May 5, 2024

మాంగల్యం తంతునా నేనా …(తరాలు- అంతరాలు)

రచన: ఆదూరి హైమవతి
విశ్లేషణ: జ్యోతి వలబోజు

వివాహబంధం

“ ముహూర్తం దగ్గర పడుతున్నది, పెళ్ళికూతుర్నితీసుకురండి “ పెళ్ళి చేయిస్తున్న పురోహితుడు మంత్రాలు చదవడం ఆపి, పెద్దగా పెళ్ళిపెద్దల్ని ఆదేశించాడు.
పెళ్ళికూతురు తరఫు ముత్తైదువులు పట్టుచీరల పరపరలతో గబగబా పెళ్లికూతురి గదిలోకి వెళ్ళి, గోడక్కొట్టిన బంతిలా అదే వేగంతో తిరిగొచ్చి ” పెళ్ళి కూతురు కనపడ్డం లేదు.” అని గట్టిగా అరిచారు.
అది వినగానే పెళ్ళికొడుకు ముఖం పాలిపోయింది. చేతిలోని అక్షింతలు క్రింద వదిలి, అవమానంతో తలవంచుకున్నాడు. పెళ్లికొడుడు తండ్రి “ఏమండీ ! బావగారూ! మ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్ళి ఎలా నిర్ణయించారండీ!‘ అష్ట వర్షాత్ భవేత్ కన్యా ‘ అని ఎనిమిదేళ్ళ పిల్లల ఇష్టాయిష్టాలతో పని లేకుండా మన అమ్మల కాలంనాడు పెళ్ళిళ్ళు చేశారు , మీ కూతురు 28 ఏళ్ళ పిల్ల. తనకు ఇష్టం లేకుండా ఎలా చేస్తున్నారండీ పెళ్ళి? మమ్మల్ని అవమానంపాలు చేయడానికా?” అంటూ కోపంతో అరిచాడు.
పెళ్ళి కూతురు తండ్రి ఆయన చేతులు పుచ్చుకుని బ్రతిమాలుతూ “ఇవి చేతులు కావు, కాళ్ళనుకోండి. ఒక్క పది నిముషాలు టైమివ్వండి, ఏం జరిగిందో నేను కనుక్కుంటాను. మా అమ్మాయి సంపూర్ణంగా ఇష్ట పడ్డాకే ఈ పెళ్ళి నిర్ణయించామని మీకూ, మీ కుమారునికీ అందరికీ తెలుసు కదండీ! నాక్కొంచెం ఊపిరి తీసుకునే సమయమివ్వండి! ప్లీజ్” అంటూ లోపలికెళ్లాడు.
పెళ్ళి బాజాలతో, అమ్మలక్కల మాటలతో, బంధువుల పరస్పర పరాచికాలతో, మంత్రోఛ్ఛారణతో , పిల్లల పరుగులు అరుపులతో కళకళ లాడుతున్న పెళ్ళిహాలు ఒక్కసారిగా చిన్నబోయి, మూగపోయింది.
పెళ్ళికూతురు తండ్రి లోపలికి పోయినవాడు అలాగే బయటికి వచ్చి తలపట్టుకుని పెళ్ళిమంటపం మీద కూలబడ్డాడు. “తండ్రిని బుకాయించి ఎవరితోనో లేచిపోయుంటుంది. ఈ కాలం ఆడపిల్లల్ని ఎవ్వరూ నమ్మలేరు. ఏక్షణానికి ఏం చేస్తారో?” బుగ్గలునొక్కుకుంటూ పెద్ద ఓముత్తైదువ తన అభిప్రాయం వెలిబుచ్చింది.
“అంత ఇష్టం లేకపోతే ఈ పెళ్ళి వద్దని చెప్పచ్చుగా. తీరా పీటలమీదికి వచ్చేముందు ఇలా అందర్నీ ముంచేసి వెళ్ళక పోతే?” మరోఆవిడ. “అసలు ఈ వంశమే అంత , వీళ్ళమ్మేం తక్కువ తిన్నదా? ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? ఊరికే వచ్చిందా సామెత?”
” పిల్ల తాతేం తక్కువ కాదు. మీకు తెల్సోలేదో?”
“ఓహో వంశమంతా ఇలా లేచిపోయిన వాళ్ళేనన్నమాట?”
“ఇహ అనుమానం ఎందుకూ? ఏ ఇతర కులస్తునితోనో , మతస్తునితోనో లేచిపోయి ఈపాటికి పెళ్ళి కూడా చేసేసుకుని ఉంటుంది . తండ్రినీ , పెళ్ళికొడుకునూ వెర్రి వెంగళప్పల్ని చేసి చక్కాపోయింది.”
“ఐనా ఈకాలం పిల్లలు మనలాగా కాదు వదినా! తల వంచుకుని ఎవరిచేత కట్టించుకోమంటే వాళ్ళ చేత తాళి కట్టించుకునేవాళ్ళం. పిల్లల్ని కనడం, ఇంటిల్లిపాదికీ నోరుమూసుకుని సేవలు చేయడం అంతే కదా!మా ఆడపడుచును వాళ్ళాయన, అత్తా కూడా కొట్టేవారుట ! ఏనాడూ నోరువిప్పి చెప్పిందే కాదు. ఆరోజులే వేరు వదినా! చచ్చినా బ్రతికినా అత్తింటే కదా!”
“కాదూ మరి ! అయ్యో అంతదాకా ఎందుకూ? మా అత్తగారు తనకు త్వరగా వేకుననే కాఫీ ఇవ్వలేదని, నాపైనా చేయి చేసుకునేది వదినా!” “మరైతే ఈ పెళ్ళికూతురు తల్లి విషయమేంటీ? ఎవరితోనైనా…” ఆసక్తిగాముందుకు వంగి అడిగిందో వనిత. “అబ్బే అదేం లేదు. కాపోతే ఆడపడుచును అత్తింటి వారు ఆరడి చేస్తున్నారంటే ఇంట్లో తెచ్చిపెట్టుకుందామని అన్నాట్ట వాళ్ళాయన, అదే పెళ్లికూతురు తండ్రి. ఆమె వద్దందిట, అలా చేస్తే ఆమె సంసారానికే మోసం వస్తుందనీ, పిల్లల తల్లిని వదిలించుకుని, ఆమె భర్తకు మరోపెళ్లి చేస్తారనీ, మెల్లిగా వాళ్ళే సర్దుకుంటారనీ, కావలిస్తే తాను వెళ్ళి మాట్లాడి వస్తాననీ వాదన చేసిందిట. పెళ్లికూతురి తండ్రికి చెల్లెలంటే మహా ప్రీతిట. కోపమొచ్చి “ఐతే నీవే వెళ్ళు ఇంటి నుంచీ, నా చెల్లెల్ని నా ఇంటికి తెచ్చుకుంటా”నని కోపంతో అన్నాట్ట.
అంతే ఆమె ఇంట్లోంచీ వెళ్ళి పోయింది. ఇది జరిగి మూడేళ్లయింది. ఆమెకు ఉద్యోగం ఉందిలే. అదీ ధీమా, సంపాదించుకుంటూ బ్రతుకుతోంది.”
“పుట్టింటచేరిందా?”
“లేదు లేదు. తాను వేరే ఇంట్లో ఉంటున్నది. ఈ ఊర్లోనే సుమా! స్వత్రంత్రం, స్వేఛ్ఛ!” “మరి ఆడపడుచు ఇంట్లో వచ్చి చేరిందా?”
“ఆహా! అతగాడు వెంటనే తన చెల్లెల్నీ, ఆమె సంతానాన్నీఇంట్లో తెచ్చిపెట్టుకుని పోషించాడు. ఏమైందో ఏమో గానీ ఆమె భర్త ఇటీవల వచ్చి భార్యాపిల్లల్నితీసుకెళ్ళాట్ట! .” ” పెళ్లికూతురి తల్లి అదేదో ఆడవాళ్ళను కాపాడే డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుందంట, ఆవిడేదో చేసిందని అంతా అనుకుంటుంటే విన్నాన్లే!” అంది ఓముదిత. “మరి పెళ్లికూతురి తల్లి ఇహ రావచ్చుగా!” “ఏమో ఏంజరిగిందో! ఇతగాడు పిలవలేదేమో! పిలిచినా ఆవిడ పంతానికి పోయి రాలేదేమో! ఏది ఏమైనా కూతురి పెళ్ళికి రాకపోడం అన్యాయం కదూ!” “ఉద్యోగం ఉంటే అదో దారి, ఆర్ధిక స్వేఛ్ఛతో పాటుగా ధైర్యం కూడానూ. మరి ఇప్పుడు పీటల మీదెవరు కూర్చుంటున్నారు కన్యాదానానికి?”
“ఇంకేం కన్యాదానం కానీ, అటకెక్కి పోయింది కదా! ఐనా పాపం పెళ్లికూతురు వరసకు పెదనాన్న, పెద్దమ్మా కూర్చుంటున్నార్లే! ఏది ఏమైనా ఊర్లోనే ఉన్న పెళ్లికూతురు తల్లిని పిల్చుకు రావాల్సింది కదూ!“ “అద్సరేకానీ , మరి వీళ్ల తాత విషయమేంటీ? చిన్నిల్లు పెట్టుకున్నాడా ఏం?”
“అంత సీను లేదు కానీ, ఇంట్లో అసలాయన మాటకు చెల్లుబాటే లేదుట మొదట్నుంచీ. చిల్లుకానీ క్రింద తీసేసేదిట వాళ్లావిడ. ఆర్నెల్ల క్రితం ఒకనాడు తనకు నేతి గారెలు, నేతిసున్నుండలూ, ఓకరోజు పూరీలూ, పచ్చిమిర్చి బజ్జీలూ , మైసూరు బోండాలూ కావాలని చిన్న పిల్లాడిలా మారాంచేస్తే, ఆవిడ‘ బీ.పీ, షుగరూ పెట్టుకుని, అసలే అరుగుదల లేకుండా, అవి తింటే ఆరోగ్యమేమవుతుందీ ? మెల్లిగా రోజుకొకటి చేసి ఒక్కో ముక్కా పెడతానందిట, ఆహా వింటేనా ఆ మొండిఘటం, నాకు అన్నీఈ రోజే ఇప్పుడే కావాల్ని పట్టుపట్టాట్ట. ఆమె కూడదన్నదనీ, కోపమొచ్చీ వెళ్ళి వృధ్ధాశ్రమంలో చేరాట్ట, అది ప్రకృతి వైద్యశాల కూడాట!. ఉండనీ అక్కడి జీవితం రుచి చూస్తేనన్నా, ఆ తిండికీ ఆహారపు అలవాట్లకూ ఒళ్ళు బాగుపడి, ఇంటి హాయి తెలుసొస్తుందనీ వారితో జాగ్రత్తగా చూడమని రహస్యంగా చెప్పివిషయాలు తెల్సుకుంటున్నదిట ఈ పెళ్లికూతురు. ఏమాట కామాటే చెప్పుకో వాలి , ఈ పెళ్లికూతురు మహా తెలివిగలదిలే!“ “మరీ చిన్నచిన్న వాటికి బెదిరించి ఇళ్ళలోంచీ పోవడం ఏం బావుంటుందీ? జీవితాలుకదా! “
“ప్రతికుటుంబంలోనూ చిన్నచిన్న పొరపొచ్చాలు వస్తుంటాయి. అంతమాత్రాన ఇళ్ళు వదలిపోడం, విడాకులిచ్చుకోడం మంచిపనా? ఓర్పు వహించాలి.”
“ఐతే కొట్టినా తిట్టినా అత్తింట్లోనే బానిసలా పడుండాలా? అక్కడే చావాలా? స్వేఛ్చగా ఉద్యోగం చేసుకుని బ్రతికితే తప్పా?” ఒక ఆధునిక మహిళ తన మాటలతో అక్కడున్న వృధ్ధ స్త్రీలనందరినీ గడగడలాడించింది.
“అలాని ఎవరన్నారు? ఎలాగో సమర్ధించుకోవాలికానీ సంసారాలు వదిలేసి పోయి భర్తను, బిడ్దలను బాధ పెట్టి ఇంటిపరువు బజారునేస్తారా? తప్పుకాదూ? వంటరిగా బ్రతకడం అంత తేలికా?”
“ఐతే తప్పంతా ఆడవాళ్ళదేనంటారా? అందుకే ఆడదే ఆడదానికి శతృవు అన్నారు. “
“ఎల్లకాలం బాధలు భరిస్తూ బతకాలా? జీవితమంతా కడగళ్లతో కళ్ళ న్నీళ్ళతో గడపాలా? తాగుబోతుల్నీ , చావగొట్టేవాళ్ళని ,భరించాలా?”
“తప్పంతా ఆడాళ్ళదేనా? మగవాడి బాధ్యతేం లేదా దీన్లో?” అంటూ ఆవేశంగా అడిగారు అక్కడున్న అమ్మాయిలు కొందరు.
“అమ్మాయిలూ! మీరంతా బాగా పెద్దపెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ సమాజంలో తిరిగే వారు, మీకు మా మాటలన్నీ తప్పుగానే తోస్తాయి. మాదంతా పాత చింతకాయపచ్చడి అంటారు, ఔనా?”
“అదేంకాదు బామ్మగారూ! బ్రతికినా చచ్చినా అత్తిల్లే లేక మొగుడిల్లే స్వర్గమని బాధలు భరించక్కర్లేదు అంటున్నాం.. అంతే! గౌరవంగా, స్వంతకాళ్ళమీద బ్రతకడంతప్పా?”
“కాదమ్మా తల్లులారా! మీరే కరెక్ట్!! మమ్మల్నిక వదిలేయండి” “అదిసరేకానీ మన వాదనలాపి, ప్రస్తుతానికి రండి. ఈ పెళ్ళిఅయ్యేనా పొయ్యేనా ?.ఆ వంటలేదో ఐతే ఇంత ముద్ద తిని ఇంటికి పోదాం పదండి, టింగురంగా అంటూ ఇంటిల్లిపాదిమీ వచ్చాం, ఇదేదో మహా పెళ్ళైనట్లు, పెటాకులైందికదా!. ఇళ్ళకెళ్ళి వండుకు తిననూ లేము, హోటళ్ళకెళ్ళనూ లేమూ? బీ.పీలూ షుగర్లూనూ. ఏంచేద్దామో చెప్పండి ,” అందో పెద్దావిడ.
ఇంతలో “లేరా ! ఇంకా ముంగిలా అలా కూర్చుంటావేం? నీకు పిల్లే దొరకదా ఏం? లే పోదాం”అంటూ పెళ్ళికొడుకు తాత వచ్చాడు మంటపం దగ్గరికి. పెళ్లికూతురు తండ్రి అయోమయంగా ఏమీ చేయలేక కూర్చునున్నాడు. ఎటూ తనకు రావాల్సిన దక్షిణ ఇవ్వనే ఇస్తార్లే అని పురోహితుడు మంటపం స్తంభం ఆనుకుని కునుకు తీస్తున్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి పెళ్ళిహాలు ముందు ఆగింది. దాన్లోంచీ పెళ్లికూతురు పట్టుచీర, నగలు, బుగ్గన చుక్కా, బారుపూల జడతో డ్రైవింగ్ సీట్లోంచీ దిగి , పక్కతలుపు తీసి, బిడ్డనెత్తుకునున్న ఒక యువతిని దింపి,” రండి ఏమీ ఫరవాలేదు” అని ఆహ్వానిస్తూ, వెనుక తలుపుతీసి ఒకావిడ్ని చెయ్యిపట్టి దింపింది. వెనుక మరో తలుపు తీసి ఒకముసలాయన్ని పట్టుకుని , చెరోచేత్తో నడిపించుకుంటూ మంటపం, దగ్గరికి వచ్చింది. ఆ ముసలాయన చాకులా ఉన్నాడు, ఆమెకంటే వేగంగా నడుస్తున్నాడు. ఒక కుర్చీ తెచ్చివేసి ఆ ముసలాయన్నికూర్చోబెట్టి , ఆ యువతిని కూడా తీసుకొచ్చి మరో కుర్చీలో మంటపానికి దగ్గరగా కూర్చోబెట్టింది. నడిపివయసావిడ్ని వివాహమంటపం మీద తన ఎడం వైపున కూర్చో బెట్టుకుని ,
“రండి నాన్నగారూ! పంతులు గారూ !మంత్రాలు చదవండి ముహూర్తానికింకా పది నిముషాలుంది.”అని చెప్పి,”సారీ ! మీకు చెప్పకుండా వెళ్ళ వలసి వచ్చింది, ఐయాం సో సారీ ! కన్ ఫ్యూజ్చేసినందుకు మామయ్యగారూ మన్నించండి! మా అమ్మగారూ, తాతగారూ నేను వెళితే తప్పరారని తెచ్చేందుకు వెళ్ళాను. ఇహ మా వదిన్ని నేనేగా తీసుకురావాల్సింది ” అంది పెళ్లికొడుకు వైపు చూసి చిరునవ్వుతో, పెళ్లికొడుకు నాన్న వైపు క్షమించమన్నట్లూ చూసింది పెళ్లికూతురు. ఆ యువతిని చూడగానే పెళ్ళికొడుకు ముఖంవెలిగి పోయింది. తండ్రికి తెలీకుండా ప్రేమవివాహం చేసుకుందని ఆయన ఆమెను దూరంగా ఉంచిన విషయం ఇతరలకెవ్వరికీ తెలీదు. పెళ్లికొడుకు అతడి తరఫువారు అంగీకారంగా మౌనం వహించారు. మంత్రాలు ఎక్కడ ఆపిందీ గుర్తులేక పురోహితుడు ” సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే ..” అని అందుకున్నాడు. అందరి నోర్లూ మూతపడ్డాయి. అంతా గప్ చిప్పై, నోర్లెళ్ళబెట్టుక్కూర్చోగా
“మంగళ సూత్రం అందుకో బాబూ! “అన్నాడు పురోహితుడు.
“మాంగల్యంతంతునా నేనా..మమ జీవనహేతునా కంఠే బధ్నామి..” అని పఠిస్తూ.

************

విశ్లేషణ:
పెళ్లి వేర్వేరు వాతావరణంలో పెరిగిన ఇద్దరు వ్యక్తులను జీవితానికి ఒకటిగా చేస్తుంది. ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకుంటూ, అర్ధం చేసుకుంటూ కలిసి నడవాల్సిన బంధం పెళ్లి. పెళ్లి తర్వాత తెలుసుకుని చేయాల్సిన పనులు ముందే చేయడం అనేది విశేష గుణం. కుటుంబ కలహాల వల్ల దూరమైన కుటుంబ సభ్యులను పెళ్లికూతురే వెళ్లి తీసుకురావడం అనేది ఊహించని విషయం. నాకెందుకులే అని అనుకోకుండా పెళ్లికూతురు తన పెళ్లికి కొద్ది గంటలముందే ఎవరికీ చెప్పకుండా వెళ్లి ఇరువైపులా చాలా కావల్సినవాళ్లను స్వయంగా తోడ్కొని వస్తుంది. అలా పెళ్లికూతురు మాయమవడం పట్ల ఇతర బంధుమిత్రులు మాట్లాడే మాటలు కూడా సర్వసాధారణమే అనిపిస్తుంది. కాని పెళ్లికూతురు తన చర్యవల్ల రెండు కుటుంబాలకు సంతోషాన్నిచ్చి ఒక మంచి వ్యక్తిత్వంగల కూతురిగా, కోడలిగా, భార్యగా తన్ను తాను నిరూపించుకుంటుంది.. ఎంత పెద్ద చదువులు చదివినా ఈనాడు అమ్మాయిలు, అబ్బాయిలకు కుటుంబ విలువలు తెలియాల్సిన అవసరం చాలా ఉందని చెప్తున్నారు రచయిత్రి ఆదూరి హైమవతి..

4 thoughts on “మాంగల్యం తంతునా నేనా …(తరాలు- అంతరాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *