May 7, 2024

ధీర-3 – అంతులేని కధ

 JAYAMMA

 

“ధీర” అనగానే… ధీరురాలు, శూరురాలు, వీరపత్ని లేదా చత్రపతి శివాజీ తల్లి లాగ వీర మాతేమో, అలాంటి characterizations కే ఆ ధీర అనే మాట వాడాలేమో అనుకుంటాం. ఇప్పటిదాకా మన సినిమాల్లో చూపించేది అలాగే. కత్తిపట్టి యుద్ధం చెయ్యగలిగే కోవలో ఉన్నవాళ్ళు సరే. కత్తిపట్టకుండా తామే కత్తై బ్రతుకుసాగించేవాళ్ళని కూడా “ధీర” అనవచ్చు. ధీర అంటే ధైర్యవంతురాలు, విశ్వాన్ని ఒడిసి పట్టుకునే ఆత్మవిశ్వాసం గలది. రామాయణంలో సీత కత్తి పట్టి యుద్దం చెయ్యలేదు, బాణాలు వేసి శత్రువుని తుదముట్టించలేదు. కాని తనని అపహరించిన రావణుడిని తన ఆత్మవిశ్వాసంతో, మాటలతో భయపెట్టిన దైర్యవంతురాలు, రామాయణానికి గ్రంధనాయకి సీత.. అందుకే ఆమె ధీర.

సామాన్యుల జీవితాలలో మరెన్నోకష్టాలు, నష్టాలు, ఆకలి, డబ్బు లేమి, బ్రతుకు భయం, అవసరాలు, వ్యసనాలు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో వుంటాయి. వీటి వాత పడి ఎంత మంది స్త్రీ, పురుష జీవితాలు పెనుగాలి లో చిక్కి రాలిపోయిన పువ్వుల్లా  రాలిపోతున్నాయో.. మళ్ళీ వాళ్ళ జీవితాన్ని వెనక్కి తీసుకొచ్చుకోలేనంత !!!

ఇటువంటి కష్టాల మధ్య, ఒకపూటే తిన్నా కూడా మళ్ళీ అర్ధాకలే అనే నిరాశా నిస్పృహల మధ్య పెరిగిన జయమ్మ, కన్న తల్లి దూరమయి, కన్న తండ్రి మరో పెళ్ళి చేసుకుని అందులో కొట్టు మిట్టాడుతూ వుంటే తాను వంటరి దయిపోయిన జయమ్మ..  తాతయ్య, నానమ్మ చేతిలో చాలీ చాలని జీవితాన్ని జీవించిన జయమ్మకు అక్షర జ్ఞానం లేదు. కానీ పుట్టుకతోనే విచక్షణ, అవగాహన తద్వారా విజ్ఞానం అన్నది కొంతమందికి వస్తుంది అనీ పెద్దలు చెప్తుంటారు, అది జయమ్మని చూస్తే నిజమే అనిపిస్తుంది. తన వారు లోనయిన ప్రలోభాలకు, చేసిన తప్పులకు (కారణాలేమైనా గానీ) కుటుంబం అనేది విచ్చిన్నమై తానెలా వంటరిదైపోయిందో అర్ధంచేసుకుంది. అటువంటి దుస్థితి తన జీవితానికి ఇకనైనా వుండకూడదనీ, తన బిడ్డలు తనలా అలమటించకూడదనీ ఆమె చేసిన.. ఇంకా చేస్తూ ఉన్న ప్రయత్నాలు ఆమెని ఈ రోజు “ధీర” గా నిలబెట్టాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న ఈ జయమ్మ ఒక ధీర అని చెప్పడంలో సందేహమే లేదు.

జయమ్మగురించి మరిన్ని వివరాలు అందిస్తున్నది డా. సత్యగౌతమి..

జయమ్మ తండ్రి రామారావు… గండయ్య, సన్యాసమ్మ కు రెండవ సంతానం. గండయ్యది కత్తులు, చాకులు తయారు చేసి అమ్మే వ్యాపారం. రోజంతా కష్టపడి కత్తులు చేసి లేదా కస్టమర్స్ వచ్చినప్పుడు కత్తులు నూరిపెట్టి సంపాదించే డబ్బు కుటుంబ పోషణకి సరిపోయేది కాదు. భార్యా, తన ఇద్దరు కొడుకులు ఏ రోజుకా రోజు చేతికి దొరికిన పని చేసి.. తలో చెయ్యి వేస్తేనే గాని ఆ కుటుంబం ముందుకెళ్లేదికాదు. పని దొరికిననాడు భోజనం, లేనినాడు పస్తు. ఇదే వాళ్ళ జీవితం. ఎదుగూ బొదుగూ లేని జీవితాలకి పెద్ద ప్లాన్స్ అనేవి వుండవు కాబట్టి, పెళ్ళీడు రాగానే పెళ్ళికి ఆపై పిల్లలకి రెడీ అయిపోతారు. అలాగే రామారావు వంతొచ్చింది. మాలక్ష్మమ్మని పెళ్ళిచేసుకున్నాడు. పెద్దలు చూసి చేసిన వివాహమే. వాళ్లకి పుట్టిన సంతానమే ఈ జయమ్మ.

రామారావు, మాలక్ష్మమ్మ కధ చాలా చిన్న కధే ఎందుకంటే ఆమె పెళ్ళి బాధ్యతని, తల్లి బాధ్యతని మధ్యలోనే విస్మరించింది. చిన్నప్పుడే పిల్లను భర్తకు వదిలేసి తన జీవితాన్ని తాను చూసుకున్నది. ఇందులో ఆమెని పూర్తిగా విమర్శించడినికి  లేదు. మాలక్ష్మమ్మ కొన్ని ఆశలతో అత్తవారింట అడుగుపెట్టింది. వాళ్ళు ఏ కోశానా కూడా ఆమె ఆశలకు సరిపడలేదు గామోసు. భర్త చూస్తే పూట భత్యం, పుల్ల విరుపు మాటలు.. ఉమ్మడి కుటుంబం. తలో చెయ్యి వేస్తే గాని అన్నం దొరకదు, దొరికినా అర్దాకలితోనే వుండాలి. దానికి తోడు ఆమెని భర్త బయటికి పనికి పంపేవాడు కాడు, ఎందుకంటే ఆమె అందగత్తె.. లోకం బాగోలేదు, ఎవరైనా తన భార్యని పేదరికం పేరుతో ప్రలోభపెడతారేమో అని. మరి కుటుంబాన్ని నడపడానికి ఒక మనిషి  చెయ్యి తక్కువయ్యింది…. భారం మాత్రం ఎక్కువయ్యింది. ఈ లోపు మొగుడికి స్నేహితులద్వారా మందు కూడా  అలవాటయ్యింది.

“ఎందుకు మావా ఈ యసనాలు.. ముందే డబ్బులు సాలట్లేదు. మీ తమ్ముడు పనికి పోలేదు, అత్తమ్మకి వంట్లో బాగోలేదు.. రెండురోజులయినాది పొయ్యి రాజేసి. ఆ యామ్మ ఈ యమ్మ దయతలచిస్తే దొరికింది.. దానితో కడుపు నిండుద్దా???”… లక్ష్మమ్మ నిలదీసింది.

నోర్ముయ్యెయ్స్… ఆడది సెప్తే గాని నాకు తెల్దేంటి ? నేను మగాడ్నే. నాకంటూ ఖర్సులుంటాయ్. నేను సంపాదించుకున్నదాన్ని నా ఖర్సులకి పెట్టుకోడానికి నాకు హక్కు లేదా? నువ్వే హక్కుతో నా డబ్బుతింటున్నావు (తాగుడు మైకం లో). నీ సేతిలో నేనెంత  పోస్తే అంతలోనే సర్దుకోవాల.. అదీ పెళ్ళాం అంటే. నువ్వేటే నన్ను నిలదీస్తావ్?… లాయర్ లాగా రామారావు లా పాయింట్లు!

ఈ వరస ఎక్కువయిపోయింది. జయమ్మ చిన్నదయినా వాళ్ళు దేనికి పోట్లాడుకుంటున్నారో ఆ లా పాయింట్లు ఏవిటో పూర్తిగా అర్ధం కాకపోయినా.. డబ్బుల గురించి పోట్లాడుకుంటున్నారని, తాగొచ్చి నాన్న అమ్మను నిందిస్తున్నాడని, చెయ్యి జేసుకుంటున్నాడని మాత్రము అర్ధం చేసుకుంది. సాయంత్రం అవ్వగానే దూరం నుండి తండ్రి వస్తున్నాడని చూసి.. భయపడుతూ వుండేది ఆ రోజు ఇంట్లో ఏ గోలవుంటుందో అని. ఇలా జయమ్మ చిన్నతనం అంతా భయంగా, బాధగా.. మళ్ళీ అవన్నీ మరిచి సాటి పిల్లలతో ఆటల్లో పడిపోయేది. కానీ ఆ చిన్ని మెదడులో ఇవన్నీ ఒక నిఘంటువులా సంక్షిప్తమవుతూనే వుండేవి.

మహానుభావుడు మందుతో ఆగలేదుగా, దమ్ము, స్త్రీ లాంటి వ్యసనాలు కూడా మొదలయ్యాయి. ఈ వ్యసనాల పోషణకు ఎక్కువ పని చేసేవాడు, ఆ లెవెల్లోనే సంపాదించుకుండేవాడు కాకపోతే.. తనకోసం ఖర్చు పెట్టుకుండేవాడు.. ఇంట్లో మాత్రము ఆ చాలీ చాలని బత్తెమే. లక్ష్మమ్మ ఎన్ని రోజులని ఆకలికి తట్టుకుంటుందీ? ఎన్ని రోజులని అవమానాలు భరిస్తుందీ? ఒకరోజు నిర్ణయించుకొని… జయమ్మ మొహం కూడా చూడకుండా.. ఆ యింటినీ వదిలేసి వెళ్ళిపోయింది. జయమ్మ కన్న తల్లి లేనిదయ్యింది తండ్రి పుణ్యమా అంటూ.

అది తెలిసి రామారావుకి చీవాట్లు, చెప్పుదెబ్బలు కొట్టారు తల్లీ, తండ్రి గండయ్య, సన్యాసమ్మ మరియు తదితర కుటుంబ సభ్యులు.

“వొరే.. ఇప్పటినుండయినా బుద్దిగా వుండు. యసనాల జోలికిపోకు. నాకు తెలిసిన నలుగురు పెద్దోళ్ళ కాళ్ళావేళ్ళా పడతాను ఏదో ఒక ఉద్యోగం నీకు ఇప్పించమని.. నువ్వులా యసనాల పాలబడితే… ఎవరూ సహాయం చెయ్యరు”… అని ముసలి తండ్రి నెత్తీ నోరూ బాదుకున్నాడు.

అప్పుటికి కొంతవరకు మారాడు రామారావు, తాగుడు తప్ప… మిగితా వ్యసనాలకు స్వస్తి చెప్పాడు.

రామారావు కూడా…ప్రతిరోజూ భోజనం పెట్టగలిగే చేతి విద్యనేదైనా నేర్చుకోవాలని నిర్ణయించుకుని, ఏదో ఆటో మొబైల్ షాపులో మెకానిక్కు గా చేరి పని నేర్చుకున్నాడు. తాగుడు మాత్రం వదలలేకపోయాడు.

ఈ లోపల తండ్రి చెప్పినట్లుగానే తనకి తెలిసిన వాళ్ళ కాళ్ళు పట్టుకొని.. వాళ్ల సహాయం తో బస్ డిపో లో మెకానిక్కు ఉద్యోగం వేయించాడు. రామారావు ఆ ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వుంటే కొన్నాళ్ళకి అది పర్మనెంటు అయ్యింది. ఇది తర్వాత మాట అనుకోండి. ఈ పరిణామాలన్నిటికీ.. జయమ్మ కెలాంటి అవగాహన వస్తుందో ఆలోచించగలరా??? తల్లి తనని వదిలేసి వెళ్లిపోయింది. తండ్రి తన భాద్యతని తాత, నానమ్మలమీద వదిలేసి తిరుగుతున్నాడు. తాను ఇరుకు జీవితం జీవిస్తూ.. చాలీ చాలని తిండీ, పండగపూటకూడా ఎవరో వేసుకున్న బట్టలు తాను క్రొత్త బట్టలుగా భావించి వేసుకుంటూ రోజులు గడిపేది. చుట్టూ మనుష్యులు కనబడుతున్నా వంటరిగా ఫీల్ అయ్యేది.

ఈ లోపుల మెల్లగా రామారావు ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంటే అతని పెళ్ళి ప్రస్థావన మళ్ళీ వచ్చింది. పెళ్ళి కూడా అయిపోయింది. జయమ్మ పూర్తిగా వంటరిదయిపోయింది. అందువల్ల.. ఆమె మకాం కూడా మారింది, తన తాతయ్య నానమ్మల పంచన చేరింది. వాళ్ళిద్దరూ అప్పటికే ముసలి వాళ్ళు, ఓపికల్లేవు. ఈ పిల్లకేమి చూడగలరు ఆలనా పాలనా? అయినా నానమ్మ.. వాళ్ళిచ్చిన బట్టలు, వీళ్ళిచ్చిన బట్టలు జయమ్మకి ఇస్తూ..వాళ్ళతో పాటే కలుగో గంజో పోస్తూ వచ్చింది.

జయమ్మ వయసుకి వచ్చింది, తన మేనత్త కొడుకు ప్రసాదు ప్రేమలో పడింది. ప్రారబ్దం కాకపోతే… బావ నిరుద్యోగి తాను ప్రేమలో పడేసరికి. తాను నల్లగా వుంటుంది, బావ తెల్లగా అందంగా వుంటాడు. ఆ అందానికి పడిపోయింది. ఇప్పుడా బావ వ్యసనాలపాలయి..అందమంతా పోగొట్టుకున్నా.. ఇప్పటికీ మురిసిపోతూ వుంటుంది.  పాత ఫొటో చూపించి .. బావ అందగాడని! హహహ…

రామారావు తన జీవితంలో జరిగిన తప్పిదాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆమె ప్రేమను నిరాకరించాడు.. ఉద్యోగం లేనివాడికి ఇవ్వనూ అని. ఆ టైములో జయమ్మ బావ ప్రసాదు ఏదో సినిమా హాలులో టికెట్లు కోసేవాడు లేదా ఏపని దొరికితే ఆ పనికి వెళ్ళేవాడు. ప్రేమ మైకంలో.. తన తల్లిదండ్రుల విషయాన్ని మర్చిపోయి.. బావని కాకనే కద్దు అని చేసేసుకుంది.. పైగా బావ అందగాడాయె.. పైసల్లేకపోతేయేం.. ఇద్దరం కలిసి పనిచేసుకుంటాం అని పెళ్ళికి నడుం కట్టింది. ఇప్పటినుండి రెండో షో స్టార్ట్!!!

పెళ్ళయ్యేంతవరకు ప్రేమ గురించి, తండ్రి మాట పెడదోవన పెట్టడం గురించే ఆలోచించింది. పెళ్ళయ్యాక క్రొత్త విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. అత్త (మేనత్తే కావచ్చు.. కానీ..), ఆడబడుచులు, మరుదులు వాళ్ళ చుట్టాలు, పక్కాలు. ప్రొద్దున్న లేచిన దగ్గిర నుండి, రాత్రి పడుకునేంత వరకు తన ప్రేమ ఏ మూలనో..! వీళ్ళ అవసరాలు, వాళ్ళ అవసరాలు మిగితా తోటికోడళ్ళు, అత్త ఆరళ్ళు, డబ్బు సంపాదించి తెమ్మనివాళ్ళ అలకలు… ఉఫ్!.. మళ్ళీ ఆకలి, డబ్బులేమి, ఇంతమంది తినడానికి రెడీ గా వుండడం వల్ల.. తాను కూడా ఇక తినడం అవసరమా అని ప్రశ్నించుకోవలసిన సంధర్భాలు ఎలా ఎన్నో ఆమె జీవితంలో తన ప్రమేయం లేకుండానే తొంగి చూసేస్తున్నాయి. బావ మాత్రం మామూలే, సినిమాహాలు ఉద్యోగం. మెల్లగా ఆ సినిమా హాలులో పనిచేసే వాళ్ళ ప్రోద్బలం తోనే త్రాగుడు మొదలెట్టాడుట. అంతే అప్పటి నుండి, అతని పతనం స్టార్ట్ అయ్యింది. అలా అలా… వాళ్ళ ప్రేమ మూలన పడింది. అతని కుటుంబం పూర్తిగా ఈమె జీవితాన్ని ఆక్రమించేసింది, ప్రసాదు పూర్తిగా అన్ని రకాల వ్యసనాలకి అలవాటయిపోయి జయమ్మను డబ్బు తెమ్మని చితక తన్నడం మొదలెట్టాడు. తండ్రి ఎన్నో సహాయాలు చేశాడు, చెప్పినా వినలేదు ఏమయిపోతుందో కూతురి జీవితం అని బాధపడేవాడు. అయినా ఆమె బ్రతుకు తెల్లారలేదు. చాలా మంది పిల్లలు పుట్టి చనిపోయారు, ఆఖర్న ఇద్దరి ఆడపిల్లలు మాత్రమే మిగిలారు. ఈ లోపు అత్త కూడా చనిపోయింది, ఆవిడ చనిపోవడంతో.. ఆవిడ ద్వారా జయమ్మ ని పట్టి పీడిచిన ఇతర కుటుంబీకుల భారం కూడా వదలడం మొదలుపెట్టింది, అప్పటికే జయమ్మ జీవితంలో అలసిపోయింది. ఇకనుండి చేసే క్రొత్త అలసట ప్రయాణానికి క్రొత్త బాధ్యత మొదలయ్యింది… వ్యసనాల పాలయిపోయి, అప్పులపాలయిపోయి పనికి పనికిరాకుండా పోయి మూల్న పడున్న మొగుడు, పెరుగుతున్న ఇద్దరు కూతుళ్ళు!!

జయమ్మ తన మిగిలిన శక్తినంతా కూడదీసుకుని మళ్ళీ నడుం బిగించింది. ఇంత బాధలో కూడా తాను దైవభక్తిని మరవలేదు. శుక్రవారం రాగానే ఉపవాసం దుర్గమ్మ తల్లికి. ఇక ఇంటిపరిస్థితులని చక్కబెట్టాలని నిర్ణయించుకున్నది, లేపోతే.. తనలాగే తన బిడ్డలు దిక్కులేనివాళ్ళవుతారని, ఎందుకూ పనికి రాకుండాపోయిన తన మొగుడ్ని చివరివరకూ ఎలా చూడడం అని అందరి దగ్గిరా వాపోయేది. ఇంతలో తనకి సహాయకారిగా వున్న తన తండ్రి కూడా కన్ను మూసాడు. తనకిక ఆఖరి సపోర్టు కూడా పోయింది, మళ్ళీ దిక్కులేనిదయింది.. కానీ ఉన్నవాళ్ళకి తానే దిక్సూచి కావలసిన పరిస్థితి.

ఆవిడ బాధని అర్ధం చేసుకున్న కొంతమంది మంచి మహిళలు తమ ఇళ్ళల్లో చిన్న చిన్న పనులు చేయించుకుని డబ్బు ఇస్తుండేవారు. వారి ఇళ్ళల్లో ఏమి వండుకున్నా ఈవిడకి పిల్లలకి ఇస్తుండేవారు. ఆ విధంగా తిండి గడిచిపోయేది. తర్వాత.. తాను అప్పుడప్పుడు పని కాకుండా పూర్తిగా నాలుగయిదు ఇళ్లు ఒప్పుకొని సహాయకారిగా ఉండడం మొదలుపెట్టింది. ఆ అమ్మగార్లిచ్చిన సలహాలు పాటిస్తూ, వాళ్ళు ఇచ్చే జీతంలో కొద్దిభాగం వాళ్ళ దగ్గిరే దాచుకునేది. ఇతర ఖర్చులేమీ చెయ్యకుండా వాళ్ళిచ్చిన బట్టల్ని తాను వేసుకొంటూ, వాళ్ళ పిల్లల బట్టల్ని తన పిల్లలకి సరి చేసి వేస్తూ.. నాలుగు డబ్బులు కూడేసుకుంది. ఆ డబ్బు తన కోసం కాదు.. తన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యడానికి, వాళ్ళు చదివితే చదివించడానికి. మొగుడికి తానెంత సంపాదిస్తుందో కరెక్ట్ ఫిగరు ఎప్పుడూ చెప్పేది కాదు. డబ్బు ఇమ్మంటే ఇవ్వటం లేదని.. పాపం జయమ్మని తన్నేవాడు అహానికి పోయి. అయినా అతన్ని క్షమించేది, మళ్ళీ ఆదరించేది, ఆశ్చర్యం!!! ఏమన్నా అడిగితే.. పాత పెళ్ళి ఫొటో చూపిస్తాది…..

“లేదు.. పాపగారూ ఆడికా తాగుడు వల్ల బుర్ర పాడయిపోయి అలా అరుస్తాడు నా మీద. లేకపోతే అలాటోడు కాడు, ఎంతందంగా ఉన్నాడో చూడండి ఆనాడు? అందుకే పేమించేశాను” …. అనేసి వెళ్ళిపోతుంది.

ఇలా విన్నప్పుడల్లా మాకనిపిస్తుంది. తాగుడు మైకమో.. అతని బుర్ర పాడయిందో.. ఆవిడ అలా అవమానింప బడినప్పుడల్లా తాను పూర్వపు ఆలోచన్లకి వెళ్ళి ప్రస్థుత గాయాల్ని మ్రానుచుకుని ముందుకి వెళ్తుందేమో అని. ఎందుకంటే ప్రేమకి బ్రతికించే శక్తి వుంది. పూర్వపు ఆలోచన్లలో ఆమె ప్రేమ బ్రతికే వుంది.  She is giving psychological treatment for herself. ఆమెకి అక్షర జ్ఞానం లేదు, నేనివ్వగలిగిన విశ్లేషణ ఇవ్వలేదు. కానీ ఆమె చేసే చర్య లో ఒక విచక్షణ వుంది.

ఇలాగే సాగుతుంది ఆమె జీవితం. ఆమె పెద్ద కూతురు గాయత్రి చేతికొచ్చింది. ఆ పిల్ల ని బడికి పంపింది కొన్నాళ్లు, కానీ ఆ పిల్లకు చదువు అబ్బలేదు. ఆ పిల్లనే చదువు మానేసి ఏదైనా పనికి వెళ్తానన్నది. ఇది జయమ్మకి బాధ కలిగించే విషయమైనా తప్పలేదు. అందుకని.. ఆమెని ఇంటి పన్లలో పెట్టకుండా ఒక కిరాణా షాపులో ఆర్డర్స్ తీసుకుని, పొట్లాలు కట్టే పనిలో పెట్టింది, అలాగే కిరాణా పనికి వెళ్ళేముందు గుడి మెట్లు కడిగి, ముగ్గు పెట్టడం లాంటి చిన్న చిన్న పన్లలో పెట్టింది. కానీ చిన్న పిల్ల పూర్ణ మాత్రం భిన్నంగా వుంది. ఆమె చదువుకుంటుంది. చదువుకోవాలని జిజ్ఞాస కలిగి వుంది. ఆమెకి కనీసపు చదువు చెప్పించి ఏదైనా ఉద్యోగంలో పెట్టాలని ఆమె ఆశ. దానికి తన పెద్ద కూతురు గాయత్రి సహాయం కూడా వుంది. తల్లీ కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఆ పూర్ణని చదివిస్తున్నారు. ఈ లోపు గాయత్రికి సంబంధాలు రావడంతో  మూడేళ్ళ క్రితమే ఆమెకి పెళ్ళి చేసింది జయమ్మ. ఇప్పుడు జయమ్మ సింగిల్ హ్యాండ్ అయిపోయింది.. ఉన్నదాంట్లోనే బావని, పూర్ణని చూసుకుంటున్నది. ఇప్పుడు పూర్ణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసింది. ఇక్కడితో జయమ్మ కష్టాలు తీరాయంటారా?.. ..లేదు.

ఇప్పుడు మూడవ షో స్టార్ట్!!!

గాయత్రిని మొగుడు, వాళ్ళ అత్తవారు సరిగ్గా చూడరు. కోరినంత కట్నం ఇచ్చింది, అప్పులు చేసి మరీ అన్ని లాంచనాలు తీర్చింది, అయినా జయమ్మకి మోక్షం లేదు. అల్లుడుకి సంపాదన బాగుంటుందని అబద్దం చెప్పి పెళ్ళి చేసుకున్నారు ఆ అమ్మాయిని. సంపాదన బాగానే వుంటుంది వాడు పనిలోకి వెళితే… కానీ వెళ్ళడు, బద్దకం. గాయత్రి వెళతానంటుంది, కానీ పంపడు అనుమానం. అందుకే డబ్బు కావలసినప్పుడల్లా… విధిలేక ఆ అమ్మాయి మొగుడు పిల్లలతో సహా.. జయమ్మ మీదే వాలుతుంది. జయమ్మకి బరువు అదనమయ్యింది…… కొన్ని జీవితాలు ఇంతేనేమో… అంతులేని కధ !!!

 

****************

 

జయమ్మ జీవితాన్ని మొత్తంగా ప్రస్థుతానికి మూడు షోలు గా విభజిస్తే చిన్నతనం, ప్రేమ-పెళ్ళి, పిల్లలు. ఆ మూడు షోలలో కూడా ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసమే కనబడుతుంది. తన తల్లిలో అది లోపించింది. తనని వదిలి ఆమె వెళ్ళిపోయింది, తనకొక తోడులేక వంటరిదై జీవించింది, తోడుకోసం బావని చేసుకున్నా..అక్కడా నిరాశ ఎదురయ్యింది, అత్తకున్న బరువులు, కమిట్ మెంట్స్ తన మెడకి గుదిబండ అయ్యింది. తన ప్రేమ ఏ మూలకో విసిరివేయబడింది, ఈ లోపున బావ, ఆమె జీవితం రెండూ చెయ్యిజారిపోయింది. పిల్లలు ఎదుగొచ్చారు. అన్నీ కరక్ట్ గానే చేసాను, పిల్ల సుఖపడుతుంది అనుకున్న సమయంలో ఆమె జీవితంలో కూడా తనకు జరిగిన అనుభవాలే చూడడం మొదలుపెట్టింది, అయినా విసగలేదు…వెర్రెక్కలేదు. ఆమె కష్టాలు ఆమె తుది శ్వాసతోనే ఆగుతుందేమో (ఎన్నోసార్లు అన్నది కూడా). అయినా వెనుదిరగకుండా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతూనేవుంది.

మరి ఈమె “ధీర” అని చెప్పడంలో సందేహమేమన్న వుందా?

 

 

 

1 thought on “ధీర-3 – అంతులేని కధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *