May 1, 2024

పురుషాహంకారం

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

పందిరివైనంత మాత్రాన అలా పకపకా నవ్వాలా?

నీ  పురుషాహంకారాన్నినాపై ఇలా రువ్వాలా?

నా పువ్వులే నిన్నుఅలంకరిస్తున్నాయని,

నా సొగసులే నీకు అందానిస్తున్నాయని,

మరిచిపోతున్నావు.

లతను నేను, పందిరి నీవు అయినంత మాత్రాన,

నీ ఆధారంగా నేను నిలబడినంత మాత్రాన

నాపై అధికారం ఉన్నట్లు పొరబడుతున్నావు.

నేను లేని నీవు తోడులేని మోడులా,

మమతలేని మనసులా ఉంటావని

తెలుసుకోలేక తడబడుతున్నావు.

నా ఆకులు నీ ఆశలు, నా పువ్వులు నీ నవ్వులు,

నా సొగసులు నీ షోకులు, నా జత నీ జీవం,

నా ఉనికి నీ కూరిమి, నా ఉసురు నీ బలిమి,

నా నీడ నీ ఆకారం, నేను లేకుంటే నీవు వికారం.

ఆధారం అన్నపదం మరిచి,

అనుబంధం పెంచుకుందాం.

అహంభావానికి వెరచి,

ఆత్మీయతను పంచుకుందాం.

ప్రకృతీ పురుషులై రమిద్దాం,

పరస్పరప్రేమకై శ్రమిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *