May 2, 2024

సంతృప్తి

రచన: కామేశ్వరీదేవి చెల్లూరి

ప్రొద్దున్న పది గంటలు దాటింది. మంచి వంటపనిలో ఉన్నా, నా ఆలోచనలన్నీ లత మీదే ఉన్నాయి. మా ఇద్దరిదీ ఇంచుమించు అర్థ శతాబ్దపు స్నేహం. ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం.

స్కూలుకి నడుస్తూ వెళ్ళాలంటే మా ఇద్దరికీ అరగంట పైన పట్టేది. చేతినిండా పుస్తకాలు పట్టుకుని, కబుర్లు చెప్పుకుంటూ, త్రోవలో చింత చెట్ల క్రింద చింతకాయలు ఏరుకుని తింటూ, నవ్వులతో, త్రుళ్ళింతలతో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మా లోకంలో మేము వుంటూ, స్కూల్ కి వెళ్లేవాళ్లం. ఎలాంటి బాధ్యతలు లేకుండా ఎంత హాయిగా ఉండేవి,ఆ రోజులు ! ఇప్పుడు నాకు బాధ్యతలు ఏమీ లేవు కానీ దానికి ఇంకా అత్తగారి బాధ్యత, మనవల్ని చూసుకోవడం అనేవి ఉన్నాయి. ఫోన్ చేసి నాలుగు రోజులు అయింది. ఎలా ఉందో, ఏమిటో ఒకసారి కాల్ చెయ్యాలి!

“ఏమిటోయ్ వంట అవుతోందా, లేదా?” అన్న ఆయన పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. ఇంతలో ఫోన్ మ్రోగింది.

“హలో, దేవీ పనిలో ఉన్నావా?” అంది అట్నుంచి లత.

“హమ్మయ్య, నువ్వేనా? ఏమైపోయావే నాలుగురోజులుగా? ఇప్పుడే అనుకుంటున్నా వంటవగానే నీకు కాల్ చేయాలని… చెప్పు…ఏమిటీ విశేషాలు?” అన్నా మొబైల్ చెవి దగ్గిర పెట్టుకుని కూర కలుపుతూ.

“ఏం చెప్పమంటావే?” దీర్ఘంగా నిట్టూర్చింది, లతా. “నిన్న మా అత్తగారు మిస్సింగ్ తెలుసా?” ఉలిక్కి పడ్డా నేను.

“ఏమిటే? మళ్ళీ చెప్పు!” అన్నా సరిగ్గా విన్నానా లేదా అని .

“అదేనే, నిన్న మా అత్తగారు ఇంట్లోంచి బైటికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా!”

“అదేమిటే! మీరంతా ఉండగానే!!”

“నేను ఇంట్లో లేనే… ఆదివారం కదా అని నిన్న నేను మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను. నిన్న సాయంత్రం మా కోడలు గదిలో మనవడ్ని చదివిస్తోందిట. మా అబ్బాయీ బయటికి వెళ్ళాడు. ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోయారో, వెనక తలుపు తీసుకుని బైటికి వెళ్ళిపోయారు.”

“అయ్యో, అసలే మతిస్థిరం కూడా లేదు, దొరికారా లేదా?” అన్నాను కంగారుగా.

“ఆ,ఆ! కంగారు పడకు, కనబడ్డారులే. ఎప్పుడూ ఆవిడ అలా చేయలేదు. ఇంట్లో ఒక్క నిముషం కూర్చోకుండా తిరుగుతూనే ఉంటారు. నిన్న ఏమైందో బైటికి వెళ్ళిపోయారు. మా కోడలు కాసేపటికి చూసుకుని కంగారుపడి నాకూ, మా అబ్బాయికి ఫోన్ చేసింది. వీధి చివరి దాకా వెళ్లి చూసినా ఆవిడ కనబడలేదుట. నేను వచ్చేసరికే మా అబ్బాయి వెతకడానికి వెళ్ళాడు. నాకూ, మా కోడలికీ ఒకటే టెన్షన్. ఆవిడ మెయిన్ రోడ్ లోకి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఆవిడకి ఏమైనా ఐతే? అసలు ఆవిడ కనబడక పోతే? అమ్మో! నా బుర్ర వేడెక్కి పోయింది అనుకో. మా మరుదులకి, ఆడబడుచులకి ఏం చెప్పుకోవాలి? అది కాకపోయినా మనకి ఎంత గిల్టీగా ఉంటుందీ!”

“ఇంతకీ ఎలా కనిపించారు?” అడిగా దాని మాటలకి బ్రేక్ వేస్తూ.

“లక్కీగా కాలనీలోనే తిరుగుతున్నారుట. ఇక్కడ అన్నీ అపార్ట్ మెంట్లే కదా! మా అబ్బాయి వాచ్ మన్లకి గుర్తులు చెప్పి, అడుగుతూ వెళ్ళాడుట. ఒక వాచ్ మాన్ ఆవిడని చూసి, కూర్చోబెట్టి, మా అబ్బాయి అటు రాగానే అప్పజెప్పాడు. పాపం మంచివాడు కనుక మా అబ్బాయి వచ్చేదాకా చూసుకున్నాడు. ఆవిడ కనిపించారు కానీ లేకపోతే అమ్మో మేము సరిగ్గా చూసుకోలేదనేగా అనుకుంటారు?” లతకి దుఖంతో గొంతు రుద్ధమయింది.

నాకు లత మీద చాలా జాలి వేసింది. దాని ఆడబడుచులు, మరుదులూ లత మెత్తదనం చూసి, ఆవిడ్ని దీని మీద వదిలేసారు. ఇప్పుడేమైనా జరిగితే మాత్రం మాటలు అనడానికి వెనుకాడరు. భర్త లేకపోయినా, కొడుకు, కోడలూ ఉద్యోగస్థులు అయినా, మనవలతో పాటూ ఆవిడనీ చూసుకుంటోంది. ఆవిడ కూతుళ్ళు మాత్రం అదేమిటో, కొన్ని రోజులైనా ఆవిడని తమతో ఉంచుకోరు.

“పోనీలేవే! మీ అబ్బాయి క్షేమంగా ఇంటికి తీసుకు వచ్చాడు కదా, అయినా మీవాళ్ళు ఆవిడ్ని నీ మీద పెట్టేసి, బాగానే తప్పుకున్నారు. కొన్నాళ్ళైనా తమతో తీసికెళ్ళొచ్చు కదా! మరుదులైతే ఫారెన్ లో ఉన్నారు మీ ఆడబడుచులకి ఏమైందిటా?” అన్నా దానిమీద జాలితో.

“ఏమిటోనే వాళ్ళంతా బిజీ, నేనేమో గట్టిగా చెప్పలేను. ఈవిడేమో ఒక్క నిముషం కుదురుగా ఉండరు. తినేవేమైనా ఒక్కసారి బల్ల మీద పెట్టి మర్చిపోతే చాలు, తిన్నంత తిని, మిగిలినవి పిసికి పడేస్తారు. చంటిపిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. నాకూ ఓపిక వుండడం లేదు. రెస్ట్ లేక నడుం నొప్పి వస్తోంది. ఇవన్నీ వదిలేసి ఏదైనా ఆశ్రమంలో చేరిపోదామా అని అనిపిస్తోంది” అంది లత విరక్తిగా.

“అసలు నీ మెత్తదనం చూసి మీ వాళ్ళు అందరూ నీ మీద వదిలేసారే. వాళ్లకి ఫోన్ చేసి కొన్నాళ్ళు ఉంచుకోమని గట్టిగా చెప్పలేవా? అయినా మీ ఆయన లేనప్పుడు ఈ బరువెందుకు నీకు ? కన్న తల్లినే చూసుకోలేరా? వాళ్ళ దగ్గిరకి పంపించెయ్. లేకపోతే ఆవిడనే ఆశ్రమంలో పెట్టు… అంతే… అదే దీనికి పరిష్కారం!” అన్నాను కోపంగా.

ఫోన్ పెట్టేసినా లత గురించే నా ఆలోచనలు. ఎన్నాళ్ళు దానికి ఈ బాధ్యతలు ? దానికంటూ ఒక టైం లేకుండా, జీవితాంతం ఎవరికో ఒకరికి చేయవలసినదేనా ? పాపం, దానికి హార్ట్ ఆపరేషనై ఆరు నెలలు అయింది. సరైన విశ్రాంతి లేదు.

అసలు లత చిన్నప్పుడు ఎంత అందంగా వుండేదో! ‘నీ కళ్ళు షర్మిలా టాగూరులా వుంటాయే…’ అని నేనంటే, ‘నా కళ్ళు జమునలా ఉంటాయి’ అనేది అది. ఏమిటో ఎప్పుడూ సినిమా కబుర్లే . దాని టిఫిన్ బాక్స్ లోది నేను , నా బాక్స్ లోది అదీ తీసుకుని తినేవాళ్ళం. కులబేధాలు మాకు ఎప్పుడూ అడ్డు రాలేదు. స్కూల్ చదువు అవగానే నాకు పెళ్లి అయిపోయింది. నా పెళ్ళైన తరవాత ఏడాదికే దాని పెళ్లి కూడా అయింది.

పెళ్ళిళ్ళు అయినా ఇద్దరం హైదరాబాద్ కే రావడం తో ఆ స్నేహం అలా సాగిపోతూ ఉంది. ఎటొచ్చీ దూరాలు ఎక్కువై ఫోన్లలో మాట్లాడుకోవడం ఎక్కువ అయింది. నాకు అన్ని బాధ్యతలు తీరిపోయాయి. పిల్లలు కూడా దూరంగా ఉన్నారు. ఇక్కడ ఆయన, నేను అంతే. అత్తమామలు లేరు. హాయిగా ఉన్నాను. దానికే పాపం బాధ్యతలు తీరడం లేదు. అత్తగారికి ఎనభై ఏళ్ళు. మతి స్థిరం లేని ఆవిడకి స్నానం చేయించడం దగ్గిర్నించీ అన్నీ తనే చూసుకుంటుంది. ఊళ్ళో ఉన్న కూతురు దగ్గిరే అయినా రెండు రోజులు ఉండడానికి దానికి కుదరడం లేదు పాపం. అలా ఆలోచిస్తూనే పనులు పూర్తి చేసుకుని, కాసేపు నడుం వాల్చాను.

***

ఇల్లంతా సందడిగా ఉంది. మా మరుదులూ, ఆడబడుచులు పిల్లలతో ఊళ్ళ నించి వచ్చారు. వేసవికాలం సెలవులు కదా. అందరం కలిసి బైటికి వెళ్దామని రెడీ అవుతున్నాము. నేను చీర తీసి కట్టుకోబోయాను. ఎంతకీ కట్టుకోవడమే రావడం లేదు. కట్టంచు పైకి, పవిటంచు కిందకి కడుతున్నాను. కుచ్చిళ్ళు పెట్టుకోవడమే రావడం లేదు. ఏమైంది నాకు? అంతా అయోమయంగా తోచింది.
“ఏమిటి? వదిన ఇలా మతి లేనిదానిలా తయారయింది? చీర కట్టుకోవడమే రావడంలేదు?” అని మా ఆడబడుచు ఆశ్చర్యపోతోంది . నేను ఇంకో చీరతీసి దానిమీదే కట్టుకోవడం మొదలు పెట్టాను.

“అదేమిటి, అలా చీరమీద చీర కడుతోంది?” అని ఆశ్చర్య పోతోంది నా తోటికోడలు. “ఈ దేవికి మతి పోయిందే!” అంటూ అందరూ నవ్వుతున్నారు. నాకు భయంతో ముచ్చెమటలు పట్టేసాయి.

ఏమిటిది, ఏం జరుగుతోందసలు? నాకు నిజంగానే మతి పోయిందా? నాకు చీర కట్టుకోవడమే రాదా? నేను అన్నీ మర్చిపోయానా? ఇలా అయిపోయానేమిటి? వళ్ళంతా చెమటలు పట్టి, భయంతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచాను.

చుట్టూ చుస్తే నేను మంచం మీదే ఉన్నాను. మిట్ట మద్యాహ్నం, మంచి ఎండలు! ఎప్పుడో నిద్ర పట్టేసింది. కరెంటు కోతతో ఫ్యాన్ ఆఫ్ అయినట్టుంది. అందుకే నాకు చెమటలు పట్టి మెలకువ వచ్చింది. కరెంట్ లేక tv లు వదిలి అపార్ట్ మెంట్ లో పెద్దలూ పిల్లలూ బైటికి వచ్చినట్టున్నారు. గోలగోలగా ఉంది బయట . అదే నాకు మా ఇంట్లో సందడిలా కల వచ్చింది. కాని ఎంత భయంకరమైన కల !

అమ్మో! అందరి ఎదురుగా బట్టలు మార్చుకుంటూ, మార్చుకోలేక సతమతమౌతూ, మతిలేనిదానిలా ఎలా ఉన్నానో! అసలు ఎందుకు అలాంటి కల వచ్చింది నాకు ? ఆలోచిస్తే లత అత్తగారు గుర్తొచ్చారు. ఆవిడ అలాగేగా ఉంటారు. ఏమో నిజంగా నాకూ ఎనభై ఏళ్ళు దాటాకా ఎలా ఉంటానో, నాకేమి సమస్యలు వస్తాయో ఎవరికి తెలుసు? అప్పుడు నన్నెవరూ పట్టించుకోక పోతే? అందరూ బరువు, బాధ్యత ఎందుకని నన్ను వదిలేస్తే? వృద్ధాశ్రమంలో చేర్చేసి, చేతులు దులిపేసుకుంటే? నేనేమైపోతాను? లత అత్తగారి గురించి నేను ఏమన్నాను? ‘ఆవిడ్ని ఎందుకు చూసుకుంటున్నావు, ఎక్కడికైనా పంపించేయచ్చుగా?’ అని కదా.
పాపం లత, ఒంట్లో ఓపిక లేకపోయినా, మనవల బాధ్యతలు ఉన్నా, ఆవిడని అందరూ వదిలేసినా అత్తగారనే అభిమానంతో ఆవిడని దగ్గిర పెట్టుకుని చూసుకుంటోంది. దానికి సపోర్ట్ చేయాల్సింది పోయి, ఇంకా విసుగు వచ్చేట్లు మాట్లాడాను. నిజంగానే అది విసిగిపోతే ఆవిడ పరిస్థితి ఏమిటి ?ఎవరూ చూసుకోక, ఆవిడ ఏమైపోతారు?

పిల్లల్ని పెంచి, పెద్దవాళ్ళని చేసి, విద్యా బుద్దులని నేర్పించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసి, పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకో జీవితాన్ని ప్రసాదించిన తల్లి తండ్రులని మన ఆదరణతో, ప్రేమతో తిరిగి మనమే వాళ్ళని చిన్నపిల్లల్లా చూసుకోవాలి. అంతేకాని వాళ్ళు మనకి బరువు అనుకుంటే ఎలా? వాళ్ళు మనల్ని ఎప్పుడూ అలా అనుకోలేదు కదా! ఎంత పేదరికంలో ఉన్నా, వాళ్ళకి ఆరోగ్యం బాగా లేకపోయినా, వాళ్ళు తిన్నా, తినకపోయినా పిల్లల్ని ప్రాణంలా చూసుకుంటారే. అటువంటి తల్లి తండ్రులని ఎలా చూసుకోవాలి?ఈ రోజుల్లో ఎంతోమంది, పెద్దవాళ్లకి ఓపిక ఉన్నంత కాలం వాళ్ళ చేత చేయించుకుని, వాళ్లకి ఓపికలు పోయాకా వృద్ధాశ్రమంలో చేర్పించేయటం, లేదా నడి వీధుల్లో అనాథలుగా విడిచి పెట్టేయడం వింటూనే ఉన్నాము.

చదువుకున్న నేను కూడా అదే సలహా యిచ్చానే, ఎంత తప్పు చేశాను? ఏమైపోయింది నా సంస్కారం? నాలో అంతరంగం నాకు బుద్ధి చెప్పింది.

భర్త లేకపోయినా, కన్నపిల్లలు వదిలేసినా, అత్తగార్ని తన దగ్గిరే ఉంచుకుని చూసుకుంటున్న లతకి సపోర్ట్ గా ఉండి, సహాయం చేయాలి అనుకుంటూ లేచాను. నా మనసులో ఇప్పుడు ఎనలేని సంతృప్తి…
***
(సమాప్తం)

5 thoughts on “సంతృప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *