April 27, 2024

పద్యమాలిక .. ఏప్రిల్ 15

april 15

NagaJyothi Ramana
తెల్ల వెంట్రుకొకటి తేరగా కనిపింప
కలికి ముదిమి వయసు కనుల నిండె
అత్త గారు పలికె నమ్మతో, తానేడ్వ
నలుపు హెన్న తలకు నప్పునంటు

పిన్ని తెచ్చెనొక్క పెళ్ళిసంబంధాన్ని
తమిళ నాట పదవి తనకు జూడ
తాళి తెంచు చోట తగదు బంధమ్మని
తలను యెత్తి యేడ్చె దరుణి దాను

అత్త యాడపడుచు యలిగి మంతనమాడ
కొత్త కోడలేమొ కొరత జెంది
వోరి నాయనంటు ఓదార్పుకైనేడ్చె
అత్త యింట బతుకు భారమనుచు

బొట్టు పెట్టుకొనుము బోసిమోమువలదు
చేతి గాజులుండ చెలువ మనగ
కూతురీ విధమ్ము కుమిలికుమిలియేడ్చు
చెల్లదిచట సవతి తల్లి మాట

ఎందుకమ్మ యెపుడు నేడ్చు కోడలుపిల్ల
యనుచు నొకరు వచ్చి యత్త నడుగ
యేడ్పు నోము నోచి యెరుగదుద్యాపనం
పూర్వ జన్మ కర్మ పుణ్య మనియె

Srinivas Iduri

అత్తా చూడుము యిదె నా
సత్తా యనుచూ పలికెను శపధం యకటా
మెత్తగ జెప్పిన వినదే
కొత్తగ వచ్చిన గడుసరి కోడలు గనుమా

శ్రీ స్వామి
కం||. ఇలలో కాలము భ్రమగా
తలపించినపుడు జనులకు తగిలెడు వ్యధలే
కలలా మీ, మా వెంటన్
నిలబడి భయపెట్టునవియు నిక్కము జనకా||

Voleti Srinivasa Bhanu

తాళి తెంచు కొనెడి కేళిలో పాల్గొని
పోజు లిచ్చి తాను మోజు దీర
సవతి తనకు యున్న సత్యమచ్చటెరిగి
భోరుమన్నదండి పుట్టినింట

Srivenkateswara Rao Dubagunta

అమ్మ తిట్టినదని అత్త కొట్టినదని
అలిగినదని కాదు ఆడ పడచు
మల్లె పూలనడుగ మగడుతేలేదని
మగువ ఏడ్చు చుండె మది తలచి

పూసు కున్న సెంటు ఫేసుపౌడరుపోయె
కట్టు కున్న చీర పట్టు జారె
ఎంత సేపు నేను ఎదురుచూడగలను
ఏడ్పు మిగిలె నాకు ఏడి సామి?

Goli Sastry

వచ్చెద నొకటే నిమిషము
ముచ్చటలాడంగ ననగ ముదితలు ముందే
రెచ్చుచు గుసగుస లాడిరి
గుచ్చెను మదిలోనముల్లు ఘోరము జరిగెన్.

పదిగంటలాయె లెమ్మని
వదిలించుక నిద్రను కన బడవేయంటిన్
గదిలో శోకము వెట్టుచు
మదినన్నే దిట్టుచుండె మాకోడలు, హా !

నల్లజుట్టు గలుగు ననిజెప్ప నొక షాంపు
దెచ్చి వాడె నేడు పిచ్చి పిల్ల
నలుపు దైవ మెరుగు నలుపున్నదే బోయి
క్రొత్తరంగు రాగ గోల ! గోల !

గాజు లేమొ వలదు గజ్జెలస్సలు వద్దు
నుదుట బొట్టు, జడయు నోనొనోనొ
జీన్సు గాక చీరె ఛీఛిఛీ ఛీయను
పిల్లనేమి జేతు పిన్నిగారు !

టీవీ నటి మాకోడలు
ఓవదినా తిట్టలేదు, ఒట్టే వినవే !
టీవీలో యేడుపు సీన్
ఈవేళే ! ప్రాక్టిసు సలుపిప్పటినుండే !

పైసా లేదే జేబ్ మే
ఐ సా ఏప్రిల్లు ఫూలు అనెడీ చీటీ
ఐసా కర్తే బాద్మే
ఐసును జేస్తాడు మేరి హస్బెండ్ హాయ్ ! హాయ్ !

Annapareddy Satyanarayana Reddy

కొడుకు పెండ్లి చేయ నిడుములుడుగునంచు
కాంక్షతోసుతునకుఁగట్టినాను
కట్నమివ్వకుండ కాపురానికి వచ్చె
నీళ్ళకుండ సతము నెత్తినుండు

ఏమికతన కోడ లటుల యేడ్చుచుండె?
నేమిజరిగె నీదినమున నింటిలోన?
పుట్టినింటికి చనుటకై పట్టు బట్టె
వలదని పతిచెప్ప వనరుచుండె

పేదయింటి పిల్ల పీడగా తలచుచు
నింటినుండి తనను గెంటబోవ
నత్త యాడపడుచు ఆగడములగాంచి
కుములుచుండె నింటి కోడలయ్యొ

అన్నకూతురంచు నాదరముగ నేను
కోరితెచ్చు కుంటి కోడలిగను
పడక గదిని వీడి బయటకే రాదది
పనిని చెప్ప నేడ్చు ప్రతిదినమ్ము

కూతురెందుకటుల కుములుచుండె దినము
కారణమ్ము చెప్పు కాంతవదిన?
క్రొత్త సెల్లు ఫోను కొనియివ్వ లేదంచు
వెక్కుచుండె కనుము వెంకటమ్మ

బాబ్డు హైరు తనకు బాగుండు ననుచును(బల్ పసందనుచును)
జుట్టుకత్తిరించ పట్టుబట్టె
నడ్డగించ తండ్రి యాక్రందనలతోడ
నిల్లుఁ బీకి పంది రేయు చుండె

సాఫ్టువేరు మగడు సరదాలు నిల్లంచు
నోర్మి లేక వచ్చె కూర్మి తనయ
మెట్టినింటి కేగ పట్టుబట్టగ నేను
ఏడ్చుచుండె నిట్లు యేమి చేతు?

విద్యలేనట్టి బావతో పెండ్లి యనుచు
పట్టుబట్టుచు నుండెను పగలు రాత్రి
నాడుబడుచు చెప్పినటుల నాడుచుండె
లెక్కచేయను కూతురి తిక్కచేష్ట

Venkata Subba Sahadevudu Gunda

నిన్న మాట లాడె పిన్నమ్మ ప్రక్కింట!
నేడు అత్త తోటి కూడె నేల?
అత్త ముఖము లోని ఆవేదనన్జూడ
తప్పదేమొ నాకు తన్నులాట!

మరచి రేమి నన్ను యిరుగమ్మ పొరుగమ్మ?
నాదు చీర మీద చీదరింపొ?
నగలు గొంటి ననెడు వగపొ? కడుపుమంటొ?
తెలియ గోర నాకు తిక్క రేగె!

నన్ను పిలువ కుండ నాచుట్టు వారలూ
మాటలాడు చుండ మంట రేగు!
వస్తు వైతి నేమొ వారల నోటను?
నిద్ర పోవు టెట్లు నేడు నేను?!?

సినిమా వెళదా మంటివి
మునిమాపున నుండి నీకు ముచ్చట్లేనా?
కనరావేనా యేడుపు
కనికరమును జూప నీవు కదలెద మమ్మా!

ఓ కోడలమ్మ తల్లితో అత్త:
ఓయమ్మ మీ కుమార్తెయె
మాయింటను గోల రేపి మననీదమ్మా!
పోయెదమత్తా మామలు
హాయిగఁ పతితోడ నుండ హద్దులు మీరన్!

Chandramouli Suryanaryana

మొద్దుగనిద్దురపోవుచు
ప్రొద్దున తావేయదమ్మ ముగ్గును కూడా
పెద్దగ నేడ్చుచు కోడలు
నిద్దుర నేలేపబోవ నీల్గుచు నుండున్

గుసగుసమని నామీదను
కసితో చాడీలు చెప్పు కంత్రీ అత్తా
పొసగదు నీకును నాకును
ముసలివి నీకెందుకింత పొగరు తెలుపుమా

Shankar Boddu

కోడలి వయ్యారమ్మును
వేడుకగా ప్రక్కయింటి పిన్నికి జెపుచున్
జోడుగ గుసగుస లాడెడు
పోడిమి గల యాడువారి ముచ్చట గనుమా!

Bss Prasad

అత్త మెప్పు కోరి అమ్మ సతా యించ
రైక తొడిగె నామె రంగు చూసి
చీర కట్టు రాక చీకాకు లెక్కువై
వెక్కి వెక్కి యేడ్చె వెర్రి పిల్ల

డా. విధాత

తేట:
కోడలన్నను కూతురే! కోపగించ
కండి! యత్తమామలనిన కన్న తల్లి
దండ్రు లేనయా! కరుణమ్ముఁ దలపు తలచి
కసురు కందును మరికొంత కాచు కొనుడు!

Arka Somayaji

ప్రక్కింటి ముంత మామిడు
లక్కున జేరె నిదె!నా గృహాంగణ సీమన్,
లక్కంటే! నాదే! మరి!
ఒక్కక్కటె! కోసికొందు! నొరులేడ్వంగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *