May 6, 2024

రెండు అష్టపదులు

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

అష్టపదులనుగుఱించి వినని వారు ఉండరు. శ్రీజయదేవుని గీతగోవిందము జగత్ప్రసిద్ధము. అందులో 24 అష్టపదులు ఉన్నాయి. అసలు అష్టపది అనే పేరు ఎందుకో తెలుసా? వీటిలో ఎనిమిది పదములు, అనగా చరణములు, ఉంటాయి. ఈ చరణములు ఎప్పుడు ద్విపదలు, అనగా అష్టపదిలోని ప్రతి పదమునకు రెండు పాదములు ఉంటాయి. అంతే కాదు, ప్రతి అష్టపదికి ఒక ధ్రువము ఉంటుంది. ఈ ధ్రువము ఇప్పటి మన పాటలలోని పల్లవి వంటిది. కాని పల్లవికి, ధ్రువమునకు ఒక ముఖ్యమైన తేడా ఉన్నది. అదేమంటే, పల్లవి చరణానికి ముందు వస్తుంది. సంస్కృతములోని గీతములలో ధ్రువము చరణమునకు తఱువాత వస్తుంది. ఇది కాకుండా, అష్టపదిని ప్రారంభించే ముందు ఒక వృత్తమును కూడ పాడాలి. ఇప్పుడు ఈ విషయాలను ఒక సంగ్రహ రూపములో నుంచుదామా?

వృత్తము, ఎనిమిది రెండు పాదముల చరణములు, చరణము తఱువాత ధ్రువము, చివరి పదములో కవి ముద్ర – ఇవి అష్టపదుల లక్షణాలు. ఈ అష్టపదులను శ్రీజయదేవుడు మాత్రా ఛందస్సులో వ్రాసెను. ఇది ప్రాకృత ఛందస్సు ప్రభావమా, బహుశా జయదేవుడు దీనిని స్వతంత్రముగా కనుగొన్నాడా, లేక శంకరాచార్యులవంటి వారి దేవతా స్తోత్రముల ప్రభావమా అనే విషయమును నిర్ణయించుట కష్టము. అష్టపదులలో ఎక్కువగా చతుర్మాత్రా ఛందస్సులే. పాదమునకు ఏడు చతుర్మాత్రలు, అంత్య ప్రాస వీటి ముఖ్య లక్షణములు.

అష్టపదులను పాడేటప్పుడు దానికి ముందున్న వృత్తమును విధిగా పాడాలి, తఱువాత అన్ని ఎనిమిది పదములను కూడ పాడాలి. కని నేటి గాయకులు, ఒకటో రెండో పదములను పాడి, చివరకు జయదేవుని ముద్ర ఉన్న చివరి చరణమును పాడి ముగిస్తారు. కృష్ణమూర్తి-వేదవల్లి, విద్యాభూషణ్, నిత్యసంతోషిణి వంటివారు మాత్రమే అష్టపదిలోని ఎనిమిది చరణములను పాడియున్నరు.

ఈ పరిచయముతో ప్రేమికులకోసము నేను వ్రాసిన రెండు అష్టపదులను మీముందు ఉంచుతున్నాను. చదివి, పాడి, ఆనందించండి.

(1)
ఇంద్రవజ్ర –
రాగమ్ము పాడన్ – రతనాల వీణన్
రాగమ్ముతోడన్ – ప్రణయస్వరూపా
వేగమ్ము రావా – విరహమ్ము తీరన్
భోగమ్ము లీయన్ – ముదమొంద నాకున్

అష్టపది – పాదమునకు ఏడు చతుర్మాత్రలు; మొదటి, మూడవ, ఐదవ మాత్రాగణములకు ప్రాసయతి.

సుందర యామిని – సుందర కౌముది – సుందర తారల గనుమా
సుందర రాగము – సుందర సాహితి – సుందర స్వరముల వినుమా
ప్రేమ యాత్రలో పథికులమై
ఈ మహి ముదమున సాగుదమా – ధ్రువము – 1

మనసున నిను నే – ననిశము దలచితి – ననుపమ మగు భ్రాంతులలో
చిన యాశలతో – పెను పులకలతో – తనువున తెలి కాంతులలో
ప్రేమ యాత్రలో పథికులమై
ఈ మహి ముదమున సాగుదమా – 2

నిన్న మనోవని – క్రొన్నన విరిసెను – నిన్ను గనంగ ప్రియముగా
వెన్నెల నదిలో – వన్నెలతో మది – మిన్నగ పాడె నవముగా
ప్రేమ యాత్రలో పథికులమై
ఈ మహి ముదమున సాగుదమా – 3

నిన్నటి రోజున – వెన్నునివలె నా – కన్నుల ముందర నిలువగ
వన్నియ సుమముల – జెన్నుగ మాలను – మన్నన వేసితి గలువగ
ప్రేమ యాత్రలో పథికులమై
ఈ మహి ముదమున సాగుదమా – 4

చాలీ రేయియు – చాలీ హాయియు – చాలీ మాయ బ్రదుకులో
చాలీ కౌగిలి – చాలీ ముద్దులు – సోలుచు దాచెద నెదలో
ప్రేమ యాత్రలో పథికులమై
ఈ మహి ముదమున సాగుదమా – 5

ప్రేమికులముగా – భూమిని నుందమొ – లేమో మన మెఱుగముగా
నా మనసున నీ – కోమల చిత్రము – శ్యామలమై శోభిలుగా
ప్రేమ యాత్రలో పథికులమై
ఈ మహి ముదమున సాగుదమా – 6

బాపురె నిజముగ – రేపన్నది మన – చూపున కందని దినమే
నా పున్నెముగా – నీ పక్కన కడు – తీపిగ నేడీ స్వనమే
ప్రేమ యాత్రలో పథికులమై
ఈ మహి ముదమున సాగుదమా – 7

ఈ రాతిరిలో – సారంగములై – చేరుదమా స్వర్గమునే
రారా మోహన – రారా ప్రియతమ – దూరము దగ్గర యగునే

ప్రేమ యాత్రలో పథికులమై
ఈ మహి ముదమున సాగుదమా – 8

2)
పుష్పశకటికా –
రాగ మొలుకు నాటల్ – రాత్రిలోఁ దేనె యూటల్
భోగ మొసఁగు నింపుల్ – పున్నమిన్ బుల్కరింపుల్
మూఁగమనసు మాటల్ – మోహనమ్మైన పాటల్
యోగసమయమందున్ – యుగ్మమై యుంద మిందున్

అష్టపది – పాదమునకు ఆఱు చతుర్మాత్రలు, చివర ఒక పంచ మాత్ర. మొదటి, మూడవ, ఐదవ మాత్రాగణములకు అక్షరసామ్య లేక ప్రాసయతి. ఛందస్సులో ఇది గీతగోవిందములోని చివరి అష్టపదియైన కురు యదునందన…ను బోలినది.

ఇది ఒక సుదినము – వదలను నిన్నిక – వదలకు నన్నిక మాధవా
ముదముల సిరులను – పదముల విరులను – హృదితో నిత్తును రా ధవా
నిను జూడగా మది నిండెగా
బ్రదు కీ ధరపై పండెగా – ధ్రువము – (1)

చిన నాటను నే – చిరు బొమ్మల నీ – చెలువము గంటిని మాధవా
మన మందున నీ – మధుర వదనమును – మఱువక నిలిపితిరా ధవా
నిను జూడగా మది నిండెగా
బ్రదు కీ ధరపై పండెగా – (2)

జగమున నా కెపు – డగపడునది నీ – సిగ పించెమురా మాధవా
మొగమున వెన్నెల – నగవుల వన్నెల – సుగమును జూపగ రా ధవా
నిను జూడగా మది నిండెగా
బ్రదు కీ ధరపై పండెగా – (3)

మ్రోగించుమ నీ – రాగమురళి బ్రియ – రాగము లొలుకగ మాధవా
మ్రోగింతును నే – వేగము వీణియ – తీగలు పలుకగ రా ధవా
నిను జూడగా మది నిండెగా
బ్రదు కీ ధరపై పండెగా – (4)

మృదువుగ మృదువుగ – పెదవుల నీయర – మధురక్షణమున మాధవా
మధువే యగు నది – సుధయే యగునది – యెద గడియారమురా ధవా
నిను జూడగా మది నిండెగా
బ్రదు కీ ధరపై పండెగా – (5)

నీతో ఘడియలు – నిండిన యుగములు – నిజముగ నెప్పుడు మాధవా
నీతో నమవస – నిండిన పున్నమి – నీవే చంద్రుడురా ధవా
నిను జూడగా మది నిండెగా
బ్రదు కీ ధరపై పండెగా – (6)

తనువను గుడిలో – మనసున విగ్రహ – మనయము నీదే మాధవా
తనువులు రెండీ – దినమున నొండై – తనియు నికెప్పుడు రా ధవా
నిను జూడగా మది నిండెగా
బ్రదు కీ ధరపై పండెగా – (7)

నవమోహన యీ – నందనవనిలో – నందము నీయర మాధవా
భవ మిక నీవె వి-భవ మిక నీవే – భువనము నీవే యాదవా
నిను జూడగా మది నిండెగా
బ్రదు కీ ధరపై పండెగా – (8)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *