May 5, 2024

వెటకారియా రొంబ కామెడియా 10

రచన: మధు అద్దంకి

ఎండలు – ఆవకాయ

14

అబ్బబ్బా పాడు ఎండలు.. మాడు మంటెత్తించేస్తున్నాయ్” అని విసుక్కుంటూ లోపలికొచ్చాడు సు.రా ( సుబ్బా రావు)
“ఏమోయ్” అని పిల్చాడు సు.రా.. ఉహు చప్పుడు లేదు.
మళ్ళా “ఏమోయ్” అని కొంచం గట్టిగా పిల్చాడు సు.రా.. ఉహు ఐనా చప్పుడు లేదు..
“ఏమోయ్” అంటూ రంకేశాడు సు.రా
ధన్ ధన్ ధన్ మంటూ శబ్దం చేస్తూ భూమి దద్దరిల్లేలా పరిగెడుతూ వచ్చింది గ.ల(గజ లక్ష్మి)
“ఎందుకంత శబ్దం చేస్తావు భూకంపం వచ్చేల ఉంది. ఆపు నీ కాళింది మర్దన” అంటూ అరిచాడు సు.రా
“చాల్లేండి సరస.. ఇక్కడ కాళింది లేదు నేను కృష్ణుడినీ కాదు.. ఏదో పూజలో పడి మీ కేక గమనించుకోలేదు.. ఈ మాత్రం దానికే ఆంబోతులా అలా రంకెలెయ్యాలా చోద్యం కాకపోతే “అంది గ.ల
“మొదలెట్టా నీ వితండ వాదన.. నీతో వాదించే ఓపిక లేదు గాని కాస్త మంచి నీళ్ళివ్వు అసలే ఎండన పడొచ్చాను” అని విసుక్కున్నాడు సు.రా.
“ఇంద తీసుకోండి” అంటూ చెంబు గుమ్మం మీద పెట్టింది..
“మళ్ళా ఇదేమి రోగం? చేతికిచ్చే ఓపిక కూడా లేదా నీకు? “అనరిచాడు సు.రా
“ఊరికే అరిచి నా చెవుల్లో సీసం పొయ్యకండి..అసలే మడిలో ఉన్నాను తీసుకు తాగండి” అంటూ విస విసా పూజ గదిలోకి పోయింది గ.ల
విసుక్కుంటూ నీళ్ళు తాగి నెమ్మదిగా కూరగాయల సంచీతో వంటింట్లోకి అడుగు పెట్టాడు.. సంచీలోని మామిడికాయలన్నీ నేల మీద కుమ్మరించాడు..
“ఆవకాయ ఏదో పెట్టి అఘోరిస్తానన్నావుగా ఇవిగో మామిడికాయలు తెచ్చాను..ఇక అఘోరించు..క్రిందటి ఏడాది ఉప్పు తక్కువయ్యి కారం ఎక్కువయ్యి ఊరగాయ 3 నెళ్లకే పాడయ్యింది.. ఈ సారి కాస్త 6 నెలలన్నా నిలవుండేట్టు పెట్టు” అన్నాడు
“క్రిందటేడు కారు చవగ్గా ఉన్నాయని నీరు పట్టిన కాయలు తెచ్చారు. అసలు మూణ్ణెల్లు నిలువ ఉందంటే అది గొప్పే.. ఈసారన్నా మంచివి తెచ్చారా లేక అత్తెసరువి తెచ్చారా”అంటూ కాయలు పరీక్షించడం మొదలెట్టింది గ.ల
ఇది చచ్చు, ఇది పుచ్చు, అంటూ ఒక పాతిక కాయలు అవతల పడేసింది.. ఇక మిగిలినవి 10..
ఆ పదినీ కూడ “ఇందా కాచ్ ” అంటూ సు.రా మీదకి విసిరి పోయి ముక్కలు కొట్టించుకు రండి అంది..
మిర్రి మిర్రి చూస్తూ కాయలతో బయటకెళ్ళాడు సు.రా
ఒక అరగంట తర్వాత బుస్స్ బుస్స్స్ అన్న శబ్దం విన్న గ.ల ” బాబోయ్ పాము… బాబోయ్ పాము రక్షించండి రక్షించండి ” అని అరుస్తూ బయటకి పరిగెత్తబోయింది..
ఆ అరుపుకి ఉలిక్కిపడ్డ సు.రా ” పామా ఎక్కడ పద పద నేను జంపు అనుకుంటూ గుమ్మలోకి పరిగెట్టాడు”
ఇద్దరు గుమ్మంలోంచి తొంగి చూస్తున్నారు పాము ఎప్పుడు కదులుతుందా అని.. ఈలోప మళ్ళా చెవి దగ్గర బుస్స్ బుస్స్ మన్న శబ్దం వినిపించి ” బాబోయ్ పాము ఇక్కడే ఉంది” అంటూ అవతలికి ఒక్క గెంతు గెంతబోయింది. ఈ లోపల గజ గజ వణుకుతున్న భర్తని గమనించి చెళ్ళున వీలున గుద్దింది.
“అబ్బా ఏమిటే నా వీపు విరగ్గొడుతున్నావ్ అన్నాదు “సు.రా..
“ఇంతసేపు పాములా బుస గొట్టి భయపెట్టారు కదా..దానికి వీపు విమానం మోతే మీకు తగిన శాస్తి అంటూ మళ్ళా ధభీ ధభీ గుద్దులు గుద్దింది..
“నేనేం చేసానే ఎమిటీ నాకీ శిక్ష” అని ఏడుపు మొహం పెట్టాడు సు.రా
“ఆ ఊపిరి అలా పాము బుస కొట్టినట్టు తీస్తున్నారేంటి? ఇదేమి రోగం మీకు” అనరిచింది గ.ల.
“ఓహ్ అదా సంగతి ఉండు చెబుతాను అన్నాడు వీపు రుద్దుకుంటూ..”
“మామిడికాయలు కొట్టించుకు రమ్మన్నావు కదా. బజార్లో కెళ్ళి వచ్చీందుకు ఎండ దెబ్బకి నా ఒళ్ళు ఆవిరి కుడుమయ్యి ఊపిరి బుసలా బయటకొచ్చింది అంతే” అన్నడు సు.రా
“ఓరి మీ మీద బండ బడ ఎంత గగ్గోలెట్టించారండీ నన్ను ” అని బుగ్గ మీద ఓ పోటు పొడిచి మామిడికాయ ముక్కలతో వంటింట్లోకి వెళ్ళింది గ.ల
“ఇదిగో ఇలా చీటికీ మాటికీ నా మీద చెయ్యి చేసుకుంటే నీకు ఆవకాయ పెట్టడంలో సహాయం చెయ్యనంతే” అంటూ బుంగమూతి పెట్టాడు సు.రా..
“మీరు కాదు మీ జేజెమ్మయినా చెయ్యాల్సిందే. లేకుంటే మీకివాళ భోజనం లేదుగా కాబట్టి ఇలా వచ్చి కారం కలపండి ముక్కల్లో” అన్నది గ.ల
చచ్చినట్టు వంటింట్లోకి నడిచి కారం,ఉప్పు, ఆవ పిండి , నువ్వుల నూనె అన్నీ ముక్కల్లో పోసి చేత్తో కలియబెట్టాడు సు.రా..
ఆవకాయని కలిపి చేయి కడుక్కుని వచ్చాడు..ఆవ ఘాటూకి, కారం ఘాటు కి చేయి మండిపోసాగింది..అలానే భోజనానికి కూర్చున్నాడు.. అప్పుడే సరిగ్గా కరెంట్ పోయింది..
ఈ లోపల సుబ్బలక్ష్మి కంచంలో వేడి వేడి అన్నంతో వచ్చింది..దానిలోకి కొత్తగా కలిపిన ఆవకాయ, నెయ్యి వేసిచ్చింది తినమని..
“ఇంకేమి వండలేదా” అన్నాడు సు.రా
“లేదు కొత్తావకాయ లేదా అని నోరూరుకుంటే అడుగుతారుగా అందుకనే ఇదే ఉంది అన్నది” సు.ల
మండుటెండలో తిరిగొచ్చిఆవకాయ కలిపి మండిపోతున్న చేత్తో వేడి వేడి అన్నం కలపలేక, కలిపినా ఆ రుచికరమైన ఆవకాయ అన్నాన్ని ఎండల వలన తినలేక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు సు.రా.. గొంతు పొలమారితే నీళ్ళు తెచ్చింది గ.ల .
“ఆ నీళ్ళు తాగి ఏమిటి వేణ్ణీళ్ళిచ్చావ్” అన్నడు సు.ర.
“పొద్దున్నా ఫ్రిజ్ లో బాటిల్స్ పెట్టడం మర్చిపోయా.. పైగా ఇప్పుడు కరెంట్ పొయింది కాబట్టి ఇవే గతి” అన్నది గ.ల
ఆ కారం తినలేక,చేతి మంటతో ఆవకాయతో చాలా కష్టపడుతూ భోజనం ముగించి గదిలోకి నడిచాడు పడుకుందామని. కరెంట్ కోతల వల్ల ఆ సుఖం కూడ లేక అష్టకష్టాలు పడ్డాడు..
ఇలా ఎండలకి అల్లలాడుతున్నా, ఆవకాయ మండుతున్నా తింటూ జీవించేస్తున్నారు మన తెలుగువాళ్లు.

1 thought on “వెటకారియా రొంబ కామెడియా 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *