May 3, 2024

మాయానగరం – 11

రచన: భువనచంద్ర bhuvana

 

 

” అమ్మగారు వస్తుందేమో !” లాలనగా జరీవాలా వీపు నిమిరి అన్నది శీతల్.

” రానీ.. ఆనేదో..” ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అన్నాడు జరీవాలా.

” అసలే అతను….” ఆపింది శీతల్..

శీతల్ సంస్కారం ఎట్టిదంటే ఏకాంతంలో కూడా సుందరీబాయి గురించి తప్పు మాట్లాడదు.

“రాక్షసి అని తెలుసు, మహా అయితే ఏమౌతుంది? నిన్ను వెళ్ళగొడుతుంది. వెళ్ళగొట్టిన మరుక్షణమే నేనీ కాస్ట్లీ జైల్లోంచి బయటకొస్తా. మనిద్దరం కలసివుంటాం” అన్నాడు నిశ్చింతగా.

” మీ పరువు పోతుంది కిషన్ జీ ” తల నిమురుతూ అంది శీతల్.

“పరువా? ” నవ్వాడు కిషన్ బాంచ్.

“మాకు డబ్బు గురించే కానీ పరువు గురించి ఏమాత్రం ఆలోచన ఉండదు శీతల్. సంపాదించాలి.. ఇంకా సంపాదించాలి.. అంతే.

నీకో చిన్న మాట చెప్పనా? సుందరి నాకోసమే బ్రతికే పతివ్రత కాదు. ఆ విషయం నాకు తెలుసునని ఆమెకు తెలుసు. ఆమెకు తెలుసునని నాకూ తెలుసు.”

“నిజమా!” ఆశ్చర్యంగా  దిగ్గున లేచి అంది శీతల్.

“ఆశ్చర్యం కలగటం సహజమే .. ” మళ్ళీ నవ్వాడు కిషన్ బాంచ్.

కాసేపు నిశ్శబ్ధం.

“ఒక మాట చెప్పనా కిషన్ జీ.. ఆడది ఎటువంటిదైనా సరే  అంటే పతివ్రతైనా, తిరుగుబోతుదైనా తన భర్త ఎవరి వెనుకైనా వెళుతున్నాడంటే సహించలేదు.” మెల్లిగా అంది శీతల్.

“కొంతవరకు నేను అర్ధం చేసుకోగలను. కానీ ప్రాణం ఎవరిదేనా ఒకటే. అలాగే వాంఛా, కోరికలాంటివి కూడా. సుందరికి అసలు  నాతో పెళ్ళంటే  ఇష్టం లేదని మొదటి రోజునే నాకు అర్ధమయ్యింది. మరో విషయం ఏమిటంటే నా అవసరం తనకి లేదు”

“అంటే? ” అడిగింది శీతల్.

“ఒకరిని ఇంకొకరు ఎందుకు భరిస్తారో తెలుసా? ఒకటి ప్రేమ, అనురాగం ఆప్యాయత, మమకారం లాంటివి ఉంటే. రెండు అవసరం ఉంటే. రెండూ లేనప్పుడు ఎవరూ ఎవరినీ భరించలేరు.”

” ఒక వేళ మన విషయం  తెలిస్తే, ఆమె ఏం చేయవచ్చు? ”  అడిగింది శీతల్.

“ఎడతెరగని యుద్ధాలు జరిగి తీరుతాయి. కానీ నన్ను విడిచిపెట్టదు”

“అవసరం లేదన్నారుగా? ”

“అవసరం లేదు, నేను తన దృష్టిలో ఓ వస్తువులాంటి వాడిని. నన్ను నీకు ఎలా వదులుతుంది? అలా వదిలేస్తే ఆవిడ “కచ్చ” ఎలా తీరుతుంది? కనుక ఇక్కడే ఉంచుతుంది. ”

“నరకం చూపిస్తుంది కదూ? ” విలాసంగా అంది శీతల్…

“హ..హ..హ.. నరకాన్నా.. ఖచ్చితంగా చూపిస్తుంది.ముఖ్యంగా నీకు అంటే డైరెక్ట్గుగా కాదు. ఇండైరక్ట్గుగా!.. నరకం అంటే భయం వెస్తోందా? ” నవ్వుతూ అడిగాడు కిషన్.

“మీకోసం వేయి నరకాలు భరించే శక్తి నా  ప్రేమకు ఉంది. ఇది మాత్రం నిజం. ” తల అతని భుజానికి ఆన్చి అంది. శీతల్.

**********

“వెంకటస్వామీ! నీకు మళయాళం తెలుసా? ” అని మళయాళంలోనే వెంకటస్వామిని  అడిగాడు పరమశివం.

“రాదు.. కానీ మాట్లాడుతోంటే కొంత అర్ధమౌతుంది ” చెప్పాడు వెంకటస్వామి తెలుగులో.

” మా నాన్న ఆర్మీలో పని చేశాడు. గొప్ప సింగర్ కూడా! ” చెప్పాడు పరమశివం మళయాళంలో.

“ఓహో గ్రేట్! ” వాళ్ళ నాన్న గురించి ఎందుకు చెప్తున్నాడో అర్ధం కాక అయ్యోమయంగా అన్నాడు వెంకటస్వామి.

“ఆర్మీలో ఉండగా అతను ప్రార్ధనాలయంలో ఒక అరాచకం చూశాట్ట.”

“అరాచకమా? ఏమిటీ? ”

“నాలుగు అడుగుల వెడల్పు , ఎనిమిది అడుగుల పొడవు వుండే పెనం ఉందిట, అక్కడి కిచన్ లో”

“అయితే..”

“ఓ అమ్మాయిని ఆ ప్రార్ధనాలయంలో తలదాచుకున్న తీవ్రవాధులు నగ్నం చేసి.. ” నవ్వాడు పరమశివం.

నవ్వుతుంటే కళ్ళు కర్కశంగా మెరిశాయి. ఎంత కర్కోటకమైన చూపూ, నవ్వూ అంటే వెంకటస్వామి గుండె ఓ క్షణం  కొట్టుకోవడం మానేసింది.

“ఊ..” అయ్యోమయంగా అన్నాడు వెంకటస్వామి.

“రెండు చేతులు కాళ్ళు కట్టేసి … ” మెల్లగా అతిమెల్లగా ఓ చెప్పలేని వెర్రి ఆనందం, వికృతత్వం నవ్వులో జోడించి అన్నాడు పరమశివం.

“ఊ…” వెంకటస్వామి గుండె భయంకరంగా కొట్టుకుంటోంది. పరమశివం మాటల్లో చూపుల్లో నవ్వుల్లో దాగున్న పైశాచికత్వాన్ని  చూడటం వెంకటస్వామికి ఇదే మొదటిసారి.

“కాళ్ళు ఒకరు, చేతులు ఒకరు పట్టుకొని రొమ్ములకు, పిరుదులకీ చక్కగా ఉప్పుకారం నూనె పట్టించి.. వెల్లకితలా  ఆ వేడి వేడి పెనం మీద”.. ఆగాడు పరమశివం.

చెమటలు పట్టాయి వెంకటస్వామికి ఊహించుకోంటేనే..

“ఓహ్.. నాన్సెన్స్.. ఇది మనుషులు చేసే పని కాదు..  పిశాచాలు.. ఇక చెప్పకు పరమశివం! ” గభాల్న లేచాడు వెంకటస్వామి.

“ఇంత చిన్నదానికే అంత భయమా? ” అని పరిహాసముగా నవ్వాడు పరమశివం.

“చిన్న విషయమా? ” కడుపులో తిప్పుతుంటే అన్నాడు వెంకటస్వామి.

“అసలు నేను అక్కడ వుంటేనా? ఏం చేస్తానో నీ ఊహకు కూడా అందదు. ” పకపకా నవ్వాడు పరమశివం.

ఆ పగలబడి నవ్విన నవ్వులో కూడా క్రూరత్వమే.

వీడు ఈ విషయాలన్నీ నాతో చెపుతున్నాడంటే కారణం నందినీయే. ఆమె జోలికి వెళ్ళినా వెళ్ళకపోయినా వీడు నన్ను వదలడు. వీడి కళ్ళల్లో, మాటల్లో, క్రూరత్వం తప్ప మరోటి లేదు. ఆ క్రూరత్వం కూడా కేవలం బెదిరించే టైపు కాదు. వీడు పరమ శాడిస్టు. తనలో తనే పరమశివం గురించి అంచనా వేస్తున్నాడు వెంకటస్వామి.

“వెంకట స్వామీ నాకు వేట అంటే భలే సరదా.. జూదమన్నా అంతే. సరదాగా ఓ గేం రమ్మీ ఆడదామ్మా? రాదని చెప్పకు. నీకు వచ్చని నాకు తెలుసు! ” సూటిగా వెంకటస్వామి కళ్ళలోకి చూస్తూ అన్నాడు పరమశివం. ఆ చూపు చాకులా గుచ్చుకుంది వెంకటస్వామిని.

“వచ్చు కానీ ఆడాలని లేదు” అని లేచాడు వెంకటస్వామి.

“ఆడాలి. నేను ఆడమన్నప్పుడు ఎవరేనా ఆడాల్సిందే, లేకపోతే..” నవ్వాడు  పరమశివుడు.

” బెదిరిస్తున్నావా? ” ఎదురు తిరిగాడు వెంకటస్వామీ.

“అయ్యో.. అయ్యో.. నేనెందుకు ఎదిరిస్తాను. నేను ఆడమన్నప్పుడు నాతో ఎవరు ఆడకపోయినా వాళ్ళని నేను స్నేహితులుగా పరిగణించను. వాళ్ళతో అసలు మాట్లాడాలనే అనిపించదు. అంతెందుకు మా నాన్న విషయం నీకు చెపుతా. నేను అడిగింది ఇవ్వను పొమ్మన్నాడు. అంతే నా మనసు విరిగిపోయింది. అందుకే.. ” ఆగాడు పరమ శివం. ఏదో విషయాన్ని అయిష్టంగా గుర్తుకు తెచ్చుకుంటునట్లు..

“అందుకే..” భయంతో కూడిన కుతూహలంతో అడిగాడు వెంకటస్వామీ.

“ఆయనతో మాట్లాడటం మానేశాను. ఆయనకు గుండెపోటు వచ్చి గిలగిల తన్నుకుంటున్నా సరే దగ్గరకు వెళ్ళలేదు.. హ… హ… హ.. కాళ్ళు చేతులు తన్నుకుంటూ చచ్చిపోయాడు. ఎన్ని సార్లు ఏడుస్తూ.., ఏడుపురాక దగ్గుతూ, దగ్గుతూ ఏడుస్తూ, ఏడుస్తూ దగ్గుతూ, దగ్గుతూ ఏడుస్తూ, ఏడుస్తూ దగ్గుతూ ఎన్ని సార్లు పిల్చాడో తెలుసా?  అబ్బా.. చచ్చేటప్పుడు ఆయన మూల్గిన ములుగు ఎంత బాగుందో తెలుసా? ఆయన పాటల్లో ఏదీ దానంత అద్భుతంగా నాకేనాడు వినిపించలేదు.  వెంకటస్వామీ చచ్చేటప్పుడు మనుషులు చేసే ఆక్రందన వింటే ఓహ్..! కిసకిస కిసకిస నవ్వాడు పరమశివం. ఆ నవ్వు మనిషి నవ్వినట్టు లేదు. మానవ శరీరంలో దాగున్న ఏ మృగమో కఠినంగా నవ్వినట్టుంది.

 

********

 

ఆదర్శవిద్యాలయం :

హడావిడిగా ఉంది. కారణం శామ్యూల్ నెలకోసారి వచ్చే మనిషి. ఇలా వెంట వెంటనే ఎందుకు వస్తున్నాడో ఎవరికీ అర్ధం కాలేదు. ఎవరికి తోచింది వారు  ఊహించుకుంటూ కంగారుపడుతున్నారు. మాథ్స్ టీచర్ సౌదర్య అయితే మరీనూ.. కారణం పిల్లల్ని ‘ తోలుకు ‘ రావాల్సిన  బాద్యత ఇవ్వాళ ఆవిడ మీద పడింది.   సౌందర్య కాస్త పిరికిది. బయటకు మాత్రం అలా కనిపించదు.

“ఏంటక్కా.. నేను కూడా రానా? ” అదిగింది శోభ.

“వద్దమ్మా.. అయినా ఎన్ని సార్లు రాగలవూ?  ఎవరి తిప్పలు వారు పడాల్సిందేగా!..” నిట్టుర్చి బయటకు రాబోయింది.

“పోనీ తీసుకెళ్ళు సౌందర్య ! ఎట్లాగూ  టెంత్  క్లాస్ వాళ్ళని కొందరిని తీసుకెళ్ళాలిగా! లేకపోతే పిల్ల వెధవలు పారిపోతారు.” అనునయంగా అంది సులోచన టీచర్.

“సరే… ఈ సారి తీసుకెళ్తా మేడం. అయినా ఈ తలనొప్పి ఎప్పుడు వదులుతుందో కదా! ” తలకొట్టుకుంటూ అంది సౌదర్య.

ఇద్దరూ బయటకు వచ్చారు. మరో నలుగురు టెంత్ క్లాస్ కుర్రాళ్లతో కలిసి.

” మీరు ముందరెళ్ళి వీధికి ఆ చివరి ఒకరు, యీ చివర ఒకరు కాపలా కాయండి. మేం మెల్లగా జాగ్రత్తగా చూసుకు వస్తాం ” స్టూడెంట్స్ తో అన్నది సౌందర్య.

“అక్కా! మొన్న ఆదివారం నాడే శామ్యూల్ రెడ్డి గార్ని చూశా..” ఉల్లాసంగా అంది శోభ.

“ఎలా? ఏమన్నారు? ” కొంచం కంగారుగా అడిగింది సౌందర్య.

“నాకేమి భయం వేయలేదు అక్కా! జోకులు కూడా వేశారు. నాతో పాటు మాధవక్క కూడా ఉందనుకో ” వివరించింది శోభ అవ్వాళ జరిగిన విషయమంతా.

” వాళ్ళు అన్నది నిజమే శోభ. శామ్యూల్ గారిలో ఏదో ఉంది. అది బయటకు కనపడని వ్యవహారం. స్కూల్లో అందరి మీద కుక్కలా అరిచే మనిషి అక్కడ అంత జోవియల్ గా వున్నాడంటే నమ్మబుద్ధి కావటం లేదు.   ఎవడి మనసులో ఏముందో ఎవరికి తెలుసు? అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ” సాలోచనంగా అంది సులోచన శోభ భుజం మీద చేయ్యి వేసి.

“ఏమో! మీరందరూ అంతగా భయపడుతున్నారు. నాకైతే నిజంగా భయం వేయ్యడం లేదు.” నవ్వింది శోభ.

శోభ వంక తల పక్కకు తిప్పి చూసింది సౌందర్య. ” యీ పిల్ల ఇప్పుడే పుట్టిన కుందేలులాంటిది. పులులు. సింహాలు. తోడేళ్ళు. ఎలుగుబంట్లు. నక్కలు కూడా యీ పిల్లకి విచిత్రంగా బొమ్మల్లా కనిపిస్తున్నాయి. భగవంతుడా! యీ పిల్లలోని పసితనాన్ని ఇలాగే ఉండనీయ్ ” అని మనసులోనే అనుకొని .. మనిషికి మనిషంటేనే భయం ఎందుకు? భయపడాల్సిన పనే లేదు. కానీ శోభ! మనిషిలో మృగాలు కూడా దాక్కొని వుంటాయి.  అవి ఎప్పుడో కానీ బయటపడవు. అవి బయట గనక పడితే వేట పూర్తి చెయకుండా మరలిపోవు. అందుకే… అందుకే మేము భయపడేది. మనుషుల్ని చూసి కాదు వాళ్ళల్లో మృగాలని చూసి”  నడుస్తూ అంది సౌందర్య.  ఆమె అనుభవాలు ఆమెవి. ఎంత ఘోరమైనవి అంటే సభ్యమానవులు నివ్వెరపడేటంతవి. తన జీవితంలో జరిగిన సంఘటనల్ని చెపితే శోభ కొంచం జాగ్రత్త పడుతుందేమోనని అనిపించినా సౌందర్య నోరు విప్పలేదు. ఎంత చిత్రం… జరిగిన నిజాన్ని చెప్పడానికి మనుషులు ఎంత భయపడతారూ? ఎంత సందేహిస్తారూ?

“నమస్తే! ” మొహం వెలిగిపోతుండగా హీరోహోండాని ఆపి అన్నాడు బోసుబాబు.

“మీరా! ” నవ్వింది  శోభ. ఆ రోజు కలరా గురించి చెప్పింది ఇతనేనని శోభకు గుర్తొచ్చింది.

“నేనే! ఏంటీ.. ఇటువైపు వచ్చారు? నా పేరు బోసు. మీ పేరేంటి? మీరేం చేస్తున్నారు? బహుశా శామ్యూల్ స్కూల్ లో పని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కరక్టేనా? ” అని ప్రశ్నలు సంధించి సౌందర్య వైపు తిరిగి ” మీరా స్కూల్ లో పని చేస్తున్నారని నాకు తెలుసండి. నేనే మీకు తెలియదు. మిమ్మల్ని చాలా సార్లు చూశాను. మీ ఇల్లు నాకు తెలుసు. నా వల్ల అయ్యే పని ఏదన్నా నాతో చెప్పండి. క్షణాల్లో చేసిపెడతాను. ” మంచి ఇంప్రెషన్ కోసం తాపత్రయపడుతూ సౌందర్య తో అన్నాడు బోసుబాబు.

“అలాగా! పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్ళాలి.. మినిస్టర్ వస్తున్నాడు. అందు కోసమని ఇటు వచ్చాం! ” చెప్పింది సౌందర్య.  బోసుబాబు మంచివాడుగానే కనిపించాడు ఆమెకి.

“ఓహో గుడిసెల్లో పిల్లలా? వాళ్ళు అంత తొందరగా లొంగరులెండి. వాళ్ళ పేర్లు ఉన్నాయా మీ దగ్గర? ” అదిగాడు నవ్వి.

“లేకేం? ఇల్లు కూడా తెలుసు. ” చెప్పింది శోభ.

“ఛా! ఇంకెందుకు వెళ్ళడం? ” అంటూ బడ్డీ కొట్టు దగ్గరున్న ఓ నడివయసు వాడ్ని చూసి ” ఒరేయ్ డేవిడు శామ్యూల్ గారి స్కూల్ పిల్లల పేర్లు వీరు చెపుతారు కానీ రెండు నిమిషాలలో వాళ్ళని తీసుకొనిరా. మాట వినకపోతే నా పేరు చెప్పు!” అని రాయల్ గా ఆడర్ ఇచ్చాడు.

సౌందర్య గుండెల  మీద పెద్ద బరువు క్షణాలలో తగ్గింది. గబగబ పేర్లు ఓ చీటీ మీద రాసి డేవిడ్ కి ఇచ్చింది.

“అక్కయ్య గారు! మీ పేరు సౌందర్య అని తెలుసు. ఈమె పేరు…” డైరెక్ట్ గా శోభని అడగకుండా సౌందర్యని అడిగాడు. అదో స్ట్రాటర్జీ.

“శోభారాణి.. నాకు చెల్లెల్లాంటిది… ” చెప్పింది సౌందర్య.

“ఓహ్..! చాలా మంచి పేరు శోభారాణి గారు! అదిగో ఆ కనిపించే ఇల్లే మాది. మీరెప్పుడు పిల్లల్ని పట్టుకోవాలనుకున్నా మీరొక్క మాట నాతో చెపితే చాలు కాళ్ళు విరకొట్టైనా వాళ్లని క్షణాలలో మీతో పంపిస్తా! ” వాగ్ధానం చేశాడు బోసుబాబు.

సౌందర్య కి ఆశ్చర్యం కలిగింది. బోసుబాబుని చూడటం సౌందర్యకి ఇదే మొదటి సారి. ఏమైనా అడుగుతానని “అక్కయ్యగారు” అని పిలవడం కొద్దో గొప్పో ఆనందం కలిగించింది.

“థాంక్స్ బోసు గారు! ”  అన్నది సౌందర్య.

“అక్కయ్యగారు! మీరు నాకు ఏనాడు థాంక్స్  చెప్పకండి. ఈ గుడిసెల్లో బ్రతికే పిల్లల బాగు కోసం పాటు పడుతున్న గురువులు మీరు. ఇక్కడ జనాలకి ఆ విషయం అర్ధం కాదు. మనం చెప్పినా ఎక్కదు.  అయితే ఓ విషయం చెప్పక తప్పదు. నేనంటే వీళ్ళకు భయం, భక్తి, గౌరవం అన్నీ వున్నాయి. ఇది గొప్ప కోసం నేను చెప్పుకోవటం లేదు. నా ఏకైక లక్ష్యం వీళ్ళ జీవన రీతిని మార్చాలని. మార్చేదాక నేను పెళ్ళిగిళ్ళి లాంటి ఏ బంధమూ పెట్టుకోదలచుకోలేదు. ప్రాణాలివ్వడానికైనా నేను సిద్ధమే. ” ఉపన్యాసంలా కాక నిజాయితి ధ్వనించేలా అన్నాడు బోసుబాబు.

“స్వరం” ఓ గొప్ప “వరం”. దాన్ని ఉపయోగించుకోవడం ఎలానో కరక్ట్ గా  తెలిస్తే పేపర్లు అమ్ముకునే వాడు కూడా ప్రైమ్ మినిష్టర్ కాగలడు. ఉపయోగించడం తెలియకపోతే కోటీశ్వరుడు కూడా కూటికి కొరగాకుండా పోతాడు. “శంకరాభరణం ” లో రకరకాలుగా “అమ్మ” అంటూ శంకర శాస్త్రి ఘోషించింది ఇదే.

ఐదే ఐదు నిమిషాలలో మొత్తం పిల్లలు సౌందర్య ముందూ, శోభారాణి ముందు నిలబడ్డారు. అదీ తలలు దువ్వుకొని , బట్టలు పూర్తిగా వేసుకొని.

“రేయ్! ఏ మాత్రం అల్లరి చేసినా మిమల్ని వదల్ను జాగ్రత్త ” అని వార్నింగ్ కూడా ఇచ్చాడు బోస్.

“థాంక్స్ తమ్ముడు ” అని మనస్ఫూర్తిగా అంది సౌందర్య.

“థాంక్స్ చెప్పకూడదు అక్కా! ఆజ్ఞాపించాలి” నవ్వాడు బోస్.

పిల్లల్ని తీసుకొని వాళ్ళు స్కూల్ వైపు వెళ్తుండగా అక్కడే ఆగి చాలా సేపు చూశాడు బోస్. శోభ ముందు వైపే కాదు వెనక వైపు నుండి కూడా అద్భుతంగా కనిపించడమే దానికి కారణం.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *