May 3, 2024

పద్యమాలిక – 1

 

ప్రతీనెలా ఒక లేదా రెండు చిత్రాలకు తగిన పద్యాలు రాయమని పద్యమాలిక అనే గ్రూపులోని కవిమిత్రులని కోరగా ఎన్నో ఎన్నెన్నో పద్యాలు వెల్లువలా వచ్చాయి. ఇవన్నీ మీకోసం మీ మాలిక పత్రికలో…

 

పద్యమాలిక 1

Sankisa Bharadwaja Sankar

దొంగగ వచ్చెను దొంగే
దొంగగ నక్కెను యడుగున దొంగను చూడన్
దొంగను పోలిన దొంగను
దొంగగ చూడక భగవతి దొంగగ మారున్

Chandramouli Suryanaryana

పతిగా నెంచెను దొంగను
సతిగా సేవలను జేసె చక్కగ నంతన్
పతియే ప్రత్యక్షంబయె
నతివ చకితు రాలవంగ నక్కెను దొంగే

పతి :
కంగారెందుకె భామా
దొంగోడేమైన యింట దూరెన చెపుమా
డంగై పోకుము నీకీ
బెంగేలనె నేనులేక పిల్లా నీకున్

ఒంటరి యతివను జూచిన
తుంటరి వాడొకడు పతిగ దూరెను గృహమున్
వింటన్ చప్పు,డసలుపతి
కంటన్ బడకుండ నక్కె ఖట్వము క్రిందన్

J K Mohana Rao

ఆడుచునుండఁగ హరితోఁ
గూడఁగ మఱొక హరి నిల్చె – గుమ్మమునందున్,
ఆఁడది తలఁచే నప్పుడు
వీఁడా హరి, యెవఁడు వాఁడు, – ప్రియుఁ డెవ్వాఁడో?

ఈ చిత్రమును చూచిన పిదప నాకు క్రింది పద్యము జ్ఞాపకమునకు వచ్చినది –

లీలాశుకుని రాసక్రీడాష్టకములో మొదటి పద్యము స్రగ్విణీవృత్తములో క్రిందిది –

అంగనామంగనామంతరే మాధవో,
మాధవం మాధవం చాంతరేణాంగనా
ఇత్థమాకల్పితే మండలే మధ్యగః
సంజగౌ వేణునా దేవకీనందనః

దీనికి ఒకప్పుడు నేను చేసిన అనువాదము –

అంగన కంగన మధ్య ముకుందుఁడు
కృష్ణుని కృష్ణుని మధ్య నొకంగన
ఇటులను జేసిన వలయపు కేంద్రము
వేణువు నూదెడు దేవకి సుతుఁడయె
(చతుర్మాత్రలలో పాట)

నాటకుఁడు చెప్పె సతితో
నేఁటికిఁ గృష్ణుండు నేను – నీవే రాధై
నాటక మాడుదమని, యొక
బూటకుఁ డది వినెను దాను – బొందెను రాధన్

కొంచెము సేద దీర్చుకొనఁ – గోమలి మంచముపైఁ బరుండె, నా
వంచకుఁడే ప్రపంచమని – భామ పరుండెఁ బదమ్ములన్, హరిన్
గాంచక దివ్యదృష్టి మదిఁ – గాంచెను శ్రీసతి వాని లీలలన్,
మించిన మాయతో రమ ర-మించుచుఁ దట్టెను దల్పుఁ గృష్ణుఁడై!

త్రిపద –
ఎడఁదలో రమణుండు – ముడివేయు నిజముగా
పడక క్రిం దది యొక్క కలయె
గడప ముం దది కూడ కలయె

ఇది కలయా, నేనేనా,
యిది యా కృష్ణుండు సేయు – యిరుకాటమ్మో?
యది యెవ్వరు ద్వారముకడ,
నిది యెవ్వరు పడక క్రింద, – యిది కనికట్టో?

త్రిపద –
కర్త గోపాలుఁడా? – భర్త గోపాలుఁడా?
హర్త గోపాలుఁడా వీఁడు!
ధూర్త గోపాలుఁడా వాఁడు!

త్రిపద –
శ్యామసుందరుఁ డిందు – శ్యామసుందరుఁ డందు
భామ కోరిన బ్రియుం డెవరు
రామరామా యేమి గొవరు
(గొవరు = తాపము)

ఎన్ని నాళ్లకుఁ బండెనో – యీ మనస్సు
ఎంత హాయి యీ రేయని – యింతి దలువ
సుంతలోఁ జూచె మఱొకని – సుదతి యపుడు
వీఁడెవఁడు, వాఁడెవఁడు, నేను – వీడు టెవని?

Venkata Subba Sahadevudu Gunda
గోపాలకృష్ణుని లీల:
పరవశ మందెడు వాడే
పరిహాసముఁ జేయ నెంచి వచ్చెను వాడే!
దొరసానివి నీవంచును
దురదుర మంచమ్ము క్రింద దూరిన వాడే!

తలపులలో నీ పిలుపే
తలగడగాఁ జేసి నిన్ను తడిమెడు వేళన్
తలుపులదర నీ పిలుపే
తలపడగా లేను నేను తాండవ కృష్ణా!

Srinivas Iduri

రోబో రజనీలాగా
పూబోణి సరసకు చేరె పొలపరి యొకడూ
కాబోవునదాపునెవరు?
బాబోయని నక్కెనపుడు భర్తరుదెంచన్!

Vanam Venkata Varaprasadarao

మంచముపైనొక శ్రీహరి
పంచన చేరింది పడతి పానుపు మురియన్
కొంచెము సడి ద్వారముకడ
వంచనగాదతడె ఇతడు వంద్యుడు ఒకడే!

పౌండ్రక ఘుక వసుదేవుడు
తీండ్రించుచు పడతి గవయ తీపుల సొక్కన్
‘గాం’డ్రనుచు ‘హరి’ ప్రవేశము
పౌండ్రకుడదె పడతి ప్రక్క కిందన నక్కెన్

కృష్టను గాను నేననుచు ‘కృష్ణసహోదర! వాసుదేవ! ని
కృష్టుడు వీడ! పౌండ్రకుడు! కృష్ణ! దయాకర! నేరనైతి న
దృష్టము నేడు! కేవలము దృప్తిగ పాదము లే స్పృశించితిన్
వృష్టిగ నేడ్చెగోపిక నివృత్తిగ చోరుని జాడ దెల్పుచున్

(తనను పొందడానికి వచ్చిన మాయా పౌండ్రకవాసుదేవుడి పాద సేవచేసి పాదముల చెంత నిదురించింది గోపిక. ద్వారమును తట్టిన ధ్వనితో తలుపులు తెరిచి,ద్వారం వద్ద నిలిచి పిలిచిన వాసుదేవుడిని, ఠక్కున తల్పం క్రింద దూరిన అల్పుడిని చూసి, విషయాన్ని గ్రహించి, ‘వీడనుకోలేదు, అయినా అదృష్టం, ఈ రోజు కేవలం వీడి పాద సేవతోనే త్రుప్తి చెందాను, అదీ నీవే అనే భ్రమతో, కృష్టను గాను’ అన్నది గోపిక, వర్షధారలుగా కన్నీరు కారుస్తూ, అనుమాన నివృత్తి చేస్తూ, తల్పము క్రింద దాక్కున్న వాడి జాడ చూపిస్తూ.కృష్ట= సాగుచేయబడినది, దున్నబడినది, తాత్పర్యం విజ్ఞులు గ్రహించగలరు!)

Srinivasa Bharadwaj Kishore

హాలోవీను దినమ్మున
నీలాగున ఇద్దరిల్లు నేరుగచేరన్
పోలి కసలు వాడెవడో
నీలము రంగసలువాడ నీవెతెలుపరా

ఒకతడవున తీర్చగలవు
ఒకడవె పదియారు వేల ఒంటరితనముల్
ఒకడినె భరియించగలను
ఒకసమయమునందు నేను ఓయీకృష్ణా
గేటుకడను అసలుమగడు
కేటుయెవడొ చేరె డూప్లికేటై యింటన్
పోటుపొడచు చూచినయని
పాటుపడుతు దూరి కింద భయమున వణికెన్

ఇందున గలవందున గల
వందునసందేహమేల అంతటనీవే
ముందే తల్పము నుంటివి
ముందు తలుపుకడను యేల ముసరుదువయ్యా

ఏటికిరా నీ మాయలు
పాటులు పడితివిక చాలు పానుపు కిందన్
బూటకమిది కాదని నీ
నాటకమని రెండు నీవె ననినా కెరుకే

ఒకదానికి ఒకడే మరి
యొకనితొ నేనేమిచేతు నోయీకృష్ణా
ఒకడే చాలును పొమ్మిం
కొక భామెవరైన యింట నొంటరిగుండున్

దొంగే దూరెనుయని తెలి
యంగ నటనలతొ కదలక యట్టేపెడితిన్
కంగారుగ దాగెనట వి
నంగానే తలుపుమోత నదుగో మూలన్

ముచ్చటగా నీరూపున
వచ్చిన పిలవాని చూడవా వచ్చిటకున్
వచ్చె కుపిత సత్య యనుకొ
నచ్చట నక్కితివియేల యనవసరముగన్

కలియుగమ్ములోన కన్ఫ్ యూష నైనదా
వాడి జీపి యస్సు వచ్చినావ
భామ “యే” కు బదులు భామ “బీ” యింటికే
వచ్చి నీవె నీవె వణుకుతావె

వచ్చితివొకరూపున నీ
వెచ్చదనమునను కరిగితి విడిచితి బిడియం
అచ్చెరువొందితి నీవిధి
వచ్చిన నినుచూసి నీవె వణుకుట కనగన్

ఇంతసేపు యెవడొ యింటనీతోనుండె
నిజమువాడ చూడు నేను నమ్ము
మేలి మోసగాడు మేకప్పునుండెనే
నన్ను చూడగానె నక్కె చూడు

ఇంతదన్క నేను యంట్లనే నీతాన
సక్కగుంటిగదర సల్లగాను
ఏడికెల్లి గిట్ల యేషంల వస్తివే
వార్ని!! దూరి గట్ల వణుకుడేల

Sudharshan Kusma

గోపాలుని వేషములో
గోపికతో గూడి యొకడు కునుకును దీయన్
తాపిన తలుపును దీయగ
నా పానుపు క్రిందదాగె నజపుడు రాగా!

లీలామయ గోపాలా !
ఏలా గోపికను మిగుల ఏడ్పించెదవూ ?
చాలించుము ద్వయ రూపము
పాలించుము యా తరుణిని పరవశమొందన్ !

మదిలో కృష్ణుని దలచగ
గదిలో మంచమున వాలి గలిసెను పడతిన్
గది తలుపులు దీయగనే
ఎదురుగ నాతండె నిలిచి ఎగదిగ జూసెన్

Chakravarthula Kiran

“జయము”న పార్థుని సారథి
నయముగ జయదేవు సరస నాయకుడయ్యెన్
క్షయమై “జయదేవు”ని చే
భయమున నేడేమొ పిఱికి పందై దాగెన్!
ప్రణయమున నతిచతురుడని
యనుభవమున తెలిసికొనియె ననఘుని సఖియే —
వణుకుచు తలుపులు తెఱువగ
కనులెదుఱుగ నిలువనతడె కలవరము పడెన్!

తేలని ప్రోబ్లెమ్ముందని
వాలి కథ రిపీటయింది, ద్వాపర లోనూ!
కేళికి ఛీటింగ్ కేసును
పోలిన యీ కథ అహల్య మోడల్ లోదే!

సండే రాధాకృష్ణులు
మెండుగ సరసముననుండ మిడ్‌నైట్ టైమ్‌లో
రెండో కృష్ణుడు వచ్చెను!
పండెను నాటకము సీను ప్రజలన వన్స్‌మోర్!

డబలాక్షను సిన్మాల్లో
ట్రబులింతే, తప్పదు మఱి, టఫ్ – గుర్తించన్
రెబెలా సాఫ్టా వీడని
లబలబలాడింది భామ లాస్టుకి పాపం!

Sirasri
మారుని కేళికై మనసు మర్కట రీతిగ చిందులేయగా
చేరను భామినిన్ కుటిల చిత్తుడు పౌండ్రకవాసుదేవుడే
కూరిమి మీరగానసలు గోపకిషోరుడు తల్పుతట్టగా
భీరువు పౌండ్రకుండకట! బెంగగ మంచము కిందనక్కెనే

Goli Sastry

ఊరిని నాటకమ్మొకటి యూరక జూపుచునుండె దానిలో
కోరిన పాత్రలేదనియు ‘ కిడ్నపు ‘ జేసెను కృష్ణు, వేషమున్
మీరుచు నొక్కడాడు తరి ‘ మేకపు ‘ తోడను కృష్ణుడప్పుడే
తీరుగ రాగ భీతిలుచు తిన్నగ మంచము క్రింద నక్కెగా.

తలపులలో కృష్ణుండే
తలవాల్చగ తన్మయమున తలక్రిందతడే
తలుపును దీయగ నాతడె
తల తిరిగెను నెలతకపుడు తల ” కల ” కలమే .
5
డ్రామానుండే నేరుగ
ప్రేమారగ వచ్చిరనుచు ప్రియముగ జూస్తిన్
డ్రామా నాడిందెవడో
ధీమాగా మగడు వచ్చె తీయగ తలుపున్.

మదిలో దలచెను కృష్ణుని
గదిలో జూడంగ కృస్ణ కలయిక గలిగెన్
గదిబయట నిలిచె కృష్ణుడు
ఇది ” జబ్బరుదస్తు ‘ సీను ఇక నవ్వండేం !

డ్రామానుండే నేరుగ
ప్రేమారగ వచ్చెననుచు ప్రియముగ జూచెన్
డ్రామా నాడిందెవడో
ధీమాగా మగడు వచ్చె తీయగ తలుపున్.

వెన్నుని వలె ” నే ” వచ్చెద
నన్నప్పుడు పతియె సతితొ నదియొకడు వినెన్
వెన్నుని వలెనే వచ్చెను
చిన్నగనే క్రింద దూరె చెయిదాటగ ” లక్ ”

తలనుంచి మగని మీదను
తలపులలో కృష్ణు దలచి తల్పము మీదన్
తలవాల్చ నిట్లు వచ్చెను
” కల ” దల్చగ మదినికొంత కలతే గలిగెన్.

ఇంతిని మదిలో నేదో
సుంతగ ననుమానమెంచె, చోద్యము కలలో
నెంతగ దాగుచు గన నా
గంతకుడే తానెయయ్యె గద కృష్ణారావ్.

ఓ ! మా రెండవ కృష్ణా
డ్రామాకే రార ! నీవు డర్నా మత్ ఆవ్ !
భామా ! తుంభీ బోలో
ధీమాగా స్టేజినెక్క తేజ్ సే ఆవో !

అన్వయము సవరిస్తూ…

ఓ ! మా రెండవ కృష్ణా
డ్రామాకే రార ! నీవు డర్నా మత్ ఆవ్ !
భామా ! తుంభీ బోలో
ధీమాగా జల్ది బంపు దేఖో ! భేజో !

అమ్మా ! గంటలొ డ్రామా
ఇమ్మొగుడే పారివచ్చె నీమేకప్ తో
నిమ్ముగ పద్యము రానిచొ
గమ్మున ప్రాంప్టింగునిత్తు కదలమననుమా !

Maddali Srinivas

అష్టమి నాడు గృష్ణునకు నష్టమ భార్యకు నిష్టమైన దా
నిష్టత జేర గృష్ణుడతి నిష్టను దానును సేవ జేయగన్
పృష్టము నందు గృష్ణు డెవరిష్ట చెలిన్ బిలిచేను గృష్ణుడో
స్పష్టము గాని లీల యిది స్పష్టము గానొక గృష్ణలీలయే

ఉరసీమను శయనించెను
పరవశ మొందుచును సాధ్వి; వాకిలి తలుపున్-
పరులెవ్వరు తట్టెననుచు
పరికింపంగన్ గనియెను ప్రద్యుమ్నునటన్

Shankar Boddu

విరహము తాళలేక తన ప్రేమను పంచెడు వాడు భర్తయే
సరసములాడ వచ్చునని చక్కని గోపిక తన్మయమ్మునన్
వరుడుగ మారు వేషమున వచ్చిన వానిని తృప్తిపర్చగా
నరళము బాదు శబ్దమున కాతడు నక్కెను భర్త వచ్చెగా!

గోపిక యింటను జొచ్చియు
గోపికతో సరసమాడి కూడిన దీవే
గోపిక తలుపును తట్టియు
నా పానుపు క్రిందనీవె యావల నీవే!

శ్రీకృష్ణుని పదములపై
గోకులమున విశ్రమించు కోమలి కలలో
వాకిట తలుపును దట్టుచు
నా కృష్ణుడె నిలిచియుండె నాశ్చర్యముగా!

NagaJyothi Ramana

ఇంటనుగలడొకహరియున్
ఇంటికి జేరేనొకహరి-ఇంతివెఱవగన్
ఇంటనుగల హరి దాగగ
ఇంటికి జేరినపతిగని –ఇంతితడబడెన్

భామకు సంశయమాయెను
ప్రేమగ పతి కూడెననియు- ప్రియమగు సతితో
స్వామిగ వేషము తనుగొని
గోముగ సవతిని పిలువగ-గోపుడు దాగెన్! !

Sivaramakrishna Prasad

కందము

నెచ్చెలి శ్రీక్రిష్ణునకలు
అచ్చం గావిభునిపోల అచ్చెరు వొందన్
మెచ్చిన మగనడి గెదనన
వచ్చిన సఖిజా రుకొనెను పవళించుగదిన్

మధువుతొ మృదువుగ భామిని
మదిదో చగదూరెదొంగ మందిర మందున్
ముదమా రపక్క నెక్కగ
మధుసూ ధనుజూ చినక్కె మంచము కిందన్

కం. కలలో శ్రీక్రిష్ణుడొకడు
కలచెద రగపక్కపైన కలడొక విభుడున్
కలకల ముచేయ తలుపులు
కలడక్కడనిలిచియెకడు కలయో మాయో-3

తప్పులు చేయగ వలెనది
తప్పో ఒప్పో కవులకు తప్పేదికవా
రొప్పురు విమర్శ సరియన
మెప్పగు సుధలూ రుకవిత మెచ్చగ రెల్లన్.

Sumathi Gattu

వలపుల తలపులలో
నీలవర్ణుని ధ్యాసనందుండ నీరజ నయనీ
తలుపుల సవ్వడి విని
తలుపు తీయ తన సఖు గని తన్మయమొందెన్ !!

Voleti Srinivasa Bhanu

“వింటిని నల్లనయ్య కడు వింతలు అమ్మకు చూపినావనిన్
కొంటెతనమ్మునీది కనుగొన్గ తపమ్ములు చేయజాలనో
తుంటరి వింటివానిపిత తొందర నాకది చూపు నీ పద
మ్మంటితి” నన్నగోపికకు మాధవు రూపులు రెండుకాన్పడెన్!

ఘనుడా వారిజనాభుడు
తన లీలలు చూపించగ తక్షణమందే
తనువులు రెండుగ జేసెను
వనితామణి ఎటుగానక వంకలు తిరుగన్

Sonti Prabhakara Sastry

నాటకము రక్తి కట్టే
నాటక కర్తలు పిలువగ రెండో కృష్ణా
వాటా పాత్రా విష్కర
నాటలు నేపథ్యశాలె నాటక మయ్యే!

ఇద్దరు కవలలు వేషా
నద్దరి నాటక మునందు-నటనా వేసా
బద్దులయి పంతము సడలి
హద్దులు తెలుపగ సహించి హాలుకు వెళ్ళే!

నాటక రక్తిని పంచెడు
ధాటిగలుగు కృష్ణ పాత్ర ధారు లిరువురున్
పోటీపడి విరమించగ
చాటుగ వేషాల గదిని సాగె గొడవలే!

దోస్తే వచ్చేనేమో!
చూస్తే, విస్తుగొలిపేను చూసే వేరా
తోస్తూ తలుపును పరికిం
చేస్తూకవలే నుతంబి చేరెన్ కృష్ణా!

Bss Prasad
పద్యమాలిక-Nov-1
నిదురున తూలగ భామయె
మెదలచు నోదొంగమంచమెక్కెరసికుడై
ఎదురుగ కానగ భర్తను
బెదురుచు నక్కెను దిగువన బెంగలు పడుచున్

చట్టునలేచెనా తలుపు చాటున పిల్లన గ్రోవియూదగా
పట్టున నక్కెనా విభుడు ప్రక్కల క్రిందన తోచకేమి యా
తట్టున గోపియూ నిజము తట్టగ నివ్వెర బోయె, నిద్దరూ
కట్టుడు నేర్పరౌ పశుల కాపరి కృష్ణుడి రూపులే సుమా !

శ్రీ మోహనరావు గారి…సలహా

చట్టున లేచె నా తలుపు – చాటున బిల్లనగ్రోవి యూదగా
పట్టున నక్కె నా విభుడు – ప్రక్కల క్రిందుగ తోచకేమియున్
చట్టన గోపియున్ నిజము – జారగ నివ్వెర బోయె, నిద్దరున్
గట్టున నేర్పరుల్, పసుల-కాపరి కృష్ణుడు దక్షుడే సుమా !

(నా ఈ ప్రయత్నమును పెద్దలు పెద్ద మనసు తో మన్నించి తప్పులున్న సలహాలిమ్మని కోరుతూ..)

సరసము కోరి పాన్పులన చక్కగ చేరగ గోపి , పాదముల్
సరసన కాంత శాంతమున సాగిలె సేవ లొనర్చ ప్రేమతో
ఎరగెను కృష్ణుడే మరల నేకము రూపము మార్చి కొంటెగా
సరసము చాలు నింతటితొ సాకులు వద్దని భామ పొమ్మనన్!

వేణువు నాదము మన్మధ
బాణములవగా మురారి భామను చేరెన్
ప్రాణభయము నామారుడు
వేణు కరముబట్టి నక్కె వేదన హెచ్చన్

Sailaja Akundi

వలపులు కురిపించె నచట
తలుపును దీయంగనిచట దర్శన మిచ్చెన్
కలయా! వైష్ణవ మాయా !
తెలియుట లేదేలనాకు తెలుపుము కృష్ణా !!!

నాధు డొచ్చెననుచు నయముగా సేవించి
నిదుర లోన మునిగె నీరజాక్షి
తలుపు చప్పు డైన తనసామి కనిపింప
తెల్ల బోయి జూచె తెక్కలెవరు ?

Arka Somayaji

మించిన యాటపాటల రమించియు,గోపిక భర్తతోడ,ని
ద్రించిన వేళ, నెవ్వరొ!యదేపనిగా,తన తల్పు తట్ట,నే
నంచును నిల్వ, గాంచి,తను యచ్చెరువందె! నితండు కృష్ణుడా?
మంచము క్రింద దూరిన యమాయిక శేఖరు డెవ్వడౌనొకో?
(ఒక గోపిక కృష్ణుని మీద తన్మయత్వంతో భర్తనే కృష్ణునిగా భ్రమించి రమించింది ఆ దేవదేవుని అనుగ్రహంతో!తిరిగి తన భ్రమను గుర్తించాలని కృష్ణుడేవస్తే జరిగిన విషయం గ్రహించింది.ఇది రాస లీలా విశేషం.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *