May 8, 2024

పూరి జగన్నాధుని రథయాత్ర

రచన: నాగలక్ష్మి కర్రా
rath-yatra_3

ఒరిస్సా రాష్ట్రం లో వున్న ప్రఖ్యాత తీర్ధ స్థలం పూరి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కి సుమారు 60కిమి దూరంలో సముద్రతీరాన వుంది. హౌరా విశాఖ పట్నం రైల్ మార్గంలో ఖుర్దా రోడ్డు జంక్షన్ లో రైలు మారవలసి వస్తుంది లేదా పూరి వరకు వెళ్ళే రైళ్లు కొన్ని ముఖ్య పట్టణాలనుంచి వున్నాయి. ఖుర్దా రోడ్డు జంక్షన్ నుంచి సుమారు 40 కిమీ. యీ ఖుర్దా రోడ్డు లోనే మా నాన్నగారు ఉద్యోగ రీత్యా స్థిరబడడంతో నాకు మూడేళ్ళప్పటి నుండి చదువు , పెళ్లి అన్ని అక్కడే అయ్యేయి.

యీ కోవెలని ‘ బొడొదేవుళొ ‘ (పెద్ద కోవెల), శ్రీ మందిరం అని పిలువబడే యీ కోవెలలో జగన్నాధుడు అంటే శ్రీకృష్ణుడు , అతని అన్న బలభద్రుడు , వారి చెల్లెలు సుభద్రలు ముఖ్య దేవతలుగా పూజలందుకుంటున్నారు.

పూరి జగన్నాధుని మందిరం 63 అడుగుల యెత్తుతో పూరి పట్టణంలో యెక్కడనుంచి చూసినా కోవెల శిఖరం , దానిపైన వుండే సుదర్శన చక్రం కనిపిస్తాయి. యీ మందిరానికి నాలుగు ద్వారాలు వున్నాయి అవి సింహద్వారం , అశ్వద్వారం , గజద్వారం , వ్యాఘ్రద్వారం అని అంటారు. సింహద్వారానికి జయ విజయులు కావలి కాస్తూ వుంటారు. యీ కోవేలలోకి ప్రవేశించాలంటే ముందుగా 22 మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాలి. యీ మెట్లు యెంత మహిమగలవి అంటే మెదటి మెట్టు మీద కాలు పెట్టగానే అంతవరకూ హోరు హోరుమని వినిపించే సముద్ర గర్జన వినిపించదు. కోవెలలో యెడమ వైపున ఆది శంకరాచార్యులచే ముఖ్య నాలుగు ఆది ఖండాలుగా గుర్తించిన సతీదేవి యొక్క శరీర ఖండాలలో పాదాలు పడ్డ ప్రదేశం. పాద ఖండే బిమొళాదేవి (విమలా దేవి ) మందిరం వుంటుంది. కోవెల ప్రాంగణంలో వివిధ దేవతా మూర్తుల విగ్రహాలు మనకి కనిపిస్తాయి. జగన్నాధుని కోవెలలో వంటశాల (భొగ శాల , ఒరియాలో భొగొ అంటే ప్రసాదం అని అర్ధం ) గురించి విశేషంగా చెప్పుకుంటారు. ప్రతి రోజు కనీసం 25,000 మందికి సరిపడా భోజనం తయారవుతుంది. పండుగ రోజులలో కనీసం లక్ష మందికి సరిపడా వండుతారు. యిప్పటికి యిక్కడ కట్టెల పొయ్య , కుండలనే వంటకు ఉపయోగిస్తారు. వొక కుండపై వొకటిగా మెత్తం ఐదు కుందలకు తక్కువ కాకుండా దొంతిగా పెట్టి వండుతారు. జగన్నాధుడికి రోజులో ఆరు మార్లు అన్న నైవేద్యాలు జరుపుతారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానికుల యిళ్ళల్లో పెళ్ళిళ్ళకి యిక్కడి అన్న ప్రసాదం తీసుకొని వెళ్ళి వారు వండించిన పదార్ధాలలో కలిపి అతిథులకి వడ్డన చేస్తారు. యిది యిక్కడి వారి ఆచారం.
గర్భ గుడిలో పుజలందుకొనే మూలవిరాట్లు రాతితో గాని , లోహములతో గాని కాక కర్రతో చేసినవి కావడం మరో విశేషం. యీ విగ్రహాలు మొహం మాత్రమే ఆకారం ఇవ్వబడి మిగతా భాగం కర్ర దుంగ ఆకారంలో వుండడం మరో విశేషం. యీ మూలవిరాట్లు ప్రతి పన్నెండు సంవత్సరాలకి వొకమారు సముద్రంలో తేలుకుంటూ వచ్చే కర్ర దుంగలతో తయారుచేసి పాత విగ్రహాల స్థానే ప్రతిష్ఠిస్తారు. యీ కర్ర దుంగలు సముద్రంలో తేలి వచ్చే రోజు , సమయం , ప్రదేశం ముందుగా స్వప్న రూపంలో ప్రధాన పూజారికి తెలియజెయ్యడం అన్ని కూడా విశేషాలే. కొన్ని వేల సంవత్సరాలుగా యిదే ఆనవాయితీగా జరుగుతూ వస్తున్న ఆచారం.
ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విదియ నాడు రథయాత్ర నిర్వహించడం అనేది కూడా అనాదిగా వస్తున్న ఆచారం. యీ వేడుకను దేశ విదేశాల నుంచి భక్తులు చూసి తరించడం మరో విశేషం. ప్రతి కోవెలలోను ఉత్సవ విగ్రహాలను కోవెల చుట్టూ తిప్పడం చూస్తాం కాని పూరీలో మూలవిరాట్టులను రథాలమీద తిప్పడం విశేషం.
1078వ సంవత్సరంలో యీ ప్రాంతాన్ని పరిపాలించిన గంగ వంశ రాజైన అనంత వర్మ చోడ గంగదేవ్ చే జగన్ మోహన్ ( మండపం ) మరియు విమాన గోపురాలు నిర్మించబడ్డాయి. 1174 లో అనంగ భీమదేవ్ యీ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు యిక్కడి చరిత్ర చెప్తోంది.
స్కంధ పురాణంలోనూ, బ్రహ్మ పురాణంలోనూ యీ మందిరం గురించిన కధలు వుల్లేఖించ బడ్డాయి. వాటి ప్రకారం శ్రీ కృష్ణుడు నీల పర్వతము పై తపస్సు చేసుకుంటూ వుంటాడు. ఆ ప్రాంతపు ‘ సవర ‘ అనే కొండజాతికి చెందిన రాజైన విశ్వవసు శ్రీకృష్ణుడిని గుర్తించి ప్రతిదినం నీల పర్వతానికి వెళ్లి స్వయంగా మాధవుడిని సేవించు కుంటూ ఉంటాడు. మాధవుని కోరిక మేరకు ఆ విషయాన్ని గోప్యంగా వుంచుతాడు. అప్పటి కళింగ రాజైన ఇంద్రద్యుమ్నడు యీ విషయాన్ని తన స్వప్నంలో చూచి నీలమాధవుడిని తన రాజ్యానికి తెచ్చుకొని , మాధవుని కొరకు మందిరం కట్టి నిత్య పూజలు చేసి తరించాలనే తలంపుతో నీలమాధవుని వద్దకు తీసుకొని వెళ్ళమని విశ్వవసుని కోరుతాడు, వచనబద్దుడైన విశ్వవసు ఇంద్రద్యుమ్నని ప్రలోభాములకు లోబడక అతని ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. ఇంద్రద్యుమ్నడు విద్యాపతి అనే యువకుని కపటము నైనా నీల మాధవుడు యెక్కడవున్నది తెలుసుకు రమ్మని పంపుతాడు. విద్యాపతి విశ్వవసు కుమార్తె లలితను వివాహమాడి నీలమాధవుని వద్దకు తీసుకొని వెళ్ళమని హఠమ్ చేస్తాడు. విధి లేక విశ్వవసు విద్యాపతి కళ్లకు గంతలు కట్టి నీలమాధవుని వద్దకు తీసుకొని పోతాడు. విద్యాపతి కపట బుద్దితో వుండుటచే ఆవాల మూటను కూడా తీసుకొని కొంచం కొంచంగా దారంతా విడుస్తూ వెళ్లి నీల మాధవుడిని దర్శించుకొని వస్తాడు. మరునాడు అందరూ గాఢ నిద్రలో వుండగా అందరిని విడిచిపెట్టి ఇంద్రద్యుమ్నమహారాజు వద్దకు వచ్చి సపరివారంగా అతనిని తీసుకొని నీలమాధవుని దర్శనానికి ప్రయాణమవుతాడు. అతనిచే జారవిడువబడ్డ ఆవాలు మొలకలెత్తి దారి చూపగా నీల పర్వతం పైకి తీసుకొని వెళతాడు. కాని అక్కడ మాధవుడు కానరాడు . నిరాశ నిండిన మనస్కుడై ఇంద్రద్యుమ్నడు నీల మాధవుడిని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. స్వప్నంలో నీలమాధవుడు ఇంద్రనీల రాతితో మలచ బడ్డ విగ్రహంగా మారి సముద్ర తీరాన ఇసుకలో కప్పబడి పోయినట్లు కనిపిస్తుంది. ఇంద్రద్యుమ్నమహారాజు యిప్పటి పూరీ సముద్ర తీరాన నీల మాధవుని వెతుకుతూ వుంటాడు. వొకనాడు వెతికి వెతికి విసిగివేసారి నిరాశాగ్రస్తుడై సముద్ర తీరాన కూర్చొని వుండగా అశరీరవాణి తాను రాజు వెతుకుతున్ననీలమాధవుడినని అతను తన భక్తుడైన విశ్వవసు మోసం చెయ్యడం వలన ఆగ్రహించినట్లు అందుచే రాజు యెంత వెతికినా అతనికి చిక్కనని , అతని భక్తికి మెచ్చి అతనికి వరం ప్రసాదిస్తున్నానని దాని ప్రభావంతో అతనికి సముద్రంలో తేలుకుంటూ వచ్చే మంచి సువాసన గల కర్ర దుంగ కనిపస్తుందని దాంతో తన , బలభద్ర , సుభద్రల మూర్తులను చెక్కించి పూజించమని వినిపిస్తుంది.
భగవంతుని ఆదేశం అనుసరించి ఆ కర్ర దుంగకు ఆకారం యివ్వడానికి ముందుకు వచ్చిన శిల్పి మొత్తం పని పూర్తయ్యేవరకు ఎవ్వరు తన ఏకాంతానికి భంగం కలిగించరాదని అలా కలిగిస్తే తాను దేవతా మూర్తులను అసంపూర్తిగా విడిచి పెట్టి అంతర్ధానమౌతానని మాట తీసుకొని పనికి వుపక్రమిస్తాడు. స్త్రీ సహజమైన కుతూహలంతో ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క పట్టమహిషి ‘గుండిచ ‘ శిల్పి నివాసమున్న స్థలానికి పోయి ఆ యింటి నుంచి యెటువంటి శబ్దములు రాకుండుట విని విగ్రహాలు తయారయి వుంటాయని రాజుని నమ్మించి తలుపులు తీయిస్తుంది. పుచ్చుకున్న మాట ప్రకారము శిల్పి అంతర్ధానమౌతాడు.
ఆ అసంపూర్తి విగ్రహాలను ప్రతిష్టించి పూజాదులు నిర్వర్తిస్తాడు ఇంద్రద్యుమ్న మహారాజు. అప్పట్నుంచి ప్రతి పన్నెండేళ్లకొకసారి కొత్త కర్రతో చేసే విగ్రహాలని పతిష్ఠిస్తారు దీన్ని ‘ నవకళేబరమ్ ‘ అని అంటారు. సుదర్శన చక్రం కూడా చెక్కతోనే చెయ్యడం విశేషం. పూరి జగన్నాధుడికి మొక్కు తీర్చుకోవడానికి భక్తులు కోవెల పైనున్న జండాను యెగుర వేస్తారు. నిర్ణీత సొమ్మును మందిర యాజమాన్యానికి చెల్లిస్తే వారే జండాను ఎగురవేయ్యడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తారు. యీ జండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ భక్తులను విస్మయానికి గురిచేస్తూ వుంటుంది.యిక్కడి పుజారులని ‘ పండాలు ‘ అని అంటారు. యిక్కడ యీ పండాల ధాష్ఠీకం , వారు యాత్రీకులను దోచుకోడం అనేవి చూస్తే యెంత ఆస్తికులకైనా దేవుడి మీద నమ్మకం పోతుంది అని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాను. అలాగే అడుగడుగునా ప్రతి మనిషి చేసే మోసం , జేబుదొంగలు మన పర్సులను , మెడలను తేలిక చెయ్యడంలో సిద్ద హస్తులు కనిపించి మన లోని భక్తిని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. యిది కూడా జగన్నాటక సూత్రధారి యొక్క మాయేనేమో ?

యిక్కడ జరిగే ముఖ్య మైన ఉత్సవాలు యివి —-
1) రథా యాత్ర 2) చందనోత్సవం 3) బంగారు అలంకరణ

1) రథయాత్ర —-

యింగ్లీషు తేదీల ప్రకారం యీ సంవత్సరం అంటే 2015 లో జూలై 18న రథాయాత్ర జరుగుతుంది.
ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియనాడు పూరిలో జరిగే రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. సుమారు 45 అడుగుల యెత్తైన రథాలమీద జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్ర రాచ వీధులలొ ఊరేగుతూ శ్రీమందిరం నుంచి మౌసిమా ( పినతల్లి ) మందిరంలో కొంచం సమయం విశ్రాంతి తీసుకొని గుండిచ మందిరంలో తొమ్మిది రోజులు వుండి తిరిగి శ్రీ మందిరానికి రావడాన్ని రథాయాత్ర అని అంటారు. ఇంద్రద్యుమ్నుని పత్ని ‘ గుండిచ ‘.
రథయాత్ర రోజు ముందుగా ఇంద్రద్యుమ్న మహారాజు బంగారు పిడిగల చీపురుతో రథాన్ని , రథాయాత్ర సాగే వీధులను తుడిచి గంధం నీళ్లతో కళ్ళాపి జల్లి శుద్ధ పరచిన తరువాత రథయాత్ర మొదలయ్యేది. యిప్పటికీ రథయాత్ర నాడు అదే చీపురుతో ఇంద్రద్యుమ్న మహారాజు సంతతివారు ప్రపంచంలో యెక్కడ వున్నా ఆ రోజు పూరి చేరుకొని రథాన్ని తుడవడం , చందనం కలిపిన నీళ్లతో కల్లాపి చల్లడం లాంటి ఆచారాలను యిప్పటికీ పాఠించడం వారికి భగవంతుని పై గల విశ్వాసాన్ని తెలియ జేస్తుంది.
45.6 అడుగుల యెత్తు , 18 చక్రాలు గల నంది ఘోష అని పిలువబడే రథంపై జగన్నాధుడు , 45 అడుగుల యెత్తు , 16 చక్రాలు ‘ తలద్వజ ‘ పై బలభద్రుడు , 44.6అడుగుల యెత్తు , 14 చక్రాలు గల ‘ దేవదలన ‘ పై సుభద్ర లు బోడో దండో ( పెద్ద వీధి లేక రాచ వీధి ) లో వేలాది భక్తులు జై జై నాదాలతో రథాలకు కట్టిన తాళ్ళతో లాగుతూ మెదలయే యాత్ర గుండిచ మందిరం వరకు సాగుతుంది. జన్నాధుని రథం రంగు రంగుల అలంకారంతో ముందుకు వెనుకకు వూగుతూ కదులుతున్నప్పుడు చూసేవారికి నల్లని మదగజం పుర వీధులలో తిరుగుతోందా అనిపిస్తుందిట. జగన్నాథుని రథయాత్రని వొక్క క్షణకాలం చూసినా పునర్జన్మ వుండదని భక్తుల నమ్మిక. తొమ్మిది రోజులు గుండిచ మందిరంలో నిత్య పూజలు , నిత్య నైవేద్యాలతో పాటు ” ఛెన్న పుడో పిఠ ” అనే వంటకం ప్రత్యేకంగా నివేదించడం జరుగుతుంది. జగన్నాదునికి అతి ప్రీతికరమైన వంటకమని , లక్ష్మీ దేవి జగన్నాధుని కొరకు తయారుచేసేదని లక్ష్మీపురాణంలో వివరించబడింది. నిజంగా యిది చాలా రుచిగా వుంటుంది. పాల విరుగు (ఛెన్న ) తో చేసే ‘ ఛెన్న పుడో పిఠ ‘ , ‘ ఛెన్న గోజ్జా ‘ యీ రెండు తీపి వంటకాలు ఒరియావారి స్పెషాలిటి అని చెప్పక తప్పదు. ఇవి ఒరిస్సా లో తప్ప యితర రాష్ట్రాలలో లభ్యం కావు. కాబట్టి జగన్నాధుని దర్శించుకున్న తరువాత యీ స్వీట్స్ రుచిని ఆస్వాదించడం మరచి పోవద్దు.

గుండిచ మందిరం వుద్యానవనాన్ని పోలి వుంటుంది. ఆషాఢపు వుక్కపోతనుండి తప్పించుటకు భగవంతుడిని యీ మందిరంలో పెడతారు అనేది కళింగుల నమ్మిక. గుండిచ మందిరంలో బలభద్ర , సుభద్రలతో వున్న జగన్నాధుని దర్శించుకుంటే వెయ్యి అశ్వమేధయాగాలు చేసినంత పుణ్యం వస్తుందట.
కలియుగ దైవం అయిన జగన్నాధుని అద్వైత గురువైన ఆది శంకరాచార్యులు , చైతన్య మహాప్రభు , రామకృష్ణ పరమహంస , జయదేవుడు మొదలైన వారు యీ స్వామిని దర్శించుకొని ధన్యులయ్యేరు అనేది యిక్కడి చరిత్ర చెప్తోంది.

2)చందనోత్సవం —
వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ నాడు మొదలయి 21రోజులు సాగుతుంది. పూరీ జగన్నాదునికి చందనోత్సవం చెయ్యడం ఆచారం. చందనోత్సవం వేసవి రాకను తెలియజేసే వుత్సవం అని చెప్పాలి. అక్షయ తృతీయనాడు జగన్నాధుడు , బలభద్రుడు, సుభద్రలను, పంచ పాండవుల పేరులతో ప్రసిధ్ధి పొందిన శివలింగాలను ( ఉత్సవ మూర్తులు ) సింహద్వారం గుండా తీసుకొని నరేంద్ర తీర్ధ కుండంలోని నీటితో అభిషేకం చేసి చందనం రాసిన విగ్రహాలను పూలతో అలంకరించిన నౌకలలో విహారానికి తీసుకొని వెళతారు. అక్షయ తృతీయనాడు రథాయాత్ర కోసం రథాలను తయారు చెయ్యడం కూడా మొదలు పెడతారు.

3) బంగారు అలంకరణ —
జగన్నాధుడు , సుభద్ర , బలభద్రుడు గుండిచ మందిరం నుంచి శ్రీమందిరానికి మరలి రావడాన్ని మారు రథయాత్ర అని అంటారు. జగన్నాధుడు , సుభద్ర , బలభద్రుడు శ్రీ మందిరానికి వచ్చిన తరువాత విగ్రహాలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.
పూరిలో జగన్నాధుని కోవల కాక మౌసిమా మందిరం , గుండిచ మందిరం కాక పంచపాండవుల కోవెలలు , పంచ తీర్ధాలు. పూరి రైల్ స్టేషనుకి 1కిమి దూరంలో వున్న బంగారు ఇసుకతో కూడిన బీచ్ ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచింది.
యీ కోవెల గురించి యెంత క్లుప్తంగా రాసినా యిన్ని పేజీలు అయ్యింది. యింకా పూరీ గురించి రాయవలసినది యెంతో వుంది. వోక్కమారు పూరి జగన్నాధుని దర్శించుకొని రండి నేను చెప్పినది అతిశయోక్తి కాదని తెలుసు కుంటారు.
పూరి యాత్రకి వెళ్లేవాళ్లు రథయాత్రకైతే ఆషాఢమాసంలో వెళ్లాలి తప్పదు. లేకపోతే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. జేబు దొంగలు , గొలుసులు లాగే దొంగలు , పూజలు నైవేద్యాలు అంటూ నస పెట్టె పండాలనుంచి అప్రమత్తంగా వుండాలని భక్తులకి నా విన్నపం.

4 thoughts on “పూరి జగన్నాధుని రథయాత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *