May 2, 2024

”స్పేస్ షిప్ ” ( తరాలు – అంతరాలు )

రచన: శశి తన్నీరు

కాలింగ్ బెల్ మీద వేలు ఉంచబోతూ లోపలి నుండి గట్టిగా వినవచ్చే మాటలకు ఆగి భర్త వైపు చూసింది పవిత్ర. అప్పటికే భాస్కర్ చెవులు శ్రద్ధగా అటు వైపు ఉంచి వింటున్నాడు.
” కుదరదు నీ సమస్య నీకు ముఖ్యం అయితే, నా సమస్య నాకు ముఖ్యం. నీ పరిష్కారం నువ్వు చూసుకోవాలి. నన్ను అడిగితే ఎలా ? ” గొంతులో కోపం మాటను వణికిస్తుంది మనస్వికి.
”అది కాదు మనూ ” ఏదో నచ్చచెబుతూ ఉన్నాడు మౌనిక్.
”మన అమ్మాయి గొంతే కదా! ఇప్పుడేమి సమస్య వచ్చింది వీళ్ళకి ?” గొంతు తగ్గించి మెల్లిగా అన్నది పవిత్ర.
మాట్లాడొద్దు అని వేలు పెదాలపై ఉంచి తనతో రమ్మని చెప్పి పవిత్రను కింద ఉన్న గార్డెన్ లోకి తీసుకెళ్ళి కూర్చోమన్నాడు.
” అది కాదండి. ఏదో పెద్ద సమస్యలాగే ఉంది. లేకుంటే పెళ్లి అయి ఏడాది కాలేదు. అప్పుడే ఇంత పెద్ద గొడవ జరుగుతూ ఉంది” ఉదయించే ముందు ఎరుపు అద్దుకున్న మేఘాల్లా, భయాన్ని అద్దుకున్న కళ్ళు. కన్నతల్లి మనసుకు తన కూతురి కాపురంలో చిన్న సమస్య కూడా పెద్ద భూతంలాగే కనిపిస్తుంది.
”ఏమి కాదులే పవిత్ర. కొంచెం సేపు తరువాత సర్దుకుంటారు. కాపురం అన్నాక సమస్యలు మామూలే కదా ” దిగులుగా కూర్చున్న భార్య పక్కన కూర్చొని భుజం మీద చేయి వేసాడు.
చుట్టిన భర్త చేయి ఇచ్చే ఏదో భరోసాతో స్థిమిత పడింది, కాని దిగులుగానే ఆలోచనలో మునిగిపోయింది పవిత్ర.

**************

”పవిత్రా ” ఏదో చెప్పబోయి మౌనంగా కూర్చున్న భర్తను చూసి చెప్పమన్నట్లు పక్కన కూర్చుంది. తమ పెళ్లి అయి ఆరునెలలే అయినా ఆమె తనలో ఒక ముఖ్యభాగంగా మారిపోయింది. వచ్చే సంపాదనలో పొదుపుగా ఖర్చుపెడుతూ గౌరవంగా సంసారాన్ని నడుపుతూ వస్తుంది.
భర్త మొహాన్ని కప్పేసిన దిగులు చూస్తే సమస్య పెద్దదే అని గ్రహించింది పవిత్ర.
భాస్కర్ చేతిని తన చేతిలో ఉంచుకొని కొంత సేపు మౌనంగా ఉండిపోయింది.
స్పర్శకు ప్రవహించే గుణం ఉంది. కొంత సేపటికి తేరుకున్న భాస్కర్ ” నా ఉద్యోగం పోయింది ” మెల్లిగా చెప్పాడు, తప్పు చేసినవాడిలాగా తన మొహం చూడలేక తల వాల్చేస్తున్న భర్తను ఓదార్చింది.
”ఏమి కాదులెండి. మన ఇంటి ముందు చిన్న షాప్ పెట్టుకుందాము. అన్నానికి కొదువ ఉండదు ” ధైర్యం చెప్పింది. భాస్కర్ మొహంలో చిన్న వెలుగు నల్లని మబ్బు అంచుపై మెరిసినట్లు మెరిసి మళ్ళా వాడిపోయింది.
”డబ్బులు ” నసిగాడు.
మెల్లిగా నవ్వి తన గాజులు గలగలలాడించింది.
”అవి అమ్మేసా !!” భర్తగా తన ఓటమిగా భావించి ”వద్దు ” స్థిరంగా అన్నాడు.
”ఏమి కాదులేండి. మన బుజ్జితల్లి లోకంలోకి వచ్చేసరికి కొత్తవి కొందాము ” మెల్లిగా భాస్కర్ చేయి తన పొట్ట మీద ఉంచుకొని నవ్వుతూ చెప్పింది.
తన రూపం అక్కడ ఊపిరి పోసుకోవడం, తలుచుకుంటే ఎంత తృప్తిగా ఉంది.
”ఏమి ఆడపిల్ల కావాలా ? మగపిల్లవాడు వద్దా ” నవ్వుతూ అడిగాడు.
”ఏమో మరి, నాకు ఆడపిల్ల కావాలి అని ఉంది. ఎవరైనా ఒకరు చాలు. ఆడ, మగ తేడా లేకుండా మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలి ” ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు చెప్పింది ఆనందంగా పవిత్ర. కాబోయే తల్లి మొహం విచ్చుకుంటున్న అరటిపువ్వు అంత అందంగా కనిపించి,అపురూపంగా దగ్గరకు తీసుకొని చుట్టేసాడు చేతులతో. ఎంత హాయిగా ఉంది తన కోసం ఒకరు ఉండటం.
భార్యా భర్తల బంధం లోని బలం ఇదేనేమో !!!
************
కాన్పుకు వచ్చిన కూతురు చేతులకు బంగారు గాజులు లేకపోవడం చూసింది పవిత్ర తల్లి.
”గాజులు ఏవి తల్లి ?” అడిగింది.
” హడావిడిలో ఇంట్లో మర్చిపోయి వచ్చాను లేమ్మా,ఆయన బారసాలకు వచ్చేటపుడు తెస్తారులే ” కూతురు మాటలు నమ్మనట్లు చూస్తున్న తల్లిని
”నాకు ఆకలిగా ఉంది. అన్నం పెడుదువు పదా ” లాక్కెళ్ళి కబుర్లు చెపుతూ నవ్వించింది పవిత్ర.

**********

గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలు బారసాలకు వచ్చినవారికి కమ్మగా ఆహ్వానం పలుకుతున్నాయి. బాలింత, పసిబిడ్డ ఉండే ఇంటి కళే వేరు,సాంబ్రాణి దూపం ఇల్లంతా పరుచుకుంటూ చిన్న పాపతో ఇంట్లో అంతా సందడిగా ఉంది. పసిబిడ్డ, పాడిఆవు ఉండే ఇంట్లో పనికి ఏమి తక్కువ !!
ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి సాంబ్రాణి దూపం వేస్తూ కుర్చీ లో కూర్చొని కూతురును చూసి మురిసిపోతున్న అల్లుడివైపు చూసి
”గాజులు తెచ్చారా అల్లుడు గారు? అమ్మాయిని బారసాల పీటల మీదకు సిద్దం చేయాలి. పురోహితుల వారు వస్తూ ఉంటారు ” అడిగింది.
భాస్కర్ కు అర్ధంకాక ” ఏమిటి అత్తయ్య ?” అని అడిగే లోపు పవిత్ర వాళ్ళ అమ్మను లోపలకు లాక్కెళ్ళింది.
”అమ్మా దయచేసి గాజుల ప్రస్తావన తీసుకురావొద్దు ” గట్టిగా అంది.
”ఏమిటే, కొంపతీసి అప్పులకోసం లాక్కెళ్ళి అమ్మేసాడా ? నేను అప్పుడే అనుకున్నాను. ఆ చిన్న ఇంట్లో నా బిడ్డ ఎలా బ్రతుకుతుందో అని ” కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ గొంతు పెంచుతున్న తల్లిని చూసి,
” అమ్మా!! ఏమీ కాలేదు. నువ్వు రచ్చ చేయొద్దు. వ్యాపారం మీద పెట్టుబడిగా నేనే ఇచ్చాను. లాభాలు వచ్చినపుడు మళ్ళీ చేయిస్తారు. ” మెల్లిగా చెప్పింది పవిత్ర.
”ఎంత అమాయకురాలివే తల్లి. ఏ మొగుడు అయినా తీసుకెళ్ళడమే కాని తెచ్చినవాడు ఉన్నాడా ! అందులోనూ ఆడపిల్ల పుట్టింది. నేను ఆ రోజు నా పుట్టింటి బంగారం ఉంచబట్టి నీ పెళ్ళికి అక్కరకు వచ్చింది. లేకుంటే మీ మేనత్తల బాధ్యతలలో మీ నాన్న వాటిని ఎప్పుడో హరీ అనిపించి ఉండేవాడు. ఈ మాత్రం తెలుసుకోలేని దానివి రేపు ఆడ పిల్ల పెళ్లి ఎలా చేస్తావు ?”
తల్లి కడుపు శోకం చిన్నగా ఊరుతూ బుగ్గలపై జారిపోతూ ఉంది.
బయట నిలబడి వింటున్న భాస్కర్ కి అవమానంతో తల వాలిపోతూ ఉంది. ఇక వినలేక వెళ్లి పోబోయాడు.
ఇంతలో మెల్లగా పవిత్ర గొంతు వినపడింది.
” అమ్మా అలా మాట్లాడొద్దు. ఆయన కష్టంలో ఉన్నప్పుడు నేను సహాయం చెయ్యక పోతే ఎవరు చేస్తారు ? అసలు ఆయన వద్దని అన్నారు. నేనే ఇచ్చాను. ఆయన ఎప్పుడూ నువ్వు నాకు భార్యవి నేను చెప్పినట్లు వినాలి అనేవారు కాదు. ఇద్దరమూ సమానమే, కష్టసుఖాలు పంచుకొనే స్నేహితులం అనేవారు. కష్టంలో ఆయనకు సహాయం చేసే స్నేహమే కదమ్మా ”సంసారం ‘ అంటే ”
అల్లుడు స్వభావం గుర్తుకు వచ్చింది కాబోలు, కొంత స్థిమిత పడింది పవిత్ర తల్లి.
” ఏమో తల్లి మా రోజులు వేరే,మీ రోజులు వేరే. భార్యా భర్తలు స్నేహంగా ఉంటె మంచి విషయమే. ఏదైనా అవసరం అయితే నన్ను అడుగమ్మా ”
తల్లి ఆవేదనకు ప్రతిగా నవ్వు వచ్చింది పవిత్రకు.
” మా మంచి అమ్మ. అయినా నా ఫ్రెండ్ ఉన్నంత కాలం మీ అవసరం రాదులే ”
పక పక నవ్వుతున్న భార్య గొంతు విని ”నువ్వు అలాగే నవ్వుతుండాలి పవిత్ర. చూస్తూ ఉండు నీ గాజులు నీకు
తెచ్చిస్తాను ” మనసులో స్థిరంగా అనుకోని బయటకు వెళ్ళాడు భాస్కర్.

***************

కాలం పరిగెడుతుంటే, అందరు మనస్విని చదువుల తల్లి అని పొగుడుతుంటే పొంగిపోయారు భాస్కర్, పవిత్ర.
చదువు పూర్తి అయిన రోజున అడిగారు మనస్విని ”తల్లి ఇక నీ పెళ్లి చేద్దాము అనుకుంటున్నాము ”
”లేదు డాడి,నాకు జాబ్ వచ్చింది. వాళ్ళే క్వార్టర్స్ ఇస్తారు. నేను కొంత స్థిరపడి,అమ్మకు గాజులు తెచ్చిన రోజే నా పెళ్లి ” నవ్వుతూ అమ్మ బోసిగా ఉన్న చేతులు చూపించింది.
భాస్కర్ కు సిగ్గుగా అనిపించింది. నిజమే కొనాలి అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఫీజు, ఏదో ఒక అవసరం.
పవిత్ర కళ్ళతోనే వారించింది.
”అలాగేమ్మా నీ ఇష్టం. నీవెప్పుడు పెళ్లి కావాలంటే అప్పుడే చేస్తాము ”
తరువాత జాబులే మనస్వి జవాబులు.
”అమ్మా అపార్ట్ మెంట్ చవకగా వచ్చింది, కొంటున్నాను. నీ గాజులు వచ్చే నెలలో కొంటాను ” ప్రతి నెలా ఇలాంటివే ఉత్తరాలు.
”పోనీలే తల్లి. నువ్వేమి దిగులు పెట్టుకోకు. అవేమి అర్జెంట్ కాదు మాకు ఇంకేమి బాధ్యతలు లేవు. నీ పెళ్లి అయితే చాలు ” అని వ్రాసేది.

*************

కారులో నుండి పూలమాలలతో దిగుతున్న మనస్విని, కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసారు భాస్కర్, పవిత్ర.
మనస్వి బుగ్గలపై జారుతున్న చిరునవ్వు చెపుతూనే ఉన్నా విషయం తెలియాలి అనే ఆత్రుత ఇద్దరిలో.
” డాడీ, మమ్మీ ….ఈయన మౌనిక్ మా ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. నన్ను చేసుకోవడం వీళ్ళ పేరంట్స్ కి ఇష్టం లేదు అందుకని ఇలా హడావిడిగా చేసుకోవాల్సి వచ్చింది ” చెప్పేసి ఆశీర్వాదం తీసుకొని ఒక్క రోజు ఉండి వెళ్ళిపోయారు.
మళ్లీ ఇదిగో ఇప్పుడు ఇలా గొడవపడుతూ……
”పద పైకి వెళదాము ” భర్త పిలుపుతో పైకి వెళ్ళింది.

లోపల ఏమి చూడాలో అనే భయంతో బెల్ కొట్టింది.
మనస్వి నవ్వుతూ తలుపు తీసింది.
అల్లుడు గారు హాయిగా టి. వి చూస్తూ ఉన్నాడు.
“హమ్మయ్య గొడవలు లేవు” మనసులోనే నిట్టూర్చారు భాస్కర్, పవిత్ర.
రాత్రి కూతురు ఒక్కతే ఉన్నప్పుడు మెల్లిగా వెళ్లి పక్కన కూర్చుంది.
”వాట్ మమ్మీ ఏమైనా చెప్పాలా ! అమ్మ వీపుపై నుండి చేతులు వేసి చిన్నపిల్లలాగా ఊగింది మనస్వి.
” అదీ… అదీ ” నసుగుతున్న అమ్మతో ”
“చెప్పు” అంది నవ్వుతూ.
” మీరు ఇద్దరు ఏమైనా గొడవలు పడ్డారా ?” ఆత్రుతగా అడిగింది తల్లి మనసు.
” గొడవలు పడినా సర్దుకుని పోవాలమ్మా. ఒకరికొకరు సర్దుకొని స్నేహంగా ఉంటేనే సంసారం ” తల్లి బాధ్యతగా కూతురుకు మెల్లిగా నచ్చచెప్పింది.
” ఓహ్ మమ్మీ, అంత గొడవలు లేవులే. నీకు గాజులు కొనాలి అని డబ్బులు ఉంచిపెట్టాను. ఫ్లాట్ కి అవసరం అని ఇవ్వమన్నాడు మౌని ” కూల్ గా చెపుతున్న కూతురును చూసి
” పోనీలెమ్మా, వాటికి ఏమి తొందర ? అల్లుడుగారికి డబ్బులు ఇచ్చెయ్యి. భర్తకు అవసరం అయితే ఇవ్వకపోతే ఇద్దరి మధ్య స్నేహానికి అర్ధం లేదు ” చెప్పింది పవిత్ర.
” అయ్యో పిచ్చి మమ్మీ!! ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు ఒకరి స్పేస్ ను ఒకరు గౌరవించుకొనే స్పేస్ షిప్ కూడా ఉండాలి. నా బాధ్యతలు అతను గౌరవించకపోతే,నా ఇష్టాలు అతను గౌరవించకపోతే అతనివి నేనెలా గౌరవిస్తాను ? ఒకరి స్పేస్ ను ఒకరు గౌరవించుకొంటేనే ‘సంసారం ‘, ఆయన సమస్య వచ్చే నెలకి వాయిదా వేసుకున్నాడులే. ముందు నీకు రేపు గాజులు కొనాలి ” అమ్మ చేతులు దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది,
” చూడు ఈ చేతులు రేపు బంగారు గాజులతో ఎలా మెరిసిపోతాయో !!” నవ్వింది మనస్వి.
బంగారం కంటే ఎక్కువగా మెరుస్తున్న మనస్వి కళ్ళను చూస్తూ ”సంసారం నిర్వచనం తరానికి తరానికి ఎంతగా మారిపోతుంది. మార్పే అంతిమ సత్యం. ఏది తప్పు కాదు, ఏదీ ఒప్పు కాదు….. ఒకరి మాట మీద ఇంకొకరికి గౌరవం ఉంటే. కూతురు పుడితే ఏమి,కొడుకు పుడితే ఏమి….. బాధ్యతలు గౌరవిస్తున్నప్పుడు. అమ్మ తన నిర్వచనాన్ని గౌరవించినట్లు, వీళ్ళ నిర్వచనాన్ని తను కూడా గౌరవించాల్సిందే !!” మనసులో అనుకొని…..
”బాగుందమ్మా మీ స్పేస్ షిప్ కాపురం ” అని నవ్వేసింది పవిత్ర.

***************

 

విశ్లేషణ: జ్యోతి వలబోజు

సంసారం సజావుగా సాగడానికి భార్యాభర్తల మధ్య ప్రేమతో పాటు అన్యోన్యత, ఒకరి మాట కాని అవసరం కాని ఇంకొకరు అర్ధం చేసుకునేలా ఉండాలి. ఈ భావన తరతరానికి మారుతుందేమో అనిపిస్తుంది ఈ కథ చదివితే. కొత్త వ్యాపారం కోసం తన గాజులను అమ్మమని భర్తకు ఇస్తుంది పవిత్ర. తర్వాత చేయించుకోవచ్చు అని అతనికి ధైర్యాన్నిస్తుంది. కాని వాళ్ల కూతురు మాత్రం తన తల్లి గాజులకు తీసిపెట్టిన సొమ్మును కొత్త ఫ్లాట్ కోసం సర్దమన్న భర్తకు ససేమిరా అంటుంది. అలాగని తను స్వార్ధపరురాలు కాదు. భార్యాభర్తలు అన్నప్పుడు ఒకరికొకరుగా ఉన్నట్టుగానే ఒకరి స్పేస్ ని ఇంకొకరు గౌరవించాలి. అప్పుడే వారిద్దరి మధ్య సఖ్యత ఎప్పటికీ నిలిచి ఉంటుంది.. శశి తన్నీరు రాసిన ఈ స్పేస్ షిప్ కథ చదివి, ఆలోచిస్తే మనస్వి మాటలు నిజమే అనిపిస్తుంది

 

4 thoughts on “”స్పేస్ షిప్ ” ( తరాలు – అంతరాలు )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *