May 3, 2024

రికార్డుల రికార్డు`ఆత్మకూరు రామకృష్ణ కళాప్రస్థానం

రచన: మాకినీడి సూర్య భాస్కర్‌

003

సృజనకు స్ఫూర్తి… అంతుబట్టని అపురూప చిత్రం ఈ ప్రకృతి!
ప్రకృతిలోని అందాలు చూసే కొద్దీ మురిపించి మైమరపిస్తాయి!!
కొండలు, కోనలు… గట్టులు, గుట్టలు… చెంగున దుమికే లేళ్ళు, సెలయేళ్ళు… పచ్చని వర్ణంతో పరిసరాలను చైతన్య పరచే చెట్లు, చేమలు… కలకూజితాలతో గాలికి రంగులద్దే పిట్టలు… ఉభయ సంధ్యల్లో రాగరంజితమయ్యే సువిశాల ఆకాశం… ఆ ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటపడే తెలినురగల కెరటం…
వీటిని చూసి గంతులు వేయని హృదయముంటుందా? ఏ భావుకత లేని అతిసాధారణ హృదయమే ఈ అందాల్ని చూసి పులకిస్తుంది. ఇక కళాకారుల హృదయాల సంగతి వేరే చెప్పాలా!
ప్రకృతి అందాలకు ముగ్థుడై, ఆ శోభ మనసులో కల్పించిన అనుభూతిని తోటివారికి పంచిపెట్టేందుకు, ఆ ప్రకృతినే అనుకరిస్తూ దానికి ప్రతికృతిని తయారుచేస్తాడు, చిత్రకారుడు. కాగితమో, కాన్వాసో, మరేదైనా తలంపును కుంచెల సాయంతో అనుకున్న రంగులను అనుకున్న విధంగా వివిధమైన ఛాయలతో, ఛాయాప్రభేదాలతో… తన మనసులోని సంవేదనలను వర్ణాంచితం చేస్తాడు.
అయితే, కుంచెల అవసరం లేకుండా చిత్రించేందుకు, వారి చిత్రణ విధానానికో నవ్యతను కూర్చుకునేందుకు ఎన్నెన్నో ప్రయోగాలు చేసే అపురూపమైన చిత్రకారులు కొందరుంటుంటారు. వారిలో ప్రఖ్యాత అమెరికా నైరూప్య అభివ్యక్తి చిత్రకారుడు జాన్సన్‌ పొల్లాక్‌… మరో అమెరికా విద్యావేత్త చిత్రకళావిద్యలో చేతివేళ్ళ చిత్రీకరణని ఒక మాధ్యమంగా ప్రవేశపెట్టిన రూథ్‌ పయ్‌జన్‌ షా, ఆమెకు అనుయాయులుగా జాన్‌ థామస్‌ పైన్‌, కారీలు… టెయిలర్‌ రమ్సే, నిక్‌ బెంజామిన్‌, జిమ్మీ లీ సుదాత్‌ మొదలైనవారు ఉన్నారు.
నిజానికి, చిత్రకారులందరూ చిత్రాలను గీస్తూ చేతివేళ్ళను ఏదో ఒక సందర్భంలో ఉపయోగిస్తారు. కుంచెను పట్టుకుందుకు చేతి వేళ్ళే ఆధారమౌతాయి. కానీ… వేళ్ళతో కుంచెను పట్టకుండా, ఆ వేళ్ళనే కుంచెగా ఉపయోగించి గొప్ప చిత్రాలను సృజించగల వినూత్న చిత్రకారులు కొందరే. ఈ ‘వేళ్ళకుంచెల’ చిత్రకారులు వేళ్ళమీద లెక్కించ గలిగినంతమంది మాత్రమే మనకు తారసపడతారు. అలాంటి కొద్ది మంది చిత్రకారుల్లో వేలెత్తి సగర్వంగా చూపించగలిగే సత్తా ఉన్న మన తెలుగు చిత్రకారుడూ ఒకరున్నారు. ఆయనే ఆత్మకూరు రామకృష్ణ.
ఆయన చేతివేళ్ళే కుంచెలు!
వివిధ రకాలైనవి, 0,1,2,3 నంబర్ల రౌండ్‌, ఫ్లాట్‌, ఫ్యాన్‌, ఫిల్బర్ట్‌, రిగ్గర్‌, లైనర్‌, స్వోర్డ్‌, మాప్‌ బ్రష్షులు… ఆయన అరచెయ్యే అద్భుతమైన రంగుల విన్యాసాన్ని ప్రకృతి శోభతో రంగరించి కాన్వాసు మీదికి విరజిమ్మే ప్యాలెట్‌!
మొత్తంగా ఆయన చెయ్యి ఒక మంత్రదండం!!
ఆయన చేతులతో ఏం మ్యాజిక్కు చేస్తారో…
చూస్తున్న మనకి అర్థం కాదు. కాని…
చూస్తున్నంతలోనే రంగురంగుల సుశ్రావ్యమైన మ్యూజిక్‌!
చూస్తున్న మన కళ్ళద్వారా చెవులకు వినబడుతుంది. అదే మాయ…
రామకృష్ణ సృష్టించే రంగుల మెస్మరిజం…
నాలుగైదు నిమిషాల్లో 12I18 అంగుళాల కాన్వాసుపైన ఒదిగిపోయే రంగుల రసరమ్య ప్రకృతి చిత్రం…
వర్ణ సంగీతం వినిపించే కవనీయ, కమనీయ విచిత్రం…
ఆ అద్భుతం సాకారమైన విధం తెలుసుకుందామా!

* * * * *

అది, మే 20, 2010
బెంగుళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్ లో కేంద్రీయ విద్యాలయం కార్యరంగం. వేదిక మీద కాన్వాసుల దొంతరలు రెండు… నిలువెత్తుగా… లెక్కపెట్టమంటారా? ఒక్క క్షణం… ఒకటి… రెండు… ఆః… సరిగ్గా ఒక వంద ఉన్నాయి… నిరీక్షిస్తూ!
తన తాత, తండ్రి కుస్తీలు పట్టి నెగ్గిన సాహసాలు తలపుల్లో కదలాడుతుండగా, ఒక నిశ్చల, గంభీర మానవమూర్తి, కాన్వాసుల దొంతరల ఈవల నిలబడి ఉన్నారు. ఆ వారసత్వ రక్తం లోపల ఉరకలు పెడ్తుంటే కలిగిన మనోధైర్యంతో, ఏదో తపఃసమాధిలో మునిగినట్లున్న నిర్మల వదనారవిందుడై, అంతర్ముఖీనుడై, దేనికో సంసిద్ధుడై… చేతికి అందేంత దూరంలో మరోపక్క రంగులు, వాటిని పరచి పెట్టుకున్నారు, ఒక క్రమంలో. అంతలో కదిలి, తొణకని చూపులతో జరిగిన ఏర్పాట్లను సమీక్షించుకుంటూ, తల పంకించుకుంటూ వేదిక మీదకు చేరింది, ఆ మానవాకారం, మిన్నంటే చప్పట్ల హోరుమధ్య… ఆసనాన్ని సిద్ధం చేసుకుంది. ఏకబిగిని 24 గంటలు దానిమీద కూర్చోవాలి మరి!

001
ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ అనిల్‌కుమార్‌ ఝా, ఐ.ఏ.ఎస్‌. గారు జ్యోతిని ప్రజ్వలింపజేశారు, ముహూర్తాన్ని నిర్ణయిస్తూ! గాయకులు శ్రీ అనంత్‌ మంద్ర గానాలాపన సాగుతోంది. ప్రకృతిని కీర్తిస్తూ ఆ గానం మనోహరంగా, సుమధురంగా… అలనల్లన చెవులకు సోకుతోంది.
ఉదయం 8 గంటల 15 నిమిషాలైంది.
చేతి వేళ్ళను రంగుల్లో ముంచుతూ, ఒక రంగును మరో రంగుతో మేళవిస్తూ… మిశ్రమ వర్ణాలను కేన్వాసుపై అద్దుతూ… సుతిమెత్తని మునివేళ్ళ తాకిడిని కాన్వాసు పైభాగంలో లేత నీలంతో అలా అద్దితే… ఆకాశంలో తేలుతూ మేఘమాలిక అలా అలా కదలిపోతూ…
కొంచెం కిందుగా… వేళ్ళు, మొత్తంగా చేతులూ పైకీ, కిందికీ వేగంగా, కానీ సుతారంగా కదులుతుంటే… ఓహ్, కొండ రూపు దిద్దుకొంది. ఇంకొంచెం కిందగా, మృణ్మయమైన పచ్చిక మైదానం…
మెరుపు వేగంతో చేతివేళ్ళ కదలిక… మెరిసిపోయే రంగుల వైభవం…
ఒకదాని పక్కన, మీదన మరొకటిగా చేరుతూ మైదానాలు, శాద్వలాలు, చెట్లు, పుట్టలు…
8 గంటల 19 నిమిషాలు ` నిర్నిమేషమైన ప్రేక్షకుల కనురెప్పలు నాలుగుసార్లు మూత బడి తెరచుకునేంతలో… కాన్వాసు మొత్తం రంగుల కాంతులతో, రసరమ్యంగా వెలిగిపోతూ నిలువెత్తు ప్రకృతి చిత్రం వచ్చి చేరింది. కళ్ళకు కాస్తంత విశ్రాంతినిచ్చిన ప్రేక్షకులు తమ చేతులకు పని చెప్పారు. హర్షధ్వానాలు మరింత ఉత్సాహపరచగా, పునః సమాయత్తమయ్యాడు చిత్రకారుడు.
కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఎవరెవరో వచ్చి వెళ్తున్న హడావిడిలో, వారు నింపాల్సిన పత్రాలేవో నింపుకుంటుండగా … ఆ చిత్రకారుని వెనుక ఒక యంత్రాంగం సర్వం వెయ్యి కళ్ళతో సన్నద్ధమై పరిశీలిస్తుండగా ` అదేమీ పట్టని ఆ చిత్రకారుడు మరో కాన్వాసును అందుకున్నారు. అతని అపారమైన చిత్రకళానైపుణ్య విన్యాసం… యావత్తూ చేతి వేళ్ళలోకి చేరిపోయిందా అన్నట్టుగా ఒక ప్రకృతి చిత్రం తరువాత మరొకటిగా, పూర్తయిన చిత్రాల సంఖ్య పెరుగుతుంటే… కాన్వాసుల దొంతర చకచకా మరుగుజ్జుదైపోతోంది!
‘‘ఇంత భారీకాయుడైన ఈయన 24 గంటలు అలా నేలపై ఎలా కూర్చోగలడు?’’
‘‘కూర్చున్నా, వంద చిత్రాలు బ్రష్‌ లేకుండా వేయగలడా?’’
‘‘రంగుల్తో మునిగిన ఆ చేతులకు ఏమీ కాదా?’’
‘‘ఆ చేతి వేళ్ళు అరిగిపోవా?’’ ప్రేక్షకులెందరున్నారో అన్ని సందేహాలు, గుసగుసలుగా గాలిలో ప్రసరిస్తుండగా… చిత్రకళా రంగంలో మాష్టర్‌ మీడియంగా ప్రణుతికెక్కిన తైల వర్ణాలతో అనాయాసంగా… సునాయాసంగా చేతి వేళ్ళను కుంచెలుగా చేసుకుని, తానే నర్తిస్తున్నాడు చిత్రకారుడు… కాన్వాసులపై, చూపరుల మనోయవనికలపై!
అనేకమైన సుందర ప్రకృతి దృశ్యాలను అలవోకగా, కలనేతగా సృజిస్తూ…
మధ్యాహ్నం పన్నెడు గంటలైంది ` 32 చిత్రాలు ముద్దులొలుకుతూ తయారయ్యాయి.
సాయంత్రం నాలుగు గంటలైంది ` ఏకంగా ఏభై ఎనిమిది చిత్రాలు ఎంచక్కా తయారయ్యాయి.
ఆరు గంటలైంది ` ఆరు బయల ప్రకృతి చిత్రాలే అన్నీ ! క్రతువును మొదలుపెట్టిన పది గంటల్లో… 41 చిత్రాల లక్ష్యాన్ని అధిగమించి, అవలీలగా ఎంతో ముందుకు సాగిపోయింది, ఆ కర లీల!

సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రముఖ కన్నడ సాహితీవేత్త డా॥ వెంకటేష్‌ జి. మల్లేపురం, కర్ణాటక చిత్రకళా పరిషత్‌ ప్రిన్సిపాల్‌ శ్రీ ఆర్‌.హెచ్‌. కులకర్ణి, ఉపన్యాసకులు శ్రీ బాబూ జత్‌కర్‌ గార్ల చేతులమీదుగా అప్పటివరకు పూర్తయిన 72 చిత్రాల కళాప్రదర్శన ప్రారంభమైంది.
అప్పటికీ చిత్రకారుడు, మొక్కవోని ధైర్యంతో, నిశ్చల మానసంతో, చెరగని చిరునవ్వుతో తన చేతివేళ్ళను కాన్వాసుల మీద ముద్రిస్తూనే ఉన్నారు.
రాత్రి 8 గంటలకు ` కేవలం పన్నెండు గంటల్లో ఎనభై పైగా (87) చిత్రాలను రచించి తన లక్ష్యానికి అతి చేరువగా చేరిన ఆ క్షణంలో` ప్రేక్షకుల ఉత్సాహం కట్టలు తెంచుకుంది… ఉరకలు వేసింది.
మరో గంట గడిచింది. పైన నాలుగు పదుల నిమిషాలు.
9 గంటల 40 నిమిషాలకు ఆఖరి చిత్రం 99వ చిత్రం సరసన చేరింది.
24 గంటల్లో వేయాల్సిన 100 చిత్రాలు మరి కొద్ది సేపట్లో పూర్తి అయిపోనున్నాయి.
ప్రపంచ రికార్డుల పుస్తకాల్లో ఓ సరికొత్త రికార్డు చేరింది!
మానవ లక్ష్యంకన్నా అతనిలో దాగొని ఉన్న మానవాతీత శక్తి గొప్పదని నిరూపితమైంది!
రికార్డుల మీద రికార్డులు తరిగిన కాన్వాసు దొంతరల స్థానంలో పేరుకుంటున్నాయి.

03a.URDB World Record

1. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డు
2. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు (ఫింగర్‌ పెయింటింగ్‌ మారథాన్‌)
3. గ్లోబల్‌ వరల్డ్‌ రికార్డ్‌
4. వండర్‌ వరల్డ్‌ రికార్డ్‌
5. యు.ఆర్‌.డి.బి. అధికారిక వరల్డ్‌ రికార్డ్‌ (అమెరికా) Fastest Time To Paint 100 Landscapes.
6. రికార్డ్‌ హోల్డర్స్‌ రిపబ్లిక్‌ (ఇండియా)
7. అసిస్ట్‌ వరల్డ్‌ రికార్డ్‌ (పాండిచ్ఛేరి)
8. ఎవరెస్ట్‌ వరల్డ్‌ రికార్డ్‌ (నేపాల్‌)
9. యునీక్‌ వరల్డ్‌ రికార్డ్‌
10. ఎమేజింగ్‌ వరల్డ్‌ రికార్డ్‌ బుక్‌
11.‘ఏకవీర’ స్టేట్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌
12. మిరకిల్‌ వరల్డ్‌ రికార్డ్‌
13. వరల్డ్‌ అమేజింగ్‌ రికార్డ్‌
14. రికార్డు హోల్డర్స్‌ రిపబ్లిక్‌ ఇండియా రికార్డ్‌
15. యలైట్‌ వరల్డ్‌ రికార్డ్‌
చేతి వేళ్ళను కుంచెగా చేసుకుని చిత్రీకరించేది తెలుగువారిలో రామకృష్ణ ఒక్కరే. అదే అరుదైన విషయమనుకుంటే, దానిని మించిన అనితరమైన విషయాన్ని కూడా సృష్టించారు. చేతివేళ్ళ చిత్రణతో ఆయన చరిత్రనే సృష్టించారు… సృష్టిస్తూనే ఉన్నారు… తిరగ రాయడానికీ సంకల్పిస్తూనే ఉన్నారు.
4x6 limca
పదమూడు గంటలపై అదనంగా మరో అరగంట సరిపోయింది ఆయనకు వంద ప్రకృతి చిత్రాల్ని తన చేతివేళ్ళతో… కేవలం వేళ్ళతో, బ్రష్‌ లేకుండా, చిత్రించడానికి! ఇదే ఆయన సృష్టించిన చరిత్ర. అలవోకగా చిత్రించి, లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో ఓ నూతన రికార్డును తన పేర నమోదు చేసుకుని, తద్వారా తెలుగు ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేశారు.
చేతి వేళ్ళ చిత్రీకరణలో తనదైన శైలి, గొప్ప నైపుణ్యం సాధించిన రామకృష్ణ, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ, రానున్న చరిత్రలో తన పేరును తన చేతివేళ్ళ సంతకంగా, కాదు కాదు, చేతివేళ్ళ చిత్రంగా… చిత్రంగా స్థిరపరచుకున్నారు.
రికార్డుల మీద రికార్డులుగా తన కళాప్రస్థానాన్ని సాగిస్తున్నారు.
రంగుల్ని రంగరించుకున్న ఆయన మునివేళ్ళ స్పర్శతో వందలకు వందలుగా కాన్వాసులు ప్రకృతి సంస్పర్శను తమ దేహంపై మోస్తూ, చూపరుల మాసస కాన్వాసులను కూడా రాగరంజితం చేస్తాయి… విస్మయానందాలకు గురిచేసి సమ్మోహన పరుస్తాయి. ఆ రంగులూ, రాగాలూ కమ్మని కవిత్వమూ వినిపిస్తాయి!

3 thoughts on “రికార్డుల రికార్డు`ఆత్మకూరు రామకృష్ణ కళాప్రస్థానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *