May 2, 2024

శోధన 2

రచన: మాలతి దేచిరాజు

sodhana

పాతబస్తీ…

యాభై నాలుగేళ్ల జర్దార్ ఓ చిన్న ఇంట్లో ఇనుప మంచం మీద కూచున్నాడు.అతనికి ఎదురుగా ఓ చిన్న టేబుల్ మీద పోర్టబుల్ టీవీ వుంది,అందులో వస్తున్న వార్తలను   చూస్తున్నాడు.

నలుగురు యువకులను జనం చంపేస్తోన్న దృశ్యం కూడా ప్రసారం అవుతోంది…యు ట్యూబ్ లో చిత్రీకరించిన వీడియో మధ్య మధ్యలో వేస్తున్నారు.

ఏ నేరం చేసినా సాక్ష్యాలు వుండకూడదనుకునే జర్దార్ ఇప్పటి వరకూ పలు కిడ్నాప్ కేసుల్లో నిందితుడు.సరైనా సాక్ష్యాలు లేక కొన్ని,బెయిల్ మీద బయటకు వచ్చిన కేసులు మరికొన్ని, అండర్ గ్రౌండ్ నుండి బయటకి  వచ్చిన జర్దార్ అందరి కంటికీ  కనిపిస్తూనే వుంటాడు.అయినా మన వ్యవస్థలోని లోపాల వల్ల అతను చట్టానికి మాత్రం  దొరకడు. అందుకే నిర్భయంగా నేరాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు.

తన జీవితంలో ఎదురైన ఏ విషయాన్నీ అంత తొందరగా వదిలిపెట్టే మనస్తత్వం లేని జర్దార్ ఎదురుగా  టీవీలో కనిపిస్తున్న న్యూస్ చూస్తూ శోధన గురించే ఆలోచిస్తున్నాడు.

ఎవరీ శోధన…ఒక జర్నలిస్ట్ లా ష్ట్రింగ్  ఆపరేషన్ చేయడమేమిటి? తనేమన్నా  జర్నలిస్టా? నిజానికి ఈ నాటి  నెట్ విజ్ఞానం తనలాంటి వాళ్లకు ఒక  ఆయుధంగా పనికివస్తోంది, ఎలా అంటే తన అనుచరులకి ఇతర  దేశాలలో ఉన్న తనలాంటి డాన్ లకు రహస్య సందేశాలు పంపటం,  చేయాల్సిన కార్యక్రమాలను సైతం రెండో కంటికి తెలియనీయకుండా ఈ సోషల్ నెట్ వర్క్ లో చాప కింద నీరులా జరిపేసుకోవడం, రహస్య వెబ్ సైట్స్ హ్యాక్ చేయడం ఇలాంటి వెన్నో సునాయాసంగా చేసేసుకుంటూ మాఫీయా రాజ్యాధినేతలుగా ఎదిగిపోతున్నారు అలాంటిది ఈ నాడు ఒక సామాన్య ఆడపిల్ల  శోధన లాంటి వ్యక్తి  తన లాంటి వాళ్ళను ఇదే నెట్ ద్వారా ఎండగడుతోంది.  అన్నింటికన్నా ముఖ్యమైన విషయం  అతడు ఇంతగా కంగారు పడడానికి కారణమైన విషయం ఆమె చంపిన ఆ నలుగురు జర్దార్ ఇన్ఫార్మర్స్ అందుకే ఈ పరిస్థితులు అతనికి మింగుడుపడటం లేదు పైగా వాళ్ళని తను చంపకుండా తమకంటే   తెలివిగా వాళ్ళని ప్రజలే చంపేలాగా చేసింది. అది అతనికి మింగుడు పడని విషయం అయింది,  పంటికింద రాయిలా గుచ్చుకుంటోంది .

 

 

కాఫీ హౌస్…

నగరంలో మంచి పేరు వున్నా హోటల్. ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి వరకూ వేడి వేడి ఇడ్లీ దొరికే ఒకే ఒక “ది బెస్ట్ హోటల్” గా పేరుంది. ఇడ్లీ ప్రియులు రోజుకు ఒక్కసారైనా ఆ హోటల్ కు వస్తుంటారు.

సమయం సాయంత్రం ఆరు గంటలు

ఎప్పటిలానే మన్మథరావ్ ఆ హోటల్ కు వచ్చాడు. విచిత్రమైన వ్యక్తి అతను, మంచి జాబ్,అంత కన్నా మంచి వైఫ్, అయినా అతనికి సంతృప్తి లేదు అతడి దృష్టిలో లైఫ్ అంటే  అమ్మాయిలతో సరదాగా గడపడం రోజుకో కొత్త అందం కోసం వేటాడటం. అతను అమ్మాయిలను ట్రాప్ చేసే విధానం కూడా  విచిత్రంగా వుంటుంది.తన దగ్గర వున్న అన్ని తెలివితేటలను (అందులో అతి ఎక్కువ ) ఉపయోగిస్తాడు.అమ్మాయిలను ట్రాప్ చేయడం గొప్ప ఆర్ట్ అంటాడు,హోటల్ లో మెనూ మారినట్టు అతని డైరీ లో అమ్మాయిలు క్యాలండర్ లో డేట్ లా మారిపోతూ వుంటారు.

ఈ రోజు అతను ట్రాప్ చేసిన అమ్మాయి పేరు గీతిక, కొత్తగా డ్యూటీ లో జాయిన్ అయింది, మన్మథ రావ్ ఆమెకు బాస్.

ఇద్దరూ ఎదురెదురుగా కూచున్నారు.

మన్మథ రావ్ మూడవ సారి తన క్రాఫ్ సరిచేసుకుంటూ  గీతిక వైపు చూసి “నూట డెబ్భై” అన్నాడు.

గీతిక అర్థం కాక “ఏమిటి సార్?” అని అడిగింది.

“నిన్ను నేను చూసిన చూపులు…ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే అందం నీది” “నీకో విషయం తెలుసా? నిద్రమాత్రలు వేసుకోకపోయినా నిద్ర పట్టేలా చేసే బ్యూటీ స్లీపింగ్ పిల్ వి”  ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు మన్మథ రావ్.

గీతిక మొహం ఎర్రబడింది. ఒక కాంప్లిమెంట్ ,అదీ తన బాస్ ఇచ్చే కాంప్లిమెంట్.

“నీ పేరు గీత అయితే బావుండేది,ఎందుకంటే నువ్వు నా గుండె మీద గీసిన   గీతవి” చాల చీప్  ట్రిక్ ప్లే చేసాడు.

“సార్ మీరు మరీను మేడం కన్నా నేను బావుంటానా?” అతని భార్యను ఉద్దేశించి అంది .

మన్మథ రావ్ దీర్ఘంగా నిట్టూర్చి”ఆమె నలుపు…నువ్వు తెలుపు, ఆమె పొట్టి…నువ్వు మంచి  హైట్, ఆమె ఎపుడూ సీరియస్ గా వుంటుంది…నువ్వు నవ్వుతూ వుంటావు..”

“ఆమె దగ్గర నాకు బాధ దొరుకుతుంది… నీ దగ్గర సంతోషం మిగులుతుంది,ఇంత కన్నా ఏం చెప్పను.” “నన్ను అనుక్షణం అనుమానిస్తుంది అని చెప్పనా? ఆఫీసు లో అలిసిపోయి ఇంటికి వెళ్లేసరికి ఆమె ఏ క్లబ్ కో వెళ్తుందని చెప్పనా?” బాధ నటిస్తూ అన్నాడు.

“అయ్యో మీకెన్ని కష్టాలు సార్…సారీ మిమ్మల్ని బాధ పెట్టాను.” ఆమెకి ఇంకా మగాళ్ళ సైకాలజీ ముఖ్యంగా మన్మథ రావ్ లాంటి వాళ్ళ సైకాలజీ తెలియదు. అప్పుడే కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది.ప్రేమకు స్నేహానికి, తేడా తెలియదు, తెలియని దశలో వుంది.

“గీతికా నా మనసులో బాధ నీతో పంచుకుంటే నాకు రిలీఫ్ గా వుంది” చుట్టూ చూసి గీతిక వైపు చూసాడు. ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ అనుభవం ఆమెకు అలవాటు లేదు.

అతను మరి కాస్త అడ్వాన్సు అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

అప్పుడే “ఎక్స్ క్యూజ్ మీ” అన్న గొంతు వినిపించింది.

తల తిప్పి చూసాడు చికాగ్గా మన్మథ రావు. మంచి మూడ్ లో, గీతికను లైన్ లో పెట్టే  ప్రాసెస్ లో వున్న అతనికి  ఆ గొంతు పెద్ద అడ్డంకి గా అనిపించింది.

ఎదురుగా ఓ అందమైన అమ్మాయి,అతని చికాకు అమృతాంజనం రాసినట్టు ఎగిరిపోయింది. వెంటనే మొహమంతా కిలోల కొద్దీ చిరునవ్వు పులుముకుని “యస్ మేడం” అన్నాడు.

“టేబుల్ మీద నా మొబైల్ మర్చిపోయాను “అంటూ టేబుల్ మీద వున్న మొబైల్ తీసుకుంది.

ఆ మొబైల్ అప్పటి వరకూ ఆన్ లోనే వుంది. అది ఓ నెంబర్ కు డయల్ చేయబడి వుంది.

మన్మథ రావ్ మాటలు అవతలి నంబర్ కు స్పష్టంగా వినిపించాయి.

అవతలి నంబర్ మిసెస్ మన్మథ రావ్ ది.

 

శోధన ఒక సుడిగాలిలా వచ్చింది, సముద్రంలేని చోట సునామీ లా చుట్టేసింది.

వస్తూనే  సి ఐ ఎదురుగా వున్నా కుర్చీలో కూర్చుంది. పక్కనే లాకప్ , నిందితులను ఉంచాల్సిన ఆ లాకప్ లో ఓ అమాయకపు యువతిని ఉంచాడు సి ఐ.

ఇరవై రెండేళ్ళ ఆ యువతి లాకప్ ఊచలను పట్టుకుని భయం భయంగా చూస్తోంది.

అప్పుడే స్టేషన్ లోకి వచ్చిన శామ్యూల్ శోధనను చూసి ఒక్క క్షణం ప్రభువుకు కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు.

ఇంకా మందు మూడ్ లోనే వున్నాడు సి ఐ దుర్జన రావ్.అతని కళ్ళు ఎర్రగా వున్నాయి.

“ఏయ్ ఎవర్నువ్వు “మాటలు తడబడుతున్నాయి కానీ ఆ మాటల్లో అధికార గర్వం తొంగి చూస్తోంది.

“సార్ సార్ నన్ను కొందరు తరుముతున్నారు…నాకు షెల్టర్ కావాలి.”

“ఈ రాత్రి మీ పోలీస్ స్టేషన్ లో తలదాచుకుని రేప్పొద్దున్నే వెళ్ళిపోతాను” బుద్ధిగా చెప్పింది శోధన.

“ఏయ్…అసలు నువ్వేమనుకుంటున్నావ్?” “ఇదేమైనా నీ అత్తరిల్లా? వెళ్ళు…వెళ్ళూ” అంటూ చేతిని బయట వైపుకు చూపించాడు.

“అదేంటి సార్ ఒక అందమైన ఆడపిల్ల మీ రక్షణ కోరి వస్తే” అమాయకంగా అడిగింది శోధన.

సి ఐ దుర్జన రావ్ తాగిన మత్తులో వున్నాడు.లేకపోతే గుర్తు పట్టేవాడేమో ఆమెని.

“ఏయ్ ఇది పోలీస్ స్టేషన్,అందులో నా ఇలాక.నేను మంచి మూడ్ లో వున్నాను కాబట్టి బ్రతికి పోయావు వెళ్లు”  సీరియస్ గా అన్నాడు.

అతని దృష్టి లాకప్ లో వున్న అమ్మాయి మీద వుంది.ఈ రాత్రి ఆ అమ్మాయిని బలవంతంగానైనా అనుభవించి తర్వాత తెల్లవారు ఝామునే సిటీ దాటించాలి. జర్దార్ నుంచి వచ్చే డబ్బు గురించి,ఈ రాత్రి దొరికే సుఖం గురించి ఆలోచిస్తున్నాడు.అందుకే కానిష్టేబుల్స్ అందరినీ  బయటకు పంపించాడు.

“సారీ ఇన్స్పెక్టర్,ఈ రాత్రి నాకు షెల్టర్ కావాలి.లేకపోతే నా శీలానికి గ్యారంటీ లేదు.అసలే రోడ్డు మీద మొగ వెధవలు చొంగ కారుస్తూ” వెంట పడుతున్నారు అంది.

సి ఐ  దుర్జనరావ్ కోపంగా శోధన వంక చూసాడు.

“అసలు పోలీస్ ల గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్ ?

నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా ? ఇది పోలీస్ స్టేషన్ లాడ్జి  కాదు” కోపంగా అన్నాడు.

“అదేంటి సార్ మీ లాంటి పోలీస్ ఆఫీసర్స్ ఈ మధ్య లాడ్జీలు బారులు బదులు పోలీస్ స్టేషన్ లోనే సెటప్ పెట్టుకుంటున్నారని  బ్రేకింగ్ న్యూస్ లో చూసానే” చాల తాపీగా అంది.

ఆ మాటతో దుర్జనరావ్ కు కోపం నషాళానికి అంటింది. మామూలు సమయంలో అయితే తన ప్రతాపం చూపించేవాడు.బలవంత కోపాన్ని అణుచుకుంటూ

“నిన్ను నిజంగా ఎవరో తరుముతున్నారని గ్యారంటీ ఏమిటి?” ఎదురు ప్రశ్నించాడు.

“అయితే ఓ పని చేయండి సార్ మీరు నాతో రండి.”

నన్ను ఇంటి దగ్గర సేఫ్ గా దింపేసి తిరిగి స్టేషన్ కు వచ్చి మందు తాగండి” కూల్ గా అంది శోధన.

ఆ అమ్మాయి తనను రిక్వెస్ట్ చేస్తుందో,ఆర్డర్ వేస్తుందో అర్థం కాలేదు అతనికి కోపంగా చూస్తూ

“చూడు నాకు అసలే తిక్క, నన్ను ఎక్కువగా ఇరిటేట్ చేస్తే పరిస్థితి సీరియస్ గా వుంటుంది” అన్నాడు.

“నాకు తిక్క కన్నా భయం ఎక్కువ నన్ను బయటకు పంపిస్తే ఈ రాత్రి నాకు ఏదైనా జరిగితే దానికి కారణం…త్రీటౌన్ సి ఐ అని ఆగి అతని పోలీస్ చొక్కా మీద వున్న నేమ్ బ్యాడ్జి చూసి సి ఐ దుర్జన రావ్ మాత్రమే అని పత్రికల వాళ్ళకు చెబుతా”  “ఒక్క రాత్రి ఒక ఒంటరి ఆడపిల్లకు షెల్టర్ ఇవ్వని ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు ?”  “ఇక్కడ టేబుల్ మీద వున్న ఈ మందు బాటిల్స్ ఎందుకు?” నాటకీయం గా అంది  శోధన.

మనిషి మత్తులో వున్నప్పుడు,కన్ఫ్యూజన్లో వున్నప్పుడు ఏమీ ఆలోచించలేడు.

దుర్జన రావ్ కూడా అదే పరిస్థితిలో వున్నాడు.ఇప్పుడతను మందు మత్తులో వున్నాడు.దానికి తోడూ కన్ఫ్యూజన్ లో కూడా వున్నాడు.అందుకే ఎలాగైనా  ఆమెను స్టేషన్ నుంచి పంపించేయాలి అని మాత్రమే అతను ఆలోచిస్తున్నాడు.

వెంటనే శామ్యూల్ వైపు చూసి రమ్మన్నట్టు సైగ చేసాడు.

శామ్యూల్ వెళ్ళాడు”ఈ అమ్మాయిని బయటకు పంపించేయ్ పెద్ద న్యూ సెన్స్ చేస్తోంది” అన్నాడు.

వెంటనే శామ్యూల్ “సిస్టర్” అని పిలిచాడు.

“యస్ మిష్టర్” అంది శామ్యూల్ వంక చూసి.

“మా సార్ చెప్పింది విన్నారుగా ప్లీజ్ ” అంటూ డోర్ వైపు చూస్తూ.

“మీ సార్ చెప్పింది నేనూ విన్నాను తెలుగు ను తెలుగులో ట్రాన్సలేట్ చేస్తే ఎలా”అని అతని నేమ్ బ్యాడ్జి వంక చూసి “శామ్యూల్ బ్రదర్” అంది.

శామ్యూల్ కి ఆమె మాట్లాడే విధానం నవ్వు తెప్పించింది, పైగా సంతోషంగా వుంది.

“ప్లీజ్ సిస్టర్..”అన్నాడు.

“పోనీ ఓ పని చేయండి”అంది.

“చెప్పండి సిస్టర్ ఏం చేయమంటారు?అడిగాడు శామ్యూల్.

“ఇప్పుడు మీరు చెప్పింది…ఇందాక మీ సార్ చెప్పింది ఓ తెల్ల కాగితం మీద రాసి ,మీ స్టేషన్ ఎదురుగా వున్న టీ బడ్డీ వాడి చేత సాక్షి సంతకం చేయించి ఇవ్వండి.ఫర్ సఫోజ్ రేపు నా శీలానికి ఏదైనా డ్యామేజీ జరిగితే మీ మీద డామేజీ సూట్ వేయడానికి “తాపీగా చెప్పింది.

ఆ మాటలు విన్న సి ఐ కి మతిపోయింది.బుర్ర గిర్రున తిరిగింది.కోపం తన్నుకు వచ్చింది.

ఇప్పుడు సీరియస్ గా డీల్ చేసే మేటర్ కాదు అని మాత్రం అర్ధం అయింది. అంతే అతని  స్వరంలో మార్పు వచ్చింది. లేని చిరునవ్వు మొహం మీదకి తెచ్చుకొని అనునయంగా

“రాత్రి వేళ లేడీస్ ను పోలీస్ స్టేషన్ లో ఉంచుకోవడాని రూల్స్ ఒప్పుకోవు,పైగా మా స్టేషన్ లో లేడీ కానిస్టేబుళ్లు కూడా లేరు” అన్నాడు.

“గుడ్…ఎంత నిజాయితీ ఉంది మీలో నిజమే మీ పోలీస్ స్టేషన్ లో శాంతి భద్రతలు ఏసీ లో కూచోని ఉంటున్నాయి కదూ… మరి ఆ సెల్ లో వున్న లేడీ సంగతి ఏమిటి సి ఐ సార్” తాపీగా అడిగింది శోధన.

ఒక్కసారిగా పోలమారింది దుర్జనరావుకి. అతని సర్వీస్ లో  మొట్ట మొదటిసారి  కంగారు పడ్డాడు.”చెప్పండి సర్ అర్థరాత్రి మహిళలను లాకప్ లో వుంచకూడదు.అదీ లేడీ కానిస్టేబుల్ లేకుండా పోనీ లోపల అదే ఆ లాకప్ లో వున్నా  అమ్మాయి మీద ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసారా?”

“ఆమెని ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేసారో తెలుసుకోవచ్చా?

వామనుడు ఇంతింతై వటుడింతై అన్నట్టు శోధన లేచింది.ఆమె మాట్లాడుతుంటే ఐ పి సి మాట్లాడుతున్నట్టు వుంది.సి ఐ దుర్జనరావ్ గొంతు తడారిపోయింది.

శోధన సెల్ దగ్గరికి వెళ్ళింది.అప్పటి వరకూ బిక్కు బిక్కుమంటూ వున్న లాకప్ లో వున్న అమ్మాయి కళ్ళలో సన్నటి వెలుగు.

“ప్లీజ్ మేడం నన్ను కాపాడండి “అంటూ కళ్ళనీళ్ళుపెట్టుకుంది.

వెంటనే తేరుకున్నాడు సి ఐ దుర్జనరావ్.

“ఏయ్ అసలు నువ్వేమనుకుంటున్నావ్?పోలీసులతోనే పెట్టుకుంటావా?”

“యస్సై దీన్ని లోపలేయి ముందు” అంటూ తన ఒరిజినల్ క్యారెక్టర్ చూపించాడు.

శోధన నింపాదిగా అతన్నే చూస్తూ. “అదేంట్రా అని నేను నిన్ను అన్నాననుకో నీ తల కాశ్మీర్ బోర్డర్ లో పెట్టుకోవలిసి వస్తుంది.” “నిన్ను రా అనడం నాకు పెద్ద కష్టమేమీ కాదు.

ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నా  చిన్నపుడు బూతులు చాలానే నేర్చుకున్నాను శాంపిల్ కు నాలుగు వదిలితే… నీ నాలుకకు రుచులు కూడా తెలియవు అర్ధం అయిందా. అయినా ఇంకా నువ్వు నన్ను అరెష్టు చేయాలని ముచ్చట పడుతోంటే కాదనను అరెస్ట్ చేసుకో”  అన్నది.

అంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లుగా నటిస్తూ “అయ్యో నా మతిమండా వన్ సెకన్ అని హ్యాండ్ బాగ్ కు వున్న బటన్ తీసింది. మీకు చెప్పనే లేదుకదూ… ఇది బటన్ కెమెరా,మంచి క్లారిటీ వుంటుంది.కావాలంటే డబ్బింగ్ కూడా చెప్పించ వచ్చు ” అంటూ నింపాదిగా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది.

అంతే…పోలీస్ స్టేషన్ లో తీవ్రవాదులు బాంబ్ పెటినట్టు షాకయ్యాడు దుర్జనరావ్.

“పోలీస్ స్టేషన్ లో మందు సెటప్. లాకప్ లో మహిళా అక్రమ నిర్బంధం.అదేమని ప్రశ్నించిన మరో మహిళపై సిఐ దాష్టీకం” ఈ బ్రేకింగ్ న్యూస్ చాలా బావుంటుంది ఇంకా తాపీగా అంది శోధన.

ఏం చేయాలో తోచని పరిస్థితి దుర్జనరావుడి అయినా తన స్టేషన్ లో తనకు భయం ఏమిటి?

ఆ వికృతమైన ఆలోచన రాగానే లేచి శోధన దగ్గరికి వచ్చి ఆమె మెడ మీద చేయి వేయబోయాడు.

“సార్…ప్లీజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళ పై అసభ్యంగా ప్రవర్తించడం మంచిది కాదు, వదిలేయండి సార్  అన్నాడు శామ్యూల్.

“రేయ్…నువ్వు ఆఫ్ట్రాల్ యస్సై గాడివి నాకే ఎదురు చెబుతావా?ముందు నువ్వు దాన్ని లాకప్ లో వేయ్.”

తన అధికార దర్పాన్ని ప్రదర్శించాడు.

“సార్..ప్లీజ్ మీరు తాగి వున్నారు” అనునయంగా అన్నాడు శామ్యూల్.

“అవును తాగిఉన్నా అయితే ఏంటీ? “ఇది నా స్టేషన్ నా ఇష్టం ఎక్కువగా మాట్లాడితే క్రమశిక్షణ పేరుతో ఏ ట్రాఫిక్ కో వెళ్తావ్ జాగర్త” అంటూ శోధన మెడ మీద చేయివేసాడు. ఇంకా ఆ చేయి మొత్తం శోధన మెడ మీద పడనే లేదు

“చేయ్ తీయరా…” శామ్యూల్ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు బయట కునికి పాట్లు పడుతున్న సెంట్రీ భయంతో లోపలికి  పరుగెత్తుకు వచ్చాడు.

సిఐ  దుర్జనరావ్ షాకయ్యాడు. “నిన్నేరా చేయ్ తీయరా” శామ్యూల్ నోట్లో నుంచి వచ్చిన ఆ మాటలు విని సెంట్రీ కన్నా ఎక్కువగా దూర్జటి షాక్ కు గురయ్యాడు.నోట్లో నాలుక లేనట్టు వుండే తన కింద పనిచేసే ఒక యస్సై తనని రా అనడమా?

“చేయ్ తీయరా” ఈసారి శామ్యూల్ చేతిలో రివాల్వర్ వుంది.

“నీ కిచ్చినట్టుగానే గవర్నమెంట్  నాకూ సర్వీస్ రివాల్వర్ ఇచ్చింది.” “నువ్వు డ్యుటీ లో ఉపయోగించవచ్చు… నేనూ అంతే కాకపోతే ఒక మహిళ ఆత్మగౌరవాన్ని  కాపాడటం కోసం ఈ రివాల్వర్ ఉపయోగిస్తున్నాను. దానికి నా ఉద్యోగం పోతే పోనీ నాకేంటి ఇదే స్టేషన్ ఎదురుగా టీ బండి పెట్టుకుని బ్రతుకుతా నీలా రక్తపుకూడు తిని మాత్రం  కాదు.” అంటూ శోధన దగ్గరికి వెళ్లి “మేడం మీరు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి వీడి సంగతి నేను చూసుకుంటాను” అన్నాడు.

శోధన స్టిఫ్ గా నిలబడి సెల్యూట్ చేసింది.”హేట్సాఫ్ శామ్యూల్ పోలీస్ లలో కూడా నీలాంటి నిజాయితీపరులు వున్నారని నిరూపించావు డ్యూటీ కన్నా మానవత్వం చాలా గొప్పదని చెప్పావ్” అంటూ టేబుల్ మీద వున్న లాకప్ తాళాలు తీసుకుని లాకప్ తెరిచి లోపల వున్న అమ్మాయిని బయటకు తీసుకువచ్చింది.

“థాంక్యూ మేడం” ఆ అమ్మాయి చేతులు జోడించింది.

” థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు అతనికి సరైన సమయంలో ఫోన్ చేసాడు” అంటూ శామ్యూల్ ని చూపించింది.

ఆ రాత్రి మరో వార్త నగరాన్ని కుదిపేసింది.

పోలీస్ స్టేషన్ లో దుశ్శాసన పర్వం సి ఐ నిర్వాకం  తెగించి సాహసం చూపిన యస్సై

ఓ అమ్మాయి చేసిన  స్టింగ్ ఆపరేషన్ వివరాలకు పూర్తి వీడియోకు యు ట్యూబ్ చూడండి.

ఆ రోజు అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోని దృశ్యాలు అప్ లోడ్ అయ్యాయి.వ్యూస్ చాంతాడులా పెరిగాయి.

చిత్రంగా సి ఐ సస్పెండ్ అయ్యాడు దర్యాప్తు కు హోం మినిస్టర్ ఆదేశించాడు, కానీ క్రమశిక్షణా చర్యగా యస్సై కొన్ని రోజులు సస్పెండ్ కు గురికాక తప్పలేదు శ్యామ్యుల్ కి పాండవుల అజ్ఞాత వాసం మంచి కోసమే అన్నట్టు.

అర్థరాత్రి  రెండు దాటుతుంది.

బెడ్ రూం లో ఏసీ చల్లదనం ఆమె శరీరాన్ని తాకుతోంది. పింక్ కలర్ నైటీలోకి మారిపోయింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది.కళ్ళు అలసటగా వున్నాయి.ఒంటరితనం జ్ఞాపకాన్ని ఆహ్వానిస్తోంది.జ్ఞాపకం విషాదాన్ని గుర్తు చేస్తోంది.

ఎక్కడో ముంబై లో వున్న తను నాట్యాన్ని ప్రేమిస్తూ, సినిమాలు చూసేస్తూ, లైఫ్ ని సింపుల్ గా, హ్యాపీ గా గడిపేయాలనుకున్నతను ఎక్కడికి వచ్చింది? ఎవరిని టార్గెట్ చేసింది ? అడవిలో భీతావహరిణిలా ఉండే  తను ,ఈ జనారణ్యంలో సివంగిలా మారింది.

ఒక కన్నీటి చుక్క “నేను గుర్తున్నానా ?” అని అడిగింది.

ఒక కన్నీటి చెమ్మ అమ్మలా స్పృశించింది

మంచం మీద వెల్లికిలా పడుకుంది.రెండు చేతులు తలకింద దిండులా పెట్టుకుంది.

కనిపించని ఉద్వేగమేదో…కన్రెప్పలను కన్నీటి అలతో కలిసి వచ్చి,అలా పలకరించి వెళ్ళింది.

కళ్ళు మూస్తే పీడకల తన కంటి వాకిట దృశ్యమై కనిపిస్తుందన్నంత భయం.

లేచి వెళ్లి వార్డ్ రోబ్ లో వున్న ఆల్బం తీసింది.

మొదటి పేజీ  తీయగానే…ఆమె ఒంట్లో చిన్న కంపనం తనకు క్లోనింగ్ లా వున్న మనిషి కాదు తన మనసు ఆ మనసు మరో శరీరాన్ని ఇస్తే కనిపించే రూపం శోభన.

సి బి ఐ ఏజెంట్ శోభన

ఎవరి కోసం తను అణ్వాయుధంగా మారిందో, ఎవరిని తను అన్వేషిస్తూ వచ్చిందో,ఎవరి కోసం తను శోధిస్తుందో… ఆ శోభన ఇప్పుడు ఎక్కడుంది?  ఏం చేస్తోంది? ఏ శత్రు దుర్భేధ్యంలో బందీగా వుందో?

నిత్యం రద్దీగా వుండే పంజాగుట్ట ఏరియా

కనీసం కామన్ సెన్స్ లేని వాహన చోదకులు, చలానాల మీద తప్ప ట్రాఫిక్ మీద ఆసక్తి చూపని ట్రాఫిక్ సిబ్బంది కొందరి వల్ల జరిగే ప్రమాదాలకు మోస్ట్ డేంజరస్ ప్లేస్ అది. అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడంలో చాలా మంది ముందుంటారు. ప్రతీ రోజు ఇంట్లో చీమలను చూసి వాటి నుంచి ఎట్ లీస్ట్ చీమ తలకాయంత క్రమశిక్షణ కూడా నేర్చుకొని భాగ్యనగర వాహనచోదకుల్లో ఒకానొక సెలబ్రిటీ గారాల పుత్రరత్నం రాత్రి ఒంటిగంట దాటాక పబ్ నుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొత్తకారులో  ఫ్రెండ్స్ తో కలిపి తాగిన మత్తు పాదాల నుంచీ నషాళానికి ఎక్కి, పాదాన్ని యాక్సిలేటర్ మీద నొక్కాడు.

స్టీరింగ్ తన ఇష్టం వచ్చినట్టు కదులుతోంది.

ఒక్క సారిగా హాహాకారాలు… కారణం ఓ కారు అదుపు తప్పుతోంది. అసలే బిజీ ఏరియా అందులోనూ కారు స్పీడ్, ఒక్కసారిగా కారు నాలుగైదు వాహనాలను గుద్దుకుంటూ వెళ్లి రోడ్డు మీద పల్టీలు కొట్టింది.మంటలు వ్యాపించాయి, కారులో ఆ పుత్రరత్నంతో పాటు అతని ఫ్రెండ్స్ వున్నారు.ఆ రోజు  ఆ సెలబ్రిటీ కొడుకు పుట్టినరోజు. ఆ సెలబ్రిటీ హోం మినిస్టర్ ధనంజయరావ్.

ఎప్పుడైతే కారు రోడ్డు మీద అదుపుతప్పి ఘోర ప్రమాదాన్ని సృష్టించిందో ఆ వెంటనే కదిలింది పోలీస్ యంత్రాంగం ప్రమాదం జరిగిన చోటుకి. పబ్ నుంచి దాదాపు ఆరు కిలోమీటర్ల వరకూ ఎన్నో ముఖ్యమైన పాయింట్స్ దగ్గర సరైన నిఘా పెట్టలేకపోయిన పోలీస్ లు ప్రమాదం జరిగిన వెంటనే మాత్రం ఎలర్ట్ అయ్యారు.

అంబులెన్స్ సైరన్ ఆ ప్రాంతంలో ప్రతి ధ్వనించింది.

ఆ ఘోరాన్ని చూసిన ఒకతను వెంటనే ఒకరికి ఫోన్ చేసాడు.

“నేను మా ఆసరా కార్యకర్తను. మేడంను వెంటనే కలవాలి,ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది” చెప్పాడు అవతలి వ్యక్తితో.

“మేడం హోం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లారు, బంజరహిల్ల్స్ లో కొందరు అమ్మయిలను ఎవరో కుర్రాళ్ళు   వేధిస్తున్నారట ఆ ఇష్యూ లో ఆయన్ని కలిసి మాట్లాడాలని వెళ్లారు.” .

“అవునా ఎప్పుడు వస్తారో ఏమైనా తెలుసా? ”

“హోమ్ మినిష్టర్ ఉదయం 11 గంటలకి  అప్పాయింట్మెంట్ ఇచ్చారు,సాయంకాలం వరకూ పిలవ లేదు, అంతే కాదు మేడం ని కలవకుండానే ఆయన ఇంటికి వెళ్ళిపోయారు కూడా, మేడమ్  పట్టుదల తెలుసు కదా హోం మినిస్టర్ ఇంటి కే  వెళ్ళి కలుస్తా అని మేడం హోం మినిస్టర్ ఇంటికి బయల్దేరి వెళ్ళారు అటునుండి అటే, మేము వస్తామన్నా మమ్మల్ని రావద్దన్నారు” అవతలి వ్యక్తి చెప్పాడు.

అదే సమయంలో ….

యాభై  అయిదేళ్ళ వైదేహి స్కూటి మీద అర్థరాత్రి రెండు గంటల వేళ హోం మినిస్టర్ కాన్వాయి వెనుకే బయల్దేరింది పట్టుదలగా

హోం మినిస్టర్ రెసిడెన్స్, తీవ్రవాదుల ముప్పు పొంచి వున్నందువలన  అతనికి జడ్ కేటగిరీ భద్రత వుంది. హోం మినిస్టర్ కాన్వాయి ఆ భవనంలోకి ప్రవేశించగానే ఆ ప్రెమిసెస్ గేట్లు మూసుకున్నాయి.

గేటు బయట వైదేహి నిలబడి వుంది. సెక్యూరిటీ పరుగెత్తుకు వచ్చి వైదేహిని చుట్టుముట్టింది. మొహం మీద చెరగని చిరునవ్వు…ఆ నవ్వు చూసిన మృత్యువే కాసింత ఉలిక్కి పడుతుంది.అలాంటిది ఈ సెక్యూరిటీ ఎంత?

ఆఘమేఘాల మీద సెక్యూరిటీ చీఫ్ వచ్చాడు. అతను మిలిటిరీలో పని చేసి వచ్చిన వ్యక్తి.

“ఎవరు మీరు?” “ఇంత అర్థరాత్రి వేళ మీకు ఇక్కడ పని ఏమిటి?” తన అధికార హోదాతో అడిగాడు.

“ఆ విషయం మీ హోం మినిస్టర్ ని అడగండి, లేదా ఈ రోజు ఉదయమే నాకు పదకొండు గంటలకి కలవమని  అప్పాయింట్మెంట్ ఇచ్చి, ఇప్పటి వరకూ హోం మినిస్టర్ ని కలిసే అవకాశం ఇవ్వకుండా, కనీసం మహిళను అనే  ఇంగితం లేని హోం మినిస్టర్ పి.ఏ ని అడగండి” అదే చిరునవ్వుతో అంది వైదేహి.

సెక్యూరిటీ చీఫ్ తన సర్వీసులో మొదటి సారి షాకయ్యాడు. ఒక సాధారణ మహిళ అర్ధరాత్రి వేళ ఎంత ధైర్యంగా వచ్చింది. అందులోనూ సెక్యూరిటీ చీఫ్ అయిన  తననే నిలదీసి మరీ అడుగుతోంది. కానీ పాపం ఆ క్షణం అతనికి తెలియదు తను మాట్లాడుతుంది ఒక అసాధారణ వ్యక్తితోనని.

తను మాట్లాడుతోంది ఒకనాటి స్వతంత్ర సమర యోథుడు, రాష్ట్ర మాజీ గవర్నర్ కూతురు తోనని తెలిస్తే? అన్నింటికీ మించి యుద్ధం అనివార్యమైతే…ధర్మం  ఓడిపోయే సమయం అసన్నమైతే…విశ్వరూపం చూపే ఒక శక్తితోనని తెలిస్తే?

క్షణాల్లో హోం మినిస్టర్  చెవిని చేరిందా వార్త వెంటనే వైదేహిని రమ్మని చెప్పాడు.

హోం మినిస్టర్ ఎదురుగా కూచుంది వైదేహి. ఆమె వంక పరిశీలనగా చూసాడు. ఆమె ముందు తన పదవి తాలూకు పొగరు చూపించే సాహసం చేయలేక పోయాడు. అతనికి ఒక్కటే ఆశ్చర్యంగా వుంది. ఈ వయసులో ఇంత అర్థరాత్రి వేళ దైర్యంగా  తనను ఫాలో అయి రావడం మింగుడు పడ్డం లేదు.

“చెప్పండి…ఈ టైం లో మీరు నన్ను కలవాల్సిన పని ఏముంది?” కాసింత తన దర్పాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ అన్నాడు .

“నాకు  మీరు ఇచ్చిన  అప్పాయింట్మెంట్ ఉదయమే” అంది వైదేహి.

“అఫ్ కోర్స్ కానీ హోం మినిస్టర్ కు బోల్డు పనులు వుంటాయి”

“అవి శాంతి భద్రతలకు సంబంధించినవే కదా? వాటిని విస్మరించి మీరు మీ పార్టీ  కార్యకర్తలతో,లేదా నాయకులతో,మాట్లాడడం అంత ముఖ్యం కాదు అని మీరు గ్రహిస్తే మంచిది. మీరు పబ్లిక్ సర్వెంట్ ముందు వారికోసం టైమ్ కేటాయించాలి పార్టీ కోసం మిగితా టైం స్పేర్ చేయవచ్చు” అన్నది.

“అంటే మా డ్యూటీస్ మీరు గుర్తు చేయాలా?” కాసింత కోపం ప్రదర్శిస్తూ అన్నాడు.

“ఉదయం పదకొండు గంటలకు రంగారెడ్డి జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ రెండు వర్గాల్లో మీ పార్టీ కార్యకర్తలు ఒక వర్గంలో వున్నారు. అక్కడ వున్న మరో పార్టీ కార్యకర్తలను పోలీస్ లు అరెస్ట్ చేసారు ఈ విషయం రేపు అసెంబ్లీ లో తేలుతుంది అది వేరే విషయం.”  “ఒక మహిళ మీ అప్పాయింట్మెంట్  తీసుకున్నప్పుడు మీరు కలువవలిసిన అవసరం వుంది”  “కదాంటారా?”  “అంతే కాదు మీ పిఏ కి కనీసం ఆ విషయాన్నీ మీ దృష్టికి తీసుకు రావాలి అన్న కనీస మేనర్స్ కూడా లేదు”  అంది వైదేహి.

“సరే..ఇప్పుడు చెప్పండి ఇంత అర్థరాత్రి కూడా మీరు ఇక్కడి వరకూ వచ్చిన కారణం?” అసహనంగా అడిగాడు హోం మినిస్టర్.

అతని కొద్దిగా చిరాకుగా వుంది,దానికి తోడూ అతని అహం దెబ్బ తిన్నది.

“బంజర హిల్స్ లో కొందరు పోకిరీలు అమ్మాయిలను వేధిస్తున్నారు…ఆ దారి లో రాత్రి మాత్రమే కాదు పగలు వెళ్ళాలన్నకూడా వాళ్ళు భయపడుతున్నారు. అంతే కాదు రాత్రి వేళ ఆ దారిలో ఫుల్ స్పీడ్ తో వెహికల్స్ వెళుతూ ఉంటాయి స్పీడ్ బ్రేకర్లని సైతం లేఖ చేయకుండా, మీ దృష్టికి వచ్చిండీ లేదో కానీ మద్యం మత్తులో డ్రైవ్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజు కి పెరిగిపోతున్నది.”  అంటున్న ఆమె మాటలు ఇంకా పూర్తికాకుండానే

“ఇది చాలా కామన్ సమస్య, దీని కోసమా మీరు ఉదయం నుంచి వేచి వున్నది.

లోకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్  ఇచ్చి ఉంటే సరిపోయేది కదా” తేలిగ్గా చెప్పాడు హోం మినిస్టర్.

“డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయినా, పొరపాటున  సిగ్నల్ క్రాస్ చేసినా బెదిరించి ఫైన్ వేసే పోలీస్ లు సెలబ్రిటీల జోలికి వెళ్ళరు?” “ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు డబ్బులకి అమ్ముడుపోకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తోంటే రాజకీయనాయకులు ఊరుకుంటారా?”   “ఆ స్వేచ్చ పోలీస్ లకు వుండి వుంటే, రాజకీయం పోలీస్ ల జోలికి వెళ్ళకుండా వుండి వుంటే నా లాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చే అవసరమే ఉండేది కాదు.” స్పష్టంగా చెప్పింది వైదేహి.

“అంటే మీరు చెప్పేది ఏమిటి?” అసహనంగా అడిగాడు హోం మినిస్టర్.

“బంజర హిల్స్ లో రాత్రి వేళ నిఘా పెంచండి, ఫాస్ట్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ పట్ల కేర్ తీసుకోండి, సెలబ్రిటీల పిల్లలు ఆకాశం నుంచి వూడిపడరు కదా వాళ్ళను అదుపులో పెట్టండి ముఖ్యంగా మీ కొడుకుని కూడా ”

చివరి మాటతో అదిరిపడ్డాడు హోమ్ మినిష్టర్ …కోపం కూడా వచ్చింది ఆయనకి.

అది గమనించి కూడా గమనించనట్లే తన ధోరణిలో తను చెప్పేస్తోంది ఆమె.

“మీ అబ్బాయి తరచూ పబ్ లకు వెళ్తాడు,అది మీ అబ్బాయి ఇష్టం,మీ ఇష్టం…కానీ తప్పతాగి డ్రైవ్ చేస్తాడు దానివల్ల మీ అబ్బాయికే కాదు రోడ్డు మీద వెళ్ళే వారికీ ప్రమాదమే”  అన్నది వైదేహి గొంతులో కోపం స్పష్టంగా ఉంది.

ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు హోమ్ మినిష్టర్ కి,  అతని ఈగో దెబ్బ తిన్నది,దానితో పాటు ఆమె చెప్పిన విషయం అతనికి కొరడా దెబ్బలా తగిలింది.

వైదేహి వంక చూసాడు, ఆమె మొహంలోని ఫీలింగ్స్ స్పష్టంగా వున్నాయి.

“కొద్దిగా మంచి నీళ్ళు ఇప్పించగలరా?” అడిగింది వైదేహి.

ఒక్క క్షణం గిల్టీ ఫీలింగ్ కలిగింది హోం మినిస్టర్ లో…ఉదయం నుంచి ఆడమనిషి ఏమీ తినకుండా, తాగకుండా తనకోసం ఎదురుచూస్తూ ఉందన్న ఫీలింగ్ అది.

వెంటనే సర్వెంట్ ని పిలిచి మంచి నీళ్ళు తీసుకురమ్మని చెప్పాడు.

మంచి నీళ్ళు  తీసుకురావడానికి సర్వెంట్ వెళ్ళాడు . ఈ లోగా ఫోన్ వచ్చింది ఆమెకి.

ఈ టైం లో ఎంతో అర్జెంటు అయితే తప్ప సెల్ మోగదు, అందుకే ముందు ఉన్నది హోమ్ మినిష్టర్ అయినా “ఎక్స్క్యూజ్ మీ”అంటూ మొబైల్ లో ఓకే బటన్ నొక్కింది.

“మేడం..బంజారా హిల్స్ ప్రాంతంలో, పంజాగుట్ట సర్కిల్ నుంచి వచ్చే రూట్ లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి తీవ్ర ప్రాణాపాయ స్త్జితిలో వున్నాడు. రక్తం అర్జెంట్ గా కావాలి.” అవతలి వ్యక్తి హాస్పిటల్ పేరు వివరాలు, బ్లడ్ గ్రూప్ అన్నీ చెప్పాడు.

“వెంటనే వచ్చేస్తున్నాను నా బ్లడ్ గ్రూప్ అదే” అనిచెప్పి హోం మినిస్టర్ వైపు తిరిగి “సారీ అండీ మనం మళ్ళీ కలుద్దాం..” అంటూ హడావుడిగా బయటకు నడిచింది.

సర్వెంట్ మంచినీళ్ళు తెచ్చేలోగా వెళ్ళిపోయింది.

ఉదయం నుంచి తన కోసం తిరిగి, తీరా తను కలిసాక కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా వెళ్ళిపోయిన వైదేహి వంక చూస్తూ ఉండగానే హోం మినిస్టర్ కు ఫోన్ వచ్చింది.

“హా..అంటూ షాకింగ్ గా ఫోన్ పెట్టేసి హడావుడిగా లేచాడు హోం మినిస్టర్

ఆయన కొడుకు ఉన్న కారుకి యాక్సిడెంట్ జరిగిందని,కొడుకు ప్రాణాపాయ స్థితిలో వున్నాడని చెప్పటానికి  ఆ ఏరియా ఇన్స్పెక్టర్ చేసిన ఫోన్ అది.

వైదేహి హుటాహుటీనా వెళ్ళింది  కూడా చావు బ్రతుకుల్లో వున్న హోం మినిస్టర్ కొడుక్కి రక్తం ఇవ్వడానికే.

ఒక అనూహ్య సంఘటనకు ఈ అధ్యాయం నాంది పలుకుతోందని ఆ క్షణం వారిద్దరికీ  తెలియదు.

సరిగ్గా అదే సమయంలో శోధన శివతో కలిసి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వచ్చింది.

మరో వైపు వైదేహి వస్తోంది.ముప్పైయేళ్ళ తర్వాత ఆ విధాత వీళ్ళిద్దరినీ కలుపుతున్నాడు.

కొద్దిగా చలి వేస్తోంది, అయినా ఆ చలి వైదేహిని ఏమీ చేయడం లేదు. స్కూటీ స్పీడ్ గా వెళ్తోంది. ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య వున్నాడు అన్న విషయం ఆమె మైండ్ ని చలికి అతీతంగా తీసుకు పోయింది.  అప్పటికే వైదేహి మధ్య మధ్య చాల మందికి ఫోన్ చేస్తోంది మరో ఇద్దరు కూడా చావు బ్రతుకుల మధ్య వున్నారు అన్నారు హాస్పటల్ వాళ్ళు   ఎప్పుడు ఎవరికి రక్తం అవసరం వస్తుందో అన్న ఆందోళన ఆమెని తొలిచేస్తోంది.

ఆలోచనలు స్కూటీ కన్నా స్పీడ్ గా వెళ్తున్నాయి.

రక్త సంబంధం అంటే ఏమిటి ? రక్తం దానం చేస్తే అది రక్త సంబంధం కాదా? ఓ పక్క ఫాక్షనిష్టులు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు, రక్తం ఏరులై పారుతోంది ప్రాణాలు విలువే లేనట్లు గాల్లో కలిసిపోతూనే ఉంటున్నాయి  కానీ అదే రక్తం లో కనీసం పదవ వంతు దానం చేసినా ఒక మనిషి ప్రాణాలు కాపాడవచ్చు అన్న ఆలోచనే వారిలో  కలిగితే మనుష్యులను చంపడంలో వున్న పైశాచిక ఆనందం,మనుష్యులను బ్రతికించడంలో పొంద గలిగితే,ఏరులై పారుతున్న ఆ రక్తం విలువ తెలిస్తే , ఈ రక్తపాతం రక్తదానంగా మారితే ఎంత బావుండు ?   ఆలోచిస్తూ మూల మలుపు దగ్గరికి వచ్చి ఒక్క క్షణం ఆగిపోయింది.

సడెన్ గా బ్రేక్ వేసింది కారణం తెలుసుకోవాలంటే పది నిమిషాల వెనక్కు వెళ్ళాలి.

శోధన ఆలోచనలు ఆమె నడిపే వెహికల్ కన్నా స్పీడ్ గా వున్నాయి.

పంజాగుట్టలో జరిగిన దారుణం ఆమెను కోపానికి గురి చేస్తున్నాయి. ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవలిసి వస్తుంది? డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదకరం?

తాగి డ్రైవ్ చేసే అధికారం ఎవరిచ్చారు ? మాట తూలితే పర్లేదు. వెహికల్ అదుపు తప్పితే ? పంజాగుట్ట సర్కిల్ లో జరిగిన యాక్సిడెంట్ విషయం తెలిసి బయల్దేరింది, శివను కూడా రమ్మని చెప్పింది శోధన.

హోం మినిస్టర్ కొడుక్కి సీరియస్ గా ఉంది అని తెలిసింది. హోం మినిస్టర్ కొడుకు ఒక్కడే మనిషా? ఆఘమేఘాల మీద అతడికి ట్రీట్మెంట్ జరుగుతునే ఉండి ఉంటుంది.అందులో ఎటువంటి సందేహం లేదు కానీ అదే మామూలు వాళ్ళకి అయితే ? ఎన్ని ప్రశ్నలు? ఎన్ని ఫార్మాల్టీస్ పూర్తిచేయమంటారో కానీస వైద్యసహాయం కూడా అందించకుండా వాళ్ళని చంపేస్తూ ఉంటారు ఎన్నోసార్లు. ఇప్పుడు కూడా ఆ యాక్సిడెంట్ ఎంత మందిని గాయపరిచిందో…మరెంత మంది ప్రాణాలను హరించిందో

ఆమె ఆలోచనలు ఎంత స్పీడ్ గా వున్నాయంటే ఎదురుగా వచ్చిన వెహికల్ ని కూడా గుర్తించలేదు…తను టర్నింగ్ లో కూడా చాలా స్పీడ్ గా  వస్తున్నానన్న విషయమూ గుర్తించలేదు. ఎదురుగా వెహికల్ కనిపించి సడెన్ బ్రేక్ వేసింది.మూల మలుపులో  తన ఎదురుగా మరో వెహికల్.

ఒక ఘటన దైవ ఘటనై  ఒక అద్భుతం  అవిష్కారమైతే?

ఎదురుగా వైదేహి…

సృష్టికర్త విధాత ఓ అద్భుతమైన,అపురూపాన్ని శరీరాన్ని సృష్టించి ఏమరుపాటుగా అ శరీరంలోని ఒక భాగాన్ని భూమ్మీదికి పంపించాడు. ఆ ప్రాణి వైదేహిగా తన తలరాతను తనే పునర్లిఖించుకుని విధాతనే అబ్బురపరిచింది. ఆపై ముప్పయ్యేళ్ళ తర్వాత తను సృష్టించిన మిగితా సగభాగం తన దగ్గరే వుందని గుర్తించి తిరిగి ఆ సగభాగాన్ని భూమ్మీదికి పంపించాడు. ఆమె తలరాతను తనే లిఖించాలని తలపోసాడు. కానీ విధాతను  ప్రాధేయపడి   తన తలరాతను కాలానికే వదిలివేయమని చెప్పింది.

అలా భూమ్మీదికి ముప్పయ్యేళ్ళ  తర్వాత వచ్చిన ప్రాణి శోధన.

ఒకే శరీరం రెండుగా చీలి ఆలస్యంగా వచ్చిన మరో శరీరమే శోధన.

కానీ కాలానికి వదిలేయకుండా శోధన తలరాతను మరొకరికి ముడివేసాడు ఆ విధాత ఎవరతను?

ఒక్క క్షణం…ఒకే ఒక్క క్షణం ఆకాశాన్ని సముద్ర కెరటం పరామర్శించినట్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *