నాన్నకోసం ఒక రోజు…

రచన: ప్రశాంతి ఉప్పలపాటి

 Prasanthi Family
సంవత్సరంలోని ఒక రోజుకి ప్రత్యేకంగా అమ్మకి, నాన్నకి, కూతుళ్ళకి, స్నేహానికి, ప్రేమకి ఇలా ప్రత్యేకంగా జరుపుకోవడం మొదట్లో వింతగా అనిపించినా, మిగతా అన్ని అంశాల మాదిరి గానే వీటికి కూడా అలవాటు పడిపోయాము.
అత్యంత వేగంగా మారుతున్న సమాజంలో, భారతీయత కొద్దో, గొప్పో మిగిలి ఉందంటే, కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల ప్రేమ పూర్వక పెంపకం కారణమన్నది కాదనలేని నిజం. అమ్మ గురించి, అమ్మ ప్రేమ, త్యాగం గురించి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కానీ నాన్న గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటాము. గుర్తింపు లేకుండా, గుర్తింపుకి నోచుకోకుండా బ్రతుకుతూ కూడా ఆనందంగా ఉండడమనేది ఓ కళ అని ఎవరో మహానుభవుడు శెలవిచ్చారు. అదే నిజమైతే “నాన్నలందరూ” అలాంటి కళాకారులే అనిపిస్తుంది. అందు గురించైనా మన జీవితాల్లో తండ్రికి ఉన్నా ప్రధాన్యత, ప్రభావం గురించి అవలోకించడం అవసరం అనిపిస్తుంది. అలాంటి నాన్నల గురించి మాట్లాడుకోవడానికి ఈ ఫాదర్స్ డే ఓ మంచి సందర్భము.
ధనవంతులమని అనుకోవడానికి ఆస్థిపాస్థులు కాదు కావాల్సింది ఆప్యాయతలు. చిన్నపటి నుంచి నాకు కానీ, తమ్ముడికి కానీ ఫలానా కావాలి అంటే కాదు అనడం అన్నది లేదు. ప్రతిదీ అడిగే లోపే ఐపోతుంది. ఇంతకు మించి కావాల్సీంది ఏముంటుంది?
నాన్న ఏమి నేర్పారు అనుకుంటే విలువలు అన్నవి మొట్టమొదటిగా గుర్తొస్తాయి. మా నాన్నది రెప్రెజెంటేటివ్ ఉద్యోగం కావడం వల్ల ఊర్లు తిరగాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఇంటికి వచ్చినా బుడ్డీలు తేవడం, మేడ మీదకి తీసుకెళ్ళి అన్నం పెడుతూ తన చిన్నప్పటి విశేషాలు చెప్పడం, సినిమా కి, బాబు కూల్ డ్రింక్స్ కి (నెల్లూరు వాసులకు సుపరిచితమైన, ప్రియమైన పేరు) తీసుకెళ్ళడం మరిచిపొలేని జ్ఞాపకాలు.
మన స్వశక్తి మీద తప్ప, ఉచితమైన విషయాలకై ఆశపడకూడదు అన్నది మొదటి పాఠం. చాలా చిన్నప్పుడొక సారి ఇంట్లో రవ్వలడ్డూలు చేసారు. మొదట ఇచ్చినవి కాకుండా, ఇంకా కావాలని అడిగితే, ఎదో చిన్న పని చేస్తె ఇస్తామని చెప్పారు. నేను పని చేసాను. తమ్ముడు చిన్నవాడు కావడం మూలాన చేయలేదు. వాడికి చేయకపోయినా ఇచ్చారని నేను అడిగితే, వాడు చిన్నవాడు చేసుకోలేడు, కానీ నువ్వు చేయగలవు. ఒక పని చేసినందుకు ప్రతిఫలంగా లభించేది ఎంతో విలువైనది. ఎప్పుడు ఏదీ ఊరికే దక్కాలి అనుకోకూడదు అని చెప్పిన విషయం నా మనసులో బాగా నాటుకుపోయింది. ఎవరికి ఎలా అందినా, నేను మాత్రం నా కష్టం మీద మాత్రమే ఆధారపడాలి అనే భావం ధృఢంగా నాటుకుపోయింది.
ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడేది, పిల్లలు ఒకరితో ఒకరు పోల్చుకుని పంతం పట్టడం. ఆ విషయంలో కూడా నాన్న ఎంతో ఓర్పుగా అర్థమయ్యేలాగా చెప్పారు. పండగలప్పుడో, పుట్టినరోజప్పుడో వాడికి ఎన్ని కొన్నావు, నాకెన్ని కొన్నావు అన్న పోలిక తెస్తే చాలా ఓర్పుగా, నీకేమి కావాలో అడుగు, అంతే కానీ వాడికి ఏమి ఇస్తే నీకెందుకు. అలా ఆలోచించకూడదు అని. అప్పటి నుంచే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం అన్నది పోయింది. ఇక అసూయ అనే మాటే మనసులో అడుగుపెట్టలేదు. నాకు కావాల్సిన వాటి గురించే తప్ప, ఎదుటి వాళ్ళకి ఏమి ఉంది అని కానీ, ఇతరులతో పోల్చుకోవడం కానీ అస్సలు లేదు.
ఇతరులని విమర్శించడం గురించి కూడా ఎంతో మంచి సూచన ఇచ్చారు. ఎదుటి వాళ్ళలో ఏమి మంచి ఉందో దాన్ని మాత్రమే స్వీకరించాలి. చేడుని నేర్చుకోకూడదు. వ్యాఖ్యానించకూడదు. ఒకరిని విమర్శించేంత అర్హత, లేదా ఉన్నతమైన నడవడిక మనలో ఎంత ఉంది, మనలో ఎన్ని లోపాలున్నాయి అని ఆలోచించమని చెప్తారు. నూరు శాతం పాటించలేకపోయినా, అనుక్షణం గుర్తు చేసుకుంటూ, అతిక్రమిస్తున్నాము అన్నది అవగాహనలో పెట్టుకుంటూ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము నేను, తమ్ముడు.
మన విద్యుక్త ధర్మం సరిగా నిర్వర్తించాలే తప్ప, అయాచితంగా వచ్చినా నగదు బహుమతులు లాంటివి తీసుకోకూడదు అని తమ ఆచరణ ద్వారా నేర్పారు. తను కొన్ని నెలలపాటు ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థలో పని చేసారు. అప్పుడు ఒక సినిమా హక్కులు తీసుకుందామని తన పై అధికారి అనుకుంటే, ఆ సినిమా ఖచ్చితంగా ఆడదు కొంటే నష్టపోతారు అని చాలా గట్టిగా చెప్పడం వలన వారు ఆ ఆలోచన మానుకున్నారు. తర్వాత ఆ సినిమా కొన్న వారు బాగా నష్టపోయారని తెలిసి, సరైన సలహా ఇచ్చి నష్టం కలగకుండా తోడ్పడినందుకు నగదు బహుమతి ఇవ్వాలని అనుకుంటే మా నాన్న సున్నితంగా తిరస్కరించారట. అలా ఎందుకు చేసారు, డబ్బులొస్తే బోలేదు వస్తువులు కొనుక్కోవచ్చు కదా అంతే, డబ్బు ఎంత వచ్చినా ఇవాల ఊంటుంది, పక్క రోజు పోతుంది. వస్తువులు పాడైపోతాయి. కానీ మనం తెచ్చుకునే మంచి పేరు, నిస్వార్థమైన గుణం వల్ల పొందే గౌరవం ఎప్పటికీ అలానే ఉంటాయి. నేను డబ్బులు తీసుకుంటే అతను అంతటితో ఆ విషయం మర్చిపోతారు. తీసుకోని కారణంగా నా మీద గౌరవం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని.
పదో తరగతిలో ఉండగా ఒకసారి స్నేహితులం అందరం పెన్నా నది దగ్గరకి వెళ్దాము అనుకున్నాము. స్నేహితులు ఇంట్లో అబద్ధం చెప్పి వస్తున్నారు కాబట్టి నేను కూడా మా నాన్నకి అలాగే చెప్పాను. నిజానికి చిన్నప్పటి నుంచి నాకు కానీ, తమ్ముడికి కానీ అబద్ధం చెప్పే అలవాటు లేదు. ఈ సారి కూడా అమ్మకి, అందరికీ నిజమే చెప్పాను. కేవలం సరదా కోసమే నాన్నతో అబద్ధం చెప్పాను. కానీ చాలా కోప్పడ్డారు. ఇంకెప్పుడైనా అలా చెప్తావా!! ఎవరి మధ్యనైనా కావాల్సింది నమ్మకం. ఒకసారి అబద్ధం చెప్తే నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగుట్టుకుంటావు. అప్పుడు నువ్వు చెప్పే యే విషయానికి మద్దతివ్వాలన్నా మేము ఆలోచించాలి. అలాంటి పరిస్థితి ఎప్పూడూ తెచ్చుకోకు అని చాలా గట్టిగా చెప్పారు. ఇక అప్పటి నుంచి అబద్ధం అన్న ఊసే లేదు సరదాకి కూడా. మారుతున్న కాలంలో తల్లిదండ్రులకి, పిల్లల్కి మధ్య ఈ నమ్మకం, నిజం చెప్పడం అన్న అంశానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఇప్పుడు బాగా అర్థమవుతోంది.
తన దగ్గర పని చేసే వారందరికీ, చేసిన పని కన్నా ఎక్కువ ప్రతిఫలం ఇస్తూ ఉండడం ఆయనకు అలవాటు. అలా ఎందుకు చేస్తారు అని అడిగితే, ఎవరి సేవను ఉచితంగా తీసుకోకూడదు, ఉదారంగా ప్రతిఫలమివ్వాలని బాబా చరిత్రలోని అంశాన్ని ఉదహరిస్తారు.
చిన్నప్పటి నుంచి ఆయనకు బంధు ప్రీతి చాలా ఎక్కువ. ఎవరైనా దేని గురించైనా పిలవడం ఆలస్యం, పరిగెత్తుకు పోతుంటారు. అలా ప్రతి సందర్భానికి, ప్రతి ఒక్కరి దగ్గరకి వెళ్ళడం అవసరమా అని తగువులాడినా, అప్పటికేదో సముదాయించి తన పని తను చేసుకుపోతుంటారు. బంధువులని కలుస్తూ ఉండాలి, అందరితోను సత్సంబంధాలు కలిగి ఉండాలి అనేది ఆయన సిధ్ధాంతం.
తాతగారికి, నాన్నమ్మకి తద్దినాలు పెట్టడంలోను అదే ధోరణి. గయలో పెట్టి వస్తే మరి చేయక్కరలేదు అంటారు కదా అంటే, ప్రతి సంవత్సరం తద్దినాలు చేయడం ద్వారా వారిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక బలవంతపు ఆచారం కాదు, ఒకసారి పెట్టేసి చేతులు దులుపుకోవడానికి, ప్రేమపూర్వకమైన బాధ్యత అని చెప్తారు.
భార్యకి కుటుంబంలో సమాన హక్కు ఆచరణలో అందిస్తూ, భార్య వైపు బంధువులను కూడా సమాన ప్రేమ చూపుతూ, ఇంటికి వచ్చే స్నేహితులను ఆప్యాయంగా పలకరిస్తూ ఉండే నాన్నంటే మాకెంతో ఇష్టం.
గొడవలేమీ ఉండవా, తరాల అంతరాల వల్ల మనస్పర్థలు రావా అంటే, అందరి లాగే ఉంటాయి. అమ్మ వైపు మాట్లాడినప్పుడల్లా, మీ ముగ్గురూ ఒకటి, నేనొక్కటే ఒకటి అని చిన్నబుచ్చుకోవడము లాంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. సరదా తగువులు సరదాగానే సమసిపోతుంటాయి.
తల్లి అయినా, తండ్రి అయినా పిల్లలకి పరిపూర్ణంగా ప్రేమని పంచుతారు. ఇందుకు యే తల్లిదండ్రులు అతీతులు కారు. కానీ పిల్లలని అర్థం చేసుకుని వారి అభిప్రాయాలకు విలువిస్తూ ప్రేమించడం గొప్ప విషయం. అలాంటి ప్రేమనే నేను మా అమ్మా,నాన్నలిద్దరి దగ్గర నుంచి పొందాను.
ఫలాన వారి పిల్లలనే గౌరవాన్ని, మంచి పేరుని, చక్కటి విలువలను నేర్పిన నాన్నని ఇచ్చినందుకు భగవంతునికి అత్యంత కృతజ్ఞతలు.

2 thoughts on “నాన్నకోసం ఒక రోజు…

Leave a Comment