May 4, 2024

చేరేదెటకో తెలిసీ – 2

రచన: స్వాతీ శ్రీపాద

 

పదిరోజుల పాటు రాత్రీ పగలు అన్ని పనులూ వదిలేసుకుని తిండి నిద్రా ఊసెత్తకుండా న్యూరో సర్జన్ గా తన ప్రతిభను పూర్తిగా వినియోగించి నాలుగు ఆపరేషన్లు చేశాక శృతి స్పృహలోకి వచ్చింది.

శివరావ్ గురించి ఈ పది రోజులుగా ఆలోచించే తీరికే లేకపోయింది.

ఆ రోజున శృతి హాస్పిటల్ లో చేరిన పదోరోజున ఉదయం  అయిదింటికే మెళుకువ వచ్చింది శర్మకు… ఎందుకో వెంటనే వెళ్ళి శృతిని చూడాలన్న కోరిక అతన్ని నిలవనియ్యలేదు. చంద్రను లేపకుండా తనే డ్రైవ్ చేసుకుని పదినిమిషాల్లో హాస్పిటల్ చేరుకున్నాడు.

అపోలోకి అతను విజిటింగ్ సర్జనే అయినా అతని రాకపోకలను ఎవ్వరూ ఎప్పుడూ అడ్డగించరు. అందులోనూ శృతి గురించి అతను ప్రత్యేక శ్రద్ధ తీసుకోడం వల్ల అసలు కాదనరు.

అంతకు ముందు రోజే మరో ఆపరేషన్ జరిగింది.

అతను సరాసరి ఐసీయూ కి వెళ్ళాడు.

శృతితో పాటు మరో ఇద్దరున్నారు అక్కడ. నైట్ డ్యూటీ నర్స్ డక్టర్ని చూస్తూనే లేచి నిల్చోబోయింది.

ఆమెను వారించి శృతి బెడ్ వైపు కదిలాడు. అసలే నాజూగ్గా ఉందేమో గొట్టాలూ పైప్ ల మధ్య బెడ్ మీద ఓ పక్కన ఉన్నట్టే అనిపిస్తోంది.

వెళ్ళి కేస్ షీట్ తీసుకుని చూసి అన్నీ నార్మల్ గా అనిపించడంతో ఊపిరి పీల్చుకున్నాదు.

చెయ్యందుకుని ఒక సారి నాడి పరీక్షించాడు.

కనుర్ర్ర్రెప్పలు పైకెత్తి కనుగుడ్ల తీరు గమనించాడు.

తల తిప్పుకోబోతూ ఆశ్చర్యంగా ఆగిపోయాడు… వాలిన కనురెప్పలు మళ్ళి ఎత్తినట్టనిపించి ….

అవును నిజమే కనురెప్పలు వాలిపోలేదు, కళ్ళు విప్పార్చుకు చూస్తోంది…

“శృతీ శృతీ…”

అప్రయత్నంగానే ఉద్విగ్నంగా పిలిచాడు.

” శ్రీకాంత్ …. ”

ఎక్కడో పాతాళం నుండి వస్తున్నట్టుంది స్వరం. చాలా తక్కువ స్థాయిలో ఎన్నో వేల మైళ్ల దూరాన్నించి మాట్లాడుతున్నట్టు…

ఆ మూడు పదాలు పలికేందుకు పడ్డ నరక యాతన ఆ మొహంలో కనిపించి , చేత్తోనే వారించి వణుకుతున్న ఆమె కుడి చేతి వేళ్ళను తన చేతుల్లోకి తీసుకుని ఆత్మీయంగా ధైర్యాన్నిస్తున్నట్టు నిమిరాడు.

“శృతీ ఒకటి చెప్పు ఈ ప్రమాదం నిజంగా జరిగిందా లేక ………..”

శృతి కళ్ళలో కలవరపాటు, ఆ వెను వెంటనే నీళ్ళు కనిపించాయి….

ఏదో చెప్పబోయింది , సాధ్యం కాలేదు.

చెయ్యెత్తబోయింది, వీలవలేదు, వేళ్ళు,  కళ్ళు తప్ప మిగతా శరీరంలో ఏ భాగమూ పని చెయ్యడం లేదు…

మెదడు కాణాలు దెబ్బతిన్నాయా?

ఏమో !

” శ్రీకాంత్ … నువ్వేనా? “ ఈ సారి మరింత స్పష్టంగా వినబడింది.

” అవును శృతీ … ఆవేశపడకు … నీకు నేనున్నాను … చెప్పు ఎక్కడ బాధగా వుంది………..”

“ ఏమో , తెలియటం లేదు .”

“ నేను గుర్తున్నానా ?”

“ నేను అంటే ఎవరు?” చిన్నపిల్లలా అడిగింది.

అంతలోనే నిద్రలోకి జారిపోయింది.

బ్రెయిన్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ నుండి సర్దుకుందుకు సమయం పడుతుంది.

అందుకే కాస్సేపు మగతగా మరి కాస్సేపు ఏవో జ్ఞాపకాలు అంతలోనే మరుపు. సహజమే. ఒకటి రెండు వారాల్లో సర్దుకుని మామూలు కానూవచ్చు కాకపోనూ వచ్చు.

చాలా సేపు తనపక్కనే కూచుని చివరికి ఎనిమిది అవుతుండగా లేచి బయటకు వచ్చాడు.

హాల్ లో తచ్చాడుతున్న శృతి భర్త శివరాం అతన్ని చూసి దగ్గరకు వచ్చాడు.

“ఎలా ఉంది డాక్టర్ గారూ ?’

“ఇప్పుడే ఏం చెప్పగలను? రాడ్ తలలో దిగబడింది. మనిషి స్పృహలోకి వచ్చాక గాని ఏం చెప్పలేం.”

అతని వెనకే నడుస్తున్నాడు శివరాం.

ఆ రోజున పెద్దగా ఆపరేషన్లు ఏవీ లేవు శర్మకు, మధ్యాన్నం కాలేజిలో ఒక రెండుగంటలు ఎమెస్ వాళ్లకు క్లాస్స్ తప్ప.

అందుకే పెద్ద హడావిడి లేకుండా నెమ్మదిగానే నడుస్తున్నాడు.

“డాక్టర్ గారూ! ఆపరేషన్ తాలూకు హాస్పిటలైజేషన్ బిల్ ..” ఎదో చెప్పాలని చెప్పలేక తటపటాయించాడు .

“ అది నాకు తెలియదు. పూర్తిగా హాస్పిటల్ వాళ్ళదే ఆ విషయం “ అని ఆగి  “మీరేం చేస్తూ ఉంటారు ?” కాస్త అనాసక్తిగానే అడిగాడు.

“నేను ప్రైవేట్ ఫర్మ్లో ఆఫీస్ ఇంచార్జ్ ని , ఏదో ఏడాదికి ఇంతని మెడికల్ బిల్ ఇస్తారు కాని మొత్తం రిఎంబర్స్ చెయ్యరు. శృతి కూడా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ ..”

“ఐ సీ, పిల్లలు …”

“ముగ్గురు , పెద్దవాడు పదకొండు ,తరువాత అబ్బాయి అమ్మాయి ట్విన్స్ ,  వారికి తొమ్మిదేళ్ళు”

ఉలిక్కిపడ్డాడు శర్మ.

పెద్దవాడు…

వాడు వాడు తన కొడుకేనా… ఏమో??

శృతి స్పృహలోకి వచ్చి చెప్తే గాని తెలియదు.

“ఎక్కడ ఉంటున్నారు ? పిల్లలను ఎలా మానేజ్ చేస్తున్నారు “ కాజువల్ గా అడిగాడు.

“ హబ్సిగూడలో ఉంటామండి. అమ్మ అక్క దగ్గర ఉంటుంది, వంట మనిషి ఉంది. పైన అప్పుడప్పుడు అమ్మ  వచ్చి చూస్తారు”

“సరే, ఎలా వచ్చారు ? బస్ లో అయితే రండి అటే వెళ్తున్నాదిగబెడతాను “

“అబ్బే, మీకు శ్రమ ” మొహమాటం చూపాడు కాని వద్దని అనలేదు.

“శ్రమేముంది , కారేగదా తీసుకు వెళ్ళేది.”

నిజానికి శర్మ వెళ్లవలసినది ఆ వైపు కాదు. అతను డీడీ కాలనీ లో ఉంటాడు . కాని శివరావ్ తో వెళ్లి పెద్దవాడిని ఒక్కసారి చూడాలన్న కోరిక అంత బలంగా కలిగిందతనికి.

“ హాస్పిటల్ కి రోజూ మీరు వచ్చి చేసేదేం లేదు , మంచి నర్స్ ఇరవై నాలుగ్గంటలూ చూసుకుంటో౦ది. అయినా మరో వారం అయితే తప్ప చికిత్స ఎంత ఫలితం ఇచ్చిందనేది చెప్పలేము. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేస్తారు, అప్పుడు మీకు చెప్తాలెండి”

“ఇక్కడ ఆపెయ్యండి. అటు ఆ వైపున ఉంది ఇల్లు”

“ఇంటి వద్దే దింపుతాను, ఓ కప్పు కాఫీ కూడా ఇవ్వరా ఏమిటి?” అంటూ అతను చూపిన వైపు పోనిచ్చాడు కారు.

ఎడం వైపు తిరిగి ఆ పక్కన ఫర్లాంగ్ దూరం లోపలకు వెళ్ళాక కుడి వేపు సందులో మూడో ఇంటిముందు దిగారు ఇద్దరూ.  చిన్న గేట్, గేట్ నుండి ఇంటి వరకు ఓ పదిగజాల ఖాళీ స్థలం..

లోపల రెండు వైపులా పూల కుండీలు. తలుపు దగ్గరకు వేసి ఉంది,

“ రమ్యా , రవి” అనిపిలుస్తూ తలుపు తోసి “రండి” అని లోనికి ఆహ్వానించాడు.

ఒక చిన్న ముందుగది అందులో నాలుగు కుర్చీలు ఓ టీ పాయ్ ఉన్నాయి.

కూర్చోమని కుర్చీ చూపి లోనికి వెళ్ళాడు.

లోపలి నుండి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.

“పిల్లలు రెడీ యా ? డాక్టర్ గారు వచ్చారు తొందరగా కాఫీ కలిపి ఇవ్వు అమ్మా,” శివరాం స్వరం

“ఇంతకీ శృతి ఎలావుంది “

“ఎలా ఉంటుంది? ఎప్పటిలానే ..” ఒక నిర్లిప్తత

అయిదు నిమిషాల్లో పొగలు కక్కే కాఫీ కప్పులతో వచ్చాడు శివరాం. అతని వెనకే పిల్లలను తీసుకుని వచ్చింది అతని తల్లి . “ఇదిగో వీళ్ళిద్దరూ రమ్య, రవి , ట్విన్స్ . అయిదో క్లాస్.  క్లాస్ లో అన్నింటిలోనూ వీళ్ళే . వీళ్ళు వెళ్ళకపోతే స్కూల్ కే కళ లేదంటుంది వాళ్ళ టీచర్.  అదిగో వాడు పెద్దవాడు శ్రీ తేజ . ఏడో తరగతి, నిశ్శబ్దంగా ఉంటాడు “

ఉలికిపడ్డాడు శర్మ. చిన్నప్పుడు తనూ అంతేనని నాన్న చెప్తూ౦డేవాడు. నిజమే బాగా నచ్చేతే గాని ఎవరితోనూ మాట్లాడలేని తత్వం.

“ మా అమ్మ ఉదయం వేళ వచ్చి పిల్లలను చూసి వెళ్తుంది .”

పరిచయాలయాయి .

శర్మ మనసు మాత్రం శ్రీతేజ వద్దే ఆగిపొయింది.

అవును పరిచయం అయిన కొత్తలో కాబోలు ఇద్దరూ అనుకున్నారు, పెళ్లి చేసుకున్నాక ఇద్దరు పిల్లలు కావాలనీ అబ్బాయికి శ్రీతేజ , అమ్మాయికి తేజస్విని అని పేరు పెట్టుకోవాలనీ,అంటే శ్రీ తేజ ..

ఆపైన ఊహ ముందుకు సాగలేదు .

కాఫీ తాగి సెలవుతీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు.

**********

 

పదిరోజుల తరువాత కళ్ళువిప్పింది శృతి.

కళ్ళు తప్ప శరీరమేమీ లేనట్టూ, చెయ్యి పైకెత్తాలనుకుంది …. ఉహు… లాభం లేదు… కళ్ళు కిందకు తిప్పింది .

చచ్చు పడినట్టు పడి ఉంది శరీరం..

ఎదురుగా … ఎవరిదా మొహం శ్రీకాంత్ పోలికలు… కాదు కాదు శ్రీకాంతే…

“శ్రీకాంత్ ” పెదవులు కదిలాయి గాని మాట పెగల్లేదు.

“శృతీ … ఎలావుంది…”

మళ్ళీ పెదవుల కదలికే తప్ప నోట మాట రాలేదు.

శ్రీకాంత్ కి పరిస్థితి అర్ధమయింది.

ఆమె మెదడు డీప్ షాక్ లో వుండి శరీర భాగాలేవీ పని చెయ్యడం లేదు.

చకచకా చెయ్య వలసిన పరిక్షలన్నీ చేశాడు…

నుదుటిపైన చెమట అద్దుకుంటూ ఊహించని పరిణామానికి తనను తనే నిందించుకున్నాడు.

ఎప్పటికి ఆమె మామూలు మనిషి కాగలదో అసలు అవుతుందో జీవితమంతా అలా బెడ్ మీదే గడపాలో కూడా తెలియని స్థితి.

ఆ మాటే ముందు ఆమె భర్త శివరావ్ కు తెలిపారు, కుటుంబ సభ్యులకు చెప్పారు.

తల్లిదండ్రులు నిరుత్తరులయారు.

శివరావ్ ముందు తట్టుకోలేనట్టు బోరున విలపించాడు.కాని అది ఎందుకో సహజంగా అనిపించలేదు. పెదవి వంపులో ఎక్కడో కాస్త ఆనందం దాక్కున్నట్టు అనిపించింది.

చాలా సేపు తర్జన భర్జనల తరువాత ఎలాగూ ఆమె ప్రభుత్వోద్యోగి గనక హాస్పిటల్ చార్జెస్ ఆఫీస్ భరిస్తుంది కాబట్టి మరికొన్నాళ్ళు హాస్పిటల్ లో వుంచే నిర్ణయానికి వచ్చారు.

” నాకు తెలిసి ఇలాంటి కేస్ ఇంతవరకు మా దృష్టికి రాలేదు.. దీనిపై స్టడీ జరిపి మీకు ఎలాంటి ఖర్చులేకుండా చూసే ఏర్పాటు చూస్తాను” శ్రీకాంత్ చెప్పాడు.

“రోజూ ఇక్కడ ఎవరైనా ఉండాలా?”

“అబ్బే, ఇక్కడ కాదు  నా రీసెర్చ్ సెంటర్ కి తరలిస్తాము. అటెండెంట్ అవసరం లేదు… అవసరమనిపిస్తే మీకు కబురు చేస్తాం. కాని, స్టడీకి ఆమెకు సంబంధించిన వివరాలు అవసరపడవచ్చు. మీ కాంటాక్ట్ నంబర్ ఉందిగా … ఫోన్ చేసి మీ వీలును బట్టి వస్తాము”

శ్రీకాంత్ కు ఆమె తలిదండ్రులకు తనను తాను గుర్తు చేసుకుందామని ఎంత అనిపించినా అతి ప్రయత్నాన ఆగిపోయాడు.

మెడికల్  స్టడీ అవన్నీ ఆలోచించి చెప్పినవి కాదు. అప్పటికప్పుడు అనాలోచితంగా చెప్పినవే, ముఖ్యంగా ఎన్నేళ్ళుగానో ఎదురు చూసిన శృతిని ఇంత నిస్సహాయ స్థితిలో వదిలెయ్యాలని లేకపోడం వల్ల వచ్చిన ఆలోచన అది. తరువాత అనుకున్న పనులన్నీ చకచకా జరిగిపోయాయి.

శృతిని హాస్పిటల్  నుండి మార్చడం , ఒక మంచి నర్స్ ను ఆమె కోసం ఏర్పాటు చెయ్యడం ……..

రోజూ ఉదయం సాయంత్రం , వీలున్నప్పుడల్లా శృతి వద్ద కూర్చోడం నిస్సహాయంగా కనిపించే చూపులు తప్ప మరే విధంగానూ ఒక్క మాటా మాట్లాడలేక పరాజితలా బేలగా చూసే ఆమెను చూడటం తప్ప మరేం చెయ్యాలో అర్ధం కాలేదతనికి….

వారం రోజుల తరువాత స్థిమితంగ్గా ఆలోచించి ఒకనిర్ణయానికి వచ్చాడు.

********

నగరం నడి బొడ్డున ఉన్న స్లిమ్మింగ్ సెంటర్ అది. ఎప్పుడు చూసినా వచ్చే పోయే వాళ్ళతో కిటకిట లాడుతూ ఉంటుంది.

వెళ్ళిన వాళ్ళు సన్నబడతారో లేదో భగవంతుడికి ఎరుక గానీ ఒకసారి వెళ్లటమంటూ ఆరంభిస్తే అది అలా కొనసాగవలసినదే. పార్కింగ్ లో కారు ఆపి దిగింది సౌమ్య.

సౌమ్య అక్కడకు వచ్చింది మొదటిసారి. పేపర్లో ప్రకటనలు వాటితో పాటు వాళ్ళూ వీళ్ళూ చెప్పగా విన్నవి జత చేసి ఆలోచించుకున్నాక ఒకసారి వెళ్ళి వస్తే నేం అనిపించింది.

పెద్ద లావేమీ కాకపోయినా కాస్త బొద్దుగానే అనిపిస్తుంది సౌమ్య… ఈ మధ్యే కాస్త బరువు పెరిగినట్టు తెలుస్తూనే వుంది.

బిగువైన డ్రెస్ లు కొంచం కొంచంగా తెలుస్తున్న కాళ్ళ నొప్పులు

అవన్నీ తరువాత …పెద్దగా బాధించిన విషయం శివ ఈ మధ్య మాట్లాడితే చాలు నీకు ఒంటి మీద ధ్యాస తగ్గిపోయింది అంటున్నాడు….

మొదటి సారి విన్నప్పుడు నవ్వేసి ఊరుకుంది, కాని మరోసారి మరోసారి …. ఎన్ని సార్లు ఆమాట విన్నప్పుడల్లా తనువు కోసేసుకుందామనిపిస్తుంది.

అంతేనా ఎదురింటి మీనాక్షి ఎంత వయసు మళ్ళినా ఎంత పొంకంగా వుందో చూడు …. అన్నప్పుడు ఎక్కడో ఓ అనుమానం పుట్టింది… మరెక్కడో ఎక్కడ తనను నిర్లక్ష్యం చేసి మరెవరి వెనకైనా వెళ్తాడేమో నన్న అనుమానం

అందుకే ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకుని వచ్చింది.

ఇచ్చిన పామ్ పూర్తి చేసి హైట్ వెయిట్  చెక్ చేసుకున్నాక గాని తెలిసిరాలేదు.

కాస్త బొద్దుగా అనుకుంది గాని బరువు పరంగా ఎంత ఎక్కువగా వుందో ………..

దాదాపు ఇరవై కిలోలు ! మై గాడ్!

కన్సల్టెంట్ రకరకాల పాకేజిల గురించి వివరించింది.

వెయిట్ లాస్ ప్రోగ్రామ్ జెల్ థెరపీ టక్స్ అంటూ …మొత్తానికి ఇరవై ఎనిమిది వేలు కట్టి పది కిలోల బరువు తగ్గే కోర్స్ లో చేరింది సౌమ్య.

జీరో సెష్షన్ అంటూ ఒక గంట సెల్లో అని చెప్పారు.

వాళ్ళిచ్చిన డ్రెస్ తీసుకుని చేంజ్ చేసుకుని అటెండెంట్ పిలిచిన రూం లోకి వెళ్ళింది.

“భయపడకండి కొంచం హీట్ … వేడెక్కుతుంది అంతే “నడుం చుట్టూ బెల్ట్ బిగించి చుట్టూ టర్కీ టవల్ చుట్టు టీవీ ఆన్ చేసి రిమోట్ కంట్రోల్ చేతికిచ్చి ” వన్ అవర్…ఏదైనా కావాలంటే బజర్ నొక్కండి “అంటూ వెళ్ళిందామె…

ఒక్కో రూమ్ లో రెండు బెడ్స్, మెషీన్స్  ఉన్నాయి దాదాపు పది రూమ్స్ ఉన్నట్టున్నాయి…

ఎక్సర్ సైజ్ చేసేందుకు ఒక స్టెప్పర్ ఒక బల్ ఉన్నాయి.

కాఆస్త కాస్త హీట్ ఎక్కువై ఒళ్ళు చమటలు పట్టడం ఆరంభించింది.

పక్క బెడ్ మిద ఆవిడకు మరేదో మెషీన్ అరేంజ్ చేశారు.

“ఫర్మింగా ?”ఆవిడ అడుగుతోంది.

“కాదు, వైబ్రేషన్”

ఎదురుగా వాల్ పై టీవీ … రెండు వైపులా నిలువుటద్దాలు.

“ఎన్ని రోజులైంది మీరు చేరి ?” పక్కనావిడను అడిగింది.

“ఆర్నెల్లు కావస్తోంది… ”

“ఏమైనా తగ్గారా?”

” ఓ రోజు తగ్గడం , ఓ రోజు పెరగడం …రెండు మూడు కిలోలు తగ్గాను…”

“అంతేనా?”

” అయినా మనం ఎంత డైట్ కంట్రోల్ లో ఉండగలమనే దానిపై ఆధార పడి ఉంటుంది.ఇక్క్కడకు రావడం కేవలం మోటివేషన్ కోసమే …. తిన్నదానికన్న ఎక్కువ ఖర్చుచెయ్యాలి అదే పాలసీ…”

నిజమే కావచ్చు.

చిన్నప్పుడు సన్నగా జాజి తీగలా వుండేది.

అప్పట్లో ఎంత పని చేసేది.

ఉదయం టైప్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ఓ గంట టైప్ నేర్చుకోడం , దానికోసం కనీసం రెండు కిలోమీటర్లు రానూ పోనూ నడక, మళ్ళీ  కాలేజికి రెండు ప్లస్ రెండు నాలుగు కిలోమీటర్లు నడక …. మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తూనే అయిదారుగురికి చదువు చెప్పడం రాత్రి పది వరకు చదువు స్వంత పనులు …

అలాంటిది కూచుని ఆలోచించుకుంటే ఇప్పుడు పనేమీ చెయ్యనట్టే లెఖ్ఖ…

పనిమనిషి వచ్చి అన్ని పనులూ చేస్తుంది. అప్పుడూ ఇప్పుడూ ఇరవై నాలుగ్గంటలూ బిజీయే కాదంటే ఒళ్ళు కదలకుండా బుర్రతో చేసే పనులు, ఇంట్లో సుఖలు ఎక్కువై…

అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చాక అసలెవరు వాకిలూడ్చి ముగ్గేసుకుంటున్నారు?

ఒకప్పుడు ఆపనికే అరగంట పట్టేది, ఒంగి ముగ్గులెయ్యడం …

ఇప్పుడు పని మనిషి రాకపోయినా ఒకరోజు ఫర్వాలేదులే అనుకోడం …

అయిన శివ వారమంతా టూర్స్ లో ఉండటం … ఏమైనా అంటే బిజినెస్ కోసం తప్పదంటాడు… శనాదివారాలు పిల్లలతో కలిసి సరదాగా గడపడం హోటల్స్ లో తినడం మళ్ళి రొటీన్…

ఆలోచనల్లోనే గంట గడిచిపోయింది.

రోజు విడిచి రోజూ అపాయింట్మెంట్ …

శనాది వారాలు వదిలేసి వారానికి మూడు సార్లు ఫిక్స్ చేసుకుని ఇంటికి బయల్దేరింది సౌమ్య.

అమీర్ పేట్ దాటడానికే అరగంట పట్టింది.

సరిగ్గా ట్రాఫిక్ లైట్ దగ్గర గ్రీన్ లైట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో హఠాత్తుగ కుడి వైపు నుండి వస్తున్న ఆకార్ లో ఉన్నది శివకాదుగదా అనిపించిందో క్షణం.

ఆ బ్లూ చెక్స్ షర్ట్ మొన్న క్రితం నెల పెళ్ళి రోజుకు తనే కొనిచ్చింది.

అయినా దూసుకుపోతున్న కారులోఅతన్ని కారులో నుండి చూసి శివ అని ఎలా అనుకోగలదు…

ఈ సందిగ్ధంలో గ్రీన్ లైట్ వెలగడం కూడ గమనించలేదు.  వెనకాల బొయ్ మంటూ తిడుతున్నట్టు హార్న్ మోగడంతో ముందుకు నడిపింది కారును.

అయినా ఇంటికి వచ్చినా మనసు అయోమయంగానే ఉంది.

ఎందుకో అతను శివా అనే అంటోంది మనసు.

ట్యూషన్ నుండి వచ్చిన పిల్లలు స్నానాలు చేస్తున్నారు. ఈ మధ్య స్కూల్స్ కమ్ కోచింగ్ సెంటర్ల వల్ల ముఖ్యంగా ఉద్యోగాలు చేసే తల్లులకు పిల్లల బెంగ తప్పింది. ఉదయం ఏడున్నరకల్లా వెళ్తే తిరిగి వచ్చేది రాత్రి ఏడింటికే.

లేకపోతే నాలుక్కల్లా ఇంటికి వచ్చే పిల్లలకోసం మరో ఏర్పాటు చూడవలసి వచ్చేది.

అంతమయిపోయిన ఉమ్మడి కుటుంబాలు, తప్పని పరిస్థితుల వల్ల ఆర్ధిక సంక్షోబం వల్ల ఇల్లు సరిదిద్దవలసిన ఇల్లాళ్ళు ఉద్యోగానికి వెళ్లవలసి రావడం , వీటన్నింటి మధ్యన పిల్లల సమయం ఎలా వినియోగిస్తున్నామన్న ఆలోచనే లేకుండా పోయింది….

 

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *