May 5, 2024

నాన్న ఆశయమే నా జీవిత లక్ష్యం

రచన: శోభా గురజాడ

sobha

నాన్న నా కళ్ళకి, కరాలకి, కాళ్ళకి కూడా మార్గదర్శకుడు. సేవా రంగాన్నే చూపించారు. సేవ చెయ్యడమే నేర్పించారు. సేవామార్గంలోనే నడిపించారు .. భగవద్గీతలో లేనివి ప్రపంచంలో ఎక్కడా వుండవు అంటూ చిన్నప్పటినుండి గీత చదివించారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలంటూ ఆసనాలు నేర్పారు. స్వయంకృషితోనే పైకి రావాలి తప్ప పైరవీలు కూడదన్నారు .

అలిగి అన్నం మానేస్తే తను కూడా తినకుండా కూర్చునేవారు .; పరిక్షలప్పుడు రాత్రి తను మాతోపాటే కూర్చునేవారు మధ్యమధ్యలో స్నాక్స్ తినిపించేవారు. ప్రతీ సెలవలకీ ఏదో ఒక ప్రాంతం చూడవలసిందే. రాగానే మంచి వ్యాసం రాయవలసిందే. పరీక్షల్లో ఎవరికీ ఎక్కువ మార్కులు వొస్తే వాళ్లకి బహుమతి ఇచ్చేవారు. కార్లో స్కూల్కి వెళ్తే దార్లో కనిపించిన పిల్లలని ఎక్కించుకునే వారు. పెద్దయ్యాక సాయం చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పేవారు

చిన్నప్పుడు చిటపట చినుకులని చూసి ఏవో నాకే తెలియని వాక్యాలని రాసి నాన్నకి చూపిస్తే ఆశ్చర్యపోయారు. ఇది నువ్వు రాయలేదు అన్నారు. నేనే రాసాను అన్నాను. అయితే అమ్మ మీద రాయి, నా మీద రాయి, బామ్మ మీద, అమ్మమ్మ మీద రాయి అన్నారు. నాలుగవతరగతిలో నా చేత కవితలు రాయించాక నేను రాయగలనని నమ్మారు. నాకింకా బాగా గుర్తు … ఒక రోజు నన్ను పిలిచి నీకు సేవ, సాహిత్యం రెండు కళ్ళుగా వుండాలి కాని సేవ కోసం సాహిత్యాన్ని త్యాగం చేసినా, సాహిత్యం కోసం సేవని త్యాగం చెయ్యద్దని అన్నారు. రోజుకొక మంచి పని చేయాలని చెప్పేవారు. డైరీలో రాత్రికి ఆ రోజు చేసినవన్నీ రాయించేవారు. మంచి పని చెయ్యని రోజు రోజు కాదనే వారు. అలా అయన మెప్పుకోసం మంచి పనులు చెయ్యడం అలవాటు చేసుకున్నాను.

మంచిమార్కులు వొస్తే సంతోషమే కాని, మంచిపనులు చేస్తే మహదానందం అనేవారు. నేను భారతీయ విద్యాభవన్లో జర్నలిజం రాత్రి కళాశాలలో పీజీ డిప్లమా చేసేటప్పుడు తను నాకు తోడొచ్చేవారు. దార్లో బంగారు పతకం తెచ్చుకుని తీరాలి అంటూనే సేవా రంగంలో వున్న దేశ అంతర్జాతీయ మహానుభావులను గురించి చేప్పేవారు . రెండూ క్లాసులు తియ్యకు నాన్న ఏదో ఒకటే చేస్తానంటే, అయితే పతకాలోద్దులే సహకారమే అందించు అని ఆ రోజు నుండి దాని విషయం వదిలేసారు. నా బంగారు పతకాలు, రజత పతకాలు, నగదు బహుమతులు చూసి కన్నీరు పెట్టుకుని తనకన్నా పెద్దవారికి దణ్ణం పెట్టి వొచ్చారు. ఇంకా డాక్టరేట్ ఒక్కటే మిగిలింది చదువులో. సేవ మాత్రం జీవితాంతం చెయ్యాలని గుర్తుచేసారు

నాన్నకి అల్జీమర్స్ వచ్చింది. అది చాలా బాధ కలిగించింది నాకు. పాతవే తప్ప కొత్తవేవీ గుర్తు లేవు. ఆయనకీ నేను బాగా క్లోజ్ కనక నేను సేవ చెయ్యడం మొదలెట్టాను. నన్ను అమ్మ అనుకున్నారు. మా అమ్మని ఎవరో కొత్త మనిషి అనుకున్నారు. నాతో తన బాల్యం గురించి చెప్పేవారు. అమ్మని కసిరేవారు. ఎంత చెప్పినా తెలిసేదికాదు. పాతవి తల్చుకోడం కొత్తవాళ్ళని మర్చిపోవడం మామూలైంది .. మా చెల్లి విదేశాల నుండి వొస్తే గుర్తు పట్టలేదు. అక్క వొస్తే సామాన్లు బైట పడేసారు. మా పిల్లల్లో పిల్లాడయ్యారు నాన్న. డాక్టర్ చెప్పినట్టు చదువు, రాత గుర్తుచేసే పని పెట్టుకున్నాను మొదట్లో. నా మూడేళ్ళ కొడుకుతో బాటు ఏ బీ సీ లు రాసి వాడిని వోడించి, సంతోషించే వారు కాని చూస్తుండగానే అన్నీ మరచిపోయారు. పిల్లలలో చిన్న పిల్లాడయ్యారు. మా పెద్దవాడు పదేళ్ళవాడు. ఈ పెద్దమనిషి చిన్నవాడు తన ఈడు అన్నట్లయ్యింది.. రాయలేనమ్మ అని ఆయన కన్నీరు పెట్టుకుంటుంటే ఏడుపొచ్చేది. నాన్నకి అమ్మ అయ్యే అదృష్టం కలిగినా చాలా ఏడుపోచ్చేది. ఆయనకి మందూ మాకు ఇవ్వడం, అన్నం పెట్టడం, స్నానం చేయించడం, బట్టలు మార్చడం చాలా కష్టంగా వుండేది. బట్టలు వెయ్యడం, విప్పడం బ్రహ్మ ప్రళయమే. పాంట్లు నిక్కర్లుగా మారాయి. భోజనం నోటితో కాక గొట్టాలతో ఎక్కించే స్తితి వొచ్చింది. తలచుకుంటే ఎడుపు ఆగదు నాకు. పారిపోవాలని చూసేవారు. అందరినీ విసుక్కునేవారు. భాష మర్చి పోయారు. బట్టలు వొద్దని మారాము . ఈ లోగా కింద పడ్డారు మంచం పట్టారు ఆహారం సరిగ్గా దిగని నాన్నకి నేనే రక్తం ఇచ్చాను. చివరిదాకా ఆయనని చూసుకున్నాను,. నా భర్తే నాన్నకు కర్మ కాండ చేసారు. మాసికాలకి వంట చేస్తుంటే బాధనిపించేది. డాక్టరేట్ చేసింది ఆయన కోసమే. సీవారంగానికి మొదటి స్థానం ఇచ్చింది నాన్నకోసం. ఇప్పుడు నాన్న కోసం గురజాడ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ఫాదర్స్ కి నగదుతో ఇచ్చి ఫాదర్స్ డే ని చేస్తూ నాన్నని పెద్దల్లో చూసుకుంటున్నాను. తప్పమ్మా నాకు నువ్వు ఆ పన్లు చెయ్య కూడదు అని కన్నీరు పెట్టుకున్న నాన్నతో చెప్పాను. ఈ రకమైన సేవ నీతోనే మొదలని నాన్నకి అర్ధం కాలేదు. ఇప్పుడు పైనుండి చూస్తూ ఉంటారని ఆశీర్వదిస్తారని ఆశ . ఆయన ఆశయాన్ని నేరవేర్చే ప్రయత్నం చేస్తున్నానని కాసింత సంతోషం. నేను ఎటెళ్లినా నాన్న పెద్దల్లో చేరి నాకోసం అభిమానం పంచుతున్నారేమో అనిపించి, ఆ వయసు వారందరిలో నాన్నని వెతుక్కుంటాను. వారి ప్రోత్సాహంలో నాన్నని చూసుకుంటాను . నాన్న కూచిగా పిలవబడ్డ నేను ఈ రోజు నాన్నలందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను

5 thoughts on “నాన్న ఆశయమే నా జీవిత లక్ష్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *