం, స్నేహం వరకు ముదిరింది. ‘కేధీ’ నవ్వుతూ పలకరించింది. ఈ మధ్యనే మూడు నెలల క్రితం తన అమ్మగారు హోమ్‌లోనే పోయారు. ఆవిడ అల్జీమర్స్‌ అనే వ్యాధితో బాధపడి పోయారు.
కేధీ చెప్పింది, అమ్మ పోయిన దుఃఖం తట్టుకోలేక ష్రింక్‌ దగ్గరకి వెళ్లాను. ఇంకా చాలా సిట్టింగ్స్‌ ఉన్నాయి అని.
ఈ దేశంలో ఇలాంటివి వినడం కొత్తేమీ కాదు గౌతమికి. ఒక్కసారి తుళ్లిపడింది కేధీ అన్న మాటలకి. ఆ ష్రింక్‌ అన్నాడు, ‘నువ్వు మీ అమ్మ మరణాన్ని నీ బాధ్యతగా భావించి, తప్పు చేశాను అన్న గిల్టీ భావనల నుంచి బయటపడేవరకూ ఈ సిట్టింగ్స్‌ ఉంటాయి అన్నాడు గౌతమీ’ అంటూ…
ఈ మాటలు వినగానే గౌతమికి తనలో ఉన్న అపరాధభావం ఒక్కసారి బయటపడి నిలదీస్తున్నట్టు అన్పించింది.
కాఫీ తాగుతూ కేధీకి బై చెప్పి, స్తిమితంగా బ్యాగ్‌లోంచి నాన్న రాసిన ఉత్తరం తెరిచి చదవడం మొదలుపెట్టింది.
అమ్మలూ! శ్రీలూ!
(అమ్మ మా యిద్దరినీ అలా పిలిచేది!) నాన్న రాసే ఉత్తరం… మీ ఇద్దరికీ కలిపి రాస్తున్న ఉత్తరం ఇది.
ఈ హోమ్‌లో నాకు అంతా చాలా సుఖంగా, సాఫీగా సాగిపోతున్నది. నాకిష్టమైన తోటపని చేస్తున్నాను. పళ్లు, కూరగాయలు పెంచుతాను నేను. అవే నాకు ఇష్టం. వేరే మొక్కల పెంపకం మీద అంతగా శ్రద్ధ ఉండేది కాదు ప్రమద్వర వచ్చేవరకు. ఆమెకి పూలంటే ప్రాణం. ఇద్దరం తోటపనుల దగ్గర పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఒకరి కుటుంబ విషయాలు ఒకరం పంచుకున్నాం. ఆమెకి 60 ఏళ్లు పైబడి ఉంటాయి. పెళ్లి కాలేదు. తమ్ముళ్లు, చెల్లెళ్లని చదివించి వారికి పెళ్లిళ్లు అవీ చేసిన ఒక మధ్యతరగతి ఆడపిల్ల కథే ఈమెది.
రిటైర్‌ అవగానే ఎవరిమీదా ఆధారపడి ఉండడం ఇష్టం లేక ఈ హోంలో చేరిపోయింది తన సంపాదనతోనే ఒక గది కొనుక్కుని. అలా మా ఇద్దరి పరిచయం పెరుగుతూ ఉంటే మా అభిప్రాయాలు, అభిరుచులు కూడా చాలా కలుస్తున్నట్టు తోచాయి. అభిమానాలు పెరిగాయి.
ఆరు నెలల క్రితం నాకు వైరల్‌ జ్వరం వచ్చి చాలా నీరసించిపోయాను. మీరు కంగారుపడతారని మీకు చెప్పలేదు. (గౌతమి – ఏం చేసేవాళ్లం నాన్నా! ఫోన్‌లో పలకరింపులేగా!) ఆ సమయంలో ప్రమద్వర నాకు చాలా సేవలు చేసి, తిరిగి మామూలు మనిషిని చేసింది.
ఇద్దరమూ ఆఖరి దశలో ఉన్నాం, జీవితంలో ఆఖరి ఊపిరి ఆగేవరకు జీవించాలి, తప్పదు. తనకీ నా అన్నవారు కావాలి అన్న ఆలోచన, నాకు ఒక సాహచర్యం కావాలి అన్న ఆలోచనతో జతపడి మేం ఇద్దరం కలిసి యింక భార్యాభర్తలుగా కలసి జీవించాలి అని నిర్ణయించుకున్నాం. తన చెల్లెళ్లు, తమ్ముళ్లు ఒప్పుకోరేమో అని సందేహ పడుతూనే, ఈనాటికైనా నా సంతోషం నేను చూసుకుంటే తప్పేమిటి? అని ప్రమద్వర అంటుంది. నిజమే కదా! తప్పు లేదు కదా! నాకు మటుకు మీరు నా పిల్లలుగా నన్ను అర్థం చేసుకుంటారు అన్న ఆశ ఉంది. నమ్మకం ఉంది. పిల్లలు తాము వివాహం చేసుకుంటాం అని చెప్పి తల్లిదండ్రుల ఆమోదం కోసం అడిగే సందర్భాలు మటుకే మనకు తెలుసు.
ఇప్పుడు తారుమారుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రమద్వరని మీ తల్లిగా కాదు, మన ఇంటి సభ్యురాలిగా అంగీకరిస్తారా?
అమ్మలూ! శ్రీలూ! మీ సమాధానం నాకు చాలా ముఖ్యం. మీ అమ్మని ఏ క్షణమూ నేను మర్చిపోలేదు. ఆమె స్థానం ఎప్పటికీ అదే. మీ అమ్మ నా సహధర్మ చారిణి. మరి ప్రమద్వరో అంటారా! నా ఆఖరి మజిలీకి ఒక స్నేహితపు సాన్నిహిత్య తోడు. తన మెడలో నేను కట్టే తాళి బంధనాల తాళి కాదు, బంధాల  తాళి.
అమ్మలూ! తమ్ముడికి నువ్వు చెప్పు. ఉంటాను తల్లీ!
ప్రేమతో
నాన్నా.
గౌతమి కళ్లల్లోంచి నీళ్లు జలజలా రాలి, రెపరెపలాడుతున్న నాన్న ఉత్తరంపై పడ్డాయి. అక్షింతలులాగా అనుకుని నవ్వింది గౌతమి. మనసు ఇప్పుడు ఎంతో తేలికగా ఉంది.
రేపే తమ్ముడికి చెప్పాలి. ఈ నెలాఖరుకి ఇండియా వెళ్తాను. పిల్లలు వస్తే వస్తారు, లేదా చందూ దగ్గర ఉంటారు. తను మటుకు వెళ్లి తీరుతుంది. ప్రమద్వరని కలవద్దూ! అమ్మా! అమ్మా! అమ్మా! అని ప్రయత్నపూర్వకంగా ప్రాక్టీస్‌ చేస్తున్నట్టు. గౌతమికి తల్లి దొరికింది మళ్లీ. తండ్రి కూడా! దూరం అయిపోయాడు అనుకున్న తండ్రి కూడా దొరికాడు మాకు. గౌతమి సంతృప్తిగా నిట్టూర్చి లేచింది.

కథా విశ్లేషణ
ప్రవాస భారతీయులకి గత పది ఇరవై సంవత్సరాలలో నిరంతరం మదిలో మెదిలే చింత ఒకటే.. ”తాము వృద్ధాప్యంలో చేయూత నివ్వవలసిన తల్లిదండ్రులని వదిలి వచ్చేశాము. ఏంచేస్తున్నారో… ఈ వయసులో అన్ని పనులూ తామే చేసుకోలేక ఎంత అవస్థలు పడుతున్నారో..” అని.
ఇంక తల్లిదండ్రులలో ఒకరు ఒంటరిగా మిగిలిపోతే ఆ బాధ రెట్టింపవుతుంది. వృద్ధాశ్రమాల పద్ధతి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం అందుకుంటోంది ఇక్కడ. తమవారు అక్కడ బాగానే ఉన్నా, దూరాన ఉండి ఏమీ చెయ్యలేని కొడుకులు, కూతుళ్లు నిస్సహాయంగా నిట్టూర్చక మానరు. తాము ఊపిరి సలుపని పనుల్లో మునిగి తేలుతున్నా కూడా.
ఈ సున్నిత విషయాన్ని తీసుకుని చక్కని కథగా మలిచి సుఖాంతం చేశారు వసంతలక్ష్మిగారు.
గౌతమి తన బాధ్యతలలో నిమగ్నమైపోవడం కళ్లకి కట్టినట్లు చూపిస్తారు. తండ్రి చేత్తో రాసి పంపిన ఉత్తరం విప్పి చదవడానికి కూడా తీరిక దొరకదామెకి. కానీ మనసంతా ఆయనమీదే… అమ్మ లేనేలేదు. ఒంటరిగా జీవితాన్ని ఎలా గడుపుతున్నారో అనే ఆలోచనే.
తీరిక చేసుకుని, ఆత్రంగా నాన్న రాసిన ఉత్తరం తెరచి చూసుకున్న గౌతమి ఆశ్చర్యానందాలతో కన్నీరు కారుస్తుంది. కన్నపిల్లలకి తండ్రి సౌఖ్యం, సంతోషం కన్నా కావలసినదేముంటుంది?
ప్రవాసభారతీయురాలైన వసంతలక్ష్మి, తల్లిదండ్రులని వదిలి దూరాన ఉంటున్న యువతి మనోభావాలని ఎంతో బాగా వివరించారు.

9 thoughts on “నాన్నకు ఆసరా… (తండ్రి – కూతురు)

  1. వసంతగారూ!చక్కటి కధాంశం ఎన్నుకున్నారు.చాలా మంచి ముగింపుని,పరిష్కారాన్ని సూచిఃచారు.ఏ భార్యాభర్తల బంధమైనా యాభై ఏళ్ళ తరువాత మరింత దృఢ పడుతుంది.అప్పుడు జీవిత భాగస్విని కోల్పోతే,రెండోవారికి నరకమే!చాలా బావుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *