May 1, 2024

అమ్మ అనిర్వచనీయం…… నాన్న అసాధ్యం…!!

రచన: డా. శ్రీసత్య గౌతమి

పుడుతూనే వచ్చే మొదటి బంధాలు అమ్మా, నాన్న ఉంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఒక్కొక్క బంధానికి ఒక్కొక్క ప్రత్యేకత దాని తరహాలో దానికే ఉన్నప్పటికీ అమ్మా, నాన్న బంధం వేరే. అయినా వీటిలో వేటినీ పుట్టగానే అర్ధం చేసుకోలేము. పెరిగాక కూడా అర్ధం చేసుకోవడం కష్టమైన పనే. అయినా చేసుకోవాలి, వాటిని నిలుపుకోవాలంటే. ఎలా నిలుపుకోవాలి? ఎలా అర్ధం చేసుకోవాలి? చాలా క్లిష్టమైన ప్రశ్నలు. అందుకే వాటిని పక్కన పెట్టేసి… బ్రతుకు ప్రశ్నల్ని అర్ధం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాము. ఇది అందరూ చేసే పనే నాతో సహా. హటాత్తుగా ఏదో ఒక సంధర్భం లో ఈ బంధాల్ని మరొకరికి విశదీకరించవలసిన అవసరమేర్పడినప్పుడు మనమే తడబడతాం ఎందుకంటే మనకే పూర్తిగా తెలియదు. మన ఇంట్లో వారిని మనమే కూలంకషం గా అర్ధం చేసుకునే అవకాశాన్ని ఒకరికొకరు ఇచ్చుకోము కాబట్టి. ఈ కాలం లో చాలా మటుకు ఆన్ని రెలేషన్స్ లో కేవలం ఆశించడం మాత్రమే కనబడుతున్నది కాని ఒకరినొకరు అర్ధం చేసుకోవడము ఒకరి యందు మరొకరు బాధ్యతను కలిగి వుండడము లోపించింది. బాధ్యత అనగానే కేవలం ఆర్ధికమైనది మాత్రమే అయిపోయింది ఈ రోజుల్లో. ఎవరి చర్యలను వాళ్ళు ఎదుటివారి యందు సమర్ధవంతము గా చెయ్యగలగడం, తమ చర్యలకు ఎదుటి వారి మెప్పు పొందగలగడం కూడా ఒక ముఖ్యమైన విధే. ఈ విధిని కుటుంబం లోని ప్రతి ఒక్కరూ చెయ్య గలిగినప్పుడు ఒకరి మీద ఒకరికి గౌరవం, బాధ్యత పెరుగుతంది. ఇవన్నీ మనము ఎదుగుతూ తెలుసుకునే అంశాలు. మరికొన్ని చిన్నతనం నుండీ తెలుసుకోవాల్సినవి, మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ. ఈ మాటలు బడిలోని, పెద బాలశిక్ష, చందమామ లాంటి నీతి కధల పుస్తకాలలో చదివినవే. పుట్టాక తల్లి దండ్రుల గురించి మొదటిసరిగా తెలియ పరిచే మూలాలు ఇవే. ఇప్పటి రోజులకి అవసరమైనది టెక్నాలజీ. టెక్నాలజీ పెరిగాక ఇలాంటి మంచి విషయాలు పిల్లలు చందమామ చదివే వయసు వచ్చే లొపే తెలుసుకుంటున్నారు. అది వాళ్ళకి ఇష్టమైన జంతుప్రపంచంతో తయారయ్యిన డిస్నీమూవీస్. వాటి ద్వారా మూవీమేకర్లు కూడా కుటుంబం లోని వారి పాత్రలని ఒక్కొక్క జంతు కేరక్టర్ లో మలిచి వారి చిన్న బుర్రలకు అర్ధమయ్యేలా చేసే ప్రయత్నం అద్వితీయమైనది. ఇటువంటి మూవీస్ లో ముఖ్యం గా చెప్పుకోదగ్గది “థి లయన్ కింగ్ (The Lion King)” దాని లోని కింగ్ మరియు తండ్రి పాత్ర “ముఫాసా’. ఈ పాత్రని అర్ధం చేసుకొన్న పిల్లలే కాదు ప్రతి ఒక్కరూ తమ తండ్రుల మీద గౌరవాన్ని, ప్రేమ ను అధికం చేసుకుంటారు. ఆ కేరక్టని మరలా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం!!!

mufasa

థి లయన్ కింగ్ ముఫాసా ఆకారం అతని తమ్ముడు స్కార్ తో పోలిస్తే చాలా దర్పంగా వుంటుంది. కింగ్ అంటే కింగ్ లాగ. స్కార్ పక్కన నిలబెడితే ముఫాసా పొడవుగా, విశాలం గా, బలం గా కనబడతాడు. స్కార్ కి అన్న రాజ్యమేలుతున్నాడని, అడవిలోని అతని ప్రజలందరూ అతని మాట వింటున్నారనీ, అలా ఉండగలిగే సామర్ధ్యం తనకు లేకపోగా ఆ బాధని అన్నపై అసూయా ద్వేషాలుగా మార్చుకొని బాధపడుతూవుంటాడు. మనసుసాఫల్యం లేని స్కార్ మానసిక లోపం అతని ఆకారాన్ని కూడా సూచిస్తుంటుంది బక్కగా, కుంచించుకుపోయిన శరీరం తో. తేనె పూసిన కత్తిలాంటి మాటలతో ముఫాసాను బాధపెడుతుంటాడు. రాజుగా ముఫాసా తన ప్రజలనుండి ఎన్ని రకాల గౌరవాలుపొందుతున్నా.. ఇంట్లో తన సొంత తమ్ముడినుండి ఎటువంటి గౌరవాన్ని పొందలేకపోతుంటాడు. అలాగని తమ్ముణ్ణి తన కుటుంబం నుండి, రాజ్యం నుండి వెలివేయలేకపోతాడు. రాజు గా, ఇంటికి పెద్దగా తమ్ముడుకి అన్ని రకాల భోగాలు, సౌకర్యాలు అందించినా అతని అసంతృప్తిని మాత్రం దూరం చేయలేక సతమతమవుతుంటాడు. రాజైతే ఏమి, ముఫాసా కుటుంబం దగ్గిరకి వచ్చేటప్పటికి సామాన్యమైన కుటుంబ పెద్ద లానే జీవిత రహదారిలో అడ్డొచ్చే గతుకులపైన రధసారధ్యం చెయ్యక తప్పలేదు అనే విషయాన్ని చక్కగా సూచించారు ఈ పాత్ర ద్వారా.
తన తమ్ముడు స్కార్ లాగ నిరుపయోగం గా ఉండకుండా, ముఫాసా మొదటి నుండి పెద్దరికం గా వ్యవహరిస్తూ, రాజ్యభారాన్ని అర్ధం చేసుకుంటూ పెద్దల నుండి పరిపాలనా మెళుకువలు నేర్చుకున్నాడు. అప్పటి రాజు మరియు తండ్రి కి చేదోడు వాదోడు గా వుంటూ భాద్యతాపరుడై తండ్రి నుండి తాను రాజ్య భారాన్ని ఎత్తుకున్నాడు. ముఫాసా ప్రతి విషయం మీద దూర దృష్టి అవగతం చేసుకోగలగడానికి కారణం ముఫాసా తన బాధ్యతల్ని ప్రేమించడం. తన పరిపాలనలోని సుభిక్షత ముందు ఇంట్లో తన మనుష్యులు తనకు చూపే వ్యతిరేకత కి తాను పడే బాధ ఏమాత్రం అనుకున్నాడు ముఫాసా. ఒక బాధ్యతాయుతమైన రాజు లేదా ఒక కుటుంబయజమాని ఆలోచనా ఏ విధం గా వుంటుందో ఈ కేరక్టర్ ద్వారా చక్కగా చూపించారు.
ముఫాసా రాజయినప్పటికీ.. ప్రతి ప్రాణిని గౌరవించాడు. తన బిడ్డ సింబ పుట్టినప్పుడు అడవిలోని జంతువులన్నీ తరలివచ్చినప్పుడు సింబని గర్వంగా రఫీకీ (కోతి) చూపిస్తుంది. ముఫాసా వెంటనే రఫీకీ ని అప్యాయం గా దగ్గిరకి తీసుకుంటాడు. తనకన్నా బలహీనమైన పక్షి జాతిని కూడా అభిమానిస్తాడు, దానికి తార్కాణం జాజూ తో కలిసి వుండడం, దానితో సింబ తో కలిసి ఆడుకోవడం. తాను బలవంతుడు మరియు రాజు అయినప్పటికీ కూడా ఏ చిన్నా ప్రాణినీ కూడా గాయపరచడు. ఆఖరికి సింబని భయపెట్టిన హైనా ల మీద కూడా కేవలం తన కోపాన్ని ప్రదర్శించి.. హెచ్చరించి పంపాడే తప్ప… గాయపరచలేదు. ఇది అతని లోని మృధు స్వభావం, అందరియందు సమాన దృష్టి, న్యాయాన్యాయ విచక్షణ మొదలైన అంశాలను చూపిస్తున్నది.

“I’am only brave when I have to be. Simba, being brave doesn’t mean you go to looking for trouble” –Mufasa to Simba
సింబ చెప్పిన మాట వినకుండా తన నేస్తం తో కలిసి తెలియకుండా హైనాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోతుంది. హైనాల మధ్య తాను చిక్కుకున్నదే కాక, తన స్నేహితురాలిని కూడా అందులో ఇరికిస్తుంది. ముఫాసా అది తెలుసుకుని పరుగున వచ్చి, హైనాలని తరిమేసి… సింబ తో అంటాడు.. తాను చాలా బయపడ్డానని. సింబ ఆశ్చర్యంతో… నువ్వు కూడా భయపడతావా? అని చూస్తాడు. ముఫాసా కొడుకుని మృధువు గా మందలిస్తాడు “దైర్యం గా వుండడం అంటే.. కష్టాలని కోరితెచ్చుకోవడం కాదు” అని. తాను తండ్రిగా తన బిడ్డకు చక్కటి వ్యక్తిత్వాన్ని సమయానుకూలం గా అలవరచడం, బోధించడం కనబడుతుంది ఇక్కడ.

The lion king-1

“A king’s time as ruler rises and falls like the sun. One day, Simba.. the sun will set on my time here and will rise with you as the new king” – Mufasa teaches Simba.
చూస్తూ చూస్తూనే పెరిగి అల్లరి సింబ గా తయారయిన కొడుకుని ప్రైడ్ ల్యాండ్స్ లోని రాక్ మీదకి తీసుకెళ్ళి ముఫాసా తాను పరిపాలిస్తున్న ప్రాంతాన్నంతా చూపిస్తూ… జీవన చక్రం గురించి బోధిస్తుంటాడు- “కనబడుతున్నమేరకు ఉన్న రాజ్యమంతా మనదే.. సూర్యుడు ప్రొద్దున ఉదయించి సాయంత్రం అస్తమించేలాగ..నేను ఏదో ఒక రోజు రాజుగా దిగిపోయి నువ్వు రాజువవుతావ్. ఇదే జీవన చక్రమంటే”. పుట్టిన ప్రాణులన్నిటి మధ్య సమతుల్యం ఎలా వస్తుందో వివరిస్తాడు, “జింకలు సిమ్హానికి ఆహారం కావొచ్చు, కానీ సిమ్హం చనిపోయాక దాని శరీరం మట్టిలో కలిసి పోతుంది, దానిపై మొలిచే గడ్డి మళ్ళీ జింకలకు ఆహారమవుతుంది”. ఇలా సింబను వెంట తిప్పుకుంటూ మంచి విషయాలను బోధించడమే కాకుండా.. పంజా ఎలా విసరాలో కూడా నేర్పుతాడు.

“You have forgotten who you are and so forgotten me” – Mufasa’s ghost to Simba.
తన తమ్ముడు స్కార్ పన్నిన కుట్రకు బలయ్యి తన బిడ్డ మరియు తన తరువాతి రాజును కాపాడడానికి ముఫాసా తన ప్రాణాలని కోల్పోతాడు. స్కార్ చెప్పిన తప్పుడు మాటలు విని తన తండ్రిని తానే చంపేశాడని నమ్మి సింబ రాజ్యమొదిలి పారిపోతాడు, ఎక్కడో పెరుగుతాడు. పెద్దవాడైన సింబ మళ్ళీ తన చిన్నప్పటి స్నేహితురాలు నాలాకు, రఫీకీ కి కనబడతాడు. నాలా ప్రైడ్ ల్యాండులోని స్కార్ యొక్క అన్యాయ పరిపాలన ని వివరించి మళ్ళీ అక్కడికి వచ్చి తన రాజ్యాన్ని తాను చేజిక్కించుకోమని చెప్తుంది, రఫీకి కూడా అదే చెప్తాడు. సింబ మాట వినడు. కానీ చనిపోయిన తన తండ్రి ముఫాసా ఆత్మని ఆకాశం లో చూస్తాడు, తన తండ్రి తనతో చెప్పిన మాటలను శ్రద్దగా వింటాడు ” సింబా.. నువ్వెవరో నువ్వు మర్చిపోయావ్.. అంటే నన్ను మర్చిపోయావన్నమాట. నువ్వు నా కొడుకివి, అంటే నిజమైన రాజువి నువ్వే ప్రైడ్ ల్యాండ్స్” కి అని చెబుతూ ముఫాసా మేఘాలలో అంతర్ధానమవుతాడు. ఇలా సింబా వెన్నుంటివుండీ తన బాధ్యతలను ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ మార్గాన్ని చూపించే మార్గదర్శి కూడా ముఫాసా.

ముఫాసా చెప్పిన మాటలు సింబ కు ఎంతో దైర్యాన్ని ఇచ్చాయి. రఫీకి, నాలా సాయం తో మళ్ళి తిరిగి ప్రైడ్ ల్యాండి వెళ్ళి తన తల్లి ని కూడా కలిసి, స్కార్ మరియు హైనాలతో హోరా హోరీ యుద్ధం చేసి వాటిని తుదముట్తిస్తాడు. తాను ప్రైడ్ రాక్ ఎక్కి గర్జించి తాను రాజుగా ప్రకటించుకుంటాడు. The king is returned !!!

లయన్ కింగ్ చూసిన ప్రతి చైల్డ్ సింబ లో తమని, ముఫాసా లో తమ తమ నాన్నలని చూసుకోక మానరు. ముఫాసాలోని ప్రతి లక్షణం వారి నాన్నలో ఉందనే అనుకుంటారు. తమ నాన్నలు తమ తో ఆడుకుంటున్నప్పుడు సింబా, ముఫాసాలనే గుర్తు తెచ్చుకుంటారు, ముఫాసా లాగే తమ నాన్నలు ఆడుకుంటున్నారనుకుంటారు, సింబా ముఫాసా మాట ఎలా వింటాడో… తాము కూడా నాన్న మాట వినాలి అనుకుంటారు, ఆ పాత్రల్లో జీవిస్తారు. నాన్నంటే ఇది ఆ చిన్ని బుర్రల్లో ముద్రవేసుకుంటారు.

నిజమే నాన్నంటే అలాగే వుంటారు. కుటుంబ నౌకాయానం ఎన్నిఈదురుగాలులకు గురి అవుతున్నా, అలలమధ్య చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నా దిక్సూచిలా పనిచేసి ఆవలి తీరానికి చేర్చగలిగే దైర్యసాహసాలు నాన్న సొంతం. అందుకే నవమాసాలూ మోసి ప్రాణం పోసిన అమ్మ అనిర్వచనీయమైనా… నాన్న అసాధ్యం !!!

6 thoughts on “అమ్మ అనిర్వచనీయం…… నాన్న అసాధ్యం…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *