May 3, 2024

అదే దారి…

రచన: చిత్ర

“పోనైతే అందింది కానీ ఒత్తాడో రాడో” అని గాభరా పడుతున్నరాములమ్మ, కొడుకుని చూడగానే నిమ్మళించింది.
“వూల్లోన రెండు తగువులు. తెంపుకుని రావొద్దేటి?” టీ తాగుతూ చెప్పుకుపోతున్నాడు, నలభై మైళ్ళవతల పల్లెటూర్నించి వచ్చినవాడు.
“మనోల్లంతా పేటొగ్గీసి అయిస్కూలు నుండి ఆస్టలు మద్దినున్న జాగాలో ఇల్లు ఏసుకుంతన్నారు కదా! దాని గురించి”
“తీసీమనా ఏటీ?”
“కాదే!.మనం కట్టి ఇరవై ఏల్లు దెగ్గిరైంది. అప్పుడెవరూ ఏటీ అన్నేదు. ఇప్పుడు, మనోడే, ఒకుడు ఇల్లు కడదాం అని గునపం దిగేసీసరికి ఎవులో దిగబడ్డారు. అది అమ్మీసార్ట. అక్కడ లే అవుటేస్తారంట. తీరా, కాయితాల్జూస్తే అయ్యి కోముటోల పేరనున్నాయి”.
“మీరిక్కడిలాగ తాపీగ వూసులాడుకుంతంటే అక్కడంతా అయిపోద్ది” వెళ్ళిపోతూ కేకలేసింది జ్యోతి. ఇద్దరూ గబగబా వెళ్ళి చూసేసరికి అక్కడంతా హడావిడిగా ఉంది. మీటింగు చెప్తున్నారు.
“పేదలందరికీ అరవై గజాల చొప్పున ఇళ్ళ స్థలాలివ్వాలని మనం ఎప్పట్నించో డిమాండు చేస్తున్నాం. ధర్నాలు చేసాం. ఆందోళనలు చేసాం. లాఠీదెబ్బలు తిన్నాం. ఇన్నాళ్లకి ఇది ఒక రూపానికొచ్చింది. మన మహా నాయకుడు పోధాన్ పేదలు బాగుపడాలంటే అందర్నీ ఆస్తిపరుల్ని చెయ్యాలన్నది ఆయన ఆశయం…”
వాడవాడంతా అక్కడే ఉంది. ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా పదిమంది జనాన్ని సర్దుతున్నారు. “నా పేరు ముందు రాయి”. “నీను ముందొచ్చాను” అని జనం మూగుతున్నారు. పేర్లు రాస్తున్న వాళ్ళకి ఊపిరి ఆడడం లేదు.
ఇళ్లస్థలాలు కావాలంటూ గొడవలూ, ఆందోళనలూ చెయ్యగా చెయ్యగా–కొత్తగా వొచ్చాట్ట, ఆఫీసరు.. లంచాలవీ తినట్ట. ఈల బాగా వేస్తాడని “ఈలబాబంతారు అతన్ని” అన్నాడు వెంకటేషు. ఒకరోజు నాయకులందర్నీ పిలిచి మాట్లాడేట్ట. ఏం గావాలంటే పేదలందరికీ అరవయ్యేసి గజాలు ఇళ్లస్థలాలు కావాలన్నార్ట. ఆయన ఏమీ అనకుండా అయిదు నిముషాలు ఆలోచించేట్ట. “సరే. ఎవరెవరికి ఇవ్వాలో అర్హులందరి పేర్లూ, ఖచ్చితమైన వివరాలూ, ఋజువులూ పట్రండి. అప్పుడు మళ్ళీ మాట్లాడదాం”. అని లేచిపోయేట్ట.
ఎక్కడో చిన్న తగువు “నా పేర్రాయనంటే కుదరదు. రాయవలిసిందే”
“ఒకే ఇంట్లో రెండు పేర్లు రాయడం కుదరదు”.
“ఆ గల్ల చొక్కా వోడికెలా రాస్సేవు? ఆడీ వాడలోనే వుండడు”
“అతనికి రేషను కార్డూ, ఆధార్కార్డూ లోకల్ ఎడ్రసుతో ఉన్నాయి. నీకూ ఉంటే పట్రా” అని మెల్లిగా పక్కకి లాగీసేరు . అతనూరుకోడు.
“ఇచ్చీది గవర్మెంటు, పుచ్చుకునీది నీను. మద్దిన ఈల్లెవరు?”
“ఈల్లెవరు అని అంత సులువుగ అనీకొరే! ఆలే మన కోసం తిరిగినారు. బాదలు పడ్డారు. కనీసానికి మన ఓట్లడిగీ వోల్లయినా కారు” అని ఎవరో సర్ది చెప్తున్నారు.
“నిజమే అన్నా! ఇలాటోల్లు ఐదారేల్లపాటు దెబ్బలు తిని, జైల్లకెల్లి, నానా పర్రాకులూ పడితే ఇగో మన కోలనీ పుట్టింది. మనం దీనికి ఇందిరాగాందీ కోలనీ అని పేరెట్టాం”.
“కోలనీ మొత్తానికి ఈల్లకి పది ఓట్లన్నా పడవు”.
పోదన్, పోదన్ అని గెంతుకుంటూ వొచ్చి చటుక్కున నిలబడి “మీకు స్తలాలిస్తన్నాడ్రా పోదన్. ఆస్తిపరుల్ని సేస్తన్నాడు . దన్నాలెట్టరేట్రా ? ఎట్టండి, ఎట్టండి” అనుకుంటూ పోయేడు వెర్రప్పడు. జైల్లో తగిలిన దెబ్బలకి మతి చెడిందంటారు.
రాములమ్మ కొడుక్కి ఫోనొచ్చింది. ఎవరితోనో మాట్లాడి వచ్చి” వూల్లోన తగువండీ, ఇందిరమ్మ ఇల్లులు వొచ్చినాయికదా! ఆడు నలపై ఏలిస్తన్నాడు కదా అని ఈల్లు అప్పులు చేస్సి ఇల్లు కట్టీసేరు. వొడ్డీలమీద వొడ్డీలు. కూలి చేసేవాడు వొడ్డీ ఏటి కడతాడు? అసలేటి తీరుత్తాడు? పల్లెటూల్లంటేమో పనుల్నేవు. అప్పులోల్లొచ్చి ఇల్లు సోధీనం సేసీమని అల్లరల్లరి.”
మెయిన్రోడ్డంతా జనమే. అల్లరి అల్లరిగా ఉంది.
“ఈ మురికివాడ పెద్ద న్యూసెన్సు బాసూ. చూడు, గవర్నమెంటు రోడ్డు సగం ఆక్రమించేసేరు. ఈ హడావిడేంటోగానీ ఇవాళ్ళ రోడ్డంతా ఆక్రమించేసేరు. వీళ్ళని తీసీడానికి ఎవరికీ ధైర్యం లేదు” మోటారుసైకిళ్ల మీద పోతూ ఎవరో విసుక్కుంటున్నారు.
“ఈ వాడ మా పక్కనే ఉండడం వల్ల మా షాపులకి సరైన అద్దెలు రావడం లేదు. ఉన్నవాటికి “లుక్” లేక బేరాల్లేవు. ఇప్పటికైనా వీళ్ళు కదిలితే…” ఒక షాపు ఓనరు కాస్త హుషారుగానే ఉన్నాడు.
ఆకలేస్తోందని తినడానికి కూచున్నారు పేర్లు రాసేవాళ్ళు. కొంతమంది చుట్టూ మూగేరు.
“అయితే ఇప్పిటికి ఎన్నిపేర్లు రాసేరండి?”
“ఇక్కడెన్నయ్యాయో చూడాలి. కానీ టౌన్లో మొత్తం నలభై ఏభై చోట్ల టీములుగా రాసేం. నిన్న రాత్రికి సుమారుగా పది లక్షలమంది అయ్యేరు”
“పది లక్షలమందా ? ఏటి మనూర్లోనే?”
“మన ఊళ్ళోనే? అనీకు. దేశం మొత్తంమీద నగరాల్లో సగం మంది మురికి వాడల్లోనే బతుకుతున్నారని ప్రభుత్వమే చెప్తోంది”
“అయితే అందర్నీ ఏటి సేస్తారో?!”
“ఏటి సేస్తారు? ఏటీ అవ్వదు, సింగువాడ సూసేం కద!”
“సింగువాడేంటి?” అన్నాడు రాములమ్మ కొడుకు.
“జంక్సనున్నాది కదా! అక్కడ రోడ్డు వారకి రైలువే గోడ కానించి పది కుటుంబాలుండీనాయి. ఆలంతా సింగులు. ఇనపరేకులు, వూసలు తెచ్చుకుని అట్లపెనాలు, అట్లపుల్లలు, గమేలాలు, కత్తిపీటలు, మూకుళ్ళు సేసుకుని అమ్ముకుంతారు. ఆడా, మగ తేడా నేదు. సమానంగ పని సేత్తారు. ఆలకక్కడ గుడిసి కాదుకదా గుడారవయినా నేదు. సెట్ల నీడనే బతుకుతారు.”
“అవునవును, సూసేను, ఆల్లకేటైంది?”
“ఎవడి కేటైందో తెల్దుగానీ ఒక రోజు తెల్లారీసరికి పొక్లెయిన్లు, క్రేన్లు తెచ్చి ఆల్లందర్నీ అక్కడ్నించి లేపీసేరు”
“మరి ఏటైపోన్రు ఆలందరూ?”
“ఏటీ అవనేదు. ఆల్లకి ఆనందపురం అవతల మనుసుల్లేనికాడ దింపీసి ఇక్కడుండండి అన్నారట. ఆల్లు పది రోజులు నిశబ్దం గుండి మెల్లి మెల్లిగా వొఛ్ఛీసేరు”
“ఏమీ?”
“ఏమీ ఏటెయ్, జాగా ఉంటే సరేటి? ఆ అడవులంట ఆలు ఏటిసెయ్యాల? ఆలు సేసీ వొస్తువులు ఎక్కడమ్ముకోవాల? ఎలా బతకాల?”
“ఇల్లోక్కాడ, బతుకొక్కాడ అంతే ఎవులికైనా నరకమే!”. మళ్ళీ రాతలు మొదలు పెట్టినట్టున్నారు.
“నా కొడుక్కీ నాకూ సంబందమేటండి?. సెట్టుకింద బతికినాం గనక కలిసి వొండుకున్నాం. గోడలంటూ లేచినాక, నాదీ అని వొచ్చినాక ఎవులి పొయ్యి ఆల్దే అవుతాది. ఇగో నాకు కోటా కార్టున్నాది. ఆదారం కార్టున్నాది. నాపేర్రాయవలిసిందే” ఎవరోఒకామె పెద్దపెద్దగా అరుస్తోంది.
మనిషోమాట మాట్లాడుతున్నారు. ఊహలకి అంతులేదు.
“అయితేటి మనకి ఎక్కడిత్తార్రా జాగాలు?”
“ఎక్కడో ఇత్తారు వాంబే కాలనీనాగ”
“ఏటి? వూరవతలా? వాంబే కోలనీ సూసినాను. మాయమ్మి ఉంతంది కదా!” పనికి వూల్లోకి రావాలంతే రోజుకి ఏభై రూపాయలవుతంది. సీకట్నే బయల్దేరియ్యాల. మల్లీ రేత్తిరికెప్పుడో! మాసెడ్డ కస్టం!!”
“ఓరీ.. నువ్వు వాంబేకే అలగంతన్నావు. బక్కన్నపాలెం లోపలికున్నాయి కొన్ని. పైనా పిల్కోలనీ లోపలి కున్నోల సంగతేటి? కణితిలో వున్నోల్లేటి సేస్తన్నారు? పిట్టలోడిపాలెం సూసేవా?”
“మరందుకే మనకంత దూరంలో వొద్దు. వూల్లోనే ఇమ్మని సెప్పండీ”
“ఆ రాసీవోల్లకే సెప్పండి. నేకపోతే మరి ఆల జెండాలు మొయ్యమని సెప్పు. మీటింగులకి రామని సెప్పండి”.
మరెలాగా మొయ్యము. ఊరొదిలీసి ఎలిపోనాక, మనిసొక్కాసి సెదిరిపోనాక ఆలెవరో మనమెవరో! ఆ కొసనించి ఎలాగొత్తాం మీటింగులకి?”
వూళ్ళో జాగాలన్నీ ఎవరెవరో అమ్మీసేరనీ, ఎవరో కొనుక్కున్నారనీ అవి ఇవ్వడం ప్రభుత్వంవల్ల అవ్వదనీ తేల్చేరు.
“గవర్మెంటు జాగాలుంతే సెప్పెయ్!” అని సవాలేసేరవరో..
“ఎందుకు లేవెస్, మా బాగున్నాయే సెప్పీదా?”అంటాడొకడు. అక్కడొక వినోదకార్యక్రమం మొదలైంది.
“ఒరే గవన్రు బంగలాకంత జాగాఎందుకు?”
“రైల్వేగౌండు అంతోటున్నాది, మనకిసాల్దేటి?”
“యూనివర్శిటందుందెయ్!అదీ ఇచ్చీవొచ్చు”
“పోర్టు స్టేడియమున్నాది. వయ్యెస్సార్ స్టేడియమున్నాది”
“కలక్ట్రాపీసేటిసిన్నదేటి?”
“ఒరే అయ్యన్నీ నిజంగిచ్చీసినా ఎయ్యిమందిలో ఒక్కిడికి సరిపోద్ది. మిగతావోల్ల సంగతేటి?”
“ఊర్నిండా కొండలే ఉన్నాయి కదరా!.కప్పరాడకొండలు, కైలాసపురం కొండలు, దేవుడికొండలు……”
చెప్పుకుపోతుంటే ఎవరో ఆపి కొండలు ఇవ్వడం కుదరదన్నారు.
“వోతావరనం దెబ్బ తినేస్ది. పొల్లూసనం చేసేద్ది” అన్నారు.
“ఎందుకివ్వకూడదు? ఎంకటేస్వర మిట్ట ఏటిసేసేరు?ఆసీలుమెట్టఎలాగిచ్చీసేరు?”
“అది వేరు. ఆ దుకానాలు సూసేవా? అక్కడ పిండొడాలూ, పచ్చిరొయ్యలూ అమ్మరు. బంగారం, వొజ్రాలు, రతనాలు అమ్ముతారు. ఒక్కరోజులో ఆ కొండమీద వందకోట్ల యాపారం జరుగుద్దంటే, నూటికి రెండ్రూపాయాలేసుకో టేక్సు. ఎంతొస్తాది గవుర్మెంటుకి? నీకూ నాకూ ఇస్తే ఏటొస్తాది, బూడిద!
“అయితేటి? ఊరొగ్గీసిపోడవేనా?”
“తప్పదురా! జాగా వొచ్చిందనుకో, దాన్ని కాపాడుకోవాల, నేదంతే ఎవులో ఒకలు దూరతారు. సరిపేట్టెస్తారు. అందుకని మనం అక్కడే ఉండాల”
“పని లేనికాడ ఎలాగుంతాం? నీనైతే అమ్మేసుకుంతాను”
“అందరూ అందుకే”
“అమ్మీసుకుంతారా ?ఎవులు కొనిస్తారు?”
“ఊరవతల ఇంతమంది జాగాలు ఒక్క సుట్టు కొనాలంతే ఎవుడిగ్గావాల? ఎవుడో ఒకడు అదును జూసి అద్దురూపాయికి సరిపెట్టేత్తాడు”
“అవునంతేన్రా! ఆరిలోవలో ఏటి జరిగింది? అప్పుడందరూ వందవంద తీసుకొని స్టాంపుపేపర్ల మీద సంతకాలెట్టేసేరు. అయ్యలాగ మారుగుళ్ళయ్యి ఇప్పుడయ్యన్నీ జమచేసి అపార్టుమెంట్లేసి అమ్ముకుంతన్నారు”
“అవును.నానూ అమ్మీసినాను.అనుకోనేదు ఇంత పెరిగిపోద్దని. అవుసరాలొకటే…”
“నువ్వొక్కడివేట్రా?బర్మాకోలనీలోన, మాదవదార కోండమీద, ఈ అపార్టుమెంట్లన్నీ ఎలాపుట్టేయి?”
“ఒక్కటి మాత్రం నిజంరా. మనం ఎటెల్తే అటే ఊరు పెరుగుద్ది.. తర్వాత అక్కడ యాపారం సాగుద్ది”
అప్పలకొండకి కాళ్ళు లేవు. చక్రాలకుర్చీలోనే పగలూ రాత్రీ. ఎవరోవెళ్ళి
“నీపేర్రాయించేవేట్రా?” అంటే “లేదు అవసరం లేదు” అనేసేడు.
“ఏమీ?” అంటే నవ్వేసేడు.
“ఉన్నూర్లో పని దొరికితే సాలామంది ఎళ్లిపోతారు. మిగిలినోళ్ళకి ఇళ్ళున్నాయి. పదిగదుల ఇంట్లో ఇద్దరుంటున్నారు. ఎయ్యిగజాల జాగాలో ముగ్గురు బతుకుతున్నారు. కొత్తయిల్లు అక్కరలేదు. అయ్యి మనకి చాలు”.
“అదెలా కుదుర్తాది?ఆళ్ళిస్తారేటి?”
“ఆళ్లివ్వరు.. మనమే తీసుకోవాలి. అదొక్కటే దారి. మరోదారి లేదు.అంతా బోగస్” అని తేల్చీసేడు.

*************

(శ్రీకాకుళ సాహితివారు కధలసంకలనం తెస్తూ అడిగితే రాసిన కధ. ఆ పుస్తకం ఈ కధ లేకుండానే విడుదలైంది)

1 thought on “అదే దారి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *